visitors

Saturday, June 6, 2020

నెం.35, ఉస్మాన్ రోడ్ - ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - మొదటిభాగం

మొదటి భాగం -

                        నెం. 35, ఉస్మాన్ రోడ్
                  -    స్వరాట్ 

ఆజన్మాంతం నేను సదా గుర్తుంచుకునే సంఖ్యలు చాలానే వున్నా అతి ముఖ్యమైనవి మాత్రం రెండే రెండు -
ఒకటి 35 , రెండవది 25.
35 ఉస్మాన్ రోడ్ గాన సరస్వతికి నిలయం.
25 సాంస్కృతిక నిలయం.
నేనేదో మీకు ఆసక్తి కలిగించే విషయాలు చెపుతానని అనుకోవడానికి కారణం నెం. 35 ఉస్మాన్ రోడ్.

ఇక, నాలాటి ఇంట్రావెర్ట్ ను చేరదీసినాలో కూడా  ఏదో టాలెంట్ వుందని ప్రోత్సహించి , నాచే నాలుగు మంచి పనులు చేయించిఅందరిలో నాకుకొంతలో కొంత గుర్తింపును యిచ్చినది నెం. 25. ఈనాడు, యిన్ని సమూహాలలో ఏవో నాలుగు మాటలు వ్రాయగలగడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్నిచ్చింది నెం. 25, మెలనీ రోడ్ .

ఈ రెండు నెంబర్లు గల స్థలాలలో ఏభైఏడేళ్ళ జీవితం గడిచింది. ఈ రెండు చోట్లా ఒక మంచి మనిషిగా జీవించడానికి కావలసిన అనేక మంచి పాఠాలు నేర్చుకున్నాను.

 ఎక్కడ వున్నాఎంత ఉన్నత స్థితిలో వున్నా గతం మరువద్దు. అహం వద్దు. ఆత్మవిశ్వాసం పెంచుకో. వినయంతో పాటూ వ్యక్తిత్వం కావాలి.  వివాదాలకు దూరంగా వుండు. అడుగు నేలమీదే వుండనీ . మంచి చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగు.
ఇటువంటి భావాలు నాలో పెంపొందడానికి ఎంతో దోహదం చేసిన ఆ 25 మీద నాకున్న కృతజ్ఞతకు సూచకంగా,  25 వ తేదీ నుండి మన సమూహంలో యీ కొత్త శీర్షికను  ప్రారంభిస్తున్నాను.

ఒకనాడు నెంబర్ 35 ఉస్మాన్ రోడ్, టి.నగర్, మద్రాస్-17, మెడ్రాస్ మహా నగరంలో సుప్రసిధ్ధం. గాన సరస్వతికి నిలయం. అదే, గానగంధర్వుడిగా, అమరగాయకుడిగా ప్రపంచ నలుమూలలావున్న తెలుగు వారందరి హృదయాలలో  సుస్థిరస్థానం ఏర్పర్చుకొని చిరంజీవి గా ప్రకాశిస్తున్న పాటల దేవుడు 'ఘంటసాలనివాస గృహం.

ఈ సంగీత కళాలయంలోని విశేషాలు  ఒక తెఱచిన పుస్తకం. లోకవిదితం. ఇప్పుడు
నేను కొత్తగా కనిపెట్టి, చెప్పగలిగే విశేషాలేవీ వుండవు. అనేకమంది, అనేక సందర్భాలలో, అనేక చోట్ల చెప్పినవే. అందులో కొన్ని మన సమూహంలో గతంలో చెప్పుకున్నవే.
కానీ35 నెంబర్  ప్రాంగణంలో పెరిగానన్న ఒకే కారణంతో, పెద్దలంతా మరింకే విషయాలైనా చెపుతాననే ఆసక్తితో ఈ శీర్షికను నాకు అప్పగించారు. ఆ మహా గాయకుడి సంగీతం గురించి చెప్పే సాహసం నేను చేయలేను. చేయను కూడా.

అందుకనే ఈ శీర్షికకు '' నెం. 35 ఉస్మాన్ రోడ్ '' అని  పేరు పెట్టాను. ఈ ప్రాంగణంలో సుమారు ఇరవై సంవత్సరాల పాటు , ఘంటసాలవారి కాలంలో నేను విన్న విషయాలను, పొందిన అనుభవాలను నాకు జ్ఞాపకమున్నంత వరకు , నాకున్న పరిధిలో వారం వారం నాకున్న భాషా పరిజ్ఞానంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఘంటసాలవారి ని ఒక మహా గాయకుడిగా కంటే , ఒక నిరాడంబర కుటుంబీకుడిగా చూపించే ప్రయత్నం చేస్తాను.
ఏ రకమైన అభూతకల్పనలు లేకుండా , ఏ విధమైన సంచలనాలు లేకుండా ఒక సాదా కుటుంబగాధా చిత్రంగానే , ఈ కధనం సాగుతుంది. సహృదయ సభ్యులంతా ఆమోదించి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.

ఇంతకూ , నెం. 35 ఉస్మాన్ రోడ్ లోకి నేను ప్రవేశించిన ముచ్చట్లు  చెప్పడానికి నాకు గల అర్హత ఏమిటో చెప్పుకోవాలి. అది ముందు చెప్తాను. 
(సశేషం)

No comments: