visitors

Sunday, May 16, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఒకటవ భాగం

16.05.2021 -  ఆదివారం భాగం - 31*:
అధ్యాయం 2 భాగం 30  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రుతి ఎంత"?

"శ్రుతా! అదెవడికి తెలుసు. నువ్వు లాగించు. నీ ఆర్మణీ నా పాటకు తోకలాగుండాలి.

"ఆ...  కోడలే కులమునక్కత్తారమూ..

( కులమునకు ఆధారము)

గోడలే మెడకత్తారమూ

(మేడకు ఆధారము)

 'రమ్ రమ్ము' ' మ ప'.

 'శ్రుతి దొరికిందా?'

 'దొరికింది సార్!'

ఒకసారి నాలుగు, మరోసారి మూడున్నర'.

"పాతికకు అటూ ఇటైనా ఏం ఫర్లేదు. నువ్వు కానీ... అస్తమాను ఆ తెల్లవే కాక నల్లవి కూడా నొక్కుతూండు." (హార్మోనియం మెట్లు)

ఇది ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో సుమారు 56 ఏళ్ళ క్రితం "చెరపకురా చెడేవు" సినీమా లోని ఒక సీన్. అందులో రేలంగి ఔత్సాహిక ఒక రంగస్థల నట గాయకుడు. చిడతల అప్పారావు అతని ఆర్మణిస్ట్.  ఈ సీన్ వ్యంగ్యాత్మకమైనా ఆనాటి ఔత్సాహిక నాటకాల స్థితిగతులకు దర్పణం పడుతుంది. సాహిత్య, సంగీతాల విషయంలో తెలుగు నాటకం ఈనాటికీ అదే గతిలో వుందనిపిస్తుంది.

ఆత్రేయఎన్.ఆర్.నందిభమిడిపాటిగొల్లపూడిలకు ముందు తెలుగు సాంఘిక నాటక రంగస్థలం అంతగా వృధ్ధిచెందలేదు.

ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్ లోని  గ్రామసీమలలోని సామాన్య ప్రజానీకానికి వినోదమంటే  పౌరాణిక నాటకమే. 1947 తర్వాత  తెలుగు సినిమా టూరింగ్ టాకీస్ ల ద్వారా మారుమూల పల్లెల్లో ప్రవేశించేదాకా పౌరాణిక నాటకానిదే రాజ్యం. మా బొబ్బిలి లాటి వూళ్ళలో పొద్దస్తమానం ఏదో ఓ ఇంటిలో నుండి "అదిగో ద్వారక ఆలమందలవిగో", "బావా! ఎప్పుడో వచ్చితీవు"అనే పాండవోద్యోగవిజయాలు, శ్రీకృష్ణరాయబార పద్యాల ప్రాక్టీస్ తో ఊరంతటికీ వినపడేలా హోరెత్తించేవారు.

మరోపక్కనుండి అంతకన్నా గట్టిగా "చచ్చిరి సోదరుల్ సుతుల్ చచ్చిరీ" అంటూ శృతి కలవని కర్ణకఠోరమైన హార్మోనియంతో జనాలను చంపేవారు మరికొందరు. ఊళ్లో ఏ పండగాపబ్బం జరిగినా, పెళ్ళిపేరంటం జరిగినా ఏదో నాటకం ఆడాల్సిందే. మధ్య మధ్య నవతరం యువకులు ఉత్సాహంగా ఏవైనా చిన్న చిన్న సాంఘిక నాటికలు వేసినా ప్రజలు మాత్రం తిరుపతి వెంకట కవుల పౌరాణిక నాటకాలవేపే మోజు చూపేవారు. పండితుల మొదలు పామరులవరకు పాండవోద్యోగవిజయాలు, కృష్ణరాయబారంలోని పద్యాలన్నీ వాళ్ళ నాలిక చివరే వుండేవి. వీరందరికీ తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధశాస్త్రిసి.ఎస్.ర్, బందా కనకలింగేశ్వరరావు, కె.రఘురామయ్య, సూరిబాబు, షణ్ముఖి ఆంజనేయరాజు, అద్దంకి శ్రీరామమూర్తిపీసపాటి నరసింహమూర్తి వంటి నటగాయకులే ఆదర్శం.

తెలుగు రంగస్థల పౌరాణిక నాటకంమీద మరాఠీ నాటక ప్రభావం ఎంతైనావుంది. ఆ బాణీతోనే తెలుగు పౌరాణిక నాటకం కొనసాగింది. ఈ నటులలో చాలామంది బాగా చదువుకున్నవారు, సంగీతజ్ఞానం కలవారు వుండేవారు. అలాటివారి నాటక పద్యాలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. ఈ నాటక పద్యాలలో సంగీతంసాహిత్యం వున్నా సుదీర్ఘమైన రాగాలాపనకే  ప్రాధాన్యత. ఒక నటుడు రాగాలాపనతో ఒక పద్యం  మొదలెడితే అది పూర్తవడానికి పదినిముషాలైనా పడుతుతుంది. అది ముగిసేసరికి మరో నటుడు అంతకన్నా గట్టిగా మరింత ఎక్కువ రాగంతీసి  పోటీగా తన సమర్థత చూపేవాడు. ఈ విధంగా ఓ కృష్ణుడు, అర్జునుడుదుర్యోధనుడుధర్మరాజుకర్ణుడు, భీముడూ అంటూ తలో నాలుగైదు పద్యాలు పాడేసరికి తెల్లారిపోయేది. రాత్రి ఏ పదింటికో మొదలైన నాటకం మర్నాటి ఉదయం ఆరింటివరకూ సాగేది.

అన్ని గంటల నాటకాన్ని ప్రేక్షకులు మహా ఉత్సాహంతో చూసి ఆ పద్యాలనే రోడ్లమీద పాడుకుంటూ ఇళ్ళకు తిరిగివెళ్ళేవారు. ఆయా నటుల గిరికీ రాగాలాపనకే జనాలు పడి చచ్చేవారు. అయితే తెలుగు పౌరాణిక నాటక పద్యాలలోని సంగీతాన్ని కర్ణాటక సంగీత ప్రపంచం అంతగా హర్షించదుఆమోదించదు.

ఈ నాటకాలలో నటనకు హావభావాలకు అవకాశం తక్కువ. కరెంట్, మైకు వసతులులేని రోజుల్లో ఆయా నటుల కంఠస్వర బలమే వారికి శ్రీరామరక్ష. ఈ పౌరాణిక నాటకాలు చాలా దీర్ఘమైనవి కావడం వలన ఒక్కొక్క నాటకంలో ఇద్దరేసి కృష్ణులు (ఒక్కోసారి ముగ్గురు కూడా), ఇద్దరేసి అర్జునులు నటించేవారు. నాటకపోషకులు వీరి మధ్య పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చి సంతోషపడేవారు. సంగీతసాహిత్యాలలో ప్రతిభ కలిగిన నటీనటులు నటించినంతవరకూ పౌరాణిక నాటకం విరాజిల్లింది.

సినీమాలలో నేపథ్యగాన సౌకర్యం వృధ్ధి చెందనంతవరకూ రంగస్థల నటులే సినీమాలలో కూడా రాణించారు. రానురాను సంగీత పరిజ్ఞానం ఏమాత్రం లేని వారంతా శృతజ్ఞానంతో పౌరాణిక నాటకాలు ఆడడం మొదలెట్టారు. సరైన కంఠస్వరం లేనివారు, శృతి గతి లేనివారంతా నటులైపోవడంతో తెలుగు పౌరాణిక నాటకం తన ప్రాభవం కొల్పోయింది. ఈనాటికీ అక్కడక్కడ పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగుతున్నా  అందులోని నటుల పద్యపఠనం మాత్రం తృప్తికరంగా వుండదు. పాత కళల పరిరక్షణ అంటూ ప్రభుత్వం కూడా అలాటివారినే గుర్తించి పోషిస్తూంటుంది. 'వృక్షాలు లేనిచోట ఆముదం మొక్కే మహావృక్షం' అవుతుంది.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారి చిత్రసీమలో అడుగుపెట్టడంతోనే తెలుగు సినీమా సంగీత రూపురేఖలు మారిపోయాయి. నేపథ్యగాన ప్రక్రియ వృధ్ధి చెందడంతో గతకాలపు రంగస్థల నటుల గాత్ర ధర్మాలు నవీన తెలుగు సినీమాకు ప్రయోజనకారి కాలేకపోయాయి. అలాటి నటీనటులంతా తెరమరుగయ్యారు.

ఘంటసాలవారు తెలుగు పద్యపఠనంలో ఒక నూతన ఒరవడిని సృష్టించి తెలుగు ప్రపంచంలో ఒక ప్రభంజనమయ్యారు. నవ్య తెలుగు లలితసంగీతానికి ఆద్యుడు ఘంటసాలే.

ఘంటసాల కంఠం తెలుగువారికి పరిచయమైనది ఒక పద్యంతోనే. కాకపోతే స్వర్గసీమలో భానుమతి తో కలసి పాడిన పాట ముందుగా ప్రజలకు చేరింది. అంతవరకు వినని ఒక వినూత్న బాణీ ఘంటసాల కంఠస్వర రూపంలో వెలువడింది. ఘంటసాల గాత్రం అనితరసాధ్యం. ఘంటసాల పాట పెదవులమీదనుంచి రాదునాభిస్థానం నుండి నాదం వెలువడుతుంది. ఆ నాదంలో మృదుత్వం వుందిలాలిత్యం వుంది. అలా అని ఆ గాత్రం స్త్రీ గాత్రం కాదు. భావగంభీరమైనది. నవరసాలను సమాన స్థాయిలో పలికించగల ప్రతిభాశాలి. మూడున్నర శృతులవరకూ ఏ శృతిలో పాడినా తేలిపోని ఉత్తమ గాత్ర సంపద ఘంటసాల సొంతం. భాషభావప్రకటన ఘంటసాల సొమ్ము. శృతిలయలలో ఘంటసాలకు వున్న పట్టు అసమాన్యం.

ఉత్తమ సంగీతజ్ఞునికి కావలసిన ఈ లక్షణాలన్నీ సంపూర్ణంగా ఘంటసాల కంఠంలో ప్రకటితమైనట్లు వేరే యితర గాయకుని కంఠంలోనూ ప్రకటితం కాలేదంటే అది అతిశయోక్తో, లేక వల్లమాలిన వీరాభిమానంతో పొగిడే పొగడ్తలో కావు. అక్షరసత్యాలు. అందుకే కోట్లాది తెలుగు ప్రజలకు ఆరాధ్య‌ఆదర్శ గాయకుడు ఎవరంటే ఘంటసాల పేరే వినిపిస్తుంది. సినీరంగంలోని సంగీతదర్శకులుకవులుగాయనీగాయకులునటీనటులుదర్శక నిర్మాతలు అందరిచేత ముక్తకంఠంతో కొనియాడబడి గౌరవింపబడిన గాయకశ్రేష్టుడు మన ఘంటసాల. భావగాంభీర్యం గల పాటలు ఏవి పాడాలన్నా మొదటి ప్రాధాన్యత ఘంటసాలవారికే. ఒక దశలో తమిళ సినీమాలలో విషాదకరుణరస ప్రధానమైన పురుష కంఠం పాటలన్నీ ఘంటసాలవారినే వరించి వచ్చేవి. ఒక్క తెలుగునాటే కాదుతమిళకన్నడ దేశాలలో కూడా ఘంటసాల గానాభిమానులు అసంఖ్యాకంగానే వున్నారు.

ఘంటసాల తెలుగువాడై పుట్టడం మన అదృష్టం. 'అది ఆయన దురదృష్టంఅని అనేవారూ ఉన్నారు. బహుశా, కేంద్రప్రభుత్వపరమైన బిరుదుల విషయంలోని అలక్ష్యధోరణి వలన కావచ్చు.

నాదయోగులైన గురువుల కృపతోపూర్వజన్మ సుకృతంవలన దైవానుగ్రహంతోనాదసిధ్ధుడిగా రూపొందిన ఘంటసాలవారిలోని ప్రతిభను నిర్ణయించే కొలమానంఅనేక ప్రలోభాలకు లోబడినఘంటసాల  సంగీతం అంటే ఏమిటో  తెలియని ఓ పదిమంది కలసి నిర్ణయించే అశాశ్వత 'పద్మ'లు కానేకావు. అంతకు మించిన శాశ్వతస్థానాన్ని ఘంటసాలవారికి ఇచ్చి రసజ్ఞులైన సంగీతలోకం ఏనాడో తమ సహృదయతనుభక్తి విశ్వాసాలను ప్రకటించింది.

ప్రతీ తెలుగువాడి గుండె చప్పుడులోనూ ఘంటసాల పాటే వినిపిస్తుంది. ఘంటసాల నావాడని, నామనిషని, ప్రజాగాయకుడని ప్రతీ తెలుగువాడు ఈనాటికీ తల్చుకుంటున్నాడంటే అంతకుమించిన ఉన్నతమైన గౌరవంబిరుదు మరేముంది. వాసికన్నా రాశిఅంతకుమించిన ధనార్జనే ప్రతిభకు గీటురాళ్ళుగా భావించి ఇచ్చే బిరుదులు ఘంటసాలకు అనవసరం. 

ఈ శతాబ్దిలోనే కాదు మరెన్ని శతాబ్దాలైనా ఘంటసాల వంటి ఉత్తమగాయకుడు జన్మించడు. ఇది పొగడ్త కాదు. అతిశయోక్తి అంతకన్నాకాదు.

1960 లో  శ్రీకృష్ణరాయబారం అనే పౌరాణిక సినీమా వచ్చింది. పూర్తిగా తిరుపతి వెంకట కవులు వ్రాసిన పద్యాలతో తీశారు. పి.సూరిబాబు  రంగస్థల బాణీలోనే పద్య సంగీతం సమకూర్చారు. రఘురామయ్య, సూరిబాబుఅద్దంకి శ్రీరామమూర్తి, కాంతారావు, గుమ్మడిరాజనాల, మిక్కిలినేని మొదలగువారు ఈ సినీమాలో నటించారు.

ఈ సినీమాలో వున్న దాదాపు ఎనభై పద్యాలలో ఘంటసాల మాస్టారు ఓ పదిహేడు పద్యాలను అర్జునునికి, కర్ణునికి రంగస్థలనాటక బాణీని అనుసరిస్తూనే  అత్యంత శ్రావ్యంగా తనదైన ముద్రను కూడా ప్రస్ఫుటం చేస్తూ పాడారు. HMV లేబిల్ తో  వచ్చిన ఈ శ్రీకృష్ణరాయబారం పద్యాలు నాలుగైదు గ్రామఫోన్ రికార్డులుగా 'నెం.35, ఉస్మాన్ రోడ్రికార్డ్ ర్యాక్ లోవుండేవి.

1960ల తర్వాత, మూడు సొంత సినీమాల నిర్మాణం వలన కలిగిన నష్టాలనుండిఅప్పుల ఊబినుండి బయటపడడానికి ఘంటసాల మాస్టారు మరింత ఎక్కువ శ్రమించడానికి సిద్ధపడ్డారు. డబ్బింగ్ సినీమాలలో పాడడానికి సుముఖత చూపారు. విరివిగా కచేరీలు చేయడం ప్రారంభించారు.

ఆ దశలోనే  ఆనాటి ఆంధ్రదేశంలోని ఒక నాటకాల కంట్రాక్టర్ వరసగా తన  పౌరాణిక నాటకాలలో వేషం వేయడానికి, నాటకానికి ముందుగానో లేక మధ్య విరామ సమయంలోనో ఒక గంటగంటన్నర సంగీత కచేరీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఘంటసాల మాస్టారికి పౌరాణిక నాటకాలు కొత్తకాదు. బాల్యంలోనూ, విజయనగరంలో సంగీతశిక్షణ ముగించుకొని వచ్చిన తర్వాత ఒక నాటక సమాజం పెట్టి కొన్నాళ్ళు పద్యనాటకాలు వేసారు. ఆ అనుభవ దృష్ట్యా ఘంటసాలవారికి ఈ నాటకాలలో వేషం కట్టడం పెద్ద ఇబ్బందికరం కాలేదు. కృష్ణలీలలులో అకౄరుడుకృష్ణరాయబారంలో విదురుడు, సక్కుబాయిలో యోగి వంటి వేషాలు వేసేవారట. ఆ నాటకాలు చూడగలిగే వయసు నాది కాదు. 

కానీ, ఘంటసాల మాస్టారి ఈ రెండోసారి నాటకాలు చూసే అవకాశం మాత్రం నాకు లభించింది. ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలతో పాటూ మా బొబ్బిలి లో కూడా ఘంటసాలవారి కచేరీతో కూడిన నాటకం చూసే అదృష్టం నాకు కలిగింది. బొబ్బిలి చిన్న బజార్ లో వున్న ఒక  సాధారణ నాటక పెండేలు (శ్రీ వెంకటేశ్వరా హాల్ అనే జ్ఞాపకం)లో ఈ నాటక ప్రదర్శనలు అయాయి. ఈ నాటకాలలో షణ్ముఖి ఆంజనేయరాజు, పీసపాటి నరసింహమూర్తి, అద్దంకి శ్రీరామమూర్తి వంటి లబ్దప్రతిష్టులైన నటులెందరో పాల్గొన్నారు. మా బొబ్బిలికి ఘంటసాల రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

ఆయన సరాసరి మా ఇంటికే రావడం ఒక సంచలనమే అయింది. మా ఇంటిలోనో రాత్రి భోజనాలు ముగించుకొని రెండు మూడు జట్కా బళ్ళలో చిన్నబజార్ లోని నాటకాల హాలుకు చేరుకున్నాము. ఘంటసాల కచేరీ, నాటకంలో వేషం అంటే జనాలకు కొదవా? చుట్టుపక్కల గ్రామాలవారంతా ఘంటసాలను చూడడానికివినడానికి తరలివచ్చారు. ఘంటసాలగారి కచేరీకి మానాన్నగారి హార్మోనియంతో పాటు ఒక తబలా, ప్లూట్క్లారినెట్ మాత్రమే ఆర్కెస్ట్రా అని గుర్తు.

ఆనాటి నాటకం 'కృష్ణరాయబారం' అనే గుర్తు. మాస్టారు విదురుడు. కొన్ని పద్యాలు వున్నాయి. ఇతర ప్రధానపాత్రలు ఎవరు వేసారో గుర్తులేదు. కానీ, భీముడిగా ఆకెళ్ళ అప్పారావు భాగవతార్ అనే ఆయన వేసారు. నిజంగా భీముడిలాగే వుండేవారు.

ఘంటసాల మాస్టారి సంగీత కచేరీ నాటకానికి ముందా? విరామ సమయంలోనా అనే విషయం మీద కంట్రాక్టర్ కు , ప్రేక్షకులకు మధ్య ఒక చిన్నపాటి గొడవలు తలెత్తినట్లు విన్నాను.

నాటకం రాత్రి పది తర్వాత కావడం వలన, రాత్రి పన్నెండు తర్వాత హాలులో కుర్చీలో కూర్చొనే ఓ చిన్న కునుకు తీశాను.  మధ్యలో ఎవరో లేపారు, ఘంటసాల పద్యాలు పాడుతున్నాడులేవమని. సగం సగం నిద్రలోనే విన్నాను. విరామ సమయంలో మేము స్టేజ్ వెనక్కు వెళ్ళాము.

అక్కడ నేను ఊహించని వింత . కృష్ణుడు, దుర్యోధనుడు, ధర్మరాజు, భీముడుఅర్జునుడు మొదలైనవారంతా కిరీటాలు, గెడ్డాలు తో పంచెలు ఎగ్గట్టుకొని నేలమీద గొంతుకూర్చొని  చుట్టలుసిగరెట్లు కాలుస్తున్నారు. అక్కడ వాళ్ళు ఉపయోగించే మాండలిక యాసతో కూడిన భాష నాకు ఆశ్చరంవేసింది. ఇంతవరకూ అచ్చ గ్రాంధికంలో సమాసభూయిష్టమైన పద్యాలు పాడింది వీళ్ళేనా అని అనిపించింది. మొత్తానికి ఆ నాటకం పూర్తయేసరికి తెల్లారిపోయింది.

ఈ విధంగా ఘంటసాల మాస్టారి కాంట్రాక్టు నాటక ప్రదర్శనలు తెలుగునాట కొన్నాళ్ళు జరిగాయి.

ఘంటసాలవారి పద్యం చదివే తీరు ఇతర పౌరాణిక రంగస్థల నటుల కంటే భిన్నమైనది. పద్యంలో రాగంతీత కంటే రాగ లక్షణానికి, భాషకు, భావప్రకటనకు, గమకశుధ్ధికిశృతిశుధ్ధతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పద్యం ఏ రాగంలో పాడినా ఆ రాగ స్వరూపం సంపూర్ణంగాజనరంజకంగా ఆ నిముషంరెండు నిముషాల పద్యంలో ఇమిడేలా పాడడం ఘంటసాలవారి గాన విశిష్టత.

ఈ విషయంలో తన మీద తమ గురుదేవులైన పట్రాయని సీతారామశాస్త్రి గారి ప్రభావం చాలా వున్నట్లు ఘంటసాలవారు తరచూ తమ ఉపన్యాసాలలో చెప్పేవారు. ఘంటసాలగారు తన బాణీ ఇతర రంగస్థల నటుల లేదా ఇతర సినిమా గాయకుల బాణీకి విరుధ్ధమైనదైనా, గాయకుడిగా తాను వారందరికన్నా ఉఛ్ఛస్థాయిలో వున్నా సాటి నట గాయకులపైన అమితమైన గౌరవం, మర్యాద కలిగివుండేవారు. తానే అధికుడననే అహంకారమో, దర్పమో ఘంటసాలవారిలో అసలు కనిపించేవి కావు. అందరిపట్లా చాలా వినయవిధేయతలతో ఉండేవారు. మంచి పాట ఎవరు పాడినా పక్షపాత బుధ్ధి లేకుండా విని ఆనందించమని, మంచి పాటను పెంచమని తన అభిమానులకు సందేశం ఇచ్చేవారు. అందుకేతెలుగునాట ఘంటసాలగారికి గాయకుడిగా ఎంత గౌరవముందో వ్యక్తిత్వంగల మనిషిగా కూడా అంత గౌరవమూ వుంది.

కర్ణాటక సంగీతంలో మహామహులుగా పేరుపొందిన ఎమ్.ఎల్.వసంతకుమారి, ఎన్.ఎల్.గానసరస్వతి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగార్లకు తాను సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో పాడే అవకాశం కల్పించి  వారిపట్ల తనకు గల గౌరవాన్నిఅభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే రంగస్థల నటగాయకులైన కె.రఘురామయ్యకు వాల్మీకి చిత్రంలో నారదపాత్రలో పాడే అవకాశం కల్పించారు. శ్రీకృష్ణ కుచేలలో సి.ఎస్.ఆర్ కు, అద్దంకి శ్రీరామమూర్తిగారికి పాడే అవకాశం కల్పించారు. ధర్మరాజు పాత్రధారి అద్దంకి శ్రీరామమూర్తిగారు పాడవలసిన పద్యాలను ఘంటసాలవారు ఆయనచేతే పాడించారు. రాగనిర్దేశంస్వరరచన స్వేచ్ఛ వారికే ఇచ్చారట. ఈ సందర్భంలో అద్దంకి  శ్రీరామమూర్తి గారు దర్బార్ రాగంలో  ఒక పద్యం సెట్ చేశారట. అయితే ఆ రాగ స్వరప్రయోగ విషయంలో చిన్న అభ్యంతరాలని సంగీత సహాయకుడిగా మా నాన్నగారు (పట్రాయని సంగీతరావు) సూచించడంతో అద్దంకి శ్రీరామమూర్తిగారు "ఇక్కడ (సినీమావాళ్ళలో)  సంగీతం గురించి తెలిసినవాళ్ళు కూడా ఉన్నారా బాబూ!" అని వ్యాఖ్యానించి, తర్వాత తన పద్యాన్ని తగురీతిగా మార్చి పాడారట. సి.ఎస్.ఆర్. కుచేలుడి పాత్రకి పాడిన 'నిలుపన్ జాలను నెమ్మనమ్ము' పద్యం ఘంటసాలగారు తిరిగి పాడిన రికార్డింగ్ సందర్భాన్ని కూడా ఘంటసాలవారి సంగీతం గురించిన వ్యాసాలలో  పట్రాయని సంగీతరావుగారు పేర్కొన్నారు. సహగాయనీగాయకుల యడల ఘంటసాలగారి వినమ్రభావం ఆ సంఘటన స్పష్టం చేస్తుంది. ఘంటసాలగారి పద్యపఠన శైలి వైశిష్ఠ్యం, నాటక పద్యశైలికి దానికీ ఉన్న వైరుధ్యం గురించి సంగీతరావుగారి మాటల్లో ఇక్కడ వినండి.




మొత్తానికి అన్ని వర్గాలవారిని ఆకట్టుకొని వారి ప్రేమాభిమానాలు పొందిన విలక్షణ గాయకోత్తముడు మన ఘంటసాల.

💥కొసమెరుపు💥

రాజీ! (ఘంటసాల మాస్టారు సావిత్రమ్మగారిని రాజీ అనే పిలిచేవారు) ఇవేళ తలనొప్పిగా వుంది. సాయంత్రం పనిలేదు. పడుక్కుంటాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూడు'.

"అలాగే. మీరు రెస్ట్ తీసుకోండి."

మరో రెండు రోజుల తర్వాత అదే సాయం సమయాలలో "రాజీ! కాళ్ళు తెగమంటలు పుడుతున్నాయి. ఆ కిష్టిగాడిని నా కాళ్ళకు కొంచెం నూనె రాయమని చెప్పు.

"అలాగే చెపుతాను".

మరో రోజు సాయంత్రం కూడా మాస్టారికి చెవినొప్పి వచ్చింది.

అప్పటికి సావిత్రమ్మగారికి ఘంటసాల మాస్టారి నొప్పులకు కారణం అర్ధమయింది. ఆయనకు వచ్చినవి నిజమైన నొప్పులుకావు 'పెళ్ళిచేసిచూడు'లో మాస్టర్ కందా మోహన్" అమ్మా నొప్పుల" బాపతని. వారానికి రెండు మూడు రోజులు వచ్చే హిందీ మాస్టర్ బారినుండి తప్పించుకోవడానికే కాళ్ళనొప్పులు, తలనొప్పులు కొనితెచ్చుకునేవారు. LKG పిల్లవాడి తంతు.

అనేక వ్యాపకాల మధ్య, అంత వయసు వచ్చాక, ఏ ఆసక్తిలేకుండా కొత్తగా హిందీ నేర్చుకోవడం ఎందుకని ఆయన భావన. చూస్తూ చూస్తూ ఇంటికి వచ్చే పేద బ్రాహ్మడిని రావద్దని చెప్పడానికి ఘంటసాలవారికి మనసొప్పేది కాదు. ఎవరి ప్రేరణతో, ఏ కారణంతో హిందీ నేర్చుకోవాలనుకున్నారో నాకు తెలియదు కానీ, ఆ హిందీ చదువు ఎక్కువ రోజులు సాగలేదు. మాస్టారికి బదులు అమ్మగారు పలకా బలపం పట్టుకొని హిందీ మాస్టర్ ఎదుట కూర్చోనేవారట. అదీ కొన్నాళ్ళ ముచ్చటే. తర్వాతఅమ్మగారికీ తలనొప్పి, కడుపునొప్పి రావడం మొదలయింది. 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో హిందీ భాషాభివృధ్ధికి బ్రేక్ పడింది.

 

💐ఈ ఉదంతంలోని విషయం మాత్రం ఘంటసాల సావిత్రమ్మగారి పుస్తకంలోనిది. కథనంభాష మాత్రం నావే.

ఈ చిన్న విషయం ద్వారా నేను చెప్పదల్చినదేమంటే ఘంటసాలవారు చాలా సున్నిత మనస్కులు. ఎవరినీ ఏ విధంగానూ నొప్పించకూడదనే పసిపిల్లవాడి మనస్తత్త్వం కలవారు. తనకు హిందీ నేర్చుకోవడంపట్ల ఆసక్తి లేదనిఅందువల్ల రావద్దని ఆ హిందీ మాస్టరుగారి ముఖంమీదే స్పష్టంగా చెప్పలేకపోయారు.

(నా జ్ఞాపకాలలో లేని, లేదా తెలియని అనేక విషయాలలో ఈ హిందీ కథ ఒకటి. బహుశా నేను మద్రాస్ లో లేనప్పడు జరిగిన విషయం కావచ్చు. అందుకే సావిత్రమ్మగారికి కృతజ్ఞతాభివందనాలతో....)

మరికొన్ని "నెం.35, ఉస్మాన్ రోడ్" జ్ఞాపకాలతో వచ్చే వారం...

                    ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, May 9, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫైవ భాగం

09.05.2021 - ఆదివారం భాగం - 30*:
అధ్యాయం 2  భాగం 29 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"సంగీతం బాబూ...! ఒకసారి త్యాగయ్యగారి 'శివశివ యనరాదా', 'శ్రీ గణపతిని సేవింపరారే' ఈ రెండు కృతులు వినిపించండి". 

వెంటనే సంగీతరావుగారు హార్మోనియం వాయిస్తూ పంతువరాళి రాగంలోని 'శివశివ యనరాదా ', సౌరాష్ట్ర రాగంలోని ' శ్రీ గణపతినీ సేవింపరారే' కృతి పల్లని పాడి వినిపించారు. "చరణం పాడండి" అన్నారు. వెంటనే సంగీతం గారు "పనస నారీకేళ ఫలముల నారగించి" అని పాడి వినిపించారు. "శివశివ యనరాదా పల్లవి, 'పనస నారికేళా ఫలముల" చరణం మాత్రం నొటేషన్స్ వ్రాసి ఎంత టైమ్ పడుతోందో చూడండి." నొటేషన్ రాసి టైమ్ చూశారు.

"బాబూ... ఒకసారి ఆ భోజనాల సీన్  మానిటర్ వేయండి". సైలంట్ పిక్చర్ స్క్రీన్ మీద కనిపించింది. నొటేషన్ హార్మోనియం మీద ప్లే చేసి చూశారు. నొటేషన్ లెన్గ్త్ ఎక్కువైపోయింది. సీన్ కు తగ్గట్లుగా నొటేషన్ లోని స్వరాలను కుదించారు. 

"ఇప్పుడు వైలిన్స్, హార్మోనియం, ఫ్లూట్  వాళ్ళు మాత్రం ఈ బిట్ నొటేషన్ తీసుకొని ప్లే చేయండి. వెస్టర్న్ వైలిన్స్ అవసరం లేదు' అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఘంటసాల మాస్టారు తర్వాత సీన్ గురించి ఆలోచించడం మొదలెట్టారు.

అది భరణీ స్టూడియో. నైన్ టు నైన్ కాల్షీట్. "పరమానందయ్య శిష్యుల కథ" క్లైమాక్స్ రీ రికార్డింగ్. పరమానందయ్య శిష్యులు కోటలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా వంటగదిలోకి ప్రవేశించి అక్కడ వున్న ఫలహారాలన్నీ ఆరగించడానికి ముందు దేవుడి గదిలోకి వెళ్ళి పూజలు చేస్తూంటే దేవకన్య చిత్రలేఖ రహస్యంగా వారిని గమనిస్తూ వారెవరో మహానుభావులని భావిస్తుంది.  ఆమె కళ్ళకు ఆ గుంపులో ఒకరు బొజ్జగణపతిలా కనిపించి భక్తితో నమస్కరిస్తుంది. తర్వాత వారు అక్కడున్న విందు పదార్థాలన్నీ సుష్టుగా భోజనం చేస్తారు. వారికి ఫలాలనిచ్చి చిత్రలేఖ భక్తితో నమస్కరిస్తుంది. వారంతా "మహారాజును పెళ్ళాడుదువు గాక"  అని దీవిస్తారు. ఈ వింతను మహారాజుకు చెప్పడానికి చిత్రలేఖ వెళ్ళిపోతుంది. అదీ సీన్. దీని మీద మ్యూజిక్ పోస్ట్ చేయాలి.

ఈ సీన్ చూడగానే వెంటనే ఘంటసాల మాస్టారికి ఈ రెండు కృతులు గుర్తుకు వచ్చాయి. సందర్భోచితంగా, పాత్రల ఔచిత్యం దెబ్బతినకుండా రసస్ఫూర్తితో ఈ కృతులను ఉపయోగించారు. ఇలాంటి విషయాలలోనే సంగీత దర్శకుడి అనుభవం, ప్రతిభ గోచరమవుతాయి. ఘంటసాల మాస్టారి సంగీతంలో ఇలాటి రసగుళికలు ఎన్నో కనిపిస్తాయి.



తోట సుబ్బారావు అనే కొత్త నిర్మాత 'పరమానందయ్య శిష్యుల కథ' సినీమా తీస్తున్నారట. సి.పుల్లయ్యగారు దర్శకుడు. ఎన్.టి.ఆర్ హీరో. ఎల్.విజయలక్ష్మి, కె.ఆర్.విజయ హీరోయిన్లు. ఘంటసాల సంగీతం అనే వార్త సినీమా పత్రికల ద్వారా తెలియవచ్చింది. అంటే ఈ సినీమాలో కూడా మంచి సంగీతం వినే అవకాశం వుందన్నమాట అని మా బొబ్బిలి ఘంటసాలాభిమానులు ఆనందపడడం చూసాను. ఆ  సమ్మర్ కు మద్రాస్ చేరాను.

"ఒరేయ్ నాయనా ! ఇవేళ తొమ్మిదింటికి శ్రీదేవీ ప్రొడక్షన్స్ కంపోజింగ్ వుంది. నాన్నగారిని రెడిగా వుండమని చెప్పు". తొమ్మిదింటికి మాస్టారి కారులో శ్రీదేవీ ప్రొడక్షన్స్ ఆఫీసుకు వెళ్ళాము. ఆ ఆఫీసు ఎక్కడో చాలా దూరంగా వుంటుందనుకుంటే, కారెక్కిన రెండు నిముషాలకే అక్కడికి చేరుకున్నాము. తీరా చూస్తే అది మా ఇంటి పక్కనే. ఫర్లాంగ్ దూరంలో ఉన్న కోట్స్ రోడ్డులో.

మేము మద్రాస్ వచ్చినప్పటినుండీ ఈ కోట్స్ రోడ్ లో ఎన్నిసార్లు తిరిగానో లెఖ్ఖేలేదు. మా నాన్నగారి కారాకిల్లీల కోసం పాండీబజార్ లోని ఆంధ్రా కిల్లీ షాప్ కి ఆ కోట్స్ రోడ్ లో నుండే వెళ్ళేవాడిని. కోట్స్ రోడ్ లో చాలామంది ప్రముఖులే వుండేవారు. రోడ్ మొదట్లోనే పాతకాలపు నటి కుమారి ఇల్లు, తమిళ హాస్యనటుడు టి.ఆర్.రామచంద్రన్ ఇల్లు, హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ జి.ఆర్.రావు, చివరగా సుప్రసిద్ధ తెలుగు నటుడు ధూళిపాళ గారి ఇల్లు ఆ కోట్స్ రోడ్ లోనే. వారింటి పచ్చరంగు ఇనప గేటు మీద తెలుగు అక్షరాల్లో 'ధూళిపాళ' అని ఉండేది. 

ఆ కోట్స్ పేరుతోనే నా సగం జీవితం ముడిపడిపోవడం మరో పెద్ద విచిత్రం. 28 ఏళ్ళపాటు నేను ఒకేచోట పాతుకుపోయి పనిచేసిన కంపెనీ పేరు కూడా "కోట్స్". అయితే ఈ కంపెనీ 'Coates ', రోడ్ 'Coats' ఒకరు కాదు. అలాటి ప్రసిధ్ధికెక్కిన కోట్స్ రోడ్ లోని శ్రీదేవి ప్రొడక్షన్స్ కు ఎన్నిసార్లు వెళ్ళానో.

శ్రీదేవీ ప్రొడక్షన్ అధినేత తోట సుబ్బారావు నిర్మిస్తున్న మొదటి చిత్రం. 'పరమానందయ్య శిష్యుల కథ'. తోట సుబ్బారావుగారు వరసగా తీసిన ఐదు చిత్రాలకు ఘంటసాల మాస్టారే సంగీతం. మాస్టారితో సుబ్బారావుగారికి మంచి స్నేహం, అంతకు మించి చాలా గౌరవం. తన చిత్రాల సంగీతం విషయంలో మాస్టారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేసారు. 

తోట సుబ్బారావు గారిది చాలా భారీ విగ్రహం. ఆయన , ఆ సినీమా డైరెక్టర్ సి.పుల్లయ్యగారు, ఆయన సహాయకుడు బి.ఎల్.ఎన్.ఆచార్య - ముగ్గురిదీ ఒకటే డ్రెస్ కోడ్. తెల్లటి పంచెకట్టు, పైన జుబ్బా. మొదట్లో తోట సుబ్బారావుగారి ఆకారం చూసి దగ్గరగా వెళ్ళడానికి జంకేవాడిని. 

ప్రప్రథమంగా సినీమా మొదలెడుతూ 'పరమానందయ్య శిష్యులు' కథతో ప్రారంభిస్తున్నారే! అది ఫ్లాప్ సబ్జెక్ట్ కదా, సినీమా ఏం సక్సెస్ అవుతుంది అని పాండీబజార్ చెట్టుక్రింద పక్షులు గుసగుసలాడాయి. నిజమే. ఈ పరమానందయ్య శిష్యులు సినీమా తీసే కస్తూరి శివరావు అప్పులపాలై ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పేదరికంతో అష్టకష్టాలు పడ్డారు. చివరకు ఆయన మరణం కూడా చాలా దుర్భరంగా జరిగిందని చెప్పుకుంటారు. జీవనం కోసం ఏదో నాటకం ఆడడానికి ఏదో వూరు వెళ్ళి అక్కడ చనిపోతే ఆ మృతదేహాన్ని ఒక కారు డిక్కిలో వుంచి మద్రాస్ కు తరలించారని అంటారు. బ్యూక్ వంటి కారుకు ఓనర్ గా మహా దర్జాగా ఒక వెలుగు వెలిగిన హాస్యనటుడు కస్తూరి శివరావు, సినీమా నిర్మాణం వల్లనే పూర్తిగా దిగజారిపోయారు.

ఈ నేపథ్యం తెలిసినవారు 'పరమానందయ్య శిష్యులు" కథ సినీమాగా తీస్తున్నారంటే భయపడడం సహజమే. నిజానికి పరమానందయ్య శిష్యులను సినిమాగా తీయడానికి కావలసినంత కథేమీ వుండదు. కొంతమంది బుద్ధిహీనులు కలసి చేసే కొన్ని తెలివితక్కువ పనులు తప్ప. వారి చేష్టలు ఇతరులకు హాస్యాస్పదంగా, చిరాకుపుట్టించేవిగా ఉంటాయి. ఇలాటి ఎలిమెంట్స్ తో మూడుగంటల సినీమాను రసవత్తరంగా ఎలా తీయగలరు? అది ప్రశ్న.

అక్కడే, దర్శకుడు సి.పుల్లయ్య, కథారచయిత వెంపటి సదాశివ బ్రహ్మంగార్ల తెలివితేటలు, అనుభవం, ప్రతిభ తోట సుబ్బారావుగారికి కలిసివచ్చేయి. దర్శక రచయితలిద్దరూ ఈ కథకు ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ను ఇచ్చారు. పరమానందయ్య శిష్యులు నిజానికి ఒట్టి వెర్రివెంగళప్పలు కాదు. ఒక దేవకన్య శాపానికి గురైన మునికుమారులు. ఆ దేవకన్య వివాహసమయంలోనే వారికి శాపవిముక్తి. ఈలోగా వారంతా రాజగురువు పరమానందయ్య (చిత్తూరు వి.నాగయ్య)గారి దగ్గర శిష్యులుగా చేరి అనేకమైన తెలివితక్కువ పనులు చేస్తూంటారు. అయితే ఆ తెలివితక్కువ పనులలోనే ఇతరులకు చాలా మంచి కూడా జరుగుతూంటుంది. వీటన్నిటికి మెయిన్ లింక్ నందివర్థన మహారాజు (ఎన్టీఆర్), రాజనర్తకి (ఎల్.విజయలక్ష్మి), దేవకన్య చిత్రలేఖ (కె. ఆర్.విజయ)ల ముక్కోణపు ప్రేమకథ. ఈ అంశాలన్నింటినీ ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ  నవరసాలతో కూడిన అద్భుతమైన కథను తయారు చేసారు. రేలంగి, రమణారెడ్డి తప్ప మిగిలిన తెలుగు సినీమా హాస్యనటులంతా ఈ 'పరమానందయ్య శిష్యులు కథ'లో నవ్వుల పంట పండించారు. 

ఈ సినీమాలోని ఒక గొప్ప విశేషం ఏమంటే హాస్యంలో ఎక్కడా వెకిలితనం, అసభ్యత లేకపోవడం. సినీమా ఆద్యంతం ఎక్కడా విసుగుపుట్టించకుండా ప్రేక్షకులకు పుష్కలంగా వినోదాన్ని పంచిపెడుతుంది. కథానాయకుడిగా ఎన్.టి.రామారావు ఈ సినీమాలో చాలా అందంగా, హుందాగా పాత్రోచితంగా నటించారు. కథానాయికలుగా ఎల్.విజయలక్ష్మి, కె.ఆర్.విజయ చేసిన నృత్యాలు మంచి ఆకర్షణ. 

ఈ సినీమాకు ప్రాణం ఘంటసాలవారి పాటలే. మాస్టారి శాస్త్రీయ సంగీత ప్రతిభ ఈ సినీమాలో చాలాచోట్ల ప్రతిఫలించింది. సదాశివ బ్రహ్మం, శ్రీశ్రీ, సముద్రాల, సినారె, కొసరాజు వ్రాసిన ఓ ఇరవై పాటలు, పద్యాలను ఘంటసాలవారితో పాటు, పి.సుశీల, పి.లీల,  ఎస్.జానకి, ఏ.పి.కోమల, పిఠాపురం,  మొదలైనవారు  చాలా శ్రావ్యంగా పాడి రక్తి కట్టించారు. ముఖ్యంగా, ఘంటసాల మాస్టారి స్వర రచనలోని  - 'ఇదిగో వచ్చితి రతిరాజా', 'కామినీ మదన రారా' (ఘంటసాల, లీల), 'వనిత తనంతట తానే వలచిన' (లీల, కోమల), 'ఓ మహాదేవా నీ పదసేవా' (పి.సుశీల)" వంటి పాటలు, ఘంటసాలవారి సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి.

ఈ సినీమాలో మరో అద్భుతమైన వ్యంగ్యాత్మక గీతం 'పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా'. కొసరాజుగారి చురక. నేటి సమాజంలో కొందరు పెద్ద మనుషుల  ముసుగువేసుకొని ఏతీరుగా వుండి  ప్రజలను దోచుకు తింటున్నారో తెలియజెప్పే పాట. పిఠాపురం, జెవి రాఘవులు, అప్పారావు (తర్వాత చక్రవర్తి పేరుతో ప్రసిద్ధుడు), పట్టాభి, భద్రం, సౌమిత్రి, మొదలైనవారు పాడారు. పరమానందయ్యగారి శిష్యులు - పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, కోళ్ళ సత్యం, జి.రామచంద్రరావుల మీద చిత్రీకరణ. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన పాట.


"పరమగురుడుచెప్పినవాడు పెద్దమనిషి కాడయా " బృందగీతం

ఇంతకుముందే చెప్పినట్లుగా ఘంటసాలవారి సినీమాలలో రీరికార్డింగ్ కు ఒక ప్రత్యేకత వుంటుంది. సందర్భానికి తగిన నేపథ్య సంగీతాన్ని సమకూర్చడంలో వారిదొక ప్రత్యేక శైలి. సినిమా ఆద్యంతం నేపథ్య సంగీతం వీనులవిందుగా వుంటుంది. బీభత్సంగా జరిగే కత్తియుధ్ధాలు, హార్స్ ఛేసింగ్ లలో కూడా ఉపయోగించే వెస్టర్న్ వాద్యాలలో కూడా, అంతర్లీనంగా, ఏదో ఒక పాట వింటున్న అనుభూతిని శ్రోతలలో కలిగించడం ఒక్క ఘంటసాలవారికే చెల్లు. వారి అనేక సినీమాలలో ఈ ధోరణి వారి స్వరరచనలో కనిపిస్తుంది. 'పరమానందయ్య శిష్యులు కథ' టైటిల్ సంగీతాన్ని కూడా సశాస్త్రీయంగా మనసుకు ఆహ్లాదకరంగా స్వరపర్చారు. 

ఈ మొత్తం సినీమా రీరికార్డింగ్ చూసే అవకాశం నాకు దొరికింది. 

"పరమానందయ్య శిష్యుల కథ" ఘనవిజయం సాధించింది. ఘంటసాలవారి సంగీతానికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలోని గీతాలన్నీ ఈనాటికీ టీ.వి. ఛానల్స్ లో తరచూ వినిపిస్తూనేవున్నాయి. 

ఘంటసాల మాస్టారు తాను సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలో తాను పాడే పాటలకన్నా ఇతర గాయనీమణులకోసం చేసే పాటలమీదే ఎక్కువ శ్రధ్ధవహిస్తారేమో అనిపిస్తుంది.

'నెం.35, ఉస్మాన్ రోడ్' లో కనిపించే వ్యక్తుల పరిచయాల విషయంలోకానీ కొన్ని సంఘటనల విషయంలో కానీ కొన్ని ముందు వెనకలుంటాయి. అవి ఆనాటి తిధి, వార, నక్షత్రాలకు కట్టుబడివుండవు. గమనించగలరు.

1966లో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. శకుంతల, పరమానందయ్య శిష్యుల కథ, పాదుకా పట్టాభిషేకం.

ఈ మూడు చిత్రాల నిర్మాతలు ఘంటసాల మాస్టారికి కొత్తే. అంతకుముందు వారి ఇతర చిత్రాలకు వేటికీ సంగీతం చేయలేదు.
 
శకుంతల - రాజ్యం పిక్చర్స్ లక్ష్మీరాజ్యం- శ్రీధరరావుగారు నిర్మించింది. గతంలో వీరు తీసిన అనేక చిత్రాలకు (కృష్ణలీలలు, హరిశ్చంద్ర, నర్తనశాల) సుస‌ర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకుడు.

అనాదిగా మన సమాజంలో అబలగా ముద్రపడిన  స్త్రీ అనుభవించే అనేక కష్టనష్టాలకు, అవమానాలకు దర్పణంపట్టే పాత్ర శకుంతల. ఐదవ శతాబ్దానికి(?) చెందిన సంస్కృత కవి కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని కథానాయకి శకుంతల. శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఇతివృత్తం.

సినీమా మాధ్యమం ఆవిర్భవించినప్పటినుండి ఈ కథను అనేక భాషలలో అనేకసార్లు సినిమాగా తీయడం జరిగింది.

ముందుగా, తమిళంలో సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యంలు శకుంతల, దుష్యంతులు గా ఒక శకుంతల వచ్చింది. 

ఆ తర్వాత 1943లో హిందీలో  వి.శాంతారాం తన మొదటి భార్య జయశ్రీ గాడ్కర్ శకుంతలగా, చంద్రమోహన్ (1966 రంగుల రాట్నం ఫేం చంద్రమోహన్ కాదు) దుష్యంతుడిగా నిర్మించారు.

 

భారతీయ సంగీత, నృత్య, చిత్ర కళలలో అణువణువున ద్యోతకమయ్యే భావ సౌందర్యాన్ని, విశిష్టతను తన సినిమాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించి ప్రపంచానికి చాటిచెప్పిన నిర్మాత, దర్శకుడు వి.శాంతారామ్.



ఆయనకు శకుంతల పాత్ర అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అన్నట్టు ఈ సినిమాలో ప్రియంవద ఎవరో కాదు వి.శాంతారామే(నట!) [source: wikipedia]

ఈ శకుంతలను తిరిగి కలర్ లో  తెలుగు హిందీ భాషలలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా నిర్మించబోతున్నారనే వార్త కొన్నాళ్ళు మద్రాస్ లో సంచారం చేయడం జరిగింది. కానీ, ఏ కారణం చేతనో శాంతారాం సంకల్పం నెరవేరలేదు. అదే కనుక జరిగివుంటే ఎన్.టి.ఆర్ , ఘంటసాలల కీర్తికిరీటాలలో మరో ఉత్తమ మణిగా భాసిల్లివుండేది. తర్వాత, శాంతారాం తానే దుష్యంతుడిగా, తన రెండవ భార్య సంధ్య శకుంతలగా 'స్త్రీ' పేరిట 1961లో నిర్మించి అఖండ ఖ్యాతి పొందారు. 



ఈ సినీమాను మౌంట్ రోడ్ లోని గ్లోబ్ ధియేటర్ (LIC పక్కన వుండేది) లో చూసిన గుర్తు. ఈ చిత్రంలోని పాటలు, నృత్యాలు, దృశ్య చిత్రీకరణ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. విదేశాలలో, చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడి విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలను పొందిన చిత్రం శాంతారాం 'స్త్రీ'.

ప్రేక్షకులను ఇంతటి ప్రభావితం చేసిన 'శకుంతల'ను 1965లో తీయ సంకల్పించారు లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావులు.

కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, బి.సరోజాదేవి శకుంతలగా, నాగయ్య కణ్వుడిగా, ఇ.వి.సరోజ, ముక్కామల మేనకా విశ్వామిత్రులుగా, శారదా, గీతాంజలులు శకుంతల నెచ్చెలులుగా ప్రముఖ తారాగణంతో తలపెట్టారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని నియమించారు. ఈ విషయం నాకు చాలా రకాలుగా ఆనందం కలిగించింది. ఒకటి ఈ సినిమా ఘంటసాలవారు చేయడం వలన మా నాన్నగారికి కొన్నాళ్ళపాటు పనివుంటుంది. మరొకటి, శాంతారాం తీసిన స్త్రీ స్థాయిలో తెలుగులో సినీమా వస్తుందనే ఆశ. అయితే అది ఆశగానే మిగిలిపోయింది. కారణం ఈ తెలుగు సినీమా కలర్ లో కాకుండా బ్లాక్ ఎండ్ వైట్ లో తీసారు. అది నాకు బాగా అసంతృప్తి కలిగించింది.
 
తెలుగు శకుంతల కు జీవం ఘంటసాల మాస్టారి సంగీతం, నాగయ్య,ఎన్.టి.ఆర్ ల నటనా ప్రాభవం. కణ్వుడి పాత్రలో నాగయ్యగారి నటన అద్వితీయం. తాను మునే అయినా, సంసార జంఝాటాలు తనకు లేకపోయినా అడవిలో క్రూర మృగాల మధ్య దొరికిన శకుంతలను పెంచి పెద్ద చేసిన తండ్రిగా, ఆమె వివాహం చేసుకొని తనను, పరివారాన్ని వదలి భర్త దగ్గరకు సాగనంపవలసిన స్థితిలో పెంచిన మమకారంతో కణ్వుడు పడే ఆవేదనను వ్యక్తీకరించడంలో నాగయ్యగారి నటన ఎలాటి రాతిగుండె కలవారినైనా కదలించి, కరిగిస్తుంది. ఈ సన్నివేశంలో  సముద్రాల వారి సాహిత్యానికి ఘంటసాల మాస్టారు స్వరపర్చిన 'ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మా' పాట పాత్రౌచిత్యంతో, సందర్భోచితంగా అసామాన్యంగా అమరింది. ఈ సన్నివేశంలో నాగయ్యగారి నటన, ఘంటసాల, సుశీలగార్ల భావావేశం అద్వితీయం. ఈ ఘట్టమే శకుంతల చిత్రానికి హైలైట్ అనిపిస్తుంది. సినీమా కలర్ కాకపోతేనేం. నటీనటుల పాత్రోచిత నటన, నవరసాలతో నిండిన ఘంటసాలవారి పాటలు, నేపథ్య సంగీతం శకుంతలకు ప్రాణప్రతిష్ట చేశాయి. 


కణ్వుడు శకుంతలను అత్తగారింటికి పంపించిన  సన్నివేశం లో గీతం

ఈ సినీమాలో  దుష్యంతుడిగాగా ఎన్.టి.ఆర్ హుందాగా నటించారు. ఆ పాత్రకు ఘంటసాల మాస్టారు పాడిన 'అనాఘ్రాతం పుష్పం' అనే కాళిదాసు శ్లోకం,  'మదిలో మౌనముగా' పాట ఎంతో మనోహరంగా వుంటుంది. 

అలాగే, చిత్రం  ప్రారంభంలోని మేనక నృత్యగీతం 'కనరా ముని శేఖరా' ఘంటసాలవారి సంగీతవైదుష్యానికి దర్పణం పడుతుంది. 

శకుంతల సినీమాలో కూడా  వైవిధ్యభరితమైన సంగీతానికి ఎంతో అవకాశం వుంది. పాటల రూపేణా, నేపథ్య సంగీత రూపేణా సంగీత దర్శకుడి ప్రతిభను కనపర్చడానికి  మంచి అవకాశం గల కథ శకుంతల. అటువంటి శకుంతలకు అజరామరమైన సంగీతాన్నే సమకూర్చారు మన ఘంటసాల మాస్టారు. శకుంతల సినీమా టైటిల్ మ్యూజిక్ కూడా చాలా శ్రవణానందకరంగా వుంటుంది. కావాలంటే మీరూ విని చూడండి.
         

అదే సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో  విడుదలైన మరో పౌరాణిక చిత్రం 'పాదుకా పట్టాభిషేకం'. మరో రామాయణ గాథ. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రం మాస్టారికి రావడం నాకు అన్నివిధాలా ఆనందం కలిగించిన విషయం. ఈ చిత్రనిర్మాత పొన్నలూరి బ్రదర్స్. ఈ సినీమాను వేరే బ్యానర్ పై తీశారు. ఈ నిర్మాతలు గతంలో భాగ్యరేఖ, దైవబలం, కాడెద్దులు ఎకరా నేల వంటి కొన్ని సినీమాలు తీసారు. వారికి సొంత స్టూడియో కూడా వుండేది. అయితే, చిత్రమేమంటే వీరి సినీమాలు వేటిలోనూ ఘంటసాలవారు పాడలేదు. ఓ రెండు సినీమాలలో ఒక్కొక్క పద్యం మాత్రం పాడించుకున్నారు. 

ఇక్కడ ఒక్క విషయం మాత్రం నాకు బాగా గుర్తు. అదేమిటంటే పొన్నలూరి బ్రదర్స్ తీసిన 'దైవబలం' చిత్రానికి రీ-రికార్డింగ్ ఎమ్మెస్ రాజు (ఎమ్.సుబ్రమణ్యరాజు) చేశారు. ఆయన ఘంటసాల ఆర్కెస్ట్రాలో వీణ, మాండలిన్ వాయించేవారు. ఆయన పట్టుబట్టి మా నాన్నగారికి 'దైవబలం' రీరికార్డింగ్ లో హార్మోనియం వాయించడానికి నొటేషన్స్ వ్రాయడానికి అవకాశం కల్పించారు. మా నాన్నగారు ఘంటసాల మాస్టారి అనుమతితోనే వెళ్ళారు. నిజానికి ఎమ్మెస్ రాజుగారికి మా నాన్నగారిని పిలవవలసిన అవసరంలేదు. కానీ అది ఆయనకు మా నాన్నగారిపట్ల గల అభిమానం, గౌరవం. ఇలాటి స్నేహభావం పామర్తిగారికి, జె.వి.రాఘవులుగారికి మా నాన్నగారిపట్ల ఎందుకు కలగలేదో అని నాకు ఆ వయసులో అనిపించేది. అది అనుభవరాహిత్యం. ప్రపంచం పోకడ పట్ల అవగాహన లేకపోవడం. 

అలాటి పొన్నలూరి వారు తమ పౌరాణిక చిత్రానికి సంగీతం చేయడానికి ఘంటసాలవారినే  ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్ధంకాలేదు.  

ఈ సినీమాలో చాలా పద్యాలు, కొన్నే పాటలు వున్నాయి. పాటల  కంపోజింగ్ స్థాయినుండి ఈ సినీమా చాలా 'లో' బడ్జెట్  సినీమా అని అయినా చాలా రిచ్ గా వుండాలని అందుకు ఈ చిత్రంలో పనిచేసేవారంతా (నటీనటులు, సంగీత దర్శకుడు, గాయనీ గాయకులు, ఆర్కెస్ట్రా, టెక్నిషియన్స్, మొదలైనవారంతా) తమ పూర్తి వేతనాలలో కొంత తగ్గించి సహకరించాలని నిర్మాతల తరఫునుండి ఒత్తిడి రావడం మొదలయింది. మొత్తం సంగీతమంతా (రీ-రికార్డింగ్ సహా) పదివేల లోపే పూర్తయిపోవాలని భావిస్తున్నట్లు చెప్పుకోవడం జరిగింది. పాటల/రీరికార్డింగ్ కోసం ఆర్కెస్ట్రాను పదిహేనుమందిని పెడితే అంతమంది వద్దు, ఓ ఐదుగురిని తీసేయమనడం. అన్నీ సింగిల్ ఇన్స్ట్రుమెంట్సే పెట్టమనడం వంటివి జరిగాయి. నిజానికి  ఈ విధమైనటువంటి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పడం అంత సముచితంకాదు. 

కానీ ప్రేక్షకులు సాధారణంగా ఒక సినీమా చూడగానే వారు కొన్న టిక్కెట్టుకు తగ్గ ఆనందం దొరక్కపోతే ఆ సినీమా చెత్త అని, మ్యూజిక్ వరస్ట్ అని, ఎడిటింగ్ బాగాలేదని, కెమెరా ఏంగిల్స్ బాగాలేవని, ఔట్ డోర్ డ్యూయెట్స్ లో హీరో హీరోయిన్లు కాస్ట్యూమ్స్ చీప్ అని నానా రకాల కామెంట్స్ చేస్తారు. ఈ రకమైన కామెంట్స్ కు ఆయా కళాకారులు బాధ్యులు కారు. 'పిండి కొద్ది రొట్టె'.
 
పాదుకా పట్టాభిషేకం నిర్మాతలలో ఒకరైన పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. కాంతారావు రాముడు, కృష్ణకుమారి సీత. 

సినీమా పూర్తయి రీరికార్డింగ్ ముందు ప్రొజెక్షన్ వేసి చూపారు. నిజానికి రీరికార్డింగ్ లేకుండా ఏ రష్ చూసినా బాగున్నట్లు అనిపించదు. రీరికార్డింగ్ బాగా రావాలంటే సంగీత దర్శకుడికి కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. కాని అక్కడ కూడా మాస్టారిచ్చిన లిస్ట్ లో కట్స్ పెట్టారు. ఘంటసాల మాస్టారు చాలా సహృదయుడు కనుక, చిత్రనిర్మాతగా తానూ విపరీతంగా నష్టపోయిన వ్యక్తిగా సాటి నిర్మాతకు ఎంతటి సహాయ సహకారాలు అందించాలో పరిపూర్ణంగా అందించి, తన సంగీత దర్శకత్వ అనుభవాన్ని ఉపయోగించి 'పాదుకా పట్టాభిషేకం' పూర్తిచేశారు. తన విభాగానికి చెందినంతవరకు పరిపూర్ణ న్యాయం చేకూర్చారు. ఇక బాక్సాఫీస్ దగ్గర జయాపజయాలంటారా - అవి దైవాధీనాలే. ఆ దైవాలు తెలుగు సినీమా ప్రేక్షకులే. వారే సినీమాను  ఎప్పుడు, ఎందుకు, ఎలా ఆదరిస్తారో వారికే తెలియదు. అందుకే సినీమా వ్యాపారం ఒక గాంబ్లింగ్ అంటారు.
పాదుకా పట్టాభిషేకంలో  సీతారాముల యుగళగీతం

నాకు ఆనాటి కొందరు చిత్ర నిర్మాతల మనస్తత్త్వం అర్ధమయేదికాదు. 'మెత్తని వాళ్ళను చూస్తే మొత్త బుద్ధి' అంటారు. అది కొందరు తూ.చ. తప్పక పాటిస్తారు. మన సంగీత దర్శకుల దగ్గర  'లో-బడ్జెట్' లో ముగించాలని, డబ్బు ఎక్కువ ఇచ్చుకోలేమని బీద ఏడ్పులు ఏడ్చేవారే, తమ తర్వాత చిత్రానికి మరో పెద్ద తమిళ మ్యూజిక్ డైరక్టర్ నో, హిందీ మ్యూజిక్ డైరక్టర్ నో పెట్టి వారి కండిషన్స్ అన్నిటికీ సలామ్ కొడుతూ వందమందికి తక్కువ లేకుండా ఆర్కెస్ట్రా పెట్టి లక్షలు లక్షలు ఖర్చు చేస్తారు. బొంబాయి వారైతే స్టార్ హోటల్స్, బీచ్ రిసార్ట్స్ లో కంపోజింగ్ లు, మందూ మాకూ అన్ని హంగులు సమకూరుస్తారు. వారికి పొరుగింటి పుల్లకూరే రుచి.

💥కొసమెరుపు💥
 
తెలుగు సినిమా రంగంలో చాలామంది గాయకులున్నారు. అందులో చాలామందియొక్క సంగీత పరిజ్ఞానం, విద్వత్  కోరస్ లకు ఎక్కువ, సోలోలు, డ్యూయెట్లకు తక్కువ అన్నట్లుంటుంది. ఇలాటివారందరికీ తరచూ మంచి అవకాశాలు కల్పించడం సంగీత దర్శకులకు చాలా ఇబ్బందికరమైన విషయమే.

ఛాన్స్ ల కోసమని ఘంటసాల మాస్టారి దగ్గరకు చాలా మందే వస్తూండేవారు. సాధారణంగానే సినిమాలలో బృందగానాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాటిచోట్ల ఐదుగురారుగురు ఆడా, మగా కంటే ఎక్కువమందికి అవకాశం కల్పించబడదు. అడిగినవారందరికీ అవకాశం కల్పించబడదు. అలాటి సందర్భాలలో ఆ కోరస్ సింగర్స్  మనసు నొచ్చుకోకుండా సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. ఆ గాయనీ గాయకులను ఆదుకోలేకపోతున్నందుకు ఘంటసాలగారు ఎంతో వేదన చెందేవారు.

అలా ఘంటసాలవారి దగ్గరకు వచ్చేవారిలో కొమ్మినేని హైమావతి  అనే ఆవిడ వచ్చేవారు. కోరస్ సింగర్ గా మాస్టారి సినిమాలలో చాలా పాటలలో గొంతు కలిపేరు. 

హైమావతిగారి తమ్ముడు అప్పారావు. తాను కూడా గాయకుడు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితం లభించక క్రమేణా డబ్బింగ్ వైపు దృష్టి సారించారు. అందులో నిలదొక్కుకున్నారు. కొన్నేళ్ళపాటు చాలా అవస్థలు పడిన తర్వాత సంగీతదర్శకుడిగా అవకాశం దొరికింది. క్రమక్రమేణా అప్పారావు చక్రవర్తిగా మారి తెలుగు సినీ సంగీతరంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మకుటంలేని చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగారు.

చక్రవర్తి (ప్రముఖ సంగీతదర్శకుడు) అప్పారావుగా వున్న కాలంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'పరమానందయ్య శిష్యులు కథ' లో పిఠాపురం, రాఘవులు, మొదలగువారితో కలసి 'పరమగురుడు చెప్పినవాడు' పాటలో ఒక చరణం పాడారు. 

చక్రవర్తి సంగీతదర్శకుడై చేసిన అనేక డబ్బింగ్ సినీమాలలో, స్వతంత్రంగా చేసిన తొలి సినీమాలలో ఘంటసాల మాస్టారు కొన్ని పాటలు పాడడం విశేషం. ఆ తర్వాత కాలంలో కూడా హీరోలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి చేతే పాడించారు కానీ చక్రవర్తి పాడలేదు.
 
ఘంటసాలగారి జీవితం ఒక తెరచిన పుస్తకం. ఇతరులకు స్ఫూర్తిదాయకంగానూ, మార్గదర్శకంగా నిలిచే అంశాలు  ఆయన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో...

మరికొన్ని వచ్చేవారం....

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


Sunday, May 2, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై తొమ్మిదవ భాగం

02.05.2021 -  ఆదివారం భాగం - 29*:
అధ్యాయం 2 భాగం 28  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

2021 ఫిబ్రవరి నెల మొదటివారంలో ఆరు ముఖ్య గ్రహాలన్నీ మకరరాశిలో నివసించినట్లు జ్యోతిషశాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ షష్ట్యగ్రహ కూటమి వలన కలిగే లాభనష్టాల గురించి కూడా వారివారి గుణింతాలనుబట్టి వివరించారు. వాటి ఫలితాల విషయంలో ఎవరి అనుభవం వారిదే. సరిగ్గా ఇలాటి గ్రహకూటమే 1962 ఫిబ్రవరిలో  కూడా ఏర్పడింది. అప్పుడు ఏకంగా ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చిచేరాయి. ఆ అష్టగ్రహ కూటమి ప్రపంచానికే అరిష్టమని, వాటి పరిణామం చాలా భయంకరంగా వుంటుందని, మహప్రళయమే సంభవించబోతుందని మనుష్యకోటే ఏదో విధంగా అంతరించబోతుందని లెఖ్ఖలుకట్టి చెప్పారు.

ఆ సందర్భంగా మద్రాస్ మహానగరం సముద్రతీరాన్ని అంటిపెట్టుకొని వున్న నగరం కావడం వలన అష్టగ్రహకూటమి దినాలలో మద్రాస్ పూర్తిగా సముద్రంలో ములిగిపోతుందనే వార్తకూడా తుఫాన్ వేగంతో ప్రజలను భయభ్రాంతులను చేసింది.  ఇటువంటి భయానక పరిస్థితులలో ప్రజలను సురక్షితంగా కాపాడే ప్రదేశం అరుణాచలం ఒక్కటేనని అందుచేత మీరందరూ వెంటనే తిరువణ్ణామలైకు రావలసిందిగా మా నాన్నగారికి ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. ఈ ఉత్తరాన్ని వ్రాసిందెవరో తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు.

ఆ వ్యక్తి మరెవరోకాదు. విప్లవకవిగా, నాస్తికుడిగా, చెడిపోయినవాడిగా సనాతనవాదులచేత వెలివేయబడ్డ ప్రముఖ రచయిత శ్రీగుడిపాటి వెంకటచలంగారు. ఆ రోజుల్లో స్త్రీ అభ్యుదయం కోసం తన కలంద్వారా తీవ్రంగా స్పందించడం ఆనాటి సభ్యసమాజానికి నచ్చలేదు. చలం రచనలు ఎవరూ చదవకూడదని కొందరు నిషేధించారు. 

నేను  చాలాకాలం పాటు 'మాలపిల్ల', 'మాలపల్లి' ఒకటే అనే భ్రమలో వుండేవాడిని. 'మాలపల్లి' ఉన్నవ లక్ష్మీనారాయణగారు వ్రాసారు. గుడిపాటి వెంకట చలంగారిది 'మాలపిల్ల', నవల. కాంచనమాలతో సినీమాగా కూడా వచ్చింది. చలంగారే మాటల రచయిత కూడా. స్త్రీ జనాభ్యుదయానికి, వెనబడిన వర్గాల ఉద్ధరణకు దోహదం చేసిన సినీమాగా మాలపిల్ల చాలా ప్రశంసలు పొందింది. ఈ 'మాలపిల్ల' సినీమాను మా నాన్నగారి స్నేహితుడు పంతుల శ్రీరామశాస్త్రిగారు ఒక వేసంగి శెలవులకు మద్రాస్ వచ్చినప్పుడు 'సన్'  థియేటర్లో మ్యాట్నీకి మేమిద్దరమే వెళ్ళాము. బెంచ్ టిక్కెట్. జనాలు లేరు. హాయిగా బెంచీలమీద పడుక్కొని చూశాము. నేను చూసిన మొదటి కాంచనమాల సినీమా అదే.  
              
 

గుడిపాటి వెంకటాచలంగారు భీమ్లీలో (భీమునిపట్నం) వుండేవారు. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అని గుర్తు. ప్రవృత్తి రచనా వ్యాసంగం. చలంగారి రచనలకు ప్రభావితులైన యువకులు చాలామందే వుండేవారు. చలంగారు కొడవటిగంటి కుటుంబరావుగారి బావగారి తమ్ముడు. కొమ్మూరి రామయ్యగారి (ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావుగారి తండ్రి) తమ్ముడు చలంగారు. గుడిపాటివారింటి దత్తపుత్రుడు. 

అంతటి తీవ్ర భావాలతో విప్లవ ధోరణి కలిగిన చలంగారు క్రమక్రమంగా తన ఆలోచనా దృక్పథంలో మార్పుకలిగి ఆధ్యాత్మికత వేపు మరలిపోయారు. తన నివాసాన్ని తిరువణ్ణామలైకు మార్చి అక్కడే స్థిరపడిపోయారు. ఆశ్రమవాసం. చలంగారి కుమార్తె సౌరీస్ కూడా అనేక పుస్తకాలు వ్రాశారు. సౌరీస్ మాత్రమే కాక  చలంగారికి మరో ఇద్దరో ముగ్గురో పెంపుడు కూతుళ్ళు వుండేవారు. అందులో ఒకావిడ పేరు పకపక (చంపకం). ఆమె భర్తే ప్రముఖ కవి, రచయిత అయిన వజీర్ రెహ్మాన్. మద్రాస్ లో వుండేవారు. మా నాన్నగారికి మంచి స్నేహితుడు. తరచూ మా ఇంటికి వచ్చేవారు. సంగీతాభిలాషి ఆయన దగ్గర చాలా ఇంగ్లీష్ రికార్డ్ లు వుండేవి. కోడంబాక్కం రంగరాజపురం - విశ్వనాథపురంలో వారిల్లు. అప్పట్లో వారికి రెండేళ్ళో, మూడేళ్ళో ఒక చిన్న పాప. చాలా ముద్దుగా వుండేది. ఆ పాప అన్నం తినే విషయంలో చాలా ఇబ్బందిపెట్టేది. అలాటి సమయంలో సోఫియా లారెన్ పాడిన "జూ బి జూ" పాట ఆ పాపను చాలా ఆకర్షించింది. దానితో ఆ పాప ఆహార సమస్య తీరింది. ఆ పాటను గ్రామఫోన్ లో వినిపిస్తూంటే ఏ అల్లరిలేకుండా శుభ్రంగా అన్నం తినేసేది. అయితే మధ్యలో పాట ఆగితేమాత్రం యాగీయే. విసుగు విరామం లేకుండా నిద్ర వచ్చేవరకూ ఆ పాట అలా వినిపించవలసిందే. నేను ఎప్పుడు వెళ్ళినా వజీర్ రెహ్మాన్ గారింట్లో ఈ సోఫియాలోరేన్  'జూ బి జూ' పాట వినబడేది.


సోఫియా లోరెన్ జూ బి జూ

చలంగారితో మా నాన్నగారికి ఎప్పుడు పరిచయం కలిగిందో నాకు తెలియదు, బహుశా, కుటుంబరావుగారు, జలసూత్రంవారు కారణం కావచ్చు. ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి తిరువణ్ణామలై వెళ్ళి చలంగారితో గడిపి వచ్చేవారు. చలంగారికి మా నాన్నగారి పాటంటే ఇష్టం. వారిద్దరిమధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. ఆయన వ్రాసే ప్రతి ఉత్తరం క్రింద 'ఈశ్వర ఆశీర్వచనాలతో - చలం' అని సంతకం చేసేవారు.

అష్టగ్రహ కూటమి విషయంగా చలంగారు వ్రాసిన ఉత్తరానికి మా నాన్నగారు ఎలా స్పందించారో నాకు తెలియదు. ఆయన ప్రతీవిషయాన్ని తార్కికంగా, హేతుబధ్ధంగా ఆలోచిస్తారు. తన వాదనలను, అభిప్రాయాలను సమర్ధించుకోవడంకోసం వాద ప్రతివాదాలు చేసే అలవాటు లేదు. అందరి అభిప్రాయాలను ఒకేరీతిలో స్వీకరించేవారు. తన ఆలోచనారీతికి తగినట్లు నడుచుకునేవారు.

మా నాన్నగారు నాస్తికులు కారు. ఆయనది జ్ఞానమార్గం. గంటల తరబడి చేసే పూజాపునస్కారాలు, నిరంతర ఆలయ దర్శనాల కర్మమార్గానికి ఆయన దూరమేమోననిపిస్తుంది. అయితే వృత్తిపరంగా అనేక దేవాలయాలను దర్శించేవారు. వాటి చరిత్రను క్షుణంగా అర్థం చేసుకునేవారు. జ్యోతిషం, హస్త సాముద్రికం, వేదాంతం వంటి వాటిలో కూడా మంచి ప్రవేశం వుంది. ఆ శాస్త్రాలలో ఆరితేరిన వారితో మంచి స్నేహమూ వుండేది. అయితే అవన్నీ జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే అన్నట్లుండేది.  నాకు తెలిసి ఆయనకు ఏ విషయంలోనూ మూఢ నమ్మకం లేదు. 

మొత్తానికి అష్టగ్రహకూటమికి మద్రాస్ విడిచిపెట్టి అరుణాచలం వెళ్ళలేదు.  తదనంతరం ఆ విషయమై ఎవరితోనూ చర్చించనూలేదు.

ఇలాటి 'నమ్మిక' 'faith' వంటి విషయాలలో ఘంటసాల మాస్టారు, మా నాన్నగారికి భిన్నంగానే వుండేవారు. 

మాస్టారు అందరినీ  నమ్మేవారు. వారు చెప్పే విషయాలకు స్పందించి తీవ్రంగా చలించిపోయేవారు. అలాటివారికి సహాయం చేయడంలోరాత్రింబగళ్ళు శ్రమించేవారు.  ఘంటసాల మాస్టారు చేసిన సగానికి సగం కచేరీలు వ్యక్తులను, సంస్థలను, అలయాలను ఉధ్ధరించడానికే జరిగాయి. అందులో ఆయనకు ఏమాత్రం ఆదాయం వుండేదికాదు. అయినా అలాటి సామాజిక కార్యక్రమాలలో ఆయనకు ఆనందం వుండేది. తన ఆర్కెస్ట్రా వారికి మాత్రం ప్రతిఫలం కలిగేలా చేసేవారు. అయితే ఆ పారితోషికం సినీమా పాటలకు వాయించేదానికన్నా తక్కువగానే వుండేది. అలాగే, గ్రామఫోన్ కంపెనీ రికార్డింగ్స్ కూడా. అందులో కూడా మాస్టారికి రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయమే తప్ప అధికలాభం వుండేదికాదు. అందుకే  చాలామంది ఆర్కెస్ట్రా వారు కచేరీలకు, గ్రామఫోన్ కంపెనీ  రికార్డింగ్ లకు అంత సుముఖత చూపేవారు కాదు. అందుకే ఘంటసాల మాస్టారు తనను బాగా అంటిపెట్టుకొని వున్నవారితోనే కచేరీలు చేసేవారు. వారంతా కూడా సంగీతంలో నిష్ణాతులే. మాస్టారి బాణీ, ధోరణికి అలవాటు పడినవారే.

ఒక ఏడాది క్రితం ఎవరో (వారికి ఎలా దొరికిందో తెలియదు) వాట్సప్ సమూహంలో ఒక ఆసక్తికరమైన విషయం పెట్టారు.  అది 1960లకు ముందెప్పుడో  జరిగిన ఘంటసాల మాస్టారి కచేరీకి సంబంధించిన వివరాలు. మౌంట్ రోడ్ స్పెన్సర్స్ వెనక వేపు 'కన్నెమెరా' హోటల్ వుండేది. ఆరోజుల్లోనే చాలా ప్రెస్టేజియస్ స్టార్ హోటల్. సామాన్యులకు అందుబాటులో వుండనిది. అలాటి హోటల్ లో జరిగిన  ఒక పెళ్ళి రిసెప్షన్ లో ఘంటసాలవారికి, వారి బృందానికి చెల్లించిన పైకం వివరాలు చూస్తే నా మతిపోయింది. ఆనాటి కచేరీకి జరిగిన మొత్తం ఖర్చు 1500 రూపాయలుగా వివరించబడింది. ఆ కచేరీలో నాకు తెలిసిన ఒక వైలినిస్ట్ కూడా పాల్గొన్నారు. పేరు లాజరస్. ఆంగ్లో ఇండియన్. మాస్టారి ఆర్కెస్ట్రా మెంబర్. ఆ కచేరీ వివరాలు చాలాకాలం నా ఫైల్ లో వుండేవి. ఇప్పుడు కనపడలేదు. ఎలాగో డెలిట్ అయిపోయాయి.

తరచూ ఎవరో ఒకరు మాస్టారి సహాయాన్ని అర్ధిస్తూ వచ్చేవారు. వారందరికీ ఏదో విధంగా సహాయపడేవారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో వుండే దేవాలయ అర్చకులకు వచ్చే ఆదాయం కుటుంబపోషణకు చాలక చాలా దీనావస్థలో వుండడం ఘంటసాలవారిని చాలా కలచివేసింది. రావలసిన జీతాలు సక్రమంగా అందుబాటు జరగక అర్చకులు చాలామంది అతి పేదరికంలో మగ్గేవారు. అలాగే చాలా దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమై, భూతగాదాలకులోనై కోర్ట్ లు కేసులు అంటూ దేవాలయ ఆదాయం కుంటుపడ్డాయి. ఇలాటివారికి తనకు చేతనైన సహాయం ఏదైనా చేయాలనే తపనతో 'వెలనాటి వైదిక అర్చక సంఘం' అనే దానిని ఏర్పర్చి అర్చకులు సాధకబాధకాలన్ని ఆ సంఘ ప్రతినిధులను తన ఇంటికి రప్పించి వారితో సావకాశంగా చర్చించి ఆనాటి రాష్ట్రమంత్రులైన  బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, తిమ్మారెడ్డి, ఎ.వాసుదేవరావు వంటి నాయకులు మాస్టారిని బాగా గౌరవించే మిత్రులు. అలాటివారిని కలసి, సంప్రదించి, నిర్విరామంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి ఆలయ అర్చకులకు తగు సహాయం అందేలా కష్టపడ్డారు. 

జగద్గురు ఆదిశంకరాచార్యులవారు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకోసం దేశవ్యాప్తంగా పర్యటించి అనేక పీఠాలను స్థాపించారు.  అలాగే ఆయన శిష్యపరంపర కూడా అనేక శంకర పీఠాలను స్థాపించారు. అలాటి వాటిలో ఒకటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని ఏకైక పీఠమైన పుష్పగిరి పీఠం. రాజ మహారాజుల కాలంలో గొప్పగా విరాజిల్లిన ఈ పుష్పగిరి పీఠం క్రమక్రమేణా తన వైభవాన్ని కోల్పోయింది. పీఠానికి చెందిన చాలా వ్యవహారాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఆ స్థితిలో పునరుధ్ధరణకు ఘంటసాలవారు  నడుంకట్టి చేసిన సేవ అనన్యసామాన్యం.

ఘంటసాలమాస్టారికి ఈ పీఠం గురించి తెలిసేనాటికి పుష్పగిరి పీఠాధిపత్యం వహించిన స్వామి నవయువకులు. అతి చిన్న వయసులోనే మహత్తరమైన పీఠాధిపత్యం లభించింది. అంతటి ఔన్నత్యం కలిగిన పదవి వహించేందుకు కావలసిన మనోపరిపక్వత, శాస్త్ర పరిజ్ఞానము, ఆగమశాస్త్ర విధివిధానాలు, మొదలైనవి సంపూర్ణంగా ఒంటబట్టలేదని అనుకునేవారు. సామాన్య ప్రజలకు పీఠాధిపతుల ఎడల భక్తి భావము, గౌరవము ఏర్పడాలి. అందుకు తగినట్లు ఈ యువస్వామి శిక్షణ పొందాలని ముందుగా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మద్రాస్ లో చాతుర్మాస్య దీక్షలు జరపడానికి తగిన వసతులు ఏర్పాటు చేశారు ఘంటసాల మాస్టారు. ఆనాటి స్థానిక తెలుగు ప్రముఖులలో ఆధ్యాత్మిక విషయాలలో అక్కర, ఆసక్తి కలిగినటువంటి వైశ్య భక్తశిఖామణి ఆర్.ఆర్.నాధం, డి.ఎస్.శాస్త్రి వంటి మరికొంతమందిని కూడగట్టుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మద్రాస్ లోని శంకరమఠాలలో, జార్జ్ టౌన్ లోని కచాలేశ్వరాలయంలో పుష్పగిరి స్వాముల చాతుర్మస్య దీక్షకు వసతులు ఏర్పర్చి తనకు సమయం చిక్కినప్పుడల్లా స్వామీజీని కలుస్తూ పీఠాధిపత్య హోదా ఎలా కాపాడుకోవాలో వంటి ఆధ్యాత్మిక, లౌకిక విషయాలను చర్చించేవారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుష్పగిరి పీఠం గురించి స్థానిక ప్రజలందరికీ తెలియడానికి తను స్వయంగా భక్తి సంగీత కచేరీలు చేసారు. అదే సమయంలో ఒక రోజు మా నాన్నగారి (పట్రాయని సంగీతరావుగారి) సంగీత కచేరీ కూడా జరిగింది. ఆ రోజున తంబురా శృతి వేయడానికి తగినవారు అందుబాటులో లేక ఘంటసాల మాస్టారే మా నాన్నగారి కచేరీకి తంబురా శృతివేసారని, తరువాత ఎప్పుడో  ఘంటసాల మాస్టారి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ  ఒక వ్యాసంలో  పుష్పగిరి స్వామీజీయే ఉటంకించారు. ఘంటసాలగారి విద్యార్థి దశలో అటువంటి కొన్ని సందర్భాలు ఉన్నా, అనంతరం అలా సహకరించడం తన స్థాయికి తక్కువ పని అని ఘంటసాలవారు ఆనాడు భావించలేదు. ముఖ్యంగా శాస్త్రీయ సంగీత విద్వాంసుల ఎడల వారికి ప్రత్యేక గౌరవ మర్యాదలుండేవి.

ఇలాటి సంఘటనే ఘంటసాల మాస్టారి తొలి దినాలలో కూడా జరిగింది. మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీలో నిస్సార్ హుస్సేన్ ఖాన్ అనే సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడి కచేరీ జరిగినప్పుడు పక్కన తంబురా శృతి వేయడానికి ఎవరూ లేకపోతే వెంటనే ఘంటసాలవారే తంబురా శృతి వేసారని ఒక వ్యాసంలో పట్రాయని సంగీతరావుగారు పేర్కొన్నారు. అంతటి హృదయవైశాల్యం గల వ్యక్తి ఘంటసాల మాస్టారు.

ఈ విధంగా నూతనంగా పీఠాధిపత్యానికి వచ్చిన స్వాములవారి వద్దకు తనకు తెలిసిన ప్రముఖులెందరినో తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోని శంకరపీఠం అభివృధ్ధి చెందాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేసి వారందరి తోడ్పాటును అర్ధించారు. ఘంటసాలవారు పుష్పగిరి పీఠౌన్నత్యానికి, ఆ పీఠానికి అధిపతియైన శ్రీ మదోద్దండ విద్యానరసింహ భారతీస్వాములవారి పురోభివృద్ధికి అనన్యసామాన్యమైన సేవలందించారు.

ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకే కాక సాంఘిక సంక్షేమాలకోసం కూడా తన శక్తిని, ప్రతిభను వినియోగించారు.

సినీమావారు ఏ సత్కార్యం తలపెట్టినా అందులో పాలుపంచుకోవడానికి ముందు వరసలో నిలిచింది ఘంటసాల మాస్టారే. సదా ప్రజల మధ్యే వుండాలని ఆకాంక్షించే ప్రజాగాయకుడు ఘంటసాల మాస్టారు. అందుకే ఎన్.టి.రామారావుగారు 'మా మాస్టారు' అంటూ గౌరవంగా, ఆప్యాయంగా పరిచయం చేసేవారు. ఎన్.టి.రామారావుగారి నేతృత్వంలో జరిగిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో ఘంటసాలవారు మరువలేని పాత్ర పోషించారు. రాయలసీమ కరువు నిధి, పోలీస్ సంక్షేమనిధి, ఇండో-చైనా వార్ సందర్భంగా ప్రధానమంత్రి రక్షణనిధి వంటి అనేక కార్యక్రమాలలో ఎన్.టి.ఆర్ తో సమానంగా వేదికను పంచుకున్నారు. ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలలో సినీ ప్రముఖులు అంతా వారి వారి అవకాశాలనుబట్టి పాలుపంచుకున్నారు. ఇది వాలంటరీ సర్వీస్ గా భావించి కొందరు, లేదా ఒక వర్గం వారు చేస్తున్న ఫంక్షన్స్ కనుక పాల్గొనడం ఇష్టం లేక మానివేసినవారు కొందరు వున్నా, దేశం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలలో పాల్గొనడం తన విధిగా ఘంటసాలవారు భావించి తన సేవలందించారు. అందుకే ఒక సందర్భంలో ఎన్.టి.ఆర్ స్పందిస్తూ "మాస్టారు ఎవరు వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు, మీరు నా పక్కనుంటే చాలు. మనిద్దరమే ఆంధ్రదేశమంతా పర్యటించి నిధులు వసూలు చేద్దామని" అన్నారట. అయితే అలాటి పరిస్థితి ఏర్పడకుండా సినీరంగమంతా ఒక్కటై దేశం కోసం తమ కళలను వినియోగించారు. చైనా యుధ్ధం సమయంలో ప్రధానమంత్రి రక్షణనిధికి ఎంతగానో తెలుగు సినీమారంగం తమ తోడ్పాటును అందించింది. విజయవాడ, హిందూపూర్, అనంతపూర్, వరంగల్, విశాఖపట్నం, మద్రాస్ వంటి అనేక ప్రధాన నగరాలలో ఎన్.టి.రామారావు నాయకత్వంలో అనేక సాంస్కృతికోత్సవాలు నిర్వహించారు.  కాంతారావు, దేవిక, ఛాయాదేవి, ధూళిపాళ, పద్మనాభం, జగ్గయ్య వంటి ప్రముఖ నటీనటులంతా రకరకాల స్కిట్ లు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. రాజసులోచన బృందం నృత్యకార్యక్రమాలుండేవి. ఇలాటి సందర్భంలోనే ఎన్.టి.ఆర్ 'శ్రీకృష్ణ సత్య' ను స్టేజ్ షోగా రూపొందించారు. అందులోని పాటలు పద్యాలను ఘంటసాల మాస్టారే స్వరపర్చారు. (ఈ కథనే తరువాత సినీమాగా తీద్దామని మీరే సంగీత దర్శకత్వం వహించాలని ఎన్టీఆర్ ఘంటసాల మాస్టారిని కోరారుట. అయితే అది ఆచరణలో జరగలేదు. అనేక చిత్రాల్లాగే ఇదికూడా మాస్టారి చేయి జారిపోయింది. ఆ అవకాశం పెండ్యాల గారు దక్కించుకున్నారు).

ఘంటసాల మాస్టారి సోలో కచేరీలు ప్రజలను విపరీతం ఉత్తేజపరిచేవి.

ఇవికాక,  ఉదయంపూట సినీ కళాకారులంతా జోలెపట్టి  ఆయా నగరాల పురవీధులలో  సంచారం చేస్తూ నిధులు వసూలు చేశారు. చిన్నలు, పెద్దలు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున విరాళాలు నటీనటుల జోలెలో వేసేవారు. అనేక చోట్ల ఎంతోమంది మహిళలు తమ ఒంటిమీది విలువైన నగలను కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది.  వీరు వెనక నడిచి వస్తూంటే ముందుగా ఘంటసాల మాస్టారు తన దేశభక్తి గీతాలతో ప్రజలను ఉత్తేజపరిచేవారు. ఇందుకోసమే ప్రత్యేకంగా బుర్రకథను, కొన్ని పాటలను వ్రాయించి తానే స్వరపర్చి గానం చేసేవారు. అలాటివాటిలో ఒకటి "హలో మిస్టర్ చౌఎన్ లై" అని  చైనా దురాగతాలను ఎండగడుతూ రాక్ ఎన్ రోల్ టైప్ లో ఒక పాట చేశారు. ఈ పాటల కంపోజింగ్, రిహార్సల్స్ మాస్టారింట్లోనే జరిగాయి. ఈ రక్షణనిధి సాంస్కృతికోత్సవాలలో మాస్టారివెంట మా నాన్నగారు పాల్గొని హార్మొనియంతో సహకరించారు.  ఈ పాటలన్నిటికి ప్రజలంతా పెద్ద ఎత్తునే ఆకర్షితులయ్యారు. ఎన్.టి.ఆర్ చేపట్టిన రక్షణనిధి విజయవంతమయింది. తరువాత రోజులలో కొన్ని గ్రామఫోన్ రికార్డ్ లుగా కూడా ఇచ్చారు.



ఇలాటి రక్షణనిధి కార్యక్రమం 1965లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సమయంలో మద్రాస్ తేనాంపేట కాంగ్రెస్ గ్రౌండ్స్ లో  కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి నేనూ వెళ్ళాను. ఆనాటి సాంస్కృతికోత్సవంలో తెలుగు, తమిళ  ప్రముఖ నటీనటులంతా పాల్గొన్నారు. 
ఎమ్.జి.ఆర్, శివాజీ, జెమినీ గణేశన్, సావిత్రి, దేవిక, ఎన్.టి.ఆర్, అక్కినేని, కాంతారావు, జగ్గయ్య వంటి హేమహేమీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు సినీమా పరిశ్రమల ప్రముఖులంతా ఒక చోట చేరితే అభిమానులకేం కొదవ. కాంగ్రెస్ గ్రౌండ్సంతా కిక్కిరిసిపోయింది. రకరకాల వినోదకార్యక్రమాలు జరిపారు.  సూపర్ హిట్ తెలుగు తమిళ గీతాలతో ఘంటసాల మాస్టారు చేసిన కచేరీ ప్రేక్షకులకు మహదానందం కలిగించింది. ఎమ్.జి.ఆర్, ఎన్.టి.ఆర్ ల ఉపన్యాసాలతో ప్రజలు ఊగిపోయారు.

కులాలలని, మతాలని, జాతులని, భాషలని, ప్రాంతాలని తమలో తాము ఎన్ని విధాలుగా కుమ్ములాడుకొని చస్తున్నా  దేశ సమగ్రతకు, రక్షణకు ముప్పువాటిల్లుతున్నదంటే దేశంలోని అన్ని వర్గాలవారు ఏకమై సమైక్యంగా పోరాడతారు. అదే భారతీయ తత్త్వం. భిన్నత్వంలో ఏకత్వం. Unity in diversity.

ఈ విధంగా సినీ కళాకారులంతా సేకరించిన సుమారు పది లక్షల రూపాయలను ఒక వేదిక మీద ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిగారికి ఎన్టీఆర్ బృందం అంతా కలసి అందజేశారు.

ఈ రక్షణనిధి కార్యక్రమాలలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతాపూర్వకంగా గౌరవిస్తూ ఎన్.టి.రామారావు పతకాలను అందజేశారు. ఆనాటి ఎన్.టి.ఆర్ పతకం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది.



సినీమా రంగం వ్యామోహాలకు, ప్రలోభాలకు నిలయం.  వ్యాపారమే ప్రధాన లక్ష్యం. అలాటి రంగంలోని ఘంటసాలవంటి ప్రముఖ వ్యక్తి ఇటువంటి సామాజిక, అలౌకిక, పారమార్థిక కార్యకలాపాలలో పాల్గొనడం చాలా అరుదు. అందుకే ఘంటసాలవారు ప్రజల మనిషిగా, సినీమారంగంలో ఒక విశిష్ట వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. 

1966లో గాయకుడిగా ఘంటసాల మాస్టారి కీర్తిప్రతిష్టలను పెంచే చిత్రాలు చాలానే వచ్చాయి. అందులో ప్రముఖమైనవి - శ్రీకృష్ణ పాండవీయం, పల్నాటియుధ్ధం, ఆత్మగౌరవం, భీమాంజనేయయుధ్ధం, చిలకాగోరింక, సంగీతలక్ష్మి,  భక్తపోతన, శ్రీకృష్ణ తులాభారం, మనసేమందిరం, ఆస్తిపరులు, మోహినీ భస్మాసుర మొదలైనవి.
 
ఈ చిత్రాల్లోని పాటలన్నీ ఈనాటికి మనం విని ఆనందిస్తూనే ఉన్నాము. 



💥కొసమెరుపు💥

శ్రీకృష్ణ తులాభారం నిర్మాణంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న ముతక జోక్ నా చెవినబడింది. 

శ్రీకృష్ణ పాండవీయంలో  ఒక కొత్త నటికి అవకాశమిచ్చారు ఎన్.టి.రామారావు. ఆవిడే కె.ఆర్.విజయ. మలయాళీ. అప్పుడే కొన్ని తమిళ చిత్రాలలో హీరోయిన్ గా వేయడం మొదలు పెట్టింది. ఆవిడకు అప్పట్లో  తెలుగు శుధ్ధంగా (అంటే అసలు) రాదు. అర్ధము కాదు.

ఈ సినీమా నిర్మాణంలో వున్నప్పుడే శ్రీకృష్ణ తులాభారం సినీమా కూడా నిర్మాణంలో వుంది. అందులో కూడా సింగార కృష్ణుడిగా రామారావుగారి నటన అద్వితీయం. ఆ విషయాన్ని అందరు గొప్పగా చెప్పుకునేవారు. ఒకరోజు కె.ఆర్.విజయ, శ్రీకృష్ణపాండవీయం సెట్ లో రామారావు గారి దగ్గర 'శ్రీకృష్ణ తులాభారం' సినీమా ప్రస్తావన తెచ్చి ఆయనను ప్రశంసించబోయిందట. కానీ విజయకు తెలుగు సరిగ్గారాక శ్రీకృష్ణ తులాభారం అనేమాట పలకలేకపోవడంతో సెట్ మీద ఉన్నవారికి  'శ్రీకృష్ణ తులాభారంలో'' అశ్లీలత ధ్వనించిందట. ఇది విన్న వెంటనే ఎన్టీఆర్ ముఖం ఆగ్రహంతో ఎర్రబడిందట. వెంటనే పక్కనున్న పుండరీకాక్షయ్యలాటివారితో "ముందు ఈ అమ్మాయికి తెలుగు బాగా నేర్పి తీసుకురండి. అంతవరకు ఆ అమ్మాయితో షూటింగ్ కాన్సిల్" అని హుకూం జారీచేశారట. 

అదీ కధ.  అయితే ఇందులోని నిజానిజాలైతే నాకు తెలియదు.  ఇది రామారావుగారి స్టైల్ లో 'శత్రు వర్గాలవారు మా మీద పన్నిన కుట్ర' కూడా కావచ్చు. అందుచేత ఊరికే చదవండి వెంటనే మర్చిపొండి. 

😊Statutory warning: గాసిప్స్  ఒంటికి పట్టించుకోవడం మనసుకు మంచిదికాదు.

1966 లో విడుదలైన  ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు  మూడు - శకుంతల, పరమానందయ్య శిష్యుల కథ, పాదుకా పట్టాభిషేకం.

నేను ముందే పరమానందయ్య శిష్యుల గురించి చెపుతానని క్రిందటి వారమే  కమిట్ అయిపోయాను. అయితే పరమానందయ్యగారి శిష్యులు వేమారం వెళ్ళారట.

వచ్చేక, వచ్చేవారం కలుద్దాము.....
                  ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.