visitors

Sunday, February 14, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పంధొమ్మిదవ భాగం

14.02.2021 -  ఆదివారం భాగం- 19*:
అధ్యాయం 2 భాగం 18 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

క్రిందటి వారం జ్ఞాపకాలమాలికలో తెలియజేసినట్లుగా, 1960 ఘంటసాల మాస్టారికి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ సంవత్సరం మాస్టారి సంగీతంలో నాలుగు సినీమాలు రిలీజ్ అయ్యాయి. అవి, శాంతినివాసం, అభిమానందీపావళీ, భక్త రఘునాధ్. రెండు సాంఘికం, రెండు పౌరాణికం. ఈ నాలుగు చిత్రాలు నాకు నాలుగు రకాలుగా ఉత్సాహాన్ని, సంతోషాన్నీ పెంపొందించిన చిత్రాలు. నేను బొబ్బిలి హైస్కూలులో చదువు మొదలెట్టాక విడుదలైన సినీమాలు. శాంతినివాసం సినీమాతో మా ఊళ్ళో కొత్త సినీమా హాలు ప్రారంభమయింది. శ్రీకృష్ణా టాకీస్. బొబ్బిలి రాజావారి బావమరది శ్రీ చెలికాని అచ్యుతరావుగారి నిర్వహణ. అదే సంవత్సరం బొబ్బిలి యువరాజావారి పేరుమీద మొట్టమొదటి ఆర్ట్స్ కాలేజీ వెలిసింది. దానితో బొబ్బిలి రూపురేఖలు మారిపోయాయి. పెద్ద పల్లెటూరి స్థితినుండి చిన్న పట్టణంగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. 

శ్రీ కృష్ణాలో అక్కినేని శాంతినివాసం, శ్రీరామాలో 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ ఐదు సినీమాలతో బొబ్బిలి విద్యార్ధిలోకంలో నా పేరు మార్మోగింది. కారణం మా నాన్నగారు చిత్రసీమలో వుండడం, అందులోనూ ఉత్తరాంధ్ర ప్రజల అత్యంత అభిమాన గాయకుడైన శ్రీ ఘంటసాలవారి వద్ద సహాయకుడిగా పనిచేస్తూవుండడంతో బొబ్బిలిలో నన్ను గుర్తుపట్టి పలకరించేవారి సంఖ్య ఎక్కువయింది.  చదువురీత్యా నేను సగటు విద్యార్ధినే అయినా,ఆనాటి పెద్దలంతా ఆశించే గుణగణాలన్నీ పుష్కలంగా నాలో వున్న కారణంగా అటు స్కూల్ లో , ఇటు బయటా అందరి ప్రేమాభిమానాలకు పాత్రుడనైయ్యాను.

"శాంతినివాసం"అభిమానం", "దీపావళి", "భక్త రఘునాధ్" ఈ నాలుగు చిత్రాలు వ్యక్తిగతంగా నేను మరచిపోలేనివి. ఈ నాలుగు సినీమాలలోని పాటలన్నీ ఆపాతమధురాలే. ఘంటసాలవారి సంగీత ప్రతిభకు గీటురాళ్ళే. శాంతినివాసం చిత్రంలో మొదటిసారిగా మా నాన్నగారు (శ్రీ సంగీతరావు గారు) హార్మోనియంతో పాటు వీణ కూడా వాయించారు. పి.సుశీల గారు, పి.బి.శ్రీనివాస్ గారు పాడిన "శ్రీ రఘురామ్ జయ రఘురాం" పాటకు వీణ వాయించారు". అలాగే, ఘంటసాల మాస్టారు పాడిన పద్యాల మధ్య వినవచ్చే హార్మోనియం బిట్స్ కూడా మా నాన్నగారే వాయించారు. శాంతినివాసంలో మూడు నాలుగైదు హిందీపాటల వరసలు చొరబడినా, మాస్టారు సొంతంగా చేసిన "రాగాలా సరాగాలా" పాట, "కలనైనా నీ వలపే", "సెలయేటి జాలులాగా చిందేసే లేడిలాగా" (ఎ.పి.కోమలపి.లీల) పాటలు నేటికీ సజీవంగానే వున్నాయి. 

శాంతినివాసం సినీమా తీసిన సుందర్లాల్ నహతాగారిదే మరో చిత్రం "అభిమానం" కూడా అదే సంవత్సరం విడుదలయింది. అభిమానం సినీమాలో మొట్టమొదటిసారిగా మా నాన్నగారి పేరును సంగీత సహాయకుడిగా తెరపై చూడడం నాకు మహదానందం కలిగించింది. అందులోనూ సంగీతవిభాగంలో మరెవరి పేరు లేకుండా 'సంగీతరావుఅని మాత్రం వేయడం కించిత్ ఆశ్చర్యదాయకం కూడా. అయితే ఇలాటి లౌకిక విషయాలలో మా నాన్నగారు చాలా నిర్లిప్తంగా వ్యవహరించేవారు. తన పేరు టైటిల్స్ లో ఉన్నా, లేకపోయినా తన వృత్తి ధర్మం ఏదో దానిని నిజాయితీగా, మనస్ఫూర్తిగా చేయడమే తన లక్ష్యంగా భావించారు. అభిమానం చిత్రంలో కె.వి.శర్మ, చలంలకు ఒక పాట వుంది. "మదిని నిన్ను నెర నమ్మి కొలుతు" ఈ పాట మీ నాన్నే పాడారు కదా అని మా బంధువర్గంలోవారు, ఆయనను తెలిసినవారు అడిగేవారు. వారికి ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ ఆ పాటను మాధవపెద్ది, రాఘవులు పాడారు. ఇందులో ఎస్ వరలక్ష్మి కూడా ఒక సోలో పాడడం విశేషం. (అభినయం కూడా ఆవిడదే). అన్ని నహతాగారి సినీమాల పాటల్లాగే ఇందులోనూ కొన్ని హిందీవరసలు వున్నాయి. అయితే ఆ హిందీ పాటలన్నీ మాస్టారి మ్యూజికల్ టచ్ తో తెనుగుదనం సంతరించుకునేవి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అభిమానం సినీమాలోని "ఊయలలుగే నా హృదయం", "వలపుతేనె పాట", "మధురా నగరిలో" (సుశీల), "దయగల తల్లికి మించిన దైవం" పాటలు అప్పుడూ, ఇప్పుడూ కూడా బహుళ జనాదరణ పొందినవే. సుశీల గారు పాడిన ఈ పాట రికార్డింగ్ కు నేనూ, మా ప్రసాద్ వెళ్ళి విని ఆనందించిన సంఘటన ఎప్పటికీ మరువలేము. నేనైతే ఈ సినీమా రీరికార్డింగ్ కు కూడా వెళ్ళాను. (కన్నాంబ, కృష్ణకుమారి, రేలంగి  పాల్గొన్న కొన్ని  సన్నివేశాలు).  

దీపావళీ సినీమాలో పాటలు పద్యాలూ ఎక్కువే. అయితే పి.లీల ఈ సినీమాలో ఒక పాటా, పద్యమూ పాడకపోవడం విశేషం. ఆడవాళ్ళ పాటలన్నీ కోమల, సుశీల, ఎస్వరలక్ష్మీ పాడగా మగవారికి ఘంటసాల, మాధవపెద్ది, రాఘవులు పాడారు. దీపావళీ సినీమాలో ఘంటసాలవారి సంగీతం  ఒక ప్రధాన ఆకర్షణ. "సరియా మాతో సమరాన..", "యదుమౌళీ ప్రియ సఖి నేనే", "ఓ దేవా కనలేవా", "కరుణా చూడవయా", "విరాళీ సైపలేనురా" వంటి పాటలలో ఘంటసాల మాస్టారి శాస్త్రీయ సంగీతప్రజ్ఞ స్పష్టంగా కనిపిస్తుంది. 


దీపావళీ సినీమా రీరికార్డింగ్ పూర్తిగా చూశాను. నరకాసురుడి రథం క్రింద బాలుడు పడిపోవడం; నరకుడి చెరలో గుమ్మడి కష్టాలు, కళ్ళు పొడిచేయడం; గుమ్మడి కూతురు పాముగా మారి చెరసాల తాళాలు తీయడం; చెరసాల భటులతో నారదుడు, కృష్ణుడి మాయా వినోదాలు; యిలా ఆద్యంతం ఎన్నో సీన్లు రీరికార్డింగ్ లో చూసాను. సందర్భోచితంగా, సమయస్ఫూర్తి తో రీరికార్డింగ్ సంగీతం సమకూర్చి రక్తికట్టించడమనేది సామాన్య విషయం కాదు. ఆ విషయంలో ఘంటసాల మాస్టారి ప్రతిభ అసమాన్యం.

ఇటీవలి కాలంలో "దీపావళీ" సినీమాకు సంబంధించి ఒక ముచ్చట. ఈ చిత్రానికి సంగీతం నిస్సందేహంగా ఘంటసాలవారిదే. కానీ, ఏ కారణం చేతనో "దీపావళీ" సినీమా సిడిలలో, డివిడిలలో ఉన్న టైటిల్స్ లో 'సంగీతం -ఘంటసాల' కార్డ్ మిస్సింగ్. సహాయకులలో సంగీతం పి.సంగీతరావు అని వుంటుంది.  ఈటీవీ ప్రారంభమైన కొత్తలో వారి tv సరాగాలుకార్యక్రమంలో ప్రసారం చేసే సినిమా పాటలలో దీపావళి సినిమా (ముఖ్యంగా తరచుగా ప్రసారంచేసిన "సరియా మాతో సమరాన నిలువగలడా..") పాటలకి వేసే క్రెడిట్స్ లో సంగీతం పి.సంగీతరావు అని వేసేవారు. అయితే రసజ్ఞులైన సంగీతాభిమానులందరికీ వాస్తవం తెలుసు కనుక ఎవరూ పెద్దగా పట్టిచ్చుకోలేదు. ఓ నవ్వు నవ్వి నవ్వుకున్నారు ఈటీవి సాంకేతిక వర్గంవారు ఆ తరవాత పాతికేళ్ళలో కావలసినంత సినీమా పరిజ్ఞానం సంపాదించుకున్నాక ఆ తప్పు మరి చెయ్యలేదు.

ఇక ఆ సంవత్సరం, 1960లో వచ్చిన మాస్టారి ఆఖరి చిత్రం, సొంత చిత్రం "భక్త రఘునాధ్". ఈ  సినీమా విశేషాలు గతవారమే ముచ్చటించుకున్నాము. 1960 లో ఘంటసాల మాస్టారి ఘనకీర్తిని పెంచిన రెండు మహత్తర చిత్రాలు "మహాకవి కాళిదాసు", "శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం". రెండూ అగ్రనటుల (ఎఎన్నార్, ఎన్టీఆర్) చిత్రాలు. రెంటికీ సంగీతం పెండ్యాలగారే. మహాకవి కాళిదాసు చిత్రంలోని పద్యాలకు, శ్లోకాలకు స్వరరచన ప్రముఖ రంగస్థల నటుడు పి.సూరిబాబు. ఈ చిత్రానికి సహనిర్మాత కూడా. కాళిదాసు చిత్రంలో ఘంటసాలవారి  గళంలో విశ్వరూపం కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన శ్యామలా దండకం ఆయనను గాన గంధర్వుడిని చేసింది.

ఈ దండకం మాస్టారికి, నటించిన అక్కినేని వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టింది. మహాకవి కాళిదాసులో మాస్టారు పాడిన శ్యామలా దండకాన్ని వేదికలమీద, టివి ఛానల్స్ లో పాడని గాయకులే లేరు. కాకపోతే ఘంటసాలవారి రేంజ్ కు సమీపంగా చేరుకున్నవాళ్ళని నేను చూడలేదు. అందరూ గాన గంధర్వులు కారు, కాలేరు.

కలియుగ దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి మీద పద్మశ్రీ ఫిలింస్ బ్యానర్ మీద పి.పుల్లయ్యగారి నిర్మాణ దర్శకత్వంలో రూపొందుకున్న చిత్రం 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ సినీమాలో తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని పరమ భక్తుడైన శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు ఒక భక్తిగీతం ఆలపిస్తూ తెరపై కనపడడం, వారి అశేషాభిమానులకు ఒక గొప్ప విశేషం, అపురూప దర్శనం. ఇదే వేంకటేశ్వర మహత్మ్యం కథను పి.పుల్లయ్యగారు 82 ఏళ్ళక్రితం 'బాలాజీ' అనే పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు. అందులో పద్మావతిగా నటించిన పుల్లయ్యగారి భార్య శాంతకుమారి, 1960 సినీమాలో వకుళమాతగా నటించి చక్కని పాటలు కూడా ఆలపించారు. ఇరవై ఏళ్ళ వ్యవధిలో ఒకే నటి రెండు విభిన్న పాత్రలు. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమాలో ఘంటసాల మాస్టారు పాడిన 'శేషశైలావాసా శ్రీ వేంకటేశాపాట ప్రధాన చిత్రంతో సంబంధంలేదు. చిత్రం చివరలో తిరుమలలో జరిగిన మహాకుంభాభిషేకం డాక్యుమెంటరీకీ అదనపు ఆకర్షణగా ఆత్రేయగారు వ్రాసిన ఈ పాటను ఘంటసాలవారిపై చిత్రీకరించారు. ఒక భక్త గాయకునిలో వుండాల్సిన ప్రశాంతత, చిరునవ్వు, భక్తిభావం, తాదాత్మ్యం యివన్నీ మాస్టారి వదనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ ఏకాంత సేవ గీతం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ పాట చిత్రీకరణలో మాస్టారితో పాటు ఫ్లూట్ వాయిస్తూ నంజుండప్ప(నంజప్ప), తంబురా శృతి వేస్తూ డి.బాబూరావు , మృదంగం వాయిస్తూ వాహినీ సౌండ్ ఇంజనీర్, వల్లభజోస్యుల శివరాం(లాగే కనిపిస్తున్నారు) పాల్గొన్నారు. నిర్మాతా దర్శకుడు పి.పుల్లయ్యగారి ఒత్తిడి వలన ఈ భక్తుని పాత్రలో తెరమీద పాడుతూ కనిపించడానికి మాస్టారు అంగీకరించారని అనుకునేవారు. ఈ పాట చిత్రీకరణ వాహినీ-విజయా స్టూడియోలో జరిగింది. ఇందుకుగానూ ఒక ఆలయం సెట్ వేసి అందులో ఈ పాట చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ కు సావిత్రమ్మగారు, పెద్దబాబులతో సహా నేనూ వాహినీకి వెళ్ళాను. మేము సుమారు మూడు, నాలుగు గంటల ప్రాంతంలో వెళ్ళాము. మాస్టారిని మేకప్ లో చూడడం అదే ప్రధమం. పట్టుబట్టలు, నుదుట తిరుచూర్ణం, మెడలో పులిగోరు పతకం, చాలా తమాషాగా, ఒకరకమైన థ్రిల్ గా అనిపించింది. ఆ షూటింగ్ లో మమ్మల్ని కూడా ప్రేక్షకుల మధ్య కూర్చోపెట్టమని ఎవరో అడగడం, అందుకు మాస్టారు సున్నితంగా నిరాకరించడం నాకు బాగా గుర్తు.  అర్ధరాత్రి వరకు పిల్లలు నిద్రకు ఆగలేరు, వద్దని చెప్పిన గుర్తు. ఓ రెండు మూడు గంటలసేపు వుండి మేము ముగ్గురం ఇంటికి తిరిగి వచ్చేసాము. అది నాకు నిరాశ కలిగించింది. షూటింగ్ పూర్తిగా చూసే అవకాశం కోల్పోయాను. కాస్తా వయసు వచ్చాక అర్ధమయింది, ఆ రోజంతా షూటింగ్ లో కూర్చున్నా మా మొహాలు తెరమీద కనిపించవని. ఎంతైనా మాస్టారు అనుభవజ్ఞులు. అందుకే పెద్దలు చెప్పిన మాటలు పాటించాలనడం.

శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా ప్రివ్యూ చూసిన గుర్తులేదు. కానీ, మా బొబ్బిలి శ్రీరామా హాలులో ఓ రెండు మూడుసార్లు చూసాను. ధియేటర్ బయట శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం పెట్టి మూడాటలకు ముందు పువ్వుల అలంకరణ, నిత్యపూజలు, హారతులు నిర్వహించేవారు. వడ్డి కాసులవాడు కదా, హుండీ కలెక్షన్, సినీమా కలెక్షన్ రెండూ దండిగానే మూటకట్టుకున్నారు. ఆ ధియేటర్ లో ఆ సినీమా ఆడినన్నాళ్ళు నేనూ నా స్నేహితుడు బి.ఎస్.కృష్ణారావు సాయంత్రం ఆట సమయంలో అక్కడికి వెళ్ళి ఆ హారతులు, తీర్థం అందుకొని అక్కడనుంచి పక్కనే వున్న మా వేణుగోపాలస్వామివారి ఆలయానికి వెళ్ళేవాళ్ళం. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా చూడడానికి చుట్టుపక్కల పల్లెటూళ్ళనుండి  ప్రజలంతా బళ్ళలో కుటుంబాలతో సహావచ్చి సినీమాచూసి రాత్రంతా బళ్ళలోనే పడుక్కొని మర్నాటి ఉదయాన్నే తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయేవారు. ఈ సినీమా వచ్చిన ఐదు రోజులకు సరికొత్త సినీమా హాలు శ్రీకృష్ణా టాకీస్ లో 'శాంతినివాసం' విడుదలయింది. ఎఎన్నార్ సినీమా. ఒకటి సాంఘికం. ఒకటి పౌరాణికం. ఒకదానికొకటి పోటీ కాలేదు. ఈ రెండు సినీమాలు 50 రోజులకు పైనే ఫుల్ కలెక్షన్స్ తో ఆడాయి. మా బొబ్బిలిలో ఏదైనా సినీమా 50 రోజులు ఆడితే అది సూపర్ హిట్ సినీమా క్రిందే లెఖ్ఖ. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా తర్వాత ఘంటసాల మాస్టారింటికి , ఎన్.టి,రామారావుగారి ఇంటికీ తిరుపతి యాత్రీకుల రద్దీ విపరీతంగా పెరిగింది.

భారతదేశం అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో పాల్గొంటూ అప్పుడే దాదాపు 90 ఏళ్ళు పైబడిందనుకుంటాను. సి.ఎస్.నాయుడు, సి.కె.నాయుడు, సర్ విజ్జి(రాజకుమార్ ఆఫ్ విజయనగరం), లాలా అమర్ నాథ్, అధికారి వంటి ప్రముఖులు ప్రథమదశ  క్రికెట్ క్రీడాకారులుగా, ఆ ఆట జనబాహుళ్యంలోకి రావడానికి చాలా కృషిచేసారు. నేను క్రికెట్ ఆట గురించి తెలుసుకున్ననాటికి, పాలీ ఉమ్రీగర్, నారీ కంట్రాక్టర్, రమాకాంత్ దేశాయ్, దిలీప్ సర్దేశాయ్, బాపు నడ్కర్ణి, ఫరూక్ ఇంజనీర్, ఎమ్ ఎల్ జయసింహ, కుందెరన్ వంటి ఆటగాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూండేవి. తర్వాత తరంనాటి సునీల్ గవాస్కర్, జి.ఆర్.విశ్వనాధ్, శ్రీక్కాంత్సోల్కర్, ఇ.ఏ.ఎస్.ప్రసన్న, బిషెన్ సింగ్ బేడీ, బి.ఎస్.చంద్రశేఖర్, ఎస్.వెంకటరాఘవన్ లు ఇప్పటి తరానికి కూడా తెలుసు. ఆనాటి క్రికెట్ ఆటగాళ్ళకు సంబంధించి రెండు, మూడు విషయాలు బాగా గుర్తుండిపోయాయి. ఒకటి ఫరూక్ ఇంజనీర్ ఏడ్. ఇతను ఇండియా తరఫు స్టార్ వికెట్ కీపర్, మంచి స్టైలిస్ట్ బ్యాట్స్మేన్. ఇతను 'బ్రిల్ క్రీమ్' ఏడ్స్ లో కనపడేవాడు. నున్నగా దువ్విన నిగనిగలాడే నల్లని వంకీల జుత్తుతో ఉన్న ఇంజినీర్ ఫోటోకింద తెలుగులో 'అతని గర్వము తలకెక్కినదా'? అనే ప్రకటన చాలా రోజులు కనపడేది. నాకు ఇంజనీర్ అంటే 'గర్వము తలకెక్కినదా' మాట ఒక్కటే గుర్తుకు వచ్చేది.  మరొక విషయం. నారీ కంట్రాక్టర్. ఇంగ్లండ్ టూర్ వెళ్ళినప్పుడు  ఏదో టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి బలంగా వచ్చి తలకు తగలడం, స్కల్ కు ఆపరేషన్ చేయడం, ఆ తర్వాత కంట్రాక్టర్ శాశ్వతంగా క్రికెట్ నుండి తప్పుకోవడం జరిగిందని పేపర్లలో చూశాను. మూడవది ఎమ్.ఎల్.జయసింహ. ఓపెనర్ బ్యాట్స్ మేన్ అనుకుంటాను. హైదరాబాద్ ప్లేయర్. తెలుగువాడనే విన్నాను. పేరును బట్టి ఎన్.టి.రామారావు (జయసింహ సినీమా వల్ల)లా వుంటాడని ఊహించుకునేవాణ్ణి. అతను మహా జిడ్డు ఆటగాడని తాతగారు(సదాశివుడు) అంటూండేవారు. ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా వెళ్ళి మూడు రోజులపాటు నాటౌట్ గా వుండిపోయాడు. ఈ మూడు రోజుల ఆటలో అతను కేవలం 72 పరుగులు మాత్రమే చేసాడని పత్రికలలో చదివాను. నిజానికి టెస్ట్ మ్యాచ్ లకు అలాటి patience, consistency ఉన్న ఆటగాళ్ళే ముఖ్యం. అలాటి బేట్స్ మెన్ ని ఇప్పుడు వాల్ అంటున్నారు. ఈ తరం ఆటగాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫార్మేట్ కి తగిన ఆటతీరు అలవరుచుకోవలసిందే. ఓర్పు, సహనం ఈనాటి ఒన్డేలకి ట్వంటీ ట్వంటీలకి సరిపడదు. అలనాటి విదేశీ ఆటగాళ్ళు డాన్ బ్రాడ్మన్, గారీ సోబర్స్, రోహన్ కన్హాయ్, వెస్లీ హాల్, మైఖేల్ హోల్డింగ్, బాబీ సింప్సన్, మొదలైనవారు గత తరం ఆటగాళ్ళు. వీళ్ళంతా ఏఏ దేశాలవారో నాకు తెలియదు. పత్రికలలో చదవడంతో సరి. ఆ రోజుల్లో క్రికెట్ అంటే మూడు రోజుల రంజీ, దులీప్ ట్రాఫీ లీగ్ మ్యాచ్ లు, ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే.

మేము మెడ్రాస్ వచ్చిన పిమ్మటే క్రికెట్  అనే ఆట ఒకటి వుందని తెలిసింది. మా రామకృష్ణా స్కూల్ లో మంచి టీములే వుండేవి. నన్ను 'సి' టీములో వుండి ఆట నేర్చుకోమన్నారు. కానీ, బరువైన బ్యాట్ లు, ప్యాడ్స్, బంతులను భరించడం నా వల్ల కాలేదు. నేనెప్పుడు ప్యాడ్లు కట్టుకొనిక్రికెట్ బంతితో ఆడిన దాఖలాలు లేవు. అయినా, చిన్ళప్పటినుండి రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూండేవాడిని. ఆట రాకపోయినా. సంగీతం రాకపోయినా శాస్త్రీయ సంగీత రాగాల పేర్లు తెలుసుకున్నట్లే క్రికెట్ ఆడడం రాకపోయినా ఆ ఆటకు సంబంధించిన కొన్ని మాటలను తెలుసుకోవడం జరిగింది. కాలేజీలో చేరాక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్రికెట్ ఆట గురించి చెప్పడానికి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ జరిగినప్పుడు మొదటిసారిగా ఈ ఆట గురించి ఫీల్డింగ్ పొజిషన్స్ గురించి మరికొంచెం తెలిసింది. స్లిప్ లు, గల్లీ, మిడ్ ఆన్, మిడ్ ఆఫ్, లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్,  స్క్వేర్ డ్రైవ్, హుక్, స్వీప్, ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, షార్ట్ బాల్, బౌన్సర్ వంటి కొన్ని పేర్లు వినడం జరిగింది. అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రయోగిస్తారో నాకు ఏమాత్రం అవగాహన లేదు. నా క్రికెట్ పరిజ్ఞానం అంతగా పెరగలేదు. హాకీ కొన్నాళ్ళపాటు ఆడినా అదీ ఒంటబట్టలేదు. చివరకు హ్యాపీగా బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ వంటి ఇన్ డోర్ గేమ్స్ కు పరిమితమై కొన్ని సర్టిఫికెట్ లు సంపాదించుకోగలిగాను. టెన్నిస్ అంటే రాయ్ ఎమర్సన్, రాడ్ లేవర్, రామనాథన్ కృష్ణన్ ల పేర్లే. ఈ కృష్ణన్ డేవిస్ కప్ పోటీలలో రాణించినంతగా వింబుల్డన్ లో పేరు పొందలేదు. సెమీఫైనల్ తోనే వెనక్కు వచ్చేసేవాడు. అతని కొడుకు రమేష్ కృష్ణన్ తండ్రికంటే మంచి పేరు పొందాడు.

రెజ్లర్స్ అంటే కింగ్ కాంగ్, దారాసింగ్ వంటి వస్తాదుల పేర్లే వినపడేవి. ఘంటసాల మాస్టారికి ఆటలపట్ల మంచి ఉత్సాహం, ఆసక్తివుండేవి. అవకాశం దొరికితే అలాటి ఆటలు చూడడానికి ఇష్టపడేవారు. దారాసింగ్  మల్లయుధ్ధ పోటీలలో పాల్గొనడానికి మెడ్రాస్ వచ్చినప్పుడు  మాస్టారు కూడా చూసేందుకు వెళ్ళారట. ఆ సందర్భంలో ఆ క్రీడాకారుల గౌరవార్ధం ఇచ్చిన ఒక విందులో తీసిన గ్రూప్ ఫోటోలో  దారాసింగ్ తో పాటూ మన మాస్టారూ కనిపిస్తారు. 

కింగ్ కాంగ్, దారా సింగ్ ల మధ్య ఘంటసాల

మా చిన్నతనంలో క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్ లే. ఇప్పటిలా ట్వెన్టీ ట్వెన్టీలు, వన్ డే మ్యాచ్ లు లేవు. ఆ టెస్ట్ మ్యాచ్ లు కూడా అరుదుగా రెండేళ్ళకో, మూడేళ్ళకో జరిగేవి. ఇంగ్లండ్, వెస్ట్ ఇండీస్, ఇండియా, పాకిస్థాన్ఆస్ట్రేలియా, అంటూ చాలా లిమిటెడ్ గానే టీమ్స్ ఉండేవి. అప్పటి ఆటగాళ్ళ ఆదాయం కూడా అంతంతమాత్రమే. మెడ్రాస్ లో  జరిగిన గేరీ సోబర్స్, వెస్లీ హాల్ తో కూడిన వెస్ట్ ఇండీస్ టీం, ఇండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కు ఘంటసాల మాస్టారు వెళుతూ తనతో కూడా మా నాన్నగారినీ తీసుకువెళ్ళారు.

మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరిగిందా లేక నెహ్రూ స్టేడియంలో జరిగిందో నాకు తెలియదు. ఆ రెండు స్టేడియంలు అప్పుడు ఇప్పుడున్నంత ఆధునిక వసతులతో వృధ్ధి చెందలేదు. ఓపెన్ ఎయిర్ లో మండుటెండలో కూర్చొని ఆట చూడవలసి వచ్చేది. అన్ని గ్యాలరీలకు రూఫ్స్ ఉండేవికావు. ఐదు రోజుల మ్యాచ్ లో మాస్టారు, మా నాన్నగారు ఒక రోజు ఆటకు మాత్రమే వెళ్ళారు. అప్పటికి మానాన్నగారికి క్రికెట్ ఆటగురించి పెద్దగా తెలియదు. ఒక్కొక్క ఓవర్ కు టీమ్ సెట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, బౌలర్ ఎక్కడో దూరం నుంచి పరుగెత్తుకు వచ్చి బాల్ వేయడం బ్యాట్స్ మేన్ ఆ బంతిని  టుప్పుమని బ్లాక్ చేయడం, లేదా బాల్ పిచింగ్ ఔట్ సైడ్ స్టంప్స్ అయితే అలా వదిలేయడం, మళ్ళా బౌలర్ అంత దూరం వెళ్ళి, పరిగెత్తుకుంటూ వచ్చి బంతి విసరడం, బ్యాట్స్ మన్ దానిని కొట్టి  అట్నుండి ఇటు పరిగెత్తుకు రావడం, దానిని చూసి జనాలు చప్పట్లుకొట్టడం, ఈలలువేసి అరవడం. ఈలోగా ఫీల్డర్ విసిరిన బంతి స్టంప్స్ కు తగలడమో, లేదా కొట్టిన బంతిని ఎవరైనా పట్టుకోవడమో జరగగానే ఔట్ అనడం, మరొక ఆటగాడురావడం, పట్టుమని పది రన్ లు కూడా తీయకుండానే ఔటయి వెళ్ళిపోవడం - ఇదంతా మా నాన్నగారికి ఆ రోజుల్లో అంత ఆసక్తి కలిగించలేదు. విసుగుపుట్టించింది.  ఉదయం ఏ ఎనిమిదింటికో వెళ్ళినవారు సాయంత్రం ఆరు దాటాక  బాగా అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. మాస్టారిదీ అదే పరిస్థితి.  ఆటాడిన వాళ్ళకన్నా ఆటను చూసినవారే ఎక్కువ అలసిపోతారు. వెస్టిండీస్ బలం ముందు ఇండియా బలం చాలలేదు. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిందని అన్నారు.

మా నాన్నగారికి ఓ 75 ఏళ్ళు వచ్చేప్పటికి ఆయనా, మా అమ్మగారూ  క్రికెట్ లో, టెన్నీస్ లో ఆరితేరిపోయారు. ఆడడంలో కాదు, టీవీలో ఆ మ్యాచ్ లు చూడడంలో, ఆ ఆటగాళ్ళ ఆటల తీరుతెన్నుల గురించి విశ్లేషించడంలో  ఇద్దరూ చాలా జ్ఞానం సంపాదించారు. ఏ ఏ దేశాల ప్లేయర్లు ఎవరెవరో వారి పేర్లేమిటో  వారిద్దరికీ  తెలిసినంతగా నాకు తెలియవు. నాకు దేశాభిమానం ఎక్కువ. ఇండియా పాల్గొనే క్రికెట్ మ్యాచ్ లు మాత్రమే రేడియో కామెంటరీ విధిగా వినేవాడిని, ఆ ఇంగ్లీష్ అర్ధం కాకపోయినా. ఇప్పుడూ అంతే.

అదే సంవత్సరం ఇంగ్లండ్ లో ఇండియా టీమ్ వెళ్ళి ఆడింది. ఆ మ్యాచ్ మన ఇండియా టైమ్ ప్రకారం రాత్రి జరిగేది. అందరూ నిద్రపోయే టైము. వాళ్ళకు నిద్రా భంగం కాకుండా హాలులోని లైట్లు తీసేసి  పాత పెద్ద రేడియోలో వాల్యూమ్ తగ్గించేసి సదాశివుడుగారు, నేనూ మాత్రం చెవులొగ్గి క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళం. ఆ కామెంటరీ ఏ బిబిసి నుంచో షార్ట్ వేవ్ లో వచ్చేది. ఆ రేడియో లో మీడియం వేవ్ దొరికినంత సులభంగా షార్ట్ వేవ్ ట్యూన్ అయ్యేదికాదు. నా వరకూ అయితే ఆ రేడియోలో సముద్రపు హోరు లాటి శబ్దాలే వినపడేవి మాటలకన్నా. ఈలోపల ఆ కామెంటరీని ఓవర్ టేక్ చేస్తూ మహ స్పష్టంగా రేడీయో పీకింగ్  అంటూ చైనా రేడియో స్టేషన్ అడ్డొచ్చి ఈ కామెంటరీ పోయేది. ఆనాటి చైనా రాజధాని పీకింగ్ ను ఇప్పుడు బీజింగ్ అంటున్నారు. ఆ రేడియో పీకింగ్ చాలా పవర్ ఫుల్. దానిని తప్పించుకొని మళ్ళా బిబిసిని పట్టడానికి నానా తిప్పలు పడేవాళ్ళం. నాకేమీ అర్ధమయేది కాదు. మధ్యమధ్య ఫోర్ అనో, కాట్ అనో, ఔట్ అనో గట్టిగా చెప్పేవారు. కామెంటరీ ఇంగ్లీష్ లో సాగేది. ఒక్క ముక్క తెలిసేదికాదు. అయినా ఆ రేడియోను అంటిపెట్టుకొని వినడం అదో సరదా. ఆ కామెంటరీ చెప్పేవాళ్ళలో ఒకాయన పేరు సర్ విజ్జి . ఆయన మా విజయనగరం రాజా, పి.వి.జి.రాజుగారికి పినతండ్రో, పెత్తండ్రో అని చెప్పుకోగా విన్నాను. కానీ ఆయనెప్పుడూ విజయనగరంలో ఉండేవారు కాదట. వాళ్ళ ఎస్టేట్స్ అన్నీ ఉత్తరప్రదేశ్ లోని రేవా, బుందేల్ ఖండ్, వారణాసి ప్రాంతాల్లో వుండడం వలన ఆయన అక్కడే ఉండేవారట. మొత్తానికి అర్ధరాత్రి దాటేవరకూ ఆ వినపడని రేడియోలో ని కామెంటరీ విని పడుక్కునేవాళ్ళం. ఇండియా జట్టు గెలవడం అనేది బహు అరుదుగా జరిగేది. విదేశీ ఫాస్ట్ బౌలర్లంటే మనవాళ్ళు హడిలి చచ్చే రోజులవి. ముఖ్యంగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లంటే మనవాళ్ళకు సింహ స్వప్నం.

మా ఇంటి ఎదురుగా వున్న సోమసుందరం గ్రౌండ్స్ లో శెలవు దినాలలో పెద్దవాళ్ళ క్రికెట్ మ్యాచ్ లు ఉదయం నుండి సాయంత్రం వరకూ జరిగేవి. ఆ సమయంలో రబ్బర్ బంతులతో ఆడే  పిల్లల క్రికెట్  బంద్. పెద్దవాళ్ళ మ్యాచ్ అయ్యేప్పుడు మేము పిల్లలం బౌండరీలైన్ లో వుండే ఫీల్డర్స్ తో ఏదో మాట్లాడుతూ, చప్పట్లు కొడుతూ అరుస్తూండేవాళ్ళం. ఇలా ఒక మ్యాచ్ లో బౌండరీలైన్ లో ఉన్న ఒక ఫీల్డర్ వేపు బ్యాట్స్ మేన్ కొట్టిన బంతి ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చింది. మేమంతా గట్టిగా రన్ రన్ క్యాచ్ క్యాచ్ అంటూ ఆ ఫీల్డర్ ను ఉత్సాహపరుస్తూ అరవడం మొదలెట్టాము. అతను మంచి ఒడ్డూ పొడుగుతో లావుగా సైట్ కళ్లజోడుతో వుండేవాడు. వేగంగా వస్తున్న ఆ బంతిని పట్టినట్లే పట్టి జారవిడిచేశాడు. ఆ బంతి సరాసరి వెళ్ళి అతని కళ్ళజోడుకు తగిలి కళ్ళద్దాలు పగిలి అతని ఒక కంటికి తీవ్రమైన గాయం అయింది. అంతవరకూ వారం వారం కనిపించే ఆ ఆటగాడు తిరిగి ఆ గ్రౌండ్స్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ లలో కనపడలేదు. ఆరోజు జరిగిన ప్రమాదంలో అతని ఒక కన్ను పూర్తిగా పోయిందని చెప్పుకునేవారు. ఇది చూసాక క్రికెట్ ఆటగాడిని అవాలనే ఉద్దేశ్యం ఏదైనా ఉంటే దానిని సమూలంగా తుడిచిపెట్టేసాను. ఇదంతా 60 ఏళ్ళ క్రితం మాట. 

ఇదిగో ఇప్పుడు మరల నిన్న అదే ఇంగ్లండ్ తో చెన్నై చేపాక్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ అయింది. 2016 తర్వాతచెన్నైలో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ జరగడం ఇప్పుడే. కోవిడ్ 19 దృష్ట్యా ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించలేదు. రెండవ టెస్ట్ నుండి టిక్కెట్లు అమ్ముతారని తెలుస్తోంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా క్రికెట్ సూపర్ స్టార్లంతా బ్రహ్మాండంగా ఆడి బాజా భజంత్రీలతో 227 రన్ ల తేడాతో ఘనంగా......ఓడారు.

...సశేషం

 *With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

3 comments:

Hrishikesh Sharma said...

మాష్టారి ప్రతిభ, క్రికెట్ కబుర్లు చాలా చక్కగా వివరించారు. మీ అనుభవాలు, అనుభూతులు అద్భుతం. ధన్యవాదాలు sir🙏🙏

P P Swarat said...

మీ అభినందనలకు ధన్యవాదాలు.

R N Nandyal said...

You are known for your inimitable narrative technique,astounding memory and verbal images.You have shown us another aspect of Shri Ghantasala i.e his love for cricket and wrestling.Many thanks for making the readers 'see' the happenings of those days