visitors

Sunday, October 24, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై నాలుగవ భాగం

24.10.2021 - ఆదివారం భాగం - 54*:
అధ్యాయం 2  భాగం 53 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1967 లో 'నిర్దోషి' సినీమాను విడుదల చేసిన నర్రా రామబ్రహ్మంగారు తన రెండవ చిత్రంగా తన గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద ఒక జానపద సినీమాను తీయడానికి సంసిధ్ధులయ్యారు. బి.విఠలాచార్య దర్శకుడు. ఎన్.టి.రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, రావికొండలరావు మొదలగువారు ప్రధాన తారాగణంగా వుంటారని అనుకున్నారు. తన మొదటి చిత్రం 'నిర్దోషి' కి సంగీతం నిర్వహించిన ఘంటసాలవారినే తన రెండవ చిత్రానికి కూడా సంగీతం చేయమని నిర్మాత రామబ్రహ్మం కోరారు. ఘంటసాలవారంటే మంచి గౌరవం, స్నేహంగల వ్యక్తి రామబ్రహ్మం గారు. వారిద్దరి మధ్య ఒక సదవగాహన వుండేది.

ఒక శుభ ముహుర్తం చూసి గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ లో కంపోజింగ్ మొదలెట్టారు ఘంటసాల. బందిపోటు సినీమా తర్వాత ఘంటసాల, బి.విఠలాచార్య కలసి పనిచేస్తున్న రెండవ సినీమా. వీఠలాచార్యగారి ఆలోచనా సరళికి, ఘంటసాలవారి ఆలోచనా సరళికి అంతరాలున్నా వాటన్నింటిని పక్కనబెట్టి సమన్వయంతో కలసి పనిచేసి చిత్ర విజయానికి కృషిచేశారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరో జానపదం కూడా వచ్చింది. ఆ విషయం తర్వాత. 

గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ మా 35, ఉస్మాన్ రోడ్ కు దగ్గరే. పానగల్ పార్క్ కు తూర్పునున్న రామకృష్ణ మిషన్ మెయిన్ హైస్కూలు పక్కనే నటుడు ముదిగొండ లింగమూర్తిగారు వుండే నానారావు నాయుడు స్ట్రీట్. దానిని ఆనుకొని వెంకట నారాయణ చెట్టి రోడ్ మీదకే ఉన్న మొదటి భవనం. ఆ భవనంలోనే రామబ్రహ్మం గారు ఒంటరిగా ఉండేవారు. సంసారం ఏదీ ఇక్కడ ఉండేదికాదు. బ్రహ్మాచారి అని విన్నాను. వివరాలు తెలియవు. ఆ ఇంటికి రెండు మూడు ఇళ్ళ తర్వాత ఎస్.వరలక్ష్మిగారి ఇల్లు, ఆ తర్వాత వచ్చే రాజా స్ట్రీట్ లో  ఎడమవేపు మొదటిదో, రెండవదో నటి సంధ్యగారి ఇల్లు. ఆమె కుమార్తే జయలలిత. నటిగా, తర్వాత ఎమ్జీయార్ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా తమిళనాట తన ప్రభావాన్ని, ప్రాభవాన్ని చాటి చెప్పారు. ఆ జయలలితే రామబ్రహ్మంగారి 'ఆలీబాబా 40 దొంగలు' సినిమాకు కధానాయిక. 

ఆ రోజుల్లో సినిమా పాటల కంపోజింగ్ మొదలుపెట్టేముందు ఆ చిత్రం యొక్క కథను సంగ్రహంగా సంగీత దర్శకుడికి, ఆనాటి పాట వ్రాయడానికి వచ్చే రచయిత కు వివరిస్తారు. సాధారణంగా ఆ భాధ్యత ను రచయిత, అసిస్టెంట్ డైరక్టర్ తీసుకుంటారు. చిత్రనిర్మాత కూడా పక్కనే వుంటారు. 

ఆ విధంగా వారు కథను చెప్పిన తర్వాత ఏఏ సన్నివేశాలలో పాటలు అవసరమనిపిస్తాయో వాటి వివరాలు ఆయా పాటల కంపోజింగ్ సమయంలో చెపుతారు. వారు చెప్పినదానిని మనసులో పెట్టుకొని గీత రచయిత, సంగీతదర్శకుడు తమ కార్యక్రమానికి ఉపక్రమిస్తారు.  వెళ్ళిన ప్రతీసారి, వీటన్నిటికీ ముందు ఒక ముఖ్యమైన కార్యక్రమం వుంటుంది, అదే ఫలహారాలు, కాఫీ, తాంబూలం, సిగరెట్ల సేవనం. సాధారణంగా ఈ పాటల కంపోజింగ్ లు ఉదయం తొమ్మిదికి, సాయంత్రం నాలుగు తర్వాత ఏర్పాటు చేసేవారు. ఆ సమయానికి అనుగుణమైన ఫలహారాలనే ,పాపం , నిర్మాతలు తమ సొంత ఖర్చుమీద, ఒక మంచి పెద్ద హోటల్ నుండి తెప్పించి ఆ రోజు అక్కడున్నవారందరికీ తెప్పించేవారు. షూటింగ్/రికార్డింగ్/రీరికార్డింగ్ లు జరిగేప్పుడు ఆయా  సమయాలను బట్టి కాఫీ, టిఫెన్లు, భోజనాలు ఏర్పాటు చేసేవారు. షూటింగ్ లు, రీరికార్డింగ్ లు నిర్విరామంగా, ఏ అడ్డంకులు లేకుండా సాగాలంటే ఈ రకమైన సాదరు ఖర్చులు తప్పవు.
 
ఆ రోజుల్లో స్టూడియోలకు వెళ్ళి రావడానికి వాహనాలను కూడా నిర్మాతలే ఏర్పాటు చేసేవారు. అందుకు సినీమా నిర్మాణంలో వున్నన్ని రోజులు కొన్ని కార్లను, వ్యాన్లను అద్దెకు తీసుకునేవారు.

మరీ నాస్తికుడైన నిర్మాత అయితే తప్ప,   తమ సినిమాను ఒక శుభముహుర్తాన పురోహితుల సమక్షంలో వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి మొదలైన దేవతాపటాలను పూలమాలలతో అలంకరించి పూజతో ప్రారంభిస్తారు. సాధారణంగా ఈ పూజా కార్యక్రమానికి  నిర్మాత దర్శకుడు, హీరో హీరోయిన్ లు, సంగీత దర్శకుడు, కెమెరామెన్, డిస్ట్రిబ్యూటర్ లను కూడా ఆహ్వానిస్తారు. ఆ పూజకు హాజరైనవారంతా తలా ఒక కొబ్బరికాయ (నిర్మాత డబ్బులే)  కొట్టి భగవంతుడి ఆశీస్సులు పొందుతారు. ఈ పూజా కార్యక్రమాలు కొన్నిసార్లు మొదటి రోజు షూటింగ్ సందర్భంగా చేస్తారు, లేదా పాటల కంపోజింగ్ తో ఆఫీసులో జరుపుతారు. వారి అనుకూలాన్నిబట్టి జరుగుతాయి. నిర్మాత యొక్క ఆర్ధికస్తోమత,  మెయిన్ ఆర్టిస్ట్ లు ఇచ్చే  వరస డేట్ల మీద సినిమా ఎంతకాలంలో ముగుస్తుందనేది తెలిసిపోతుంది.

మరి, ఈ ఆలీబాబా 40 దొంగల సినిమా ఏవిధంగా ప్రారంభయిందో నాకు తెలియదు. నేను 'వినాయకచవితి', 'మాయనిమమత' సినిమా ప్రారంభోత్సవాలకు తప్ప మిగిలిన ఏ సినీమా ఉత్సవాలకు వెళ్ళలేదు. ఈ సినిమా సమయంలో నేను కొంచెం ఖాళీగానే ఉండేవాడిని. శని ఆదివారాలు శెలవు, ప్రతీ పండగకు ఏదో రకమైన శెలవుల వలన, మా నాన్నగారికి ఇష్టంలేకపోయినా, ఘంటసాల మాస్టారి వెనకాల వెళ్ళేవాడిని. షూటింగ్ ల పట్ల, స్టార్స్ పట్ల నాకు ఏనాడు ఆసక్తివుండేదికాదు. ఆంధ్రానుండి మద్రాస్ వచ్చే బంధుమిత్రుల కోసం కొన్ని షూటింగ్ లకు వెళ్ళడం జరిగింది. పాటల రచన విధానం మీద, స్వర రచనల మీద వుండే ఆసక్తివలన కంపోజింగ్ లకు, రికార్డింగ్/రీరికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అది కూడా ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలకు మాత్రమే వెళుతూ,  ఎక్కడా నా వల్ల ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడిని. పాటల కంపోజింగ్ సమయంలో పాటల లోని పదాలు,  వరసల విషయంలో రచయిత, సంగీత దర్శకుల మధ్య జరిగే చర్చలు, సంభాషణలు వినడంలో ఒక ఆనందం వుండేది.
 
కొసరాజుగారు, సి.నారాయణరెడ్డి గారి వంటి రచయితలు వారే ఏవో ట్యూన్స్ లాటివి కట్టి పాడి వినిపిస్తూండేవారు. పాటల కంపోజింగ్ మామూలు వాళ్ళకు ఒక విసుగుపుట్టించేపని. ఘంటసాలవారి కంపోజింగ్ అంటే సంగీతంబాబు (హార్మోనియం), రాఘవులు (చేసిన ట్యూన్ కు సరైన మాటలు దొరికేవరకు అలా  పదే పదే పాడి వినిపించడం ఆనాటి రివాజు). లయ కోసం ఒక తబలా తప్పనిసరి. మొదటి రోజుల్లో పామర్తిగారు కంపోజింగ్ లలో తబలా వాయించేవారు. తర్వాత పెద్ద ప్రసాద్, జడ్సన్, ఆయన తమ్ముడు చిన్నప్రసాద్, సుబ్బారావు, ఇలా చాలామంది మారారు.

గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ ఇంటి క్రింది భాగంలో వుండడం మా నాన్నగారిలాటి వాళ్ళకు ఒక సౌకర్యంగా వుండేది. కొన్ని ఫిల్మ్ కంపెనీలు మేడమీద వుండి తన హార్మోనియంను ప్రతీసారీ మేడమీదకు ఎక్కించడం, దింపడం మహాయాతనగా వుండేది. కొన్నిసార్లు ఆఫీసు బాయ్స్ అందుబాటులో వుండేవారు కాదు. అలాటి కొన్ని సమయాలలో నేనే ఆయనకు సాయంపట్టేవాడిని. తర్వాత కాలంలో వీణ వాయించేప్పుడు అదే సమస్య. రెండు చాలా బరువైన వాద్యాలే. హార్మోనియం, వీణ, డ్రమ్స్ వంటి హెవీ ఇన్స్ట్రమెంట్స్ ను స్టూడియోలకు మోసుకెళ్ళడమూ శ్రమతోకూడిన పనే. ఈ వాద్యలతో పోలిస్తే ఫ్లూట్, వైలిన్ వాయించేవాళ్ళకు మహా హాయి. చాలా తేలికగా బస్సుల్లో ప్రయాణం చేసి స్టూడియోలకు వచ్చేవారు. అందుకే మొదటి రోజుల్లో సినీమా కంపెనీవాళ్ళే ఆర్కెస్ట్రావారిని తమ కార్లలో తీసుకువెళ్ళి, మళ్ళీ ఇళ్ళవద్ద దింపేవారు. మొదటినుండి మా నాన్నగారిది బరువైన జీవితమే.

ఆలీబాబా 40 దొంగలు కథ అరేబియన్ నైట్స్ కథలలోనిది. ఈ  కథ సినీమాగా అనేక విదేశీ భాషల్లో, స్వదేశీ భాషలలో నిర్మించారు. 1955లో ఆలీబాబా 40 దొంగలు సినీమాను మోడర్న్ థియేటర్స్ వారు తమిళంలో ఎమ్.జి.రామచంద్రన్, భానుమతి, వీరప్ప, తంగవేలు మొదలైనవారితో తీసారు. తమిళంలో మొట్టమొదటి గేవాకలర్ సినీమా. బ్రహ్మాండమైన విజయం పొందింది. హీరో పాడే ఒకే డ్యూయెట్ భానుమతితో   ఎ.ఎమ్.రాజా పాడగా, కమేడియన్ తంగవేలు తెర మీద పాడిన 'ఉల్లాస ఉలగమ్ ఉనకే సొందం... సెయడ సెయడ సెయడ... ని జల్సా సెయడ సెయడ సెయడ..." పాటను ఘంటసాలగారు పాడారు. సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతంలో వచ్చిన ఆ సినీమా పాటలన్నీ చాలా జనాదరణ పొందాయి. సినిమాలో భానుమతిగారి పాటలే ఎక్కువ. ఆ సినీమాను తెలుగులో కూడా డబ్ చేసారు. ఆ సినీమాను ఒక పధ్నాలుగేళ్ళ తర్వాత తెలుగులో తీయ సంకల్పించారు రామబ్రహ్మంగారు. విఠలాచార్యగారు, మాటల రచయిత డి.వి.నరసరాజుగారు కలసి తెలుగు సినిమా ట్రీట్మెంట్ ను కొంత మార్చారు. ఒరిజినల్ కథలో ఆలీబాబాకు, ఆ నలభై దొంగలకు ఏ సంబంధము లేదు. కాని తెలుగులో మాత్రం ఆ బందిపోటు దొంగల గుంపు వల్లే ఆలీబాబా తండ్రి చనిపోవడం లాటి ఫ్లాష్ బ్యాక్ ను సృష్టించారు. కామెడీ ట్రాక్ మార్చారు. 1969 సినీమా నాటికి దొంగల చేతికి తుపాకులు వచ్చాయి. అవి పాత సినిమా లో కనపడవు. ఆలీబాబా 40 దొంగలు లో వినోదానికి కొదవలేదు. అందువల్ల పాటలకు కొదవలేదు. సోలోలు, డ్యూయెట్లు, డాన్స్ పాటలు చాలానే వుంటాయని అనుకోవడం జరిగింది. సంగీతపరంగా మంచి స్కోప్ వున్న సినీమా. పాటల ట్యూన్స్ విషయంలో ఏ విధమైన జోక్యం లేకుండా స్వేఛ్ఛగా పనిచేసుకునే వాతావరణాన్ని ఘంటసాలవారికి రామబ్రహ్మంగారు కల్పించడంతో ఘంటసాలగారు మనసుపెట్టి ఈ సినీమాకు పనిచేశారు. 

అప్పుడే వర్ధమాన గాయకుడిగా అందరి దృష్టిలో పడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనే నూతన గాయకుడిచేత ఘంటసాలవారు తనసంగీత దర్శకత్వంలోని ఈ సినీమాలో  రెండు పాటలు పాడే అవకాశం కల్పించారు. 

ఈ సినీమాలో హీరోయిన్ కు ఒక రొమాంటిక్ సోలో. ఎవరిచేత పాడించాలనే విషయం చర్చకు వచ్చింది. సాధారణంగా జయలలిత పాటలకు  సుశీలగారినే ఎన్నుకుంటారు. కానీ ఈ పాటను ఆ సినిమా హీరోయిన్ జయలలిత చేతే పాడించాలని నిర్ణయించారు. జయలలిత  గాయని కాదు.  నటి, నర్తకి మాత్రమే. కానీ సంగీతం మీద ఆసక్తి, పాడాలనే ఉత్సాహం గల నటి. శ్రావ్యమైన కంఠం. అది చూసి ఎమ్.జి.ఆర్ ముందుగా తన సొంత చిత్రం ' అడిమై పెణ్' లో జయలలిత చేత ఒక సోలో కె.వి.మహాదేవన్ సంగీతంలో పాడించారు. ఆ పాట ('అమ్మా ఎన్డ్రాల్ అన్బు)  అందరికీ నచ్ఛింది. అలాగే, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  తమిళంలో పాడగా రిలీజైన మొదటి సినీమా కూడా ఈ అడిమై పెణ్ సినీమానే. ఇందులో  హీరో ఎమ్.జి.ఆర్ కు పాడే అవకాశం రావడం అతనికి దక్కిన గొప్ప అదృష్టం.

గాయని కాని గాయని చేత పాడించాలంటే సంగీతదర్శకుడు కొంత కసరత్ చేయాలి. పాత గాయనీమణుల శక్తి సామర్ధ్యాలు అందరికీ తెలిసినవే కావడం వలన పాట ఎలా కంపోజ్ చేసినా ఇబ్బందిలేదు. కావలసిన ఎఫెక్ట్ రాబట్టుకోవచ్చును. అదే నూతన గాయకులైతే వారు ఏ శ్రుతులలో పాడగలరు, ఎంత స్థాయి వరకు గొంతు పెగులుతుంది, గమకాలు ఎంతవరకు పాడగలరు, భాష ఉచ్చారణ, భావ ప్రకటన  వంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని  వారి స్థాయికి తగ్గ రీతిలో పాటకు వరస కూర్చవలసి వస్తుంది. అక్కడ సంగీత దర్శకుడు తన సంగీత ప్రతిభను చాటకూడదు. విజ్ఞతను చూపించాలి. లేకపోతే పాట అభాసుపాలు అవుతుంది.

ఏ సన్నివేశానికి ఏ రకమైన రాగాలు అనువుగా వుంటాయి, పాటలో ఎన్ని చరణాలుండాలి, పాటను బట్టి ఎలాటి బిజిఎమ్స్ వేయాలి, పాటకు ఎంత ఆర్కెస్ట్రాను పెట్టాలి అనే విషయాలన్నిటిమీద సంగీత దర్శకుడిగా ఘంటసాలవారికి నిర్దిష్టమైన అభిప్రాయాలే వుండేవి. అవసరమున్నా లేకపోయినా హెవీ ఆర్కెస్ట్రాను ఉపయోగించడానికి సుతారము ఘంటసాలగారు ఇష్టపడేవారు కాదు. పాట అందరు పాడుకోవడానికి వీలుగా పదాలు సులభంగా అర్ధం అయేలా, క్యాచీగా వుండాలి. అందుకే తన పాటలలో పల్లవి తర్వాత వచ్చే చరణాలు రెండైనా, మూడైనా ఒకే వరసలోనే చేసేవారు. చరణం చరణానికి ట్యూన్ మార్చుకుంటూ పోతే ఆ పాట  శ్రోతల హృదయాలలో నిలవదనేది వారి అభిప్రాయం. రాగమాలిక పాటలు వేరు. అదే నృత్యప్రధాన గీతమైతే డాన్స్ డైరెక్టర్ ను కూడా పక్కన పెట్టుకొని వారి సూచనలు తీసుకొని గతులను, జతులను సమకూర్చేవారు. 

జయలలితకు తెలుగులో ఇదే మొదటిపాట. హీరో హీరోయిన్ లను మంచి చేసుకుంటే (ఇచ్చే భారీ పారితోషికాలు ఎలాగూ తప్పవు) తమ సినిమా షూటింగ్ లు ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న ప్రకారం ముగిసిపోతాయని నిర్మాతల అల్ప ఆశ. అందుకోసం వాళ్ళలో వుండే అదనపు అర్హతలు కనిపెట్టి బయటపెట్టడానికి తాపత్రయపడుతూ వుంటారు. స్టార్ ఇమేజ్ గలవాళ్ళు ఏం చేసినా అదో గొప్ప చరిత్ర అని భావించే వీరాభిమానులున్నంత వరకూ ఎవరేంజేసినా చెల్లుతుంది.

జయలలిత విషయంలో అలాటి అపప్రధ రాకుండా వుండేలా ఘంటసాల మాస్టారు ఆలీబాబా 40 దొంగలు సినీమా లో ఒక పాటను స్వరపర్చారు. ఆ పాటను  సరళమైన చిన్న చిన్న మాటలతో దాశరధి వ్రాసారు. మాస్టారు కూడా గాయని ఎక్కువ కష్టపడకుండా వుండేలా సున్నితంగా, శ్రావ్యంగా బృందావన సారంగ స్వరాలను ఉపయోగించి ఈ పాటను స్వరపర్చారు. ఘంటసాల మాస్టారు చేసినపాట నిర్మాత, దర్శకుడు అందరికీ నచ్చింది. ఇప్పుడా పాట రికార్డింగ్ చేయడానికి ముందు హీరోయిన్ జయలలితకు నేర్పాలి. ఆ తర్వాతే రికార్డింగ్. నిర్మాత హీరోయిన్ ను సంప్రదించి పాట రిహార్సల్స్ చేయడానికి  ఓ రెండు రోజుల పాటు సమయం సంపాయించారు. ఉదయం ఆరు నుండి ఏడు గంటలవరకు రిహార్సల్స్. ఆ తరువాత ఆవిడ మేకప్ చేసుకొని తొమ్మిదికల్లా షూటింగ్ స్పాట్ లో వుండాలి. రాత్రి తొమ్మిది దాటాకే ఇంటికి రావడం. అప్పుడు అసలు కుదరదు. జయలలిత ఇంట్లోనే రిహార్సల్స్. ఘంటసాల మాస్టారే ఆవిడ ఇంటికి వెళ్ళి పాట నేర్పాలి. ఆ విషయంలో మాస్టారికేమీ పట్టింపులేదు. తాను చేసిన పాట బాగా రావాలి, అంతే. ఆవిడ నివాసం గౌతమీ పిక్చర్స్ ఆఫీస్ కు దగ్గరలోనే రాజా స్ట్రీట్ లో. అనుకున్నట్లుగానే ఒక రోజు ఉదయం ఆరింటికల్లా మాస్టారు, మా నాన్నగారు (సంగీతరావుగారు) హార్మోనియంతో, జడ్సన్ తబలాతో, వారితో పాటు నేను కూడా జయలలిత ఇంటికి చేరుకున్నాము. ఎవరో మమ్మల్ని చూసి లోపల హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఇల్లంతా నిర్మానుష్యంగా, నిశబ్దంగా వుంది. కొంతసేపటికి సంధ్యగారు వచ్చి మాస్టారిని పలకరించి అమ్ము (జయలలిత  ముద్దు పేరు) ఇప్పుడే వచ్చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఓ పది నిముషాల తర్వాత మెల్లగా సుకుమారంగా మేడ మెట్లు దిగి జయలలిత మేమున్న చోటికి వచ్చి అందరికి ఓ నమస్కారం అందజేసింది. కొన్ని మామూలు మాటలు అయ్యాక మాస్టారు, వాద్యబృందం సహకారంతో ఆవిడకు 'చల్ల చల్లనీ వెన్నెలాయే, మల్లెపూల పానుపాయే' పాటను  ఓ రెండుసార్లు పాడి వినిపించారు. జయలలిత మంచి జ్ఞానస్తురాలే. ఎక్కువ సమయం తీసుకోకుండానే పాటను నేర్చుకుంది. తానూ పాడి వినిపించింది. సన్నటి శ్రావ్యమైన గాత్రం. అవేళకు రిహార్సల్స్ ముగిసాయి. ఆ మర్నాడు కూడా మరోసారి రిహార్సల్స్ చూస్తే రికార్డింగ్ పెట్టుకోవచ్చని చెప్పిందావిడ. ఆ మర్నాడు ఉదయం జరిగిన రిహార్సల్స్ కు నేను వెళ్ళలేదు. తర్వాత ఒక రోజు విజయాగార్డెన్స్ థియేటర్ లో 2 to 9 కాల్షీట్ లో రికార్డింగ్ ఫిక్స్ చేసారు. ఈ పాటకు వైలిన్స్, గిటార్, మేండలిన్, పియోనో, ప్లూట్, క్లారినెట్, డబుల్ బేస్, తబలా, డోలక్, రెండు హార్మోనియంలు (రెండో హార్మోనియం హుసేన్ రెడ్డిగారు) ఇతర రిథిమ్స్ మొత్తం అంతా ఒక పదిహేను మంది ఆర్కెస్ట్రాను ఉపయోగించిన గుర్తు.   హీరోయిన్ జయలలిత పాడుతున్న పాట అనగానే ఈ పాట రికార్డింగ్ కు ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, డాన్స్ డైరక్టర్, అసిస్టెంట్లుతో పాటు నాలాటివారు కూడా చాలా మందే హాజరయ్యారు. ఆర్కెస్ట్రాతో ఓ రెండు మానిటర్లు చూసాక సింగర్ వాయిస్ తో ఒక రిహార్సల్ చూశారు. ఘంటసాలమాస్టారు సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ పక్కనే కూర్చోని జయలలితకు, ఆర్కెస్ట్రావారికి తగిన సూచనలిచ్చాక ఫైనల్ టేక్ కు అంతా రెడీ అయ్యారు. అప్పుడు జయలలిత తన రూమ్ లోనుండి ఘంటసాల మాస్టారు వున్న రూముకు వచ్చి మొదటిసారిగా తెలుగులో మీ డైరక్షన్ లో పాడుతున్నాను. బాగా పాడాలని ఆశీర్వదించండి అని  వంగి ఘంటసాల మాస్టారి కాళ్ళకు నమస్కారం చేసింది.  అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అది ఒక ఉత్తమ కళాకారుడి సంస్కారం. వినయ విధేయతలు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ పెద్దలను గౌరవించడమనే సంస్కారం అందరిలో అలవడాలి. ఆ తరువాత ఓ రెండు మూడు టేకులలో పాట OK చేసారు.  జయలలిత ఆలీబాబా 40 దొంగలు సినీమా కోసం పాడిన తొలి తెలుగు గీతం రికార్డింగ్  తృప్తికరంగా ముగిసింది. 


చల్లచల్లనీ వెన్నెలాయే

 🌿💐🌿


1969 లో తిరుమల-తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడిగా ఘంటసాలవారిని కరుణించిన వేంకటేశ్వరస్వామి 1970లో మరోసారి మరోలా ఆశీర్వదించాడు. 

తన సంగీతం ద్వారా 25 సంవత్సరాల పాటు చలనచిత్రసీమకు, సమాజానికి, దేశానికి ఇతోధికంగా చేసిన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం ఘంటసాల వారికి ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' బిరుదును ఇచ్చి గౌరవించింది. 1970 ప్రారంభంలో ఢిల్లీలో ఆనాటి రాష్ట్రపతి గౌరవనీయులు వి.వి.గిరిగారి చేతులమీదుగా ఘంటసాలవారు  'పద్మశ్రీ' అవార్డు ను అందుకున్నారు.
 
పద్మ అవార్డ్ ను పొందిన తొలి తెలుగు సినీమా గాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది తెలుగు సంగీతాభిమానుల ప్రశంసలను, ఆశీస్సులను, ప్రేమాభిమానాలను తన సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ వచ్చిన శుభతరుణంలో ఘంటసాల రజతోత్సవ నిర్వహణా కార్యకర్తలలో మరింత నూతనోత్సాహం పుంజుకుంది.

ఆ రజతోత్సవ విశేషాలన్నీ వచ్చేవారం...
                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

5 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి చాలా ఓపికగా వివరిస్తున్నందుకు

సంబటూరి వెంకట మహేష్ బాబు said...

ఆలీబాబా నలభై దొంగలు సినిమా విశేషాలను కళ్ళకు కట్టినట్లు ఎంతో ఓపికగా ఆసక్తిదాయకంగా వివరించారు స్వరాట్ బాబాయ్ గారూ....
అద్భుతమైన మీ రచనా శైలి చాలా చాలా బాగుంది.... ఇంత చక్కగా అలనాటి విశేషాలను ఎంతో శ్రమకోర్చి మాతో పంచుకుంటున్నందుకు మీకు హార్ధిక శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ ����������������������

P P Swarat said...

మీ అభినందనలకు ధన్యవాదాలు.

Patrayani Prasad said...

��
శ్రీ స్వరాట్ అన్నయ్యకు ����, ఈ భాగంలో నీవు వివరించిన విషయాలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. వివరంగా అన్ని విషయాలను క్రోడీకరించి, సులభ శైలిలో వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
వచ్చే సంచికలో శ్రీ ఘంటసాల మాస్టారి, రజతోత్సవ విశేషాలు ఉండబోతున్నాయని తెలిసి అత్యంత ఉత్సుకతో, మేమంతా ఎదురు చూస్తున్నాము.-
పట్రాయని ప్రసాద్ , గురుగ్రామం, హర్యానా రాష్ట్రము. తేదీ:25-10-2021, సోమవారం. ��

Patrayani Prasad said...

🕉
శ్రీ స్వరాట్ అన్నయ్యకు 🙏🙏, ఈ భాగంలో నీవు వివరించిన విషయాలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. వివరంగా అన్ని విషయాలను క్రోడీకరించి, సులభ శైలిలో వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
వచ్చే సంచికలో శ్రీ ఘంటసాల మాస్టారి, రజతోత్సవ విశేషాలు ఉండబోతున్నాయని తెలిసి అత్యంత ఉత్సుకతో, మేమంతా ఎదురు చూస్తున్నాము.-
పట్రాయని ప్రసాద్ , గురుగ్రామం, హర్యానా రాష్ట్రము. తేదీ:25-10-2021, సోమవారం. 🔯