visitors

Sunday, December 26, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైమూడవ భాగం

26.12.2021 - ఆదివారం భాగం - 63*:
అధ్యాయం 2 భాగం 62 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
అక్టోబర్ 6 నాకు వ్యక్తిగతంగా ఆనందకరమైన రోజైతే, అక్టోబర్  7 1971, 35, ఉస్మాన్ రోడ్ లో వున్నవారందరికీ మహదానందకరమైన రోజు. ఆనాడు ఆ ఇంట పండగ వాతావరణం చోటుచేసుకుంది. 

మొదటిసారిగా మా నాన్నగారు, ఘంటసాలవారు విదేశాలకు వెళుతున్న సందర్భంలో విమానాశ్రయానికి వెళ్ళి అందరితోపాటు వీడ్కోలు చెప్పాలనే కోరిక అందరితోపాటు నాకు వుండడం సహజమే. అందుకోసం చాలా రోజుల ముందునుండి ప్లాన్ చేస్తూనే వున్నాను. నేను పని చేసేది దొరల కంపెనీ. నేను ఆ కంపెనీలో చేరే నాటికి నా అదృష్టం దొరలెవ్వరూ మద్రాస్ ఫ్యాక్టరీ/ఆఫీసులో అధికారులుగా లేరు. కలకత్తా హెడ్ ఆఫీస్ లో ఎమ్.డి.గా ఒక దొర వుండేవారు.  అయినా కంపెనీలో 52 శాతం షేర్లు ఇండియన్స్ వి. 48 శాతం యూరోపియన్స్ వి. కంపెనీ నియమ నిబంధనల మీద ఆధిపత్యం అంతా UK కంపెనీ వారిదే. ఆనాటికి నేను పనిచేస్తున్న కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ టు పొజిషన్లో వుండేది. దీనికి పోటీగా ఇండియాలో నాలుగైదు కంపెనీలున్నా ఈ కంపెనీకీ పెద్ద పోటీ ఇచ్చే స్థాయిలో లేవు. నేను ఆ కంపెనీలో పనిచేసిన 28 ఏళ్ళలో చెప్పుకోదగ్గ స్ట్రైకులు , లాకౌట్లు అంటూ మేమెవ్వరమూ బాధపడలేదు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. మూడేళ్ళకొకసారి  జరిగే యూనియన్ ఎగ్రిమెంట్ సమయాలలో తప్ప. అప్పుడు ఓ వారం పదిరోజులు పాటు హెడ్ ఆఫీస్ నుండి ఇతర బ్రాంచ్ ఫ్యాక్టరీలలోని యూనియన్ లీడర్స్ వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు మంతనాలు సాగించేవారు. లంచ్ టైమ్ లో మేమంతా (యూనియనైజ్డ్ స్టాఫ్) గేట్ల వద్ద నిలబడి తిన్నది అరిగేంతవరకూ "పోరాడతాం! పోరాడతాం! మా కోర్కెలు నెరవేరే వరకు పోరాడతాం! అని అరచి తర్వాత ప్రతి దినం ఆ సమయంలో మా హక్కుగా ఇచ్చే లెమన్ జ్యూస్ తాగేసి ఎవరి పనుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం. ఇదంతా ఒక ఫార్మాలిటీయని అందరికీ తెలుసు. అయినా అదో సరదా వ్యవహారం.

అదృష్టవశాత్తు మా కంపెనీ వ్యవహారాలలో లోకల్ పొలిటికల్ యూనియన్లు తలదూర్చకుండా మా కంపెనీ యూనియన్,  మేనేజ్మెంట్ చాలా జాగురూకతతో వ్యవహరించేది. ఈ మూడేళ్ళ ఎగ్రిమెంట్ జరిగినప్పుడల్లా ఉద్యోగస్తులు 20-30 శాతం వరకు ఆర్ధికంగా బాగుపడేవారు. అయితే ఈ బెనిఫిట్స్ అన్ని నిరంతర ఉద్యోగులకు మాత్రమే. వీరు కాక తాత్కాలిక ఉద్యోగులు నలుగురైదుగురు ఉండేవారు.

ఈ పరిస్థితులలో నాలాటి కొత్త వాడికి ఆఫీస్ లో శెలవు ఇస్తారో లేదో అనే సందేహం వుండేది. అదృష్టవశాత్తూ అప్పటికి ఆ కంపెనీలో నా ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయింది. నన్ను పెర్మనెంట్ ఎంప్లాయిగా కన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్ కూడా చేతికిచ్చారు. దానివలన నాకు ఏడాదికి పదహారు ఫెస్టివల్ హాలిడేస్, పదిరోజులు ఏన్యువల్ లీవులు, ఆరు సిక్ లీవులు, మూడు క్యాజువల్ లీవులు వుండేవి. ఇవికాక శని ఆదివారాలు శెలవులు. వీటికి ప్రిఫిక్స్, సఫిక్స్ లు గా శెలవులు పెట్టుకొని వరసగా వారం పదిరోజులు బయట ఊళ్ళకు తిరిగే అవకాశం వుండేది. వీటన్నిటిని మించి శెలవులు పెడితే లాస్ ఆఫ్ పే. నెలవారీ అదనపు కన్వేయన్స్ లు, ఓవర్ టైమ్ లు వంటివి పోయేవి.  ఉన్న శెలవులు వాడనివారికి క్యాష్ బెనిఫిట్ వుండేది. అయితే ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఆఫీస్ టైమింగ్స్. 8. 35 లోపల మేనేజేరియల్ లెవల్ వారు తప్ప మిగిలిన స్టాఫ్ అంతా విధిగా  కార్డ్ లు పంచ్ చేసిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. 8.45 వరకు నెలలో మూడు రోజులు అనుమతి. అది మీరితే సగం రోజు శెలవు కట్ . దాని వల్ల వచ్చే క్యాష్ బెనిఫిట్ లు కట్. ఈ కట్లు ఏవీ లేకుండా పూర్తి జీతాలకోసం ఇళ్ళ నుండి ఉదయం ఏడు లోపలే బయల్దేరేవాళ్ళు. మరీ ఫ్యాక్టరీ పరిసరాల్లో కాపురం వుండేవాళ్ళు తప్ప. ఫ్యాక్టరీ రాయపురంలో. మేముండేది టి.నగర్. సుమారు 20 కి.మీ. డైరక్ట్ బస్ ఒకే ఒకటి 36A. దానిని నమ్ముకుందుకు లేదు. ప్యారీస్ కార్నర్ వరకు ఒక బస్ . అక్కడనుండి రాయపురం వేపు వెళ్ళే నెం. 1, 6, 8, 36 వంటి బస్సులు పట్టుకొని ఆఫీస్ కు అరకిలో మీటర్ దూరంలో దిగి అక్కడ నుండి ఆఘమేఘాలమీద పరుగులెత్తి ఎలాగో  8.35 లోపల  ఫ్యాక్టరీ గేట్ దగ్గర వుండే క్లాక్ దగ్గర కార్డ్ పంచ్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి గడియారం  8.25 కే ఆగిపోయేది. కాదు, కొందరు యూనియన్ లీడర్ల స్వామిభక్తులు ఆపేసేవారు. ఆ విషయంగా కొన్నాళ్ళు చర్చలు, రాధ్ధాంతం, మీటింగ్ లు అధికార్ల హెచ్చరికలు అదో తమాషా. ఈ బస్ ప్రయాణాలకంటే లోకల్ ట్రైన్ లో కోడంబాక్కం నుండి బీచ్  స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ రాయపురం వెళ్ళే బస్సుల్లో వెళ్ళడం కొంత బాగనిపించింది. అందుకు ఉస్మాన్ రోడ్ నుండి కోడంబాక్కం వరకు సైకిల్ మీద వెళ్ళి అక్కడ స్టాండ్ లో సైకిల్ వుంచి ఎలక్ట్రిక్ ట్రైన్ లో బీచ్ వరకు వెళ్ళేవాడిని బీచ్ స్టేషన్ కు ఎదురుగానే GPO బస్ స్టాప్. ఆ ఫస్ట్ లైన్ బీచ్ లోని భవంతులన్నీ బ్రిటిష్ వారి కాలం నాటివి. అన్నీ ఒకే రకం ఎర్ర రంగులో వుండేవి. స్టేట్ బ్యాంకు, జిపిఓ, కార్నవాలీస్ బిల్డింగ్ , క్లైవ్ బ్యాటరీ అంటూ ఆ రోడ్డంతా రాయపురం రైల్వే స్టేషన్ వరకు పురాతన బ్రిటిష్ సంస్కృతి తో నిండిన భవంతులు వుండేవి. గత పాతిక సంవత్సరాలలో వచ్చిన ఆధునికీకరణతో ఆ పాతకాలం నాగరికతా చిహ్నాలు కూడా కనుమరుగైపోయాయి. ఆ బస్ స్టాప్ లో నిలబడి మా ఆఫీస్ లో నలుగురైదుగురం బస్ ల కోసం ఎదురుతెన్నులు చూస్తూండేవాళ్ళం. ఆ బస్ లు ఏవీ ఖాళీగా వుండేవి కావు. బస్ స్టాప్ లలో ఆగేవీ కావు. ఉదయం, సాయంత్రం మాకది మహా యజ్ఞమే. ఆ సమయాలలో ఆ రోడ్డమ్మటే కార్లలోనో మోటార్ సైకిల్స్ మీద వెళ్ళే మా మేనేజర్లు మమ్మల్ని చూస్తే మమ్మల్ని తమ వాహనాలమీద తీసుకుపోయేవారు. అయితే వారికి 8.35 నిముషాల షరతేమీ లేదు. తొమ్మిది లోపల ఎప్పుడైనా వచ్చేవారు. అందుచేత మాకు ఆఫీసుకు వెళ్ళడం రావడం అనేది ఎప్పుడూ 100 మీటర్ రేస్ గానే వుండేది. 

నాకంటే ముందే లేచి మా ఆవిడ ఆరింటికే ఇల్లు వదలి అంబత్తూర్ కు ముందే వున్న పాడీ లోని బ్రిటానియా కు పరిగెత్తేది. నేను ఏడింటికి ఇల్లు ఒదిలేవాడిని. ఇద్దరం సాయంత్రం ఏడు గంటల ప్రాంతాన ఇల్లు చేరేవాళ్ళం. ఇంత అవస్థ పడుతూ ఒక ఆడపిల్ల ఉద్యోగం కోసం హైరాన పడడం మా నాన్నగారికి , ఘంటసాల మాస్టారికి అంత ఇష్టం వుండేదికాదు.  పెద్దల మాటకు ఎదురు చెప్పలేక మా పెళ్ళైన మూడు మాసాలలోపే, సరియైన రాకపోకల సౌకర్యం లేక మా ఆవిడ ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన బ్రిటానియా కంపెనీ ఉద్యోగానికి తిలోదకాలిచ్చివేసింది.

మా నాన్నగారు ఫారిన్ ట్రిప్ వెడుతున్నారు, సెండాఫ్ కు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలి ఒక రోజు శెలవు కావాలని మూడు రోజులు ముందే లీవ్ అప్లికేషను ఫారమ్ నింపి మా డిపార్ట్మెంట్ హెడ్ వరదరాజన్ కు ఇచ్చాను. చూసిన వెంటనే మారుమాట లేకుండా ఎంతో అందమైన దస్తూరీలో కె.ఆర్. వరదరాజన్ అని సంతకం పెట్టి శెలవు మంజూరు చేసారు. మనిషి చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరించేవారు. ఆ కంపెనీలో ఎప్పుడూ శెలవు సమస్య లేదు. మితిమీరితే అన్నివిధాల నష్టపోయేది ఉద్యోగి మాత్రమే. ఇవన్నీ ఆ ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్లు మీద , ప్రమోషన్లమీద ప్రభావం చూపేవి.

ఇక హాయిగా ఎయిర్ పోర్ట్ కు వెళ్ళవచ్చు. కానీ వెళ్ళడం ఎలా. మాస్టారింటి జనాలతోనే వారి కారు సరిపోతుంది. మా నాన్నగారు మరికొంతమంది కలసి వేరే కారులో వారి సామాన్లతో వెళతారు. వారితో కుదరదు. మీనంబాక్కం వేపు బస్ లు చాలాసేపు పడుతుంది. ఇక వున్న సౌకర్యం ఎలక్ట్రిక్ రైలు మాత్రమే. మా ఇంటిలోనుండి నేను ఒక్కడినే ఎయిర్ పోర్ట్ కు బయల్దేరాను. అప్పటికి, ఇప్పటికీ (అంటే గత ఇరవైఏళ్ళ క్రితం వరకు) నాకు అందుబాటులో వున్నది, నడపడం తెలిసినదీ సైకిల్ మాత్రమే. సెకండ్ హ్యాండ్ లో లభ్యమైన ఆ సైకిల్ నన్ను చాలా ఏళ్ళే మోసింది. (ఆ తర్వాత  కొన్నేళ్ళకు టి.ఐ. సైకిల్ లో పనిచేస్తున్న మా మామగారి కోటాలో కొత్తగా ఒక హెర్క్యులిస్ సైకిల్ కొనడం జరిగింది. అంతవరకే నా వాహనయోగం.)

ఆ సైకిల్ మీదే ఒక వైట్ ప్యాంట్, వైట్ టీ.షర్ట్ (రెడీమేడ్ కాదు,  టైలర్ మేడే) వేసుకొని కోడంబాక్కం వెళ్ళి అక్కడనుండి తాంబరం వెళ్ళే రైలు ఎక్కాను. ఇప్పుడంటే జనసమర్దత విపరీతంగా పెరిగిపోయి రైళ్ళ రాకపోకలు అపసవ్యమైపోయాయి, కానీ, ఆ రోజులలో ప్రతీ ఏడెనిమిది నిముషాలకు ఒక లోకల్ ట్రైన్ ఠంచన్ గా వచ్చేది. అప్పట్లో మద్రాస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలంటే మీనంబాక్కం లోనే దిగవలసి వచ్చేది. ఆనాటికి ఎయిర్ పోర్ట్ కు ఎదురుగా వుండే త్రిశూలం రైల్వే స్టేషన్ లేదు. అలాగే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వేరే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వేరేగా వుండేవి. అప్పట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రోజూ వుండేవి కావు. వాటికోసం బొంబాయి లేదా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చేది. అందువల్లనే ఘంటసాలవారి బృందం కూడా ముందు బెంగుళూరుకు, తర్వాత బొంబాయి కి వెళ్ళి అక్కడనుండి వెస్ట్ జర్మనీ కి ఫ్లైట్ లో వెళ్ళారు వయా బేరూట్ (లెబనాన్). 

నేను మీనంబాక్కం రైల్వేస్టేషన్ లో దిగి అక్కడ నుండి నడుచుకుంటూ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కు చేరాను. నేను చాలా ముందుగానే వచ్చాను కనుక మానాన్నగారితో ఘంటసాలవారి బృందంతో సరదాగా గడపవచ్చని ఊహించాను. కానీ అక్కడి వాతావరణం పూర్తి విరుధ్ధంగా వుంది. ఎయిర్ పోర్ట్ అంతా జన సముద్రంగా వుంది. మావాళ్ళెవరూ కనపడలేదు. ఆ జనంలో మా వాళ్ళ దరిదాపులకు వెళ్ళడమే కష్టమయింది. అక్కడకు వచ్చినవారంతా దక్షిణ భారత చలనచిత్రసీమలోని దిగ్గజాలే. వారందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోయాను. ఒక ప్రక్కగా నిలబడి వచ్చే పోయేవాళ్ళను చూడడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. కొంతసేపటికి ఎవరో బాగా తెలిసినవాళ్ళు కనిపించి మా వాద్యబృందం ఉన్నవేపు చూపించారు. అక్కడే మానాన్నగారు, ఇతర వాద్యబృందం ఉన్నారు. ఒక పక్కన సినీరంగ ప్రముఖులతో మాట్లాడుతూ ఘంటసాల మాస్టారు కనిపించారు. వారి పక్కకు వెళ్ళే అవకాశమేలేదు. అదీకాక, ఆ సమయంలో నాకు ఒక కంటికి ' మద్రాస్ ఐ' (కంజన్క్టివిటిస్) వచ్చి కొంత అవస్థపడుతున్నాను. అది వైరల్ కావడం వలన మరింత చొరవగా అందరిలో కలవడానికి సాహసించలేకపోయాను. మాస్టారికి వీడ్కోలు చెప్పడానికి వచ్చే ప్రముఖులను చూస్తూ ఒక వారగా నిలబడ్డాను. 

నేను మద్రాస్ వచ్చాక విమానాశ్రయానికి రావడం అదే మొదటిసారి. బయట నుండి విమానాలు రావడం పోవడం చాలాసార్లు చూసినా లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు. మా తాతగారి (బాబాయిగారు) (ఘంటసాల సదాశివుడు) SIP క్వార్టర్స్ మేడ మీదనుండి చాలా స్పష్టంగా ఎయిర్ పోర్ట్ రన్ వే దగ్గరగా కనపడేది. సెయింట్ థామస్ మౌంట్ కొండను తాకుతూ క్రిందికి దిగుతున్నట్లు వచ్చే విమానాలను చూస్తూ శని ఆదివారాలలో కాలక్షేపం చేసేవాళ్ళం నేనూ, మాస్టారి పిల్లలూ. ఇప్పుడున్నంత జనారణ్యాలు ఆనాడు లేకపోవడం వలన చల్లటి గాలి రివురివ్వుమని వీచేది. గంటలకొద్ది ఆ పై మేడలమీదే గడిపేవాళ్ళం.

ఇక ఈ రోజు మాస్టారికి వీడ్కోలు పలకడానికి వచ్చిన పెద్దలు, అభిమానులను చూస్తూంటే గాయకుడిగా, వ్యక్తిగా ఘంటసాలవారి ఔన్నత్యం అర్ధమయింది.

తెలుగు సినీమాకు మూలస్థంభాలనదగ్గ ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ నటులు కాంతారావు, రామకృష్ణ, గుమ్మడి, ధూళిపాళ, పద్మనాభం, కెవి చలం, నిర్మాతలు - త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య, రామానాయుడు, రాజేంద్రప్రసాద్, పద్మశ్రీ వెంకటేశ్వర్లు, ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, డి.వి.ఎస్.రాజు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మల్లికార్జున రావు , కె ఎ ప్రభాకర్ , బలరాం , ప్రతిభా శాస్త్రి, దర్శకులలో పి.పుల్లయ్య, కె.విశ్వనాథ్, కె.బాబూరావు, గీత రచయితలు - ఆరుద్ర, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి మాస్టారికి ఘనమైన వీడ్కోలు పలికి అభినందించారు. ఆనాడు అక్కడకు వచ్చిన సినీ సంగీత కుల ప్రముఖులు - కెవిమహాదేవన్ , టి.వి.రాజు, టి.చలపతిరావు, సత్యం, ఎమ్.బి.శ్రీనివాస్, పుహళేంది, ఎ.ఎ.రాజ్, నేపధ్య గాయకులు - టి.ఎమ్.సౌందరరాజన్, పి.బి.శ్రీనివాస్, పి లీల, పి. సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం, మొదలైన సినీ ప్రముఖులు, వందలాది ఘంటసాలవారి అభిమానులు మాస్టారిని పూలమాలలతో ముంచెత్తారు. వారికి వారి బృందానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారి హర్షధ్వానాలతో మద్రాసు విమానాశ్రయం మార్మోగింది. దీనికి ముఖ్యకారణం - దక్షిణాది చలనచిత్ర పరిశ్రమనుండి పదిమంది బృందంతో ఒకే ట్రిప్ లో వివిధ దేశాలలో సినీ, లలిత సంగీత కచ్చేరీలు చేయబోతున్న మొదటి కళాకారుడు మన ఘంటసాల వారే కావడం. ఇది సినీరంగంలో అందరిలో ఆనందాన్ని, ఆసక్తిని రేకెత్తించిన విషయం.


ఇంతమంది సినీరంగ కళాకారుల, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘంటసాల మాస్టారి సంగీతయాత్ర దిగ్విజయంగా ప్రారంభమయింది. ఇక్కడనుండి  రాయబోయే కధనమంతా మా నాన్నగారు, ఘంటసాల మాస్టారు విదేశ యాత్ర ముగించుకు వచ్చిన తర్వాత వారి అనుభవాలను వారి ముఖతా విన్నదీ, దిన వార పత్రికలలో వచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నదీ మాత్రమే.

నిజానికి ఘంటసాల మాస్టారి వీడ్కోలు సందర్భంగా వారితో నాకు కూడా ఒక ఫోటో (of course వారి వెనకాలే అనుకోండి) వుందన్న విషయం నాకు చాలా కాలం వరకు తెలియనే తెలియదు. ఇటీవల ఈ  వాట్సప్ సమూహాలలో ఘంటసాల మాస్టారి అభిమానులు వారి ఫోటోలు విరివిగా పెట్టడం మొదలెట్టాక నేనున్న యీ ఫోటో కూడా బయటకు వచ్చింది. మద్రాసు నుండి బయల్దేరిన ఘంటసాలవారి విమానం బెంగుళూరు చేరింది. విమానాశ్రయంలో కన్నడ చిత్ర ప్రముఖులు, అభిమానులు, పాత్రికేయులు ఘంటసాలవారికి ఆనందంగా వీడ్కోలు పలికారు. 

తరువాత అక్కడినుండి బొంబాయి చేరుకున్నారు. బొంబాయి ఆంధ్రా సాంస్కృతిక సంఘంవారు ఒక్రబ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి ఘంటసాలవారిని పూర్ణకుంభంతో వేదమంత్రాల మధ్య సభాస్థలికి తీసుకువెళ్ళి ఘన స్వాగతం పలికారు. ఘంటసాలవారి సంగీతయాత్ర  జయప్రదం కావాలని ప్రార్ధనలు చేశారు. ఆ సభకు వేలాది అభిమానులు హాజరయి హర్షధ్వానాలు పలికారు. 

" ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గర్వమ్ము "
అని ప్రబోధించిన కవివరేణ్యులు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి మాటలను మననం చేసుకుంటూ మన తెలుగు గాయకుడు ఘంటసాల అక్టోబర్ 8 వ తేదీ తెల్లవారుజామున బొంబాయి ఎయిర్ పోర్ట్ లో ప్రముఖులు ఇచ్చిన వీడ్కోలు అందుకొని తన వాద్య బృందంతో  జర్మనీ వెళ్ళే విమానం ఎక్కారు. 

అక్కడ నుండి మొదలైన వారి మూడు వారాల సంగీత యాత్రా విశేషాలు ....

వచ్చేవారం  'నెం. 35, ఉస్మాన్ రోడ్' లో  చూద్దాము...
                              ...సశేషం

4 comments:

Hrishikesh said...

మీ airport అవస్థలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మాస్టారి మీద అప్పటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ఎంత గౌరవం ఉండేదో తెలుస్తోంది. మంచి వివరణలకు అభినందనలు, ధన్యవాదాలు.

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

Anonymous said...

మాస్టారూ నేను తొండియార్పెట్ లోని రెయినీ హాస్పిటల్ లో 13.2.1955 జన్మించాను.రాయపురంలోని ఎస్.ఎన్.చెట్టి స్ట్రీట్ లోదాదాపు 17పదహేడు సంవత్సరాలు మా పెద్దమ్మ పెదనాన్న గారింట్లో ఉండి చదువు కోవడంజరిగింది.రాయపురంలోని మీరు పనిచేసిన సంస్థ ఏది .బీచ్ రోడ్డు ,ఆనాటి ఆంగ్లేయులు కట్టిన కట్టడాలు వాటిలో తిరిగిన అనుభవం ఇప్పటికీ గుర్తొస్తూఉంటాయి.మళ్లీ మీరు ఆ పాత మధురాతి రోజులను గుర్తు చేసారు. ధన్యవాదాలు మాస్టారూ.

Anonymous said...

కందిండి రమేష్ బాబు, కడప