visitors

Tuesday, March 17, 2020

కూచిపూడి రత్న - పట్రాయని సంగీతరావు





1920, నవంబరు 2న జన్మించిన పట్రాయని సంగీతరావుగారు 100వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భం ఇది. జీవిత గమనంలో అర్థ శతాబ్దం పైగా కూచిపూడి నాట్యరంగంతో ఆయన సంగీత జీవితం ముడిపడి ఉంది.
 శ్రీ వెంపటి చినసత్యంగారి ఆహ్వానం మేరకు కూచిపూడి ఆర్ట్ అకాడెమీ లో సంగీత బోధకులుగా ప్రవేశించినా, అచిరకాలంలోనే సత్యంగారి నృత్యరూపకాలకు సంగీత దర్శకులుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వెంపటి చినసత్యంగారి నాట్యం, భుజంగరాయశర్మగారి సాహిత్యం, సంగీతరావుగారి సంగీతం అద్భుతంగా మేళవించి కూచిపూడి నాట్యానికే మహోన్నతమైన దశ పట్టింది. 

భుజంగరాయశర్మగారి సాహిత్యానికి అద్భుతమైన అపురూపమైన రాగాలతో సంగీతబాణీలను కూర్చడంతో పాటు గాత్రసహకారాన్ని, వీణతో వాద్యసహకారాన్నిఅందించేవారు. సత్యంగారు రూపొందించిన నృత్యనాటికలన్నీ దేశ విదేశాలలో అత్యంత ప్రజాదరణ పొంది విజయం సాధించాయి. 

తమ విజయాలకు సంగీతరావుగారు అందించిన తోడ్పాటును కూచిపూడి అకాడెమీ ఎప్పుడూ మరిచిపోలేదు. 2006 లో స్వర స్వారాట్ - వైణిక ప్రవాదక మణి పేరుతో శ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రిగారి పేరు  మీద జీవనసాఫల్యత అవార్డును బహూకరించారు కూచిపూడి అకాడెమీ. 2012 లో శ్రీ సత్యంగారు దివంగతులయ్యారు. శ్రీ సత్యంగారి 84వ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో అప్పటి మానవవనరుల శాఖా మంత్రి శ్రీమతి పురంధరేశ్వరిగారి చేతులమీదుగా డాక్టర్. వెంపటి చినసత్యం  పురస్కారాన్ని ప్రకటించి సంగీతరావుగారికి బహూకరించారు సత్యంగారి కుటుంబం. 

 సత్యంగారు 2012 లోను, అంతకుముందే శ్రీ భుజంగరాయశర్మగారు కూడా గతించారు. కూచిపూడి త్రిదిగ్గజాలలో ఒకరైన తమ గురువుగారు, శతవార్షికోత్సవం జరుపుకుంటున్నసందర్భంలో తమ సంగీతరావు మాస్టరుగారిని సన్మానించి తమ ఆత్మీయతను చాటుకున్నారు శ్రీ వెంకట్ వెంపటి - శ్రీ చినసత్యంగారి పెద్దకుమారుడు, వారి శ్రీమతి శ్రీమయి.  ఈ కార్యక్రమంలో  సంగీతరావుగారికి  కూచిపూడి రత్నఅనే అవార్డుతోపాటు, గండపెండేరము తొడిగి, కనకాభిషేకము జరిపించి గురువుగారిని సన్మానించారు, మార్చి 15, 2020 తేదీన. చెన్నెలో కూచిపూడి అకాడెమీ భవనంలో ఆత్మీయ విద్యార్థులు, కుటుంబసభ్యుల మధ్య శ్రీ వెంపటి వెంకట్ దంపతులు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంలో శ్రీ సంగీతరావుగారి ఆత్మీయ, ఆశీర్వచనాలను వారి పెద్దకుమార్తె శ్రీమతి రమణమ్మగారు సభాసదులకు చదివి వినిపించారు. ఆ ఉపన్యాసం ఇది.

 “ సంగీత కళకీ, నాట్యకళకీ రాజధాని చెన్నై.
తరతరాలుగా దాక్షిణాత్య కళలన్నీ, తమిళనాడు ప్రభుత్వం చేత దోహదం పొందుతూ ఉన్నవే. కూచిపూడి నాట్య అకాడెమీ విషయంలోనూ వారు అద్వితీయమైన ప్రోత్సాహాన్ని బహుకాలంగా అందిస్తూ ఉండడం చాలా ముదావహమైన విషయం.
మాన్యులు తమిళనాడు ప్రభుత్వం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చెన్నైలో సార్థకంగా నిలబడడానికి నాకు ఆధారమైనవారు - ఇద్దరు కళామూర్తులు. ఒకరు సినీ సంగీత లాక్షణికుడు శ్రీ ఘంటసాల. కూచిపూడి నాట్య దార్శనికుడు శ్రీ వెంపటి చిన్న సత్యం. కూచిపూడి నాట్య అకాడెమీ టి.నగర్, పానగల్ పార్కు ఎదురుగా ప్రారంభించారు ఆ రోజుల్లో. శ్రీ వెంపటి సత్యంఅకాడెమీలో సంగీతం కూడా పాఠ్యాంశంగా ప్రారంభించాలని సంకల్పించారు. సంగీతం క్లాసులు నన్ను తీసుకోమని అడిగారు.
ఆ సమయంలో - శ్రీ ఘంటసాల గారు అమెరికా సంచారం విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన తరువాత, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండేది కాదు. నేను చేయవలసిన పనీ ఎక్కువ ఉండేది కాదు. 
ఆ కారణంగా, శ్రీ ఘంటసాల అనుమతితో, అకాడెమీలో సంగీతం క్లాసులు ప్రారంభించడం జరిగింది.

ఆనాడు గౌన్లు, పరికిణీలు, నిక్కర్లు వేసుకున్న పిల్లలుగా పరిచయమైన ఆ పిల్లలు – ఈనాడు
 కూచిపూడి నాట్యకళామూర్తులుగా, ప్రసిద్ధ నాట్యవేత్తలుగా, నాట్యకళా గురువులుగా, మాననీయ మహిళా మూర్తులుగా రూపొంది రాణిస్తున్నారు. కానీ నా కంటికి వాళ్ళందరూ, నేటికీ కూచిపూడి స్కూలు పసిపిల్లలుగానే కనిపిస్తున్నారు. కూచిపూడి అకాడెమీతో నాకున్న అనుబంధం చాలా ఆత్మీయమైనది. కూచిపూడి నాట్యానికి అకాడెమీ చేసిన సేవ అపూర్వమైనది. నాట్యవేత్తలకు మార్గదర్శకమైనది.

అకాడెమీలో ప్రవేశించిన కొద్దిరోజుల్లోనే  ఢిల్లీ కార్యక్రమానికి నేను పాడవలసి వచ్చింది. కూచిపూడి కార్యక్రమాల్లో  మగవాళ్ళకి రేడియో మల్లిక్, సంగీతదర్శకుడు బి గోపాలం పాడుతూ ఉండేవారు. వాళ్ళు పాడిన పాటలు – రికార్డు చేసినవి వినినేను ఢిల్లీ కార్యక్రమంలో పాడ్డం జరిగింది.
సంగీత విమర్శకుడు శ్రీ సుబ్బుడు చేసిన కార్యక్రమ సమీక్ష చూసిన తర్వాత ధైర్యం కలిగింది.
శ్రీ కృష్ణ పారిజాతం, శాకుంతలం, క్షీరసాగరి మధనం ఈ నృత్య నాటికలకు కొన్ని సంవత్సరాలు గాత్ర సహకారం అందించడం జరిగింది. ఆనాటికి వాద్య  బృందంలో -  శర్మ బ్రదర్స్ గా పిలవబడిన గాయకుల్లో కామేశ్వర శర్మగారు – వైణికులు. ఆయన మా నాన్నగారి(శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి) సమకాలికులు. గోవిందరాజన్  మృదంగం, నాగరాజన్ ఫ్లూటు, ఎం. ఎస్. రావు వయొలిన్ తో వాద్యబృందం ఉండేది. గోవిందరాజన్ లో మంచి హాస్యస్ఫూర్తి ఉండేది. అందరినీ హాస్య ఛలోక్తులతో నవ్విస్తూ, వాతావరణం ఉత్సాహ భరితంగా ఉంచేవారు. నాగరాజన్ – ఆనాటి సుప్రసిద్ధ విద్వాంసులు. అలత్తూరు బ్రదర్స్ శిష్యుడు. సినిమా వాద్య బృందంలో ఫ్లూటు వాయించేవారు. తరువాత కూచిపూడి వాద్య బృందంలో చేరారు.

ఎం. ఎస్. రావుగారు మా విజయనగరం వారు. రావుగారి అన్నయ్య నా క్లాసుమేట్. ఆ రోజుల్లో నాకాయన వయొలిన్ వాయించేవారు. ఆనాటి మా బృందంలో సదా స్మరించదగిన వ్యక్తి శ్రీ భుజంగరాయ శర్మగారు. మధురకవి, పండిత వరేణ్యుడు, మరపురాని ఎన్నో నృత్య రూపకాలను రచించిన మహాకవి.
ఈనాడు వాళ్ళెవరూ లేరు. ఆత్మీయులైన వారి మధుర స్మృతులతోను, శుభాకాంక్షలతోను ఈ కార్యక్రమం సక్రమంగా విజయవంతంగా నడవాలని కోరుకుంటున్నాను.

కూచిపూడి అకాడెమీలో నా సేవ గాయకునిగా, వైణికుడిగా, హార్మోనిస్టుగా, సంగీత దర్శకుడిగా ఇలా అనేక రూపాల్లో నడిచింది.
నన్ను వైణికుడిగా, సంగీతదర్శకుడిగా లోకానికి పరిచయం చేసిన సహృదయం శ్రీ వెంపటి సత్యంగారిదే.
శాకుంతలం రెండోభాగం, పద్మావతీ శ్రీనివాసం, కల్యాణ రుక్మిణి, హరవిలాసం, అర్థ నారీశ్వరం, శ్రీ పద పారిజాతం, గోపికా కృష్ణ ఇలా అనేక నృత్య రూపకాలకి సంగీత దర్శకత్వ బాధ్యత వహించే అవకాశం కలిగింది.
ఆనాడు సినిమాల్లో సుప్రసిద్ధులైన వేదాంతం రాఘవయ్య, పసుమర్తి కృష్ణమూర్తి , వెంపటి పెదసత్యం, వెంపటి చినసత్యం నాట్య దర్శకులుగా ఉండేవారు. అయితే సంప్రదాయ కూచిపూడి నాట్యాన్ని మద్రాసులో నిలపాలి అన్న కోరిక శ్రీ చినసత్యం గారికే కలిగింది. కూచిపూడి అకాడెమీకి ఆయనే సంచాలకులుగా నిలబడ్డారు. కూచిపూడి నాట్యానికి అకాడెమీ ద్వారా శ్రీ సత్యంగారు చేసిన సేవ  అపురూపమైనది, అద్వితీయమైనది. వివిధ నాట్యరీతుల్లో ఉత్తమ లక్షణాలన్నీ సేకరించి, అనేక కూచిపూడి నాట్యాంశాలు రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కూచిపూడి నాట్యానికి ఆయన చేసిన సేవ ఒక శతాబ్దానికి చాలింనంత.

ఆయన పెద్ద కుమారుడు వెంకట్ కార్యదక్షత మీద, చిన్న కుమారుడు రవిశంకర్ అసాధారణ నాట్య ప్రజ్ఞ మీద విశ్వాసంతో, ఏ సమస్యా లేదన్న ధీమాతో ఉండేవారు సత్యంగారు. అకాడెమీ దురదృష్టం -2012 లో శ్రీ వెంపటి చినసత్యం నిర్యాణం చెందారు. తరువాత కొద్ది కాలానికే చిన్నకుమారుడు రవిశంకర్ అనూహ్య అకాల మరణం పాలయ్యారు.

ఈనాడు అకాడెమీ బాధ్యత వహించి సంచాలకుడుగా సమర్థంగా నడిపిస్తున్నారు  సత్యంగారి పెద్దకుమారుడు వెంకట్, వారి కోడలు శ్రీమయి నాయందు ప్రేమతో , ఈ సత్కార కార్యక్రమానికి పూనుకున్న వీరిద్దరికీ శుభాభినందనలు, శుభాశ్శీసులు తెలుపుతున్నాను.  వారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ కామేశ్వరి కూచిపూడి నాట్య సంప్రదాయాన్ని అంది పుచ్చుకుని అనూ   గా కొనసాగించాలి. పిల్లవాడు మృదంగం వాదకుడిగా శిక్షణ పొందుతున్నాడని , పిల్లలిద్దరూ నాట్య సంగీతాల్లో అభిరుచి కలిగి ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం కలిగింది. ఆ చిరంజీవులిద్దరికీ ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్నది.

కూచిపూడి నాట్య సంప్రదాయ శైలిని చెక్కు చెదరకుండా కాపాడే బాధ్యతను శ్రద్ధతో వహించి, సత్యంగారి కుటుంబం అఖండంగా కూచిపూడి నాట్య సేవను చేయగలిగే అవకాశాన్ని  ఆ నటరాజస్వామి  వారికి కలిగించాలని ప్రార్థిస్తున్నాను.











రచించిన మహాకవి.

x


15.3.2020






























Friday, August 25, 2017

అచ్చెరువుగొలిపే అఖండ జ్ఞాపకశక్తి!!


పట్రాయని సంగీతరావు గారి జ్ఞాపకశక్తి గురించి :

నిండా ముప్ఫయి ఏళ్ళు రాకుండానే ఏదీ జ్ఞాపకం ఉండడంలేదంటూ బాధపడుతుంటాం. చదవడానికేం - వందల పుస్తకాలు చదువుతాం కానీ రచయిత అభిప్రాయాన్ని లక్ష్యాన్ని గ్రహించడంలో చాలాసార్లు తికమక పడుతుంటాం. కానీ 97 సంవత్సరాల ముది వయసులో తాను ఎప్పుడో ఇరవయ్యేళ్ళ వయసులో చదివిన పుస్తకంలోని వ్యాసాన్ని, అందులోని శ్లోకభావాలను సంగీతరావుగారు ఉదహరించడం వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.


1935 అంటే సరిగ్గా 82 ఏళ్ళ క్రితం ఉదయిని అన్న పత్రికలో విశ్వనాథ సత్యనారాయణగారు సీత(కుందమాల) అనే వ్యాసం రాసారు. సంస్కృత కవులు మళ్ళీ మళ్ళీ రామాయణమే రాయడం గురించి చెబుతూ అదే విషయాన్ని కవి మురారి భట్టు అనర్ఘ రాఘవంలో రాసిన శ్లోకాన్ని ప్రస్తావించారుట. ఏదో మాటల సందర్భంలో చిన్నప్పుడు చదివిన ఆ వ్యాసం గురించి ఇన్నేళ్ళ తర్వాత గుర్తుంచుకొని చెబుతున్నారు సంగీతరావుగారు.


యదిక్షుణ్ణం జహతి రామస్య చరితం


గుణైరేతావర్భిర్జయతి జహతి జగదన్యో జగతికః

తమాత్మానం తత్తత్ గుణగరిమ గంభీర మధుర స్ఫురద్వాగ్బ్రహ్మాణః

కథముపకరిష్యన్తి కవయః


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉదయిని అనే సాహిత్య పత్రిక (దసరా -నాలుగవ సంచిక) లో సీత (కుందమాల) అనే శీర్షిక తో రాసిన వ్యాసం లో ఉదాహరించిన శ్లోకం ఇది.


మురారి భట్టు చెప్పిన శ్లోక భావం :


అనేక మంది కవుల చేత నలగ గొట్టబడిన రామ చరిత్రనే తిరిగి నువ్వెందుకు రాస్తున్నావు అంటే కవి మురారి భట్టు చెప్పిన సమాధానం :


కవుల యొక్క మృదు మధుర గంభీర స్ఫురద్వాక్కులు శ్రీరామచంద్రుని వంటి నాయకుని వర్ణించినపుడు కాక తమకు తాము సార్థక మవడం మరెలాగ? - ఇదీ భావం.


భవభూతి ఉత్తర రామ చరిత్ర లో శ్రీరామ చంద్రుణ్ణి ఉత్తమ నాయకుడిగా ఎలా అయితే చిత్రించాడో అదే విధంగా దిఙ్నాగాచార్యుడు కుందమాల అనే ప్రాకృత నాటకంలో సీత పాత్రను మహోన్నతంగా చిత్రించాడు. అదీ ' "సీత - కుందమాల" శీర్షిక తో ఉన్న విశ్వనాథ వారి వ్యాసం నేపథ్యం.


సంగీత రావుగారు చెప్పిన ఉదయిని 1935 నాటి (దసరాసంచిక) దొరికింది. అందులో సీత (కుందమాల) పేరుతో శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి వ్యాసం ఉంది. సంస్కృత కవులలో సగానికి పైగా అందరూ రామాయణాన్నే తిరిగి రాసారని చెప్తూ ఈ మురారి భట్టు శ్లోకాన్ని ఉదహరించారు. అది అనర్ఘ రాఘవంలోనిది అని సంగీత రావుగారుచెప్తే తెలిసింది కానీ వ్యాసంలో ఆ విషయం లేదు. శ్లోకం మాత్రమే ఉంది. రామకథలోని గొప్పదనం ఏమిటంటే దిఙ్నాగుడనే బౌధ్ధునిచేత అద్వైత మతము, కర్మ సిద్ధాంతం వ్రాయించింది అన్నారు విశ్వనాథ. మురారి భట్టు శ్లోకం ఉదయినిలో ఉన్నది ఇది -


యదిక్షుణ్ణం పూర్వై రితి జహతి రామస్య చరితం

గుణై రేతావద్భిర్జయతి పునరన్యో జగతికః

స్వమాత్మానం తత్తద్గు ణగరిమ గంభీర మధుర స్ఫురద్వాగ్బ్రహ్మాణః

కథ ముప కరిష్యన్తి కవయః


(ఉదయిని పత్రిక గురించి- ఈ పత్రిక కొంపెల్ల జనార్దనరా‌వు సంపాదకత్వంలో 1934లో ద్వైమాసిక పత్రిక గా ప్రారంభమయింది. ఆరు సంచికలు మాత్రమే వెలువడి ఆయన అకాలమరణంతో ఆగిపోయింది.ఉదయిని వెలువడింది స్వల్పకాలమే అయినా సాహిత్యచరిత్రలో గణనీయమైన పత్రిక గా నిలిచింది. కొంపెల్ల మరణానంతరం శ్రీ శ్రీ మహాప్రస్థానం రచనను ఆయనకు అంకితం చేస్తూ ఆ అంకితాన్ని కూడా గేయరూపంలోనే..

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!

సెలవంటూ ఈ లోకాన్ని వదిలి... అనే ఎలిజీ కవితను రాసారు. శ్రీశ్రీ మహాప్రస్థానం సంకలనంలో ఈ కవిత ను చూస్తాం)













Tuesday, May 9, 2017

వేయబోవని తలుపు - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గీతం

                

ఆకుండి వెంకటశాస్త్రిగారికి గురుపూజ జరిగిన సందర్భంలో సంగీతరావుగారు 1943 లో కాకినాడ వెళ్ళారు. అప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో పరిచయం ఏర్పడింది.  ఫ్రేజర్ పేట రినైసాన్స్ క్లబ్ లో వారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  సంగీతరావుగారు కచేరీ కూడా చేసారు.

 ఆవిధంగా కృష్ణశాస్త్రిగారితో  ఏర్పడిన పరిచయం, కొంతకాలం విరామం తరువాత  మద్రాసులో తిరిగి కొనసాగింది.   

దేవులపల్లిగారు  రాసిన   పూవులేరి తేవే చెలి, ప్రతి దినమూ నీ గుణకీర్తనము, వేయబోవని తలపు, మ్రోయింపకోయ్ మురళి, జయజయమహాంధ్ర జనయిత్రి, భ్రమించుముద్దు మోముతో, శివుడు తాండవమాడెను, చూచితివో లేదో చిన్ని కృష్ణుని సొబగు మొదలైన ఎన్నో రచనలను  సంగీతరావుగారు స్వరపరిచారు.  

యోగాంబళ్ స్ట్రీట్, కమలాబాయ్ స్ట్రీట్ జంక్షన్ దగ్గర దేవులపల్లిగారి నివాసంలో ఆయనను తరచు కలుస్తూ ఉన్నప్పుడు తాను స్వరపరచిన గీతాలను ఆయనకు వినిపిస్తూ ఉండేవారు. సంగీతరావుగారి అమ్మాయి పద్మావతి తో ఈ భావగీతాలను పాడించి వినిపించేవారు. 

కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారు గొప్ప సంగీతవేత్త. హైదరాబాద్ ఆకాశవాణిలో మ్యూజిక్  కంపోజర్ గా పనిచేసారు. సంగీతరావుగారి అమ్మాయి పద్మావతికి మామగారు. 1985-86 సం. లో పద్మావతి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో అనేక లలితగీతాలను ఆలపించారు. సూర్యప్రకాశరావుగారి వాద్య నిర్వహణలో పాడిన దేవులపల్లివారి గీతాలలో వేయబోవని తలుపు గీతాన్ని ఇక్కడ వినండి.

 ఒక పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించిన తరవాత ఆ రాగంలోని ఏదైనా కీర్తన, కృతి లేదా భావగీతం పాడడం అనేది పట్రాయని సీతారామశాస్త్రిగారి సంప్రదాయం.  

A raaga aalaapana preceding a keerthana or krithi is for exploring the whole gamut of the raaga. In the School of Patraayani Seetharama Shastry garu, it is achieved in a meaningful way through rendering a  padhyam followed by the keerthana or krithi. 

ఈ పాటని కూడా అదే పద్ధతి లో పాడారు పద్మావతి. 

కృష్ణశాస్త్రిగారి భావగీతాలన్నీ అమృతవీణ, మంగళకాహళి, కృష్ణపక్షము అనే సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. కృష్ణపక్షము లోని శారదశర్వరీఅనే ఖండికను ముందు పహాడీ రాగంలో పద్యంగా పాడారు. తరువాత  అమృతవీణ సంకలనంలోని కృష్ణాష్టమి శీర్షికలోని –

 “ వేయబోవని  తలుపు తీయమంటూ పిలుపు అనే గీతాన్ని పహడీ రాగంలో పాడారు.

   


                                                                                                                                                      

Sunday, April 30, 2017

నేటి వసంత - నాటి లలిత


అనుకోడానికి సప్తస్వరాలే అయినా అవి 12 స్వరస్థానాలుగాను (16 పేర్లతో)*, 22 శృతులుగాను విభాగం చెందడం వల్ల ఆరోహణ, అవరోహణలలో ఔడవ, షాడవ, సంపూర్ణ స్వరాల కలయికతో – permutation and combination భేదాలతో అవి కొన్ని వేల రాగాల వరుసలు (మూర్ఛన – scale)గా రూపొందించవచ్చన్నది తెలిసిన విషయం. ఆ వరుసలలో కొన్నివేల రాగాలు పేర్లతో వ్యవహరించడానికి వీలుగా నామకరణ చేయబడ్డాయి. అవి సప్తస్వరాలూ ఉన్న సంపూర్ణ రాగాలయిన 72 మేళకర్త రాగాలలో ఏదో ఒకదానికి జన్యరాగాలు అయే అవకాశం ఉంది. జనాదరణ వల్ల వాటిలో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పేరు లేనివి, ఉన్నా ప్రచారంలో లేని వరసలు కొన్ని వేలుంటాయి. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు పేరు తెలియని వరుసలకి కొత్త పేర్లు పెట్టడం జరుగుతుంది. సామాన్యులు దీనిని కొత్త రాగం కనిపెట్టడంగా భావిస్తుంటారు.

*సప్తస్వరాలు పదహారు పేర్లతో పన్నెండు స్వరస్థానాలుగా విభాగం చెందితే - 1. షడ్జమం. 2. శుధ్ధ రిషభం. 3. చతుశ్రుతి రిషభం (శుధ్ధ గాంధారం అని మరో పేరు). 4. సాధారణ గాంధారం (షట్ శ్రుతి రిషభం అని మరోపేరు). 5. అంతర గాంధారం. 6. శుధ్ధ మధ్యమం. 7. ప్రతి మధ్యమం. 8. పంచమం. 9. శుధ్ధ ధైవతం. 10. చతుశ్రుతి ధైవతం (శుధ్ధ నిషాదం అని మరో పేరు). 11. కైశిక నిషాదం (షట్ శ్రుతి దైవతం అని మరో పేరు). 12. కాకలి నిషాదం.  ఉదా: మొదటి మేళకర్త - కనకాంగి కి శుధ్ధ నిషాదం అంటే చతుశ్రుతి ధైవతానికే ఆ పేరు. 72 మేళకర్తల విభాగం ఈ 16 పేర్లను అనుసరించే చేయబడింది. న్యాయంగా 2 గాంధారాలు, 2 నిషాదాలు మొదలైన 12 స్వరాల ఆధారంగా అయితే 72 మేళకర్తలు రావు.

పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక (72 మేళకర్తలు), నాదముని పండితుల రచన- సంగీత స్వరప్రస్తార సాగరం (2044 రాగాలు) వంటి సంగీత గ్రంధాలను పరిశీలిస్తే  ఏ వరుసకి ఏ పేరు ఉంది అని తెలుసుకోవచ్చు. వీటిలో ప్రచారంలో ఉన్న అనేక రాగాల పేర్లు కనిపిస్తాయి.


ఆ విధంగా ప్రచారంలో లేని రాగ వరుసలో ఉన్న ఊహలు గుసగుసలాడే అన్న పాట సౌదామిని రాగంగా గుర్తించడం జరిగింది. ఒక అన్యస్వర ప్రయోగం వల్ల సుమనేశరంజని అన్న మరో ప్రచారంలో లేని రాగఛాయలు కూడా ఆ పాటలో ఉన్నాయి.

సంప్రదాయం, బానీ, ప్రాంతీయ పధ్ధతులననుసరించి కొన్ని రాగలక్షణాలు, పేర్లలో తేడాలు గమనించవచ్చు. రాగవిభాగంలో ఏ రకమైన తేడాలు లేకుండా ఏకరూప్యత సాధించడానికి, దక్షిణ భారత సంగీత విద్యార్ధులందరూ ఏకీకృత పాఠ్యప్రణాళికను అనుసరించడానికి వీలైన ప్రయత్నాలు సంగీత విద్వాంసుల సదస్సుల్లో జరుగుతూంటాయి. చాలా కాలం క్రితం మద్రాసు మ్యూజిక్ అకాడమి expert’s committee లలిత, వసంత రాగాల  విషయంలో ఈ విధమైన మార్పులు చేయడం జరిగింది.  


ఇప్పటి వసంత అప్పట్లో లలిత. నాడు వసంత నేడు లలిత. ఉదాహరణకి  ఒకనాడు లలిత రాగంలో ఉన్న "సీతమ్మ మాయమ్మ  "కీర్తనను  ఈనాడు వసంత రాగంగా గ్రహిస్తున్నారు. 

పట్రాయని సీతారామశాస్త్రిగారి కృతి - లలితే సరసగాన కళాశ్రితే ని   లలిత రాగంలో సమకూర్చినా,  దాన్ని ప్రస్తుతం వసంత రాగంగా భావించడానికి గల నేపధ్యం, ఈ లలిత, వసంత  రాగాల లక్షణాలు, గురువుగారి సంగీత రచన, సంగీతరావుగారి మాటల్లో.... గాత్రంలో... వినండి.





 


Monday, April 24, 2017

వాసా అప్పయ్యగారు


ఉత్తరాంధ్రలో వాసా వారిది సుప్రసిద్ధ సంగీత కుటుంబం.  వారి నివాస స్థలం బొబ్బిలి. బొబ్బిలి ఆస్థాన పండితులు వారు.  

వాసావారి సంప్రదాయంలో బిలహరి, కల్యాణి, లలిత, నవరోజు మొదలైన రాగాలలోని స్వరపల్లవులు ప్రసిద్ధమైనవి. 


వాసా అప్పయ్యగారికి సాంబయ్య, కృష్ణమూర్తి అని ఇద్దరు కొడుకులు.వీరు వీణ విద్వాంసులు. సాంబయ్యగారికి సంతానం లేక తమ్ముడి కొడుకు వెంకటరావుగారిని దత్తత తీసుకున్నారు.


ఆదిభట్ల నారాయణదాసుగారు కొంతకాలం వాసా సాంబయ్యగారివద్ద వీణాభ్యాసం చేసానని తన ఆత్మకథ "నా ఎరుక" లో రాసుకున్నారు.


వాసా వెంకటరావుగారు తరువాత కాలంలో విజయనగరం సంగీత కళాశాలలో వీణాచార్యులుగా పనిచేసారు.ఆయన కొడుకే ప్రసిద్ధ వీణ విద్వాంసుడు శ్రీ వాసా కృష్ణమూర్తి.ఇదొక తెలుగు సంగీతకుటుంబం. 

పట్రాయని సంగీతరావుగారు తన చిన్ననాటి జీవితంలో పరిచయమైన అనేక వ్యక్తుల, ప్రదేశాల గురించి చింతాసక్తి పేరుతో రాసిన తన స్మృతులలో శ్రీ వాసా అప్పయ్యగారి గురించి ప్రస్తావించారు. 

వాసా అప్పయ్యగారి శిష్యుడు గుమ్ములూరి వెంకటశాస్త్రిగారు గురస్తుతిగా మలహరి రాగంలో గీతాన్ని రచించారు. ఆ గీతాన్ని వారి శిష్యపరంపర పిళ్ళారిగీతాలతో పాటు నేర్చుకునేవారు.

సంగీతరావుగారు ఈ తరం ప్రాథమిక సంగీత విద్యార్థులకి ఆ గీతాన్ని పరిచయం చేస్తున్నారు.

ఈ గీతంల ధాతువు యథాతథం కాగా, మాతువు, ప్రారంభం మాత్రమే మూలంలో ఉన్నది. మిగిలినది పూరణం.



Monday, April 17, 2017

1957 ఏప్రిల్ 17 న శ్రీ సాలూరు చినగురువుగారి నిర్యాణం. అంటే ఈనాటికి సరిగ్గా  60 సంవత్సరాలు. 2010 సం. లో  గురువుగారి 110వ జయంత్యుత్సవం సందర్భంగా  మద్రాసు మ్యూజిక్ అకాడెమీ (మినీ)హాల్ లో ఆయనకు స్వరనివాళి సమర్పిస్తూ ఒక కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో ఔత్సాహికులు సాధన చేయడానికి  వీలుగా,  ఈ తరానికి గురువుగారి కృతులు,  పద్యాలను పరిచయం చేసే ఉద్దేశంతో  సంగీతరావుగారు పాడగా  చేసిన రికార్డింగ్స్ లో ఒకటి ఇక్కడ సమర్పిస్తున్నాం. ఈ రికార్డింగ్స్ చేసినప్పటికి సంగీతరావుగారి వయస్సు 90 సంవత్సరాలు అన్న విషయాన్ని  శ్రోతలు గుర్తుంచుకోవాలి.


ఈ క్రింది వాక్యం పైన నొక్కి ఆ పద్యాన్ని వినండి.
గురువుగారి రాగమందనురాగము సీసపద్యం



సంగీతంతో నాదోపాసన చేసిసరస్వతీ పుత్రులుగా ఆనాటి ప్రజల అభిమానాన్ని పొందారు శాస్త్రిగారు. తనకు ఈ విద్యను ప్రసాదించిన సరస్వతీదేవిని తల్లిగాపుత్రుడి లాగే ఆరాధించారు శాస్త్రిగారు. తన ఆనందాన్నిదుఃఖాన్ని కూడా సరస్వతి అమ్మవారితో పంచుకున్నారు.
సంగీతకళా మూర్తి శారదాదేవిని తల్లిగా భావించి ఆమెకు చేసుకున్న నివేదన-
సీ.
రాగమందనురాగ రసమునొల్కించుటే అమ్మరో నీ మందహాసమమ్మ
గడియారమునకె సద్గతి జూపు లయతాళ గతులెన్న నీ మందగమనమమ్మ
పూలమాలికల కూర్పును బోలు స్వరకల్ప నలు నీదు మృదుల భాషలు గదమ్మ
శ్రుతి యందు లీనమౌ గతి మది నిల్పుటే భారతీ నీ శాంత భావమమ్మ

నవరసంబుల సముద్భావమంద జేయుటే శారదా నీ కటాక్షము గదమ్మ
తే.గీ.
భావ రాగంబులనుతాళ ఫణితిశ్రుతియు
గలియ గానంబు చేసెడి గాయకునకును
శ్రుతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జనని
శరణు ముఖజిత శశి బింబ శారదాంబ

పద్యంలో కనిపిస్తుంది. ఇందులో వస్తువు సరస్వతిని స్తుతించడం. రాగమందు అనురాగ రసమునొల్కించుట ఆమె మందహాసమనిగడియారమునకే గతులు చూపే లయతాళగతులు ఆమె మందగమనమనిపూలమాలికలవలె కూర్చిన స్వర కల్పనలు ఆమె భాషలనిఈ విధంగా చేసే నవరస సముద్భవం ఆమె కటాక్షమనిభావరాగ తాళాలతో శ్రుతిపక్వంగా పాడి ఆమెను ఆనందింపచేయని గాయకుడు గాయకుడే కాదని వర్ణించారు.