visitors

Sunday, December 5, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైయవ భాగం

05.12.2021 - ఆదివారం భాగం - 60*:
అధ్యాయం 2  భాగం 59 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'గాన గంధర్వుడు' శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి జయంతి సందర్భంగా అశేషాభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.🔔🌷🌿💐🔔🌺🌿🙏

జగపతి పిక్చర్స్ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ గారు ఘంటసాలవారికి సన్నిహిత మిత్రులు. ఘంటసాల మాస్టారిపట్ల చాలా గౌరవ మర్యాదలు చూపేవారు. కళాకారులకు చాలా ప్రామ్ట్ గా పారితోషకాలు చెల్లించడం విషయంలో ఎప్పుడూ ప్రధమంగా వుండే ఉత్తమ నిర్మాత. మంచి సహృదయుడు. ఘంటసాల మాస్టారి అవసరాలను డిమాండ్ ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పారితోషకాలను పెంచడంలో ఇతర నిర్మాతల కంటే ముందంజలో వుండేవారని చెపుతారు. రాజేంద్రప్రసాద్ గారు చిత్రనిర్మాణం చేపట్టి  మద్రాసులో అడుగుపెట్టేనాటికి ఆయనకు ఆ రంగంలో పెద్ద అనుభవంలేదు. తన మొదటి చిత్రాన్ని ఎవరైనా భాగస్వాములతో కలసి నిర్మించే యోచనలో వున్నారు. ఆ క్రమంలో రాజేంద్రప్రసాద్ గారు ఘంటసాలవారిని కలుసుకొని తనతో భాగస్వామి గా  చేరమని వరసగా చిత్రనిర్మాణం చేపడదామని కోరారు. అప్పటికి ఘంటసాలవారి సొంతచిత్రం ' భక్త రఘునాధ్' నిర్మాణంలో వుంది. అప్పటికే రెండు సినీమాల అపజయంతో అప్పుల్లో మునిగితేలుతూవున్న సమయంలో ఏ అనుభవం లేని కొత్త యువకుడిని భాగస్వామిగా చేసుకొనే విషయంలో ఘంటసాలవారు వెనుకంజ వేసారు. ధైర్యంచేసి ముందుకు వెళ్ళలేకపోయారు. నిర్మాతగా రాశిలేని తనతో మరొక కొత్త నిర్మాత చేరడం ఆ వ్యక్తికి అంత శ్రేయస్కరం కాదని భావించి అదే విషయాన్ని సున్నితంగా రాజేంద్రప్రసాద్ గారికి నచ్చచెప్పి గాయకుడిగా తన పరిపూర్ణ సహకారం ఎప్పటికి వుంటుందని భరోసా ఇచ్చారట (ఈ విషయాలన్నీ  మాస్టారి సోదరుడు,  జి.వి.ఎస్.ప్రొడక్షన్స్ నిర్మాత ఘంటసాల సదాశివుడుగారు చెప్పినవి).

తర్వాత, రాజేంద్రప్రసాద్ గారు మరొకరి  భాగస్వామ్యంలో  1960లో "అన్నపూర్ణ" చిత్రం తీసారు . నిర్మాత వీరమాచనేని, దర్శకుడు వీరమాచనేని కలసి పనిచేసిన మొదటి చిత్రం. అందులో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. మొదటి చిత్రంతోనే చిత్రరంగానికి సంబంధించిన విషయాలన్ని ఆకళింపు చేసుకొని వరసగా 'అ', 'ఆ'లు మొదటి అక్షరంగా వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో అనేక సినీమాలు తీసి నిర్మాతగా ఘన విజయాలు సాధించారు వీరమాచనేని రాజేంద్రప్రసాద్. ఒక పదేళ్ళ తర్వాత  వీరమాచనేని కాంబినేషన్ లో మార్పు చేయవలసిన పరిస్థితి వచ్చింది. 'అ ,ఆ' ల సినిమా లకు బ్రేక్ పడింది. ఈసారి స్వీయ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ 'దసరాబుల్లోడు' సినీమాను రంగులలో తీసారు. ఆ సినిమా లో పాటలన్నీ విపరీత జనాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. జగపతి సినీమాలంటేనే పాటలు ప్రధానంగా జనాకర్షణగా వుంటాయనే పేరు వచ్చింది. వి.బి.రాజేంద్రప్రసాద్ గారి సినిమాలన్నింటిలోనూ ఘంటసాలవారు పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. జగపతికి అక్కినేని, జగ్గయ్య,  కె.వి.మహాదేవన్, ఆత్రేయ, ఘంటసాల, సుశీల కాంబినేషన్ ఒక అమూల్యమైన ఆస్తి. 

వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శక నిర్మాతగా 1971 లో రిలీజైన అక్కినేని బ్లాక్ బస్టర్  'దసరాబుల్లోడు'లో ఘంటసాలవారు ఏడు పాటలు పాడారు. కుర్రకారును వెర్రెక్కించిన పాటలు పాడడంలో కూడా ఘంటసాలే టాప్ అనడానికి ఈ సినీమా పాటలు ఒక నిదర్శనం. 'ఎట్టాగో వున్నాది ఓలమ్మి', 'పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, 'నల్లవాడే అల్లరి పిల్లవాడే', చేతిలో చెయ్యేసి చెప్పు బావా' పాటలు ఈనాటికీ వినిపిస్తూనే వున్నాయి. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో  నిర్మాత గా అంచెలంచెలుగా అగ్రస్థాయికి చేరుకున్న నిర్మాత వీరమాచనేని రాజేంద్రప్రసాద్. 

"ఈయనతో ఘంటసాల మాస్టారు భాగస్వామ్యం చేపట్టివుంటే !!!"... అని మాబోటిగాళ్ళం అనుకోవడమే... వారికి మాత్రం ఎప్పుడూ అలాటి ఆలోచనే వుండేది కాదు.

🔔

నెం. 36, ఉస్మాన్ రోడ్ వెనక వేపు ఇంట్లో వుండే రాజగోపాలన్ మామ మామగారు కాలంచేశాక (అనే గుర్తు) మామా, మామీల కుటుంబం మెయిన్ బిల్డింగ్ లోకి వచ్చేసారు. ముందుభాగం గేట్ ఉస్మాన్ రోడ్ లో వుండగా వెనక భాగం గేటు ఆనందం స్ట్రీట్ లో వుండేది. పేరుకే ఆనందం స్ట్రీట్, అందులోకడుగు పెడితే ఏ ఆనందం ఉండేది కాదు. ఆ వీధి పక్కన రంగరాజపురం చిన్న గేటు (రైల్వేగేటు) దాక విస్తరించి ఉండే గుడెసెవాసులుండే రాజపిళ్ళై తోట్టంలోని పిల్లలకి ఆ వీధి మొదటి వంద మీటర్లూ ఓ ఓపెన్ టాయ్ లెట్. కొంచెం అప్రమత్తంగా లేకుండా కాలేస్తే మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తి కాళ్ళు కడుక్కోవలసి వచ్చేది.  ఆ వీధిలోనే ఏడిద నాగేశ్వరరావుగారు, మాడా వెంకటేశ్వరరావుగారు, కృష్ణంరాజుగారు  చిన్న అద్దె ఇళ్ళలో కాపురముండేవారు. ఆ 36 ఉస్మాన్ రోడ్ మెయిన్ బిల్డింగ్  వెనక భాగం, ఆనంద్ స్ట్రీట్ లో ఉన్న ఇంట్లోకి ఒక తెలుగు కుటుంబం వచ్చింది. అప్పటికే మెయిన్ బిల్డింగ్ మేడ మీద అద్దెకున్న మండా బుచ్చిరామారావుగారికి ట్రాన్సఫర్ కావడంతో వారు మద్రాస్ నుండి వెళ్ళిపోయారు. ఈ వెనకింటికి అద్దెకు వచ్చినవారు కూడా సినీమా నిర్మాతే. భార్య, ఒక కుమార్తెతో ఆ ఇంట్లో వుండేవారు. ఆయన పేరు కోగంటి కుటుంబరావుగారు. ఆయన ఉత్తమచిత్ర బ్యానర్ మీద 'మనసు-మాంగల్యం' అనే సినిమాను అక్కినేని, జమున హీరో హీరోయిన్ లుగా మొదలెట్టారు. కె.ప్రత్యగాత్మ డైరక్టర్. పెండ్యాల గారి సంగీతం. కోగంటివారి అమ్మాయి మా చెల్లెళ్ళ వయసుదే. మా రెండిళ్ళ మధ్య ఒక పిట్టగోడ అడ్డు. పిల్లలంతా ఆ గోడ దూకే రాకపోకలు సాగించేవారు.  ఆ అమ్మాయి తమ సినీమా షూటింగ్ విషయాలు మాస్టారి పిల్లలకు చెప్పేది.  అందరితో స్నేహంగా మసిలేది. వయసుకు చిన్నే అయినా మహా ధైర్యస్తురాలు. 
తర్వాత హిందీ ప్రచార సభ సమీపంలోని భాగీరధీ అమ్మాళ్ స్ట్రీట్ లోని ఒక మేడమీదకు మారిపోయారు. ఆ వీధిలోనే కైకాల సత్యనారాయణ గారి బంగళా కూడా వున్న గుర్తు. ఆ కోగంటి వారి అమ్మాయిని ఓ రెండు దశాబ్దాల తర్వాత నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో వున్నప్పుడు మరల చూసాను. 

'మనసు మాంగల్యం' సినీమాలో  ఘంటసాల మాస్టారి పాటలు నాలుగున్నాయి. రెండు సోలోలు, రెండు డ్యూయెట్లు. 'ఏ శుభ సమయంలో', 'ఎందుకు వచ్చావో...', 'ఆవేశం రావాలి..' పాటలకు పెండ్యాలగారు మంచి వరసలు సమకూర్చారు. 

🌷

1971  ఫిబ్రవరి మూడవ వారంలో ఒక రోజు ఉదయాన్నే బయల్దేరి రాయపురంలో వున్న శ్రీ బి డి రావు గారి కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఆయనే దక్షిణ విభాగపు అధిపతి. ప్రపంచంలో 14 దేశాలలో ఆ కంపెనీ ఫ్యాక్టరీలు, సేల్స్ ఆఫీసులు వున్నాయి. మన దేశంలో నాలుగు ప్రధాన నగరాలలో ఫ్యాక్టరీలు, అనుబంధంగా అనేక ప్రధాన పట్టణాలలో సేల్స్ ఆఫీసులు వుండేవి.  ఆ కంపెనీకీ వెళ్ళేవరకు ఆ కంపెనీ గురించి ఏమీ తెలియదు. ఏ పోస్ట్ కోసం రమ్మన్నారో, ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో, ఏమి అడుగుతారో అంతకన్నా తెలియదు. ఫ్రంటాఫీస్ లో ఒక్కడినే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. ఓ అరగంట తర్వాత ఓ కళ్ళద్దాల ఆయన వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని ఆయన రూమ్ కు దారి చూపాడు. లోపల బి.డి.రావుగారు వున్నారు. ఆయన నన్ను కూర్చోమని చెప్పి నా సర్టిఫికెట్ లు చూసి, "చూడు! మా  చీఫ్ ఎక్కౌంటెంట్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. అతనికి నీ పట్ల నమ్మకం, తృప్తి కలిగితేనే నీకు జునియర్  స్టెనో టైపిస్ట్ ఉద్యోగం. లేకపోతే లేదు. జాగ్రత్తగా చూసుకో! వెళ్ళి చీఫ్ ఎక్కౌంటెంట్ ను కలియమని చెప్పి పంపేసారు. అతని రూమ్ ఎక్కడో తెలియదు. ఎవరో చెపితే అటుప్రక్క వెళ్ళాను. మొదట్లో నన్ను రావుగారి ఛాంబర్ కు పంపిన కళ్ళద్దాలాయనే చీఫ్ ఎక్కౌంటెంట్. ఆయన మళ్ళీ నా సర్టిఫికెట్ లు అన్నీ తిరగేసి  పక్క రూమ్ లో వున్న ఒక టైప్ రైటర్ దగ్గరకు తీసుకుపోయి ఉద్యోగం కావాలని ఇంగ్లీష్ లో ఒక లెటర్ టైప్ చేసి చూపించమని అడిగారు. నేను బి.ఎ. అంటే పాసయ్యాను కానీ ఇంగ్లీష్ లో నా ప్రవేశం అంతంత మాత్రమే. స్పెల్లింగ్ మిస్టేక్స్ అసలు వుండేవి కావు. అంతలా మా బొబ్బిలి హైస్కూలు లో భట్టీయం వేసేవాళ్ళం రాగయుక్తంగా. కాకపోతే ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడంగానీ,  వ్యాకరణం తప్పులు లేకుండా నాలుగు వాక్యాలు వ్రాయడం కానీ తెలిసేది కాదు. ఆ మాటకొస్తే తెలుగు అంతే అనుకోండి. 

మొత్తానికి ఓ అరగంట కష్టపడి టైపింగ్ మిస్టేక్స్ లేకుండా ఒక అప్లికేషను టైప్ చేసి  చూపాను.  అది చూసిన తర్వాత ఆయన ఓ రెండు నీలం రంగు మెమో పాడ్ కాగితాలిచ్చి తాను రాసిన ఒక లెటర్ ను టైప్ చేయమన్నారు. సరేనని మళ్ళీ టైపిస్ట్ రూముకు వెళ్ళాను. అదొక హాలీడే  నోటీస్. ఏ కారణం చేతనో ఆ మర్నాడు ఫ్యాక్టరీ, ఆఫీసులకు సెలవు. అందుకు బదులుగా మరో శనివారం రోజున పనిచేయాలన్నది అందులో సారాంశం. నిజం చెప్పొద్దు.  ఆ నోటీస్ టైప్ చేయాల్సిన పనే లేదు. ఆ దస్తూరీ ముత్యాలకోవ. చాలా అరుదుగా అంత చక్కటి చేవ్రాత చూస్తాము. బొబ్బిలి లో మా టైపింగ్ గురువులు, పెద్దలు భళ్ళమూడి గోపాలరావుగారి రాక్షస సాధనలో ఉత్తరాలు, స్టేట్మెంట్ లు , బ్యాలన్స్ షీట్లు ఇత్యాదులు టైప్ చేయడమంటే నల్లేరుమీది బండే. ఆ రోజు నా అదృష్టం, షార్ట్ హాండ్ లో డిక్టేషన్ తీసుకోమని అడగలేదు. చేతిలో షార్ట్ హాండ్ సర్టిఫికెట్ వున్నా ప్రత్యక్షానుభవంలేదు.

ఆ ఎక్కౌంటెంట్ గారు ఇచ్చిన మెమో నోటీస్ కూడా జాగ్రత్తగా డిస్ప్లే చేసి టైప్ చేసి ఇచ్చాను. నన్ను మళ్ళా ముందరి రిసెప్షన్ రూములో కూర్చోమని చెప్పి నేను టైప్ చేసిన రెండు ఉత్తరాలను పట్టుకొని ఆ చీఫ్ ఎక్కౌంటెంట్ గారు రీజినల్ మేనేజర్ బి.డి.రావుగారి రూములోకి వెళ్ళారు.

ఈ సందర్భంలో   పాత సంగతి  ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. డిగ్రీ చేతికి రాగానే మద్రాసులో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టిన రోజుల్లో రాయలా కార్పరేషన్ లో పని చేసే ఒకాయన ఇంటికి వెళ్ళాను.  ఆ కంపెనీ హాల్డా టైప్ రైటింగ్ మెషిన్లను తయారీ చేసేది.  సైదాపేట దాటి వేలచ్చేరి రోడ్ కు ముందు గిండీలో వుండేది. అది బొబ్బిలి రాజావారి కంపెనీ.  ఆయన బొబ్బిలి రాజావారికి క్యాంప్ సెక్రెటరి. ఆయనను అదే మొదటిసారి చూడడం.  ఇల్లు సౌత్ ఉస్మాన్ రోడ్ చివర సి.ఐ.టి.నగర్ లో వుండేది. వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకోగానే లోపలనున్న ఆయన శ్రీమతిని బయటకు పిల్చి "వీడెవడో తెలుసా ! మా సుందరి కొడుకు. వీళ్ళమ్మ, మా అక్కలు మంచి ఫ్రెండ్స్.  వీళ్ళ తాతే  ఘంటసాలకు సంగీతం నేర్పాడు. వీళ్ళ నాన్న సంగీతరావుగారు. హార్మోనియం మీద అద్భుతంగా పాటలు, పద్యాలు పాడతారు. నేనూ కృష్ణ రాయబారం పద్యాలు పాడతాను అంటూ "చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు" అంటూ నాటకం బాణీలో  ఆరున్నర శ్రుతిలో కయ్ మని వినిపించారు. "నీక్కాకపోతే ఇంకెవడికి వస్తుందిరా ఉద్యోగం. ఒక అప్లికేషను రాసి ఇయ్యి  అని అన్నారు. నేను అప్పటికే మా నరసింగడి సహాయంతో వ్రాసిన ఇంగ్లీష్ అప్లికేషను చేతిలో పెట్టాను. అది చూసిన వెంటనే 'ఏ వెధవరా నీకు ఇంగ్లీష్ నేర్పింది. ఇలా రాస్తే ఎవడు ఉద్యోగం ఇస్తాడు. అంటు నా కాగితం నాకే తిరిగిచ్చారు. అందులోని మొదటి వాక్యం "Being given to understand that there are some vacancies in your esteemed organization (.) I wish to apply for the same...." అని రాసాను. తరవాత తెలిసింది (,) ఉండవలసిన చోట ఫుల్ స్టాప్ పెట్టాను. ఈరోజుల్లోలాగా just a typo అని తేలిగ్గా తీసుకునేవాళ్ళుకారు ఆరోజుల్లో. కరెక్షన్స్ కి అసలు అవకాశం ఇవ్వురు. ఆయన మళ్ళా మరోలా లెటర్ రాయింపించి తీసుకొని, "తప్పకుండా నీకు నేను ఉద్యోగం వేయిస్తానురా! వారానికో పదిరోజులకో ఒకసారి వచ్చి కలుస్తూండు. మేమంతా నీకు కావలసినవాళ్ళమే" అంటూ భుజం తట్టి పంపారు. నిజంగానే వెంటనే ఉద్యోగం వచ్చినంత సంబరం కలిగింది. పదేసి రోజులకు ఒకసారి ఆయన దర్శనం చేసేవాడిని.  అలాగే నెలలు, ఏళ్ళు గడిచిపోయాయి. నాకు కాలం కలసిరాలేదు. మళ్ళా ఈ మధ్య నా పెళ్ళి ఇన్విటేషన్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నన్ను అభినందిస్తూ "బొబ్బిలి రాజావారికి కూడా ఒక ఇన్విటేషన్ పంపు. ఎడ్రస్ ఇస్తాను. ఎవడికోసం వస్తాడు. మీనాన్న చిన్నప్పుడు ఆయన మీద పట్టాభిషేకం ఉత్సవాలు జరిగేప్పుడు హైస్కూలులో పాటలు పాడేడు తెలుసా! మీ నాన్న, మా చిన్నన్న దక్షి క్లాస్మేట్స్. ఆ కృతజ్ఞత మీదైనా రావాలి. నేను వచ్చేలా చేస్తాను." ఇది ఆ వైట్ & వైట్ షార్ట్ మ్యాన్  ధోరణి. ఆయనే మా బొబ్బిలి,  తాతా వెంకట కామేశ్వర శాస్త్రి, ఉరఫ్ కృష్ణశాస్త్రి. సాంస్కృతిక రంగంలో అపర భగీరథశాస్త్రి, సింపిల్ గా టి.వి.కె.శాస్త్రి.

చదువు చెప్పే గురువులంతా శ్రధ్ధగా బాగానే చెపుతారు. తమ శిష్యులంతా వృధ్ధిలోకి రావాలనే ధ్యేయంతోనే వుంటారు. నేర్చుకునేవాళ్ళకి తెలివితేటలు లేకపోతే వాళ్ళేంచేస్తారు. ఎలుగ్గొడ్డు చర్మాన్ని ఎంత వుతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.  కానీ కాలక్రమంలో మనిషి జీవితంలోని వివిధ అనుభవాలు వివిధ రకాల పాఠాలు నేర్పుతాయి. దానితో మనిషి తెల్లగాను (ఉత్తముడిగానూ) మారవచ్చు, లేదా నల్లగానూ (దుర్మార్గుడిగానూ) మారవచ్చు. 

మేనేజర్ గారి రూమ్ లో నుండి మళ్ళీ పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళాను. అక్కడ రావుగారితో పాటు ఇందాకటి చీఫ్ ఎక్కౌంటెంట్, మరో కమర్షియల్ మేనేజర్ ఉన్నారు. ఇప్పుడే కలకత్తా హెడ్ ఆఫీస్ లోని పెర్సనల్ మేనేజర్ తో మాట్లాడాను. "నిన్ను జూనియర్ స్టెనో టైపిస్ట్ గా ఎపాయింట్ చేయడానికి ఒప్పుకున్నారు, ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతావు" అంటూ తన టేబిల్ డ్రాయర్ సొరుగులోని  ఓ చిన్న పంచాంగం చూసి మార్చ్ 1 బాగుంది. మంచి రోజు. రాహుకాలం లేని సమయంగా చూసి రిపోర్ట్ చెయ్యి. సిన్సియర్ గా పనిచేసి వృధ్ధిలోకి రా అని అక్కడి ముగ్గురు అభినందించి పంపారు.

అంతే,  కంపెనీలోని అందరి సహకారంతో, 1971 మార్చ్ 1 నుండి ఓ 28 ఏళ్ళపాటు అదే కంపెనీలో రెవిట్ అయిపోయి, కంపెనీలోని వివిధ శాఖలలో  విశ్వాసంగా పనిచేసి వియ్యారెస్ (vrs) మీద సగౌరవంగా బయటకు వచ్చాను. 

🌿

విదేశాలలో తెలుగు పాటకు ప్రాచుర్యం కల్పించాలనేది ఘంటసాలవారి చిరకాల వాంఛ. 1962లోనో 63లోనో ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రముఖుల సమక్షంలో జరిగిన సంగీత కచేరీలో లభించిన ప్రశంసలు, ప్రోత్సాహం చూశాక ఆ కోరిక మరింత బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా తన పేరిట లలిత సంగీత కళాశాలలు నెలకొల్పి అన్ని విద్యలలాగే నిర్దిష్టమైన పధ్ధతిలో శాస్త్రీయ సంగీతానికి వున్నట్లే లలిత సంగీతానికి సిలబస్ లు తయారుచేయించి సంగీత శిక్షణలు ఇవ్వాలనేది మరో కోరిక. కానీ, తనకున్న నిరంతర కార్యకలాపాల ఒత్తిడిలో తన ఆశయాలు నెరవేరడంలో జాప్యం కలిగింది. రాష్ట్ర రాజధానిలో తన సినీజీవిత రజతోత్సవ వేడుకల అనంతరం  ప్రపంచం నలుమూలలనుండి అభిమానుల ప్రోత్సాహంతో  అక్కడి తెలుగువారు అందజేస్తామన్న సహాయ సహకారాల బలంతో సాధ్యమైనంత త్వరలో విదేశాలలో సంగీత యాత్ర చేపట్టాలనే దృఢనిశ్చయానికి వచ్చారు. ఆ దిశగా ప్రముఖుల సలహా సంప్రదింపులతో కేంద్రస్థాయిలో ప్రయత్నాలు మొదలెట్టారు. అవి సఫలీకృతమవుతాయనే నమ్మకమూ వారిలో బలంగా కలిగింది.  ఈలోగా ఏ నిర్మాతకు తన వలన ఇబ్బంది కలగకుండా తాను పాడవలసిన పాటలను త్వర త్వరగా పాడి ముగించడానికి మాస్టారు నిశ్చయించారు. 

🌷

నాది రంగేళీరాజా స్వభావం కాకపోయినా ఈ కొత్తరకం జీవితంలోకి అడుగుపెట్టాక అదనపు బరువు భాధ్యతలు పెరిగి స్వేఛ్ఛ తగ్గింది. ఆఫీసుకు వెళ్ళిరావడంలోనే 13 గంటలు గడిచిపోయేది. నెం.35, ఉస్మాన్ రోడ్ లో జరిగే కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశం కరువయింది. అలాటి సమయంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన  100 వ చిత్రం ( ఒక లెక్క ప్రకారం)  'రంగేళీరాజా' సినీమా ప్రివ్యూ చూడడం జరిగింది. రాజ్యం పిక్చర్స్ కు ఘంటసాలవారు సంగీతం నిర్వహించిన మూడవ సినిమా. శకుంతల, గోవులగోపన్న తర్వాత వచ్చిన చిత్రం. మాస్ మసాల సినీమా. ఉన్న ఆరు పాటల్లో నాలుగింటిని మాస్టారే పాడారు. 'విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా', 'డార్లింగ్ డార్లింగ్ కమాన్', 'ఇలాటి రోజు మళ్ళి రానేరాదు', మాస్టారూ సంగీతం మాస్టారు' పాటలు వీనులవిందుగా ఉన్నా సినిమా పెద్ద విజయం సాధించలేదు. 
అదే సంవత్సరంలో ఘంటసాల మాస్టారు మంచి మంచి పాటలు పాడిన చిత్రాలు మరెన్నో వచ్చాయి. రాజకోట రహస్యం, జీవితచక్రం, ఆనందనిలయం, శ్రీమంతుడు, ప్రేమనగర్, రామాలయం, శ్రీకృష్ణ సత్య మొదలైనవి.

ఈ చిత్రాల పాటల విశేషాలన్నీ వచ్చే వారం...

               ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


6 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి. చాలా ఓపికగా వివరిస్తున్నారు

P P Swarat said...

Thank you, sir.

Voleti Srinivasa Bhanu said...

చక్కని శైలి.సినిమా ప్రముఖుల సంగతి సరేసరి, భళ్ళమూడి గోపాలరావు గారి ప్రస్థావన రాగానే బొబ్బిలి అగ్రహారం వీథి కి తీసుకుపోయేరు.

ameerjan said...

“ఈయనతో ఘంటసాల మాస్టారు భాగస్వామ్యం చేపట్టివుంటే !!!"... అని మాబోటిగాళ్ళం అనుకోవడమే... వారికి మాత్రం ఎప్పుడూ అలాటి ఆలోచనే వుండేది కాదు.

ఔను…మాబోంట్లకూ అంతే! వారికివి చాల చిన్న విషయాలై వుంటాయి!

మీ ఉద్యోగ విశేషాలు, టి.వి.కె. శాస్త్రి గారి వివరాలు కూడ ఆసక్తికరంగా వున్నాయి. రంగేళి రాజా వివరాలు కూడ!

టైపింగ్ శిక్షణ ఆరోజుల్లో అత్యంత అవసరమన్నది మీ పోస్టు ద్వారా ఈ తరం వాళ్ళకూ బాగా అర్థమై వుంటుంది. టిపో అంటూ ఊరకే వదలి వేసే రోజులు కావవి. ఇంగ్లీషు వాక్య నిర్మాణం, speed and accuracy కే ప్రాధాన్యత!

అన్నట్లు నాకు టైపు రాకున్నా…బ్యాంకు ఉద్యోగంలో చేరిన తరువాత…మరీ ఆఫీసర్ ఐన తరువాత అవసరం సింగిల్ ఫింగర్ టైపింగ్ నేర్పింది. అలవాటు స్పీడు నేర్పింది!😄😄

మంచి ఆసక్తి గొలిపే మీ పోస్టులు చదివి మేము “ గుర్తుకొస్తున్నాయి” టైపు లో ఆనంగిస్తూంటాం! అభినందనలు..ధన్యవాదాలు స్వరాట్ సర్! 💐💐🙏🙏

సంబటూరి వెంకట మహేష్ బాబు said...

మీ జ్ఞాపకాల దొంతర నుండి తీసిన మరో చకచక్కని సంచిక.....

జగపతి సంస్థ అధినేత వీరమాచినేని బాబూ రాజేంద్రప్రసాద్ గారి గురించి.....

మీ ఉద్యోగ జీవితానికి బాట వేసిన టైపింగ్ టెస్ట్ విశేషాల గురించి....

టి వి కె శాస్త్రి గారి గురించి.....

ఇంకా మధ్య మధ్యలో యాభై వసంతాల క్రితం మీ జీవితంలో తారసపడిన ఎందరెందరో వ్యక్తుల గురించి ఇంత extreme minute details కూడా ఎంచక్కగా గుర్తు పెట్టుకుని మా కళ్ళ ముందు నిలిపారు అందరినీ 👏👏👏👏👏.....

మీ జ్ఞాపక శక్తికి ఎప్పటిలాగే బోలెడన్ని ఆశ్చర్యచకిత అభినందనలతో.... ఇంత ఓపికగా మీ జ్ఞాపకాలను మాతో పంచుకుంటున్నందుకు మీకు హార్ధిక శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ..... వచ్చే సంచిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాము 😊🙏🙏😊💐💐😊

Hrishikesh said...

బాగున్నాయి నేటి విశేషాలు.👌👌🙏🙏