నెం.35, ఉస్మాన్ రోడ్ మెయిన్ గేట్ మీద అర్ధచంద్రాకారంలో ఒక ఇనప ఆర్చ్. ఆ ఆర్చ్ మీద బోగన్విల్లా క్రీపర్. మెజెంటా కలర్ లో గుత్తులు గుత్తులుగా ఏ వాసనా వుండని పువ్వులు. జాగ్రత్తగా వుండకపోతే అప్పుడప్పుడు గుచ్చుకునే ముళ్ళు, ఎండిపోయిన సన్నపాటి మోళ్ళు. ఆ గేటు దాటి లోపలికి ప్రవేశిస్తే ఒక పెద్ద కారు పట్టేంత పోర్టికో. ఆ పోర్టికో దక్షిణం పిల్లర్ ముందు ఒక పూలమొక్క. గుత్తులు గుత్తులుగా సన్నటి తెల్లటి పూవులు పూసేది. రాత్రిపూట చాలా సువాసనలు వెదజల్లేది. అందువల్ల అది నైట్ క్వీన్ అని అనుకునేవాడిని. మా పెద్దలు అలాగే చెప్పారేమో కూడా. ఆ పూలమొక్క కాయలు మిరియం గింజలులా ఆకుపచ్చగా మెరుస్తూవుండేవి. అవి పండిపోయేసరికి బచ్చలిపండులా తయారయేవి. వాటిని పట్టుకోగానే చిట్లిపోయి లోపలినుండి పింక్ కలర్ ద్రవం వచ్చేది. అది బట్టలమీద పడితే ఎన్ని ఉతుకులు ఉతికినా ఆ పింక్ రంగు పోయేదికాదు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి, హోలీ సమయాలలో ఆ నైట్ క్వీన్ పళ్ళు మాకు ఉపయోగపడేవి. ఆ పోర్టికో ఎడమవేపు ఇంటివెనక వెళ్ళడానికి ఒక సందు. ఆ సందులో కాంపౌండ్ వాల్ ను ఆనుకొని ఒక దానిమ్మచెట్టు. అనార్కలీ అనీ ప్రేమతో పిలచుకోవడానికి ఎర్రటి పువ్వులు మాత్రం చక్కగా పూసేది. ఆశగా కోసుకుతినేలాటి పళ్ళుమాత్రం కాసిన గుర్తులేదు. మా ఔట్ హౌస్ ఆనుకొని ఒక జామిచెట్టు. పళ్ళుతోముకుందుకు ఉపయోగపడేది. దానిపక్కనే ఒక మునగచెట్టు. పాపం, దాని వంతుకు అది బాగానే కాచేది కాని, ఆ చెట్టు మొదట్లో విపరీతమైన తెల్లగొంగళీలు చేరేవి. అవి ఒంటిమీద ప్రాకితే విపరీతమైన దద్దుర్లు. ఆ గొంగళీలను తొలగించడానికి పొగపెట్టేవారు. మాకు దగ్గువచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్ళమేతప్ప గొంగళీలు పోయేవికావు. చివరకు ఆ మునగచెట్టునే సమూలంగా నరికిపారేసారు. నూతివేపు ఒక వేపచెట్టు. చల్లటిగాలి, మంచి నీడతో అక్కడ హాయిగా వుండేది. అక్కడే బట్టలు ఉతికడానికి రెండు బండలు. అవి వాషింగ్ మెషిన్లు, సర్ఫ్, ఎక్సెల్ వాషింగ్ పౌడర్లు, లిక్విడ్ లు లేని రోజులు. కొంత స్థోమత కలిగినవారు పసుపురంగు 'సన్ లైట్' వాషింగ్ సోపును వాడేవారు. 501 బార్ సోప్ కూడా అధికంగా అమ్ముడుపోయేది. ఆ సోప్ వాటరంతా అరటి చెట్టు మొదట్లోకి చేరేది. ఆ చెట్టుకు ఎదురుగా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక దవ్వారం. దాని తర్వాత మేడ మీదకు వెళ్ళే మెట్లగది. అది దాటి ముందుకు వెడితే మెయిన్ గేట్. నెం. 35, ఉస్మాన్ రోడ్ కు ఒక ప్రదక్షణం కొట్టడమయింది.
ఇంటికి నాలుగు ప్రక్కలా మంచి గార్డెన్ పెంచాలని అమ్మగారికి (సావిత్రమ్మగారికి)
కోరిక. కానీ మంచి పూలమొక్కలు పెంచడానికి తగిన భూసారం ఆ స్థలంలో లేకుండా నానారకాల
సిమెంట్, ఇటిక, కాంక్రీట్ వంటి రబిష్ తో మొదట్లో నింపారట. అందువలన సుందరమైన, సువాసనలు వెదజల్లే సున్నితమైన మొక్కలు
పెంచుకోవాలనే ఆశ నెరవేరలేదు.
కారు పోర్టికోలో నుండి వరండా మెట్లెక్కి వస్తే అక్కడ ప్రధాన ద్వారం.
రోస్ వుడ్ కలర్ తలుపు. సగం నాన్ ట్రాన్సపెరెంట్ మ్యాటీ అద్దంతో వుండేది. (ఇప్పుడు అదే తలుపు పార్థసారధిపురంలోని
రత్నకుమార్ ఇంటికి అమర్చినట్లుగావుంది) ఆ తలుపు
తెరవగానే ఒక పెద్ద హాలు ఆ హాలు దాటగానే ఎడమవైపుకు బయటకు వెళ్ళడానికి ఒక ద్వారం.
కుడివేపు మరో చిన్న హాలు అక్కడో ద్వారం. పక్కనే ఒక బెడ్ రూమ్. చిన్నహాలు దాటాక స్టోర్ రూము లాటి గది. కుడివైపు
వంటగది. ఆ స్టోర్ రూమ్ దాటాక కుడివేపు బాత్ రూము. ఎడమవేపు టాయిలెట్ వుండేది. ఘంటసాల మాస్టారు 1950 లలో ఆ ఇల్లు కొనడానికి ముందెప్పుడో ఆ భవనం ఒక దొరదే అయినా ఆ ఇంటికి ఎటాచ్డ్ బాత్ సంస్కృతి
ఏర్పడలేదనుకుంటాను. అక్కడ ఒక ద్వారం. అది దాటితే చిన్న ఖాళీ ప్రదేశం. ఎదురుగా ఔట్ హౌస్. ఆ
ఔట్ హౌస్ లో పామర్తిగారు, కుటుంబం సుమారుగా ఓ ఐదేళ్ళు, మేము ఓ 28 సంవత్సరాలు నివసించాము. నేనూ, మా పెద్ద చెల్లెలు రమణమ్మ తప్ప మిగిలిన నలుగురు పిల్లలు ఆ ఇంట్లోనే
పుట్టి, పెరగడం విద్యాబుధ్ధులన్నీ
ఆ చిన్ని ఔట్ హౌస్ లోనే జరిగాయి.
నెం. 35 ఉస్మాన్ రోడ్ లో కొట్టచ్చేలా ప్రామినెంట్ గా కనపడేది మెయిన్ హాలు
మాత్రమే. మిగిలిన గదులన్నీ చిన్నవే. ఘంటసాల మాస్టారు తన కంపోజింగ్ కు , రిహార్సల్స్ కోసం కావలసినంత పెద్ద హాలున్న ఇంటినే
ఎన్నుకున్నారు తప్ప ఇతర వసతుల సంగతి పట్టించుకోలేదని అమ్మగారు అంటూ
వుండేవారు. తర్వాత మేడమీది ఇల్లు కట్టినప్పుడు మరికొంత విశాలంగా కట్టించారు. అలాటి నెం.35,ఉస్మాన్ రోడ్ మెయిన్ హాల్ లో ఎన్నో కంపోజింగ్ లు, మ్యూజిక్ రిహార్సల్స్, సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మీటింగ్ లు, సాహితీ సదస్సులు జరిగాయి. దేశంలోని ప్రముఖ వ్యక్తులెందరో ఆ హాలులో
సమావేశమయ్యారు. కవులు, గాయకులు ఎందరో ఆ హాలులో
కూర్చొని పాటలు వ్రాసారు. ప్రముఖ గాయనీ గాయకులెందరో పాటలు నేర్చుకున్నారు. అలాటి సరస్వతీ నిలయం ఒక అరవై ఏళ్ళ కాల వ్యవధిలో కనుమరుగైపోవడం తీరని
వేదనగా అనిపిస్తుంది. కానీ ఆ జ్ఞాపకాలు ఏనాటికీ మరపురానివి.
🌿
నెం.35,ఉస్మాన్ రోడ్ ఇంటి మెయిన్ హాల్ లో పడమటవేపు
గోడంతటికి ఒక పెద్ద అద్దాల బీరువా. దానినిండా ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు
నిదర్శనంగా వివిధ ఆకారాలలో దర్శనమిచ్చే జ్ఞాపికలు అసంఖ్యాకం. కొత్తవి రాగానే పాతవి
అటకెక్కేవి. ఒక్క మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారి మెమెంటోలే వరసగా ఏడాదికి
ఒకటి చొప్పున పదిపన్నెండు ఉండేవి. ఆ సంస్థ నిర్వహించిన బ్యాలట్స్ లో ప్రతీ
సంవత్సరం ఘంటసాలవారే ఉత్తమ గాయకుడిగా ఎన్నికవుతూ వచ్చారు. ఆ తర్వాత మాస్టారే ఆ
బ్యాలట్స్ లో ఇక తన పేరును చేర్చవద్దని ఇతర గాయకులను ప్రోత్సహించే విధంగా
ఏర్పాటుచేయమని కోరడం జరిగింది.
ఒక సముద్రాల వారిని, ఒక మల్లాదివారిని, ఒక కృష్ణశాస్త్రి గారిని,ఆరుద్రగారిని, కొసరాజుగారిని, శ్రీశ్రీ గారిని సి.నారాయణరెడ్డి గారిని, దాశరధిగారిని, పినిశెట్టి గారిని, జరుక్ శాస్త్రిగారిని, యామిజాల వారిని, రావులపర్తి భద్రిరాజుగారిని, ఇదే హాలులో చూసే అవకాశం నాకు కలిగింది. అలాగే లీల, సుశీల, కోమల, జానకి, పి.బి.ఎస్., మాధవపెద్ది, పిఠాపురం, పాణిగ్రాహి, మల్లిక్ వంటి గొప్ప గాయకుల పాటను వినే అదృష్టం ఆ హాలు నాకు కలిగించింది. సినీమాలలో పాటలు, డ్యాన్స్ లు అనేవి ఎక్కువగా భారతదేశపు సినీమాలలోనే కనిపిస్తాయి. హాలీవుడ్ సినీమాలలో ఈ ప్రక్రియ చాలా అరుదుగా కనిపిస్తుంది. పాశ్చాత్య సినీమాలలో సంగీతభరిత చిత్రం, నృత్యభరిత చిత్రం అంటూ ప్రత్యేకించి ఎక్కువగా ఉండవు. కథతో సంబంధం లేకపోయినా రెండేసి రీళ్ళకు ఒక పాట, డ్యాన్స్, రీలున్నర ఫైట్స్ అనే సినీమా ఫార్ములా సంస్కృతి మన భారతదేశపు సినీమాలలోనే కనిపిస్తుంది. సినీమా అంటే కేవలం ఒక వినోదసాధనంగా మనవాళ్ళకు అలవాటయిపోయింది. అందుకే ఇండియాలో ఆస్కర్ కి అర్హమైన ఆర్ట్ ఫుల్ సినీమాలకి ఆస్కారంలేదు.
భారతదేశపు సినిమా ప్రపంచంలో వుండేంతమంది కవులు, గాయకులు, మ్యూజిక్ కంపోజర్స్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ మరే ఇతర సినీమాలలోనూ కనపడరు. ముఖ్యంగా, మన తెలుగు టాకీ పుట్టినప్పటినుండీ కడుపునిండా
పాటలతోనే పుట్టింది. పాటలు, డాన్స్ లు లేని తెలుగు సినీమాలను ప్రస్తుతానికైతే
ఊహించనేలేము. మారుతున్నకాలాన్నిబట్టి సినీమా పాటల ధోరణి మారుతుంది. దానిని ఎవరూ
ఆపలేరు.
ఇక మన సినీమాలలో ఇన్ని రకాల పాటలెందుకు అని ఆలోచించి చూస్తే, నాకు కలిగిన అభిప్రాయం ఏమంటే - మాటద్వారా
వ్యక్తీకరించలేని మనోభావాలను బయటకు చెప్పడానికి పాట ఒక సాధనం. మనలోని నవరస భావాలను
పాటలో చెప్పినంత బాగా మాటలో చెప్పడం సాధ్యంకాదు. అందుకు సన్నివేశానుసారం పాటలు, వినోదాన్ని పంచే నృత్యాలు, వాటి ఆలంబనతో సాగే పాటలు మన సినీమాలకు అనివార్యం అయాయేమో అని అనిపిస్తుంది.
నా యీ అభిప్రాయంలో, వ్యక్తీకరణలో లోటుపాట్లు
వుండవచ్చు.
కానీ, ఒక్కటి మాత్రం నిజం. మన సినీమాల ద్వారా ఎన్నో వేలమంది సాహితీకారులకు, సంగీత కళాకారులకు భుక్తి లభిస్తున్నది. వారి వారి
ప్రతిభను బట్టి సమాజంలో గొప్ప గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు, ఆర్ధికోన్నతి లభిస్తున్నాయి. ఇప్పుడు
ఘంటసాల మాస్టారి కాలంలో తెలుగు సినీమాలలో పాటలు ఎలా రూపొందేవో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో
చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఒక శుభోదయాన ఫలానా నిర్మాత ఆఫీసులో, ఫలానా టైములో పాట కంపోజింగ్ పెడుతున్నారని,దానికి రావలసిందిగా ఆ చిత్ర సంగీతదర్శకుని, కవిగారిని, చిత్రదర్శకుని ఆహ్వానిస్తారు. మ్యూజిక్
డైరక్టర్ తో పాటు ఒక తబలిస్ట్ , ఒక హార్మనిస్ట్ (సాధారణంగా) కూడా వస్తారు. అలాగే, డైరక్టర్ తో పాటూ అసిస్టెంట్ డైరక్టర్ వుంటారు.
వారందరిని అనుకున్న సమయానికి ఆఫీసుకు తీసుకువచ్చే బాధ్యత మొదటిరోజుల్లో నిర్మాత
యొక్క ప్రొడక్షన్ మేనేజరే చూసుకునేవాడు. వీరంతా
అక్కడికి చేరగానే ఒకరినొకరు పలకరించుకొని ముచ్చట్లాడుతూంటారు. ఈలోగా కాఫీ టిఫిన్
కార్యక్రమం. ఉదయంపూట కంపోజింగ్ అయితే ఇడ్లీ, వడ లేదా పొంగల్, వడ, వేడి వేడి కాఫీ; సాయంత్రం సమయమైతే బోండా లేదా బజ్జీ, వేడి వేడి కాఫీ. ఈ కాఫీ టిఫిన్లు సాధారణంగా పానగల్ పార్క్ దగ్గరలో
వున్న ఉడిపీ పార్క్ ల్యాండ్స్ హోటల్ , లేదా పాండీబజార్ నారాయణన్ కేఫ్, లేకపోతే గీతా కేఫ్ లనుండి తెప్పించేవారు. (గీతా కేఫ్ ఇంకా బాగానే నడుస్తోంది. నారాయణన్
కేఫ్ ప్రముఖ నటుడు సి.ఎస్.ఆర్ గారి ఫేవరేట్ స్పాట్. ఇప్పుడు ఆ హోటల్
స్థానంలో అడయార్ ఆనందభవన్ స్వీట్స్ షాప్ వెలసింది. పార్క్ ల్యాండ్స్ హోటల్ ను
నల్లీవారు ఒక పెద్ద జ్యువెలరీ షాప్ గా మార్చేశారు.)
ఈ టిఫిన్, కాఫీల సెషన్ అయిన వెంటనే తాంబూల సేవనం; లేదా తమకు ఇష్టమైన బ్రాండ్ శ్వేతకాష్టాలను ప్రత్యేకంగా తెప్పించుకొని మనసారా
ఆస్వాదించుట. ఈ దినుసులన్నీ నిర్మాతగారి పద్దులోనే. ఈ పద్దులన్నీ ఏ విధంగా
సద్దుబాటు చేయాలో చూసుకోవడానికి వేరే ఎక్కౌంటెంట్ వుంటాడు. ముందు ఆత్మారాముడిని సంతృప్తిపర్చాక అప్పుడు అసలు విషయం మీద
కూర్చుంటారు. సీనీమా పరిభాషలో కథమీద 'కూర్చోవడం' అంటే పని ప్రారంభించడం. నిర్మాత
గారి ఆదేశంతో డైరక్టర్ గారు తాము తీయబోతున్న సినీమా కథను సంక్షిప్తంగా
వివరిస్తారు. చిత్రంలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులు, ముఖ్యంగా, పాటలు పాడే నటీనటులు గురించి చెపుతారు. ఈలోగా ఆయన అసిస్టెంట్
స్క్రీన్ ప్లే బుక్ తిరగేసి ఈ సినీమాకు ఎన్ని పాటలు అవసరమౌతాయో, ఎక్కడెక్కడ పాట వస్తుందో వంటి విషయాలను డైరెక్టర్
గారికి అందజేస్తాడు. ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేస్తారు. ఎవరి లిమిట్స్ లో వారు
వుండాలనే ఎథిక్స్ ను ఆనాటి వారు సక్రమంగా పాటించేవారు. అనవసర విషయాలలో జోక్యం
చేసుకోవడం, అనుచిత సలహాలు ఇవ్వడం వంటివి వుండేవికావు. ఒకవేళ
ఎవరైనా ఏదైనా చెప్పదలిస్తే ప్రాపర్ ఛానల్ లోనే జరగాలి. నిర్మాత, దర్శకులే కీ హెడ్స్. వారి నిర్ణయమే తుది నిర్ణయం. అందువలన ఒక సినీమా ఫేటు డైరక్టర్ తెలివితేటలమీద, నిర్మాత విజ్ఞత మీద ఆధారపడివుంటుంది. మిగిలిన శాఖలవారంతా ఎవరి పనిని వారు బాధ్యతాయుతంగా చేసుకుంటూపోతారే
తప్ప ఇతరములైన వ్యాఖ్యలు ససేమిరా చేయరు. అది ఆనాటి వృత్తి శైలి.
డైరక్టర్ మొట్టమొదటగా పాట యొక్క సన్నివేశాన్ని, తెరమీద నటించబోయే నటీనటుల గురించి, ఆ సీనుకు ముందు జరిగిన కథ, తర్వాతి సీన్ లో కథ క్లుప్తంగా వివరిస్తారు. ఆ పాట ఏ లొకేల్ లో షూట్
చేయాలనుకుంటున్నారో ఊహామాత్రంగా చెపుతారు. ఈలోగా
నిర్మాత కూడా తన మనోభావాలు వెల్లడిస్తారు. ఇక అక్కడినుండి బంతి సంగీత దర్శకుడు, కవిగార్ల కోర్ట్ లో వుంటుంది. పాటకు మాటా? మాటకు పాటా? అనేది ఆలోచిస్తారు. మామూలుగా వినోదాత్మక గీతాలకు, శృంగార గీతాలకు మెట్టుకు మాటలు వ్రాస్తారు. లేదూ పాట సన్నివేశానికి పరిపుష్ఠిని చేకూరుస్తూ సాహిత్యపరంగా వుండాలీ అంటే పాట ముందు వ్రాసి దానికి వరస కూరుస్తారు. మాటకు పాట, పాటకు మాట ఈ రెండు శైలులకు అందరు కవులు, సంగీత దర్శకులు సిద్ధంగానే ఉంటారు. ఘంటసాల మాస్టారు సవ్యసాచి. ఏ పధ్ధతిలో పాటను చేయాలన్నా ఆయన
సంసిధ్ధంగానే వుండేవారు. సంగీత దర్శకుడే, గాయకుడు అయితే కవిగారి పని సులభతరం. ఇప్పుడు, కొంతమంది ప్రముఖ కవుల రచనా శైలి ఎలావుంటుందో
చూద్దాము.
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావుకతకు, పద లాలిత్యానికి ప్రాధాన్యమిచ్చే మనిషి. ఏ బి.ఎన్. రెడ్డిగారిలాటి దర్శకుడో తప్ప ఆయన చేత పాటలు వ్రాయించలేరు. కాగితం మీద అక్షరం పెట్టడానికే రోజంతా పడుతుంది. అయితే ఆయన పలికించే ప్రతీమాట మనసుకు హత్తుకుపోతుంది. వారు ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు వ్రాయలేదు. ఈ ఇద్దరు ప్రముఖులు కలసి పనిచేసినది 'విజయం మనదే' సినీమాలో పాట ' శ్రీరస్తు శుభమస్తు' పాట. మాస్టారే పాడారు. రామారావు గారు, దేవిక గార్ల మీద చిత్రీకరణ. రామారావు గారి కజిన్ సాంబశివరావు గారు నిర్మాత. బి. విఠలాచార్య దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పాట. ఈ నిర్మాత ఆఫీస్ సౌత్ ఉస్మాన్ రోడ్ లో CIT నగర్ లో వుండేది. ఈ పాట కంపోజింగ్ అప్పుడు ఒక రోజు నేనూ వెళ్ళాను. ఘంటసాల మాస్టారు తన పాటల కంపోజింగ్ కు విధిగా మానాన్నగారిని హార్మోనియం వాయించడానికి, లయకోసం ఒక తబలిస్ట్ ను తీసుకువెళ్ళేవారు. వీరిద్దరు తమ వాద్యాలతో సహకరిస్తుండగా మాస్టారు తననాలతో అలా పాడి వినిపిస్తూండేవారు. కృష్ణశాస్త్రి గారు అలా తదేకంగా చిరునవ్వుతో మాస్టారు పాడింది వింటూవుండేవారే తప్ప ఒక్కమాట కూడా కాగితంమీద పెట్టేవారు కాదు. గంటలు గడిచేవి. మాస్టారు పల్లవి వరసను పాడుతూనే వుండేవారు. ఇక అక్కడ వున్నవారందరికీ విసుగుపుడుతోందని అనిపించే సమయానికి కృష్ణశాస్త్రి గారు కాగితం మీద వ్రాసి చూపించేవారు 'పాట మెదడులో వుంది. వ్రాసి పంపిస్తాను' అని. అప్పటికే ఆయన గళం మూగపోయింది. ఏది చెప్పాలన్నా కాగితం మీదే. ఇక ఆ రోజుకు కంపోజింగ్ ముగిసినట్లే. ఇలా ఒకటి రెండు సిట్టింగ్ ల తర్వాత ఆణిముత్యంలాటి పాట వెలువడేది. కృష్ణశాస్త్రి గారి పాట కావాలంటే మంచి ఓపికా, సహనం కావాలి. రాశికంటే వాసిని చూసే కవి కృష్ణశాస్త్రి గారు.
శ్రీ సముద్రాల రాఘవాచారిగారితో ఘంటసాల మాస్టారు చాలా సినీమాలకే
పనిచేశారు. సారంగధర మొదలు రహస్యం వరకు చాలా సినీమాలలో
ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో అనేక పాటలు వ్రాశారు. మాస్టారు తాను చేసిన పల్లవి తననాలు పాడుతూంటారు, ఆచార్యులవారు తన స్టీల్ పాన్దాన్ లో నుండి రెండో మూడో తామలపాకులు తీసి తాపీగా వాటిని తన పై కండువాతో తుడిచి, వాటికి సువాసన సున్నం పూసి, ఈనెలు తీసి వాటిమీద వక్క ,కొంచెం సీవల్ పెట్టి తాంబూల సేవనం మొదలెట్టేవారు. మాస్టారి పాట
సాగుతూనే వుండేది. నోట్లోని తాంబూలం అయ్యాక బయటకు వెళ్ళి మంచినీళ్ళతో
నోరు కడుక్కొని వచ్చి మరల కూర్చొనేవారు. "ఒరే నాయనా! నీ తననాలు మరోసారి
చెప్పు రాసుకుంటాను" అని కాగితం మీద వ్రాసుకొని "నాకు మరో కంపెనీలో కంపోజింగ్ కు వెళ్ళాలి. రేపు
మళ్ళీ కలుద్దాము. పల్లవి ఇచ్చేస్తాను. ఈలోగా నువ్వు చరణాలు
తయారు చేసుకో" అని లేచి చక్కాపోయేవారు. అనుకున్నట్లుగానే మర్నాటికి పల్లవి, చరణాలు రెడిగా పట్టుకువచ్చేవారు. వాటిని దర్శక నిర్మాతలు విని ఓకె అంటే పాట కంపోజింగ్ పూర్తయినట్లే. లేకపోతే
మరో కొత్త పల్లవికి వరస, మాటలు కూర్చడం
మళ్ళీ మొదలయేది. ఈ తతంగమంతా చాలా సహజసిధ్ధంగానే ప్రశాంత వాతావరణంలో
నే జరిగేది.
కొసరాజు రాఘవయ్య చౌదరీగారి పాటలు చాలావరకు జానపదవరసలుతోనే వుండేవి.
ఆయన సిట్యుయేషన్ వినగానే పాటను వ్రాయడం మొదలెట్టేవారు. ఆయన స్వతహాగా కొంత
పాడతారు. తాను వ్రాసిన పాటను తానే తన ధోరణిలో పాడివినిపించేవారు. కొసరాజు గారు
పాడింది బాగానేవుండేది. దానికి మాస్టారు సంగీతపరంగా మరింత పదునుపెట్టి పాడి
వినిపించేవారు.ఆ పాట అందరి ఆమోదం పొందేది.
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కూడా పాటలు వెంటవెంటనే వ్రాసే
మనిషికాదు. చాలా టైమ్ తీసుకుంటారు. సంగీతదర్శకుడు వినిపించే ట్యూన్ కు ఏవో
ప్యారడీలు రాసి ఇవేకదా మీ పాట పెరామీటర్లు. రాసిస్తాను అనేవారట. రామకృష్ణ
శాస్త్రిగారు 14 భాషలలో నిష్ణాతుడు. అలాగే సంగీతశాస్త్రంలో కూడా మంచి అవగాహన వుండేది. "రహస్యం" చిత్రం లోని కొన్ని పాటల సాహిత్యానికి సరిపడేలా
రాగనిర్దేశనం కూడా శాస్త్రిగారే చేయడం, దానిని ఘంటసాల మాస్టారు అత్యంత ప్రతిభావంతంగా ప్రయోగించి అత్యద్భుతమైన పాటలను సమకూర్చడం జరిగింది.
ఇక, డాక్టర్ సి.నారాయణరెడ్డిగారైతే ప్రొడ్యూసర్స్ కు, డైరక్టర్లకు అందరికీ ఫేవరిట్ సాంగ్ రైటర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ లో పనిచేస్తూవుండడం వలన హైదరాబాద్ లో వుండేవారు. పదిహేను రోజులకు ఒకసారి మద్రాసు వచ్చి మూడేసి రోజులు హోటల్ లో మకాం పెట్టేవారు. తాను వచ్చేముందు ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి రాయవలసిన పాటల సన్నివేశాన్ని అడిగి తెలుసుకునేవారు. ఎప్పుడు వచ్చినా ఫ్లైట్ లో వచ్చేవారు. ఎయిర్ పోర్ట్ లో, ఫ్లైట్ లో కూర్చొని తాను వ్రాయవలసిన పాటలకు పల్లవులు, చరణాలు వ్రాసి తయారుగానే మద్రాసు లో అడుగెట్టేవారు. ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి సంగీత దర్శకుడితో కూర్చొని వారి పాట విని తన సాహిత్యాన్ని తగినవిధంగా మార్పులు చేర్పులు చేసి ప్రొడ్యూసర్ చేత ఓకె అనిపించుకొని తనకు రావలసిన పైకం వసూలు చేసుకొని వేరే కంపెనీ కి వెళ్ళిపోయేవారు. ఇలా వున్న మూడు రోజుల్లో ఓ పదిహేను పాటలకు తక్కువలేకుండా వివిధ సినీమాలకు వ్రాసేసి హైదరాబాద్ వెళ్ళిపోయేవారు.
ఇక ఆరుద్రగారికైతే వరస దమ్ములాగనిదే పాట వ్రాయడానికి
ఇన్స్పిరేషనే రాదనేవారు. రెండువేళ్ళ మధ్య సిగరెట్ పెట్టి గంజాయి పీల్చినట్లుగా
సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ పాట వ్రాసేవారు. ఒక పాట పూర్తయేసరికి ఎన్నో
పెట్టెలు ఖాళీ అయేవి.
ఇక ఆత్రేయగారి సంగతి లోకవిదితమే. నేను కొత్తగా చెప్పడానికి ఏంలేదు. రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను తెగ ఏడిపించిన కవిగా కీర్తిపొందారు.
ఈ విధంగా సినీమా లోకంలో వివిధ కవులది వివిధ రకాల అలవాట్లు. వివిధరకాల
బాణి, వాణి. వీరందరి
ధోరణికనుగుణంగా మాటకు మెట్టు కూర్చడంలో, లేదా తన మెట్టుకు తగిన మాటలు రాబట్టుకోవడంలో ఘంటసాల మాస్టారు
కృతకృత్యులే అయ్యారు. నిర్మాత,దర్శకులు సంగీత దర్శకునికి, పాటల కవికి సంపూర్ణమైన
స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సంగీతపరంగా, సాహితీపరంగా సన్నివేశానికి తగిన అజరామరమైన గీతాలు రూపొందుతాయి. అలా
ఎన్నో మధురాతిమధురమైన పాటలు రూపొందాయి కూడా.
కానీ ఈ రకమైన సుహృద్భావ వాతావరణం అన్నివేళలా, అన్నిచోట్లా అమరడం కష్టం. కొంతమంది నిర్మాతలు వుంటారు. వారికి సంగీతంతోనూ, సాహిత్యం తోనూ పరిచయం లేకపోయినా అన్నీ
తెలిసినట్లుగా జోక్యంచేసుకొని పనికిరాని సలహాలు ఇస్తూంటారు. ఎన్ని మంచి పల్లవులు ఇచ్చినా బాగులేదంటూ కొత్తవి కావాలనడం.ఆ పల్లవిలో
కొంత ఈ పల్లవిలో కొంత చేర్చి మరేదో ట్యూన్ చేయమనడం, కవిగారి మాటలకు వంకలుపెట్టడం చేస్తూంటారు. డబ్బు పెట్టుబడి పెట్టి
సినీమా తీస్తున్న నిర్మాతలమనే అభిజాత్యంతో ప్రవరిస్తారు. మరికొందరు నిర్మాతలైతే తమకు పాట నచ్చినా, తమ పక్కనుండే కారు డ్రైవర్ కు, ఆఫీస్ బోయ్ కు సంగీత దర్శకుడు ఇచ్చిన పాట
తృప్తికరంగా లేదంటున్నారు కనుక మరో పల్లవి అంటే బాగుంటుందని కవిగారిని, సంగీతదర్శకుడిని ఇరకాటంలో పెట్టడమూ వుంది. ఒక
స్థితిలో సహనం కోల్పోయి నువ్వూ వద్దూ నీ సినీమా వద్దు అంటూ లేచి చక్కాపోయే సర్వ
స్వతంత్రులైన సంగీత దర్శకులు వున్నారు, సాలూరు రాజేశ్వరరావు గారిలాటివాళ్ళు. ఎంత గొప్ప నిర్మాతైనా వారి
ధోరణి నచ్చకపోతే వద్దని మధ్యలో మానేసిన సినీమాలెన్నో రాజేశ్వరరావుగారికి. నిర్మాతలు ఈ రకమైన వంకలను బొంబాయి నౌషద్ ఆలి దగ్గరో, శంకర్ జైకిషన్ దగ్గరో , మదన్ మోహన్ దగ్గరో పెట్టగలరా? పెట్టి వాళ్ళచేత ఒక్క పాటైనా చేయించుకోగలరా! ఇలాటి
విభిన్న మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులందరినీ సమన్వయపర్చుకుంటూ, సామరస్యభావంతో మెలగుతూ అందరిపట్ల వినయవిధేయతలు
కనపరుస్తూ, అందరిచేత గౌరవింపబడుతూ ఘంటసాల మాస్టారు దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు చలనచిత్ర రంగంలో
అజాతశత్రువుగా మనుగడ సాగించారు. ఇదేమంత సామాన్య విషయం కానేకాదు.
💥కొసమెరుపు💥
"మాస్టారూ! అన్నపూర్ణా లోకి కొత్త సంగీత దర్శకుడు
వచ్చారట!" అని ఎవరో రాజేశ్వరరావు గారి దగ్గర వత్తి వెలిగించారట.
అందుకు ఆయన "ఏం చేస్తాం! సార్, మధుసూదనరావు గారు
మన దగ్గర మోహన రాగం స్టాక్ అయిపోయిందని అనుకున్నట్లున్నారు." అని అన్నారట మహా కూల్
గా.
💐
మరికొన్ని విశేషాలతో వచ్చేవారం.....
...సశేషం
1 comment:
🍀 35-ఉస్మాన్ సాహెబ్ రోడ్ 34 వ సంచికలో ...మాస్టారి ఇల్లంతా మేమే కలయతిరిగి క్షుణ్ణంగా సర్వే చేసినంత అనుభవాన్నిచ్చారు స్వరాట్ సర్! అంతే కాదు..మెయిన్ హాలులో జరిగిన మ్యూజిక్ కంపోజింగ్స్, రిహార్సల్స్...ఇంకా ఎందరో నిష్ణాతులతో మీ పరిచయాలు మీకెలా మరపురాని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయో తెలియజేస్తూ, అసలేమీ సంబంధం లేని మాలాంటివారికి కూడకళ్ళకు కట్టినట్లు రాసి మహదానందాన్నిచ్చారు.
🍀 అలాగే..భారతీయ సినిమాల్లో పాటల గురించి మీ సూక్ష్మ విశ్లేషణ కూడ బావుంది. చాల వరకు నిజమేననిపిస్తుంది కూడ. మీరన్నట్లు ఆస్కార్ కు ఆస్కారమున్న ఆర్ట్ ఫుల్ సినిమాలకు మన దగ్గర అవకాశం లేదు. కేవలం ప్రేక్షకులు హార్ట్ఫుల్ గా అనుభూతి చెందితే చాలనుకుంటా!
🍀 అన్నిటికన్న ముఖ్యంగా మన తెలుగు సినిమాల ‘మ్యూజిక్ సిటింగ్స్’ గురించి మీ వర్ణన అద్భుతం! బహుశః ఇంత కన్న వివరంగా, విశిష్టతతో గతంలో మేమెక్కడ చదివి వుండలేదన్నది యదార్థం! పైగా...లేశమాత్రమైనా అతిశయోక్తి లేకుండ స్వీయానుభవంతో మీరు వర్ణించిన వివరాలు ఈ బ్లాగు ద్వారా మేం తెలుసుకునే అవకాశం కలగడం మా అదృష్టం!
🍀 ఇక “కొసమెరుపు”! సాలూరు వారి డిక్షన్ అనేక సార్లు బాలు గారి ద్వారా విన్న మాకు...ఈ అన్నపూర్ణ కొత్త సంగీత దర్శకుడు, మోహనరాగం స్టాకు గురించి మరోసారి బాలు గారి గళంలో ఊహించుకుని నవ్వుకున్నాం! 😊నిజంగా “కొస మెరుపే”! 🙏🙏
Post a Comment