visitors

Sunday, May 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై మూడవ భాగం

30.05.2021 -  ఆదివారం భాగం - 33*:
అధ్యాయం 2 భాగం 32  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'గొట్టం గొట్టై గొట్టహ టం టై టహఅంటూ చక్కిలిగింతలు పెట్టేప్పటికి అప్పటివరకున్న కన్నీటి ప్రవాహానికి ఆనకట్టపడి కిలకిలనవ్వుతూ నాన్న పొట్టమీద కూర్చొని కేరింతలు కొట్టేవారు పిల్లలు. రత్నకుమార్శ్యామలసుగుణశాంతి అంతా ఘంటసాలమాస్టారి పొట్టమీద కూర్చొని స్వారీ చేసినవారే. ఆయనకు ఇంట్లోవున్నప్పుడు బనీనుషర్ట్ వేసుకునే అలవాటు లేదు. భుజం చుట్టూ ఒక పెద్ద తువ్వాలు కప్పుకొని హాల్ లోని పొడుగాటి చేతుల వాలుకుర్చీలో విశ్రాంతిపొందేవారు. అదే సమయంలో అమ్మమీద పితూరీలు చెప్పడానికి పిల్లలు ఒక్కొక్కరుగా నాన్న దగ్గరకు చేరేవారు. వారిని సముదాయించి మంచి మూడ్ లో పెట్టడం మాస్టారికి బాగానే తెలుసు. మాస్టారు తరచు ఉపయోగించే ఈ 'టం టై టహాకు మూలం మాయాబజారే అని నా భావన. అందులో చిన్నమయ (రమణారెడ్డి) తన మంత్రదండంతో 'అం అహః', ఇం ఇహీః ఉం ఉహూఃఅని చదివే మంత్రాలు. వాటినే మార్చి మాస్టారు పిల్లలమీద ప్రయోగించేవారేమో అనిపిస్తుంది. పిల్లలందరికీ మాస్టారి దగ్గర చేరిక ఎక్కువే. విజయకుమార్ (పెదబాబు)కి తప్ప. ఆ విషయంలో నేను, పెదబాబు ఒకటే.  

 

ఘంటసాల మాస్టారు ఇంట్లోనే కాదుతాను పనిచేసే ప్రతీచోట వాతావరణం ఆహ్లాదకరంగాఅనుకూలంగా వుండేలా చేసేవారు. రకరకాల సరదా కబుర్లతో తన చుట్టూవుండేవారిని సంతోషపర్చేవారు.

 

ఒకసారి విజయాగార్డెన్స్ లో ఏదో సినిమా రీరికార్డింగ్ జరుగుతోంది. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకూ కాల్షీట్. లంచ్ బ్రేక్ లో ఆర్కెస్ట్రా వారు కొంతమంది బయటకుపోయారు. మాస్టారి లంచ్ ఇంటిదగ్గరనుండి తమ్ముడు కృష్ణ తెచ్చేవాడు. లేకపోతే కంపెనీవారు తెప్పించిన భోజనం చేసేవారు. మాస్టారు లంచ్ ముగించుకొని తర్వాతి సీన్ మ్యూజిక్ గురించి ఆలోచిస్తూ హార్మోనియం మీద ఏవో chords పడుతున్నారు. కొంచెం దూరంగా ఒక కుర్చీలో మా నాన్నగారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆయనకు లంచ్ బ్రేక్ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేయడం అలవాటు. కొందరు ఒకపక్కగా కునుకుతీస్తారు. మరికొందరు చతుర్ముఖ పారాయణంతో అదనపు కాసులు సంపాయిస్తారుపోగొట్టుకుంటూనూ వుంటారు.  మాస్టారి పక్కనే తబలా ప్రసాద్ కూర్చొని వున్నాడు. మాస్టారు అనుకున్న విధంగా సరైన బిట్స్ అమరడం లేదు. వాతావరణం కొంచెం బోరింగ్ గా మారింది.


ఈలోగా బయటనుండి ఆర్కెస్ట్రా లోని ఆచారిత్రయం ఒక్కొక్కరుగా లోపలకు అడుగుపెట్టారు. వారిని చూడగానే మాస్టారు చటక్కున 'శఠకోపచారీగారూఅంటూ హార్మోనియం మీద ఒక స్థాయిలో ఒక కార్డ్ వాయించారు. దానికి వెంటనే తబలా డక్క మీద ప్రసాద్ ఒక దరువు వేసాడు. వెంటనేమాస్టారు 'హనుమంతాచారిగారుఅని మరో స్థాయిలో మరో కార్డ్ పట్టారు. దానికి కూడా ప్రసాద్ జవాబు ఇచ్చాడు. ముచ్చటగా మూడవసారి 'నరేంద్రాచారిగారుఅని మరోస్థాయిలో పాడి మరో కార్డ్ వాయించారు. దానికీ ప్రసాద్ ధాటీగానే డక్క మీద ముక్తాయింపు ఇచ్చాడు. అందరూ ఒకటే నవ్వులు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. స్థబ్దుగా ఉన్నవారందరిలో చైతన్యం పుట్టి హుషారుగా   ఎవరిచోట్లకు వారు చేరుకున్నారు. రికార్డింగ్ థియేటర్లో వివిధ వాయిద్యాలకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తారు. స్ట్రింగ్ ఇన్స్ట్ర్ మెంట్స్ వారు ఒక గ్రూపుగావిండ్ ఇన్స్ట్రమెంట్స్ వారు ఒక గ్రూప్ గారిథిమ్ సెక్షన్ వేరేగా కూర్చుంటారు. ఒక్కొక్క గ్రూప్ కు రెండేసిమూడేసి మైకులు ఉండేవి.  

ముందుగాఈ ఆచారి త్రయం గురించి చెప్పాలి కదా! 

శఠకోపచారిగారు వైలినిస్ట్. సముద్రాల రాఘవాచార్యులవారి అల్లుడు. నరేంద్రాచారి గారు కూడా వైలినిస్టే. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్ఛుకున్నారు. మాస్టారికి విజయనగరం అన్నామ్యూజిక్ కాలేజీ విద్యార్ధులన్నా ఒక మమకారం వుండేది. వారందరికి తగిన అవకాశాలు కల్పించేవారు. రావూరి వీరభద్రం (మొదట్లో కోరస్ లు పాడేవారు)నరేంద్రాచారిమొసలికంటి సన్యాసిరావు (ముగ్గురూ వైలినిస్ట్ లే). ఇక ఇంతకు మునుపు చెప్పుకున్న హనుమంతాచారిగారు యూనివాక్స్ ప్లేయర్మంచి గాయకుడు కూడా. హిందుస్థానీ సంగీతంలో ప్రవేశముంది. అభంగాలుహిందీ భజన్స్ చాలా బాగా పాడేవారు. 'శ్రీరామచంద్ర కృపాళు భజమనఅనే గీతాన్ని మొదటిసారిగా ఆయన నోటే విన్నాను. హనుమంతాచారిగారు మంచి హాస్యనటుడు కూడా. చాలా కన్నడం సినీమాలలో నటించారు. 'ప్రేమ్ నగర్సినీమా మొదట్లో వచ్చే ఏరోప్లేన్ సీన్ లో కనిపిస్తారు. 



ఈ సీన్లో గాంధీ టోపీలో కనిపిస్తారు హనుమంతాచారిగారు

నాలుగు భాషల ప్రముఖ సీనీ సంగీత దర్శకులందరి దగ్గరా పనిచేసేవారు. మంచి వ్యక్తి. హనుమంతాచారి గారు కర్ణాటకమహారాష్ట్ర అంటూ బయట కచేరీలు ఎక్కువచేసేవారు. అలాటిచోట్లనుండి ఏవేవో వస్తువులు కొని ఘంటసాలమాస్టారికి ఇస్తూండేవారు. హనుమంతాచారి గారు తీసుకు వచ్చే సుగంధ వక్కపొడి ఎంతో బాగుండేది. ఒక్క పలుకు నోట్లో వేసుకుంటేచాలుఆ సువాసన ఎంతోసేపు వుండేది.

 

హనుమంతాచారి గారి అబ్బాయి రాజ్ కుమార్ (యోగి అసలు పేరు యోగీంద్రకుమార్). 'రాముతెలుగుతమిళ చిత్రాలలోని బాలనటుడు. ఆ సినీమాలోని నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాంటి సహృదయుడైన మంచి కళాకారుడు రావి కొండలరావుగారి ట్రూప్ తో 1981 లో  ఢిల్లీ నుండి మద్రాసు వస్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ కు జరిగిన ఘోర విపత్తులో దుర్మరణం పొందారు. హనుమంతాచారి గారు అన్న కొన్ని మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆయనను మాస్టారోఅమ్మగారో అడిగారుహాయిగా టి.నగర్ ఏరియాలో ఒక మంచి ఇల్లు కొనుక్కొని వచ్చేయచ్చు కదా అని ?

 

అందుకు హనుమంతాచారిగారు "ఎందుకమ్మా సొంత ఇల్లు. ఎప్పుడు ఎక్కడుంటామో తెలియదు. ఇవేళ మద్రాసురేపు బెంగుళూరు తర్వాత బొంబాయి.  సొంతిల్లంటే మనకు ఇష్టం వున్నా లేకపోయినా బలవంతంగా అదే ఇంట్లో పడివుండాలి. అదే అద్దె ఇల్లైతే దర్జాగా మనకు కావలసిన ఏరియాలో కావలసిన వసతులన్నీ అడిగి చేయించుకొని హాయిగా గడిపేయొచ్చు. స్థలం కొనడంఎవరినో నమ్మి ఇల్లు కట్టడంఅది మనకు నచ్చడంనచ్చకపోవడంఈ గొడవలన్నీ ఎందుకమ్మాఅద్దె ఇల్లే హాయి అని తన కన్నడ తెలుగు యాసతో అన్నారు. హనుమంతాచారి గారి మాటలు నాకు ఒక ఇంగ్లీష్ సామెతను గుర్తుకు తెస్తుంది. 'వెర్రి వెంగళప్పలు ఇళ్ళు కడతారుతెలివైనవారు వాటిలో నివసిస్తారుఅని తాత్పర్యం.

 

సొంతిల్లు కట్టడంలోని సాధకబాధకాలుకష్టనష్టాలు తెలియాలంటే చూడుడు బాలు మహేంద్ర తీసిన  నేషనల్ అవార్డ్ తమిళ ఆర్ట్ ఫిలిం  'వీడు' ( ఇల్లు) . ఈ సినీమాలో హీరో భానుచందర్ కు మన రత్నకుమారే డబ్బింగ్ చెప్పారు. ఏ గూడూ మన శాశ్వతం కాదు. దేవుడిచ్చిన గూడే (దేహం) శాశ్వతం కానప్పుడుమనం కట్టుకునే గూడు మాత్రం శాశ్వతమానిరంతరం నివసించడానికి.

 

హనుమంతాచారిగారు అప్పుడు ఎక్కడవుండేవారో కానీతర్వాత నాకు తెలిసేనాటికి కృష్ణవేణీ ధియేటర్ పక్క వీధి దామోదర్ రెడ్డి స్ట్రీట్ లో ఒక మేడమీద అద్దె ఇంట్లో ఉండేవారు. 

 

'ఏస్తబలిస్ట్ ప్రసాద్ ఘంటసాల ఆర్కెష్ట్రాకు ఒక లైవ్-వైర్. వురిమి జగన్నాథంగారు 1940-50 ప్రాంతాలలో జెమినీ స్టూడియో లో స్టాఫ్ తబలిస్ట్ గా పనిచేసేవారు. వారి స్వస్థలం సాలూరు . సాలూరి రాజావారి (జమీందారు) నాటకశాలలో సీనరీ తెరలు పెయింటింగ్ చేసేవారు. మా తాతగారికీ స్నేహితుడు. ఆయన పెద్ద కొడుకు రామలింగం ఆయన కూడా పేరు మోసిన తబలిస్ట్. ఎస్.రాజేశ్వరరావుకె.వి.మహాదేవన్ వంటి ప్రముఖ సంగీతదర్శకుల వద్ద పనిచేసేవారు. జగన్నాథంగారి మరో కొడుకు ప్రసాద్. అతను ఘంటసాలవారి ఆర్కెస్ట్రాలో సుమారు పదిహేడేళ్ళ వయసులోనే వచ్చి చేరాడు. ఆనాటికినాకు తెలిసీలక్ష్మణరావు గారురామలింగంగారు కూడా మాస్టారి దగ్గర అడపాదడపా పనిచేసేవారు.

 

విజయా సినీమాలకైతే అక్కడ భోగీలాల్ అనే ఆయన పెర్మనెంట్ తబలిస్ట్ గా వుండేవారు. ఆయన మాస్టారి పార్టీతో కచేరీలకు బయట వూళ్ళకు వెళ్ళేవారు. ఆ భోగీలాల్ అనే ఆయన మాస్టారి కచేరీకి ఏదో వూరు వెళుతూ రాత్రికి రాత్రి ట్రైన్ లోనే హార్ట్ అటాక్ తో మరణించారు. ట్రైన్ ఉదయం బెజవాడ చేరేవరకూ ఎవరికీ తెలియలేదు. మా నాన్నగారు కూడా వేరే కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేస్తున్నారు. బెజవాడ స్టేషన్ లో మాస్టారు దగ్గరుండి ఆ బాడీని మద్రాస్ తరలించడానికి కావలసిన ఏర్పాట్లు చేయించారట.

 

తబలా ప్రసాద్ మాస్టారి దగ్గర చాలా కాలమే పనిచేశాడు. కంపోజింగ్ లు రిహార్సల్స్ బయట ఊళ్ళ కచేరీలు అన్నిటికీ వచ్చేవాడు. మాస్టారి పార్టీలో అతి చిన్న కుర్రవాడు ప్రసాద్. చాలా ఛలాకీగాఅందరినీ తన చిలిపి చేష్టలతో ఏడిపిస్తూ అల్లరి చేసేవాడు. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అందరినీ తెగ నవ్వించేవాడు. అతని అరవ తెలుగు వినడానికి తమాషాగా వుండేది. కానీ తబలా వాద్యం విషయానికొచ్చేసరికి తెగ విజృంభించేవాడు. ఆ వేళ్ళలోని స్పీడ్పట్టుహావభావాలు సామాన్య శ్రోతలకు బహు ఆకర్షణగా వుండేది. ప్రసాద్ గురుముఖతా ఎవరి దగ్గరా తబలా నేర్చుకోలేదనే విన్నాను. తండ్రిఅన్నలే అతని గురువులు. అతని తబలా వాదనానికి అందరూ ముచ్చటపడేవారు.

 

ప్రసాద్  ఘంటసాల మాస్టారి కంపోజింగ్ లకు వచ్చేవాడు. కంపోజింగ్రిహార్సల్స్ వరకు బాగా వాయించేవాడు. మాస్టారు కూడా మెచ్చుకునేవారు. అతను వెంటనే రెండు చేతులూ జోడించి మాస్టారితో గుసగుసగా "ప్రొడ్యూసర్ కు చెప్పి మరో పది రూపాయలు ఎక్కువచేసి ఇవ్వండి" అనేవాడు. అందరూ అతని మాటలకు పగలబడి నవ్వేవారు. అలాగేమాస్టారి దగ్గర ఎక్కువ చీవాట్లు తినేది అతనే.  రికార్డింగ్ థియేటర్లో మానిటర్ చూసే సమయానికి నడక మార్చేసేవాడు. కంపోజింగ్ రిహార్సల్స్ లో వాయించింది కాకుండా మరేదో కొత్త నడక వాయించేవాడు. "ఒరే నాయనా ! ఇది కాదురాముందు అనుకున్నది వాయించరా ! టైమ్ వేస్ట్ చేయకురా!" అని మాస్టారు సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి గట్టిగా కేకెట్టేవారు.  బదులుగా "ఆ నడకే మాస్టారుఇది" అంటూ దబాయించేవాడు. కొంతసేపు పక్కనున్న డోలక్ వాళ్ళోరిథిమ్ ప్లేయర్సో వాయించి చూపాక ఒరిజినల్ నడకకు వచ్చేవాడు. ఇది అల్లరివల్ల కొంత, శ్రుతజ్ఞానంతో సంపాదించిన విద్యవల్ల కొంత అని పెద్దలు అభిప్రాయపడేవారు. కానీ ప్రసాద్ తన తబలా వాదనంతో పాటలకు ప్రత్యేక సొబగులు తెచ్చినమాట మాత్రం ఖాయం. మాస్టారిలాగే ప్రసాద్ వున్నచోట వాతావరణం చాలా లైవ్లీగా వుండేది.  ప్రసాద్ మీది ఆకర్షణతోనే నేను చాలా రికార్డింగ్ లకు రీరికార్డింగ్ లకు వెళ్ళాను. అతనికి ఘంటసాల మాస్టారంటే విపరీతమైన భక్తి వుండేది. క్రమక్రమేణా ప్రసాద్ చాలా బిజీ అయిపోయాడు. నాలుగు భాషల మ్యూజిక్ డైరక్టర్స్ అంతా ప్రసాద్ లేకుండా రికార్డింగ్ లు చేసేవారు కాదు. రోజుకు మూడు కాల్షీట్లు పనిచేసేవాడు. దీనివలన ఘంటసాలవారి కంపోజింగ్ లకురిహార్సల్స్ కు సమయానికి రాలేకపోయేవాడు. రికార్డింగ్ లకు మాత్రం హాడావుడి హడావుడి గా వచ్చిపోయేవాడు. అతను తబలా ముందు కూర్చుంటే మాత్రం పులే. తర్వాతఅతని స్థానంలోకి జడ్సన్ తబలాకుసుబ్బారావు డోలక్ కు వచ్చారు. ఆ ఇద్దరు కూడా మాస్టారి దగ్గర చాలా ఏళ్ళే పనిచేశారు.


మా నాన్నగారు తబలా ప్రసాద్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన ఒక పెద్ద కథ "వాద్యగోష్ఠి"  చందూర్ గారి 'జగతిపత్రిక లో ప్రచురితమైంది. ప్రసాద్ కు తెలుగు చదవడంరాయడం తెలియదు. మా నాన్నగారు ఇచ్చిన ఆ పుస్తకాన్ని తాను వెళ్ళిన ప్రతీ చోటా చూపించి 'సంగీతరావుగారు నా మీద కథ వ్రాసారుఅని అందరికీ చెప్పి తెగ మురిసిపోయాడు.

 

అలాటి తబలా ప్రసాద్ ను 1974 తర్వాత కొన్ని దశాబ్దాల పాటు చూడనేలేదు. తర్వాతనా ప్రోద్బలంతో టివికె శాస్త్రిగారు మా మద్రాస్ తెలుగు అకాడెమీ వేదికల మీద రెండుసార్లు  ప్రసాద్  తబలా సోలో ప్రోగ్రామ్స్ పెట్టించారు. అప్పుడే అతనిని చూడడం. మనిషి బాగా మారిపోయాడు. చాలా సన్నగా వుండే మనిషి కొంచెం లావయ్యాడు. పట్టు లుంగీపట్టు షర్ట్నాలుగు వేళ్ళకూ ఉంగరాలు,మెడలో చైన్లుకున్నక్కుడి వైద్యనాథన్ స్టైల్ లో నుదురంతటికీ పెద్ద కుంకుమ బొట్టుతో వచ్చాడు. మనిషిలో అదే చైతన్యం. ముఖంలోమాటలో అదే చైతన్యం. అతనికి ప్రజలను ఎలా ఆకర్షించాలోవారికి ఏది వినిపిస్తే మెస్మరైజ్ అవుతారో ఆ పట్లన్నీ బాగా తెలుసు. మా వేదిక మీద పాల్గొన్నరెండు సార్లూ ప్రసాద్ ఘంటసాల మాస్టారు చెప్పిన ఒక ఉదంతాన్నే తబలామీద వాయించి చూపించి ప్రేక్షకులను తెగ నవ్వించాడు. దీనిని తన టివి షోలలో కూడా ప్రదర్శించేవాడు.

 ఆ కథ ఏమిటంటే -

 ఘంటసాల మాస్టారు 1958-59 లలో 'సతీ సుకన్యఅనే సినిమా కు సంగీతం నిర్వహించారు. ఆ సినిమాషూటింగ్పాటలు కంపోజింగ్ అన్నీ మైసూర్ ప్రీమియర్ స్టూడియోలోనే జరిగాయి. ఆర్కెష్ట్రా కూడా అక్కడివారేనని విన్న గుర్తు. పాటల కంపోజింగ్ కు ఘంటసాల మాస్టారు మైసూరు వెళ్ళినప్పుడు పాటల కంపోజింగ్ కు ఒక తబలా విద్వాంసుడిని ఏర్పాటు చేసారట. కానీ ఆయనకు సినీమాలలో పాటలకు వాయించే అలవాటుఅనుభవం లేదని తెలిసిందట. ఎలాగో అతనితోనే గడుపుకున్నారట. పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారి ట్యూన్స్ కు ఆ తబలా విద్వాంసుడు ఎలాటి  హావభావాలతో వాయించాడో అవన్నీ చాలా స్వారస్యంగా మాస్టారు మద్రాసు వచ్చాకతన కంపోజింగ్ ల సమయంలో నటించి చూపించి అందరినీ వినోదపరిచారట. ఆ సంఘటననే ప్రసాద్ మా వేదికమీద తన తబలా సహాయం తో మిమిక్రీ చేసి చూపించాడు. ఏ హాస్యనటుడికి దొరకనంత రెస్పాన్స్ తబలా ప్రసాద్ కార్యక్రమానికి లభించింది.

 

అలాగే రీరికార్డింగ్ల సమయంలో ప్రసాద్, చిదంబరం  ఎస్.జయరామన్ అనే తమిళ గాయకుడిని మహాబాగా ఇమిటేట్ చేసి చూపేవాడు. అందుకోసం ముందుగా వైలినిస్ట్ చిత్తూర్ సుబ్రమణ్యంగారి స్టీల్ డబ్బాలోని తామలపాకులుసీవల్ అన్నీ నోటినిండా దట్టించి నములుతూ ఆ లాలాజలం నిండిన నోటితో సి.ఎస్.జయరామన్ పాత పాటలు పాడేవాడు. జయరామన్ గొంతు తాంబూలం వేసుకొని పాడినట్లుగా వుండేది. విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతంలో శివాజీ గణేశన్ కు 'పుదయల్ అనే సినీమాలోని ఒక హిట్ సాంగ్ ను ప్రసాద్ మిమిక్రి చేస్తూ అందరినీ తెగ నవ్వించేవాడు.

 

తబలా ప్రసాద్ కు దాదాపు 77 ఏళ్ళు వచ్చేసాయి. అయినా మనిషిలోని ఆ పాత ఉత్సాహం అలాగే వుంది. ఘంటసాల మాస్టారి మీది భక్తితో ఇప్పటికీ అప్పుడప్పుడు రతన్ను కలియడంలేదా ఫోన్ లో మాట్లాడడం చేస్తూంటాడు.


మార్చ్ 7, 2019
 

తబలా ప్రసాద్ అనే ఉరిమి లలితా ప్రసాద్

సినీమాలకు ఏనాడో దూరమైపోయిన మానాన్నగారిని ఆమధ్య తబలా ప్రసాద్  కలుసుకొని ఆప్యాయంగా మట్లాడి కొంతసేపు గడిపాడు. అది ఆనాటి వ్యక్తుల మధ్య వుండే స్నేహానురాగాలుభక్తి విశ్వాసాలు అవన్నీ  ఈ తరం వారికి రుచి చూపించడం కోసమే ఈ 'నెం.35ఉస్మాన్ రోడ్'.

 💥కొసమెరుపు💥

ఘంటసాల సావిత్రమ్మగారికి అక్క చెల్లెళ్ళు చాలామందే వుండేవారు. తోడబుట్టినవారు కొందరైతే ఆవిడ సాన్నిహిత్యంతోరావమ్మలాటి  చెల్లెళ్ళు మరి కొందరు.  ఆ జాబితాలోకి కొత్తగా మరో ఇద్దరు - అక్కాచెల్లెలు వచ్చి చేరారు. మోహినికుమారి. తెలుగువారే. సావిత్రమ్మగారి స్నేహ బృందమూ పెద్దదే. బెంగుళూరు సరోజినిగారి కుటుంబంనెల్లూరి పవని నిర్మల ప్రభావతి (ప్రముఖ రచయిత్రి)గారి కుటుంబం ఘంటసాల కుటుంబానికి మంచి ఆప్తులు. వీరందరి రాకపోకలతో 'నెం.35, ఉస్మాన్ రోడ్సదా కళకళలాడుతూవుండేది. 

ఆ విశేషాలన్నీ వచ్చే వారమే...

 🌿

ఆ ఇద్దరూ మంచి మిత్రులే. అన్నగారి అనుయాయులే. ఘంటసాల మాస్టారికీ సన్నిహితులే. ఆ ఇద్దరూ కలసి అన్నగారితో ఒక మంచి చిత్రం తీసి రాష్ట్రపతి బహుమానం కూడా పొందారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ విడిపోయి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం...

ఈలోగా  ఆ రెండు కుంపట్ల వారెవరో మీరూ కాస్తా ఆలోచించండి....

 

              సశేషం...


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, May 23, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై రెండవ భాగం

23.05.2021 - ఆదివారం భాగం - 32*:
అధ్యాయం 2  భాగం 31 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఒకానొక శుభోదయాన నిద్రలేచి నెం.35,ఉస్మాన్ రోడ్  బాల్కనీలోకి వచ్చి చూడగానే రోడ్ కు అవతలవేపున్న ఇంటికి  అతిపెద్ద తెలుగు సినీమా కటౌట్ ఒకటి బ్రహ్మాండంగా కనిపించింది. మద్రాస్ లో ఒక తెలుగు సినీమాకు అంత పెద్ద కటౌట్ చూడడం అదే ప్రథమం. అందులోనూ కత్తి పట్టుకున్న ఎన్.టి.రామారావు పోస్టర్. మహా థ్రిల్లింగ్.

నెం.35, ఉస్మాన్ రోడ్ దక్షిణాన వున్న  34 నెంబర్ ఇంటికి ఎదురుగా కెవి రెడ్డిగారి ఇంటి వెనకభాగం. మెయిన్ గేట్ మురుగేశ మొదలియార్ రోడ్ లో వుండేది. ఉత్తరాన ఉన్న 36 నెంబర్ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటికి ఈ సినీమా పోస్టర్.

ఇంతకూ ఆ సినీమా ఏమిటో తెలుసా ! 'కంచుకోట'. 


ఆ కటౌట్ లో భారీ ఎన్.టి.ఆర్ తో పాటు సావిత్రి, దేవికకాంతారావు కూడా చిన్నగా కనిపించారు. ఎన్.టి.ఆర్ కటౌట్  పూర్తిగా రంగు రంగుల చెమ్కీ బిళ్ళలు అతికించడంతో  జిగేల్ జిగేల్మనిపించేవి. రాత్రిపూట అయితే కార్ల లైట్ల వెలుగు ఆ చమ్కీ బిళ్ళలమీద పడి రంగురంగులుగా మిరుమిట్లు గొలుపుతూ ఆ పక్కనుండి వెళ్ళేవారికి మహా ఆకర్షణగా వుండేది. కంచుకోట సినీమా ప్రివ్యూ కానీ, లేక విడుదలైన మొదటి రోజే చూసేయాలన్నంత ఆసక్తితో వుండేవాడిని.

రెండూ జరగలేదు. ఆ ఏడాది మా పబ్లిక్ ఎక్జామ్స్ సమయంలో రిలీజ్ కావడంతో  మద్రాస్ లో అటు ప్రివ్యూగానీ మా ఊళ్ళో సినీమా థియేటర్ లోనూ చూడ్డం అవలేదు. అసలు ఇంతవరకూ కనీసం టివిలో కూడా 'కంచుకోట ' చూడలేదు.

కానీఈ సినీమాలో పి.సుశీల, జానకి పాడిన 'సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూపాట మాత్రం ఈనాటికీ సూపర్ హిట్ సాంగ్. సందేహం లేదు.


సరిలేరు నీకెవ్వరూ...

విశ్వశాంతి వారి 'కంచుకోట'. దర్శకుడు సి.ఎస్.రావు. సోషల్ సినీమాలకు ఎక్కువగా డైరక్ట్ చేసే సి.ఎస్.రావు ఒక జానపదానికి డైరక్ట్ చేయడం నాకు వింతగా అనిపించింది.

ఆ ఇల్లు చిత్రనిర్మాత U.విశ్వేశ్వరరావుగారిది (అద్దెకే అనుకుంటాను). ఆఫీస్ కమ్ రెసిడెన్స్. సంగీతం కె.వి.మహాదేవన్. ఈ విషయం నాకు మరింత ఆశ్చర్యం కలిగించింది. పామర్తిగారు, విశ్వేశ్వరరావుగారు, దయాసాగర్ గారు మంచి స్నేహితులు. విశ్వేశ్వరరావుగారు అనేక డబ్బింగ్ సినీమాలు తీశారు. వాటన్నిటికీ పామర్తిగారే సంగీతం నిర్వహించారు.  విశ్వశాంతిలో దయాసాగర్ గారి పొజిషన్ నాకు సరిగ్గా తెలియదుకానీపామర్తిగారు మాత్రం అది తన సొంత కంపెనీ అన్నట్లుగా వుండేవారు. సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని అప్పారావు (తరవాత కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి) కూడా తరచూ అక్కడే వుండేవారు. బహుశా ఆ సినీమాకు ఆయన కె.వి.మహాదేవన్ దగ్గర పనిచేసేవారేమో.  

విశ్వేశ్వరరావుగారి భార్యఆవిడ పేరు గుర్తుకు లేదు కానీ అందరూ ఆవిడను బేబీ అనేవారు. వారికి ఒక చిన్న బేబి. సావిత్రమ్మగారిని కలుసుకుందుకు అప్పుడప్పుడు ఈ పెద్ద బేబిచిన్న బేబి  వచ్చేవారు. పామర్తిగారి కుటుంబంతో మంచి స్నేహం వుండేది.

విశ్వశాంతి వారు తీసే మొదటి స్ట్రైట్ సినీమాకు తానే సంగీత దర్శకుడనని పామర్తిగారు చాలా నమ్మకంతో వుండేవారు. కంచుకోట తర్వాత అనేక పెద్ద సినీమాలు తీసి అంచెలంచెలుగా లయన్U.విశ్వేశ్వరరావుగారు ఎదిగిపోయారు. (ఆయన లయన్స్ క్లబ్ మెంబర్). తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలలో ఒకరుగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇందుకు అన్నగారి ఆశిస్సులే కారణం. త్రివిక్రమారావుపుండరీకాక్షయ్యవిశ్వేశ్వరరావుగార్లు రామారావు గారికి అతి సన్నిహితులు. ఎన్.టి.ఆర్ కుటుంబంతో బాంధవ్యం కూడా వుందనుకుంటాను. తర్వాత, తర్వాత విశ్వేశ్వరరావుగారు ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో, ఫిలిం అవార్డ్స్ జ్యూరీలో అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ఉస్మాన్ రోడ్ లో కొన్నేళ్ళు వున్నాక హబీబుల్లా రోడ్ లోని విశ్వశాంతి గార్డెన్స్ లోని సొంత భవనానికి వెళ్ళిపోయారు. వారి కొన్ని సినీమాలకు చక్రవర్తిగారు కూడా సంగీత దర్శకత్వం వహించారు. కానీపామర్తిగారికి విశ్వశాంతిలో స్ట్రైట్  పిక్చర్ కు సంగీతం చేసే అవకాశం రాలేదు.

ఈ విశ్వశాంతి కి సంబంధించినదే మరో దుర్ఘటన బాగా గుర్తుండిపోయింది. ఈ ఇంటి మేడ పై భాగంలో ఒక కొబ్బరాకుల శాల 'కొట్టాయ్' ఒకటి వుండేది. (తమిళనాడులో ముఖ్యంగా మద్రాసులో గుడిసెలన్నీ కొబ్బరాకులతో అల్లిన మట్టలతోనే కట్టేవారు. అటువంటి కొట్టాయ్ 35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ మీద కూడా ఉండేది). విశ్వశాంతి వారి కొట్టాయ్ లో వారి సినీమా ప్రొడక్షన్స్ కు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతూండేవని చెప్పేవారు. ఎదురిల్లైనా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ శాలలో ఉదయం నుండి రాత్రివరకు పనిచేసుకొని ఇళ్ళకు పోయేవారు. ఫిబ్రవర్లోనో మార్చినెలో - తిరుమల రామానుజకూటంలో పెద్దబాబు ఉపనయనం ముగించుకుని వచ్చినసరికి ఒక దర్వార్త తెలిసింది. ఆ రోజు ఉదయం వచ్చి చూసేసరికి దయాసాగర్ గారు కొట్టాయ్ లో సూయిసైడ్ చేసుకొని శవమై కనిపించారట. కారణం తెలియదు. ఇది చాలా రోజులపాటు అందరి మనసులను కలచివేసిన విషాదకరమైన దుర్ఘటన.

🌹🌹🌹

ఘంటసాల మాస్టారు సినీమాలు తీయొద్దని నిర్ణయించుకున్నాక తమ్ముడు తాత (సదాశివుడు) చేత మాధవరం మిల్క్ ప్రాజెక్ట్ లో పాల వ్యాపారం పెట్టించారని గతవారాలలో చెప్పాను. ఆ పాల వ్యాపారం ఓ మూడేళ్ళపాటు సజావుగానే సాగింది. మేముపిల్లలం, ప్రతీ శనిఆదివారాలు మాధవరం వెళ్ళి మిల్క్ కాలనీలో సరుగుడు చెట్లక్రింద తిరుగుతూ అక్కడి షెడ్లలో పశువులకు చేసే సంరక్షణ చూస్తూ బాబాయి, పిన్నిగార్ల ప్రేమాభిమానాలు పొందుతూండేవాళ్ళము.

రోజులు ఎప్పుడూ ఒకలాగే వుంటే మన గొప్పతనం ఏం ఉంది?

ఓ మూడేళ్ళ తర్వాత ఏదో వ్యాధిసోకి మాస్టారి పశువులన్నీ చాలావరకు మరణించాయి. అక్కడితో మాధవరం మిల్క్ బిజినెస్ మూతపడింది. తాత (బాబాయ్)గారుపాప (పిన్ని)గారు మరల 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు చేరుకున్నారు.

"ఆశా దురాశా వినాశానికే ఏలా ప్రయాసా వృధా యాతనే"  అని ఘంటసాల మాస్టారు 'టైగర్ రాముడు' లో ఓ పాట పాడారు.

జీవితంలో దురాశకు పోతే వినాశనం చెందడం న్యాయం. కానీ తనకు అయినవారిని ఆదుకొని వారికి ఒక ఆసరా కల్పించాలనే సదాశయం కూడా తనకు వ్యతిరేక ఫలితాలను ఇస్తూంటే ఎంతటివాడైనా ఎన్నాళ్ళు తట్టుకోగలడు. ఘంటసాల మాస్టారు గొప్ప మహర్జాతకుడైనా జీవితంలో  కష్టాలు నష్టాలే ఎక్కువగా అనుభవించారు.  వీటన్నిటి ప్రభావం ఆయన అనారోగ్యాలకు కారణమనిపిస్తుంది. 

తమ్ముడు సదాశివుడు గారు , పాప పిన్నిగారు (సుబ్బలక్ష్మి) ఇద్దరూ చాలా మంచివారు. పిల్లలంటే చాలా ప్రేమ. వారి దురదృష్టమోఅదృష్టమో అంటే చెప్పలేను కానీ వారికి సంతానం కలగలేదు. అయితేనేంఇంట్లోని పిల్లల సంరక్షణ చాలావరకు  పిన్నిగారే చూసేవారు. ఆవిడలోని సేవాగుణం చెప్పుకోతగ్గది. ఇంట్లో ఎవరికి ఏ అనారోగ్యం వచ్ఛినా ఆవిడ ముందుండి సహాయం చేసేవారు. 

నాకు ఒక విషయం బాగా గుర్తు. ఒక సంవత్సరం వేసంగి శెలవులకు సాలూరు నుండి మా తమ్ముడు పి.వి.ఎన్.ఎస్.ప్రసాద్, చెల్లెలు మంగమాంబపదకొండేళ్ళది, (మా ప్రభూ చిన్నాన్నగారి అబ్బాయి, అమ్మాయి)మద్రాస్ వచ్చారు.

ప్రసాద్, మంగమాంబ, శిష్యులతో ప్రభూ చిన్నాన్నగారు


ఉదయం పూటంతా ఔట్ హౌస్ లోనే గడిపినా రాత్రి అయేసరికి నేనూ, మా ఇంటికి వచ్చే అతిధులంతా మాస్టారింటి మేడమీదే పడుక్కునేవాళ్ళం. అలా శెలవులకు వచ్చిన మా ప్రభూ చిన్నాన్నగారి అమ్మాయికి సడన్ గా జ్వరం పట్టుకుంది. అందుచేత ఆ రోజు మేమంతా క్రింది హాలులోనే పడుకున్నాము. ఆ రాత్రంతా పాపంపాప పిన్నిగారే మధ్య మధ్యలో లేచి మా మంగమాంబకు మందులుమాత్రలు వేసి చాలా జాగ్రత్తగా చూసారు. తర్వాత ఒకటి రెండు రోజుల్లో  జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నిజానికి పిన్నిగారికి అలా చేయవలసిన అవసరంలేదు. అయినా ఆవిడలోని అభిమానం అలాటిది.

చిన్నప్పుడు క్లాస్ పుస్తకాలలో చదివిన ఫ్లారెన్స్ నైటింగేల్ అంటే ఈవిడలాగే వుంటుందేమో అని నాకు అనిపించేది. మాస్టారింటి పిల్లలందరికీ పిన్నిగారి దగ్గర చేరిక ఎక్కువే. అమ్మకు కోపం ఎక్కువ. ఆవిడ చేతివాటానికి భయపడి పిన్ని దగ్గరకోమా అమ్మగారి దగ్గరకో చేరేవారు. తాతా బాబాయ్ అన్నా అందరికీ ఇష్టమే.

ఘంటసాల మాస్టారి రెండవ పుత్రరత్నంవెంకట రత్నకుమార్ ఉపనయనం పిన్నిబాబాయ్ ల చేతులమీదుగానే మాస్టారు జరిపించారు. పీటలమీద తమకు బదులు సదాశివుడుగారిని, పాప పిన్నిగారినే కూర్చోపెట్టి కార్యక్రమం జరిపించారు. ఈ ఉపనయనానికి ఎన్.టి.రామారావుగారు, తన అనుచర బృందంతో వచ్చి ఆశీర్వదించారు. అయితే, ఈ ఉపనయనం తర్వాత ఎప్పుడో 1970 లలో జరిగింది. సందర్భం వచ్చింది కనుక, మాస్టారింటి కుటుంబ సభ్యుల మధ్య గల మమతానురాగాలు ఎలాటివో తెలియడానికి చెప్పాను.

ఈసారి ఇంక ఏ విధమైన వ్యాపారాలు కాకుండా తమ్ముడిని ఏదైనా నిలకడైన  ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించి పెద్దలతో తనకు గల పలుకుబడిని ఉపయోగించి తమ్ముడికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని IDPL వారి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లాంట్ లో ఒక ఉద్యోగం సంపాదించిపెట్టారు. కంపెనీవారే క్వార్టర్స్ ఇచ్చారు. ఈ ప్లాంట్ నందంబాక్కంలో వుంది. సదాశివుడుగారు తన రిటైర్మెంట్ వరకు అదే కంపెనీలో పనిచేశారు.

మాధవరం ఉత్తరం. నందంబాక్కం దక్షిణం. మా వీకెండ్ వెకేషన్స్ ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారాయి.

ఆ సర్జికల్ ప్లాంట్ లో అన్ని భాషలకు చెందిన  ఘంటసాల అభిమానులు ఎందరో వుండేవారు.  కుటుంబరావు అని ఒకాయన, కృష్ణ అని ఒకాయన ఆ కంపెనీలో పెద్ద పదవులలో వుండేవారు.

అలాగే సెల్వనాయగం అని తాతగారి కొలీగ్ ఒకాయన, వీరందరితో, వారి కుటుంబ సభ్యులతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. వంశపారంపర్యంగా వచ్చిన మధుమేహ వ్యాధి సదాశివుడు గారిని వదిలిపెట్టలేదు. ఆ కారణంగా చివరలో ఆయన దృష్టి దెబ్బతిన్నది. అప్పుడు కంపెనీలోని ఈ పెద్దలంతా ఆయనకు చాల సహాయ సహకారాలందించి చాలా ప్రేమాభిమానాలు కనపర్చేవారు. దీనికంతటికీ మూలం ఆ దంపతుల మంచితనం. అంతకుమించి వారందరికీ ఘంటసాలవారి మీదున్న అపరిమితమైన భక్తి. ఏ విధమైనటువంటి పబ్లిసిటీలు ఆశించకుండా  గోప్యంగా తగిన సమయంలో తగిన సహయ సహకారాలందించేవారే నిజమైన స్నేహితులు. 

 🌹🌹🌹

నందంబాక్కం అనగానే తమిళనాడునే అట్టుడికించిన ఒక భయంకర సంఘటన ఒకటి 1967 లో జరిగింది. గిండీ కతిపర జంక్షన్ దాటాక ఒక రోడ్ తాంబరం వేపు వెళుతుంది. అది GST - Grand Southern Trunk Road - National Highway No. 45. కుడిచేతివేపు మరో రోడ్ సెయింట్ థామస్ మౌంట్ వేపు వెళుతుంది. అది బట్ రోడ్. ఆ రోడ్ నందంబాక్కం మీదుగా బెంగళూర్ రోడ్ వయా పోరూర్, పూనమల్లి. మధ్యలో ఒక దగ్గర తిరపతి వెళ్ళే రోడ్డు కుడివేపుకి ఉంటుంది.   నందంబాక్కం border అడయార్ రివర్. అక్కడున్న బ్రిడ్జ్ దాటాక రామాపురం.  ఈ రామాపురంలో 'పురట్చితలైవర్', 'మక్కళ్ తిలగం' ఎమ్.జి.రామచంద్రన్ తోట బంగళా - రామాపురం తోట్టంగా తమిళనాడంతా ప్రసిద్ధిపొంది ఉంది ఇప్పుటికీ. ఎమ్.జి.ఆర్, టి.నగర్  ఆర్కాట్ స్ట్రీట్ లోని సొంత ఇంట్లో కన్నా ఈ రామాపురం బంగళాలోనే ఎక్కువగా వుండేవారు. పార్టీ ప్రముఖులతో సమావేశమైనాతను నటించే సినీమా కథల మీద చర్చలైనా అంతా ఈ రామాపురంలోనే జరిగేవి.

అది 1967 జనవరి నెల. 13 వ తేదీ పొంగల్ కు ఎమ్.జి.ఆర్ కొత్త సినీమా 'తాయ్ క్కు తలైమగన్' అనే కొత్త సినీమా రిలిజ్ కాబోతున్నది. జయలలిత హీరోయిన్. చిన్నప్ప దేవర్ నిర్మాత. ఎమ్జీయార్ అభిమానులంతా ఈ సినీమా విడుదలకు రాష్ట్రవ్యాప్తంగా చేయవలసిన సంబరాల పనులలో తలమునకలైవున్నారు.

జనవరి 12 వ తేదీ సాయంత్రం సుప్రసిద్ధ తమిళ నటుడు మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ aka ఎమ్.ఆర్.రాధా, తన స్నేహితుడైన ఒక నిర్మాతతో కలసి ఎమ్.జి.ఆర్ ను కలవడానికి రామాపురం తోట బంగళాకు వెళ్ళారు. కొంతసేపు వారి మధ్య ఏవో మాటలు సాగాయి. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎమ్.జి.ఆర్, ఎమ్.ఆర్.రాధా ఇద్దరూ తుపాకీ బుల్లెట్ గాయాలతో రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించబడ్డారు. ఎమ్.జి.ఆర్ ను రాధా తుపాకీ తో కాల్చాడన్న వార్త దావానలంగా ప్రాకిపోయింది. ఎమ్.జి.ఆర్ అభిమానులు ఎమ్.ఆర్.రాధా ఆస్తులను ధ్వంసం చేశారు. ఉళ్ళో విధ్వంసకాండ మొదలయింది. ఈ ఇద్దరు నటులను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించి శస్త్ర చికిత్స చేశారు. ఎమ్.జి.ఆర్ కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పేవరకు హాస్పిటల్ వద్దకు చేరిన జనాలను అదుపు చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు.

కణతలమీద రాధాకు తగిలిన బుల్లెట్లను తొలగించారు కానీఎమ్.జి.ఆర్ గొంతులో దిగిన రెండు బుల్లెట్లను తొలగించలేకపోయారు.



వాటిని ఆపరేట్ చేస్తే ఎమ్.జి.ఆర్ స్వరపేటిక పూర్తిగా దెబ్బతినే అవకాముందని వదిలేశారట. తర్వాత ఎమ్.జి.ఆర్, ఎమ్.ఆర్.రాధా ఇద్దరూ బాగానే కోలుకున్నారు. కానీ ఎమ్.జి.ఆర్ కంఠంలోని స్పష్టత పోయింది. ఆ విషయం 1967 తర్వాత వచ్చిన ఎమ్.జి.ఆర్ సినీమాలన్నింటిలో బాగా తెలుస్తుంది. నిజానికి ఎమ్.జి.ఆర్, ఎమ్.ఆర్.రాధా మంచి మిత్రులుగానే వుండేవారు.వారిద్దరూ కలసి అనేక చిత్రాలలో నటించారు. ఇంతకూ ఇంతటి తీవ్ర ఘర్షణకు అసలు కారణమేమిటి అన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. రాజకీయ విభేదాలా? లేక మరొకటా? అంతుచిక్కని విషయంగానే మిగిలిపోయింది. వివిధ పత్రికలలో రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. అసలు కారణం బయటపడలేదు.

ఎమ్.జి.ఆర్ ను తానే పిస్టల్ తో కాల్చి తనను తాను కాల్చుకున్నట్లు ఎమ్.ఆర్.రాధా వాంజ్ములం ఇచ్చినట్లు దాని ఆధారంగా అతనిని అరెస్ట్ చేసినట్లు ప్రముఖ పత్రికలు వ్రాసాయి. కేస్ కోర్ట్ కు వెళ్ళింది. ఎమ్.ఆర్.రాధాకు ఏడేళ్ళ కారాగార శిక్షపడింది. తర్వాత మద్రాస్ హైకోర్ట్ లో రాధా వయసు దృష్ట్యా జైలు శిక్షను ఏడేళ్ళనుండి నాలుగేళ్ళకు తగ్గించారు.

ఎమ్.ఆర్.రాధా ఇ.వి.రామస్వామి నాయకర్ యొక్క ద్రవిడ ఉద్యమానికి తీవ్రంగా ప్రభావితుడైన వ్యక్తి. సినీమాల్లోనే కాక రంగస్థలం మీద కూడా ఎమ్.ఆర్.రాధా ప్రతిభ గణనీయంగానే వెలిగింది. 'రక్త కన్నీర్' నాటకాన్ని రాధా తమిళదేశమంతా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చాడు. నాటకంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా అనేకసార్లు పోలీసులు ఎమ్.ఆర్.రాధాను అరెస్ట్ చేసేవారు. ఈ నాటకం రాధా హీరోగా సినీమా కూడా తీసారు. చాలా పెద్ద హిట్. ఇదే 'రక్త కన్నీర్' డ్రామాను తెలుగులో నాగభూషణం ప్రదర్శించేవారు. ఈ విధంగా, సి.ఎన్.అణ్ణాదురై కాలం నుండి తమిళ రాజకీయాలు, సినీమాలు పరస్పరం ముడిపడివుండేవి. 

తరచూ ఏదో సినీమా కంపెనీవాళ్ళు మాస్టారింటికి వచ్చి తమ సినిమా ఫలానా స్టూడియో లో ఫలానా ధియేటర్లోఇన్ని గంటలకు ప్రివ్యూ వేస్తున్నాముఅందరూ తప్పక వచ్చి చూడండి అని ఆహ్వానించేవారు. మొదట్లో ఇదొక సంప్రదాయంగా వుండేది. కానీ, 1970 లు వచ్చేసరికి స్టూడియోలలో ప్రివ్యూలు వేయడం, ఆ సినీమాలో పనిచేసినవారందరినీ పిలవడం అనేది క్రమేణా తగ్గిపోయింది. పాత రోజుల్లో ఒక్కో సినీమా మూడేసి నాలుగేసి సార్లు వేసేవారు. ముఖ్య నటీనటులు, దర్శక నిర్మాతల కోసం ఒకసారీసాంకేతిక నిపుణుల కోసం ఒకసారి, పాత్రికేయుల కోసం ఒకసారిజనరల్ గా వారివారి కుటుంబాలకోసం ఒకసారీ అంటూ సినీమాలు వేసేవారు. స్టూడియో థియేటర్లు పబ్లిక్ థియేటర్లంత పెద్దవిగా వుండవు. వాటి సిట్టింగ్ కెపాసిటి వంద లోపలే. పెద్దలకు మాత్రమే కుర్చీలు. పిల్లలు, ఎవరి పిల్లలైనా సరే నేల మీద కూర్చొని చూడవలసిందే.

విజయావారి మాయాబజార్, ఎన్.టి.రామారావుగారి సీతారామ కళ్యాణం వంటి సినీమాలెన్నో పిల్లలందరం క్రింద కూర్చొనే చూసేవాళ్ళం. ఈ ప్రివ్యూలు చూసిన కుటుంబాలు ముందుగా సినీమా చూసి బాగుందని ఆనందిస్తే, ఆనాటి ఆంధ్రదేశంలో ఆ సినీమా తప్పక విజయవంతమౌతుందని అనుకునేవారు. అయితేనిర్మొహమాటంగా ఒక సినీమాలోని బాగోగులను విమర్శించే అవకాశం తక్కువ. సినీమా పత్రికలవారు తమ మనుగడకోసం చిత్ర సమీక్ష చేసేవారే తప్ప విమర్శించేవారు బహు అరుదు. అలాగే ప్రముఖుల కోసం వేసే ప్రివ్యూలలో కూడా సినీమా పూర్తయాక ఆయా నటీనటులు, దర్శక నిర్మాతలు, సంగీతదర్శకులు, గాయకులు ప్రతి ఒక్కరు ఒకరినొకరు కావలించుకొని, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని సినీమా అద్భుతంగా వుందని, ఘనవిజయం సాధిస్తుందని, మరల అందరం శతదినోత్సవ సభలో కలుసుకుందామని సంతోషమైన ముఖాలతో పరస్పరం  అభినందించుకునేవారు. అది ఒక మర్యాద. సభ్యత. సినీమా బాగా లేదని ఎవరినోటా వినవచ్చేదికాదు. ఆ అభినందనలలో నిజాయితీ కానరాదు. అంతా కృతకమే.

స్టూడియోలలో ఈ మాటలన్నీ విన్న నేను అవే సినీమాలను మా బొబ్బిలి శ్రీరామాలోనో, శ్రీకృష్ణాలోనో చూసినప్పుడు అక్కడి ప్రేక్షకుల రియాక్షన్ మరోలా వుండేది. మావూళ్ళో ఏ సినీమా అయిన నాలుగువారాలపాటు హౌస్ ఫుల్ తో ఆడితే ఘనమైన సినీమాక్రిందే లెక్క.

పొద్దస్తమానం సినీమా లోకంలో అదే ధ్యాసగా వుండడంవలన ఘంటసాల మాస్టారికి కానీమా నాన్నగారికి కానీ స్టూడియో ప్రివ్యూలు కానీ, బయట థియేటర్లలో కానీ సినిమాలు చూసే ఆసక్తి వుండేది కాదు. ఆ సమయంలో హాయిగా ఇంట్లో కాలక్షేపం చేయాలని అనుకునేవారు. దాని ఫలితంగా మా ఇళ్ళలోని వారు కూడా సినిమాలు చూడడం తక్కువే. కథాపరంగా, సంగీతపరంగా చాలా బాగుంటాయని నమ్మే సినీమా ప్రివ్యూలు వేస్తే వాటిని మాత్రం చూడాలని సావిత్రమ్మగారికి అనిపించేది. అయితే మారెండిళ్ళలో చంటిపిల్లలు ఎక్కువమంది వుండడంతో ఇంట్లోని ఆడవారికి సినీమాలు చూసేంత సావకాశం దొరికేదికాదు.

 "ఈరోజు ఫలానా సినీమా వేస్తున్నారట".

"అలాగా! సాయంత్రం ఐదింటికి వచ్చేస్తాను. నువ్వుపిల్లలు రడిగా వుండండి".

సాయంత్రం ఐదవుతుంది, ఐదున్నర అవుతుంది, ఆరవుతుంది, కానీ, గోవిందు కారు హారన్ మాత్రం వినపడదు. ఏ ఆరున్నరకో మాస్టారు వచ్చి బయల్దేరండి, వెళదామంటూ హడావుడి చేసేవారు. ఆ సమయానికి కోడంబాక్కం స్టూడియోలో సినీమా మొదలెట్టేసివుండేవాళ్ళు.

మేము కోడంబాక్కం లెవెల్ క్రాసింగ్ దగ్గర పడిగాపులు పడి స్టూడియోకు వెళ్ళేసరికి ఓ రెండు రీళ్ళ సినీమా ఓ రెండు పాటలు అయిపోయి వుండేవి. దాదాపు చాలా సినీమాలు సగం నుండి చూసినవే. సినీమా చూసిన తృప్తే ఎవరికీ వుండేదికాదు. అదేదో ఒక సినీమాకు అయితే మేము వెళ్ళిన పావుగంటకే శుభం కార్డ్ వేసేశారు. అయ్యగారిని నమ్ముకుంటే ఏ సినీమా పూర్తిగా చూడలేవనే నిర్ణయానికి అమ్మగారు వచ్చేసారు. అయితేఇందులో ఘంటసాల మాస్టారిని తప్పుపట్టడానికి లేదు. మాస్టారు సాంగ్ రిహార్సల్స్ కో, రికార్డింగ్ కో వెళ్ళారంటే ఇంక అదే ధ్యాస.  ఇంటి ఇల్లాలికి ఇచ్చిన వాగ్దానంమిగిలిన విషయాలు, అన్నీ పూర్తిగా మరచిపోయేవారు. ఇప్పటిలాగా, వెంటవెంటనే ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడేందుకు అది సెల్ ఫోన్ల యుగం కాదు కదా! ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటేఘంటసాల వంటి ఒక గొప్ప గాయకుడుసంగీత దర్శకుడి ఇంట్లో టెలిఫోన్ లేకపోవడం. ఆ సమయానికి చాలామంది చిన్నా చితకా సినీమావాళ్ళందరికీ ఇళ్ళలో టెలిఫోన్ సౌకర్యం వుండేది.

మాస్టారి సన్నిహిత నిర్మాతల బలవంతం మీద చాలాకాలానికి టెలిఫోన్ పెట్టుకోవడానికి సిధ్ధమయ్యారు. ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్స్ అంత సులభం కాదు. ఘంటసాలవారి హెల్త్ కారణంగా వారింట్లో వెంటనే టెలిఫోన్ అవసరమని అప్లై చేసిన ఎన్నో మాసాలకు  'నె.35, ఉస్మాన్ రోడ్' కు టెలిఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ 443773.

ఆనాటికి మద్రాస్ టెలిఫోన్ డిస్ట్రిక్ట్ లో ఆరు నెంబర్లతోనే వుండేవి. తర్వాత ఏడు నెంబర్లు, ఆ తర్వాత మరి కొన్నేళ్ళకు ఎనిమిది నెంబర్లు వచ్చాయి. ఇప్పుడు సరేసరి, ల్యాండ్ ఫోన్లు వున్న ఇళ్ళే అరుదు. ఒక్కొక్కరికి రెండేసిమూడేసి సెల్ ఫోన్లు. సినీమాలన్నీ మొబైల్ లోనే చూడవచ్చు. లేకపోతే హోమ్ థియేటర్. ఇక స్టూడియోలు ఎందుకు? పబ్లిక్ థియేటర్లెందుకుకాకపోతేనాలా సినీమా మోహితులకు స్టూడియోలలో ప్రివ్యూ షోలు చూడడంలో ఓ మజా, కిక్, థ్రిల్లు వుండేవి. Gone are the days. 

🌹🌹🌹

అమ్మగారికి (సావిత్రమ్మగారు) పూర్తిగా టైటిల్స్ నుండి  చూడాలి చూడాలనుకొని చూడలేకపోయిన (లేక సగం చూసిన) మంచి సినీమాలలో ఒకటి 'మంచి మనసులుకె.వి.మహాదేవన్ కు తెలుగులో గొప్ప గుర్తింపు తెచ్చిన సినీమా. పాటలన్నీ తమిళం ఒరిజినల్ అయిన 'కుముదం' సినీమాలోవే అయినా తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. అప్పుడు వారికి ఆ పాటలు అరవ వాసన వేయలేదనుకుంటాను.

ఆ పాటల రుచివాసన మార్చింది మాత్రం పూర్తిగా ఘంటసాలగారు, సుశీలగారే అని చెప్పాలి. ఆ ఇరువురి గాత్ర మాధుర్యం వలన 'మంచి మనసులుపాటలు ఈనాటికీ ఆపాతమాధుర్యాలుగానే తెలుగు సంగీతప్రియులను అలరిస్తున్నాయి.

అలాటి 'మంచి మనసులురిలీజ్ అయిన మూడేళ్ళకో, నాలుగేళ్ళకో మద్రాస్ లో ఒకానొక మారుమూల పాత సినీమా హాలుకు వచ్చింది. అది జార్జ్ టౌన్ లో తాతముత్తియప్పన్ వీధిలో వుండిన 'సెలెక్ట్' సినీమా హాలు. మద్రాసులో ఆ ఒక్క హాలులోనే తెలుగు సినీమాలు శుక్రవారం నుండి గురువారం వరకూ రోజుకు మూడాటలు ఆడేవి. ఊళ్ళో మరికొన్ని థియేటర్లు తెలుగు సినీమాలను ఆదివారం ఉదయం ఆటలుగా మాత్రమే వేసేవారు. ఆ హాల్స్ కూడా అంతంతమాత్రమే. అలాటి ఒక పాత హాలులో తను చూడాలనుకున్న 'మంచిమనసులు' సినీమాకు వెళ్ళాలని నిర్ణయించారు. ఆ రోజే ఆఖరి ఆట. మర్నాటినుండి సినీమా మారిపోతుంది. అమ్మగారి ప్రపోజల్ కు అయ్యగారు ఆమోదముద్ర వేశారు. ఆరోజు వారు వేరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోలేదు. సెలెక్ట్ టాకీస్ మా ఇంటికి చాలా దూరం. కారు వసతి లేని వారికి మరో ఊరు ప్రయాణంలాటిదే.

సాయంత్రం ఐదింటికల్లా అందరం రెడీ అయి కార్లో బయల్దేరాము. అయ్యగారు, అమ్మగారునేనూ. మాతోపాటు పెద్దబాబు కూడా వున్నాడనుకుంటాను. సినీమా వేసే టైమ్ కంటే చాలా ముందుగానే బయల్దేరాము కనుక ముందుగా ఒకసారి మాలతిని (మాలతీచందూర్) కూడా చూసేసి తర్వాత సినీమా మొదలెట్టే సమయానికి థియేటర్ కు వెళదామని కారును పరశువాక్కం వేపు మళ్ళించారు. అప్పట్లో చందూర్ దంపతులు పరశువాక్కం లోని మూకత్తాల్ స్ట్రీట్ (అనే గుర్తు) లో వుండేవారు. చందూర్ గారి 'జగతి' పత్రిక కూడా అక్కడనుండే వెలువడేది. సావిత్రమ్మగారికి మాలతీ చందూర్ గారన్నా, పి.భానుమతిగారన్నా అమితమైన ఇష్టం. ఏమాత్రం అవకాశం వున్నా వాళ్ళిద్దరిని కలుసుకోవడానికి ఇష్టపడేవారు. ఘంటసాలగారి వంటి బిజీ గాయకుడు తమ ఇంటికి రావడంతో చందూర్ దంపతులు మహా సంబరపడిపోయారు. ఘంటసాలవారి కుటుంబంతో చిరకాలమైత్రి వారిది. మాస్టారింటి పిల్లలంతా మాలతీ చందూర్ గారిని 'మాలత్తయ్య' అని ఆప్యాయంగాగౌరవంతో పలకరించేవారు. చందూర్ దంపతులు, ఘంటసాల దంపతులు లోకాభిరామాయణంలో పడ్డారు. నేను ఒకటికి రెండుసార్లు గుర్తు చేసాక వారింటినుండి బయల్దేరి సెలెక్ట్ కు చేరుకున్నాము.

 💥కొసమెరుపు💥

ఎప్పటిలాగే, టైటిల్స్ నుండి సినీమా చూడాలనే అమ్మగారి కోరిక నెరవేరలేదు. మేము వెళ్ళేసరికి సినిమా మొదలైపోయి అరగంటయింది. టిక్కెట్ కౌంటర్ కూడా మూసేసారు. హౌస్ ఫుల్ కాకపోయినా జనం నిండుగా వున్నారు. ఘంటసాలవారి ని గుర్తుపట్టి అక్కడి మేనేజర్ లోపల ఎలాగో ఓ నాలుగు సీట్లు మేనేజ్ చేశాడు. అలా సెలెక్ట్ లో 'మంచిమనసులు' చూశాము. అయితే ఈసారి ఘంటసాల మాస్టారి తప్పేమీ లేదు. అమ్మగారే మాలతిగారితో మాటల్లోపడి సినిమాకు లేటయిపోయారు. ఏమైతేనేం, మరోసారి కూడా పూర్తి సినీమా చూడ్డం కుదరలేదు.

వచ్చేవారం మరికొన్ని విశేషాలు...

                      సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, May 16, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఒకటవ భాగం

16.05.2021 -  ఆదివారం భాగం - 31*:
అధ్యాయం 2 భాగం 30  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రుతి ఎంత"?

"శ్రుతా! అదెవడికి తెలుసు. నువ్వు లాగించు. నీ ఆర్మణీ నా పాటకు తోకలాగుండాలి.

"ఆ...  కోడలే కులమునక్కత్తారమూ..

( కులమునకు ఆధారము)

గోడలే మెడకత్తారమూ

(మేడకు ఆధారము)

 'రమ్ రమ్ము' ' మ ప'.

 'శ్రుతి దొరికిందా?'

 'దొరికింది సార్!'

ఒకసారి నాలుగు, మరోసారి మూడున్నర'.

"పాతికకు అటూ ఇటైనా ఏం ఫర్లేదు. నువ్వు కానీ... అస్తమాను ఆ తెల్లవే కాక నల్లవి కూడా నొక్కుతూండు." (హార్మోనియం మెట్లు)

ఇది ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో సుమారు 56 ఏళ్ళ క్రితం "చెరపకురా చెడేవు" సినీమా లోని ఒక సీన్. అందులో రేలంగి ఔత్సాహిక ఒక రంగస్థల నట గాయకుడు. చిడతల అప్పారావు అతని ఆర్మణిస్ట్.  ఈ సీన్ వ్యంగ్యాత్మకమైనా ఆనాటి ఔత్సాహిక నాటకాల స్థితిగతులకు దర్పణం పడుతుంది. సాహిత్య, సంగీతాల విషయంలో తెలుగు నాటకం ఈనాటికీ అదే గతిలో వుందనిపిస్తుంది.

ఆత్రేయఎన్.ఆర్.నందిభమిడిపాటిగొల్లపూడిలకు ముందు తెలుగు సాంఘిక నాటక రంగస్థలం అంతగా వృధ్ధిచెందలేదు.

ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్ లోని  గ్రామసీమలలోని సామాన్య ప్రజానీకానికి వినోదమంటే  పౌరాణిక నాటకమే. 1947 తర్వాత  తెలుగు సినిమా టూరింగ్ టాకీస్ ల ద్వారా మారుమూల పల్లెల్లో ప్రవేశించేదాకా పౌరాణిక నాటకానిదే రాజ్యం. మా బొబ్బిలి లాటి వూళ్ళలో పొద్దస్తమానం ఏదో ఓ ఇంటిలో నుండి "అదిగో ద్వారక ఆలమందలవిగో", "బావా! ఎప్పుడో వచ్చితీవు"అనే పాండవోద్యోగవిజయాలు, శ్రీకృష్ణరాయబార పద్యాల ప్రాక్టీస్ తో ఊరంతటికీ వినపడేలా హోరెత్తించేవారు.

మరోపక్కనుండి అంతకన్నా గట్టిగా "చచ్చిరి సోదరుల్ సుతుల్ చచ్చిరీ" అంటూ శృతి కలవని కర్ణకఠోరమైన హార్మోనియంతో జనాలను చంపేవారు మరికొందరు. ఊళ్లో ఏ పండగాపబ్బం జరిగినా, పెళ్ళిపేరంటం జరిగినా ఏదో నాటకం ఆడాల్సిందే. మధ్య మధ్య నవతరం యువకులు ఉత్సాహంగా ఏవైనా చిన్న చిన్న సాంఘిక నాటికలు వేసినా ప్రజలు మాత్రం తిరుపతి వెంకట కవుల పౌరాణిక నాటకాలవేపే మోజు చూపేవారు. పండితుల మొదలు పామరులవరకు పాండవోద్యోగవిజయాలు, కృష్ణరాయబారంలోని పద్యాలన్నీ వాళ్ళ నాలిక చివరే వుండేవి. వీరందరికీ తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధశాస్త్రిసి.ఎస్.ర్, బందా కనకలింగేశ్వరరావు, కె.రఘురామయ్య, సూరిబాబు, షణ్ముఖి ఆంజనేయరాజు, అద్దంకి శ్రీరామమూర్తిపీసపాటి నరసింహమూర్తి వంటి నటగాయకులే ఆదర్శం.

తెలుగు రంగస్థల పౌరాణిక నాటకంమీద మరాఠీ నాటక ప్రభావం ఎంతైనావుంది. ఆ బాణీతోనే తెలుగు పౌరాణిక నాటకం కొనసాగింది. ఈ నటులలో చాలామంది బాగా చదువుకున్నవారు, సంగీతజ్ఞానం కలవారు వుండేవారు. అలాటివారి నాటక పద్యాలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. ఈ నాటక పద్యాలలో సంగీతంసాహిత్యం వున్నా సుదీర్ఘమైన రాగాలాపనకే  ప్రాధాన్యత. ఒక నటుడు రాగాలాపనతో ఒక పద్యం  మొదలెడితే అది పూర్తవడానికి పదినిముషాలైనా పడుతుతుంది. అది ముగిసేసరికి మరో నటుడు అంతకన్నా గట్టిగా మరింత ఎక్కువ రాగంతీసి  పోటీగా తన సమర్థత చూపేవాడు. ఈ విధంగా ఓ కృష్ణుడు, అర్జునుడుదుర్యోధనుడుధర్మరాజుకర్ణుడు, భీముడూ అంటూ తలో నాలుగైదు పద్యాలు పాడేసరికి తెల్లారిపోయేది. రాత్రి ఏ పదింటికో మొదలైన నాటకం మర్నాటి ఉదయం ఆరింటివరకూ సాగేది.

అన్ని గంటల నాటకాన్ని ప్రేక్షకులు మహా ఉత్సాహంతో చూసి ఆ పద్యాలనే రోడ్లమీద పాడుకుంటూ ఇళ్ళకు తిరిగివెళ్ళేవారు. ఆయా నటుల గిరికీ రాగాలాపనకే జనాలు పడి చచ్చేవారు. అయితే తెలుగు పౌరాణిక నాటక పద్యాలలోని సంగీతాన్ని కర్ణాటక సంగీత ప్రపంచం అంతగా హర్షించదుఆమోదించదు.

ఈ నాటకాలలో నటనకు హావభావాలకు అవకాశం తక్కువ. కరెంట్, మైకు వసతులులేని రోజుల్లో ఆయా నటుల కంఠస్వర బలమే వారికి శ్రీరామరక్ష. ఈ పౌరాణిక నాటకాలు చాలా దీర్ఘమైనవి కావడం వలన ఒక్కొక్క నాటకంలో ఇద్దరేసి కృష్ణులు (ఒక్కోసారి ముగ్గురు కూడా), ఇద్దరేసి అర్జునులు నటించేవారు. నాటకపోషకులు వీరి మధ్య పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చి సంతోషపడేవారు. సంగీతసాహిత్యాలలో ప్రతిభ కలిగిన నటీనటులు నటించినంతవరకూ పౌరాణిక నాటకం విరాజిల్లింది.

సినీమాలలో నేపథ్యగాన సౌకర్యం వృధ్ధి చెందనంతవరకూ రంగస్థల నటులే సినీమాలలో కూడా రాణించారు. రానురాను సంగీత పరిజ్ఞానం ఏమాత్రం లేని వారంతా శృతజ్ఞానంతో పౌరాణిక నాటకాలు ఆడడం మొదలెట్టారు. సరైన కంఠస్వరం లేనివారు, శృతి గతి లేనివారంతా నటులైపోవడంతో తెలుగు పౌరాణిక నాటకం తన ప్రాభవం కొల్పోయింది. ఈనాటికీ అక్కడక్కడ పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగుతున్నా  అందులోని నటుల పద్యపఠనం మాత్రం తృప్తికరంగా వుండదు. పాత కళల పరిరక్షణ అంటూ ప్రభుత్వం కూడా అలాటివారినే గుర్తించి పోషిస్తూంటుంది. 'వృక్షాలు లేనిచోట ఆముదం మొక్కే మహావృక్షం' అవుతుంది.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారి చిత్రసీమలో అడుగుపెట్టడంతోనే తెలుగు సినీమా సంగీత రూపురేఖలు మారిపోయాయి. నేపథ్యగాన ప్రక్రియ వృధ్ధి చెందడంతో గతకాలపు రంగస్థల నటుల గాత్ర ధర్మాలు నవీన తెలుగు సినీమాకు ప్రయోజనకారి కాలేకపోయాయి. అలాటి నటీనటులంతా తెరమరుగయ్యారు.

ఘంటసాలవారు తెలుగు పద్యపఠనంలో ఒక నూతన ఒరవడిని సృష్టించి తెలుగు ప్రపంచంలో ఒక ప్రభంజనమయ్యారు. నవ్య తెలుగు లలితసంగీతానికి ఆద్యుడు ఘంటసాలే.

ఘంటసాల కంఠం తెలుగువారికి పరిచయమైనది ఒక పద్యంతోనే. కాకపోతే స్వర్గసీమలో భానుమతి తో కలసి పాడిన పాట ముందుగా ప్రజలకు చేరింది. అంతవరకు వినని ఒక వినూత్న బాణీ ఘంటసాల కంఠస్వర రూపంలో వెలువడింది. ఘంటసాల గాత్రం అనితరసాధ్యం. ఘంటసాల పాట పెదవులమీదనుంచి రాదునాభిస్థానం నుండి నాదం వెలువడుతుంది. ఆ నాదంలో మృదుత్వం వుందిలాలిత్యం వుంది. అలా అని ఆ గాత్రం స్త్రీ గాత్రం కాదు. భావగంభీరమైనది. నవరసాలను సమాన స్థాయిలో పలికించగల ప్రతిభాశాలి. మూడున్నర శృతులవరకూ ఏ శృతిలో పాడినా తేలిపోని ఉత్తమ గాత్ర సంపద ఘంటసాల సొంతం. భాషభావప్రకటన ఘంటసాల సొమ్ము. శృతిలయలలో ఘంటసాలకు వున్న పట్టు అసమాన్యం.

ఉత్తమ సంగీతజ్ఞునికి కావలసిన ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా ఘంటసాల కంఠంలో ప్రకటితమైనట్లు వేరే యితర గాయకుని కంఠంలోనూ ప్రకటితం కాలేదంటే అది అతిశయోక్తో, లేక వల్లమాలిన వీరాభిమానంతో పొగిడే పొగడ్తలో కావు. అక్షరసత్యాలు. అందుకే కోట్లాది తెలుగు ప్రజలకు ఆరాధ్య‌ఆదర్శ గాయకుడు ఎవరంటే ఘంటసాల పేరే వినిపిస్తుంది. సినీరంగంలోని సంగీతదర్శకులుకవులుగాయనీగాయకులునటీనటులుదర్శక నిర్మాతలు అందరిచేత ముక్తకంఠంతో కొనియాడబడి గౌరవింపబడిన గాయకశ్రేష్టుడు మన ఘంటసాల. భావగాంభీర్యం గల పాటలు ఏవి పాడాలన్నా మొదటి ప్రాధాన్యత ఘంటసాలవారికే. ఒక దశలో తమిళ సినీమాలలో విషాదకరుణరస ప్రధానమైన పురుష కంఠం పాటలన్నీ ఘంటసాలవారినే వరించి వచ్చేవి. ఒక్క తెలుగునాటే కాదుతమిళకన్నడ దేశాలలో కూడా ఘంటసాల గానాభిమానులు అసంఖ్యాకంగానే వున్నారు.

ఘంటసాల తెలుగువాడై పుట్టడం మన అదృష్టం. 'అది ఆయన దురదృష్టంఅని అనేవారూ ఉన్నారు. బహుశా, కేంద్రప్రభుత్వపరమైన బిరుదుల విషయంలోని అలక్ష్యధోరణి వలన కావచ్చు.

నాదయోగులైన గురువుల కృపతోపూర్వజన్మ సుకృతంవలన దైవానుగ్రహంతోనాదసిధ్ధుడిగా రూపొందిన ఘంటసాలవారిలోని ప్రతిభను నిర్ణయించే కొలమానంఅనేక ప్రలోభాలకు లోబడినఘంటసాల  సంగీతం అంటే ఏమిటో  తెలియని ఓ పదిమంది కలసి నిర్ణయించే అశాశ్వత 'పద్మ'లు కానేకావు. అంతకు మించిన శాశ్వతస్థానాన్ని ఘంటసాలవారికి ఇచ్చి రసజ్ఞులైన సంగీతలోకం ఏనాడో తమ సహృదయతనుభక్తి విశ్వాసాలను ప్రకటించింది.

ప్రతీ తెలుగువాడి గుండె చప్పుడులోనూ ఘంటసాల పాటే వినిపిస్తుంది. ఘంటసాల నావాడని, నామనిషని, ప్రజాగాయకుడని ప్రతీ తెలుగువాడు ఈనాటికీ తల్చుకుంటున్నాడంటే అంతకుమించిన ఉన్నతమైన గౌరవంబిరుదు మరేముంది. వాసికన్నా రాశిఅంతకుమించిన ధనార్జనే ప్రతిభకు గీటురాళ్ళుగా భావించి ఇచ్చే బిరుదులు ఘంటసాలకు అనవసరం. 

ఈ శతాబ్దిలోనే కాదు మరెన్ని శతాబ్దాలైనా ఘంటసాల వంటి ఉత్తమగాయకుడు జన్మించడు. ఇది పొగడ్త కాదు. అతిశయోక్తి అంతకన్నాకాదు.

1960 లో  శ్రీకృష్ణరాయబారం అనే పౌరాణిక సినీమా వచ్చింది. పూర్తిగా తిరుపతి వెంకట కవులు వ్రాసిన పద్యాలతో తీశారు. పి.సూరిబాబు  రంగస్థల బాణీలోనే పద్య సంగీతం సమకూర్చారు. రఘురామయ్య, సూరిబాబుఅద్దంకి శ్రీరామమూర్తి, కాంతారావు, గుమ్మడిరాజనాల, మిక్కిలినేని మొదలగువారు ఈ సినీమాలో నటించారు.

ఈ సినీమాలో వున్న దాదాపు ఎనభై పద్యాలలో ఘంటసాల మాస్టారు ఓ పదిహేడు పద్యాలను అర్జునునికి, కర్ణునికి రంగస్థలనాటక బాణీని అనుసరిస్తూనే  అత్యంత శ్రావ్యంగా తనదైన ముద్రను కూడా ప్రస్ఫుటం చేస్తూ పాడారు. HMV లేబిల్ తో  వచ్చిన ఈ శ్రీకృష్ణరాయబారం పద్యాలు నాలుగైదు గ్రామఫోన్ రికార్డులుగా 'నెం.35, ఉస్మాన్ రోడ్రికార్డ్ ర్యాక్ లోవుండేవి.

1960ల తర్వాత, మూడు సొంత సినీమాల నిర్మాణం వలన కలిగిన నష్టాలనుండిఅప్పుల ఊబినుండి బయటపడడానికి ఘంటసాల మాస్టారు మరింత ఎక్కువ శ్రమించడానికి సిద్ధపడ్డారు. డబ్బింగ్ సినీమాలలో పాడడానికి సుముఖత చూపారు. విరివిగా కచేరీలు చేయడం ప్రారంభించారు.

ఆ దశలోనే  ఆనాటి ఆంధ్రదేశంలోని ఒక నాటకాల కంట్రాక్టర్ వరసగా తన  పౌరాణిక నాటకాలలో వేషం వేయడానికి, నాటకానికి ముందుగానో లేక మధ్య విరామ సమయంలోనో ఒక గంటగంటన్నర సంగీత కచేరీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఘంటసాల మాస్టారికి పౌరాణిక నాటకాలు కొత్తకాదు. బాల్యంలోనూ, విజయనగరంలో సంగీతశిక్షణ ముగించుకొని వచ్చిన తర్వాత ఒక నాటక సమాజం పెట్టి కొన్నాళ్ళు పద్యనాటకాలు వేసారు. ఆ అనుభవ దృష్ట్యా ఘంటసాలవారికి ఈ నాటకాలలో వేషం కట్టడం పెద్ద ఇబ్బందికరం కాలేదు. కృష్ణలీలలులో అకౄరుడుకృష్ణరాయబారంలో విదురుడు, సక్కుబాయిలో యోగి వంటి వేషాలు వేసేవారట. ఆ నాటకాలు చూడగలిగే వయసు నాది కాదు. 

కానీ, ఘంటసాల మాస్టారి ఈ రెండోసారి నాటకాలు చూసే అవకాశం మాత్రం నాకు లభించింది. ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలతో పాటూ మా బొబ్బిలి లో కూడా ఘంటసాలవారి కచేరీతో కూడిన నాటకం చూసే అదృష్టం నాకు కలిగింది. బొబ్బిలి చిన్న బజార్ లో వున్న ఒక  సాధారణ నాటక పెండేలు (శ్రీ వెంకటేశ్వరా హాల్ అనే జ్ఞాపకం)లో ఈ నాటక ప్రదర్శనలు అయాయి. ఈ నాటకాలలో షణ్ముఖి ఆంజనేయరాజు, పీసపాటి నరసింహమూర్తి, అద్దంకి శ్రీరామమూర్తి వంటి లబ్దప్రతిష్టులైన నటులెందరో పాల్గొన్నారు. మా బొబ్బిలికి ఘంటసాల రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

ఆయన సరాసరి మా ఇంటికే రావడం ఒక సంచలనమే అయింది. మా ఇంటిలోనో రాత్రి భోజనాలు ముగించుకొని రెండు మూడు జట్కా బళ్ళలో చిన్నబజార్ లోని నాటకాల హాలుకు చేరుకున్నాము. ఘంటసాల కచేరీ, నాటకంలో వేషం అంటే జనాలకు కొదవా? చుట్టుపక్కల గ్రామాలవారంతా ఘంటసాలను చూడడానికివినడానికి తరలివచ్చారు. ఘంటసాలగారి కచేరీకి మానాన్నగారి హార్మోనియంతో పాటు ఒక తబలా, ప్లూట్క్లారినెట్ మాత్రమే ఆర్కెస్ట్రా అని గుర్తు.

ఆనాటి నాటకం 'కృష్ణరాయబారం' అనే గుర్తు. మాస్టారు విదురుడు. కొన్ని పద్యాలు వున్నాయి. ఇతర ప్రధానపాత్రలు ఎవరు వేసారో గుర్తులేదు. కానీ, భీముడిగా ఆకెళ్ళ అప్పారావు భాగవతార్ అనే ఆయన వేసారు. నిజంగా భీముడిలాగే వుండేవారు.

ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ నాటకానికి ముందా? విరామ సమయంలోనా అనే విషయం మీద కంట్రాక్టర్ కు , ప్రేక్షకులకు మధ్య ఒక చిన్నపాటి గొడవలు తలెత్తినట్లు విన్నాను.

నాటకం రాత్రి పది తర్వాత కావడం వలన, రాత్రి పన్నెండు తర్వాత హాలులో కుర్చీలో కూర్చొనే ఓ చిన్న కునుకు తీశాను.  మధ్యలో ఎవరో లేపారు, ఘంటసాల పద్యాలు పాడుతున్నాడులేవమని. సగం సగం నిద్రలోనే విన్నాను. విరామ సమయంలో మేము స్టేజ్ వెనక్కు వెళ్ళాము.

అక్కడ నేను ఊహించని వింత . కృష్ణుడు, దుర్యోధనుడు, ధర్మరాజు, భీముడుఅర్జునుడు మొదలైనవారంతా కిరీటాలు, గెడ్డాలు తో పంచెలు ఎగ్గట్టుకొని నేలమీద గొంతుకూర్చొని  చుట్టలుసిగరెట్లు కాలుస్తున్నారు. అక్కడ వాళ్ళు ఉపయోగించే మాండలిక యాసతో కూడిన భాష నాకు ఆశ్చరంవేసింది. ఇంతవరకూ అచ్చ గ్రాంధికంలో సమాసభూయిష్టమైన పద్యాలు పాడింది వీళ్ళేనా అని అనిపించింది. మొత్తానికి ఆ నాటకం పూర్తయేసరికి తెల్లారిపోయింది.

ఈ విధంగా ఘంటసాల మాస్టారి కాంట్రాక్టు నాటక ప్రదర్శనలు తెలుగునాట కొన్నాళ్ళు జరిగాయి.

ఘంటసాలవారి పద్యం చదివే తీరు ఇతర పౌరాణిక రంగస్థల నటుల కంటే భిన్నమైనది. పద్యంలో రాగంతీత కంటే రాగ లక్షణానికి, భాషకు, భావప్రకటనకు, గమకశుధ్ధికిశృతిశుధ్ధతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పద్యం ఏ రాగంలో పాడినా ఆ రాగ స్వరూపం సంపూర్ణంగాజనరంజకంగా ఆ నిముషంరెండు నిముషాల పద్యంలో ఇమిడేలా పాడడం ఘంటసాలవారి గాన విశిష్టత.

ఈ విషయంలో తన మీద తమ గురుదేవులైన పట్రాయని సీతారామశాస్త్రి గారి ప్రభావం చాలా వున్నట్లు ఘంటసాలవారు తరచూ తమ ఉపన్యాసాలలో చెప్పేవారు. ఘంటసాలగారు తన బాణీ ఇతర రంగస్థల నటుల లేదా ఇతర సినిమా గాయకుల బాణీకి విరుధ్ధమైనదైనా, గాయకుడిగా తాను వారందరికన్నా ఉఛ్ఛస్థాయిలో వున్నా సాటి నట గాయకులపైన అమితమైన గౌరవం, మర్యాద కలిగివుండేవారు. తానే అధికుడననే అహంకారమో, దర్పమో ఘంటసాలవారిలో అసలు కనిపించేవి కావు. అందరిపట్లా చాలా వినయవిధేయతలతో ఉండేవారు. మంచి పాట ఎవరు పాడినా పక్షపాత బుధ్ధి లేకుండా విని ఆనందించమని, మంచి పాటను పెంచమని తన అభిమానులకు సందేశం ఇచ్చేవారు. అందుకేతెలుగునాట ఘంటసాలగారికి గాయకుడిగా ఎంత గౌరవముందో వ్యక్తిత్వంగల మనిషిగా కూడా అంత గౌరవమూ వుంది.

కర్ణాటక సంగీతంలో మహామహులుగా పేరుపొందిన ఎమ్.ఎల్.వసంతకుమారి, ఎన్.ఎల్.గానసరస్వతి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగార్లకు తాను సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో పాడే అవకాశం కల్పించి  వారిపట్ల తనకు గల గౌరవాన్నిఅభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే రంగస్థల నటగాయకులైన కె.రఘురామయ్యకు వాల్మీకి చిత్రంలో నారదపాత్రలో పాడే అవకాశం కల్పించారు. శ్రీకృష్ణ కుచేలలో సి.ఎస్.ఆర్ కు, అద్దంకి శ్రీరామమూర్తిగారికి పాడే అవకాశం కల్పించారు. ధర్మరాజు పాత్రధారి అద్దంకి శ్రీరామమూర్తిగారు పాడవలసిన పద్యాలను ఘంటసాలవారు ఆయనచేతే పాడించారు. రాగనిర్దేశంస్వరరచన స్వేచ్ఛ వారికే ఇచ్చారట. ఈ సందర్భంలో అద్దంకి  శ్రీరామమూర్తి గారు దర్బార్ రాగంలో  ఒక పద్యం సెట్ చేశారట. అయితే ఆ రాగ స్వరప్రయోగ విషయంలో చిన్న అభ్యంతరాలని సంగీత సహాయకుడిగా మా నాన్నగారు (పట్రాయని సంగీతరావు) సూచించడంతో అద్దంకి శ్రీరామమూర్తిగారు "ఇక్కడ (సినీమావాళ్ళలో)  సంగీతం గురించి తెలిసినవాళ్ళు కూడా ఉన్నారా బాబూ!" అని వ్యాఖ్యానించి, తర్వాత తన పద్యాన్ని తగురీతిగా మార్చి పాడారట. సి.ఎస్.ఆర్. కుచేలుడి పాత్రకి పాడిన 'నిలుపన్ జాలను నెమ్మనమ్ము' పద్యం ఘంటసాలగారు తిరిగి పాడిన రికార్డింగ్ సందర్భాన్ని కూడా ఘంటసాలవారి సంగీతం గురించిన వ్యాసాలలో  పట్రాయని సంగీతరావుగారు పేర్కొన్నారు. సహగాయనీగాయకుల యడల ఘంటసాలగారి వినమ్రభావం ఆ సంఘటన స్పష్టం చేస్తుంది. ఘంటసాలగారి పద్యపఠన శైలి వైశిష్ఠ్యం, నాటక పద్యశైలికి దానికీ ఉన్న వైరుధ్యం గురించి సంగీతరావుగారి మాటల్లో ఇక్కడ వినండి.




మొత్తానికి అన్ని వర్గాలవారిని ఆకట్టుకొని వారి ప్రేమాభిమానాలు పొందిన విలక్షణ గాయకోత్తముడు మన ఘంటసాల.

💥కొసమెరుపు💥

రాజీ! (ఘంటసాల మాస్టారు సావిత్రమ్మగారిని రాజీ అనే పిలిచేవారు) ఇవేళ తలనొప్పిగా వుంది. సాయంత్రం పనిలేదు. పడుక్కుంటాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూడు'.

"అలాగే. మీరు రెస్ట్ తీసుకోండి."

మరో రెండు రోజుల తర్వాత అదే సాయం సమయాలలో "రాజీ! కాళ్ళు తెగమంటలు పుడుతున్నాయి. ఆ కిష్టిగాడిని నా కాళ్ళకు కొంచెం నూనె రాయమని చెప్పు.

"అలాగే చెపుతాను".

మరో రోజు సాయంత్రం కూడా మాస్టారికి చెవినొప్పి వచ్చింది.

అప్పటికి సావిత్రమ్మగారికి ఘంటసాల మాస్టారి నొప్పులకు కారణం అర్ధమయింది. ఆయనకు వచ్చినవి నిజమైన నొప్పులుకావు 'పెళ్ళిచేసిచూడు'లో మాస్టర్ కందా మోహన్" అమ్మా నొప్పుల" బాపతని. వారానికి రెండు మూడు రోజులు వచ్చే హిందీ మాస్టర్ బారినుండి తప్పించుకోవడానికే కాళ్ళనొప్పులు, తలనొప్పులు కొనితెచ్చుకునేవారు. LKG పిల్లవాడి తంతు.

అనేక వ్యాపకాల మధ్య, అంత వయసు వచ్చాక, ఏ ఆసక్తిలేకుండా కొత్తగా హిందీ నేర్చుకోవడం ఎందుకని ఆయన భావన. చూస్తూ చూస్తూ ఇంటికి వచ్చే పేద బ్రాహ్మడిని రావద్దని చెప్పడానికి ఘంటసాలవారికి మనసొప్పేది కాదు. ఎవరి ప్రేరణతో, ఏ కారణంతో హిందీ నేర్చుకోవాలనుకున్నారో నాకు తెలియదు కానీ, ఆ హిందీ చదువు ఎక్కువ రోజులు సాగలేదు. మాస్టారికి బదులు అమ్మగారు పలకా బలపం పట్టుకొని హిందీ మాస్టర్ ఎదుట కూర్చోనేవారట. అదీ కొన్నాళ్ళ ముచ్చటే. తర్వాతఅమ్మగారికీ తలనొప్పి, కడుపునొప్పి రావడం మొదలయింది. 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో హిందీ భాషాభివృధ్ధికి బ్రేక్ పడింది.

 

💐ఈ ఉదంతంలోని విషయం మాత్రం ఘంటసాల సావిత్రమ్మగారి పుస్తకంలోనిది. కథనంభాష మాత్రం నావే.

ఈ చిన్న విషయం ద్వారా నేను చెప్పదల్చినదేమంటే ఘంటసాలవారు చాలా సున్నిత మనస్కులు. ఎవరినీ ఏ విధంగానూ నొప్పించకూడదనే పసిపిల్లవాడి మనస్తత్త్వం కలవారు. తనకు హిందీ నేర్చుకోవడంపట్ల ఆసక్తి లేదనిఅందువల్ల రావద్దని ఆ హిందీ మాస్టరుగారి ముఖంమీదే స్పష్టంగా చెప్పలేకపోయారు.

(నా జ్ఞాపకాలలో లేని, లేదా తెలియని అనేక విషయాలలో ఈ హిందీ కథ ఒకటి. బహుశా నేను మద్రాస్ లో లేనప్పడు జరిగిన విషయం కావచ్చు. అందుకే సావిత్రమ్మగారికి కృతజ్ఞతాభివందనాలతో....)

మరికొన్ని "నెం.35, ఉస్మాన్ రోడ్" జ్ఞాపకాలతో వచ్చే వారం...

                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.