నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - ఐదవ భాగం
మొదటిభాగం ఇక్కడ
రెండవ భాగం ఇక్కడ
మూడవభాగం ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ
నెం. 35 ఉస్మాన్ రోడ్
- స్వరాట్
విజయనగరం లో ఘంటసాల సంగీతాభ్యాసం అటు సంగీత కళాశాల లోనూ ఇటు గురువుగారు పట్రాయని సీతారామశాస్త్రి గారింటి వద్ద కూడా సాగేది. సంగీతం పట్ల ఒక లక్ష్యం , ఉత్సాహం , శ్రధ్ధ గల విద్యార్ధులకు ఏ సమయంలోనైనా సీతారామశాస్త్రి గారు సంగీత శిక్షణలు యిచ్చేవారు. ఈ విషయాన్ని ఘంటసాలవారు తమ జీవిత చరిత్రలో , ఇంటర్వ్యూ ల లో తెలియజేశారు.
" సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్ధం చేసుకున్నారు. నన్ను సర్వ విధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగించారు. శ్రీ శాస్త్రిగారి గానం , వారి మూర్తిమంతం, సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించాయి. 'గురువు' అన్న మాట శ్రీ శాస్త్రిగారియెడలనే సార్ధకమయిందనిపించింది. వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించాను.
ఈ సమయం , ఆ సమయం అని లేకుండా అన్ని వేళల్లో నన్ను కూర్చోబెట్టి సాధన చేయించేవారు. ఆయన ఎప్పుడూ " సాంబ సదాశివ" నామాన్ని స్మరిస్తూ ,అదే నాదంగా నాభిస్థానం నుండి ఎలా పలకాలో చెపుతూ నాతో కూడా పాడించేవారు.
ఘంటసాలగారు AIR కార్యక్రమంలో తనపైన ప్రభావం చూపిన గురువుగారి గురించి ఇలా అన్నారు -
ఆడియో లింక్ ఇక్కడ వినవచ్చు.
సంగీతాభ్యాసానికి విజయనగరం వచ్చినప్పుడు కొంతకాలం తన ఆకలిబాధను తీర్చుకోవడానికి మధూకరం ఎత్తినా, సంగీతకళాశాలలో చేరిన కొన్నాళ్ళకు మహారాజావారి సింహాచలం సత్రవులో పద్దు కుదిరింది. ఆకలి సమస్య తీరింది. సత్రవు భోజనం, మఠం నిద్ర (గురువుగారింట). కళాశాల విద్య ముగిసే రోజులలో తన రాత్రి బసను "మూడు కోవెళ్ళ" కు మార్చాడు.
ఆ రోజుల్లో పేద విద్యార్ధులు వారాలు , మధూకరం చేసుకుంటూ విద్యభ్యాసం చెయ్యడాన్ని అందరూ సహజంగానే భావించేవారు.
గృహస్థులు కూడా ఆలాటి విద్యార్ధుల ఎడల ప్రేమను కనపర్చేవారు. సంప్రదాయజ్ఞులు కూడా విద్యార్ధులు మధూకర వృత్తిని అవలంబించడం మహోత్కృష్టకార్యంగా భావించేవారు.
అయితే ఇందుకు మినహాయింపులు కూడా ఉంటాయి. గురువులు శిష్యుడి శ్రధ్ధను , మనోప్రవృత్తిని గమనించి అందుకు తగినట్లుగానే విద్యాబోధన చేసేవారు. అందుకు ఉదాహరణ గా యీ చిన్న కథ చూద్దాము.
ఒక కుర్రవాడు గురుకులంలో చేరి , గురు శుశ్రూష చేస్తూ శ్రధ్ధగా విద్యాభ్యాసం చేసేవాడు. అతని భోజన వసతులన్నీ గురువుగారింటనే సాగేవి. ఆ గురు దంపతులు ఆ బాలుడిని తమ కన్నకొడుకులతో సమానంగా ప్రేమగా చూసుకునేవారు.
ఇలా కొన్నేళ్ళు గడిచాయి.
ఒకరోజు గురుపత్ని ఆ విద్యార్ధికి భోజనం వడ్డించి అన్నంపై నెయ్యి వడ్డించింది. వెంటనే , ఆ శిష్యుడు ఆమెను వారిస్తూ , " అమ్మగారు , మీరు పొరపాటున నాకు నెయ్యికి బదులు ఆముదం వడ్డిస్తున్నారు. గమనించండి ," అని అన్నాడు. " అయ్యో ! అలాగా నాయనా ! చూసుకోలేదు " అంటూ ఆవిడ మరల నేయి తీసుకువచ్చి వడ్డించింది. ఇదంతా గురువుగారు చూస్తూనే ఉన్నారు. మర్నాటి ఉదయం శిష్యుడు అధ్యయనం కోసం గురువుగారి సమక్షానికి వచ్చాడు. గురువుగారు అతనిని చూసి " నాయనా ! నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇక నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళవచ్చును " అని చెప్పారు. అది విని శిష్యుడు నిర్ఘాంతపోయాడు. తనవల్ల ఏం తప్పు జరిగిందో తెలియక , గురువుగారి మాటలు అర్ధంకాక శిష్యుడు గురువుగారి కాళ్ళమీద పడ్డాడు.
ఆయన అతనిని లేవదీసి బుజ్జగింపుగా " నాయనా ! నీకు ఎప్పుడైతే విద్య పట్ల లక్ష్యం మారి ఇతర విషయాలపై బుధ్ధి లగ్నం చేశావో , అప్పుడే నీ విద్య ముగిసింది. ఇన్నాళ్ళూ నీవు గురువమ్మగారి చేతి భోజనమే చేస్తున్నావు. ఇన్నాళ్ళూ , ఆవిడ నీ భోజనంలో ఆముదమే వడ్డించేది , నెయ్యి కాదు. నీవు మారుమాటాడకుండా అదే భుజించేవాడివి. అప్పుడు నీ లక్ష్యం , ఏకాగ్రత అంతా నీ విద్య మీదనే ఉండేది. నిన్న నీకు భోజనంలో నెయ్యికి బదులు ఆముదం వడ్డించారానే విషయం తట్టింది. అంటే నీ దృష్టి మరలింది. ఏకాగ్రత తగ్గింది. ఇంక నీకు విద్య బుధ్ధికెక్కదు. నీ విద్యాభ్యాసం ముగిసినట్లే. ఇక నీవు ఇంటికి వెళ్ళి వేరే ఏదైనా వృత్తి చేసుకొని నీ తల్లిదండ్రులను సుఖపెట్టు " అని మంచి సలహాలతో అతనిని గురుకులం నుండి పంపివేశాడు.
ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసింది, ఏ విద్యయైనా నేర్చుకోవాలంటే చిత్తశుధ్ధి , లక్ష్యం , ఏకాగ్రత , వినయ విధేయతలు కావాలి.
ఈ లక్షణాలు ఉన్న విద్యార్ధులు మాత్రమే తమ కృషితో ఉన్నతిని సాధిస్తారు.
ఈ లక్షణాలన్నింటితో ఘంటసాల వెంకటేశ్వర్లు పట్రాయని సీతారామశాస్త్రి గారి సన్నిధిలో సశాస్త్రీయమైన సంగీత విద్యను క్షుణంగా అభ్యసించాడు.
గురువుగారింట శిక్షణ అయాక నల్ల చెరువు మెట్టల సమీపంలో ఉన్న ఒక బావి దగ్గర స్నానాదికాలు ముగించి , దగ్గరలో ఉన్న వ్యాసనారాయణ స్వామి గుడి ఆవరణలో మరల సంగీత సాధన చేసేవాడు. ఆ వ్యాసనారాయణ మెట్టనే నల్లచెరువు మెట్టలు , బాబా మెట్టలు అని కూడా అనేవారు. అక్కడ ఖాదర్ అవులియా బాబా ఆశ్రమం ఉండేది. ప్రతీ రోజూ సాయంత్రం ఆ బాబాగారి సమక్షంలో సంగీత , నృత్య కార్యక్రమాలు జరిగేవి.
విజయనగరంలో సంగీత విద్యార్ధులు తమ విద్యాసాధనని పరీక్షించుకోవడానికి , సార్ధకపర్చుకోవడానికి అనేక భజన గోష్ఠులు అవకాశం కల్పించేవి. వ్యాసుల రాజారావు గారి మేడలోనూ , వంకాయలవారింటిలోనూ , శంభరదాసుగారి కుటీరంలోనూ ప్రతీవారం ఏదో రోజున భజన కాలక్షేపం ఉండేది. ఏకాహాలు , సప్తాహాలు అంటూ ఏడాది పొడుగునా సత్కాలక్షేపాలు జరిగేవి. వీటిలో , విద్వాంసులు , విద్యార్థులు అనే తేడాలేకుండా అందరూ పాల్గొనేవారు. ఈ భజన గోష్ఠులలో సాధకులకి మంచి ప్రోత్సాహం , పాడడానికి చొరవ ఏర్పడేవి . ఏదో ఒక కీర్తన తీసుకొని బృందగానం చేసేవారు. స్వరకల్పనలలో అందరూ పోటీపడి పాల్గొనేవారు.

ఇలాటివాటిని వెంకటేశ్వర్లు బాగానే సద్వినియోగం చేసుకున్నాడు.
అంతేకాదు , గురువుగారి " కౌముదీ పరిషత్ " సాహీతీ , సంగీత గోష్ఠులను ఆసక్తితో , శ్రధ్ధగా పరిశీలిస్తూ తన సంగీతవిద్యను పెంపొందించుకున్నాడు.
ఇటువంటి సుహృధ్భావ వాతావరణం లో ఘంటసాల సంగీత విద్య ముగిసింది.
ఇక ఆ ఊరినుండి వెళ్ళిపోయే సమయంలో , విజయనగరం లో శ్రీ మారుతీ భక్త మండలి , సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఘంటసాలచేత ఒక సంగీత కచేరీ చేయించారు. ఆ సందర్భంగా ఘంటసాలకు , హరికధా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి చేతుల మీదుగా ఒక తంబురాను బహుకరించారు. ఆ తంబురా తన జీవితంలో అత్యంత విలువైనదిగా ఘంటసాలవారూ తరచూ అందరికీ చెప్పేవారు.
ఘంటసాల వెంకటేశ్వర్లు సంగీత కళాశాల విడిచిపెట్టిన నాటికి ప్రముఖ కర్ణాటక సంగీత గాత్రజ్ఞులు సర్వశ్రీ నేదునూరి కృష్ణమూర్తి , నూకల చిన సత్యనారాయణ , జనగాం ఆంజనేయులు , వైణిక విద్వాంసులు అయ్యగారి సోమేశ్వరరావు , మొ.వారు అప్పటికింకా విద్యార్ధి దశలోనే ఉండేవారు.
ఇక్కడ , శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఆసక్తికరమైన విషయం.
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు , శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు , విజయనగరం సంగీత కళాశాలలో వైలిన్ విద్యార్ధులుగా చేరి సంగీతం నేర్చుకున్నారు. వైలిన్ లో శిక్షణ ముగిసిన కొన్నేళ్ళకు గాత్రంలో సాధన చేసి గాత్ర విద్వాంసులుగా స్థిరపడ్డారు. ఈ యిద్దరూ కూడా కొన్ని సంగీత కచేరీలలో శ్రీ సంగీతరావు గారికి వైలిన్ వాద్య సహకారం అందించారట.
(అలాగే , మద్రాస్ లో జరిగిన ఒక కచేరీలో సంగీతరావు గారికి శ్రీ హరి అచ్యుత రామశాస్త్రి గారు (ప్రముఖ సంగీత విద్వాంసులు కీ.శే. శ్రీ హరి నాగభూషణం గారి కుమారులు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి. చాలా ప్రముఖ సంగీత దర్శకుల వాద్యబృందాలలో పేరుపొందిన వైలినిస్ట్.) వైలిన్ సహకారం అందించడం నాకు బాగా గుర్తుంది.)
సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామం చేరుకున్నారు.
తరువాత , ఏం జరిగిందో , మనం కూడా విజయనగరం నుండి బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడేనా...
కాదు , వచ్చే వారం.
.... సశేషం