visitors

Friday, February 20, 2015

శాస్త్రీయ సంగీతంలో సృజనాత్మకత




సాహిత్యాభిలాషి అయినవాడు నన్నయ్య, తిక్కన, పోతన మొదలైన మహకవుల కావ్యాలుషేక్స్పియర్, మిల్టన్ లాంటి మహారచయితల ఇంగ్లీష్ సాహిత్యం చదివిBA, MA పట్టాలు పొందినా, పొందక పోయినా తనదైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సృజనాత్మకమైన రచనలు చేస్తాడు.
చిత్రలేఖనం అధ్యయనం చేసిన విద్యార్ధి గొప్ప గొప్ప చిత్రకారుల పధ్ధతులను నేర్చుకున్నా, తన ప్రత్యేకతను చాటే చిత్రాల ద్వారా తన ప్రతిభ గుర్తింపబడాలని కోరుకుంటాడు.
అలాగే మరే కళలకి సంబంధించిన వారైనా, శిల్పం కానీ ఇంకేదైన తమదైన శైలి ప్రకటించుకనే ప్రయత్నం చేస్తారు.

కాని శాస్త్రీయ సంగీతాన్ని త్యాగయ్య, దీక్షితార్, శ్యామాశాస్త్రి వంటి వారి కృతులు ద్వారా అభ్యాసం చేసి, విద్వాంసులనిపించుకున్న వారు కూడా తమ వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను, సృజనాత్మకతను ప్రదర్శించగలిగే నైపుణ్యాన్ని ఎందువల్ల సాధించలేకుండా ఉన్నారుమనోధర్మం సృజనాత్మకతని ఎంతవరకు పోషిస్తుంది?

ఈ విషయంలో సినిమా సంగీత దర్శకుల కనబరుస్తున్న ప్రతిభ తక్కువదా?

తన తొంభై నాలుగేళ్ళ గతాన్ని విహంగ వీక్షణగా దర్శించి ఈ విషయాలలోని లోతులను అనుభవపూర్వకంగా కల్పిత పాత్రల ద్వారా ఆవిష్కరించిన ఇది పట్రాయని సంగీతరావు గారి 'స్వగతం
ఇది ఆయన కచేరీ ... చదవండి!!

(వారి అనుభవాలు, చరిత్రలో వాటి ప్రాముఖ్యం చదువరులకు మరింత దగ్గరగా తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఫోటోలు, పాటలు సందర్భోచితంగా ఉపయోగించుకున్నాం. ఎటువంటి అభ్యంతరాలున్నా తెలియజేస్తే వెంటనే తొలగిస్తాం)

                                                             కచేరీ

శాస్త్రిగారి కూతురు పెళ్ళిలో శర్మనీ, ప్రసాదునీ కలుసుకోవడం అదృష్టం. వాళ్ళని చూసి అప్పుడే రెండు దశలు దాటింది. ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. శర్మ నా వయసు వాడే కాని, ప్రసాదు మా కన్నా చిన్నవాడు. శర్మ నా classmate కాదు. భారతీతీర్ధ సభలలో ( విజయనగరంలో సాహితీ సభ. స్థాపన 1939 - incorporated as "The Andhra Research University, California, May, 20 1939) కలుసుకునేవాళ్ళం. నేను ప్రతి సభకి ప్రార్ధన చేయడం జరిగేది. శర్మ అప్పటికే పద్యాలు రాస్తూ ఉండేవాడు. శర్మ ఈనాడు దేశానికి బాగా తెలిసిన కవి, రచయతాను.

నాకూ, శర్మకీ ఉన్న స్నేహం, అతని సంగీతం పిచ్చి నా సాహిత్యం వెర్రి మీద ఏర్పడింది. అయితే అతడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. నేను కవిత్వం రాయలేదు. శర్మకి కొన్ని రాగాలు గుండెకి పట్టుకొన్నాయి. అయితే అవి శాస్త్రీయ గమకస్ఫూర్తితో కాదు.  మొన్న శాస్త్రిగారి కూతురు పెళ్ళిలో ఆశీర్వదిస్తూ పద్యాలు రాయలేదు. ఒక పాట పాడేడు. ఆ పాట కల్యాణీ స్వరాలలోనే నడిచింది. ఆ పాటకి ఎంతో చక్కగా అమరింది ఆ సంగీతం. నేనే ఆ పాట పాడితే ఏదో కృతిలా వినిపించేది. ఆ పాటలో వధూవరులను ఆశీర్వదించడమే కాదు, గతం ఎడల కృతజ్ఞత, గౌరవం, వర్తమానం యడల సదవగాహన, రసానుభూతి, భవిష్యత్యడల ఆశ ప్రేమలను కూడా ధ్వనింపజేసేడు. ఆ పాట ఇంకా వినిపిస్తునే ఉంది. ఆ పాట అతని స్వంతమే. అతని వ్యక్తిత్వానికి నిదర్శనమే.

ప్రసాదు చిన్నప్పటినుంచి బొమ్మలు రాసేవాడు. రవివర్మ రాసిన సరస్వతి, లక్ష్మీ మొదలైన చిత్రాలు అలాగే రాసేవాడు సాధనగా. అప్పట్లో త్యాగరాజస్వామి చిత్రం రాసి నా పుట్టినరోజు శుభాకాంక్షలతో యిచ్చాడు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ అతడొక చిత్రం “వసంతరాత్రి”, అని పేరు, బహూకరించాడు. ఆ చిత్రం పూర్తిగా అతని వ్యక్తిగత ప్రతిభనే తెలియజేస్తూ ఉంది. నాటి పెళ్ళివైభవాన్ని నిత్యకల్యాణంగా నిలబెడుతూ ఉంది. ఆ రాత్రి కొంతసేపు నేను పాడవలసిన బాధ్యత ఉంది. మీకు తోచినంతసేపే పాడండి. మీరు వేదికమీద కనపడాలి. అదే నాకు తృప్తి, అన్నారు శాస్త్రిగారు. వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో కూడా జరిగింది నా కచేరి.


ఒక కవిలాగా, ఒక చిత్రకారుడిలాగా "యిది నాదీఅని, గాయకుడిగా ఏమి చెప్పుకోగలనూ అని అనిపించింది. సంగీత విద్వాంసుడు యిది నా స్వంతం అని తన గానంలో మమకారం ఎలా పెంచుకుంటున్నాడుతను గానంచేస్తున్న కృతులు తనవి కావు. త్యాగరాయాది వాగ్గేయకారులవి. కావచ్చు. కాని గానం చేస్తున్నవాడు తను. తన గాత్రవిశిష్ఠత తనదే గదా. అయితే కృతిగానంలో కేవలం కృతిగానమేకాదు, కృతికి ఎంతో మనోధర్మసంగీతం జోడించబడుతూ ఉంది. రాగాలాపన, నెరవల్, స్వరకల్పన, యిదంతా గాయకుడి స్వంతమే కదా. అవును ఈ వ్యక్తిగత ప్రతిభను గుర్తించాలి.

 అయితే ఒక విషయం చెప్పక తప్పదు. రాగానికి కొన్ని లక్షణాలు నిర్ణయించబడ్డాయి. ఆరోహణ, అవరోహణ, గ్రాహన్యాస అంశ మొదలైన పరిధులున్నాయి. ఆ రాగం ఆ లక్షణాలతో పాడాలి. రాగం గమకస్ఫూర్తితో ఉండాలి. ఏ గాయకుడు కూడా ఈ పరిధుల్ని అతిక్రమించకూడదు. అంటే రాగాలాపన అన్నది వ్యక్తిగతమయిన ప్రతిభ మనోధర్మం కాదు.   అది సాముదాయిక మనోధర్మం. ఇక స్వరకల్పన. లయబధ్ధంగా స్వరకల్పన ఆశువుగా గానం చేయడం అన్నమాట. ఈ స్వరకల్పన సాధకులు ఆనందించినంతగా రసికులచేత ఆనందించబడదు. ఈ స్వరకల్పన కూడా కొన్ని పరిధులలోనే జరుగుతుంది. కృతి పాడేటప్పుడు చరణంలో కొంతసేపు ఈ స్వరకల్పన సాగుతుంది. నెరవల్ తరవాత మొదట పావు ఆవృతం, తరవాత అర ఆవృతం, క్రమంగా కొన్ని ఆవృతాలు ఓపిక ఉన్నంత వరకూ పాడవచ్చును. ఈ స్వరకల్పనలో కూడా సర్వలఘువు, అంత్యనియమం, చివరికి ముక్తాయింపుతో పూర్తి. ఈ స్వరకల్పనలో గాత్రజ్ఞుడు, పక్కవాద్య వాయులీన విద్వాంసుల మధ్య పోటీ జరుగుతున్నట్టు సామాన్య శ్రోతకి అనిపిస్తుంది. ఏ పోటీ అయినా ఆనందించే ప్రేక్షకులుంటారు. కానీ గానం రసానుభూతికి చెందినది. సరి, ఈ అవగాహనవల్ల అర్ధం అయినదేమిటి అంటే, గాయకుల మనోధర్మ సంగీతం కూడా చర్వితచర్వణమే.

సంగీత కచేరీ అంతా ఒక అవధాన ప్రక్రియగా అనిపిస్తుంది. సంగీత కచేరీలో ఆశించిన నాదానుభవం, రసానుభవం కన్నా సమస్యాపూరణంలో పొందే సంతోషం కలుగుతుంది. ఏమైనా, సంగీత కచేరీలో తన్మయత్వం పొందిన రసికుడు మరో ప్రక్రియలో ఆసక్తి పొందడు. సంగీతం వినడంలో కలిగే నిషా తన్మయత్వం అతడు మరేవిధమయిన సంగీతంలోనూ పొందలేడు. సంగీత కచేరీలో గాయకుడు ప్రదర్శించిన మనోధర్మ సంగీతంలో కవి కనిపించడు. పౌరాణికుడు కనిపిస్తాడు.
     
ఈనాటి మన సంగీత కచేరీ ఒక మూసలో నడుస్తూ ఉంది. అందరి కచేరీ ఒకటే మూస. ప్రారంభంలో ఒక వర్ణం, తరవాత గణపతి ప్రార్ధన వాతాపి గణపతిం కీర్తన, తరవాత ప్రారంభంలో కొంతసేపు రాగాలాపన, తరవాత కృతి, చరణంలో కొంతసేపు నెరవల్, కొంతసేపు స్వరకల్పన. ఇదే పధ్ధతిలో ఒక పది కీర్తనలు గానం చేసి, రాగం, తానం, పల్లవి మకుటాయమానంగా పాడి, వీలును బట్టి ఒక జావళి, అష్టపది గాయకుడి అభిరుచిని బట్టి దేశభక్తి గీతం. ఏదైనా లలితగీతంలాంటి దాంతో కచేరీ పవమాన సుతుడు పట్టి పాదారవిందములకు మంగళం పాడడం జరుగుతుంది.

సంగీత కచేరీలలో ప్రధానంగా గానం చేయబడుతూ ఉన్నవి కృతులు. కృతులలో కూడా త్యాగరాజస్వామి కృతులు గణనీయంమని చెప్పుకోవచ్చును. ముత్తుస్వామి దీక్షితుల వారి(1775-1835) కృతులు, శ్యామాశాస్త్రిగారి (1762-1827) కృతులు త్యాగరాజస్వామి స్థాయి కీర్తనలుగా భావింపబడినా, వారు రచించిన కృతుల సంఖ్య తక్కువ. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా  భావింపబడినవారు ఈ ముగ్గురే. 

శ్యామాశాస్త్రి (1762-1827)
త్యాగరాజస్వామి (1767-1847)
ముత్తుస్వామి దీక్షితార్ (1775-1835)
   
త్రిమూర్తుల రచనలో ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. త్యాగరాజస్వామి కృతులలో కృతి మూడు భాగములు పల్లవి, అనుపల్లవి, చరణం అనేవి.

సాహిత్యదృష్ట్యానే కాకుండా సంగీతంలో కూడా పల్లవి, అనుపల్లవి, చరణములలో ప్రత్యేకత కనబడుతుంది. అనుపల్లవి అనేది త్యాగయ్యగారి కృతులలో విశిష్టంగా కనిపిస్తుంది. సంగీతపరంగా ఆ అనుపల్లవి సంగీతమే చరణంలో మళ్లా పునరావృతం అవుతుంది.  దీక్షితులవారి కృతులలోనూ, శ్యామాశాస్త్రిగారి కృతులలోను అనుపల్లవి సంగీతం పునరావృతంకాదు. వారి కృతులలో మధ్యమకాల సాహిత్యం కనబడుతుంది.

కృతిరచనలో త్యాగయ్యగారి మార్గం అనుసరించిన యితర వాగ్గేయకారులు చాలామంది ప్రధానంగా పట్నం సబ్రహ్మణ్యయ్యమైసూరు సదాశివరావు, రామానాధపురం శ్రీనివాసయ్యంగారు, వంటి యితర వాగ్గేయకారులందరూ పల్లవి, అనుపల్లవి, చరణం పధ్ధతినే అనుసరించేరు. ఆనయ్య, కోటేశ్వరయ్యరు, మాతృభూతయ్య మొదలైన యితర వాగ్గేయకారుల కృతులు చాలా స్వల్పసంఖ్యలోనే ఉన్నాయి. వాగ్గేయకారుల సాహిత్యం కావ్యసాహిత్యంలాగా పఠించవలసినది కాదు. వినదగ్గది మాత్రమే. 

వాగ్గేయకారులలో  త్యాగరాజస్వామి రచనలలో గుండెకు పట్టుకునే లక్షణం ఉంది. ఆయన కృతుల పల్లవిలోనే ఆయన హృదయం వ్యక్తం అవుతుంది. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రజల హృదయాలలో నిలిచిపోయేయి. (1)శాంతము లేక సౌఖ్యము లేదు, (2)నిధిచాల సుఖమా, రాముని సన్నిధిసేవ సుఖమా, (3)అనురాగములేని మనసున సుజ్ఞానము రాదు, (4)రాగసుధారస పానముచేసి రంజిల్లవే ఓ మనసా, (5)నినువినా నా మదెందు నిలవదే, (6)రామభక్తి సామ్రాజ్యమేమానవులకబ్బునో, (7)అనాధుడనుకాను, అనాధుడవు నీవని నిగమజ్ఞుల మాటవిన్నానులే, (8)అలకలల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో, (9)ఎందరో మహానుభావులు అందరికి వందనములు. త్యాగయ్యగారి కీర్తనల్లో ఎన్నో జనసామాన్యంలో కూడ తమిళనాడులో ప్రచారం అయేయి. 'రమణీసమానమెవరు, సుజనజీవనా, యిత్యాది కీర్తనలు, తెలుగు దేశంలో బమ్మెరపోతన పద్యాలలా, తమిళనాట వ్యాపించాయి. త్యాగరాజస్వామి కవితా హృదయం శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, “త్యాగయ్యగారి నాదసుధారసం” అనే వ్యాసంలో వివరించేరు.  త్యాగయ్యగారి సాహిత్యం గురించి సమర్ధంగా చెప్పగల యోగత్య శర్మగారిది.

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (1893-1979)
కృతులు నేర్చుకొనే ముందు నేర్చుకొనే రచనలు కొన్ని ఉన్నాయి. వర్ణము, స్వరజతి, గీతము, అలంకారములు, జంటవరసలు, సరళీస్వరము. సంగీతశిక్షణ సరళీస్వరాలతో ప్రారంభం అవుతుంది. ఈ సంగీతశిక్షణ విధానం అంతా పురందరదాసుగారి(1484-1564) కాలం నుంచీ ఉంది. సంగీతశిక్షణలో రాగపరిచయం గీతములనుంచి ప్రారంభం అవుతుంది. పరందరదాసుగారి పిళ్ళారిగీతములతో ప్రారంభం అయి సంచారీగీతములు, లక్షణగీతములతో ప్రసిధ్ధరాగపరిచయం చేయబడుతుంది. 
పురందర దాసు (1484-1564)
రాగంయొక్క ప్రామాణికసంచారానికి గీతమే గీటురాయి. గీతంలో ప్రక్షిప్తాలకి అవకాశంలేదు.  సంగీతశిక్షణలో ప్రారంభ సంగీతరచన అంతా కన్నడ భాషలో ఉంది. అందుకే దక్షిణసంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అని పేరు వచ్చిందమో. కర్ణాటక సంగీతం అనే పేరున్నా, సంగీతరచనలు అన్నీ తెలుగులోనే ఉన్నాయి. ప్రారంభ సంగీత రచనలు చాలా కన్నడంలో ఉన్నా, మరెన్నో శాస్త్రీయసంగీత ప్రారంభ గీతారచనలు తెలుగులోనూ ఉన్నాయి.  పైడాల గురుమూర్తిశాస్త్రిగారు వేయి గీతాలు రాసారట. ముత్తుస్వామి దీక్షితులు గారి గీతాలు సంగీత సంప్రదాయప్రదర్శినిలో ఉన్నాయి. ఆనాటి వైణికులను ఎక్కువగా ఆకర్షించినది గీతం. కారణం, ధారావాహికమైన నాదంలేని వీణలో మీటుకు అనుకూలంగా ఉండే స్వరరచన గీతం అవడం. ఆనంగ గజపతి సహాధ్యాయి, వీణా వెంకటరమణయ్యగారిని, "మీరు మైసూరు ఆస్థానంలో ఏమి వాయించేరు?" అంటే, "నేనామీనాక్షి గీతం మూడు కాలాలూ వాయించేనుఅనేవారు, ఆయన వార్దక్యలో, అమాయకంగా. అంటే గీతం కూడా సభాగానంలో ఉండేది అని తెలుసుకోవచ్చును. ఈనాడు సభాగానంలో ప్రధానమైనది కృతి మాత్రమే. పాడితే ప్రారంభంలో ఒక వర్ణం పాడవచ్చు. జావళీ, పదం, అష్టపది లేదా, అరవలు, 'ఏదో ఒరు తుకడాఅని  అంటారు అలాంటి వాటితో పూర్తవుతుంది సభ.

 వాగ్గేయకారులలో సుప్రసిధ్ధ పండితులు -  పచ్చిమిరియం ఆది అప్పయ్య,  వీణకుప్పయ్య, పల్లవిగోపాలయ్య, వడివేలు, పట్నం సుబ్రహ్మణ్యయ్య - వీరంతా వర్ణాలు రచించేరు. వీరివి కృతులు కూడా ఉన్నా వారి ఘనతను నిరూపించేవి వర్ణాలు.

ఈనాడు గీతం, వర్ణం, పదవర్ణం, స్వరజతి, యివన్నీ సంగీతశిక్షణలో మాత్రం ఉపయోగింపబడుతున్నాయి. సంగీత కచేరీలలో గానం చేయబడుతున్న శృంగారరచన జావళీ, సంగీతరచనలో అర్వాచీనమైనదిగా చెప్పుకోవచ్చును. జావాళీ వర్తమానకాలానికి  చెందినది. గీతం, కృతి, కీర్తన భక్తిరస సాహిత్యంతో ఉంటాయి. వర్ణం, స్వరజతులు కొన్ని, పదం, జావళీ శృంగార సాహిత్యంతో ఉంటాయి. జావళీలో ఉండే సాహిత్యం సామాన్య నాయికలకు సంబంధించి ఉంటుంది. జావళీలు కొన్ని అసభ్యంగా ఉన్నా, వాగ్గేయకారులు రచించినది కాబట్టి విద్వాంసులు "చెరగుమాసె ఏమిసేతురాలాంటి అసభ్యరచనలు కూడా భక్తిగా సభలలో గానంచేస్తూ ఉంటారు.
ఈనాడు సంగీత కచేరీలలో వినిపిస్తున్న సంగీతంలో - గాత్ర సంగీతానికి, వాద్యసంగీతానికి తేడాలేదు. కచేరీలలో వినపడే కల్పితసంగీతం, మనోధర్మసంగీతంలో కూడా గాత్ర, వాద్యసంగీతాలకు తేడాలేదు. అయితే ఒక్క విషయం - వాద్యసంగీతంలో మనం పొందేది నాదానుభవం. గాత్రసంగీతంలో మనం పొందగలిగేది నాదానుభవం మాత్రమే కాదు. రసానుభవం కూడా. గాత్రసంగీతం అంటే సంగీత సాహిత్య సమ్మేళనం.
  
భారతీయ సంగీతం హిందూస్తానీ కానివ్వండి, కర్ణాటక సంగీతం కానివ్వండి, గాత్రసంగీతాన్ని లక్ష్యంగా చేసుకొని రచించబడినవే. అయితే గాయకుల గానంలో మాత్రం స్వరలయల మీద ఉండే శ్రధ్ధాసక్తులు రసభావముల యడల కనిపించదు. త్యాగరాజ కీర్తనలు వింటున్నప్పుడు త్యాగయ్యగారి నాదసుధారసం అనుభవించగలుగుతున్నాం. త్యాగయ్యగారి హృదయం మాత్రం తెలియదు.

కర్ణాటక సంగీతంలో దాక్షిణాత్య వాగ్గేయకారుల సంగీతరచనలే ప్రధానంగా వినిపిస్తాయి. సంగీత త్రిమూర్తులు ముగ్గరూ తిరువారూరులో జన్మించినవారే. అయితే దాక్షిణాత్య సంగీత రచనలన్నీ తెలుగుభాష ఆధారంగానే నిలిచాయి. అందుచేత కర్ణాటక సంగీతం అని పిలువబడుతున్నది తెలుగు సంగీతమే.

అయితే ఈ దక్షిణాది తెలుగు కృతులు తెలుగు దేశం చేరడానికి కొంత కాలం పట్టింది, కానీ శాస్త్రీయసంగీతానికి సంపూర్ణ ప్రాతినిధ్యం వహించేయి. అయితే ఆనాటికి తెలుగు దేశంలో గానం చేయబడుతూ ఉన్న సంగీతం స్వరూపం ఎలాంటిదీ?

12వ శతాబ్దంనుంచి అష్టపదులు దేశం అంతా గానం చేయబడుతూన్నట్టుగానే తెలుగు దేశంలో కూడా గానం చేయబడుతూ ఉన్నాయి. అష్టపదులతోపాటు తరంగాలు, స్థానిక సంకీర్తనపరులు తూము నరసింహదాసు(1790-1833 or 1753-1820(?)) వంటి స్థానిక రచయితల భజన సంకీర్తనలు - ఎద్దునెక్కినవాడు లింగడు, బొల్లిగెద్దనెక్కినవాడు రంగడు, కనులకు కనపడవేమి, ఇంత కపటముంచుట నీకు న్యాయమా తండ్రీ - లాంటివి కూడా గానం చేయబడేవి. 

తూము నరసింహదాసు(1790-1833) 
తెలుగు దేశంలో ఆనాటికే ప్రచారంలో ఉన్న సంగీతరీతులు - యక్షగాన సంగీతం, జానపద సంగీతం. జానపద గీతాలు తెలగులో వివిధ రీతులుగా ప్రచారం పొందేయి. త్యాగరాజస్వామి అవతరించకముందున్న (1767కి ముందు) శాస్త్రీయ సంగీత రచనలు గీతాలు, స్వరజతులు, వర్ణములు, జక్కిణ దరువులు, ప్రబంధాలు. ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుగు దేశం గ్రహిస్తూ ఉన్నట్టు నిదర్శనంగా, తెలుగు దేశంలోని సాంస్కృతికంగా అభివృధ్ధిచెందిన పట్టణాలలో అనేక సంగీత కుటుంబాలు (వాసావారు, మొదలైనవి) సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నాయి. త్యాగరాజస్వామి 1847 సిధ్ధిపొందిన తరవాత 1862 ప్రాంతంలో శ్రీ ఆదిభట్ల నారాయణదాసు జననం. అయితే త్యాగరాజస్వామి ఎంతో ప్రాచీనుడు అన్నట్టు భావిస్తాము. త్యాగరాజస్వామి శిష్యపరంపర ఆయన గానం చేసిన కృతులను ఎప్పటికప్పుడు భద్రపరచి స్వరపరచడం అయింది. తరవాత ఆ కృతులు గురుశిష్యపరంపరగా ప్రచారం అయేయి. శాస్త్రీయ సంగీతజ్ఞులలో మొదటి తరం విద్వాంసులు, వారి శిష్యపరంపరనుంచి వచ్చినవారు, సుసర్ల దక్షణామూర్తిశాస్త్రి (1860-1922), పారుపల్లి రామకృష్ణయ్య పంతులు(1883-1951), హరినాగభూషణం(1884-1959), యిత్యాదులు, త్యాగరాజకృతులు గానం చేసినవారు, ఆ కృతులను తెలుగు కీర్తనలనే భావంతో తెలుగు నుడికారంతోనూ, తెలుగు ధ్వనితోనే పాడేవారు. 
                 
                         సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి(1860-1922)
పారుపల్లి రామకృష్ణయ్య పంతులు(1883-1951)
           
తంజావూరు బానీలో తమిళ విద్వాంసుల నుడికారంతో పాడకపోతే అది సంప్రాదాయం కాకపోతుందేమో అనే భావంకావచ్చును, క్రమంగా తెలుగు విద్వాంసులు ఆ కృతులు తెలుగు భాషేనా అని అనిపించే బానీలో పాడడం ప్రారంభించేరు. నిజానికి గమకస్ఫూర్తి అన్నదే శాస్త్రీయ బానీ. తంజావూరు బానీ అన్నది గగనకుసుమం. సుప్రసిధ్ధ తమిళ విద్వాంసులందరిదీ ఒకే బానీ కాదు. వాళ్ళందరిదీ ఎవరి స్వంతబానీ వారిదే. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం యడల తెలుగునాట ప్రజాబాహుళ్యం స్పందన లేకపోడానికి కారణం తంజావూరి బానీ కావచ్చును.


19వ శతాబ్దం ఉత్తరార్ధంలో త్యాగరాజస్వామి కీర్తనలు తెలుగు దేశంలో ప్రచారం పొందినట్టు చెప్పవచ్చును. 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో మరో సంగీత ప్రక్రియ, హరికధ, కూడా తెలుగునాట విరివిగా ప్రజాభిమానం పొందింది. శాస్త్రీయసంగీతానికి ఎదురునిలబడినది హరికధాగానమే. నిజానికి తెలుగునాట శాస్త్రీయసంగీతాన్ని గౌరవించినా, ప్రజలు ఆనందించినది మాత్రం హరికధ. ఆదిభట్ల నారాయణదాసుగారి రుక్మిణీ కల్యాణంలోని "లేజవ్వనంపు పసందు", జానకీ శపధంలోని "వినుమయ్య మాయూరువంటి మట్లు, గుహుడి పాట "రామయ్య తండ్రీజానపద రీతిలో చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గ్రామఫోన్ రికార్డుల వల్ల ప్రజల్లో ప్రచారంలో ఉండేవి. 

రామయతండ్రీ ఓ రామయతండ్రీ-  చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గానం

 మొదలి నాగభూషణ శర్మగారి "తొలినాటి గ్రామఫోన్ గాయకులు" రెండవసంపుటం నుంచి -(శోభనాచల బ్లాగ్ సౌజన్యంతో )                                    

ఈ హరికథాగానం కూడా దేశభక్తి ప్రచారంగా తయారయి స్వాతంత్ర్యసమరం రోజుల్లో కళాదృష్టి స్థాయి పెరగలేదు.
                                                 
అదేవిధంగా 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ప్రజలను వెర్రి ఎత్తించిన మరో సంగీత ప్రక్రియ స్టేజినాటకసంగీతం. ఆ రోజులలో నాటకం పాటలలో సావిత్రి, సక్కుబాయి, తులాభారం మొదలైన నాటకాలలో వినబడిన పాటలు ప్రజల కంఠస్వరాలలో ప్రతిధ్వనించేవి. తెలుగువారి అభిమాన గాయకులు నటులే. ముఖ్యంగా పద్యపఠనం ప్రజలను ఆకర్షించింది. నేటికీ తెలుగు నాటకం పద్యాలు ప్రజాజీవితంలో వినబడతాయి. తెలుగు స్టేజిగాయకులు గానం చేసిన పాటలు మాత్రం మహారాష్ట్ర నాటక సంగీత ప్రభావం పొందాయి. 

గ్రామఫోన్ దేశంలో పరిచయం అయిన తరవాత హిందూస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల సంగీతం రికార్డు అయి దేశం అంతా వ్యాపించేయి.
గ్రామఫోన్(1877) 
 ఆనాటి సుప్రసిధ్ధ విద్వాంసుడు అబ్దుల్ కరీం ఖాన్ (1872-1937) కర్ణాటక హిందుస్తానీ సంగీతాలను సమన్వయం చేయాలని అభిలషించేరు. ఆయన త్యాగరాజస్వామి కీర్తన 'రామ నీ సమాన మెవరుపాడేరు. అది రికార్డు అయింది. అయితే అతని ప్రయత్నం అంత జయప్రదం కాలేదు. ఆయన త్యాగరాజస్వామి కీర్తన సాహిత్యం మాత్రం తీసుకొని హిందుస్తానీ తుమ్రీ రీతిలో పాడేరు. ప్రధానంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలలో తేడా వినగానే చెప్పగలిగేది ఆయా సంగీతాలలో గమకస్ఫూర్తి.
అబ్దుల్ కరీం ఖాన్(1872-1937)
చాలామంది తమిళ గాయకుల పాట రికార్డు అయింది. పాట రికార్డు అయిన తెలుగు సంగీత విద్వాంసులను వేళ్ళమీద లెక్కించవచ్చు.  ఆ రోజుల్లో హరికధలు రికార్డు అయేయి. బవరదాసు, చొప్పల్లి సూర్యనారాయణ భాగవతారు కధలు నేను విన్నాను కూడా.
చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్(1905-1957)
అత్యధికంగా తెలుగు దేశంలో వినపడ్డవి కామిక్ పాటలు. అయితే సంగీత రసికతకి తార్కాణం స్టేజి గాయకుల నాటకం పాటలు, వారు చదివిన నాటకాలలోని పద్యాలు. శాస్త్రీయ సంగీతం రికార్డులలో, 20వ శతాబ్దం పూర్వార్ధంలోకన్నా, ఉత్తరార్ధంలో సాంకేతికంగానూ, గాయకుల గానంలోను ఎంతో అనుభవం కనిపిస్తుంది.

 సంగీత శాస్త్రజ్ఞులు గానాన్ని రెండుగా పేర్కొన్నారు. మార్గ సంగీతం, దేశీ సంగీతం అని. స్వరలయల సంపూర్ణ అవగాహనతో గానం చేసేది మార్గము. సహజమైన ఉత్సాహ, ఉద్రేకములతో గానం చేసేది దేశి సంగీతం. భారత దేశంలో జానపద సంగీతం ఆయా భాషా ప్రాంతలను బట్టి వేరువేరుగా ఉంటుంది. మార్గ సంగీతం, హిందుస్తానీ సంగీతం కర్ణాటక సంగీతం అని పిలవబడుతూ ఉంది. రెండు సంప్రదాయాలుగా పరిణామం చెందిందిగానీ, ఆదిలో రెండింటికీ ఒకటే కుదురు. 

నాట్యశాస్త్రం క్రీస్తుపూర్వమే రచింపబడింది. నాట్యశాస్త్రంలో భాగం సంగీతాధ్యాయం. ఆనాటికే ఎన్నో రాగాలు ప్రచారంలో ఉన్నాయి. తర్వాత సంగీతరత్నాకరం (12వ శతాబ్దం), మకరందం మొదలైన గ్రంధాలు రచింపబడ్డాయి. ప్రాచీన సంగీత లక్షణం సక్రమంగా అనుసరించబడకపోడంచేత తిరిగి సంస్కరించవలసిన అవసరం ఏర్పడడంచేత, రామామాత్యుడు స్వరమేళకళానిధి, సోమనాధ పండితుడు రాగవిభాగం  రచించడానికి ప్రోత్సహింపబడ్డారు. కర్ణాటక సంప్రదాయ ఆవిర్భావానికి ప్రారంభం అదే కావచ్చును. కర్ణాటక సంగీత సంప్రదాయం ప్రామాణికంగా అనుసరిస్తున్న 'చతుర్దండి ప్రకాశికవెంకటమఖి విరచితం. వెంకటమఖి నాయకరాజు రఘునాధనాయకుని మంత్రి, రాజగురువు, గోవింద దీక్షితుల కుమారుడు. అంటే కర్ణాటక సంగీత సంప్రదాయం 17వ శతాబ్దం నుంచీ కొనసాగుతున్నట్టుగా భావించవచ్చును. ద్రవిడభాషా జన్యాలైన తమిళం, కన్నడం, తెలుగు, మలయాళ ప్రాంతాలలో ఈ సంగీత సంప్రదాయం అనుసరింపబడుతూ ఉంది. మరో సంగతి. దక్షిణ దేశంలో ప్రచారంలో ఉన్న వీణా వాద్యం కూడా నాయకరాజుల కాలంలోనే నిర్మింపబడి రఘునాధవీణ అని పిలవబడింది. కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఒక స్థాయిలోని 12 స్వరాలకు 16 పేర్లు పెట్టి 72 మేళకర్తల రాగవిభాగం జరిగింది.
  
హిందుస్తానీ సంగీతానికి కర్ణాటక సంగీతానికి రాగలక్షణాలు, లయవిధానమే కాకుండా, వినగానే తేడా తెలియజేసేది గమకస్ఫూర్తి. పట్టు, ఒరయక వంటి గమకం కర్ణాటక బానీలో విలక్షణంగా వినిపిస్తుంది.

తెలుగునాట 20వ శతబ్దంలో ప్రచారంలోకి వచ్చిన నవ్య సంగీతరీతి లలిత సంగీతం. తెలుగుభాషలోనూ, కవిత్వంలోను వచ్చిన పరిణామంలో రచనవల్ల గేయరచనకు ప్రోత్సాహంవచ్చింది. నవ్యకవులు చాలామంది సంప్రదాయ ఛందస్సుకన్నా గేయరీతిలో తమ రచనలు విరివిగా చేసేరు. నవ్యరీతిలోను వ్యవహారికభాషలోను వచ్చిన గేయరీతి గానంచేయడానికి గాయకులు అనుసరించిన మార్గం లలిత సంగీతం. లలిత సంగీతం మార్గ దేశీ సంగీతముల సమన్వయంగా భావించవచ్చును. దేశీ సంగీతంలోని భావోద్రేకము మార్గ సంగీతంలోని రాగమాధుర్యం లలిత సంగీతం సంగ్రహించింది. ఆ సమయానికి రేడియో ఆవిర్భవించింది.
ఆలిండియా రేడియో(1936)

రేడియోలో శాస్త్రీయ సంగీతమే కాకుండా లలిత సంగీత శాఖ కూడా ఏర్పాటయింది. నాటికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం మూడు పువ్వులు ఆరు కాయలుగా దక్షిణ దేశం అంతా విరాజిల్లుతూ ఉంది. అయితే లలిత సంగీత రసికులు యువతరంలో ఆశావహంగానే ఏర్పడుతూ ఉన్నారు. శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసులు, వాద్య విద్వాంసులు, వైణికులు, వాయులీన విద్వాంసులు, నాదస్వర విద్వాంసులు, మురళీ వాదకులు రసికుల మన్ననలు పొందుతున్న రోజులవి. దేశంలో ఎన్నో సంగీతసభలు ఏర్పడి విద్వాంసులకు బిరుదు పట్టాలు యివ్వడం ప్రారంభించేయి. దేశంలో ఏ శుభకార్యం జరిగినా శాస్త్రీయ సంగీత కచేరీలు వినిపించేవి. ప్రతి పెళ్ళి నాదస్వర సంగీతంతో ఊరేగేది. అదే పరిస్థితులలో సినిమా పరిశ్రమకి అంకురార్పణం అయింది. ఎన్నో సినిమా స్టూడియోల నిర్మాణం అయింది. 
                
                                                  మోడర్న్ థియేటర్స్(1935)
           
జెమిని స్టూడియోస్(1940)
                                           


విజయ- వాహిని(1948)
                                                                  


 ఈనాడు హిందుస్తానీ, కర్ణాటక సంగీత కచేరీలలో వివిధ సంగీత రచనలు గానం చేయబడుతూ ఉన్నాయి. దృపద్, ఖ్యాల్, తుమ్రీ, గజల్, భజన్ పేర్లు తెలియని హిందుస్తానీ సంగీత రసికులుండరు. అదే విధంగా కర్ణాటక సంగీత కచేరీలలో కృతి, కీర్తన, పదం, జావళీ, వర్ణం, స్వరజతి, గీతం, తిల్లానా. ఈనాడు ప్రచారంలో లేనివి జక్కిణదరువు, ప్రబంధం వంటివి. ఇక కూచిపూడి వారి యక్షగానాలలో వినిపించే పాటలను 'దరువుఅంటారు. హరికధలలో గానం చేయపడేవి 'మట్లు'. ఆ పాటల శైలినిబట్టి, దానిలో సాహిత్యాన్నిబట్టి ఈ రచనలు ఇన్ని విధాల పేర్లతో పిలవబడుతూ ఉన్నాయి. ఏవిధమైన సాహిత్యం ఉన్నా ఇవన్నీ సంగీత రచనలే. ప్రధానంగా గాత్ర సంగీతాన్ని ఉద్దేశించి రచింపబడ్డవి, అంటే భాషా సహితమయినవి. ఇవి సంగీత రచనలైనా, ఆ సాహిత్యంలోని రసభావములకు దోహదంగా సంగీతాన్ని, అంటే, రాగభావం, లయవిన్యాసం ఉండడం రచయిత అభిప్రాయంగా గ్రహించవలసి ఉంటుంది.  

కర్ణాటక సంగీత కచేరీలలో ఈ సంగీత రచనలు పాడే విధానం వింటూంటే ఒకటి అనిపిస్తుంది. స్వరమాధుర్యాన్ని, గమనసౌందర్యాన్ని స్వంతం చేసుకుందికి సాహిత్యం రాజీ పడుతున్నట్టు. కారణం, పాటలో విరుపులు. అప్పుడప్పుడు 'రామునితోక పివరుండిట్లనియెఅన్నట్టు వినిపిస్తుంది. పదముల స్వరూపం సంగీత విరుపులను అనుసరింస్తుంది. 
 ఇది చూడండి:
         సృష్టిస్తత్యంతకార కమితా ఫలదాయక
        సమాన గాత్ర, శచీపతినుత అబ్ది మదహర
        అనురాగ రాజిత కధాసారహిత
 అనే మాటలు గాయకుల పాటలో మనకు యిలా వినిపిస్తుంది -
         సృష్టిస్తత్యంతకారకా మిచఫలదా
        యకసమానగా త్రశచీ పతినుతా...
        అబ్దిమదహరా
        నురా గరా గరా జితకధా సారహిత
 అలాగే శ్యామాశాస్త్రిగారి స్వరజతిలో -
        కలుషహారిణి - సదా నతఫలదాయకియని
        బిరుదు భువిలో కలిగిన దొరయనుచు
        వేదము మొరలిడగవిని
ఇది గాయకుల పాటలో -
కలుష హారిణి సదా నతఫలదా
యకియని బిరుదు భువి లో
కలిగిన దొరయనుచు  వే
దము మొరలిడగ విని
ఇందులో వేదము అన్నమాటలో 'వేఅన్న అక్షరం కింద షడ్జమంలో నిలిచిపోయి, మిగిలిన 'దము మొరలిడగవినిఅన్నది పై గాంధారంలో ప్రారంభం అయి అవరోహణలో కిందికి వస్తుంది.  
ఇక గీతాలలో సాహిత్యం నామకార్ధం. ఉన్న సాహిత్యం కూడా అజంతంగా స్వరలయలలో మాట స్వరూపం ఖచ్చితంగాను, స్పష్టంగానూ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే -
ఈ నాటి సినిమా పాటలలో మాట స్పష్టంగా తెలుస్తుంది. మాట విరుపుని బట్టి సంగీతం నడుస్తుంది. అంటే ఏమిటికృతిలో సంగీతాన్ని సాహిత్యం అనుసరిస్తే, సినిమా పాటలో సాహిత్య భావాన్ని దృష్టిలో పెట్టుకొనే స్వరలయలు నడుస్తాయి. ఇక సంగీత రసికులలో కూడా సంగీతం కోసం సాహిత్యాన్ని భరించేవారు. సాహిత్యం కోసం స్వరలయలలో సాహిత్యాన్ని వెతుక్కునేవారూ ఉన్నారు. ఏమైనా, సినిమా పాటలో సంగీత సాహిత్యాలు సమాన ప్రాధాన్యం కలిగినవిగా ఉంటాయి. సినిమా పాటను ఆదరించే రసికలోకం బాహుళ్యం. అయితే పాటలో నాదానుభవం పొందగోరే రసికులు సినిమా పాటలో రుచిని గ్రహించినా తగినంత నాదానుభవం పొందలేరు.

       
సంప్రదాయంగా వస్తున్న దృపద్, ఖ్యాల్ ఆనందించే రసికులు ఈనాటికీ తన్మయత్వం పొందుతారు. అయినా గజల్, తుమ్రీ విని తన్మయులయేవారు జాస్తి. ఆయా సంగీత ప్రక్రియలు గానం చేసే గాయకులు కేవలం ఆ ప్రక్రియకే అంకింతం అయేవారూ ఉన్నారు. అంటే గజల్ పాడేవారూ, తుమ్రీ పాడేవారూ ఆయా ప్రక్రియలలో నిష్ణాతులన్నమాట. కొన్ని ప్రక్రియలు కొన్నికొన్ని భావాలు చెప్పడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఈ విషయాన్ని చెప్పడానికే అనుకొంటాను త్యాగరాజస్వామి "సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గంము కలదేఅన్నారు. ముఖ్యంగా త్యాగరాజస్వామి కీర్తనలలో స్వగాతాలుగానో, అనుభవాలుగానో ఉంటాయి. అలాగే తుమ్రీలో రక్తికట్టే భావం పాటలో వ్యక్తంకాదేమో. అందుకే నాకు బడేగులాం ఆలీఖాన్ పాడిన తుమ్రీ 'ఆయేనా బాలుం క్యాకరుం సజనీఅన్నది సినిమా పాటగా మరీ ఆనందం కలగలేదు. అలాగే తెలుగులో 'నను పాలింపగ నడచి వచ్చితివోఅన్న కృతి సినిమా పాటగా అంతగా కదిలించలేదు.


సంగీత కళ వేదం నుంచే జనించిందంటారు. వేదగానం అనడం ఉంది కదాయజుర్వేదంలో వినపడే స్వరాలు ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు. స్వరితం అన్నది షడ్జమ స్వరం అనుకొంటే ఉదాత్తం  రిషభం, అనుదాత్తం నిషాదంలోనూ వినిపిస్తాయి. వేదపఠనంలో ఈ మూడే కాకుండా మరో స్వరం పంచమ స్వరంలో వినిపిస్తుంది. దానికి పేరు తెలియదు. దాన్నీ అనుదాత్తమే అంటారు. పై చెప్పిన స్వరాలు యజుర్వేద పఠనంలో వినగలిగేవి. సామ వేదం, అంటే, సామగానంలో సప్తస్వరాలూ వినపడతాయి. ఆ స్వరాలు కర్ణాటక సంగీత మేళకర్త 'ఖరహరప్రియలో. అయితే ఆరోహణక్రమంలో కాకుండా అవరోహణక్రమంలో ఉంటుంది.   శ్రాయంతీయం అనే సామం సామవేదుల జనార్దనం గారి దగ్గర నా చిన్నతనంలో నేర్చుకొన్నాను. అయితే వేదపఠనంలో స్వరాలు మనం గుర్తించగలిగినా లయను గుర్తించడం తెలియలేదు.

ఇక కావ్యగనం. అంటే, చందోబధ్ధమైన వృత్తాలలో, మాత్రాబధ్ధమైన వృత్తాలలో లయ కనిపిస్తుంది. మత్తకోకిలం, ఉత్సాహం, మాలిని మొదలైన వృత్తాలలో 3,4,5,7,9 మాత్రల నడక కనిపిస్తుంది. అందుకే కూచిపూడి భాగవతులు యక్షగానాలలో ఆయా వృత్తాలనే పాటలుగా ఉపయోగించేవారని విన్నాను. కంద పద్యం తెలుగులో చతురస్ర నడకలో చదివి, చరణం చివర మిశ్ర నడకలో పాటగా నడిపిస్తారు. దానికే 'కందార్ధంఅని పేరు.

 రాగాల పేర్లు చాలా ప్రాచీనకాలంనుంచి వినిపిస్తున్నా ఆ రాగాలు ఎలా పాడేవారోఅంటే, రాగలకి లక్షణం ఉందికాని లక్ష్యరచనలు లేవు. అష్టపదులవంటి ప్రాచీన గేయరచనలకు రాగం పేరు పేర్కొనబడింది. కాని ఆ గేయాలను ఎలా పాడేవారో స్వరబధ్ధం కాలేదు. సంప్రదాయజ్ఞులు భజనకాలక్షేపంలో పాడుతున్న విధం చూస్తే ఆ పాటలు లయబధ్ధంగా ఉన్నా, రాగభావం అంత ప్రౌఢంగా ఉండదు. ఈనాడు సంగీత సభలలో విద్వాంసులు వారి అభిరుచిననుసరించి ఆయా రాగాలలో, లయ కూడా వారి అభిరుచినిబట్టి సర్దుకొని అష్టపదులు గానం చేస్తున్నారు. అష్టపదులు, తరంగాలు, అన్నమాచార్య కీర్తనలు, సదాశివబ్రహ్మేంద్రుల కీర్తనలు, యివన్నీ స్వరబధ్ధం కాకుండా రాగతాళ సూచనలు మాత్రం ఉన్న గేయాలు. తెలుగునాట బాగా ప్రచారం అయిన రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు కూడా అటువంటివే. ఆ కీర్తనలలోని ఆర్తి శ్రోతలను కరిగిస్తుంది. కీర్తనలోని రాగభావం కోసం ఆశించము. ఈమాట ఎందుకు అనవలసి వచ్చిందంటే, ప్రాచీన గేయరచనలో రాగభావం కన్నా లయ, సాహిత్యభావం ప్రధానంగా కనిపిస్తాయి.

 కర్ణాటక సంగీత సంప్రాదాయంలో స్వరరచన 17వ శతాబ్దంనుంచి కనిపిస్తుంది. ప్రాధమిక శిక్షణకు అనువైన సరళీస్వరాలు, జంటస్వరాలు, తాళగతులను బోధించే అలంకారములుకాక వివిధ రాగసంచారములను బోధించే గీతములు యివే సంగీతరచనలో ప్రారంభ దశగా కనిపిస్తుంది. క్రమంగా స్వరజతులు, వర్ణములు, పదవర్ణములు, కృతులు, రాగసంచారక్రమాభివృధ్దిని సూచించే రచనలు వచ్చాయి. స్వరరాగతాళములు గాయకుని ప్రతిభననుసరించి గానం చేయడానికి కృతి రచనే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఈనాటి సంగీత కచేరీలలో ప్రధాన రచనలు ఈ కృతులే. అందులోనూ త్యాగరాజకృతులు. త్యాగరాజకృతులు గానం చేసేటప్పుడు మూలరచన అదే అని తెలిసినా, గాయకులు గానం చేసినప్పుడు గమకస్ఫూర్తిలోను, సంగతులు వేయడంలోనూ వారివారి మనోధర్మ సంగీతానికి ఎక్కువ అవకాశం ఉండడం చేత  త్యాగరాజస్వామి ఈ కీర్తన ఎలా పాడేరో అన్న జిజ్ఞాస కలుగుతుంది. త్యాగరాజస్వామి కీర్తనల విషయంలో చాలామంది అనుకొంటున్న మాట చాలా కృతులు ఆయన పేరుతో ప్రక్షిప్తం అయేయి అని. అంతేకాదు, ధాతువిషయంలో కూడా మార్పులుచేర్పులు జరిగినట్టు. చాలా కీర్తనల విషయంలో రాగాలు భిన్నంగా ఉన్నట్టు గ్రంధస్థం అయిన విషయం. "ప్రాణనాధ బిరానఅన్న కీర్తన శంకరాభరణంలో పాడతారు. గ్రంధాలలో 'శోలినిఅని ఉంది. "జ్ఞానమొసగరాదాఅన్న కీర్తనను 'పూరీకల్యాణీలో పాడతారు. పుస్తకాల్లో 'షడ్విధమార్గిణిఅని ఉంటుంది. ఇది మేళకర్త. జేసుదాసు పాడినది కూడా షడ్విధమార్గిణిలోనే.  అయితే ఒక్క విషయం గ్రహించాలి. త్యాగయ్యగారు సంగీత కచేరీకోసం ఆయన కృతులు రాయలేదన్న విషయం. ఆయన అభిప్రాయం సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గములేదనేది. అంతేకాదు, సంగీతశాస్త్రజ్ఞానము సారూప్యసాధనమనీ, సారూప్యసౌఖ్యదమనీ. ఆయన అనుభవంలో నాదసుధారసమే నరాకృతి పొందిన శ్రీరామచంద్రుడు. భగవద్భక్తి, సంగీతజ్ఞానము లేకపోతే మోక్షము కలగదని, రాగలయాదుల భావించి ఆనందసాగరమీదని దేహము భూమిభారమని. నాదలోలత్వంపై యింత తన్మయత్వంగా మరెవరూ చెప్పినట్టులేదు. ఆయన స్వతంత్రుడు. మమతబంధనయుత నరస్తుతికన్న ఉంఛవృత్తే సుఖమనిపించింది. ఆయన ఎన్నడూ దైన్యం అనుభవించలేదు. కవినరాధములు నిరాదరువు చూసి అనాధుడన్నారట ఆయనని. రామానేను అనాధుడనుకాను, నీవే అనాధుడవని నిగమజ్ఞుల మాట విన్నాను, అన్నారు. ఆయన కృతులలో ఇటువంటి స్వానుభవాలు ఎన్నో చెప్పేరు. ఆయన శిష్యులకు ఆయన సంగీతం మాత్రమే అర్ధం అయింది. ఆయన హృదయం అర్ధంకాలేదు. ఆయన కృతులు గానం చేస్తున్నప్పుడు ఆయన హృదయం వ్యక్తీకరించే ప్రయత్నంచేయలేదు ఆయన శిష్యులు. ఆ మాటలతో మాకేం సంబంధం అన్నట్టుగా వినిపిస్తాయి ఆయన కృతులు, విద్వాంసుల గానంలో. ఇంతకీ అనుకోవలసిన మాట - త్యాగయ్యగారు ఆయన కృతులు సంగీతకచేరీలను ఉద్దేశించి రంచించినవి కావు. ఆయన కృతులు ఆయన భావోద్వేగాలను అనుసరించి వ్యక్తం అయేయి గానరూపంగా.

తమిళనాట వెలసిన త్యాగరాజ కృతులు తమిళనాట ఎంతో ఆత్మీయమయేయి. ఆ కృతులలోని భాషకాని, వాటిలోని భావంకాని కాదు. ఆ కీర్తనలను ఆవరించిన స్వరరచన, భాషతో వాళ్ళకి సంబంధంలేకుపోడంచేత ఉచ్చారణలోనూ పదముల విరుపలలోనూ పొరపాట్లు రావడం సహజం. అంతేకాదు, కృతి పాడేటప్పుడు భావం తెలియకపోతే ఉచితమైన భావంలో నెరవల్ చేయడం జరగదు. ఒక మహావిద్వాంసుడు, "భువిని దాసుడనిఅనే కృతి పాడుతూ "అడ్డత్రోవ తొక్కితినిఅన్న దగ్గర నెరవల్ చాలాసేపు పాడేడు. ఆ కృతిలో  "పాలముంచినా నీళ్ళముంచినా పదములే గతి లేకపోతే చాలా సౌఖ్యమో కష్టమో తెలియజాలిచెందితినిఅనే కరుణామయమయిన మాటలున్నాయి. నెరవల్ చేయడానికి హృదయస్పందన కలిగించే భావం అవసరం.  భాష తెలియనివాళ్ళు ఆ కృతులకు ప్రామాణికులు కావడంచేత, వాళ్ళే ప్రామాణిక గాయకులవడంచేత త్యాగరాయ కీర్తనలు సంగీత సాహిత్య సమ్మేళనం కలగవలసినంత సంతృప్తిని కలిగించలేదు. దానికి బదులు తంజావూరు బానీ స్థిరపడింది.

త్యాగరాజ కృతులు ప్రచారం అయిన తరావాత చాలామంది వాగ్గేయకారులు కృతి రచన చేసేరు. అయితే ఆ రచనలు అంత ప్రచారంలోకి రాలేదేగాయకులలో కొత్త కృతులు పాడడం కన్న పాతవి పాడితేనే పండితుడుగా గుర్తింపు పొందవచ్చననే భావం కావచ్చును. అర్వాచీన వాగ్గేయకారులలో ముత్తయ్య భాగవతార్ గుర్తింపుపొందేరు. తరవాత తమిళ విద్వాంసుడు పాపనాశన్ శివన్ కృతులు తమిళ విద్వాంసుల కచేరీలలో గానం చేయబడ్డాయి. 

పాపనాశం శివన్(1890-1973) 
ఆధునిక వాగ్గేయకారులలో బాలమురళీకృష్ణ తిల్లానాలు నాట్యకార్యక్రమాలలో నాట్యం చేయబడ్డాయి. న్యాయంగా రసమయమయిన ఆయన కృతులు ప్రచారం పొందవలసింది.

తరవాత కృతి నిర్మాణంలో మరో మార్పు - సాహిత్యానికి సంగీతం అమర్చడం. మలయాళ మహారాజు స్వాతి తిరునాళ్ కృతులకు శెమ్మంగుడి శ్రీనివాస అయ్యరు సంగీతం కూర్చేరు. ఆ కృతులు బాగానే ఆదరింపబడ్డాయి, తమిళ గాయకులచేత. 

స్వాతి తిరునాళ్(1813-1846)
తర్వాత అన్నమాచార్య కీర్తనలకు నేదునూరి కృష్ణమూర్తి సంగీతం అమర్చేరు. ఆ కృతులు శ్రీమతి M.S. సుబ్బులక్ష్మి పాడగా రికార్డు అయేయి. ఆ కృతులు రసికలోకంలో ఆనందింపబడ్డాయి. ఇక తెలుగునాట హరినాగభూషణం గారు వంటి వాగ్గేయకారులు ఉన్నారు. వారి కృతులు ఉన్నట్టు కూడా గాయకులు గుర్తించలేదు. పట్రాయని సీతారామశాస్త్రి గారు ఆయన కచేరీలలో ఆయన స్వంత రచనలు మాత్రమే పాడేవారు. అయితే ఆయన కచేరీలను ఆనందించే రసికులు లలిత సంగీత రసికులుగా భావించేవారు తంజావూరు బానీవారు, తంజావూరు బానీ రసికులు. రాగతాళములు  నిర్దిష్టంగాను, సమర్ధంగాను ప్రయోగింపబడడం ప్రధానం. కాని తెలుగు కీర్తనలు అరవధ్వనితో పాడితేనే విద్వత్ లక్షణంగా ప్రచారం అయింది. స్వరలయలపైన అధికారంకలిగి సాహిత్యాన్ని సమకూర్చగలిగేవారు ఎంతోమంది రచనలు చేయలేదని అనలేము. అయితే గుర్తింపబడ్డ వాగ్గేయకారులంతా దాక్షిణాత్యులే. అతి స్వల్పంగా రాసినా వాళ్ళే వాగ్గేయకారులుగా వారి కీర్తనలు సభలలో గానం చేయడం, ఇతరుల రచనలు, ముఖ్యంగా తెలుగు దేశం నుంచి వచ్చిన రచనలు పట్టించుకోకపోవడం జరిగింది.

రాజరికపు రోజుల్లో కవులు, గాయకులు, నర్తకులు, చిత్రకారులు రాజదర్బారుకి అలంకారప్రాయంగా పోషింపబడ్డారు శతాబ్దుల పర్యంతంగా. కవుల పేర్లు నిలిచాయి చరిత్రలో అంకితం పొందిన మహారాజుల పేర్లతో. అలనాటి గాయకుల పేర్లు తెలియవు. వారి సమకాలంలో వారూ సుప్రసిధ్ధులయే ఉంటారు. కారణం, గాయకుల సేవలు శాశ్వతంగా నిలిచే అవకాశంలేదు ఆ రోజుల్లో. అదీకాక దర్బారులో నర్తకులకున్న ప్రాముఖ్యత గాయకులకు ఉండే అవకాశం లేదు. అలనాటి రోజుల నర్తకీమణుల నామధేయాలు గ్రంధస్థం అయేయి అనుకుంటాను అక్కడక్కడ. రాజదర్బారులో ప్రకాశించిన గాయకుడు తాన్ సేన్ పేరుమాత్రం ధృవతారగా మెరుస్తూ ఉంది. ఆయా సంస్థానాల చరిత్రలో మరికొన్ని సంగీత విద్వాంసుల పేర్లు ఉండవచ్చును. నేను చెపుతున్నది లక్షణవేత్తల గురించి. వాగ్గేయకారుల గురించి కాదు. ప్రభుత్వాలనాశ్రయించిన గాయకుల గురించి మాత్రమే. 
     
త్యాగరాజస్వామి "సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము కలదేఅన్న మాటకి ముందు మనస్సులో కొంతకాలం మధనం జరిగిన తరవాత వచ్చిన మాట అని అనిపిస్తుంది.   

నాయకరాజుల కాలంలో కర్ణాటక సంగీతసంప్రదాయం స్థిరపడింది. స్వరరచన కూడా ప్రౌఢమార్గంలో పడింది. సంగీతము, నాట్యమూ రెండూ మహారాజులకు అంకితం అయిపోయేయి. ప్రభువులను ఆనందింపచేయడానికి తగిన నాట్యసంగీతం రచించడం అవసరం అయింది. తంజావూరు సోదరులు భరత శ్రేష్టులుగా ముత్తుస్వామి దీక్షితులవారిచేత గుర్తింపబడ్డారు.        

           
తంజావూరు సోదరులు - చిన్నయ్య(1802),పొన్నయ్య(1804), శివానందం(1808), వడివేలు(1810-1845)

సంగీతంలో వర్ణరచన ప్రౌఢరచనగా భావింపబడుతూ ఉంది. ఆ స్థితిలో త్యాగయ్యగారు ఉంఛవృత్తిలో జీవిస్తూ సంగీతం యుగపురుషుడుగా కృతిరచన చేయసాగేరు. ఆనాటి సంగీతవిద్వాంసులకు మొదట అయ్యగారి కృతి ఏదో భజనకీర్తనలా, సంగీతదృష్ట్యా చాలా పేలవంగా కనపడింది. క్రమంగా అయ్యగారి కృతులు స్వరరాగప్రస్తారానికి, మనోధర్మ సంగీతాలాపనకి వర్ణంకంటే ఎక్కువ అనుకూలమయినదని ఋజువు అయిందనిపిస్తుంది. ఆనాటికి సంప్రాదాయ సంకీర్తనగానం ప్రచారంలో ఉంది. పురందరదాసుగారు సంగీత శిక్షణకు అనుకూలంగా భక్తిగీతములు రచించేరు. పండితులు రాగం, తానం, పల్లవి గానం చేసేవారనిపిస్తుంది. త్యాగరాజస్వామివారి కృతిలో రాగం, తానం, పల్లవి గానం చేసే అవకాశం అంతర్గతంగా ఉంది. త్యాగయ్యగారి రచన ఎంత ప్రౌఢ మార్గంలో ఉందో, వర్ణరచనకి దీటుగా నిలబడ్డ వారి పంచరత్నకీర్తనలు ఋజువు చేస్తాయి. 

ఆనాటి భక్తిమార్గంలోని వారంతా స్వతంత్రులు. శ్రీమద్ భాగవతపురాణకర్త బమ్మెర పోతనామాత్యుని ప్రభావం పొందిన వారు, పరమేశ్వరుని స్తుతి తప్ప నరస్తుతి కుదరని వారు, దురహంకారపూరితులైన ప్రభువులను, ఇమ్మనుజేశ్వరాధములు అని ధైర్యంగా అన్న పోతనగారి వాణి వారి ప్రవృత్తికి నచ్చింది. అందుకే మమతాబంధనాయుత నరస్తుతి సుఖమాఅని అనుకొన్నారు మెత్తగా.

అంటే ఆరోజుల్లో సంగీతజ్ఞులమధ్య భక్తి సంగీతం, శృంగార సంగీతం అనే తెర ఏర్పడిందన్నమాట. అందుకే "దుడుకుగల నన్నేదొర కొడుకు బ్రోచురాఅన్న పంచరత్న కీర్తనలో "తెలియని నటవిట శూద్రులు, వనితలు, స్వవశమకుటకుపదేశించి సంతసించి స్వరలయంబులనెరుంగకనే శిలాత్ములై సుభక్తులకు సమానమను"  అని అన్నారు త్యాగరాజస్వామి.

 క్రమంగా వర్ణం శిక్షణ సంగీతంలో చేరిపోయి, భరతనాట్యానికి పరిమితం అయిపోయింది. కృతి శాస్త్రీయసంగీతానికి ఏకైక ప్రతినిధిగా సంగీత కచేరీలలో గానం చేయబడుతూ ఉంది. అంటే ఒకప్పుడు విద్వత్ రచనగా భావింపబడిన వర్ణానికి తిరుగుబాటుగా వచ్చిన కృతి కొనసాగుతూ ఉందన్నమాట. వర్ణం, స్వరజతి, తిల్లాన, పదం, జావళీ, యివన్నీ నాట్యప్రదర్శనలో ప్రయోగించే రచనలుగా నిలిచేయి.

 త్యాగయ్యగారి నాటికి అష్టపదులు, తరంగాలు, తాళ్ళపాకవారి పదాలు, పురందరదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు ప్రచారంలోనే ఉన్నాయి. త్యాగరాజస్వామి మహాభక్తుల సంకీర్తనలన్నీ గానం చేసేవారు. ఆయన మహారాజ ఆస్థానంలో గానం చేయలేదు. "నిద్దుర నిరాకరించి ముద్దుగ తంబూరబట్టి శుధ్ధమైన మనసుతో సుస్వరముతో పద్దుతప్పకఆయన శ్రీరామచంద్రబ్రహ్మను నాదోపాసనచేసేరు. సన్యాసాశ్రమం తీసుకొంటేనేగాని ఆయనకి సంతృప్తికలగలేదు. 1847 జనవరి 6వ తేదిని ఆయన సిధ్ధిపొందేరు.
  
19, 20 శతాబ్దాలు కర్ణాటక సంగీత చరిత్రలో స్వర్ణయుగం కావచ్చును. అంతఃపుర వాద్యంగా ఉన్న వీణ రేడియో ద్వార శ్రవణపేయంగా సామాన్య రసికులు కూడా వినగలిగేరు. పాశ్చాత్య వాద్యమైన వయెలిన్ అతి శ్రోత్రియంగా గమకస్ఫూర్తితో విద్వాంసులతో తలపడింది. అలాగే నాదస్వరం, వేణువు తమ అస్తిత్వాన్ని ఋజువుచేసుకొన్నాయి. తాళవాద్యాలు వాటి అర్హస్థానాన్ని వేదిక మీద నిలుపుకొన్నాయి.

 సంగీత కచేరీలన్నవి ప్రజాజీవితంలో పరిచయమయినవి 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో కావచ్చును. అంటే నూటపాతిక-నూటయాభై సంవత్సరాలలోపు. అంతవరకు సాంస్కృతిక కార్యకలాపలన్నీ రాజదర్బారుకి చెందిన వ్యవహారంగా ఉండేవి. త్యాగరాజస్వామి వారే కాదు, ఉపాసకులు ముత్తుస్వామి దీక్షితుల వారు, అమ్మవారి అర్చకులు శ్యామాశాస్త్రిగారు తమ సంగీత రచన భగవదారాధనగానే చేసేరు. వారి కృతి రచనలోని సంగీతమాధుర్యం గానకచేరీలకు ప్రోత్సహించింది తర్వాత. విద్వద్గానానికి నికషోపలంగా భావించే రాగం, తానం, పల్లవికి ఉపోద్ఘాతంగా సంగీత కచేరీలో వాగ్గేయకారుల కృతులు చేర్చబడ్డాయి.  సంగీత కచేరీ అంటే స్వర రాగ తాళ ప్రాధాన్యం కలిగిన కార్యక్రమంగా నిర్ణయించినట్టు భావించవచ్చును. నేటి సినిమాకి title musicనాట్య కార్యక్రమంలో పదవర్ణం ఉన్నట్టే, - కచేరీ, ప్రముఖ సంగీత రచన, తానవర్ణంతో ప్రారంభంకావాలి. తరవాత ఆనాటి రామస్వామి దీక్షితులవారి కృతి "వాతాపి గణపతితో గణపతి ప్రార్ధన గాయకుని విశ్వాసాన్నిబట్టి చేయవచ్చును. సంగీత కచేరీ అంటే మూడు గంటల కార్యక్రమం. పది కృతులేనా రాగం, స్వరకల్పన, నెరవల్ తో పాడవలసి ఉంటుంది. పాడిన కృతులన్నీ భక్తిరసంతో, ఆర్తితో కూడినవై ఉండాలి. అయితే నేటి కచేరీ గానంలో ఏమాత్రం కరుణ స్ఫురించదు. "ఎవరురా నినువినా గతి మాకుఅన్నా, "నీ దయరాదాఅన్నా, "కటకటా నా చరితము కర్ణకఠోరము" "ఎటుల బ్రోతువో తెలియదేకాంత రామయ్యఅన్నా, గద్దిస్తున్నట్టే ఉంటాయి. కచేరీ గాయకుల గానంలో ఏ విధమైన ఆర్తి ధ్వనించదు. పాటలో ఏ విధమైన రసస్ఫూర్తికి వలసిన పట్టు విడువులుండవు ధ్వనిలో. ఒక వేళ ఎవరైనా ఈ విషయం ప్రశ్నిస్తే వారి అభిప్రాయం ఇదేమైనా నాటకమా, సంగీత కచేరీలో నాటకం పాటలా పాడాలా సంగీత కచేరీలో రాగస్ఫూర్తిగానే పాడడం జరుగుతుంది, అని అనుకోవలసివస్తుంది.
  
కర్ణాటక సంగీత కచేరీ జరుగుతుంటే ఏదో match చూస్తూ ఉన్నట్లో లేకపోతే ఏదో అవధానమో, విద్వద్గోష్టి జరుగుతూ ఉన్నట్లో ఉంటుంది. పక్కవాద్యనిపుణులంతా అహమహిమికాభావంతో కనపడతారు. హిందుస్తానీ కచేరీలో పక్కవాద్యములు తమ ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తున్నట్టు ఉండదు. కర్ణాటక సంగీత కచేరీలో గాత్రజ్ఞుడు పక్కవాద్యాలతో పోటీపడతున్నట్టు అనిపిస్తుంది. ఈ పోటీ ప్రధానంగా గాయకుడికి, వాయులీన వాద్యకుడికీ. రాగాలాపనలోనూ, స్వరకల్పనలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు జరుగుతుంది. సదస్యులు యిద్దరికీ కరతాళధ్వనులతో తమ అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. కచేరీ రాగం, తానం, పల్లవితో పతాకస్థాయి చేరుతుంది. గాయకుడు యిచ్చిన సమస్యాపూరణకి తాళవాద్యాలు కొంత పరిశ్రమతో సమాధానమిస్తాయి. పల్లవి తరవాత గాయకుల అభిరుచిని బట్టి ఏదైనా లలితగీతం, జావళీలాంటివి వినపడతాయి. ప్రేమగీతాలు వినపడవు. ఈ జావళీలు వేశ్యా జీవితానుభవానికి సంబంధించిన సాహిత్యంతో ఉంటాయి. ఏమైనా సంగీత రసికులు సహజంగా లీనమై సంపూర్ణమయిన నాదానుభవం పొందుతారు సాధారణంగా.


సంగీత కచేరీలు జరుగుతూ 150 సంవత్సరాలోపే అయి ఉంటుంది. వివాహాలలోనూ, ఉత్సవ సమయాలలోనూ, శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీరామనవమి సందర్భాలలోనూ సంగీత కచేరీలు జరిపే సంప్రదాయం ఉంది తెలుగునాట. ఆయా సందర్భాలలో ప్రధానంగా హరికధలు జరుగుతాయి. సంగీత కచేరీలు కూడా జరగడం ఉంది. అంతేకాక కేవలం సంగీతోత్సవాలు చేసే సంగీత సభలు మద్రాసులో చాలా ప్రాంతాలలో ఉన్నాయి. 1919లో అన్న జ్ఞాపకం మద్రాసు సంగీత ఎకాడమీ స్థాపించి. ప్రస్తుతం సన్ టివి, జయా టీవీలు పోటీపడి వార్షిక సంగీతోత్సవాలు నిర్వహించి డిసెంబర్ సీజన్ లో ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నాయి.

 అయితే ఈ సంగీత కచేరీలు ఎక్కడ జరిగినా, ఏ విద్వాంసుడు కచేరీ చేసినా పైన చెప్పిన మూసలోనే ఉంటాయి. కచేరీ క్రమమేకాకుండా రాగాలు కూడా విన్నవే వింటున్నాం. చెప్పుకోడానికి అనంతకోటి రాగాలు ఉన్నా, అనుభవంలో మాత్రం పరిమితంగానే. అలాగే త్యాగరాజస్వామి 2 వేల కృతులు రాసేరు అని అనుకోడం. కానీ ప్రచారంలో ఉన్నది కొన్ని వందలలోపే. మరో సంగతి, ఒకే రాగంలో చాలా కృతులు వింటాం. రాగ అనుభవం మాత్రం అన్ని కృతులు విన్నప్పుడు ఒకటే. కారణం, ఆ రాగం సంపూర్ణంగా ఆలపించడం ప్రధానం. అందుచేత ఎన్ని కృతులు రచించినా సాహిత్యపరంగా మార్పులు ఉండవచ్చును. సంగీత పరంగా కొంత తాళం మార్పువల్ల ఉండవచ్చును. త్యాగరాజస్వామివారి పల్లవి, అనుపల్లవి, చరణంతో కృతి రచన పధ్ధతిని చాలా మంది అనుసరించేరు. అనుపల్లవి అన్నది త్యాగయ్యగారి కృతిలో సార్ధకంగా ఉంటుంది. వారి కృతిలో సంగీత పరంగా విశిష్టత ఉంటుంది అనుపల్లవికి. క్రమంగా సంగీతపరంగా ప్రత్యేకత లేకపోయినా నాలుగు ఆవృతములు సాహిత్యం ఉంటే మొదటి రెండు లైన్లూ పల్లవి తరవాతి రెండు లైన్లూ అనుపల్లవి అనడం మామూలు అయిపోయింది.


సాహిత్యపరంగా కృతికి, జావళీకి, పదానికి మార్పు ఉన్నా, గానంలో అన్నీ ఒక్కలాగే వినిపిస్తాయి.

ఈ క్రమమయిన కచేరీలో ఏ విధమైన మార్పు జరిగినా సంప్రదాయభంగం అయిపోతుందేమో అనే అనుమానం పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితిలో కృతి, కీర్తనలకు 'పాటఒక సవాలుగా నిలిచి ఉంది. కవీశ్వరులు, రాజకీయాలు, సినిమాలు, వాణిజ్యాలు, ప్రచారాలు - వర్తమాన జీవితంలో ప్రతీచోట పాటే. నలుగురు స్నేహితులు సరదగా కాలక్షేపం చేదామనుకొంటే అక్కడ పాట ప్రత్యక్షం. దానికి కారణం, దాని అణకువ. అందరూ దాన్ని ధైర్యంగా పిలవగలరు. కృతి అనేసరికి దానికి భక్తివినా సన్మార్గము లేదు కదా. పాట అంటే అందరూ దాన్ని ఉపయోగించుకోవచ్చును. దాని నిరాడంబరత దాని అవసరాన్ని మరింత ఎక్కువ చేసింది. ఈ స్థితిలో కృతి శిక్షణ సంగీతంలో చేరిపోయే నిర్బంధం ఏదీలేదు కాని దానికి సన్మార్గం వేరే ఏముందినిజమే, త్యాగయ్యగారి మాట యడల ఎవరికీ వ్యతిరేకత లేదు. కారణం, దేశం యింకా ఆస్తికతలోనే ఉంది. కాని జీవితం, స్వీయానుభవం. కళల ఓదార్పు పొందకుండా ఎలా ఉండడంవర్తమాన యువతరం మాకు పాట దగ్గరగా ఉంటే చాలనుకొంటున్నారు. గడచిన తరంలో యువకులకు గల రాగప్రలోభం నేటి యువతరంలో కనిపించకుండా ఉంది. అయితే గాయకులు ప్రస్తుతం నడుస్తున్నట్టు మూస సంగీత కచేరీలు జరపడం ఎలాస్వరలయలమీద అధికారంగల గాయకులు వారి లక్ష్య సంగీతం వారే సమకూర్చుకోవాలి. రాగాలాపన, స్వరకల్పన ఆశువుగా చేయడమే మనోధర్మానికి నిదర్శనం కాదు. రసభావస్ఫూర్తిగా స్వరరచన చేయాలి.

 బాగానే ఉందయ్యాకానిగాయకులు కవులు అయినప్పుడే అది సాధ్యం. గాత్రసంగీతానికి అదో సమస్య కదా!

నిజమే. వివిధ అంశాలు మీద కవులు రచించిన గేయరచనలు అపారంగా ఉన్నాయి. లేదా, నీ కవి మిత్రుల రచనలూ ఉన్నాయి.  నీ అభిరుచిని బట్టి ఆ గేయాలు నువ్వు సంగీతం కూర్చి నీ స్వంత కచేరీ నీవు చేయవచ్చును. సాహిత్యం కవిగారిదే. కాని పాడే పాట నీది. సినిమావాళ్ళకి సన్నివేశాన్ని అనుసరించి రాసే కవులూ, సంగీతం కూర్చే సంగీత దర్శకులు ఉన్నారు కదాపాట రాసినది కవిగారే, పాటకి సంగీతం సంగీతందర్శకుడిదే.

మన గానకళ, మన అభిరుచి, జీవితంలో దాని ప్రభావం విహంగ వీక్షణన్యాయంగా పరిశీలించేక ఇక అనుకోవలసినది -

పరమేశ్వరునికి అంకితమైన కీర్తన దాని గాఢమైన అనుభవపు గాంభీర్యం మామూలు సరదా పాటలో ఎలా ఆశించగలం?

కృతికి ప్రత్యామ్నాయంగా గాఢమైన మానవ జీవితానుభవాలు ప్రేమ, ఆర్తి, కరుణ, దయ, యిత్యాది సాత్వికభావాలు గల సాహిత్య రచన రాగమయంగా ఆలాపం కావచ్చును. పరమేశ్వరాంకితంగా కృతి నిలిస్తే, మానవ హృదయానుభూతికి ఆలాపం ప్రతిబింబంకావచ్చును నాదమయంగా.

ఒక చిత్రకళాభిలాషి రవివర్మ చిత్రించిన సరస్వతి, లక్ష్మిమొదలైన దేవతామూర్తుల బొమ్మలు తిరిగి రాసేడు అంటే అతని చిత్రకళాసక్తిని అభినందిస్తాం. అతనికి మంచి భవిష్యత్తు ఉందని ఆశిస్తాం. అతనిని వర్ధమాన చిత్రకారుడని అభినందిస్తాం. కాని అతను సాధకుడు కిందే గుర్తిస్తాం. కాని సంగీతం విషయంలో అలాకాదు. ఒక కృతి గురువుగారి దగ్గర రోజులపర్యంతం నేర్చుకొని గానం చేయవచ్చును. ఆ కృతి రచన అతనిది కాదు. అయినా గాయకుడికిందే లెక్క. అదే సినిమా పాట విని నేర్చుకొని పాడితే సినిమా పాటలు పాడుతూ ఉంటాడు అంటాం. అలాగే ఒకరు ప్రాచీన రచనల వరవడితో రాస్తే ఈనాడు ప్రాచీనసాహిత్యాభిమానిగా మాత్రమే అనుకొంటాం. గాయకుడు గాని, నాట్యకారుడు గాని, కవి గాని, చిత్రకారుడు గాని వారి వ్యక్తిగత ప్రతిభను ఋజువు చేయకుండా గుర్తించడం సరి అయిన పధ్ధతి కాదేమో. స్వకీయమైన స్వరరచన చేయలేనివాడు సంపూర్ణ సంగీతజ్ఞుడు కాడు. మరో విషయం - ఈనాడు తెలుగు కవి "ప్రాచీన ఛందస్సులో నా అభిప్రాయం సరిగా రాదు, నాకు తోచిన ఛందస్సులో నేను రాస్తానుఅని అంటే ఏదో భాషాద్రోహంగా భావించపడలేదు. అలాగే ఒక రచయిత వివిధ దేశాలకి చెందిన సాహిత్యాన్ని పరిశోధించి ఆ ప్రభావంతో మాతృభాషలో తన వ్యక్తిగత ప్రతిభతో ఒక రచన చేస్తే అది తృణీకరించబడలేదు. సంగీతం విషయంలో ఆ స్వేఛ్ఛ ఉందా?

 ఆ స్వేఛ్ఛ అమలు జరపబడుతూనే ఉంది. అయితే సంప్రదాయ సంగీతజ్ఞుడు ఆ స్వేఛ్ఛను ఉపయోగించుకోలేదు. ఆ స్వాతంత్ర్య భావం సంప్రదాయ సంగీతజ్ఞూడు అనుభవంలోకి తెచ్చుకొన్నప్పుడే నాదప్రపూర్ణమూ, రాగరంజితమూ, సంగీత సాహిత్య సరస సమ్మేళనమూ అయిన 'ఆలాపంవస్తుంది. సంగీతానికి నిర్వచనం భావ రాగ తాళములు గాయకుడివి, స్వర రాగ తాళములు వాద్యకారుడివి.
  
శ్రీ శాస్త్రిగారి కోరిక ప్రకారం ఈ రాత్రి పెళ్ళి రిసెప్షన్ లో కొంత సంగీత కాలేక్షేపం చేయవలసి ఉంది. అయితే మూస సంగీత కచేరీయే చేయాలని పట్టుపట్టే సంప్రదాయజ్ఞులూ లేరు పెళ్ళివారిలో. నా పధ్ధతికి అడ్డుండదు. అష్టపదులు, తరంగాలు, సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు, అన్నమాచార్యులవారి కీర్తనలు నా అభిరుచిని బట్టి నేను స్వరపరచుకోవడం అయింది. అలాగే ఆధునిక రచనలు కూడా ఎన్నో సంగీత పరచడం అయింది. వాటిని యింతవరకూ సక్రమంగా వినియోగించడం జరగలేదు. ఈనాడు స్వేఛ్ఛగా గానం చేయగలిగే అవకాశం వచ్చింది.

 స్వర రాగ తాళములకు భారతీయ సంగీతము, కర్ణాటక, హిందుస్తానీ అన్న భేదం లేదు. స్వరం అన్నది భాషగా ఉపయోగించుకోవచ్చును హృదయాన్ని తెలియజేయడానికి.
  
ఆరోజు నా కచేరీ భర్తృహరి సుభాషితంలోని ప్రార్ధన శ్లోకం "దిక్కాలాద్యనవఛ్ఛిన్న అనంత చిన్మాత్ర మూర్తయే"తో ప్రారంభం అయింది. సంగీత కచేరీ ఈ రకంగా ప్రారంభం కావడం కొత్తగా అనిపించింది రసికులకి. అష్టపదులు, తరంగాలు, అన్నమాచార్య రచనలు, సంప్రదాయ కీర్తనలు అన్నీ నా పధ్ధతిలోను, నేను ఏర్పఱుచుకొన్న రాగ తాళాలతోనే నడిచాయి. అంతేకాదు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లలిత కీర్తన, ఓ సందర్భంలో ఆయన మాటమీదే, ఆ గీత రచన జరుగుతున్నప్పుడు, రచనకు సహకారంగా పాడివినిపించినది సమయానికి జ్ఞాపకం వచ్చి, పాడేను. ఆ కీర్తన "మంగళకాహళిఅన్న ఆయన పుస్తకంలో అచ్చయింది తరవాత. 

మరోమాట కూడా చెప్పుకోవాలి. పెళ్ళి సభలో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకును చూడగానే పాడాలని అనిపించి పాడినది విశ్వనాధ సత్యనారాయణగారి రచన మూగనోము పద్యం, ఆయన గేయం చిన్ని మబ్బులూను.   
         ఓసి నీరద నవోదయ కాల వియద్విలంబ
        మానసిత వారివాహనివహానత కైశిక
 అని జంఝూటిలో ప్రారంభించి
         నీ నడయాడు త్రోవలు పూనీతములైనవి
 పద్యంతో ఆశీర్వదించాక పెళ్ళికూతురు మధురానుభవం కన్నెకాటుక కళ్ళు అనే గేయం రాగమాలికలో నడిచింది. పెళ్ళివారందరికి ఎంతో సంతోషం కలిగించింది ఆ పాట. చివరగా భగవద్గీతలోని శ్లోకంతో పూర్తిచేసాను కచేరీ.

మా శర్మ ఎంతో సంతోషంగా వచ్చి ఈవాళ సంగీత సభ ఎంతో పులకించింది. రేపు శరత్ పూర్ణిమకి మా కళాపరిషత్తు వార్షికోత్సవంలో మళ్లా ఇదే కల్యాణ గానం వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అన్నాడు. ప్రసాదు 'రసోవైసహాఃఅనే నైరూప్యచిత్రం చిత్రించి తను స్వయంగా యివ్వడానికి చిన్నవాడవడంచేత సిగ్గుపడి శాస్త్రిగారి చేతిమీదుగా యిప్పించాడు.

ఇంకా కొంత కాలం పాడాలనే ఆశ కల్పించారు మిత్రులు.

                                                        ===+++===




Thursday, December 11, 2014

స్వర రచనలో సిద్ధహస్తుడు - నేదునూరి కృష్ణమూర్తి

కలైమామణి - శ్రీ సంగీతరావుగారు,  శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి గురించి 1976లో రచించిన వ్యాసం ఇది. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో సంగీతరావుగారు ఎందరో సంగీతజ్ఞులను పరిచయం చేసారు. ఆ పరంపర లోనిదే ఈ వ్యాసం:

                                                  శ్రీ నేదునూరి  కృష్ణమూర్తి
 తెలుగు దేశంలో సంప్రదాయ సంగీత విద్వాంసుడుగా ఉన్నత ప్రమాణాలని నెలకొల్పిన విద్వద్గాయకుడు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గానం ప్రముఖ దాక్షిణాత్య సంగీత విద్వాంసుల మన్ననలను పొంది రసికలోకం సన్మానాన్ని పొందింది. దక్షిణ భారత దేశం కర్ణాటక సంగీతానికి ఆది పీఠం. సంప్రాదాయ సంగీత పరీక్షకు నికషోఫలం. 

సంగీత మూర్తిత్రయం శ్రీ త్యాగరాజస్వామి, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి మొదలైన కర్ణాటక సంగీత సంప్రదాయ యుగకర్తలకు జన్మభూమి అయిన దక్షిణ దేశం, సంగీత సాధకులకు మార్గదర్శకమై ఉంది. సంగీత సాధనకు, సిధ్ధికి , రసజ్ఞతకు నిలయమైన దక్షిణ దేశంలో ప్రథముశ్రేణి విద్వాంసుడు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి పొందిన సన్మానం, గాయకుడుగా అతడు సాధించిన నిరపేక్షణీయమైన ఘనవిజయం.
తరతరాలుగా సంగీత సాధన జరుగుతున్నా, తెలుగు దేశంలో దక్షణాది బాణీ సాధించడం ఒక ఆదర్శంగానే ఉంది. ప్రముఖ వాగ్గేయకారుల రచనలు తెలుగు భాష ఆధారంగానే జరిగినా, ఆ సంగీతానికి మాత్రం హక్కుదారులు దక్షిణాత్యులుగానే భావించడం జరిగింది.  తెలుగు దేశంలో సంగీత సభలు నిర్వహిస్తూ, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వివిధ సంస్థల చరిత్రలు ఈ సత్యాన్ని ఋజువు చేస్తాయి. ఈ తరంలో తెలుగు దేశంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖ విద్వాంసులు ఎందరో కర్ణాటక సంగీతంలో పాండిత్యంతోబాటు దాక్షిణాత్యపు బాణీకూడా సాధించడంతో కర్ణాటక సంగీతంలో ఒక సమాన స్థాయి ఏర్పడడం గమనించగలం.

ఏ కళారంగంలోనైనా ఏ విధమైన కొత్తదనాన్నైనా సాధించగలిగినవారు వెంటనే గుర్తింపబడడానికి అవకాశాలు ఎక్కువ. సంప్రదాయ మార్గంలోనే సక్రమంగా అనుసరిస్తూన్న కళాకారులు తమ విశిష్టతను నిరూపించుకోవాలంటే ఎంతో ప్రతిభ, దీక్ష అవసరం. సంప్రదాయ విరహితంగా వేరే పంథాననుసరించిన వారు చాలా మంది ఉంటారు.  అటువంటివారివలన కళకి అరుదుగా మంచి జరుగుతుంది.  సంప్రదాయ మార్గంలో కనీసపు భద్రత ఉంది.

సంప్రదాయ మార్గంలో ప్రథమశ్రేణి గాయకుడుగా ధృవపడి నిలిచినవారు శ్రీ కృష్ణమూర్తి. కర్ణాటక సంగీతశైలిని నిర్దిష్టంగా, రసవత్తరంగా ప్రదర్శించగల ఆయన కంఠం లలిత గంభీరమైనది. వివిధ గమకములు పరిపుష్ఠంగా, శ్రవణపేయంగా ఆయన కంఠంలో ఒదుగుతాయి. శ్రీ కృష్ణమూర్తి గానం ఎంతో నిగ్రహం, ఔచిత్యమూ, ఆత్మవిశ్వాసమూ, సరసత కలిగి ఏ వైపరీత్యానికి తావు ఇవ్వదు. రాగాలాపనలోను, స్వరకల్పనలోనూ స్వకీయమైన విశిష్టతను నిరూపించుకొన్నవారు శ్రీ  కృష్ణమూర్తి.
అధ్యాపకుడుగా
  శ్రీ కృష్ణమూర్తి వివిధ వాగ్గేయకారుల రచనలు  గానం చేస్తున్నప్పుడు రసికులు తాదాత్మ్యం పొందుతారు.శ్రీ కృష్ణమూర్తి ఉత్తమగాయకులు మాత్రమే కాదు. ఉత్తమ అధ్యాపకులు కూడా. వారి పర్యవేక్షణలో, శిక్షణలో ఎందరో వర్ధమాన గాయకులు సంగీత సభలలో పాల్గొని తమ గురుసంప్రదాయానికి వన్నె తెస్తున్నారు.
తాళ్ళపాక రచనలు
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి నేడు ఆంధ్రప్రదాశ్ ప్రభుత్వ కళాశాలాధ్యక్షతను అతిదక్షతతో నిర్వహిస్తూ సంకీర్తన రచనకు ఆద్యుడైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు స్వర రచన చేస్తున్నారు. శ్రీ కృష్ణమూర్తి స్వరపరచిన కీర్తనలు విద్వల్లోకంలో ప్రచారం పొంది ఉన్నాయి.
అలరులు కురియగ ఆడెగదే అనే శంకరాభరణంలోని కీర్తన రసికలోకాన్ని ఎంతో ఆకర్షించింది.

ప్రాచీన గేయరచనలకు స్వరరచన చేయడం ఎంతో గురుతర బాధ్యతతో కూడిన కార్యం. ఈనాడు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు కూడా సంగీతమయంగా వినవచ్చే పరిస్థితి ఏర్పడింది. తప్పులేదు. ఏ మాటయినా పాటగా పాడవచ్చును. సంగీత చేరడంలో వాటి విశిష్టతకు గాంభీర్యానికి దోహదంగా ఉంటుందో లేదో గ్రిహించవలసి ఉంటుంది. భజగోవింద శ్లోకముల వంటి వైరాగ్య సూచకమైన రచనలకు భాగేశ్వరి, జయజయవంతి, బేహాగ్ లాంటి రాగాలలో పాడితే రసనిష్పత్తిలో రాగ తాళముల ప్రాముఖ్యాన్ని విస్మరించినట్టు అవుతుంది.
అష్టపదులు, తరంగాలు, సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు, రామదాసు, కీర్తనలు, మొదలైన అనేక గేయరచనలకు అధికారికమైన స్వర పాఠం అంటూ లేదు. గాయకులు వారి అభిరుచికి, ప్రజ్ఞకు అర్హమైన రీతిలో గానం చేయడం జరుగు ఉంది. ముఖ్యంగా ప్రాచీన రచనలకు సముచితమైన రాగ తాళములు నిర్ణయించడం ఒక సమస్య. ప్రాచీనమైన సంకీర్తనలు, గేయములు సాహిత్య ప్రధానంగా ఉంటాయి. సాహిత్యభావానికి, పదముల నడకకు అనుకూలంగా స్వరరచన సాగకపోతే కార్యసిధ్ధి సంతృప్రికరంగా జరగదు.
లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే అన్నది లలి తాలా వంగాలా తాపారీ శీలనా అని పరిణమిస్తుంది.
వివిధ రూపంగా ఉన్న సంకీర్తనలకు, గేయములకు వాటి ప్రత్యేక శైలిని నిరూపించడంలో సంప్రదాయాన్ని ఎంతో అనుభవంతోనూ, విజ్ఞతతోనూ గ్రహించవలసి ఉంటుంది.
సంగీత ప్రపంచంలో శ్రీ త్యాగరాజస్వామివారి ప్రభావంతో విద్వాంసుల ముఖత వినవచ్చిన ప్రతి రచనా వాటి ప్రత్యేక శైలిని కోల్పోవడం గమనించగలం. రామదాసు కీర్తన, పురందరదాసు కీర్తనా అన్నీ త్యాగరాజస్వామివారి కీర్తన నమూనాలోనే ఉంటాయి.
సహస్రాధికంగా ఉన్న అన్నమాచార్యులవారి కీర్తనలు మాన్యులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచినవి ఒకటి రెండు తేడాగా మూడు పదులు మాత్రం పుస్తకరూపంగా వచ్చాయి.
శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు రాగ తాళములు సూచింప బడ్డాయి. వాటిని అనుసరించడంలో సాధకబాధకాలు ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే అర్ధం అవుతాయి.  కొన్ని సంకీర్తనలకు తాళం సూచింపబడలేదు. సూచింపబడిన రాగాలు కొన్ని వాడుకలో లేవు.
స్వరరచయితగా ఈ పరిస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని అన్నమాచార్యులవారి సంకీర్తనల ప్రాచీన శైలిని నిరూపిస్తూ సార్ధకంగా స్వరరచన చెయ్యగలగడం లక్ష్య లక్షణ పారంగతులూ, ప్రతిభావంతులూ అయిన శ్రీ కృష్ణమూర్తిగారికే సాధ్యం.
సంకీర్తనాచార్యులు, భక్త శిఖామణి అన్నమాచార్యులవారి సంకీర్తనలు గాయక చూడామణి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరమాధుర్యంతో రాగహృదయులకు భక్తిని, రక్తిని కలిగించగలగడంలో ఆశ్యర్యంలేదు.                 



Friday, December 5, 2014

విశాలాక్షి గారి ముచ్చట్లు

                          

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురాతి మధురంగానే ఉంటాయి. కొన్ని అనుభవాలు ప్రత్యక్షంగా మనిషి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపితే, మరికొన్నిటి ప్రభావం పరోక్షంగా ఉంటుంది.  వాటి ప్రభావం ఎలా ఉన్నా పరిమళం మాత్రం జీవితమంతా వెన్నంటి ఉంటుంది. మరికొన్ని వ్యక్తిత్వవికాసంలో కూడా  దోహదపడతాయి. జీవితపు మలుపుల్లో మైలురాయిలాగా కనిపిస్తూ గుర్తుచేస్తుంటాయి.
ఈ జ్ఞాపకాల కాసారంలో ద్వివేదుల విశాలాక్షిగారు ఇక లేరు అని కాలం విసిరిన చిన్న గులకరాయి సృష్టించిన అల్లిబిల్లి తరంగాలే  వేణుగోపాలకృష్ణ రాసిన ఈ  వ్యాసంలోని అక్షరాలు.

ద్వివేదుల విశాలాక్షిగారు ఆంధ్ర సాహిత్యలోకానికి చిరపరిచితులే. విశాలాక్షిగారి భర్త శ్రీ ద్వివేదుల నరసింగ రావుగారు. డి.ఎన్.రావు అనేది ఆయన వ్యవహారనామం.  సంగీతరావుగారి విజయననగర జీవితంనుండే డి.ఎన్.రావుగారితో ఆత్మీయమైన అనుబంధం ఉండేది.   సినీరంగంలో స్థిరపడిన  ఘంటసాల గారు మద్రాసుకి వస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయని సంగీతరావుగారిని ఆహ్వానించారు. తండ్రికి నచ్చని సినీరంగం నాకూ వద్దనుకున్నారు సంగీతరావుగారు. కానీ  సంసారసాగరంలో పడి ఊపిరాడక మునుకలు వేస్తూ ఈదుతుంటే  మార్గాంతరాన్ని ఆలోచించారు మిత్రులు. ఆయనని బలవంతంగా విజయనగరం రైల్వేస్టేషన్ లో రైలు టికెట్ కొని మద్రాసుకి రైలెక్కించారు డి.ఎన్. రావు గారు. అది సంగీతరావుగారి సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ముఖ్యమైన  మైలు రాయి. 1955లోజరిగింది ఇది. తరువాత డి.ఎన్.రావుగారి కుటుంబం కూడా మద్రాసులో కాపురం పెట్టాకా ఈ చెలిమి మరింత దృఢం అయింది. డి.ఎన్. రావు గారు, విశాలాక్షిగారు సంగీతరావుగారి కుటుంబంతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇవి గోపీ (వేణు గోపాలకృష్ణ) చిన్ననాటి  విశాలాక్షిగారి కబుర్లు...
                                                                                  
                      నాకు తెలిసిన 'మంచోళ్ళు'                    
1965-66 ప్రాంతాల్లో అంటే నేను ఐదు-ఆరు చదివే రోజుల్లో నేను తరచుగా వెళ్ళే చోటు పూర్ణిమ, విజయరాఘవాచారి రోడ్డు. వాణీ మహల్ నుంచి విజయరాఘవాచారీ రోడ్డులోకి తిరిగేక కుడిచేతివేపున్న పెద్ద బంగళా. D.N. రావుగారి ఆఫీస్ కం రెసిడెన్స్. United States Educational Foundation of India. (అంతకు పూర్వం చెట్ పట్ –సేత్తు పట్టు - హేరింగ్టన్ రోడ్డులో ఉండేవారు. ఒక్కసారి వెళ్ళిన గుర్తు. 1964 అయుంటుంది.) నాన్నగారు వెళుతుంటే వెంట మేం పిల్లలం కూడా వెళ్ళేవాళ్ళం. మొదట్లో. తరవాత్తరవాత ఎవరూ లేకుండా నేనే వెళ్ళేవాణ్ణి. అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదని కొంత కాలానికి అర్ధం అయింది. అక్కడ నా వయసు వాళ్ళెవరూ లేకపోయినా అలా వెళిపోతూండడానికి కారణం అక్కడి friendly atmosphere. వాళ్ళబ్బాయి శ్రీనాధ్, అమ్మాయి ఛాయ, (ఇద్దరూ అన్నయ్య కన్నా పెద్దేనేమో). విశాలాక్షిగారు. అందరూ చాలా friendly గా ఉండేవారు, నేను చాలా చిన్నవాణ్ణే అయినా. గేటు దగ్గరనుంచి చాలా లోపలికి ఉంటుంది బంగళా. ఇప్పటికీ. కింద ఆఫీస్ పైన రెసిడెన్స్. పాత్ వేకి రెండు పక్కలా లాన్, మధ్యలో చిన్నకొలను, కొలనులో తెల్ల, వయొలెట్ కలువలు, రెండు హంస బొమ్మలు, చేపలు – (చేపలు ఒరిజినల్). ఇంటికి ముందు వెనకా పువ్వుల మొక్కలు, చెట్లు. సాయంత్రాలు నిశ్శబ్దంగాను, pleasant గాను ఉండేది ఆ ప్రాంతం. చుట్టుపక్కల బిల్డింగ్స్ మధ్య దూరం ఎక్కువ. ఆ ఇల్లు B.N. రెడ్డిగారికి (కొండారెడ్డిగారు?) సంబంధించిన వాళ్ళది కావొచ్చు. పక్కన constructions ఏవీలేని ఖాళీ స్థలం ఉండేది. దాన్ని టెన్నిస్ కోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకునే వారు ఛాయ. (ఒకవేళ ఆ స్థలంలో తరవాత కొండారెడ్డిగారి బిల్డింగ్ వచ్చుంటుందా? ఏమో?) ఆ రోజూల్లో ఆవిడ IIT  admission కి prepare అవుతుండేవారనుకుంటాను. ఆ సాయంత్రం వేళల్లో అలా వాళ్ళింట్లో కలిసినప్పుడు నాన్నగారు పాడేవారు. చాలా విషయాలగురించి మాట్లాడేవారు. పద్మని కూడా పాడమనేవాళ్ళు. (అప్పట్లోనే – 1969 కావొచ్చు – పద్మ ఆంధ్రా క్లబ్ లో పాడి ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది. రిలీజ్ కాని దైవం సినిమాలోని ఎన్ని మాయలు చేసినావయా పాడింది. పామర్తిగారు అప్పడు సెక్రటరీయో లేదా ఏదో ఆఫీస్ బేరర్. శారద కూడా పాడినట్టు జ్ఞాపకం. ఎన్ని మాయలు నేర్చినావయా, జయజయ సుందర నటరాజ, తిరుమలమందిర సుందర ఇవన్నీ సంగీతం పాఠంలో భాగంగా అందరికీ నేర్పించేవారు నాన్నగారు).
అమ్మమ్మ పూజలకోసం, వ్రతాలు వస్తే, వచ్చి పువ్వులు కోసుకెళ్ళు అనేవారు విశాలాక్షిగారు. తెలతెలవారుతుండగా మొక్కలమధ్య తిరుగుతూంటే పరిమళం అంటే ఏమిటో తెలుస్తుంది. పువ్వులు కోసుకురాడం నాకు దినచర్యే. అదికూడా ప్రతిరోజు "నేనొక పూలమొక్కకడ" పద్యం మెదులుతూండగా.  అలా వాళ్ళింటికెళ్ళడం అలవాటయింది. ఒకరోజు వాళ్ళింట్లో లంచ్. మొదటిసారి పసువు రంగు లో నెయ్యి చూసాను. అవును పసుపు వేసేను అన్నారావిడ. అలాగే మొదటిసారి కిచిడి. మొదటిసారి స్ట్రాబెరి ice cream. అది కూడా ఆవిడ తయారుచేసినదే (!?) Ice cubes tray లో. ఈ traysలో లా చిన్న చిన్న క్యూబ్స్ కావు. పెద్దవి. అవిప్పుడు చూస్తే అవికూడా చిన్నవిగానే ఉంటాయేమో మరి.
ఒకరోజు సాయంత్రం అందరూ లాన్ లో పేం కుర్చీలేసుకుని కూర్చుని మాట్లాడుకుంటుండగా నేను నా whistle ప్రతిభని వేళ్ళతోని, వేళ్ళులేకుండా చూపించాను. బాగుంది, కానీ అమ్మాయిల కాలేజీల దగ్గర వెయ్యకు అన్నారు విశాలాక్షిగారు. అప్పట్లోనే ఒక చిన్న బొచ్చుకుక్కపిల్లని తెచ్చుకున్నారు. దాని పేరు పిక్సీ. అది గడ్డిలో పరిగెడుతూ, దొర్లుతూ పడుతూ, పట్టకోడానికి వచ్చేది మమ్మల్ని.
శ్రీనాధ్ అప్పటికే సిటి బేంక్ లో పని చేసేవారో లేదో నాకు తెలీదు. అప్పట్లో దాని పేరు First National City Bank. మౌంట్ రోడ్డు మీద ఉండేది. ఒక రోజు సాయంత్రం ఎప్పటిలానే నా మాటలకి వాళ్ళు నవ్వుకుంటూ, శ్రీనాధ్, ఆ కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరికాయలు ముట్టుకుని దిగితే రెండు రూపాయలు పందెం అన్నారు. నేను రెడి అయిపోయాను. అప్పుడెవరెవరున్నారో నాకు గుర్తులేదు. రెండు చేతులతో పట్టుకుని చెట్టెక్కి కొబ్బరికాయలు ముట్టుకుని దిగేను. ఆయన కొత్త రెండు రూపాయల నోటిచ్చుకున్నారు. లైట్ పింక్, ఉల్లిపొర రంగులో ఉండే ఆ నోట్ల మీద వెనక పులి బొమ్మ ఉండేదనుకుంటాను. మర్నాడు ఉదయం గుండెలమీద ఎర్రగా చారలు. అమ్మ తిట్టింది అలా పందాలు కాసి డబ్బులు తీసుకోకూడదని. వాళ్ళింటికెళ్ళి కుర్చీకి తగిలించి ఉన్న ఆయన షర్ట్ జేబులో ఆ నోటు పెట్టేసాను. అది ఎప్పటికీ ఆయనకి తెలిసుండదు.  ఆ తరవాత ఆయన లండన్ వెళ్ళడం. అన్నీ జరిగిపోయాయి. నాకు వగరు అన్న రుచి తెలిసింది ఆయనవల్లే. ఇన్ని వాల్ నట్స్ చేతిలో పెట్టేరు. ఆ రుచేంటో గాని నచ్చలేదు. నవ్వి అలా తినరు అని మరిన్ని కిస్ మిస్ పళ్ళు ఇచ్చారు. Probably they were amused by my innocent boyish behavior.
ఒకరోజు రాత్రి వాళ్ళింటింనుంచి తీసుకువచ్చిన భారతిలో కరెన్సీ నోట్లు బయడపడ్డాయి. మరిచిపోయి పెట్టేసారేమోనన్నారు నాన్నగారు. నవ్వులాటకని తరవాతి తెలిసింది. అది అన్నయ్యకి వచ్చిన రెమ్యునరేషన్. 67లో BA   పూర్తయి బొబ్బిలినుంచి వచ్చేక కొన్ని రోజులు ఫౌండేషన్ నిర్వహించే GRE పరిక్షలకి ఇన్విజిలేషన్ వెళ్ళేవాడినని అన్నయ్య అన్నాడు.  
1966 అక్టోబర్ నాకు బాగా జ్ఞాపకం. ఘంటసాలగారి కచేరీ పంచశీల సమితి, హైదరాబాదు, కి వెళ్ళేరు నాన్నగారు. అప్పటికి కొన్నిరోజులుగా లల్లీకి (లలిత, రెండో క్లాస్ చదువుతున్నప్పుడు) ఒంట్లో బాగులేదు. కామెర్లు అని, ఇంకేదో. రాత్రికి రాత్రి సీరియస్ అయింది. అమ్మ, సావిత్రమ్మగారు గాభరా పడుతున్నారు. ఆవిడ కారుతీయించి రాయపేట హాస్పిటల్ తీసుకెళ్ళేరు. ఆ రాత్రి దానికి తెల్లారలేదు. సెరిబ్రల్ హెమరేజ్ అని అన్నారని D.N. రావుగారు చెప్పేరు. మర్నాడు ఘంటసాలగారు ఫ్లైట్ లో వచ్చేరు. ఆ మర్నాడు నాన్నగారు వచ్చేరు. కానీ మాకెందుకో (పిల్లలకి) నమ్మకంలేదు. అదెక్కడో ఇంకా ఉందనే చాలా రోజులు మా అనుమానం.

 లలిత
 C M బ్రహ్మానంద రెడ్డి ఘంటాసాలగారికి మెమెంటో ఇస్తున్నప్పటి ఫోటో, పక్కన నాన్నగారు హార్మోనియంతో ఉన్నది, మేడ మీద ఆఫీసు రూం గుమ్మంమీద ఉండేది. పంచశీల సమితి వారు ఆయనకిచ్చిన సన్మాన పత్రం పెద్దది గోల్డ్ ఫ్రేం తో ఉన్నది హాల్లో గోడమీద ఉండేది. ఆ రెండూ (with dates) ఈ విషయాలన్నీ మరపురాకుండా చేసినవి. ఆ సన్మాన పత్రంలో ఓ spelling mistake ఉంది. ఘ కి ఒత్తు ఎక్కడ పెట్టాలో చాలామందికి తెలీదు.... పోనీ కొంత మందికి తెలీదు... కాదా... at least  ఆ సన్మాన పత్రం రాసినతనికి తెలీదు. Ok.       
రెక్సోనా సోప్ చుట్టూ ఉండే రేపర్ మీద విడివిడిగా ఇండియా రాష్ట్రాలు గ్రీన్ కలర్ డ్రాయింగ్ తో కొన్ని రోజులు అమ్మేరు. వాటన్నిటిని కలెక్ట్ చేసి ఇండియా మేప్ పూర్తిచేసి పంపిస్తే ఏదో ఇస్తారు. అరే అవి నేను పారేసానే. ఈ సారి ఇస్తాను అని విశాలక్షిగారు కొన్ని ఇచ్చేరు.  అలా పూర్తి చేసిన మేప్ పంపిచాను కూడా. నాకేం రాలేదు మరి. ఈ కలెక్షన్ పిచ్చి ఎక్కువగానే ఉండేది. మేచస్ – అగ్గిపెట్టి మీద బొమ్మలు, ఐదు పైసలకి పది. కూరలు, ఏవి కొన్నా మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి సాయిబు కొట్లో మేచస్ కొనేసేవాణ్ణి. birds, animals, flags, air crafts ఇలా అన్నీ కలెక్ట్ చేసేవాణ్ణి. Calcutta Confectionary Works, Bombay, వాళ్ళ fruitee, milky bar toffees, bubble gum రేపర్స్ లోపల ఈ బొమ్మలుండేవి. ఒక్కొక్కటి పది పైసలు. Special indication ఉన్న రేపర్ పంపిస్తే వాళ్ళు ఖాళీ ఆల్బం పంపేవాళ్ళు. ఇంక ఆ ఖాళీలని నింపడానికి ఈ fruiteeలు, milky barలు కొంటూండమే పని. అక్క birds ఆల్బం మధ్యలో ఆపేసింది. Animals ఆల్బం పూర్తిచేసి పంపిస్తే నా పేరుమీద 35 ఉస్మాన్ రోడ్డు అడ్రస్ తో లెటర్ పేడ్, విసిటింగ్ కార్డ్స్ వచ్చేయి. పైన ట్రంకుపెట్టిలో ఇంకా ఉన్నాయి. కొన్ని నెలలు పట్టేది పూర్తిచెయ్యడానికి. కాని విశ్వమోహన్, అల్లు air crafts ఆల్బం వారం రోజుల్లోనే పూర్తిచేసి పంపించేసారు. ఆ buying spree ఎంతో ఊహించుకోవచ్చు. (అప్పటికి – వాళ్ళు శంకరాభరణం తీస్తారని విశ్వమోహన్ కాదు వాళ్ళ నాన్నగారే అనుకుని ఉండరు). ప్రపంచ దేశాల నాయకుల ఆటోగ్రాఫ్స్ ఉన్న పుస్తకం, స్టాంప్ సైజ్ లో వాళ్ళ పోటోలు వచ్చేయి వాళ్ళకి. కానీ general knowledge కి ఈ కలెక్షన్ బాగానే ఉపయోగపడుతుంది. చాలా దేశాల జెండాలు, వాళ్ళ కరెన్సీ, రకరకాల జంతువులు, పక్షులగురించి చాలా విషయాలు నాకు తెలిసాయి.
1968 నాటికి బజుల్లా రోడ్డు చివర ఉన్న ఒక ఇంట్లోకి మారిపోయిన రోజుల్లోనే విశాలాక్షిగారు నాకీ రేపర్స్ ఇచ్చేవారు. అక్కడనుంచి వాళ్ళు మలేషియా వెళ్ళిపోయారు. పనగల్ పార్క్ పోస్టాఫీస్ లో కొని తీసుకు వచ్చిన ఏరోగ్రాం మీద నాన్నగారు రాసిన చాలా ఉత్తరాలు పటాలింగ్ జయా అడ్రస్ కి నేనే పోస్ట్ చేసేవాడిని.  అప్పుడు, మలేషియా వెళ్ళడానికి ముందు, వాళ్ళింట్లో ఉన్న చాలా వస్తువులు మా ఇంటికి transfer అయ్యాయి. లాన్ లో వేసుకుని కూర్చునే పేం కుర్చీలు, గుండ్రటి పేం టీ పాయ్. ఇండేన్ గేస్ కనెక్షన్, బేడ్మింటన్ రేకెట్స్ with net, carom board with coins. 151 ఉస్మాన్ రోడ్ ఇంటి ముందు డబుల్స్ కోర్ట్ కి కావలసినంత చోటుండేది. 1975-76 లో మురళి, శాస్త్రి డబుల్స్ కోర్ట్ వేసి ఇచ్చేరు. రోజూ అందరం ముమ్మరంగా బేడ్మింటన్ ఆడేలా చేసినవి ఆ రేకెట్సే. అవి మెటల్ వి కావు. Wood. పైనున్న (అటక) ట్రంకుపెట్టి ఓ ట్రెషర్ బాక్స్ – వాళ్ళింటినుంచి వచ్చిన దేశవిదేశాల పిక్చర్ పోస్ట్ కార్డ్స్, ఆల్బంలు అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. 
ఇంకా చాలా మొక్కలు with కుండీలు. Light indigo కలర్ చామంతులు, చాలా పెద్దవి పూసేవి. అమ్మ, నేను చాలా ఏళ్ళు ఆ మొక్కల సంరక్షణ చూసాం. ఇంక పుస్తకాలయితే ఎన్నో. అందులో చాలా ప్రతిమా బుక్స్. ఆ పుస్తకాల్లో నేను ప్రతి సంవత్సరం పరీక్షలయ్యాక వేసవి సెలవులు ప్రారంభం కాగానే విధిగా చదివే పుస్తకం నండూరి రామ్మోహన్ రావుగారి అనువాదం – హకల్ బెరీఫిన్. ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. మార్క్ ట్వేన్ ఇంగ్లీష్ ఒరిజినల్ ఇప్పటి దాకా నేను చూడలేదు. ఆ అవసరం రాలేదు. మొన్ననే పద్మ అడిగింది కావాలని చదవడానికి. ఇంట్లో అప్పటికే నాన్నాగారి కలెక్షన్ లో ఉన్న టాం సాయర్, హకల్ బెరిఫిన్ పుస్తకాలు అట్టలూడి ముందు, వెనక కొన్ని కాయితాల్లేకుండా, నల్లటి దారంతో కుట్టబడి, ముక్కలైపోతూ ఉండేవి. కొత్తగా వచ్చిన పుస్తకాల్లో హకల్ బెరిఫిన్ రెండుండేవి. ఒకటి తక్కువ పేజీల పాత ఎడిషన్. రెండోది latest, unabridged. పెద్దది. సౌరకుటుంబం, అంతరిక్షం గురించి కొన్ని పుస్తకాలు చదివేను. లైట్ ఇయర్ – కాంతి సంవత్సరం concept అవి చదివాక తెలిసొచ్చింది.
అంతకు ముందే ఆవిడ రాసిన పుస్తకాలు, అభిమాన పురస్సరంగా – విశాలాక్షి అని ఆవిడ సంతకం చేసి నాన్నాగారికిచ్చిన పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేవి. కొవ్వొత్తి ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. వారధి రెండు కుటుంబాల కధ గా సినిమా అయింది. అందులో సుశీల వేణుగాన లోలుని గన బాగా పాడేరంటూంటారు నాన్నగారు. ఆవిడ పుస్తకాలు రీప్రింట్ చెయ్యడానికి కాపీలు లేవంటే నేనే కొన్ని పంపిచాను.                       
ఒకసారి విశాలాక్షిగారు మాత్రమే మలేషియా నుంచి వచ్చేరు. తెల్లవారుఝామున ఎప్పుడో ఫ్లైట్ లేండ్ అవుతుంది. ఆవిడని రిసీవ్ చేసుకుని హోటల్ (ఉడ్ లేండ్స్) లో దింపే బాధ్యత నాకిచ్చేరు. 1986-87. జ్ఞాపకం లేదు. North-East monsoon vigorous గా ఉండే రోజులు. నవంబరయి ఉంటుంది. Cyclone form అయింది. సరిగ్గా ఆవిడ వచ్చేరోజు సాయంత్రం గాలి, కుంభవృష్టి. కోడంబాకం నుంచి చెరువుల్లా మారిన రోడ్ల మీద కష్టపడి ఈదుకుంటూ airport చేరేసరికి తెల్లారిపోతోంది. Electric trains రాత్రి పొద్దుపోయాక ఉండవు. ఉన్నా నడవ్వు. రోడ్లమీద బస్సులు, ఆటోలు నడిచే అవకాశంలేనే లేదు. ఈ వాతావరణంలో ఫ్లైట్ లు కేన్సల్ అవాల్సిందే, లేదా divert అవాల్సిందే, లేండయే ప్రసక్తే లేదు. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ మలేషియానుంచి వచ్చింది కరెక్ట్ టైంకే, లేండయింది. వెళ్ళిపోయింది అన్నాడు airportలో. చందూర్ గారికి ఫోన్ చేస్తే వచ్చేసుంటారు హోటల్ కి వెళ్ళి చూడు అన్నారు. ఎలాగో మళ్ళీ కష్టపడి ఉడ్ లేండ్స్ చేరుకున్నాను. హోటల్ గదిలో క్షేమంగా ఉన్నారు ఆవిడ. But D.N. రావుగారు was not impressed when I tried to explain. Later he said if you were a good administrator (or planner?) you would have planned for rain. ఆయన చెప్పిన మరో సలహా – don’t carry chips on your shoulder.  మీ నాన్నగారి అభిప్రాయాలు, నమ్మకాలు మీ నాన్నగారివే – do not get carried away. 
మలేషియానుంచి తిరిగి వచ్చేసేక భీమిలిలో ఇల్లు కట్టుకున్న తరవాత రెండు మూడు సార్లు నేను వెళ్ళేను. పక్కనే సౌరీస్ గారి దర్శనం కూడా అయింది. అంతకుమునుపే చాలా ఏళ్ళ క్రితం తంబురా ఇవ్వడానికి తిరువణ్ణామలై వెళ్ళినప్పుడు చలంగారిని, ఆవిడని కూడా చూసాను. భీమిలిలో శ్రీనాధ్ మెమోరియల్ లైబ్రరీ ఉండేది ఓ పక్కన. ఒక సారి తగరపువలస దగ్గర సంతో ఏదో. సాయంత్రం భీమిలీ చేరేసరికి చీకటి పడిపోయింది. భోజనం అయ్యాక రాత్రి D.N. రావుగారే కార్ లో విశాఖపట్నం ఆసీల్ మెట్ట సిగ్నల్స్ దగ్గర డ్రాప్ చేసేరు. తోడుగా ఓ కుర్రాడు వచ్చేడు.
1998-99 అనుకుంటాను. ఆంధ్రా సోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ – అస్కా, ఒరిజినల్ గా విజయరాఘవాచారీ రోడ్లో అక్కడే ఉండే ఆంధ్రా క్లబ్ –మద్రాసు లో రాజాలక్ష్మీ అవార్డు తీసుకుందికి విశాలాక్షి గారు వచ్చినప్పుడు నేను, సుధ వెళ్ళి కలిసేం. సన్మానం తరవాత మర్నాడు మళ్ళీ హోటల్ రూంలో కలిసినప్పుడు నా కధ నీ కొండకు నీవే రప్పించుకో చూపించేను. నీకు శైలి ఉందయ్యా అన్నారావిడ అది చదివి.


 2001 లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం  స్వర్ణముఖి అపార్ట్ మెంట్స్ లో విశాలాక్షిగారు, డి.ఎన్. రావుగారిని కలిసినప్పుడు తీసిన వీడియోనుంచి ఈ ఫోటో.

2013లో  శ్రీవెంపటి చినసత్యంగారి పేరుమీద అవార్డు ఇచ్చిన సందర్భంలో నాన్నగారు విశాఖపట్నం వెళ్లారు. విశాలాక్షిగారిని చూడడంకోసం కిర్లంపూడి లేఅవుట్లోని పామ్ అపార్ట్ మెంట్స్ కి వెళ్లారు. 

హుదూద్ తుఫాన్ భీభత్సం చూసాక ఆవిడతో ఒకసారి మాట్లడమని చెప్పేరు నాన్నగారు. సరేనన్నాను. ఫాల్కివాలా ఫౌండేషన్ లో వెన్నెల internship కోసం మద్రాసెళ్ళి, ఎనిమిదిని (నవంబర్) తిరిగి బయల్దేరే రోజు ఉదయం ఈనాడు లో వార్తచూసాక తెలిసింది నేను చెయ్యాల్సిన పని ఇక ఎప్పటికి చెయ్యలేనని.    

Tuesday, October 7, 2014

పట్రాయని వారు

తెలుగువారి ఇంటిపేర్లలో అతి తక్కువగా వినిపించే ఇంటిపేరుగా పట్రాయని వారిని చెప్పవచ్చు.దక్షిణ భారత దేశపు బ్రాహ్మలలో ఆరామద్రావిడ శాఖకి చెందిన ఇంటిపేరు పట్రాయనివారు. మొదట సన్నిధివారు అనే ఇంటిపేరుతో ఉండేదట వీరి వంశం. అయితే  వీరి పూర్వీకులలో ఎవరో సైనిక విభాగంలోని ఒక విభాగానికి అధిపతిగా " పట్రాయడు" అనే పదవిలో ఉండేవారని, అందువల్ల అతని వంశానికి పట్రాయడు అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్పారు. వ్యాకరణరీత్యా ఇంటిపేర్లు ఔపవిభక్తికరూపంలో తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో  పట్రాయడు పదం పట్రాయనిగా కనిపిస్తుంది. తెలిసినంతవరకు పట్రాయనివారి కుటుంబానికి చెందిన పూర్వీకులలో 1800-1850 కాలానికి చెందిన పట్రాయని వెంకట నరసింహ భుక్త గారి పేరు వినిపిస్తుంది.,
శృంగవరపుకోట,విజయనగరం మధ్య చామలా పల్లి అనే అగ్రహారం ప్రతిగ్రహీత గా ఈ వంశంవారు అందుకున్నారు.
చామలా పల్లి 18 వృత్తుల అగ్రహారం. వృత్తి అంటే ఒక కుటుంబం జీవించడానికి కావలసిన భూ వసతి అని అర్థం. ఆనందగజపతి వంశపు రాజులతో ఈ పట్రాయని వెంకట నరసింహ భుక్తగారికి అనుబంధం ఉండేదని తెలుస్తోంది. నరసింహ భుక్తగారి కాలంలోనే ఆ అగ్రహారం, ఇతర ఆస్తులన్నీ హరించిపోయాయి. అతనికి ఆరుగురు కుమారులు.వారిలో పెద్దకుమారుడు పట్రాయని పాపయ్యశాస్త్రి. పాపయ్యశాస్త్రిగారి సోదరులు అయిదుగురిలో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాలవైపు వెళ్లారని, వారిపేర్లు పెదనరసన్న, చిన నరసన్న అని తెలుస్తోంది కాని మిగిలిన వివరాలు తెలియలేదు.
పాపయ్యశాస్త్రిగారి భార్య అవధాన్ల వారి అమ్మాయి నరసమ్మ. పాపయ్య శాస్త్రిగారు పౌరోహిత్యం చేసేవారని తోలు బొమ్మలాటలో ప్రావీణ్యం చూపేవారని తెలుస్తోంది. వీరు 35 ఏళ్ళ చిన్న వయసులోనే మరణించారు.
నరసింహశాస్త్రిగారు గుడివాడ అగ్రహారానికి చెందిన మధురాపంతుల కూర్మన్నగారి అమ్మాయి  సూరమ్మని వివాహం చేసుకున్నారు.. కూర్మన్నగారి పినతండ్రి కొడుకు, జ్ఞాతి మధురాపంతుల పేరయ్యశాస్త్రి గారు. నరసింహశాస్త్రిగారికి పినమామగారు.  పేరయ్యశాస్త్రిగారు అప్పటికే పేరుపొందిన సంగీత విద్వాంసులు. పట్రాయని నరసింహశాస్త్రిగారు వీరివద్ద శిష్యరికం చేసి సంగీతం నేర్చుకున్నారు. దాక్షిణాత్యసంగీత గ్రంధాన్ని నేర్చుకోవడం కోసం మద్రాసునగరానికి వెళ్ళి,నంజుండయ్యర్ వద్ద శిష్యుడిగా ఉన్నారు.బరంపురం,సాలూరు,విజయనగరం సంస్థానాలలో కచేరీలు చేస్తూ,సంగీతశిక్షణ ఇస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరు పొందారు.
నరసింహశాస్త్రిగారు బరంపురం లో చాలాకాలం సంగీత శిక్షణలు చేసిన తరువాత బొబ్బిలి రాజా వారి ఆదరణపొంది సాలూరు లో స్థిరపడ్డారు. సాలూరు గ్రామ ప్రజలు నరసింహశాస్త్రిగారిని ఎంతో ఆప్యాయంగా పెదగురువుగారని సంబోధించేవారు. వారి కుమారుడు సీతారామశాస్త్రిగారిని చినగురువుగారని పిలిచేవారు. సాలూరు లో పెదగురువుగారి శిక్షణలో ఎందరో సంగీత విద్వాంసులుగా పేరుపొందారు. 1920 ప్రాంతాలలోనే నరసింహశాస్త్రిగారు, కుమారుడు సీతారామశాస్త్రిగారు ఇద్దరూ సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాల అనే సంగీత విద్యాలయం ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేవారు. పర్ణశాలగా ప్రారంభమయిన పాఠశాల సీతారామశాస్త్రిగారు, సాలూరు ప్రజల అండదండలతో పటిష్టమయిన కట్టడంగా రూపొందింది.  ఇప్పటికీ సాలూరులో పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య కళాశాల పేరుతో నిర్వహింపబడుతున్న విద్యాలయంలో ఎందరో చిన్నారులు సంగీతం, నృత్యం మొదలైన రంగాలలో శిక్షణ పొంది వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.ఈ పాఠశాలను నేడు  జరజాపు రమేష్, సాలూరు రాజేశ్వర రావు మెమోరియల్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

నరసింహ శాస్త్రిగారి భార్య పేరు మంగమ్మగారు. వీరికి  ముగ్గురు సంతానం. వారిలో కుమార్తె ,కుమారుడు మరణించగా మిగిలిన ఏకైక కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి.నరసింహశాస్త్రిగారు పెదగురువుగారన్న పేరుతో, సీతారామశాస్త్రిగారు చినగురువుగారన్న పేరుతో ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందారు.. సీతారామశాస్త్రిగారు అతి చిన్నవయసులోనే మాతృవియోగం పొంది తండ్రితో పాటు ఉత్తర దక్షిణ దేశ యాత్రలు చేస్తూనే సంగీతం నేర్చుకొని కర్ణాటకసంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ సంగీత కచేరీలలో సంప్రదాయం కన్నా జనరంజకత్వానికి పెద్ద పీట వేసి స్వీయసంగీత రచనలను ఆలపించి అత్యంత జనాకర్షణ పొందారు. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వోకల్ పండితుడిగా ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దారు. సంగీత కళాశాలలో ఆయన వద్ద శిక్షణ పొందిన వారంతా ప్రభుత్వ కళాశాలలలో అధ్యాపకులుగా, సంగీత విద్వాంసులుగా, సినీ సంగీత శాఖలో ముఖ్యులుగా రూపొందారు. ప్రముఖ  సినీ నేపధ్యగాయకులు ఘంటసాల వెంకటేశ్వరావు, సుశీల మొదలయిన ప్రముఖులెందరో  శాస్త్రిగారి వద్ద శిక్షణ పొందిన వారే. 1957 ప్రారంభంలో పదవీవిరమణ చేసిన శాస్త్రిగారు మరి కొద్దికాలానికే 1957 మార్చి మాసం 17న మరణించారు.
సీతారామశాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. పట్రాయని సంగీతరావు,పట్రాయని నారాయణమూర్తి, పట్రాయని ప్రభాకరరావు. వీరు ముగ్గురూ తాతగారు,తండ్రిగార్ల సంగీత సంప్రదాయాన్ని కొనసాగించారు. పట్రాయని సంగీతరావుగారు అతి చిన్నవయసునుండి గాత్రంలో విద్వత్తును ప్రదర్శిస్తూ కచేరీలు చేసి,సంగీత శిక్షకుడిగా ఉంటూ కాలక్రమంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి సహాయకుడిగా,సహచరుడిగా,ఆయన మరణానంతరం కూచిపూడి నాట్య అకాడెమీలో సంగీతదర్శకుడిగా 35 సంవత్సరాలు తన సేవలనందించారు.వెంపటి చినసత్యం గారు రూపొందించిన నృత్యనాటికలకు సంగీతరావుగారు కూర్చిన సంగీతం ఆ నాటకాలకు జీవం పోసింది. దేశవిదేశాలలో కూచిపూడి నృత్యనాటకాలను ప్రదర్శించిన సందర్భంలో సంగీతరావుగారు కూడా సత్యంగారివెంట ఉండి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రసంగీత భూషణ, తమిళనాడు ప్రభుత్వం కళాకారులకు గౌరవపురస్కరంగా ఇచ్చే కలైమామణి,ఆంధ్రప్రభుత్వ ముఖ్యమంత్రి తో ఘనసత్కారం,మద్రాసు తెలుగు అకాడెమీ వారి స్వర్ణ పురస్కారం సంగీతరావుగారు అందుకున్న అనేక సన్మానాలలో కొన్ని.

సంగీతరావుగారికి ఇద్దరు అబ్బాయిలు,ముగ్గురు అమ్మాయిలు. అందరూ తండ్రిదగ్గర సంగీత శిక్షణ తీసుకున్నా, వారిలో రెండవ అమ్మాయి పద్మావతి సంగీతంలో విశేష ప్రజ్ఞ కనబరచి తమిళనాడు యూనివర్సిటీలో మ్యూజిక్ లో ఎం.ఏ,ఎం.ఫిల్ డిగ్రీలు సాధించారు. సంగీతరావుగారితో పాటు వెంపటి చినసత్యంగారి నృత్యనాటకప్రదర్శనలలో పాలుపంచుకుని గాత్ర సహకారం చేసారు. 

భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాద్ ఆలిండియా రేడియో కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారు.ఇంటి దగ్గర అనేక మంది శిష్యులకు సంగీత పాఠాలు చెప్తారు. వర్థమాన  సినీ నేపథ్యగాయని,ఇటీవలి నంది అవార్డు గ్రహీత  కుమారి గీతామాధురి   పద్మావతి దగ్గర చిన్నతనం నుండి సంగీతం నేర్చుకున్న శిష్యురాలే.

                                                           శ్రీ పట్రాయని నారాయణ మూర్తిగారు

సంగీతరావుగారి తమ్ముడు పట్రాయని నారాయణమూర్తిగారు వాసా వారివద్ద వీణ శిక్షణ పొంది విశాఖపట్నంలో ఎందరికో వీణలో,గాత్రంలో శిక్షణ ఇచ్చారు.ఆయన దగ్గర సంగీత శిక్షణ పొందిన వారు అధ్యాపకులుగా సంగీత బోధకులుగా స్థిరపడి ఉన్నారు. సినిమా రంగంలో కూడా సంగీతరంగంలో పేరుతెచ్చుకున్న విద్యార్ధులున్నారు. ప్రముఖ వర్థమాన నేపథ్య గాయకుడు మల్లికార్జున్ నారాయణమూర్తి గారి  శిష్యుడే.

నారాయణమూర్తిగారికి ఇద్దరు  కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతిర్మయి-ప్రముఖ రచయిత పంతుల శ్రీరామ శాస్త్రిగారి కోడలు.భర్త ఉద్యోగరీత్యా పాండిచ్చేరి లో కాపురం. జ్యోతిర్మయి పాండిచ్చేరిలో స్కూలు టీచర్ గా పనిచేస్తూనే తమిళనాడులో పలు ప్రాంతాలలో సంగీత కచేరీలు చేస్తూ పేరు పొందారు. రెండవకుమార్తె  కిరణ్మయి విశాఖపట్నం లో స్కూలులో సంగీత అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తున్నారు.
                                  శ్రీమతి కిరణ్మయి, శ్రీమతి పద్మావతి, శ్రీమతి జ్యోతిర్మయి

 కీ.శే. శ్రీ పట్రాయని ప్రభాకరరావుగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం అభ్యసించి డిప్లమా పొందారు. విజయనగరంలో చాలామందికి సంగీత శిక్షణ ఇచ్చారు. తండ్రి మరణానంతరం  సాలూరు లోని సంగీత పాఠశాల ను నిర్వహించి ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాలనుంచి వచ్చేవారికి  సంగీత పాఠాలు చెప్పారు.
                                              శ్రీ పట్రాయని ప్రభాకరరావుగారు
ఈ విధంగా పట్రాయని వంశంలో మూడు తరాల వారు సంగీతవిద్యా సరస్వతి ముద్దు బిడ్డలుగ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంగీతజ్యోతి దేదీప్యమానంగా వెలగడానికి కృషిచేసిన సంగీత విద్వాంసులుగా కనిపిస్తున్నారు