visitors

Saturday, January 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదిహేడవ భాగం

30.01.2021 -  శనివారం భాగం- 17*:
అధ్యాయం 2 భాగం 16 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"మీ ఘంటసాల సవినయంగా సమర్పించు..." అంటూ  తెల్లని దుస్తులతో, అంతకంటే నిర్మలమైన చిరునవ్వుతో నిండుగా తెరమీద కనిపిస్తూ ప్రేక్షకులనుద్దేశించి చెప్పిన ప్రారంభ స్వాగత వచనాలతో జివిఎస్ ప్రొడక్షన్స్ వారి సంగీత ప్రధాన, భక్తి రస చిత్రం  "భక్త రఘునాధ్" సినిమా ప్రారంభమవుతుంది.

జి.వి.ఎస్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఒక  మకరతోరణం మధ్య ఒక పెద్ద గంట వేలాడుతూ, క్రింది ముందు భాగంలో ఇంగ్లీష్ లో G.V.S.PRODUCTIONS అని కనిపిస్తుంది. 

ఘంటసాలవారి రెండో చిత్రమైన 'సొంతవూరు' చిత్రం కూడా జివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే వచ్చింది. అసలు ఈ పేరు ఎన్నుకోవడంలో మాస్టారి అంతరంగం నాకు తెలియదు కానీ, ఆ బ్యానర్ లో మాస్టారింట్లో చాలామంది పేర్లు కలిసివచ్చేలా కనిపిస్తాయి: జి. ఘంటసాల, వి. వెంకటేశ్వరరావు, విజయకుమార్, ఎస్. సావిత్రి , సదాశివుడు(తమ్ముడు), సుబ్బలక్ష్మి(తమ్ముడి భార్య,మేనకోడలు), శ్యామల. అప్పటికి సుగుణ, శాంతి అనే అమ్మాయిలు పుట్టలేదు.  ఇలా అందరి భాగస్వామ్యంతో ఈ సినీమాలు తీసారని నేను సరదాగా మా బొబ్బిలిలో మా స్నేహితుల దగ్గర చెప్పేవాడిని. "భక్త రఘునాధ్" సినీమా చూసింది కూడా బొబ్బిలిలోనే. శ్రీరామా టాకీస్ అని గుర్తు.

రఘునాధుడు ఉత్కళదేశానికి చెందిన విష్ణుభక్తుడు. ఉత్కళదేశమే ఓఢ్రదేశంగా, ఒరిస్సాగా , ఇప్పుడు ఒడియా రాష్ట్రంగా మారింది. ప్రాచీన భారతదేశంలోని అనేకమంది పరమ భాగవతోత్తముల గాధలన్నీ గ్రంథరూపంలో వెలువడ్డాయి. అందులో, పూరీ జగన్నాధస్వామి భక్తుడైన ఈ రఘునాధ గోస్వామి చరిత్ర కూడా వుంది. 

రెండు సాంఘిక సినీమాలు తీసి ఆర్ధికంగా చాలా నష్టపోయినా ముచ్చటగా మూడవ ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచి మరో సినీమా తీయ సంకల్పించి కధ, మాటలు, పాటలు, దర్శకత్వపు భాధ్యతలను శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు. శ్రీ సముద్రాలవారు పౌరాణిక చిత్రాలకు మాటలు,పాటలు రాయడంలో నిష్ణాతులు. అంతకు రెండేళ్ళకుముందే వినాయకచవితి వంటి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకానుభవమూ పొందారు. వీటన్నిటినీ మించి తనను చిత్రసీమకు పరిచయం చేసిన వ్యక్తిగా, ఆత్మీయుడిగా, సన్నిహితుడిగా ఆచార్యులవారి మీద గల పూజ్యభావంతో, కృతజ్ఞతా భావంతోను తాను నిర్మించబోయే కొత్త సినీమా భాధ్యతలను ఆచార్యులవారికి అప్పగించేరేమో అని అనిపిస్తుంది. 

"భక్త రఘునాధ్" చిత్రానికి కధానాయకుడిగా ముందు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదించగా, వారెందుకో ఈ చిత్రకధ పట్ల అంత సుముఖంగా లేనట్లు, రఘునాధుడనే భక్తుడిగురించి తెలుగువారికి అంతగా తెలియదని, అలాటి గాథను తెరకెక్కించడం శ్రేయస్కరం కాదని, అయినా ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీ కె.వి.రెడ్డిగారిని నియమిస్తే బాగుంటుందని సలహా యిచ్చినట్లు, కానీ, అప్పటికే ఘంటసాలవారు తన సినీమా డైరక్టర్ గా శ్రీ సముద్రాల వారికి మాట యిచ్చినందువలన, ఆ వాగ్దానాన్ని మీరడం ఇష్టంలేక  శ్రీ నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా వచ్చిన సమాచారాన్ని నేను చదివేను. 

తరువాత, కాంతారావు, జమునలను నాయక,నాయికలుగా ఎన్నుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో నాగయ్య, సి.ఎస్.ఆర్, రేలంగి, సూర్యకాంతం, పేకేటి మొదలైనవారు నియమితులయ్యారు. 

ఈ సినీమా భక్తుడి గాథ కావడం వలన  అతని జీవితం లోని కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, ఇలా అన్ని రసభావాలను చూపించే క్రమంలో ఈ సినీమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిర్మాత (తమ్ముడి పేరిట) సంగీతదర్శకుడు, గాయకుడు అన్నీ తానే అయినందున సంగీతనిర్వహణ విషయంలో వారికెంతో స్వేచ్ఛ లభించిందనే చెప్పుకోవాలి. ఇతరుల ఒత్తిడులేవీ సంగీతంమీద ప్రతిఫలించే అవకాశంలేదు. సంపూర్ణ  పాటల స్వర రచన విషయంలో మాస్టారు వ్యవహరించి అక్కడ తానే ఒక భక్తుడి అవస్థలను అనుభవించి ఆయా రసాలకు తగిన వరుసలను సమర్ధవంతంగా తయారు చేశారు. 

పాటల కంపోజింగ్, రిహార్సల్స్ వంటివి నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి క్రింది హాల్ లో, మేడమీది గదులలో జరిగాయి. ఈ రిహార్సల్స్ సమయంలో ఆ పాటలు పాడిన నేపథ్య గాయనీమణులైన శ్రీమతి పి.లీల, జిక్కి, ఎ.పి.కోమల, మాధవపెద్ది మొదలైనవారిని తరచూ చూస్తూ, వారు పాట నేర్చుకుంటూ పాడే విధానాన్ని గమనిస్తూండేవాడిని.

భక్త రఘునాథ్ చిత్ర జయాపజయాలు పరంగా కాకుండా అందులోని ఉత్తమమైన, శ్రావ్యమైన సంగీతపరంగా, ఆ సినీమానిర్మాణంలో చోటుచేసుకున్న కొన్ని అంశాలవలన, ఆ చిత్రం ఎప్పటికీ నాకు మరపురానిది, అత్యంత ఆత్మీయమైనది. అవేమిటో మీకే తెలుస్తుంది.

భక్త రఘునాథ్ చిత్ర గీతాల రికార్డింగ్, రీరికార్డింగ్, ఇండోర్ షూటింగ్ వాహినీ స్టూడియోలోనే జరిగింది. మాస్టారు తన దైనందిక కార్యకలాపాలు చూసుకుంటూనే ఈ చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూండేవారు.

1959లో మొదలైన "భక్త రఘునాధ్" 1960 లో విడుదలయింది. ఈ సినీమాలో మొత్తం 14 పాటలు, ఓ 8 పద్యాలు, శ్లోకాలు ఉన్నాయి. వీటిలో చాలా పాటలు, పద్యాలు హెచ్ ఎమ్ వి గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయాయి. ఈ పాటలలో చాలా భాగం వేసవి శెలవులలోనే రికార్డింగ్ పూర్తిచేసుకోవడంవలన నేను చాలా పాటల రికార్డింగ్ కు, తరువాత రీరికార్డింగ్ కు వెళ్ళడం జరిగింది. అందులో నాకు బాగా గుర్తుండిపోయినవి - 
"నీ గుణగానాము", "తరలిపోయే తెరువరీ", "సంసారజలధి", "ఈ మరపేలా ఈ వెరపేలా", "రామహరే కృష్ణహరే", "గోపాల దయసేయరా"పాటలు.


ఈ చిత్ర నిర్మాణ సమయంలో సాలూరు నుండి మా ప్రభూ చిన్నాన్నగారి అబ్బాయి ప్రసాద్ (పి.వి.ఎన్.ఎస్.వి) కూడా శెలవులకు మద్రాస్ మొదటిసారిగా వచ్చాడు. అతను అప్పుడు ఇప్పుడు కూడా ఘంటసాలవారి పరమ వీర భక్తుడు. ఘంటసాల మాస్టారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా జిజ్ఞాసతో సేకరించే అలవాటుకలవాడు. అతను మద్రాస్ వచ్చిన సమయంలో నెం.35, ఉస్మాన్ రోడ్ కల్యాణశోభతో వెలిగిపోతూండేది. సకలజనాల రాకపోకలతో కోలాహలంగా వుండేది.

ఒక పెద్ద భోషాణం పెట్టిలాటి స్పూల్ టేప్ రికార్డర్ ( జర్మన్ మేక్ గ్రండిగ్  టేప్ రికార్డర్ )లో "భక్త రఘునాథ్" పాటలు, పద్యాలు, షూటింగ్ సమయంలో రికార్డ్ చేసిన డైలాగ్స్  ఇంట్లోని ఆడవారికి వినిపిస్తూండేవారు ప్రొడ్యూసర్ సదాశివుడు, మేనేజర్ సుబ్బు, ఎడిటర్లు బి. హరినారాయణ, దేవేంద్రలు. అలాగే షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో ఆల్బమ్స్ అన్నీ మేడమీద గదుల్లో బీరువాలలో పడివుండేవి. ఆ ఫోటోలను భక్తిపూర్వకంగా, అపురూపంగా చూడడంలో, టేప్ రికార్డర్ లో పాటలు, మాటలు  వినడంలో మా ప్రసాద్, నేనూ పోటీలు పడేవాళ్ళం. అతను మద్రాస్ లో ఉన్న సమయంలోనే "నీ గుణ గానము" పాట షూటింగ్ వాహినీలో జరిగింది. మేమూ వెళ్ళాము. పూరీ జగన్నాధస్వామి ఆలయం సెట్ వేసి దేవుడి ముందు షూటింగ్. జమున, కాంతారావు, మరికొంతమంది ఎక్స్ట్రాలు (వారిని ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు) మేకప్ వేసుకొని సిద్థంగా ఉన్నారు.. ఎంతసేపు గడచినా షూటింగ్ ప్రారంభంకాలేదు. లైటింగ్ ఎడ్జస్ట్మెంట్ తోనే సరిపోయింది. ఆ పాట షూటింగ్ చూడకుండానే బయటకు వచ్చేసాము.

ఎడిటర్ దేవేంద్రనాధ్ తండ్రిగారు వాహినీలో పనిచేసేవారు. ఈ దేవేంద్రకు ఆ రోజుల్లో కొంచెం అక్కినేని నాగేశ్వరరావు పోలికలుండేవి. ఆకారణం చేతనేమో ఈయన 'పెళ్ళి చేసి చూడు' సినీమాలో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద ఎన్టీఆర్, జి.వరలక్ష్మిల ముందునుండి నల్లకళ్ళద్దాలతో స్టైల్ గా నడిచెళుతూ కనిపిస్తారు. దేవేంద్ర తర్వాత చాలా సినీమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఎడిటర్ హరినారాయణ కూడా ఎడిటర్ గా తరువాత కొన్ని సినీమా లకు డైరక్టర్ గా పనిచేశారు. అలాటివాటిలో ఒకటి రెండు సినిమాలకు మాస్టారు సంగీతం కూడా నిర్వహించేవారు. పామర్తిగారు, హరి, దేవేంద్ర, సుబ్బు, జెవి రాఘవులు వీరంతా మాస్టారింట్లో సొంత మనుషుల్లాగే ఏ అరమరికలు లేకుండా మసిలేవారు. వీరందరి కుటుంబాలతో సావిత్రమ్మగారికి మంచి స్నేహసంబంధాలుండేవి. ఒకరిళ్ళకు ఒకరు వచ్చిపోతూండేవారు.  

సినీ పరిశ్రమ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. సాంకేతికంగా  అంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో సాంకేతిక నిపుణుల జీవితాలు చాలా దుర్భరంగా వుండేవి. చిత్రనిర్మాణం త్వరగా ముగించాలనే తపనలో రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడేవాళ్ళు. సమయానికి సరైన ఆహారం వుండేదికాదు. వాటి ప్రభావం వారి ఆరోగ్యాలమీద పడేది. సినీమాలలో పనిచేసేవాళ్ళలో అధిక సంఖ్యాకులు డైబిటీస్, బి.పి, హార్ట్ కంప్లైంట్, విజన్ ప్రోబ్లమ్స్ కు గురి అయేవారు. అందుకు, సక్రమమైన ఆహారవిహారాలు, పనిచేసే చోట సరైన వసతులు లభించక అనారోగ్యాలకు గురైయ్యేవారు. సుబ్బు , దేవేంద్ర కూడా కొంత వయసు మీరాక తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విన్నాను. 

ఘంటసాలవారిది నిండుమనసు. బంధు, స్నేహప్రీతి మెండు. తన ఆశ్రితులందరికీ ఏదో విధంగా ప్రోత్సాహం , సహాయం చేయాలని ఆశించేవారు. మాస్టారు తీసిన మూడు సినీమాలలోనూ నటులు కాని తన సన్నిహితులచేత ఏవో వేషాలు వేయించి వారికి ఆనందం కలిగించి తానూ ఆనందపడేవారు. 

మొదటిచిత్రం 'పరోపకారం' లో గాయకుడు బి.గోపాలంగారి చేత, నృత్య కళాకారుడు వెంపటి చిన సత్యంగారి చేత వేషాలు వేయించి వారికి తాను పాటలు పాడారు.

రెండవ సినీమా 'సొంతవూరు' లో రాజసులోచన కు హీరోయిన్ హోదా కల్పించారు. ఆ సినీమా లో మా నాన్నగారు( పి.సంగీతరావు) కూడా సి.ఎస్.ఆర్ తో ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఏవో రెండు మూడు డైలాగ్స్ వున్నాయి. 

ఈ మూడవ సినీమా భక్త రఘునాథ్ లో కూడా ఒక నృత్య సన్నివేశంలో వీణవాయిస్తూ మా నాన్నగారు కనిపిస్తారు. "జయమురళీలోలా గోపాలా" అనే జావళీని మాస్టారు అద్భుతంగా స్వరపర్చగా ఏపి కోమల పాడారు.

 తెరమీద నర్తకిగా మణి అనే కొత్త అమ్మాయికి అవకాశం కల్పించారు. మణి, స్వర్ణ ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. చక్కటి నృత్యకళాకారులు. భక్త రఘునాధ్ లో పాటకి నాట్యం చేసినది మణే. నాకు బాగా గుర్తు. కానీ పాటలపుస్తకంలో మణి పేరుకు బదులుగా స్వర్ణ అని ఎక్కడో చూశాను. వీరిద్దరూ తరువాత ఎన్టీఆర్ నిర్మించిన 'శ్రీ సీతారామ కల్యాణం'లో సీత, శూర్ఫణకలుగా అవకాశాలు పొంది గుర్తింపబడ్డారు. అందులోని మణియే తర్వాత తర్వాత గీతాంజలిగా  బహుభాషా చిత్రనటిగా పేరుపొందారు. పాపం! ఆమె నటించిన మాస్టారి "భక్త రఘునాధ్" ఆవిడకు గుర్తులేదు. ఎన్టీఆర్ సినీమా ద్వారానే చిత్రసీమకు వచ్చినట్లు చెప్పుకునేవారు. పరాజయం పొందిన సినీమాలో నటించానని చెప్పుకోవడం ఒక నామోషి కూడా కావచ్చు. అలాగే భక్త రఘునాథ్ లో నటించిన మరొక కొత్త నటి కమలకుమారి. పేకేటి శివరాం పరిచయం చేశారు. ఆ నటీమణే జయంతిగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఆవిడా అంతే. 

ఘంటసాల మాస్టారు తమ గురువు (పట్రాయని సీతారామశాస్త్రి)గారిని గౌరవించే రీతిలో "భక్త రఘునాథ్"లో గురువుగారు చదివే  చాటుపద్యం "మరచుట లేదు నీ స్మరణ" ను తాను పాడారు. ఈ పద్యాన్ని రఘునాథ్ పాత్రధారి కాంతారావు మీద చిత్రీకరించారు. ఈ పద్యం కాగానే "భవ తాపాలు బాపే నీ పాదయుగళి" పాట ప్రారంభమవుతుంది.ఈ చాటుపద్య కవి ఎవరో తెలియదు. కానీ మా తాతగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు ఈ పద్యాన్ని విధిగా తమ కచేరీలలో పాడేవారని విన్నాను. ఆ విధంగా తమ గురువుగారు పాడుతూండగా విని ఘంటసాల మాస్టారు నేర్చుకున్నారు. గురువుగారు తన శిష్యులెవరికీ తన స్వీయ కీర్తనలు నేర్పించి ప్రచారం పొందే ప్రయత్నం చేయలేదు. ఆ శిష్యులంతా గురువుగారి కచేరీలు విని గ్రహించినవి కొన్ని కృతులు మాత్రమే.


గురువుగారు తరచు పాడే చాటువు 
"మరచుటలేదు నీ స్మరణ..." సంగీతరావుగారి గాత్రంలో వినండి
 
ఘంటసాలవారి భక్త రఘునాథ్ మద్రాస్ శివార్లలోని తిరుప్పొరూర్ మురుగన్ ఆలయ పరిసర వీధులలో చిత్రీకరించారు. అక్కడి ఆలయంలో పెళ్ళిచేసుకున్న నవ దంపతులతో ఒక పెళ్ళి బృందం ఊరేగింపుగా వస్తూండగా మదమెక్కిన ఒక ఏనుగును పాటపాడుతూ భక్త రఘునాథ్  ఆపు చేసే దృశ్యం చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగ్ రెండు మూడురోజులు సాగింది. ఔట్ డోర్ అవడం మూలాన, నేను చిన్నవాడిని కావడం వలన, వెళ్ళాలని కోరిక కలిగినా అది సాగదని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆ నవ దంపతులలో  కొత్త పెళ్ళికొడుకుగా రెడ్డి (పూర్తిపేరు గుర్తులేదు) వేషం కట్టాడు. 

(రెడ్డి తర్వాత కాలంలో నటి వాసంతి కి కారు డ్రైవర్ గా పనిచేశాడు. మాస్టారి కారు డ్రైవర్ గోవిందు ఎప్పుడైనా శెలవుపెడితే ఆపద్ధర్మ డ్రైవర్ గా ఈ రెడ్డి వచ్చేవాడు. ఎర్రగా పొడుగ్గా నొక్కులజుత్తుతో ఉండేవాడు. సినీమా నటుడు కావాలని వచ్చాడనుకుంటాను. చివరికి నటిమణి డ్రైవర్ గా సరిపుచ్చుకోవలసి వచ్చింది. వాసంతి లా కాలేజీలో చదువుతూ సినిమా నటిగా అవకాశాలు రావడంతో లా చదువు మధ్యంతరంగా ఆపేసినట్లు తమిళ పత్రికలలో చదివాను. ఆ వాసంతి, బి.ఏ., మంచి మనసులు చిత్రంలో నటించిన సంగతి మీకు తెలిసినదే. ఆవిడ కొన్నాళ్ళు ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి, పానగల్ పార్క్ కు మధ్య నాదముని స్ట్రీట్, గోవింద్ స్ట్రీట్ లమధ్య వుండే మూడు నాలుగు పెంకుటిళ్ళలో ఒక ఇంటిలో నివాసముండేది.  ఒక సినీమానటి అలాటి సామాన్యమైన ఇంటిలో అద్దెకుండడమా? అని నాకు ఆశ్చర్యంగా వుండేది. అయితే ఆకాలంలో ఆపాటి నటీమణులకు యిచ్చే పారితోషికం అంతేమరి. వారికొచ్చే ఆదాయంతో అలాటి చిన్న ఇళ్ళలోనే గడపవలసి వచ్చేది. అనేక సినీమాలలో నటించాక ఒక డి.ఎమ్.కె లీడర్ ను వివాహం చేసుకొని సినీమాలకు గుడ్ బై చెప్పేసింది).

సరే. మళ్ళీ మన షూటింగ్ గజేంద్రుడిని చూద్దాము.

సినీమా లో ఈ సీన్ లో ఒక పెళ్ళి బృందంమీద ఒక మదమెక్కిన ఏనుగు భీభత్సం సృష్టిస్తే భక్తుడైన రఘునాథ్ వచ్చి వారిని రక్షించాలి. అక్కడ ఒక పాట ఉంది. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" మాస్టారు చాలా ఉద్వేగభరితంగా, భక్తి ప్రపత్తులు ఉట్టిపడేలా పైస్థాయిలో సాగేపాట. 

ఇటువంటి సిట్యుయేషనల్ సాంగ్స్ ను డైరక్టర్ చెప్పే సన్నివేశాన్ని తన మనసులో ఊహించుకుంటూ సంగీతదర్శకుడు హెవీ ఆర్కెష్ట్రాను ఉపయోగించి ఒక అద్భుతమైన వరసను సమకూరుస్తారు. అంతకు పదిరెట్లు భావావేశంతో ఘంటసాల మాస్టారు వంటి గాయకులు గానంచేసి ఆ పాటను సజీవం చేస్తారు. అయితే అంత అద్భుతంగా రూపొందిన పాట సీనీమాలో మరింత ఆకర్షణీయంగా జనామోదం పొందాలంటే సన్నివేశ చిత్రీకరణ బాగుండాలి. అందుకు దర్శకుడి ప్రతిభ, నటీనటుల నటనావైదుష్యం, సాంకేతికవర్గం నైపుణ్యం, పరిసరాలు, వాతావరణం అన్నీ సహకరించాలి. 

షూటింగ్ ముగించుకొని రాత్రి ఎప్పుడో ఇళ్ళకు చేరి ఆ పాట షూటింగ్ లో జరిగిన ఫార్స్ ను  రామచంద్రరావు, సుబ్బు, తాతగారు (సదాశివుడు), హరి పగలబడి నవ్వుతూ ఇంట్లో వివరిస్తూంటే నాకు ఏదోలా అనిపించేది. ఇంతకూ విషయమేమిటంటే, ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు తగ్గట్టుగా, సముద్రాల వారి ఊహాపోహలకు తగినట్లుగా, ఛాయాగ్రహకుల నైపుణ్యాన్ని తలదన్నేలా ఉండవలసిన ఏనుగు ఆ సన్నివేశంలో ఏమాత్రమూ సహకరించలేదట. "ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా" అని మాస్టారి గొంతు హైపిచ్ లో వినిపిస్తూంటే, మరో పక్కనుండి పాటకు లిప్ మూమెంట్స్ ఇస్తూ  హిరో  కాంతారావు శరవేగంగా వస్తూంటే భీభత్సాన్ని సృష్టించి, ఔట్ డోర్లో ఒక కలకలం సృష్టించవలసిన గజరాజు మాత్రం ఒక్క ఇంచ్ కూడా ముందుకు అడుగెయ్యలేదట. ఉన్నచోటనే కదలకుండా పెట్టిన ఆహారం తాపీగా నములుతూ పాట వింటోందట. పక్కనున్న మావటివాడు అంకుశంతో ఎంత పొడిచినా ఆ ఏనుగులో చలనమేలేదట. అలాటి ఏనుగును ఎక్కడనుండి పట్టుకొచ్చారని దర్శక నిర్మాతలు విసుగుచెందారట. అయితే ఆ ఏనుగు సీజన్డ్ ఆర్టిస్టేనని అప్పటికే అనేక సినీమాలలో నటించిందని ప్రొడక్షన్ మేనేజర్ సుబ్బు వివరణ. ఏమైతేనేం ఒక రోజు ఎగిరిపోయింది. ఔట్ డోర్ లో ఎండాపోయింది. హీరో గారి ఒకరోజు కాల్షీట్ వేస్టయింది. ఆ మర్నాడు అదే తంతు. చివరికి హీరో షాట్లు, పెళ్ళిబృందం షాట్లు ముగించారట. ఏనుగు షాట్లు తర్వాత తీసారట. అప్పుడు కూడా ఆ ఏనుగు దయతల్చలేదు. సినీమాలో ఏనుగు నడిచి వస్తూంటే పక్కనే కనీకనిపించకుండా ఆ మావటివాడు కనిపిస్తాడు. ఘంటసాలవారు, డైరెక్టర్ సముద్రాల వారు ఆశించనట్లుగా పాట రూపొందలేదు. ఏనుగు అందరిని నిరాశపర్చి తట్టెడు పేడను మాత్రం మిగిల్చిందని షూటింగ్ కు వెళ్ళిన మావాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకుంటూ నవ్వుకున్నారు, అంతకుమించి చేయగలిగింది ఇంకేమీలేక. తర్వాత, ఎడిటింగ్ టేబిల్ దగ్గర ఆ సీన్ ను ఏదో మేనేజ్ చేశారు.

సినీమాలలో సన్నివేశ చిత్రీకరణలు ఇలాగేవుంటాయి. చెప్పేదొకటి,  అనుకునేదొకటి, అయేది మరొకటి.  చివరకు నిర్మాతే బోల్తా కొడతాడు.

ఘంటసాల మాస్టారి భక్త రఘునాథ్ లో కనిపించే మరో ఆత్మీయ వ్యక్తి 'తమ్ముడు' కృష్ణ, మా అందరికీ 'గుండు'మామయ్య. మాస్టారింటి చీఫ్ ఛెఫ్. (నిజమనుకునేరు! కాదండోయ్!)

ఆ వివరాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాము.

         ...సశేషం.

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

5 comments:

Dr. P. SUMABALA said...

భక్త రఘునాథ షూటింగ్ విషయాలు చదివి మేమంతా నవ్వుకున్నాం. బాగుంది.
ఇవన్నీ మాకు తెలీని విషయాలు.
ఈ సినిమా లో పాటే కదా హే శివశంకరా .... మేము వీణ మీద practice చేసేవాళ్ళం ఆ పాటని.

తరువాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాం.

సుమబాల

P P Swarat said...

Thank you Bala.

వెంకట మహేష్ బాబు సంబటూరి said...

ఘంటసాల మాస్టారు గారి స్వంత చిత్రం భక్త రఘునాథ గురించి చాలా చాలా చక్కగా వివరించారు ఈ నాటి సంచికలో 👏👏👏👏👌👌👌👌🙏🙏💐😊👍....

అక్కినేని గారు కథానాయకుడిగా నటించి ఉంటే ఆ చిత్రం మరో స్థాయి లో ఉండి నిర్మాత ఐన మాస్టారు గారిని కాస్తంత అయినా ఆదుకునేదేమో....!!!!

ఇక మీరన్నట్లు విజయవంతం కాని ఈ చిత్రం తమ తొలి చిత్రం గా చెప్పుకోవడాన్ని ఉద్దేశ్యపూర్వకంగా మరువడం గీతాంజలి గారు జయంతి గారు వంటి నటీమణులకి నిస్సందేహంగా శోభస్కరం కాదు.... వారు అలా చేయడం ఘంటసాల మాస్టారు గారిని అవమానించడంతో సమానమే...

భక్త రఘునాథ చిత్రం షూటింగ్ లో గజేంద్రుడి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా చదివించింది😊😊.... ఇంత చక్కని జ్ఞాపకాల దొంతరకి పరమాద్భుతమైన అక్షర రూపం ఇస్తూ వారం వారం మమ్మల్ని అలరిస్తూన్న మీకు శత సహస్ర కృతజ్ఞతాభివందనాలు..... అభినందనలు స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏😊👍👍😊💐💐😊

P P Swarat said...

చాలా సంతోషం. మీకు నా ధన్యవాదాలు.

Patrayani Prasad said...

🕉🙏🙏శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు నమస్కారములు. విషయాలన్నీ, అంత జ్ఞాపక శక్తితో , సవివరంగా వ్రాయగలిగి నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంచికలో నా ప్రస్తావన కూడా , మళ్ళీ వచ్చినందుకు, ఆనందంగా ఉంది. మిగిలిన విషయాలన్నీ చదవాలన్న, ఆత్రుత కలుగుతోంది. మళ్ళీ వారం ఎప్పుడువస్తుందా ? అనే ఉత్కంఠత కలుగుతోంది. రచన చాలాబాగా సాగుతోంది. ధన్యవాదాలు.🙏🙏-పట్రాయని ప్రసాద్ బెంగుళూరు.