visitors

Sunday, July 18, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభైయవ భాగం

18.07.2021 - ఆదివారం భాగం - 40*:
అధ్యాయం 2  భాగం 39 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ ఆర్చ్ గేటు, కాంపౌండు వాలు లోపల గేటు పక్కనుండే తంగేడు చెట్లు, గేటు లోపలి పోర్టికో, పదమూడు పధ్నాలుగడుగుల సిమెంట్ అరుగు, డార్క్ గ్రీన్, బ్లాక్, వైట్ కలసిన మార్బుల్ ఫ్లోరింగ్ వరండా, దానిమీద ఒక పొడుగాటి కర్రబల్ల, రెండు పేము కుర్చీలు వీటితోనే నా చిన్నతనం గడిచింది. ఈ పరిసరాలలోనే ఎంతోమంది వ్యక్తులతో కొద్దో గొప్పో పరిచయాలు ఏర్పడ్డాయి. వారందరివల్ల ఎన్నో విషయాలు అవగాహనకు వచ్చాయి. మా బొబ్బిలి తాతగారింటి ఆశ్రమవాస జీవితానికి అలవాటు పడిన నేను ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడిని, ఇప్పటికి కూడా. అందుచేత మా ఔట్ హౌస్ లో మా పిల్లల మధ్యకన్నా బయట పోర్టికోలోనే ఒంటరిగా గడిపేవాడిని. ఉదయం ఎనిమిది తర్వాత ఘంటసాల మాస్టారు బయటకి వెళ్ళగానే వీధి తలుపు మూసివేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయేవారు. తిరిగి మాస్టారి డ్రైవర్ గోవింద్ మ్రోగించే కారు హారన్ విన్న తర్వాతే మళ్ళీ తలుపు తెరిచేవారు. ఆ మధ్యకాలంలో, నేను ఇంట్లో వుంటే, ఆ  పోర్టికో వరండా మీదే ఏవో పుస్తకాలతో గడిపేవాడిని. లేదా రోడ్ మీద వచ్చీపోయే జనాలను గమనించేవాడిని. అందులో కొత్తవాళ్ళు వుండేవారు, పరిచయస్తులు వుండేవారు. వారిలో కొందరు గేటు బయటి గోడమీది 'ఘంటసాల' నేమ్ బోర్డ్ చూసి  నా వేపు చేయి ఊపేవారు, ఎందుకో, మరి.

అలా బయట వరండాలో కూర్చొని ప్రకృతిలో లీనమయేవేళ తరచూ మా ఎదురు ప్లాట్ ఫారమ్ మీదనుండి వెళుతూ ఇద్దరు పిల్లలు కనిపించేవారు. వారెవరో నాకు తెలియదు. అక్కా తమ్ముళ్ళు. చాలా సన్నగా, పొడుగ్గా వుండేవారు. ఆ రోజుల్లో ప్రతీవాళ్ళు నాకంటే పొడుగే అనిపించేది. ఆ అక్క చాలా జాగ్రత్తగా తమ్ముడి చేయిపట్టుకొని నడిపించి తీసుకువెళ్ళడం నాకు ఆసక్తి కలిగించిన విషయం. బజుల్లారోడ్ వేపు నుండి వస్తూండేవారు. ఒకరోజు ఒక సినీమా పత్రికలో ఈ అమ్మాయి ఫోటో చూసాను 'నాగిని'డాన్స్ కాస్ట్యూమ్స్ లో.  పేరు సురేఖ. శ్రీ రాజేశ్వరీ కళానికేతన్  ఆధ్వర్యంలో శాస్త్రీయ, జానపద నృత్య కార్యక్రమాలకు సంబంధించిన ఒక చిన్న పాంప్లెట్ పోస్టర్ లో. అంత సన్నగా వుండే పిల్ల డ్యాన్స్ చేస్తుందంటే నమ్మలేకపోయాను. తర్వాత ఒకసారి ఆ పిల్లలను మా నరసింగడికి చూపి అడిగితే చెప్పాడు, వాళ్ళు తెలుగువాళ్ళే, మన విజయనగరం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడినవారేనని.

అలా చిన్నప్పుడు చూసిన ఆ చిన్న కుర్రవాడు భవిష్యత్తులో ఘంటసాలవారింటి అల్లుడు అవుతాడని, మా కుటుంబానికి అతి సన్నిహిత మిత్రుడు అవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. అతనే మా సురేంద్ర. కొండూరు సురేంద్రకుమార్. కష్టాలలో వుండే స్నేహితులను, సన్నిహితులను ఆదుకోవడంలో ఎంతో అక్కర చూపించే గొప్ప సహృదయుడు. ఆనాడు నేను చూసిన అతని అక్క, ఆ సన్నపాటి చిన్న అమ్మాయి భవిష్యత్తులో ప్రసిద్ధ బాలీవుడ్ కోరియాగ్రాఫర్ గా రూపుదిద్దుకుంటుందని కూడా అప్పుడు నేననుకోలేదు. ఆమె, ఆమె భర్త చిన్ని ప్రకాష్ కూడా దేశంమంతా మెచ్చిన బాలీవుడ్ కోరియాగ్రాఫర్స్. ఎవరితో ఎప్పుడు ఎలాటి స్నేహాలు , బంధాలు ఏర్పడతాయో ఊహించలేము.

🍀🍀


అలా శెలవు రోజుల్లో పోర్టికోలోనో, గేటు బయటో నిల్చొని వచ్చేపోయే మాస్టారి అభిమానులకు, కోరస్ గాయకులకు తగిన సమాధానం చెప్పి పంపడంలో,  వారానికి ఒకసారైనా  కనిపించే హిస్ మాస్టర్స్ వాయిస్ (హెచ్.ఎమ్.వి.) పెరుమాళ్ తెచ్చే ఎర్ర లేబిల్, సరస్వతీ స్టోర్ వాళ్ళు తెచ్చే  నీలం లేబిల్ కొలంబియా గ్రామఫోన్ రికార్డులు, ముందుగా నేనే అందుకునేప్పుడు మహదానందంగా వుండేది. ఆ రికార్డులకు కట్టిన తెల్లటి ట్వైన్ దారపు ముడులను కష్టపడి విప్పి ఏ ఏ సినీమాలలో పాటలు వచ్చాయో, రెండుప్రక్కలా ఏ పాటలున్నాయో ముందుగా చూసి వాటిని మళ్ళీ ఆ దారంతో కట్టి జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకుపోయి అమ్మగారి (సావిత్రమ్మగారు) చేతికి అందించేవాడిని. ఆవిడ వాటిని చూసి "మధ్యాహ్నం అయ్యగారు వెళ్ళిపోయాక వేసుకుందాము" అని భరోసా ఇచ్చేవారు.  ఆ పాటలను వేసేప్పుడు గ్రామఫోన్ కు కీ ఇచ్చి, ముల్లుమార్చి ఆ రికార్డులు పెట్టి వినడంలో ఒక చిన్నపాటి థ్రిల్. 


ఘంటసాల మాస్టారు తాను పాడవలసిన తమిళమో, హిందీయో డబ్బింగ్ సినీమాల కోసం, లేదా ఏవైనా కచేరీల కోసం కొత్తపాటల నొటేషన్స్ కోసం మాత్రమే  గ్రామఫోన్ తెరిచేవారు. మిగతా  ఇంట్లోవాళ్ళం మాస్టారి పాటలు వినేది వారు ఇంట్లోలేని సమయంలోనే. తన పాటలు తాను వినేంత సమయం కాని, ఆసక్తికాని మాస్టారికి వుండేవికావు. రాత్రిపూట ఎప్పుడైనా ఢిల్లీ రేడియో నుండి వచ్చే అఖిల భారత సంగీతకార్యక్రమాలు మాత్రం వినేవారు. 


నెం.35, ఉస్మాన్ రోడ్ కు  మూడు పూటలా పోస్ట్ మేన్ వచ్చేవాడు. అప్పట్లో రోజుకు మూడు పోస్టల్ డెలివరీలు వుండేవి. వచ్చినప్పుడల్లా చాలా ఉత్తరాలే వుండేవి. అందులో కొన్ని మా నాన్నగారికి. మిగిలినవి మాస్టారి ఫ్యాన్స్ వ్రాసినవి, ఇతర బంధువులనుండి వచ్చే ఉత్తరాలు.  వాటిని నేను తీసుకుంటే వెంటనే వాటిని సార్టౌట్ చేసి ఎవరివి వాళ్ళకు అందజేసేవాడిని. నేను 12th పాసయిన తర్వాత మాస్టారి ఫాన్స్ ఉత్తరాలకు  నాచేతే సమాధానం వ్రాయించేవారు. అలాగే, సావిత్రమ్మగారు, పాప పిన్నిగారు వారి అక్కచెల్లెళ్ళకు, బంధువులకు వ్రాసే ఉత్తరాల మీద ఎడ్రెస్ లు వ్రాసే పని నాదే. (నా దస్తూరి బాగుంటుందని వారి నమ్మకం). ఉత్తరాలను వెనకనుండి ముందుకు వ్రాయడంలో పాప పిన్నిగారు సిధ్ధహస్తులు. మహాస్పీడుగా వ్రాసేవారు. ఆ వ్రాత నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను. వాటిని చదవాలంటే అద్దం సహాయంతోనే చదవవలసి వచ్చేది.

మాస్టారికి వచ్చే అధిక సంఖ్యాక ఉత్తరాలు మాస్టారి కొత్త సినీమా పాటలు విని ఆనందించామని ప్రశంసలు కురిపిస్తూ వెంటనే తర్వాతి లైనులో  మాస్టారి కార్డ్ సైజ్ ఫోటో పంపమని విన్నపాలు. ఉత్తరాలకు రిప్లై వెంటనే ఇచ్చేవాళ్ళం కానీ, ఫోటోలు వెంటవెంటనే పంపాలంటే కుదిరేది కాదు. ఫాన్స్ కోసం మాస్టారు తీయుంచుకున్న  ఫోటోలు అందుబాటులో వుండేవికావు. వాటిమీద ఆటోగ్రాఫ్ చేయడానికి ఘంటసాలగారు అందుబాటులో వుండేవారు కాదు. పనికట్టుకు తీయించిన వందా, రెండు వందల ఫోటో కాపీలు రెండు మూడు నెలలలోనే అయిపోయేవి. ఈ ఉత్తరాలు వ్రాసేవారిలో చాలమందికి - ఘంటసాల నెం.35, ఉస్మాన్ రోడ్, టి.నగర్, మద్రాస్-17 అని పూర్తి ఎడ్రస్ తెలిసేది కాదు. తెలుగులో కేవలం
'ఘంటసాల, మద్రాస్' అని వ్రాసేవారు. అయినా అవి కొంచెం లేటుగా మా ఇంటికి వచ్చిచేరేవి. మెయిన్ పోస్టాఫీస్ లో ఎవరో తెలుగు అడ్రస్ ను ఎర్ర ఇంక్ పెన్నుతో ఇంగ్లీషు లో వ్రాసి డెలివరీ చేసేవారు. 

🍀🌺🌿


మా నాన్నగారికి  తరచూ ఉత్తరాలు వచ్చేవి - సాలూరు/ టాటానగర్ నుండి మా ప్రభు చిన్నాన్నగారు, అరుణాచలం నుండి గుడిపాటి వెంకట చలం గారు,  ఒరిస్సా రాయఘడా నుండి పంతుల శ్రీరామశాస్త్రిగారు, ఒరిస్సా జయపూర్/ భద్రక్ ల నుండి భట్టిప్రోలు కృష్ణమూర్తిగారు, రౌర్కేలా నుండి మంథా రమణరావు గారిలాంటి  చిరకాల సాహితీ మిత్రులు  ఉత్తరాలు వ్రాసేవారు. వృత్తిపరంగా వీరంతా వేర్వేరు రంగాలకు చెందినవారు. శ్రీరామశాస్త్రిగారు  హైస్కూలులో మాస్టరు. కృష్ణమూర్తి గారు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్విసెస్ లో ఉన్నతాధికారి. రమణరావు గారు రూర్కెలా స్టీల్ ప్లాంట్ లో పెర్సెన్నెల్ మేనేజర్ (ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్  అంటున్నారు). వీరేకాక మరో ముఖ్య స్నేహితుడి దగ్గరనుండి  వచ్చిన ఉత్తరాలను కూడా జాగ్రత్తగా పదిలపర్చేవారు. ఆయనే డా. డి.ఎన్. రావు (ద్వివేదుల నరసింగరావు). మా నాన్నగారి విజయనగరంలో చిన్ననాటి స్నేహితుడు. ఘంటసాలవారి తర్వాత మా నాన్నగారి విషయంలో అత్యంత శ్రధ్ధ చూపిన వ్యక్తి. ద్వివేదుల నరసింగరావుగారు విజయనగరం ఎమ్.ఆర్.కాలేజీలో లెక్చెరర్ గా పనిచేసేవారు. కాలేజీ స్టూడెంట్స్  ప్రేమతో ఆయనను 'దిలీప్ కుమార్' అని పిలుచుకునేవారు. 1953లో ఘంటసాలవారు తమ కుటుంబంతో విజయనగరం వచ్చినప్పుడు తమ ఇంట్లో విందు కూడా  ఏర్పాటు చేసారు. విజయనగరం మహరాజావారి స్కాలర్షిప్ తో అమెరికా విస్కన్సిన్ యూనివర్శిటీలో పి.హెచ్.డి. చేసారు. రావుగారి సతీమణి ద్వివేదుల విశాలక్షి గారు. ప్రముఖ నవలా రచయిత్రి. ఈ ఇద్దరికీ మా నాన్నగారంటే చాలా గౌరవం అభిమానం.  చివర వరకూ మా కుటుంబం పట్ల ఎంతో అక్కర కనపర్చినవారు. అక్కడ నుండి డా.డి.ఎన్.రావు ఢిల్లీలో  ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ స్టాఫ్ కాలేజీ సమ్మర్ లో ముస్సోరీలోనూ, వింటర్ లో ఢిల్లీలోనూ ఆరేసి మాసాలకు మారుతూండేది. ఆ రెండు ప్రాంతాలనుండి మా నాన్నగారికి ఉత్తరాలు వచ్చేవి. అలాటి డి.ఎన్. రావుగారు మద్రాస్ లో సెటిల్  అవుతారనే వార్త మా నాన్నగారికి చాలా సంతోషం కలిగించింది.

యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇన్ ఇండియా (USEFI)  సదరన్ రీజన్ డైరక్టర్ పదవిలో డా.డి.ఎన్. రావు మద్రాసు వచ్చారు. అప్పటికి మద్రాస్ లో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పడలేదు. డి.ఎన్.రావుగారు చెట్పట్ హారింగ్టన్ రోడ్  లో ఓ పోష్ లొకాలిటిలో నివాసం ఏర్పర్చుకున్నారు. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. విజయనగరంలో వుండేప్పుడు మా ప్రభు చిన్నాన్నగారు ఆ అమ్మాయికి వైలిన్ సంగీతం కొన్నాళ్ళు నేర్పేవారు. అప్పుడు ఒకటి రెండుసార్లు వాళ్ళింటికి వెళ్ళాను. అప్పటి నా వయసు ఎనిమిదేళ్ళు. వాళ్ళందరికీ మద్రాసు వాతావరణం కొత్త. ఎవరితో ఇంకా స్నేహాలు ఏర్పడలేదని మా నాన్నగారు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళమనేవారు. నాకు సహజంగా వుండే బెరుకుతనం, మొహమాటం వలన నాకు అంతగా చనువులేని వారింటికి వెళ్ళడానికి సంకోచంగా వుండేది. ఒకరోజు మా నాన్నగారి ఒత్తిడి వలన వారింటికి వెళ్ళక తప్పలేదు. ఒకరోజు మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో పానగల్ పార్క్ దగ్గర 47 నెంబర్ బస్సులోనో లేక 9 వ నెంబర్ బస్సులోనో చెట్ పట్ వరకు వెళ్ళి హారింగ్టన్ రోడ్ లో వారిల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. హారింగ్టన్ రోడ్ అప్పుడూ ఇప్పుడూ కూడా పోష్ లొకాల్టీయే.  ఆరొజుల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో చాలా చల్లగా, ప్రశాంతంగా, నిర్మానుష్యంగా వుండేది. అప్పుడప్పుడు తిరిగే కార్ల సంచారమే తప్ప నరసంచారం వుండేదికాదు. డి.ఎన్.రావు గారింట్లో వారంతా చాలా స్నేహపూర్వకంగా, కలగొలుపుగా మాట్లాడారు. కొంతసేపు గడిచాక వారి అబ్బాయి అమ్మాయి సిటీలో ఎక్కడికైనా తిరిగిరావడానికి ప్లాన్ చేసి, చివరికి లోకల్ ట్రైన్ లో తాంబరందాకా వెళ్ళివద్దామని ప్లాన్ చేసారు. వీళ్ళుండే హారింగ్టన్ రోడ్ చివర ఇప్పుడు సబ్ వే ఉన్నచోట అప్పట్లో ఒక లెవెల్ క్రాసింగ్ వుండేది. అక్కడనుండి కొంచెం దూరం రైలు ట్రాక్ పక్కనుండే వెళితే నుంగబాక్కం రైల్వేస్టేషన్. అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కాలని నిర్ణయించుకొని బయల్దేరాము. కానీ కొంత దూరం వెళ్ళేసరికి ముందుకు వెళ్ళబడని పరిస్థితి.  ఎదురుగా ఒక బ్రిడ్జి, క్రింద కూవమ్ కెనాల్. మనుషులు వెళ్ళే త్రోవలేదు. వెళితే రైలు ట్రాక్ మీదే నడుచుకుంటూ వెళ్ళాలి. రెండు ట్రాక్ ల మీద వచ్చే పోయే లోకల్ ట్రైన్స్. మరో మీటర్ గేజ్ లైన్ మీద ఎగ్మూర్ నుండి సౌత్ కు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్ళు. అలాటి త్రోవలో వెళ్ళడం అంత మంచిదికాదని నాకు అనిపించింది. ఫర్వాలేదు స్పీడ్ గా నడిస్తే రెండు మూడు నిముషాల్లో దాటేస్తామని ధైర్యం చేసి ముందుకే సాగి ఏ అవాంతరం లేకుండా బ్రిడ్జ్ దాటేసాము. నుంగంబాక్కం స్టేషన్ లో టిక్కెట్లు కొని లోకల్ కోసం ఎదురు చూస్తూ బీచ్ స్టేషన్ తర్వాత ఫోర్ట్, పార్క్, ఎగ్మూర్, చెట్పట్, నుంగబాక్కం, కోడంబాక్కం, మాంబళం, సైదాపేట, గిండీ, మీనంబాక్కం, (అప్పటికి ఎయిర్ పోర్ట్ దగ్గర త్రిశూలం స్టేషన్ రాలేదు), పల్లవరం, క్రోమ్ పేట, సానిటోరియం,  ఆఖరున తాంబరం  అంటూ చెపుతూండగానే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదో మా ముందునుండి మీటర్ గేజ్ ట్రాక్ మీద స్పీడ్ గా వెళుతూ కనిపించింది. నా గుండె గుభేలుమంది. ఇదే ట్రైన్ ఒక ఏడెనిమిది నిముషాల ముందు మేము ఆ బ్రిడ్జి మీద నడుస్తున్నప్పుడే వచ్చివుంటే... మా గతి.... తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. నావరకు అదొక పెద్ద ఎడ్వెంచరే. నా పక్కనున్న వాళ్ళిద్దరూ అసలు పట్టించుకోనేలేదు. ఏవో కబుర్లు చెపుతువున్నారు. ఈలోగా లోకల్ రావడం అందులో ఎక్కి వరసగా వచ్చే స్టేషన్లు, ఆ ప్రాంతాలలో వుండే కంపెనీలు, ఫ్యాక్టరీలు , కోవెళ్ళు, హాస్పిటల్స్ చూసుకుంటూ తాంబరం చేరాము. అప్పటికి ఇంకా సౌత్ వేపు బ్రాడ్ గేజ్ ట్రాకులు ఏర్పడలేదు. లోకల్ రైళ్ళు తాంబరం తో సరి. చెంగల్పట్ వేపు వెళ్ళాలంటే మీటర్ గేజ్ పాసింజర్ రైళ్ళే. అప్పట్లో తాంబరం స్టేషన్ పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రిచెట్లతో చల్లటి గాలివీస్తూ హాయిగా వుండేది. దూరాన కనిపించే వండలూరు కొండలు చూస్తూ ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్లాట్ ఫారం అంతా తిరిగాము. తాంబరం స్టేషన్ కు ఒక ప్రక్క  టిబి శానిటోరియం, మరోప్రక్క, మద్రాస్ క్రిష్టియన్ కాలేజీ బహు పురాతనమైనవీ, చాలా ప్రసిధ్ధి చెందినవి. ఇలా నాకు తెలిసిన విషయాలేవో చెపుతూ ఓ అరగంట అక్కడ కాలక్షేపం చేసి తిరిగి లోకల్  లో బయల్దేరాము. ఈ సారి నుంగంబాక్కం లో కాకుండా చెట్పట్ స్టేషన్ లో దిగి వాళ్ళను ఇంటిదగ్గర దింపి నేను రాత్రి ఎనిమిది తర్వాత ఇల్లు చేరాను. ఈ సంఘటన ఈనాడు అమెరికా లో వుంటున్న ఆవిడకు గుర్తుందోలేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం వుండిపోయింది. 

💐🌿💐


1967 లో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన మరో రెండు మంచి చిత్రాలు పుణ్యవతి', 'పెద్దక్కయ్య. 

'పుణ్యవతి' 'పూవుం పొట్టుమ్' 'నయీ రోషిని' త్రిబుల్ వెర్షన్  సినీమా. తెలుగు, తమిళ, హిందీ భాషలలో వాసూ స్టూడియోస్ అధినేత వాసుదేవ మీనన్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషలకు దాదామిరాసి డైరక్టర్. హిందీకి సివి శ్రీధర్ డైరక్టర్. హింది వెర్షన్ కి రవి,   తమిళానికి గోవర్ధనం, తెలుగుకు ఘంటసాల సంగీతం నిర్వహించారు. కథ ఒకటే అయినా ఎవరి సంగీతం వారిదే. ఈ మూడు వెర్షన్స్ లోనూ భానుమతి ప్రధాన పాత్ర ధరించినా ఒక పాట కూడా పాడకపోవడం ఒక విశేషం. ఎస్.వి.రంగారావు, ఎన్.టి.రామారావు, శోభన్ బాబు, హరనాథ్, కృష్ణకుమారి, జ్యోతిలక్ష్మి వంటి పెద్ద తారాగణమంతా వుంది.  మంచి కథాంశంగల కుటుంబ గాథా చిత్రం. పిల్లల పెంపకం సరిగాలేకపోతే జరిగే అనర్ధాలకు దర్పణం పట్టే చిత్రం 'పుణ్యవతి'. సన్నివేశపరంగా చాలా మంచి పాటలున్న చిత్రం. పాటలన్నిటినీ సినారెవే రాసేసినారు.  ఘంటసాలగారు చాలా  మంచి వరసలు కూర్చారు. ఎన్.టి.ఆర్, కృష్ణకుమారిల మీద "మనసు పాడింది సన్నాయి పాట" (బేహాగ్); హరనాథ్, జ్యోతిలక్ష్మిల మీద చిత్రీకరించిన ' ఎంత సొగసుగా వున్నావు'(భీంప్లాస్); శోభన్ బాబు సోలోలు " పెదవులపైన సంగీతం; "ఇంతేలే నిరుపేదల బ్రతుకులు" వంటి పాటలు, ఘంటసాలవారి మాటల్లోనే చెప్పాలంటే పదికాలాల పాటు నిలిచిపోయే చాలా మంచి పాటలు. హరనాథ్ తన పాటలకు సరైన లిప్ మూవ్మెంట్స్ ఇస్తారని ఘంటసాలవారు ప్రశంసించారు. సీరియస్ కేరక్టర్ లో శోభన్ బాబు చాలా చక్కగా నటించారు. సీనియర్ నటులుగా భానుమతి, రంగారావు, ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి తమ స్థాయిని నిలబెట్టుకున్నారు. ఈ మూడు వెర్షన్స్ లో తెలుగు సినీమా, అందులోని సంగీతమే తనకు బాగా తృప్తి కలిగించిందని నిర్మాత వాసు మీనన్ ప్రకటించారట.

ఇంతేలే నిరుపేదల బ్రతుకులు


పెదవులపైన సంగీతం.....పాట


అదే నెలలో విడుదలైన ఘంటసాలగారి మరో సినిమా 'పెద్దక్కయ్య'. తోట సుబ్బారావుగారి శ్రీదేవి కంబైన్స్ చిత్రం. ఫ్యామిలీ సెంటిమెంట్. గుమ్మడి, కృష్ణకుమారి, హరనాథ్, వాణిశ్రీ, చంద్రమోహన్, రమణారెడ్డి, జి.వరలక్ష్మి ప్రధాన తారాగణం. ఏడుగురు ఆడపిల్లల పేద తండ్రి కథ. కృష్ణకుమారి పెద్ద కూతురైతే, బేబి రాణి ఆఖరి కూతురు. బి.ఎ.సుబ్బారావు దర్శకుడు. హరనాథ్ కోసం ఘంటసాల మాస్టారు పాడిన దాశరధిగారి ఉమర్ ఖయ్యాం టైప్ పద్యాలు, ఘంటసాల, సుశీలగార్ల 'ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో'; సుశీలగారి సోలోలు ' చూడాలి అక్కను చూడాలి'; "తల్లి దీవించాలి దారి చూపించాలి"; మాస్టారి సోలో "తోడులేని నీకు  ఆ దేవుడే (శ్రీశ్రీ) " వంటి పాటలు సన్నివేశపరంగా,  సంగీతపరంగా చెప్పుకోదగ్గ మంచి పాటలు.




ఈ సినీమాలో తిరుమల కొండల నేపథ్యాన్ని చూపినప్పుడు మాస్టారు తన ప్రైవేట్ రికార్డు "వెంకన్న నామమే భక్తితో కొలిచితే" లోని ఒక బిట్ ఆలపించడం ఎంతో సందర్భోచితమనిపించింది. ఈ పెద్దక్కయ్య సినీమాలో ఆఖరి కూతురిగా బేబి రాణి ముద్దు ముద్దుగా నటించి గుమ్మడితో సమానమైన మార్కులు సంపాదించింది. ఆ సీజన్ లో బేబి రాణి వరసగా అనేక తెలుగు, తమిళ సినీమాలలో చిన్న పాపగా కనిపించి ప్రేక్షకుల హృదయాలలో నిల్చిపోయింది. ఆ పాప పెద్దయితే చాలా పెద్ద స్టారు అవుతుందని అందరూ భావించేవారు. కాని దురదృష్టం. ఛైల్డ్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయింది. ఆమధ్య ఏదో తమిళ్ ఛానెల్ ఈనాటి బేబి రాణితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశాను. ఆ చిన్నప్పటి పాపకు ఈ అమ్మాయికి ఏమాత్రం సంబంధమే లేనట్లు అనిపించింది. చాలా బాధగా అనిపించింది. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు.

🌿🌺🌿

మరిన్ని విశేషాలతో...
వచ్చేవారం ....
                     ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

3 comments:

చుండి వేంకట రాజు said...

చాలా ఓపికగా వ్రాస్తున్నారు. ధన్యవాదాలండి

P P Swarat said...

Thank you,sir.

Unknown said...

Swarat garu namaste Mee No35 usman road article chalabagundi Abhinandanulu sir