8.08.2021 - ఆదివారం భాగం - 43*:
అధ్యాయం 2 భాగం 42 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
" దేవుడనేవాడున్నాడా యని
ఆత్రేయకు కలిగెను సందేహం"
ఒక్క ఆత్రేయగారే అనేమిటి మానవుడై పుట్టిన ప్రతీ మనిషికి ఏదో దశలో ఈ సందేహం కలుగుతుంది. అంతవరకెందుకు, మహాభాగవతాన్ని వ్రాసిన పరమ భాగవతోత్తముడైన బెమ్మెర పోతన్న గారికే కలిగింది సందేహం - "కలడు కలండెనువాడు కలడోలేడో" అని. కానీ, మన ఘంటసాల మాస్టారికి అలాటి అనుమానాలు, సందేహాలు ఏనాడులేవు. ఆయన దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించారు. మనస్ఫూర్తిగా దైవనామ సంకీర్తనం చేశారు. అవి సినీమా పాటల రూపంలో, ప్రైవేట్ గీతాల రూపంలోనూ ఈ లోకంలో ప్రచారమై ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందడానికి దోహదమయింది. శివుడా, విష్ణువా? విద్యల తల్లా, సిరుల తల్లా? లేక ముగ్గురమ్మలు కలసిన ఆది పరాశక్తియా అనే తరతమ భేదం వారికిలేదు. అందరూ వారికి ఇష్టదేవతలే. సత్పురుషులు, సచ్చింతన కలవారందరిలోనూ ఘంటసాలవారు దైవాన్ని దర్శించి వారి సన్నిధిలో తన దేవగానామృతంతో ఆయా మహనీయులను సేవించారు. వారి ఆశిస్సులు పొందారు.
కలియుగ దైవంగా, భగవాన్ గా ప్రపంచం నలుమూలలావున్న కోట్లాది ప్రజలచేత కొనియాడబడిన శ్రీ సత్యసాయి బాబావారి సాంగత్యం ఘంటసాలవారికి మొదటిసారిగా ఏనాడు కలిగిందో నాకు తెలియదు కానీ బాబా మద్రాస్ వచ్చినప్పుడల్లా ఘంటసాలవారు ఆయనను దర్శించేవారు. మైకా బారన్ గా ప్రసిధ్ధిపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గోగినేని వెంకటేశ్వరరావుగారు పుట్టపర్తి సాయిబాబా భక్తులు. మద్రాసు లో బాబావారు వారింటికి అతిధిగా వేంచేసినప్పుడు స్థానిక ప్రముఖులెందరో వారిని దర్శించారు. అలాటివారిలో ఘంటసాలవారు ఉన్నారు. తర్వాత కాలంలో, బాబావారు అంజలీదేవి, ఆదినారాయణ రావు దంపతుల గృహానికి వచ్చినప్పుడల్లా ఘంటసాలవారు వారిని కలిసేవారు.
ఒకసారి ఘంటసాల మాస్టారు తన బృందంతో పుట్టపర్తి ప్రశాంతినిలయంలోనో లేక వైట్ ఫీల్డ్స్ లోనో సాయిబాబా సమక్షంలో కచేరీ చేసి బాబా ప్రశంసలకు పాత్రులయ్యారు. (అప్పటికి నాకు సాయిబాబా అంటే ఏవిధమైన అవగాహన లేదు). ఆ సందర్భంగా సత్యసాయిబాబా తన హస్తచాలనంతో ఒక వజ్రాల ఉంగరాన్ని సృష్టించి ఘంటసాలవారికి బహుకరించారు. మిగిలిన వాద్యబృందానికి తలా ఒక బంగారు కాసు బహుకరించారు. ఆ సందర్భంలో మాస్టారితోపాటు సావిత్రమ్మగారు కూడా వెళ్ళారు. ఘంటసాల మాస్టారు చాలా తీవ్రంగా చలించిపోయే మనస్తతత్త్వం కలవారని, చాలా వేగంగా భావోద్వేగాలకు లోనయేవారని మా నాన్నగారు చెపుతూండేవారు. ఆరోజున సత్యసాయి బాబా వారి సమక్షంలో కూడా ఘంటసాల వారికి అలాటి దివ్యానుభూతికి గురయ్యారని అనుకునేవారు. అదే సందర్భంలో అక్కడే వున్న మా నాన్నగారిలో కానీ, సావిత్రమ్మగారిలో కానీ ఎటువంటి సంచలనాలు కలగలేదని చెప్పగా విన్నాను. దేవుడి విషయంలో కానీ, సాధు సత్పురుషుల విషయంలోకానీ అందరి అనుభవాలు ఒకేలావుండవు. ఆయా మనుషుల జిజ్ఞాస మనోప్రవృత్తి, జీవితానుభవం దృష్ట్యా కూడా దైవ విశ్వాసాల అంతరం, స్థాయి మారుతూంటాయి. ఘంటసాల మాస్టారు తన ఆరోగ్యం బాగాలేని దశలో కూడా సత్యసాయి బాబావారిని దర్శించి వారినుండి ఉపశమనం పొందారు. వారిపై పాటలు వ్రాసి,స్వరపర్చి తన భక్తప్రపత్తులను చాటుకున్నారు. ఘంటసాల మాస్టారు జరిపిన అనేక సంగీత కచ్చేరీలు ఆధ్యాత్మిక కేంద్రాలు, సత్కార్యాలకోసం జరిపినవే. స్వలాభాపేక్ష వుండేది కాదు. స్టూడియోలలో మైక్రోఫోనుల ముందు పాడడంలో కన్నా, చిన్న చిన్న వూళ్ళలో వేలాది అభిమానుల మధ్య వారి కోసం పాడడంలోనే ఘంటసాలవారు ఎక్కువ ఆనందం అనుభవించేవారు. ఆ సమయంలో కలిగిన శ్రమ, కష్టనష్టాలను కూడా ఆయన లెఖ్ఖచేసేవారు కాదు. అందుకే 'ఘంటసాల మా మనిషి' అని, ' ప్రజల గాయకుడు' అని ఈనాటికీ కొనియాడబడుతున్నారు.
🍄
'ఏరా... పెద్ద బాబూ... ఎక్కడున్నావు... సంగీతం మాస్టారొచ్చి ఎంతసేపయింది..." ఓ పెద్ద కేక. 'వస్తున్నానమ్మా' అంటూ మరెక్కడినుండో మెల్లగా సమాధానం. కొన్ని క్షణాల తర్వాత మాస్టారింటి హాలులో నుండి తంబురా శ్రుతుల మధ్య సంగీత పాఠం ప్రారంభమయేది. శిష్యుడు ఘంటసాలవారి పెద్ద కుమారుడు విజయకుమార్. గురువుగారు నూకల పెద సత్యనారాయణ గారు. సుప్రసిధ్ధ సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణ గారికి వీరికి ఏమైనా బంధుత్వం వుందేమో తెలియదు. పెద సత్యనారాయణ గారు కూడా అడపాదడపా ఆలిండియా రేడియో లో పాడేవారు. ఆయన మా పెదబాబుకు సంగీతం గురువుగారు. మనిషి పొట్టిగా, సన్నగా ఖద్దరు పంచ, జుబ్బా, చేతిలో గొడుగుతో మధ్యాహ్నం 4.30- 5.00 ప్రాంతాలలో వచ్చేవారు. సంగీతపాఠం జరిగినంతసేపూ ఎవరూ ఆ హాలు ప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. ఘంటసాల మాస్టారయితే ఆ దరిదాపులకే వెళ్ళేవారు కాదు. ఆయన కనిపిస్తూంటే గురుశిష్యులిద్దరూ బిగదీసుకుపోయేవారు. అందుకని పాఠం అయేకే మాస్టారు హాలులోకి వచ్చి నూకలవారిని పలకరించేవారు. ఆయనకు ఆదరణ కల్పించే ఉద్దేశంతో తన స్వీయ సంగీతంలో ఎప్పుడైనా తంబురా శ్రుతికి ప్రాధాన్యం వుంటే ఆ అవకాశం వారికి కల్పించేవారు. నూకల పెద సత్యనారాయణ గారికి హియరింగ్ ఎయ్డ్ అవసరం బాగానే ఉండేది. కర్ణాటక సంగీత బాణీకి అలవాటు పడిన గాయకులు కానీ, వాద్యకారులు కానీ సినీమా సంగీతంలో ఇమిడిపోయి రాణించినవారు బహు అరుదు. వారి సంగీత ప్రతిభ సినీమాలోకంలో అక్కరవచ్చేది కాదు. 1980ల తర్వాత ఫ్యూజన్ సంగీతం ప్రారంభమయ్యాక ట్రెండ్ కొంత మారిందనుకోండి. అది వేరే విషయం. అలాటి మంచి గాయకులు, వాద్యకారులు సినీమాలలో అవకాశాలకోసం ఘంటసాల మాస్టారి వద్దకు వచ్చేవారు. అలాటివారికి తగిన ప్రోత్సాహం, ఆదరణ కల్పించలేకపోతున్నందుకు మాస్టారు చాలా బాధపడేవారు.
పెదబాబు విజయకుమార్, నేనూ సమవయస్కులం కాకపోయినా ఇద్దరమూ స్నేహ భావంతోనే వుండేవాళ్ళం. మా అమ్మగారికి పిల్లలపట్ల గల ప్రేమాభిమానాల వలన పెద్దబాబుకు మా అమ్మగారి దగ్గర చనువుండేది. తరచూ మేముండే ఔట్ హౌస్ లో మాతో గడిపేవాడు. చదువులో రాణించలేడనే విషయం అర్ధమయ్యాక అతని దృష్టిని పూర్తిగా సంగీతంవేపు మళ్ళించేలా ఘంటసాల మాస్టారు ప్రయత్నించారు. మొదట్లో మాస్టర్ వేణుగారి దగ్గర హార్మోనియం, పియోనా నేర్పించారు. క్రమక్రమంగా విజయకుమార్ సంగీతవిద్యలో అభివృద్ధి కనపర్చడంతో మౌంట్ రోడ్ లోని 'మ్యూసీ మ్యూజికల్స్ ' లో చేరి పియానో వాద్యంలో కృషి చేసి ట్రినిటి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, లండన్ వారి డిప్లమో సాధించాడు.
ఆ మ్యూసీ మ్యూజికల్ స్కూల్ లో చాలా ప్రఖ్యాతి పొందిన వెస్టర్న్ సంగీత కళాకారుడు, ఆంగ్లో-ఇండియన్ ఒకాయన ఉండేవారు. హేండల్ మాన్యుల్.
హేండల్ మాన్యుల్
మెడ్రాస్ సినీమా ప్రపంచంలో పేరు పొందిన సంగీత దర్శకులు, వాద్యకళాకారులు ఎందరో ఆయన శిష్యులే. ఆయన విధిగా మద్రాస్ శాంథోమ్ కేతిడ్రల్ లాటి అనేక పెద్ద పెద్ద చర్చ్ లలో ప్రేయర్, హిమ్స్, కేరోల్స్ ఖ్వయర్ సంగీతకార్యక్రమాలని కండక్ట్ చేసేవారు. అలాటి ప్రముఖుని వద్ద పియోనా నేర్చుకునే అదృష్టం పెద్దబాబుకు లభించింది. తర్వాత, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో సంప్రదాయబధ్ధంగా కర్ణాటక సంగీతం నేర్చుకొని అందులో డిప్లమో పొందాడు. మంచి గాత్రం.
సంగీత సాధన చేస్తున్నరోజులలో పెద్దబాబు పాడే ఒక కృతి నాకు బాగా గుర్తు. ముత్తయ్య భాగవతార్ రచించి, స్వరపర్చిన 'విజయాంబికే విమలాత్మికే' అనే కృతి. 'విజయనాగరి' రాగం. పెద్దబాబు పియోనాకు మొదటి శ్రోతను (మెచ్చుకర్తను?) నేనే. అతను మాస్టర్ వేణుగారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్న కాలంనుంచే ఇంట్లోనే ఒక పియోనో ఉండేది అతని ప్రాక్టీస్ కోసం మేడమీద స్టడీ రూంలో. మేడ మీద రినొవట్ చేసాక, పిల్లలందరూ స్కూళ్ళనుంచి వచ్చేక హోం వర్కులు, చదవుకోడాలు, ట్యూషన్లు ఆ స్టడీ రూంలోనే. సొంత చిత్ర నిర్మాణ కాలంలో ఆ రూమ్ టైలర్స్ రూమ్.
పది పన్నెండేళ్ళ వయసులోని పిల్లలు ఏం మాట్లాడినా, ఏంచేసినా పెద్దలకు తప్పుగానే కనిపిస్తుందట. మా నాన్నగారి స్నేహితులు శ్రీ పంతుల శ్రీరామశాస్త్రిగారు అనేవారు. ఆ వయసులోని పిల్లలు గట్టిగా మాట్లాడినా, ఆట్లాడినా, పాటలు పాడినా, పని చేసినా, చేయకపోయినా, అల్లరిచేసినా, చేయకపోయినా ఏదో దానికి పెద్దలు విమర్శిస్తూ, పిల్లలమీద తమ విసుగుదలను ప్రదర్శిస్తారని, ఇది పెద్దలకుండే అవలక్షణమని ఆయన చెప్పేవారు. తనలో ఉండే ఆ లక్షణం గురించే ఆయన చెప్పారని ఒకసారి రాయఘడా వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. కారణమేమిటో తెలియదు కానీ, నేను కానీ, పెద్దబాబు కానీ మా తండ్రుల దగ్గర చాలా చనువుతో, స్వేఛ్ఛగా మాట్లాడలేకపోయేవాళ్ళం, మెలగలేకపోయేవాళ్ళం. మా తరం పిల్లల్లో చాలామందిలో ఆ లక్షణం వుండేదనిపిస్తుంది. పెద్దల పట్ల భయం భయంగానే ప్రవర్తించేవారు. ఇది సాకుగా చేసుకొని మాస్టారింట్లో వుండే గుండు మామయ్య, సుబ్బు, పనిమనిషి తాయి కొడుకు పయ్యా లాటివాళ్ళు కూడా పెద్దబాబును అదలించడం, కన్నెర్రజేయడం నాకు చాలా చికాగ్గా వుండేది. అయితే అదంతా వారి దృష్టిలో పిల్లలను సక్రమంగా తీర్చిదిద్దుతున్నామనే భావన. ఏమైతేనేం, చిన్నప్పుడు నాలో చాయాస్వర జ్ఞానం బాగా వుండేదని మానాన్నగారు అనడం నాకు బాగా గుర్తు. అకారంలో ఏం పాడినా వాటి స్వరాలు గుర్తించేవాడినట. చిన్నతనంలో ఆయన ముఖతః సంగీతం నేర్చుకోలేకపోయాను. ఆయనకూ తన వృత్తి కార్యకలాపాలలో నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని సంగీతం నేర్పే సమయమూ వుండేదికాదు. తర్వాత కాలంలో చదువురీత్యా నేను మద్రాసులో లేకపోవడం వల్ల నా సంగీత శిక్షణ ఆగిపోయింది. నాకు మా నాన్నగారిపట్ల అకారణ భయం మరో కారణం కావచ్చు. కానీ అదంతా ఏనాటి మాటో!
పెద్దబాబు విజయకుమార్ పియానో వాద్యం నాకు చాలా ఉత్సాహం గాను, ఆశ్చర్యం కలిగించేదిగానూ వుండేది. ఎంతో వేగంగా సాగే ఆ వేళ్ళ కదలిక, గమనం ఆనందంగా వుండేది. వెస్టర్న్ మొజార్ట్, జాజ్, కర్ణాటక రాగాలు అన్నిటినీ చాలా సునాయాసంగా పియానో మీద గంటల తరబడి వాయించేవాడు. సమయమే తెలిసేది కాదు. హార్మోనియం మీద కూడా ఘంటసాల మాస్టారి మంచి మంచి పాటలెన్నో అవలీలగా వాయించి వినిపించేవాడు. సినీమా సంగీతానికి కావలసిన అర్హతలన్నీ అతనిలో పుష్కలంగానే వుండేవి. జరిగిన కథ చిత్రంలో 'ఇదిగో మధువు, ఇదిగో సొగసు' అన్న పాటలో అతని సోలో పియానో బిట్ ప్రత్యేకంగా వినిపిస్తుంది. క్రమక్రమంగా తండ్రిగారికి సహకారం అందించే స్థితికి చేరుకున్నాడు. సంగీత దర్శకుడై తన సంగీతదర్శకత్వలో వచ్చిన 'వస్తాడే మా బావ' చిత్రంలో తన తండ్రిగారి చేతే ఒక పాట పాడించి ఆయనకు ఆనందాన్ని కలగజేశాడు.
ఆ సినీమాకు చేసిన పాటలు, తర్వాత మరెప్పుడో తన సోదరుడు రత్నకుమార్ తీసిన తమిళ సినిమా 'తేన్ కూడు' కు చేసిన పాటలు నాకు హార్మోనియం మీద వాయిస్తూ పాడి వినిపించేవాడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణించే లక్షణాలన్నీ వుండేవి.
కానీ, తెలుగు సినీమా పరిశ్రమ అతని ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు కల్పించలేకపోయింది. భగవంతుడు కూడా పెద్దబాబు కు అర్ధాయుష్షునే ప్రసాదించి ఈ లోకంనుండే తీసుకుపోయాడు. భోళాశంకరుడి వంటి పెద్దబాబు జ్ఞాపకాలు సదా నా వెంటనే వుంటాయి. నెం.35, ఉస్మాన్ రోడ్ లో మరపురాని మనిషి మా పెద్దబాబు.
💐
" ఇలా ఇలా జీవితం పోతే పోనీ
ఈ క్షణం నరకమను, స్వర్గమను
ఏది ఏమను... ఇలా ఇలా జీవితం" అంటూ గుండు మామయ్య ఇచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ ఎన్టీఆర్ స్టైల్లో కాఫీగ్లాసును పట్టుకొని తూలుతూ పాడుతూ అందరికి వినోదం కలిగించేవాడు ఒక కుర్రవాడు. గుండు మామయ్య కాఫీ ఆ కుర్రవాడికి అంత నిషాను, మజాను ఇచ్చేదనుకుంటాను. ఉన్నచోట వుండకుండా తుళ్ళుతూ, గెంతుతూ, చాలా హుషారుగా వుండేవాడు. ఒట్టి కబుర్లపోగు. అతనే వేణు. సావిత్రమ్మగారికి చెల్లెలి కొడుకు. రతన్, శ్యామల వయసే వుండవచ్చు. ఆ అబ్బాయి తండ్రి నరసింహమూర్తి. ఆయన కూడా చాలా హడావుడిగా, గట్టిగా, గలగలా మాట్లాడుతూండేవారు. ఘంటసాల మాస్టారి ఇల్లు ఎప్పుడూ బంధుమిత్రులతో కలకలలాడుతూవుండేది. అందులోనూ వేసవికాలం వస్తే మరింతమంది వచ్చేవారు. సావిత్రమ్మగారి అన్నగారు, పిల్లలు, చెల్లెలు, మరది, పిల్లలతో ఒకటే సందడిగా వుండేది. పిల్లల పాటలు, ఆటలతో పొద్దుపోవడమే తెలిసేదికాదు. నరసిమ్మూర్తి బాబాయి, సుబ్బారావు మామయ్య ఊరినుంచి వచ్చేరంటే మా ఔట్ హౌస్ మీది కొట్టాయ్ (కొబ్బరాకుల పాక)లో కూడా ఉత్హాహం హడావుడి ఎక్కువయేది. ప్రతీ రోజూ మధ్యాహ్నం మూడు నుండి ఆరు వరకూ చతుర్ముఖ పారాయణం జరిగేది. రమ్మీ. పదమూడు ముక్కలాట. పండగ దినాల్లో అయితే రాత్రి పది పదకొండు దాకా సాగేది. ఈ రమ్మీ క్లబ్ లో మా నాన్నగారు, సదాశివుడుగారు, నరసింగ, సుబ్బారావుగారు, నరసింహమూర్తి గారు, క్రిందింట్లో అద్దెకుండే కొల్లూరి వారి బంధువు రామకృష్ణ, ప్రముఖ నటుడు లింగమూర్తిగారు, ప్రముఖ నటి శ్రీదేవి పినతల్లి భర్త మోహన్ రెడ్డి (1980లలో నటి శ్రీదేవి కుటుంబం మా పక్కిల్లు 36, ఉస్మాన్ రోడ్ క్రింది పోర్షన్ లో అద్దెకు వుండేవారు), మా నాన్నగారి మేనమామ కుమారులు మురళి, శాస్త్రి, వయోలా (మేడూరి)రాధాకృష్ణమూర్తిగారు సభ్యులు. రాధాకృష్ణమూర్తిగారు ఆలిండియా రేడియోలో వయోలా వాద్యంలో బి హై గ్రేడ్ కళాకారుడు. సినీమా వాద్యబృందాలలో కూడా పనిచేయాలని చాలా కోరిక. సంగీత దర్శకులందరిని కలుస్తూండేవారు. కానీ ఆయనది సినీమా సంగీతానికి అతకని శాస్త్రీయ బానీ. దానితో ఆయనకు సరైన అవకాశాలు వచ్చేవికావు. ఘంటసాల మాస్టారు మాత్రం అప్పుడప్పుడు తన పాటలకు పిలిచేవారు. రాధాకృష్ణమూర్తిగారు చాలా మంచి వ్యక్తి. మా నాన్నగారికి మంచి స్నేహితుడు.
వీరంతా రోజూ వచ్చి పేకాట ఆడేవారని కాదు. వారి వారి అవకాశాలను బట్టి వస్తూండేవారు. వీరిలో నలుగురు విధిగా వచ్చేవారే. ఒక చెయ్యి తగ్గినప్పుడు నేను కూడా ఒక చేయి వేసేవాడిని. రామకృష్ణ వెయ్యిళ్ళ పూజారి. అటు మాధవపెద్దివారి లోగిట్లో, మరోపక్క ఆంధ్రా క్లబ్ లో, ఇంకా అనేక చోట్ల చతుర్ముఖ పారాయణం చేయించేవాడు. అతనికి పేక ముక్క నలిగితే నచ్చేదికాదు. కొత్త సెట్లు కావాలనేవాడు.
ఆంధ్రా సోషల్ క్లబ్ లో తెలుగు సినీమా రంగానికి చెందిన హేమాహేమీలెందరో రమ్మీలో నిష్ణాతులు. రోజుకు వందలు, వేలు చేతులు మారేవి. పేకముక్క ఏమాత్రం నలిగినా అదేమిటో కనిపెట్టగల పేకాట నిష్ణాతులుండేవారట. రామకృష్ణే చెప్పేవాడు. అందుచేత ఏ రోజుకారోజే కొత్త పేకలు వాడతారట. పాతవాటిని క్లబ్ వాళ్ళు చీప్ గా బయటవాళ్ళకు అమ్మేస్తారట. అలాటి పేకలేవో మా ఇంటికొచ్చినప్పుడు తెచ్చేవాడు. ఆటలో హుషారు వుండేందుకు పైసల స్టేక్స్ తోనే ఆడేవారు. నాకు గుర్తున్నంత వరకు డ్రాప్ కు ఐదు పైసలు, మిడిల్ 15, ఫుల్ కౌంట్ పావలా తో మొదలెట్టి కాలక్రమేణా 1980లు వచ్చేసరికి పావలా, అర్ధ, రూపాయి. పాయింట్ కు పైసా. మా మురళీ, శాస్త్రిలాటి వారెవరైనా ఈ ఎపిసోడ్ చదివితే ఈ ఫిగర్స్ ను సరిచేయవచ్చును.
ఈ చతుర్ముఖ పారాయణ సమయంలో లోకాభిరామాయణంతో పాటు సంగీత, సాహిత్య, వేదాంత విషయాల మీద కాలక్షేప ప్రసంగాలు కూడా జరిగేవి. చాలా సుహృద్భావ వాతావరణంలో ఏ హడావుడి, ఉద్రేకాలు లేకుండా చాలా సరదాగా ప్రశాంతంగా ఈ పారాయణం కొన్ని దశాబ్దాల పాటు జరిగింది. ఘంటసాల మాస్టారికి ఈ ఆటల మీద, పుస్తక పఠనం మీద పెద్ద ఆసక్తి వుండేదికాదు. వారికి ఇంట్లో వున్నంతసేపూ హాయిగా విశ్రాంతిగా కళ్ళుమూసుకు పడుక్కోవడంలోనో లేక పిల్లలతో కాలక్షేపం చేయడంలోనో ఆనందంవుండేది.
ఆ రోజులు, ఆనాటి సరదాలు తిరిగి రానేరావు. ఆ రోజులను ఎంత మననం చేసుకున్నా తనివితీరదు. ఈ మాటలు ఘంటసాల మాస్టారు పాడిన ఒక ప్రైవేట్ లలితగీతాన్ని గుర్తు చేస్తోంది కదూ!
💐
మరిన్ని విషయాలతో, విశేషాలతో వచ్చే వారం...
అంతవరకు ...
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
5 comments:
Thanks for sharing nostalgic moments. Those days will not come again.
పెద్దబాబు జ్ఞాపకాలని ఈవ్యాసంలో స్మరించు కోవడం చాలా ఆనందంగా వుంది.నేను B.A.Music చేస్తున్నప్పుడు పెద్దబాబు నాకిచ్చిన "సాంబమూర్తి గారి మ్యూజిక్ వాల్యూమ్స్ ఇప్పటికీ పదిలంగా నాదగ్గరున్నాయి".పెద్దన్నయ్యా ఈ వ్యాసంలో ఉస్మాన్ రోడ్డు మధుర జ్ఞాపకాలని మరోసారి కళ్ళకి కట్టించావు.చాలాథేంక్స్.
💎 దేవుడున్నాడా, లేడాయన్న సంశయం...దైవం మీద అపార విశ్వాసం వుంచిన వ్యక్తికి అసలుండదనుకుంటా! అందుకే ఈ మీమాంస మాస్టారి దరిజేరియుండదు. మీరన్నట్లు, మనుషుల మనోప్రవృత్తి, జీవితానుభవాల్ని బట్టి దైవం మీద వారి వారి విశ్వాసం వుంటుందన్నది నిర్వివాదాంశం!
💎 పెదబాబుతో మీకున్న అనుబంధం...సవివరంగా తెలియజేశారు. వారి సంగీతానుభవం తెలియపరుస్తూ, ఆనాటి వాద్యపరికరాలు, మ్యూజిక్ స్కూల్ వివరాలు కూడ తెలియజేయడం చాల బావుంది. అలాగే..” వస్తాడే మా బావ” సినిమాలోని ‘వాగు...ఓకొంటె వాగు పాట’ ఇప్పటికీ మాకందరికీ అరుదైన, అతి మురిపెమైన పాట!
💎 ఇక చతుర్ముఖ పారాయణం, ఆంధ్రా సోషల్ క్లబ్, పేకాటలో స్టేక్స్ గురించి సవివరంగా చెప్పారు. మా కాలేజీ రోజుల్లో...మా ఊరి(కావలి) ఎమ్.ఎల్.ఏ. కలికి యానాది రెడ్డి పేకాట ప్రావీణ్యత గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు. శని, ఆదివారాలు ఖచ్చితంగా మద్రాసు క్లబ్బుల్లో పేకాటలో వుంటాడని, అక్కడ ఒక ఆటకు వాడిన ముక్కలు మళ్ళీ వాడరని, అలా వాడితే మా రెడ్డిగారిలాంటి వాళ్ళు ఠక్కున పట్టేస్తారని, హైద్రాబాద్ లో అసెంబ్లీ సెషన్స్ రోజుల్లో మద్రాస్-హైద్రాబాద్ ఫ్లైట్స్ లో తిరుగుతాడని....ఇలా ఎన్నెన్నో! మీరిచ్చిన వివరాలు చదువుతూంటే...మా యానాదిరెడ్డి గారి ‘కతలు’ కళ్ళ ముందు మెదిలాయి!😀😀
“ ఆ రోజులు, ఆనాటి సరదాలు తిరిగి రానే రావు. ఆ రోజులను ఎంత మననం చేసుకున్నా తనివి తీరదు.” ధన్యవాదాలు స్వరాట్ మాస్టారు!!🙏🙏🙏
I will have to repeat my comments. Shri has an enviable narrative technique,phenomenal memory and applaudable perception. With what kind of verve and spirit he narrated his friend,Vijaya kumar's musical skills, with the same level of verve and spirit, he has written about the scenes of playing cards "Chaturmukha Parayanam" In this episode I have found "detachment in attachment- a philosophical attitude about the beautiful days which will never come back.
-Ranganath Nandyal
Correction:Shri Swarat has-‐-
Post a Comment