visitors

Saturday, June 6, 2020

నెం. 35, ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - రెండవభాగం


నెం. 35, ఉస్మాన్ రోడ్  (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ( రెండవభాగం)

  

                                            నెం. 35, ఉస్మాన్ రోడ్ 
 
                                                                                      - స్వరాట్


ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేముందు నాకు గల అర్హతేమిటో చెపుతానన్నాను.

ఒక మనిషి తనను గురించి పరిచయం చేసుకోవాలంటే , తనకంటూ ఒక స్థాయి , వ్యక్తిత్వం వుండకతప్పదు. అవి లేనివారు తమ వంశవృక్షాలను వెదకి వాటిలోని సారస్వమైన ఫలాలను తనకు ఆపాదించుకొని పదిమందిలో నిలబడాలనుకుంటారు. దీనినే 'చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం' ;  లేదా "మా పెద్దలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి " అని చెప్పడం. ఆ పనే యిప్పుడు నేను చేయబోతున్నాను.  నా యీ మాటలు చదువుతున్నవారికి నేనేదో complexities తో బాధపడుతున్నాననే అనుమానం కలుగుతుంది. నాకలాటి ఆత్మనూన్యతా భావాలేవీ లేవు. ఉన్న వాస్తవం అది. Hypocrisy కి దూరంగా వుండాలనేది నా కోరిక.

మాది ' పట్రాయని'  వారి వంశం. ఈ వంశంలోని పూర్వీకులు ఏదో రాజుగారి కొలువులో ' పట్రాయుడు' పదవి వహించారట. అంటే కొంతమంది సైనికులకు అధిపతి వంటి పదవి. ఆ పట్రాయుడి వంశంలోని వారు పట్రాయనివారుగా మారారు.
ఆ వంశంలో పుట్టినవారు శ్రీ వెంకట నరసింహ శాస్త్రి . ఆయన సంగీతజ్ఞుడు . ఆయన జీవితం చాలావరకు ఒరిస్సాలో ని బరంపురంలో జరిగింది. కర్ణాటక సంగీతంలో కొంత కీర్తన గ్రంధాన్ని నేర్చుకునేందుకు మద్రాస్ లో కొన్నాళ్ళు వున్నారట. ఒరిస్సా లోని అనేక రాజాస్థానాలలో , జమిందారీలలో  కచేరీలు చేస్తూ పండిత సత్కారాలు , సన్మానాలు అందుకున్నారు.ఈయనకు గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రీ నరసింహశాస్త్రి గారికి వయసు మీరాక తన కుమారుడితో సాలూరు లో నివాసం ఏర్పర్చుకున్నారు. సంగీతంలో తండ్రీ కొడుకులిద్దరిదీ వేర్వేరు మార్గాలుగా తోస్తుంది. ఆయనను '  సాలూరు పెద గురువు' గారనేవారు.

ఆయన కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి. వాగ్గేయకారుడు. ఎన్నో కృతులను , చాటు పద్యాలను చందోబధ్ధంగా వ్రాశారు. వీరు  ' సాలూరు చిన గురువుగా లబ్దప్రతిష్టులు. సీతారామశాస్త్రి గారు సాలురులో సొంతంగా భూమికొని దానిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించి సంగీత పాఠశాల ప్రారంభించారు. ఆంధ్రదేశమంతా  తిరిగి సంగీత కచేరీలు చేసేవారు.
సీతారామ శాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. సంగీతరావు , నారాయణ మూర్తి , ప్రభాకరరావు.
ఈ ముగ్గురు కూడా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే.
ఇలా మూడు తరాల వరకు సంగీతమే వృత్తిగా , ప్రవృత్తిగా , పరమార్ధంగా గల మా పట్రాయని వారి వంశం,  మా నాల్గవ తరానికి వచ్చాక సంగీతాన్నే వృత్తిగా స్వీకరించలేకపోయింది. కారణాలనేకం. అవి అప్రస్తుతం. అయితే అందరూ సంగీతాభిలాష , ఆసక్తి , గౌరవ మర్యాదలు కలవారే. ఇద్దరు , ముగ్గురు ఆడపిల్లలు సంగీతంలో విశిష్టమైన కృషిచేసినవారే.

పెరుగుతున్న కుటుంబం , ఆర్ధిక సమస్యల దృష్ట్యా శ్రీ సీతారామశాస్త్రిగారు (మా తాతగారు) సాలూరులోని స్వంత పాఠశాల వదలి  ఆంధ్రదేశంలోనే ప్రప్రధమ సంగీత కళాశాల అయిన విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించి , తన కుటుంబాన్ని కూడా విజయనగరానికి తరలించారు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏర్పడిన ఖాళీలో గాత్ర పండితునిగా నియామకానికి పెద్ద పోటీయే వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రముఖ వైలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడుగారు నియమించబడ్డారు. గాత్రపండితునిగా శ్రీ సీతారామశాస్త్రిగారు నియమితులయ్యారు. అయితే ,
ఈ ఆచార్య పదవి ఆయనను అంత సునాయాసంగా వరించలేదు.  విజయనగరం ఎస్టేట్ కలెక్టర్ , పండితుల సమక్షంలో జరిగిన పోటీలో నెగ్గిన తర్వాత శ్రీ సీతారామ శాస్త్రిగారికి గాత్ర పండితుడిగా ఉద్యోగం లభించింది.
అదే పదవిలో శ్రీ శాస్త్రిగారు రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. శ్రీ సీతారామ శాస్త్రి గారిది విలక్షణమైన సంగీతం. ఆయన గానం శుద్ద శాస్త్రీయమైనా  దాక్షిణాత్యపు సంగీతబాణీకి విరుధ్ధమైనది ఆయన గానం , సంగీతం. ఆయన తనకు ప్రక్క వాద్యంగా హార్మోనియం ను తానే వాయించుకుంటూ పాడేవారు. ఆ కారణంగా , ఆనాటి బాణీ విద్వాంసుల మధ్య ఒకరకంగా వెలివేయబడ్డారు.  ఆయన అన్ని రకాల బాణీలలో ఆరితేరినవారే. సంగీత కళాశాల లో విద్యార్ధులకు సంగీతం బోధించేప్పుడు అక్కడి శాస్త్ర మర్యాదలను పాటిస్తూ సిలబస్ ప్రకారమే శిక్షణ యిచ్చేవారు. కళాశాల వెలుపల , కచేరీలలో తన స్వతంత్ర ధోరణిలో గమకయుక్తమైన , భావప్రధానమైన కర్ణాటక సంగీతాన్నే  హార్మోనియం మీద వాయిస్తూ గానం చేసేవారు.  శ్రీ సీతారామ శాస్త్రిగారి  స్వీయ కృతులు రెండు ఓడియన్ రికార్డ్ లుగా వచ్చాయి.

సాలూరి చిన గురువుగారి బాణీ సాహితీ లోకంలో , వారికి ఒక విశిష్టతను , వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టాయి. కచేరీలలో ఆయన గానం చేసే స్వీయ కృతులు , చాటు పద్యాలు విజయనగరం లోని పండితులను , సాహితీవేత్తలను అమితంగా ఆకర్షించాయి. అదే ' కౌముదీ పరిషత్' అనే సాహితీ వేదిక ఆవిర్భావానికి కారణమయింది. శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారే ఆజన్మ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. స్థానిక సంస్కృత కళాశాల పండితులంతా సభ్యులు గా చేరి పదిహేను రోజులకో  నెలకో ఒకసారి సాయంత్రం పూట వెన్నెల వెలుగులో సాహిత్య , సంగీత గోష్ఠి జరిపి తమ కవితలను , కృతులను వినిపించి చర్చలు జరిపేవారు.
ఈ కౌముదీ పరిషత్ కు ' భారతీ తీర్థ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్శిటీ వారి గుర్తింపు లభించింది. ఆ భారతీ తీర్థ రీసెర్చ్ యూనివర్సిటీ వారే
శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారికి , వారి పెద్ద కుమారుడు శ్రీ సంగీతరావు గారికి ' సంగీత భూషణ ' బిరుదు ప్రదానం చేశారు.
శ్రీ పట్రాయని సంగీతరావు గారు తండ్రికి తగ్గ తనయుడు. సార్ధక నామధేయుడు. గురు ముఖఃతా ఆయన నేర్చుకున్న సంగీతం మూడు మాసాలు మాత్రమే. తండ్రిగారి సహచర్యం లో ఆయన గానం వింటూ స్వయంకృషితో సాధించినదే అధికం. హార్మోనియం మీద కర్ణాటక సంగీతాన్ని గమకయుక్తంగా , శుధ్ధ శాస్త్రీయంగా అత్యంత సమర్ధవంతంగా పలికించగల  అతి కొద్దిమంది విద్వాంసులలో ఒకరుగా శ్రీ సంగీతరావు పేరు పొందారు. తన 16 వ ఏట నుండే స్వతంత్రంగా హార్మోనియం మీద జంత్రగాత్ర కచేరీలు చేయడం ప్రారంభించారు. శ్రీ సంగీతరావు గారు ఆంధ్రదేశానికి చెందిన మరో విలక్షణ విద్వన్మణి సంగీత సుధాకర శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సీనియర్. వయసులో పది సంవత్సరాలు పెద్ద.
ఆలిండియా రేడియో ప్రక్క వాద్యంగా హార్మోనియం ను నిషేధించిన కారణంగా శ్రీ సంగీతరావు ఆలిండియా రేడియోను తనకు తానే దూరం చేసుకున్నారు.  శ్రీ సంగీతరావు గారి  గానవిద్వత్ ప్రదర్శనకు ఆకాశవాణి ఏనాడు వేదిక కాలేదు.   సంగీత ప్రసంగాలకు మాత్రం వారిని ఆహ్వానించేవారు.అది శ్రీ సంగీతరావుగారి వ్యక్తిత్వం.
తన స్వయంకృషితో నే వీణ , వైలిన్ వాద్యాల మీద పట్టు సాధించారు. వారికి తండ్రిగారి వారసత్వం వలన సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం లభించింది. ఆంధ్రదేశంలోని ప్రముఖ కవులు రచయితలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది.
శ్రీ పట్రాయని సంగీతరావుగారికి ఆ పేరు నెలల పిల్లాడిగా వున్నప్పుడే అనుకోకుండా పెట్టబడింది. ఆ పేరు తోనే సంగీతలోక ప్రసిధ్ధులైనారు. స్కూల్ రికార్డ్స్  లో నమోదైన పేరు నరసింహమూర్తి.  అది వారి తాతగారి పేరు.

నేను శ్రీ సంగీతరావుగారి పెద్ద కుమారుడిని.  నా తర్వాత , మంచి సంగీతం పట్ల అభిరుచి, ఆసక్తి గల ఒక సోదరుడు , ముగ్గురు సోదరీమణులు వున్నారు.

దీనికి , మన పాటల దేవుడికి ఏమిటి సంబంధం , ఎందుకీ అక్కర్లేని సొద అని మీరు భావించినా భావించవచ్చు. కానీ , కారణం వుంది . ఘంటసాలగారి గురించి అర్ధం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు , కొంతమంది వ్యక్తుల గురించి కూడా అవగాహన కావాలి. అందుకే ఈ ఉపోధ్ఘాతం.

శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో గాత్ర ఉపన్యాసకుడిగా ప్రవేశించిన కొద్ది నెలలకు , వేసంగి శెలవులలో, కళాశాల మూసివేసివున్న తరుణంలో ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి సంగీతం నేర్చుకోవాలని , విజయనగరం చేరుకున్నాడు.

అప్పుడేం జరిగింది ?
                            .... (సశేషం - రెండవభాగం)

No comments: