13.06.2021 - ఆదివారం భాగం - 35*:
అధ్యాయం 2 భాగం 34 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్.
"ఋణానుబంధ రూపేణా
పశు పత్నీ సుతాలయః
ఋణక్షయే క్షయం
యాంతి కా తత్ర పరివేదన"
పశువులు,భార్యాసుతులు, గృహములు , భూవసతులు
మొదలైనవన్నీ ఋణానుబంధ రూపంగా ఏర్పడి,ఆ ఋణం తీరగానే ఆ మనిషి నుండి దూరమైపోతాయి. ఆ ఋణం తీరిపోగానే వాటి వల్ల కలిగే దుఃఖమూ ఇంక మిగలదు అనేది సూక్తి.
" ఏనాటిదో ఈ బంధం
ఈ జీవుల సంబంధం
తెలియగరాని ఈ అనుబంధం
ఋణానుబంధం
అంతా ఋణానుబంధం....
..... ఎవరికి ఎవరు ఏమౌతారో
అంతా ఋణానుబంధం..."
అని సముద్రాల రామానుజంగారు వ్రాసిన మాటల్లోని తాత్త్వికతను , వేదాంతాన్ని పామరులకు సైతం అర్ధమయేలా సరళంగా మరింత భావోద్వేగంతో మన గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు ఆలపించారు.
నేటితో మా తండ్రిగారి శ్రాద్ధ కర్మలు, మూడు రోజుల కార్యక్రమము సంతృప్తికరంగా మా పరిధులమేరకు నిర్వర్తించాము. మా తండ్రిగారు నివసించిన మా పెద్దచెల్లెలు రమణమ్మ స్వగృహంలోనే వైకుంఠ సమారాధన కూడా జరిగింది.
దైవత్వాన్ని పొందిన మా నాన్నగారి దివ్య ప్రసాదాన్ని మేమంతా భక్తి శ్రద్ధలతో స్వీకరించాము.
మాకు జన్మనిచ్చి, పెంచి, విద్యాబుద్ధులను నేర్పించి మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దిన పూజ్యులు, మా తండ్రిగారు పట్రాయని సంగీతరావు గారికి మేము ఋణపడివున్నామో,
లేక ఆయనే మాకు ఋణపడి అన్ని ఋణాలు తీర్చుకొని ఈ భవబంధాలనుండి విముక్తులయ్యారో అనేటువంటి తార్కిక,తాత్త్విక,వేదాంత విషయాల గురించి చెప్పే విషయ పరిజ్ఞానం నాకు లేదు.
కానీ వారు మాత్రం ఈ లోకంతో తనకున్న 101 సంవత్సరాల భవబంధాలను, అనుబంధాలను అన్నింటిని తొలగించుకొని మనమెవ్వరమూ ఊహించలేని, అందుకోలేని సుదూర తీరాలకు తరలివెళ్ళిపోయారు.
భౌతికంగా మా తండ్రిగారు మమ్మల్ని వదలివెళ్ళినా ఆయన సౌజన్యం, వ్యక్తిత్వం, మానవతాదృక్పధం,
ఆయనతోటి జ్ఞాపకాలు మాత్రం సదా మమ్మల్ని వెన్నంటే వుండి మాకు తోడునీడగా నిలిచేవుంటాయి.
మా నాన్నగారికి సంబంధించిన వీడుకోలు మాటలను ఇంత త్వరలో 'నెం. 35,ఉస్మాన్ రోడ్' ధారావాహిక లో వ్రాస్తానని,
వ్రాయవలసివస్తుందని నేను ఏనాడూ ఊహించలేదు.
ఈ కరోనా మహమ్మారికి ఆయన బలికావలసి వచ్చింది. 101 సంవత్సరాల 7 మాసాలతో ఆయన ఆయుర్దాయం ముగిసింది.
ఈ భూమి మీద ఆయన ఋణం తీరిపోయింది.
ఉన్న నాలుగునాళ్ళు ఒక మహామనీషిగా అందరి గౌరవమర్యాదలను అందుకొని అందరివద్దా శాశ్వతంగా శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
'నెం.35,ఉస్మాన్ రోడ్' తో శ్రీ పట్రాయని సంగీతరావు గారి అనుబంధం నిన్న మొన్నటిది కాదు. 1952 లో మొదటిసారిగా ఆయన ఆ ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆ రోజు
కొత్త బంధాలకు, అనుబంధాలకు స్నేహ సత్సంబంధాలకు నాంది పలికిన రోజు.
ఆ రోజున ఘంటసాల మాస్టారింట్లో వారి తండ్రిగారి ఆబ్ధికం జరుగుతోంది. మాస్టారు ఇంటిలోపల ఆ కార్యక్రమంలో నిమగ్నమైవున్నారు.
అలాటి సమయంలో శ్రీ సంగీతరావు గారు 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోకి ప్రవేశించారు. వీధి వాకిలి, పోర్టికో దాటి వరండాలోకి వెళ్ళగానే అక్కడ ముందుగా మాస్టారి స్నేహితుడు మోపర్రుదాసుగారు కనిపించారట. ఆయన సంగీతరావు గారిని గుర్తుపట్టి,ఆయనను అక్కడే కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి ఘంటసాలవారి తో చెప్పారట. వెంటనే మాస్టారు చేస్తున్న కార్యక్రమాన్ని మధ్యలో ఆపి బయటకు వచ్చి సంగీతరావు గారిని చేయిపట్టుకొని సగౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్ళారట.
ఆనాటి సంగీతరావు గారి మనస్థితి కుచేలుడి మనస్థితి వంటిదే. బాల్యమిత్రుడైన కుచేలుడిని కృష్ణుడు ఆదరించినట్లుగానే సంగీతరావు గారిని ఘంటసాల ఆదుకున్నారు.
శ్రీకృష్ణ కుచేల సినీమాలోని కుచేలుని విషయాల గురించి
చెప్పేప్పుడు మా నాన్నగారిలోని వేదనాపూరితమైన భావోద్వేగాన్ని చూస్తే ఆ కుచేలుడు తానే అయి మాట్లాడుతున్నారా ?అనే భావన నాలో కలిగేది. అంతలా ఆ కుచేలుడి పాత్రలో లీనమైపోయేవారు.
మద్రాసు సినీమా వాతావరణం లో ఇమడలేక కొన్ని మాసాల తర్వాత విజయనగరం వచ్చేసినా మరో ఏడాది తర్వాత సంగీతరావు గారు మరల మద్రాస్ వెళ్ళడం, ఆ సమయంలో ఘంటసాల మాస్టారిని మా నాన్నగారు కలవడం జరిగింది. ఇక మర్నాడు ప్రయాణమనగా ఆయన బసచేసిన హోటల్ కు మాస్టారు వెళ్ళి బలవంతాన ప్రయాణం ఆపుచేయించి తనతో కూడా కారులో తన ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అంతే, ఆ తర్వాత సంగీతరావు గారు మరల విజయనగరం లో నివాసం చేయలేదు. ఆనాడు ఘంటసాలవారు చూపిన ప్రేమాభిమానాలు, స్నేహభావం సంగీతరావు గారిని కట్టిపడేసాయి. ఇక తన జీవితమంతా ఘంటసాలవారి సహచర్యంలోనే అనే నిర్ణయానికి వచ్చేసారు. ముందు కొన్ని మాసాలు టి నగర్ రంగయ్యర్ స్ట్రీట్ ఇంటిలో గడిపినా , ఆ తర్వాత త్వరలోనే 'నెం.35,ఉస్మాన్ రోడ్' ఔట్ హౌస్ లోకి తన నివాసం మారిపోయింది. ఆ చిన్ని ఇంటిలో దాదాపు 28 సంవత్సరాలు ఘంటసాల కుటుంబీకుల మమతానురాగాల మధ్య సంగీతరావు గారు తన జీవనయానం కొనసాగించారు.
శ్రీ సంగీతరావు గారు దాదాపు 22 సంవత్సరాలు సినీమారంగంలో గడిపినా తామరాకుమీది నీటిబొట్టులాగే వుండేవారు. సినీమా సంగీతం తన గమ్యం కాదనే దృష్టితో వుండేవారు. తనకు ఆశ్రయమిచ్చి ఆదరించిన ఘంటసాలవారి వద్ద తప్ప ఏ ఇతర సంగీత దర్శకుల దగ్గరా పనిచేయలేదు. చేయాలనే కోరికా వుండేదికాదు. స్వతహగా మంచి గాయకుడైనప్పటికీ సినీమాలలో పాడాలనే ఆసక్తే ఆయనకు కలగలేదు. తన వ్యక్తిత్వానికి, ఆశయాలకు భంగకరమనిపించినప్పుడు ఆలిండియా రేడియో వంటి ప్రసార సాధనాలనే తృణీకరించారు. సంగీతరావు గారు ధనార్జన కోసం, కీర్తిప్రతిష్టలకోసం ఏనాడూ వెంపర్లాడలేదు. తనను గుర్తించి వచ్చిన అవకాశాలను మాత్రం స్వీకరించి త్రికరణశుధ్ధిగా అత్యంత నిజాయితీ తో పనిచేశారు. దాదాపు 70 సంవత్సరాలపాటు సంగీతరావు గారు మద్రాసులో గడిపినా తనకంటూ ఒక చిన్న ఇంటినిగానీ , ఒక సెంటు భూమిని కానీ ఏర్పర్చుకోలేకపోయారు. అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు కూడా ఒక ముఖ్య కారణం. అయినా ఆయన ఏనాడూ బాధపడలేదు. తనకున్న దాంట్లోనే సుఖంగా,సంతోషంగా జీవించారు.
1972 తర్వాత ఘంటసాల మాస్టారి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో చేతిలో తగినంత పని, ఆర్జన లేనప్పుడు కూడా, ఆయన దగ్గరవున్న ఇతర సహాయకులంతా వేరే మార్గాలు పట్టినప్పుడు కూడా సంగీతరావు గారు ఇతరులవద్దకు ఛాన్స్‌ల కోసం ఏ ప్రయత్నం చేయలేదు.
అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దైవం, ప్రముఖ నాట్యాచార్యుడు
శ్రీ వెంపటి చిన సత్యంగారి రూపంలో వచ్చి తమ కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ఒక నృత్యనాటకంలో పాడేందుకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఘంటసాల మాస్టారి అనుమతితోనే సంగీతరావు గారు ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వంలో మొదలైన 'సతీ సావిత్రి' సినీమాలోని ఒక శ్లోకం , 'నాదబిందు కళాధరి' పాట రికార్డింగ్ జరిగింది. అది సంగీతరావు గారు లేకుండా జరిగింది.
అంతకుముందు కూడా ఒకసారి తన అనారోగ్యం కారణంగా 'సత్యనారాయణ మహత్యం' సినీమాలోని ఒక నృత్యగీతం రికార్డింగ్ లో పాల్గొనలేకపోయారు. ఈ రెండు సమయాలలో తప్ప ఘంటసాలవారి చరమాంకం వరకూ ఆయనకు సహాయకుడిగానే జీవించారు.
1974 లో తన 54 వ ఏట, తనకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్న తరుణంలో సరికొత్త జీవితాన్ని ఆరంభించారు. డా. వెంపటి చిన సత్యంగారి ఆహ్వానం మేరకు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీలో గాయకుడిగా, అక్కడి విద్యార్ధులకు సంగీతం మాస్టర్ గా, హార్మొనిస్ట్ గా, వైణికుడిగా, సంగీత దర్శకుడిగా తనలోని బహుముఖ ప్రజ్ఞను కనపర్చి తన విద్వత్ ఏమిటో లోకానికి చాటిచెప్పారు. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు సంగీతజ్ఞుడిగా కూచిపూడి నృత్య విశిష్టత ప్రపంచ వ్యాప్తం కావడానికి ఇతోధికంగా కృషిచేశారు. కూచిపూడి నృత్య త్రిమూర్తులలో( డా.వెంపటి చిన సత్యం, పట్రాయని సంగీతరావు, శ్రీ ఎస్ వి భుజంగరాయ శర్మ) ఒకరిగా మన్ననలు పొందారు. అనేక సార్లు ప్రముఖ ప్రపంచ దేశాలన్నీ పర్యటించి భారతీయ కళా సంస్కృతి ఔన్నత్యాన్ని ఆయా దేశాలలో చాటి చూపారు.
అక్కడే తన ఆశయసిధ్ధికి, సంగీత విద్వత్ కు తగిన గుర్తింపు, మన్నన , ప్రశంస లభించిందని మనసారా ఆనందించారు.తృప్తి చెందారు.
కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ నృత్య నాటక సంగీత దర్శకుడిగా చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక 'కలైమామణి' బిరుదును ఆనాటి ముఖ్యమంత్రి కుమారి జె. జయలలిత చేతులమీదుగా స్వీకరించారు.
ఆ తర్వాత, వివిధ సందర్భాలలో మరెన్నో సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు పొందారు. శ్రీ సంగీతరావు గారికి తన
22 వ ఏటనే మొట్టమొదటిసారిగా ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ వారిచే 'సంగీతభూషణ' బిరుదు ప్రదానం జరిగింది. ఇన్ని బిరుదులు, సన్మానాలు,సత్కారాలు పొందినా తన జీవితాన్నంతా అతి నిరాడంబరంగా,ఏ డాబూ,దర్పం లేకుండా గడిపారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారికి అసలు సిసలైన వారసుడు శ్రీ పట్రాయని సంగీతరావుగారు. సంగీతమే తన వృత్తిగా,ప్రవృత్తిగా, ఊపిరిగా జీవించిన ధన్యజీవి.
శ్రీ సంగీతరావు గారు ఒక నాదయోగి.
శ్రీ సంగీతరావు గారిలో నిగూఢమై వున్న,అనన్యసామాన్యమైన సంగీత విద్వత్, నిరాడంబరత, సౌమ్యత, సౌజన్యం, అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం వంటి లక్షణాలు ఘంటసాల మాస్టారిని బాగా ఆకర్షించాయి. వారిరువురి మధ్య స్నేహబంధాన్ని బలపర్చాయి. మాస్టారు సంగీతరావు గారిని గురుస్థానంలోనే వుంచి గౌరవించారు. ప్రేమగా 'సంగీతం బాబూ' అని పిలిచేవారు. ఘంటసాలవారు కనపర్చిన గౌరవమర్యాదలనే సినీమా రంగంలోని ఇతర సంగీత కళాకారులు,దర్శక నిర్మాతలు సంగీతరావు గారిపట్ల చూపించేవారు.
శాస్త్రీయ సంగీతం, కూచిపూడి నాట్యం మీద పరిశోధనా వ్యాసాలు వెలువరించే ఎంతోమంది పిహెచ్ డి విద్యార్ధులు విషయసేకరణకోసం శ్రీ సంగీతరావు గారి వద్దకు వచ్చేవారు. ఆయనకూడా ఎంతో సహృదయంతో వారికి కావలసిన సమాచారాన్ని సోదోహరణంగా వివరించి చెప్పేవారు.
ఘంటసాల మాస్టారు స్వీయ సంగీతంలో చేసిన, పాడిన ఎన్నో పాటలు ఉత్తమ సంగీత విలువలు కల గీతాలని ,శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధులకు అవి ఒక బేస్ వంటివని వాటిని అందరూ నేర్చుకొని పాడాల్సిన అవసరం ఎంతైనా వుందని సంగీతరావు గారు అభిప్రాయపడేవారు. అలాగే తన విద్యార్ధులందరికీ నేర్పించారు కూడా. అందులో ప్రముఖమైనవి -
'దినకరా శుభకరా '- పంతువరాళి రాగం;
ఆరుద్రగారి ' తూరుపుదిక్కున అదిగో చూడు పొడిచె వేగుచుక్క - గుణ్ కలి రాగం; ఈ పాటనే సంగీతరావు గారు భూపాళ రాగంలో స్వరపర్చి పాడేవారు;
'ఎన్ని మాయలు నేర్చినావయా కన్నా' మల్లాది వారి సాహిత్యం. జంఝూటి రాగం. ఘంటసాలవారు 'దైవం' అనే సినీమాను తీయాలని సంకల్పించి మల్లాదివారిచేత ఈ పాట వ్రాయించి కంపోజ్ చేశారు. కానీ ఆ సినీమా ఆదిలోనే ఆగిపోయింది. ఇంతమంచి పాట రికార్డు కూడా కాలేదు.
మల్లాది వారి 'తెల్లవార వచ్చె తెలియకనా సామి' మోహన రాగం;
దాశరధిగారి 'ఏనాటికైనా ఈ మూగవీణా' సింధుభైరవి రాగం;
'ఏడుకొండలవాడా వెంకటా రమణా' - చక్రవాకం
'వేణుగాన లోలునిగన' - దేశ్
ఇలాటి పాటలు మరెన్నో. ఇవికాక తాను వ్రాసి,స్వరపర్చిన గీతాలను కూడా పిల్లలకు నేర్పేవారు.
ఘంటసాలవారు 'మాస్టారు' గా చిత్రపరిశ్రమలోని ప్రముఖులందరిచేత గౌరవింపబడుతున్నప్పటికీ ఆయనలో ఆ అహంకారం,దర్పం కొంచెం కూడా కనిపించేవి కావు. తోటి కళాకారులందరినీ తనతో సమానంగా గౌరవించేవారు,అభిమానించేవారు. ముఖ్యంగా,శాస్త్రీయ సంగీత విద్వాంసుల పట్ల ఎనలేని భక్తి విశ్వాసాలుండేవి.
మ్యూజిక్ ఎకాడెమీలో జరిగిన నిస్సార్ హుస్సేన్ ఖాన్ గారి గాత్రకచేరీకి స్వయంగా తంబురా శ్రుతి వేసినా; ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారికి కొన్ని మాసాలపాటు తన ఇంట ఆతిథ్యం ఇచ్చినా; వీటన్నిటికీ కారణం ఘంటసాలవారిలోని వినయవిధేయతలే.
ఒక శాస్త్రీయ సంగీత కచేరీ ముగింపులో సభ నిర్వాహకులు గాయకుడిని,పక్కవాద్యగాళ్ళను సత్కరించి తంబురా శ్రుతి వేసినాయనను వదిలేసారు. కొంత నిర్లక్ష్యం. కొంత అజ్ఞానం. అప్పుడు,ఆ సభలోనే వున్న మాస్టారు వేదికమీదకు వచ్చి సంగీతంలో శ్రుతికి గల ప్రాధాన్యత ను వివరించి ఆ శ్రుతిని సక్రమంగా వేస్తూ గాయకుడి గాత్రానికి దోహదపడే తంబురా కళాకారుడిని సన్మానించకుండా విస్మరించడం తగదని సన్నసన్నగా చీవాట్లు పెట్టారు. ఆ తర్వాత, తంబురా శ్రుతి వేసినాయనను ఘంటసాల మాస్టారే శాలువ కప్పి అభినందించారు. ఆ సమయంలో ఆ తంబురా సహకారం అందించిన వ్యక్తి ముఖంలోని సంతోషం,గుర్తింపు పొందానన్న తృప్తి స్పష్టంగా కనిపించింది.
ఘంటసాల మాస్టారి ఔన్నత్యం, వినయవిధేయతల గురించి మా నాన్నగారు,శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఒక ఉదంతం.
కదిరిలోనో లేక బళ్ళారిలోనో సరిగ్గా గుర్తులేదు, జరిగిన ఏవో సంగీతోత్సవాలకు ఘంటసాల మాస్టారు ఒక కచేరికి తన బృందంతో వెళ్ళారు. అక్కడ సభ నిర్వాహకులు మాస్టారి కచేరీకి ముందు భీమ్ సేన్ జోషి గారి కచేరీ ఏర్పాటు చేసారట. భీమ్ సేన్ జోషి అంటే భారతదేశంలోని అగ్రశ్రేణి హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. అత్యంత ప్రతిభాశాలి. అటువంటి గాయకుడి గానం వినగలగడం ఒక అదృష్టంగా భావించి ఘంటసాల మాస్టారు తన కచేరీ సమయం కంటే చాలా ముందుగానే బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారట.
ఘంటసాల వచ్చారన్న విషయం తెలిసిన మరుక్షణమే ఆడిటోరియంలో భీమ్ సేన్ జోషి గారి కచేరి వింటున్న శ్రోతలంతా ఒక్కుమ్మడిగా బయటకు పరిగెత్తుకుపోయి ఘంటసాలవారి కారును చుట్టుముట్టారట. ఆయనను చూడడానికి , మాట్లాడడానికి ఒకటే కలకలం చెలరేగిందట.
జనాలు అంతా ఎందుకు అంత అకస్మాత్తుగా లేచి పరిగెడుతున్నారో అర్ధంకాక వేదికమీద జోషిగారు తన గానం ఆపేసి నివ్వెరపోయి చూస్తున్నారట.
బయట ఘంటసాల మాస్టారికి విపరీతమైన ఆగ్రహం వచ్చిందట. ఆయన జనాలను తప్పించుకొని హాలులో వేదికమీదకు వెళ్ళి మైకు అందుకొని గట్టిగా అరిచారట. ఒక మహా విద్వాంసుడు అత్యద్భుతంగా గానం చేస్తూంటే మధ్యలో లేచిపోవడం చాలా అనుచితమని,సభామర్యాద కాదని, ఆ మహాగాయకుడిని అవమానపర్చడమేనని కేకలు వేసారట. ఆయన కంటే తానేం గొప్ప గాయకుడినేంకాదని ఆయన సంగీతం వినడానికే ముందుగా ఆడిటోరియంకు వచ్చానని , ప్రేక్షకులు ఇంత హీనంగా ప్రవర్తించడం తగదని, ఈ రకమైన వాతావరణం లో తాను ఇక అక్కడ కచేరీ చేయనని గట్టిగా చెప్పి తాను భీమ్ సేన్ జోషి గారికి ప్రేక్షకుల తరఫున క్షమాపణలు చెప్పారట.
ఘంటసాలగారు అంత తీవ్రంగా స్పందిచడంతో అంతా సద్దుమణిగి జోషి గారి కచేరీ ప్రశాంతంగా ముగిసిందట.
ఇది ఘంటసాల మాస్టారి వినయానికి, వ్యక్తిత్వానికి,
హృదయవైశాల్యానికి ఒక మచ్చుతునక.
'నెం.35,ఉస్మాన్ రోడ్' లో పుస్తక పఠనాన్ని అలవాటు చేసింది సంగీతరావు గారే. ఆసక్తికరంగా ఆయన చెప్పే కథలు విని సావిత్రమ్మగారు , పాప పిన్నిగారు, తర్వాతి కాలంలో పిల్లలు మంచి పుస్తకాలు చదవడం పట్ల అభిలాషను పెంపొందించుకున్నారు.
సంగీతరావు గారు అటు సంగీతంలో ఎంత నిష్ణాతుడో సాహిత్యం విషయంలోనూ అంతే. ఆయనకున్న విషయ పరిజ్ఞానం అపారం. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడగల వాక్పటిమ వుండేది. అయితే అది బయటకు తీసుకురావడానికి ఇతరులు చాలా శ్రమపడవలసి వచ్చేది. మా నాన్నగారిలోని రచయితను చందూర్ దంపతులవంటివారు గుర్తించి ఒకటికి పదిసార్లు బలవంతపెడితే కొన్ని కధలు వ్రాసారు. అవి చందూర్ గారి 'జగతి' లో, మాలతిగారి నిర్వహణలోని ' ఆంధ్రమహిళ 'లోనూ ప్రచురితమయాయి. సంగీతరావు గారికి ఈ సాహితీ సంపర్కం విజయనగరం రోజుల్లోనే ఏర్పడింది. ఆయన మిత్రులు పంతుల శ్రీరామశాస్త్రిగారు , భట్టిప్రోలు కృష్ణమూర్తి గారు , మంథా వెంకట రమణారావుగారు మంచి కవులు. చేయితిరిగిన రచయితలు. వీరే కాకుండా స్థానికంగా కవులుగా లబ్ధప్రతిష్టులైన పంతుల లక్ష్మీనరసింహ శాస్త్రిగారు, క్రొవ్విడి రామంగారు,తదితర సాహితీవేత్తల సాంగత్యంతో
శ్రీ సంగీతరావు గారికి సాహిత్యంలో అభినివేశం, మక్కువ ఏర్పడ్డాయి.
మా నాన్నగారు డబ్బులు చేర్చుకోలేకపోయారు, కానీ,
అంతకుమించిన ఎన్నో రెట్లు విలువైన ఉత్తమ సాహిత్యాన్ని సేకరించగలిగారు. అవి ఎవరి దగ్గరా సంగ్రహించినవికావు. స్వయంగా డబ్బుపెట్టి కొనుక్కున్నవి.
ఆయన ఇంటివద్ద ఖాళీగా వుంటే సగభాగం సంగీతంతోనూ , సగభాగం పుస్తక పఠనంతోనూ గడిచిపోయేది.
పాండీబజార్ రాజకుమారి ధియేటర్ ( ఇప్పుడు 'బిగ్ బజార్ కాంప్లెక్స్) కాంపౌండ్ గోడను ఆనుకొని ప్లాట్ ఫారమ్ మీద
చాలా పెద్ద సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపు వుండేది. ఒక్క వర్షాలు పడే సమయంలో తప్ప, ఉదయం పది నుండి రాత్రి 10 వరకూ ఆ పుస్తకాల షాపు తెరిచివుండేది. పానగల్ పార్క్ చప్టాలమీద ముచ్చట్లాడే రచయితలంతా అక్కడ లేరంటే, పాండీబజార్ లోని ఈ పుస్తకాల షాప్ దగ్గర దర్శనమిచ్చేవారు. ఆ పుస్తకాల షాపులో వివిధ భాషలకు చెందిన అమూల్యమైన గ్రంథాలెన్నోదొరికేవి. పుస్తకం ఖరీదు నూరు రూపాయలైతే ఏభై రూపాయలకు అమ్మేవారు.
ఆ రకంగా మా నాన్నగారు చాలా పుస్తకాలే కొన్నారు.
ఆ షాపులో ఇటువంటి ఉత్తమ గ్రంధాలతోపాటూ
యువతరానికి కావలసిన మిల్స్&బూన్, జేమ్స్ హాడ్లీ ఛేస్, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు వంటి వారి పల్ప్ సాహిత్యం కూడా విరివిగానే దొరికేది. ఉదయం నుండి రాత్రివరకూ ఆ పుస్తకాల షాప్ జనాలతో కళకళలాడుతూ వుండేది. ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలు కొని వారు పట్టుకువెళ్ళేవారు. ఆరుద్ర, జరుక్ శాస్త్రి,శ్రీరంగం నారాయణ బాబు , ఊహాగానం - లత వంటి ప్రముఖులెందరో అక్కడ కనిపించేవారు.
ఇలాటి మరో పెద్ద సెకండ్ హ్యాండ్ బుక్స్ స్టాల్ లజ్ కార్నర్ లో కామధేను ధియేటర్ ఎదురు ప్లాట్ ఫారమ్ మీద వుండేది. ఆ పుస్తకాల షాపుతో తనకు చిరకాల సాన్నిహిత్యాన్ని గురించి చాలా రసవత్తరంగా ముళ్ళపూడి వెంకట రమణ తన జీవితకధలో వ్రాసారు.
మా నాన్నగారి వద్ద శరత్ బాబు, రవీంద్రనాధ్ టాగోర్, మున్షీ ప్రేమ్ చంద్, చలం, కొడవటిగంటి కుటుంబరావు గార్ల పుస్తకాలు, దేశి ప్రచురణ ( బొందలపాటి శివరామకృష్ణ,శకుంతలాదేవి అనే గుర్తు) వారి పుస్తకాలు ఎన్నో వుండేవి. వీటితోపాటు సంగీతం ,నృత్యం,వేదాంతాలకు సంబంధించినవీ వుండేవి. ఆ పుస్తకాలన్నిటినీ నేను పై పైని తిరగెయ్యడమే తప్ప క్షుణంగా చదివే అవకాశం లభించలేదు.
'రంగులరాట్నం' సినిమా తో పరిచయమైన చంద్రమోహన్ మా ఇంటికి సమీపంలోనే కృష్ణమాచారి స్ట్రీట్ లో ఒక మేడమీద ఒక చిన్న గదిలో అద్దెకు వుండేవారు. ఆయన దగ్గర నవతర మహిళలు ఆశించే యద్దనపూడి , కోడూరి , ముప్పాళ వంటి వారి సాహిత్యం కొంత వుండేది. ఆ పుస్తకాలను తెలుగువారిళ్ళలో అద్దెకు ఇస్తూండేవారు. అలా చంద్రమోహన్ పుస్తకాలు ఘంటసాలవారింట్లోను వచ్చి చేరేవి. ఎవరో సైకిల్ మీద వచ్చి ఇచ్చి మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత పట్టుకుపోయేవారు. ఒక్కో పుస్తకానికి రూపాయో, రెండో వసూలు చేసేవారు.
అలాటి సమయంలోనే పానగల్ పార్క్ దాటాక పింజల సుబ్రహ్మణ్యం వీధి మొగలో రాఘవన్ నెయ్యి దుకాణం. దాని పక్కనే 'రవిరాజ్ లెండింగ్ లైబ్రరీ'.
ముందుగా ఒక చిన్న రూమ్ లో ప్రారంభించాడు. ఓనర్ అప్పటికి యువకుడే. పెద్ద చదువు సంధ్యలు లేవు.
చాలా రకాల పుస్తకాలు, మ్యాగజైన్స్ చాలా భాషల్లో దొరికేవి. షాపు తెరచిన కొత్త రోజుల్లో పుస్తకం రేటును బట్టి ఒక్కో పుస్తకానికి పావలా, అర్ధ,రూపాయి,రెండూ అద్దె వసూలు చేసేవారు. ఇంగ్లీష్ పుస్తకం అయితే అద్దె ఐదు రూపాయలు. సరికొత్త పుస్తకాలు , మ్యాగజైన్స్ అయితే వాటికి వేరే రేటు.ఒకే రోజులో చదివేసి మర్నాటికల్లా ఇచ్చేయాలి. చాలా లోప్రొఫైల్ లో మొదలైన ఆ లైబ్రరీ అతి త్వరలోనే టి నగర్ అంతటికీ అతి పెద్ద లైబ్రరీగా మారింది. అదే బిల్డింగ్ లో మరో రెండు రూమ్స్ లోకి విస్తరించింది. ఒక్కో పుస్తకం నాలుగైదు కాపీలు వచ్చేవి. యండమూరి ,మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకాలకు మంచి గిరాకీ వుండేది. అక్కడ వుండే పుస్తకాలన్నీ చదవాలంటే నా ఆదాయం చాలదు. అందుచేత నాకు అందుబాటులో వుండే పాత తెలుగు ,తమిళం పుస్తకాలతోనే నేను , మా ఆవిడ శేషశ్రీ కాలక్షేపం చేసేవాళ్ళం. దాదాపు 1990 ల వరకు ఆ లైబ్రరీ లో మెంబర్ గా వుండేవాడిని. ఆ తర్వాత పనుల ఒత్తిడివల్ల తరచూ లైబ్రరీకి వెళ్ళిరావడం కుదరక మానేసాను.
మా నాన్నగారు రికార్డింగ్ లు , రీరికార్డింగ్ లకు వెళ్ళినప్పుడు తనతో కూడా ఒకటో రెండో పుస్తకాలు తన వెంట తీసుకువెళ్ళేవారు.
లంచ్ బ్రేక్ లో ఆ పుస్తకాలు చదువుతూవుండేవారు.
ఇంటి దగ్గర మా అమ్మగారు కూడా పుస్తకపఠనంతోనే కాలక్షేపం.
మా నాన్నగారిది, అమ్మగారిది( శ్రీలక్ష్మి) బాల్య వివాహం. ఆనాటికి ఆయనకు పదకొండు సంవత్సరాలు; ఆవిడకు ఐదు సంవత్సరాల లోపే. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. 85 ఏళ్ళ సహచర్యం. ఐదేళ్ళ వ్యవధిలో ఆ పుణ్యదంపతులు భౌతికంగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. మానాన్నగారి జన్మదినం,నిర్యాణం రెండూ 2వ తేదీయే కావడం ఒక విశేషం.
ఘంటసాల మాస్టారి బృందగానాల్లో పాడే కొంతమంది గాయనీమణులకు పుస్తకపఠనం మీద ఆసక్తివుండేది. మా నాన్నగారి దగ్గర చేరి ఆ పుస్తకాలు తీసుకొని చదివిన తర్వాత తిరిగి రికార్డింగ్ లకు వచ్చేప్పుడు తీసుకువచ్చి ఇచ్చేసేవారు. ఓ ఇద్దరు గాయనీమణులు పుస్తకం తీసుకువెళ్ళడమే తప్ప తిరిగి ఇవ్వడం మర్చిపోతూండేవారు. అడిగితే వచ్చే రికార్డింగ్ సమయంలో తెచ్చిస్తానని ,లేకపోతే ఇంటికి తీసుకువచ్చి ఇస్తామని చెప్పేవాళ్ళు. అక్కడితో సరి. ఎన్నాళ్ళైనా ఇదే తంతు. ఆడవాళ్లు. గట్టిగా అడగలేని పరిస్థితి. చాలా మంచి
విలువైన పుస్తకాలు చేజారిపోయినందుకు మా నాన్నగారు,
అమ్మగారు చాలా బాధపడేవారు.
అందుకే మన పెద్దలంటారు - ఏమని --
" పుస్తకం,వనిత,విత్తం
పరహస్త గతం గతః
అధవా పునరాయతి
జీర్ణం, భ్రష్టాచ,ఖండశః "
ఈనాటి 'నెం.35,ఉస్మాన్ రోడ్ 35వ భాగం -
పూజ్యులు, మా తండ్రిగారు శ్రీపట్రాయని సంగీతరావు గారికి, మాతల్లిగారు శ్రీమతి శ్రీలక్ష్మిగారికి శతాధిక వందనములతో సమర్పణం.
స్వరాట్
💐🙏🌺🙏💐🍀🙏🌺
10 comments:
శ్రీ సంగీతరావుగారికి నివాళిగా మీరు రాసిన ఈ 35వ భాగం ఎంతో క్లుప్తంగానే అయినా, ఆయన వందేళ్ళ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పరిచయం చేస్తూ. చక్కని శైలిలో సమగ్రంగా సాగిన రచన.ధన్యవాదాలు.
శ్రీ సంగీతరావు గారికి ఘన నివాళి ..పాత మద్రాస్ తో ఎంతో కొంత సంభందం వున్న నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చాయి. ��
స్వరాట్ బాబాయ్ గారూ!
పూజ్యులు శ్రీ పట్రాయని సంగీతరావు గారి స్మృతిలో మీరు నేడు అందించిన ఈ సంచికలో వారి జీవనయాన చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు..... ఘంటసాల మాస్టారు గారి తో వారికి ఉన్న అనుబంధం గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారి విద్వత్తు గురించి, వారి అభిరుచుల గురించి అన్ని అంశాలను స్పృశిస్తూ చాలా చక్కగా వివరించారు... మీరన్నట్లు శతాధిక వర్షాల పరిపూర్ణజీవితాన్ని గడపిన మీ పితృదేవులు శ్రీ సంగీతరావు గారి కి ఇది హృద్యమైన స్మృత్యంజలి.....
పుణ్య దంపతులైన మీ అమ్మానాన్న గార్లకు ఇరువురికీ మా హృదయపూర్వక నివాళులు 🙏🙏🙏🙏💐💐🌷🌷🌺🌺🌷🌷
మీ పోస్టులన్నీ చాలా ఆసక్తితో చదువుతున్నాను.ఇంత గొప్పగా వ్రాయడం అందరరికీ సాధ్యంకాదు.అభినందనలు
అభినందించిన సన్మిత్రులందరికీ కృతజ్ఞతాభివందనాలు.
అద్భుతమైన వివరాలు అందించారు sir సంగీతరావు మాష్టారి గురించి. వారు చేసిన సంగీత సేవలు అపూర్వం. ఘంటసాల గారు, సంగీత రావు గార్లతో మీ అనుబంధం అపూర్వమైన అనుభూతి sir. చాలా అదృష్టవంతులు. పై లోకంలో మరలా వారిద్దరూ కలుసుకొని ఉంటారు. ఈ serial ని మీరు నడుపుతున్న తీరు అమోఘం sir. ధన్యవాదాలు. అభివాదములు.🙏🏼🙏🏼హృషీకేష్
ధన్యవాదాలు.
కీ.శే. శ్రీ పట్రాయని సంగీత రావు గారి కీ ఘన నివాళులు. ఈ సందర్భంగా పూజ్యులు శ్రీ సంగీత రావు గారి కుటుంబం తో మా నాన్న గారు కీ.శే. సామవేదుల రామగోపాల శాస్త్రి గారి కి ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకునే సదవకాశం కలిగింది.మా నాన్న గారికీ ఎన్నో సార్లు మీ కుటుంబం ఆతిధ్యం ఇచ్చిన విషయం నేను కూడా ఎరుగుదును.(1982 లో మద్రాస్ తెలుగు అకాడెమీ వారి ఉగాది పురస్కారం అందుకునేందుకు నాన్న గారు వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా చాలా పర్యాయాలు). శ్రీ ఘంటసాల వారి సాన్నిహిత్యం లో మీ నాన్న గారు ఆ సరస్వతీ దేవి కి చేసిన సేవలు ఎనలేనివి. శ్రీ సంగీత రావు గారి సోదరులు శ్రీ పట్రాయని నారాయణ మూర్తి గారి వద్ద సంగీతం(వీణ) నేర్చుకునే మహాద్భాగ్యం నా శ్రీమతి దక్కింది. ప్రాతః స్మరణీయులు అయిన శ్రీ సంగీత రావు గారి కి మీరు సమర్పిస్తున్న ఈ నివాళి అమోఘం. ధన్యవాదాలు.
సామవేదుల శ్రీనివాస్
ధన్యవాదాలు. శ్రీయుత రామగోపాలశాస్త్రిగారితో నాకు మంచి సాన్నిహిత్యమే వుండేది. బొబ్బిలిలో గుమ్మా మార్కండేయ శర్మగారి
ఇంటి పక్కనే వారిల్లు. ఆ ఇంటిలోనే మా తాతగారు బ్రహ్మశ్రీ సామవేదుల నరసింహం పంతులుగారు వుండేవారు. నా బాల్యం ,చదువు ఆ ఇంటిలోనే సాగింది. అప్పట్లో అది పూరిల్లు. ఆ ఇల్లు సామవేదుల వరహాలు(రైల్వే గార్డ్) గారిది. ఆ ఇంటినే రామగోపాలశాస్త్రిగారు మరల పెంకుటిల్లుగా మార్చారు. సంగీతానికి , వేద సంస్కృతి కి చాలా సేవచేశారు. బొంబాయి లో వుండే మీ బావగారు జిబికె సంజీవిగారు వాట్సప్ ద్వారా పరిచయమయ్యారు. ఈరోజు పరిచయం కలిగింది. చాలా ఆనందంగా వుంది.
�� ఇపుడే 35-ఉస్మాన్ సాహెబ్ రోడ్ 34 వ సంచిక చదివి సంగీత సాహిత్యాల సమ్మేళనం ఈ చిరునామా లో ఎంతగా పరిఢవిల్లిందో చూశాం! ఇపుడీ 35 వ సంచికతో మరింత తన్మయత్వం చెందాం!
�� మీ నాన్న గారికి ఈ సంచికాభాగాన్ని అంకితమివ్వడం వారిపట్ల, వారి జీవన విధానం పట్ల, మీ ప్రేమ ...గౌరవానురాగాల్ని వ్యక్తపరుస్తోంది. అసలు ఇంత సూక్ష్మంగా మీరెలా విషయాలన్నీ అక్షరబద్ధం చేస్తారో..ఆశ్చర్యమేస్తుంది స్వరాట్ సర్!
�� ఒకే పౌనఃపున్యం, ఒకే తరంగ దైర్ఘ్యం అన్నట్లు(Likemindedness అనుకుంటా) ఒకే గూటి పక్షులుగా...నాన్నగారు, ఘంటసాల మాస్టారుల అనుబంధం కొనసాగిందన్న విషయం మీ ఈ సంచిక ద్వారా మరింత స్పష్టమయ్యింది.
�� 1974లోనో 1975 లోనో శ్రీ వెంపటి చిన సత్యం గారు కావలి జవహర్ భారతికి “భారతీయ నృత్యం” గురించి ఓ సెమినార్ నిర్వహించడానికి వచ్చినపుడు ..వారితో నాన్నగారున్నారో లేదో తెలియదు కాని, ఆ తరువాతి రోజుల్లో ఈ నృత్య త్రిమూర్తులు రూపొందించిన అనేక సంగీత రూపకాలు దర్శించే భాగ్యం నాకు కలిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను.
��101 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని, తన వ్యక్తిత్వానుసారంగా...సంతృప్తికరంగా జీవించి ఈ లోకానికి వీడ్కోలు చెప్పి వెళ్ళిన కలైమామణి శ్రీ సంగీతరావు గారి పవిత్రాత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ....సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేస్తూ .....ఈ సంచిక కొనసాగించినందుకు మీకు మరోసారి మా అభినందనాధన్యవాదాలు!!����
Post a Comment