31.10.2021 - ఆదివారం భాగం - 55*:
అధ్యాయం 2 భాగం 54 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
'పద్మశ్రీ' బిరుదాంకితులు, సాటిలేని మేటి మధురగాయకులు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి సినీజీవిత రజతోత్సవం దక్షిణభారత చిత్రరంగాన ఉన్న ప్రముఖులందరిలో నూతనోత్సాహన్ని నెలకొల్పింది.
హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో 1970 ఫిబ్రవరి 1వ తేదిన జరగబోయే బ్రహ్మాండమైన సన్మాన, సంగీతోత్సవంలో సినీరంగానికి, రాజకీయరంగానికి చెందిన అతిరథ మహారథులంతా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి.
ఘంటసాలవారి సినీజీవిత రజతోత్సవాన్ని అంతకుముందు కని, విని, ఎరుగని రీతిలో జరపడానికి రజతోత్సవ కార్యనిర్వాహకులు సంసిధ్ధులయ్యారు.
అందులో భాగంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకులతో, సినీప్రముఖులతో రజతోత్సవ కమిటీ ఏర్పాటు చేసిన విషయమూ గత వారాలలో చెప్పడం జరిగింది. దానికి తోడు తెలుగు చలనచిత్రసీమ దిగ్దంతలనదగ్గ సర్వశ్రీ - చిత్తూర్ వి.నాగయ్య, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె.జగ్గయ్య, టి.ఎల్.కాంతారావు, ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, రేలంగి వెంకట్రామయ్య, భానుమతి, సావిత్రి, అంజలీదేవి, జయలలిత, విజయనిర్మల, సంధ్య మొదలగువారు ఘంటసాలవారి రజతోత్సవ వేడుకలలో పాల్గొనడానికి సుముఖత చూపించారు.
ఇంతమంది ప్రముఖులతో నిండిన వేదికమీద అందుకు దీటుగా భారీగా సంగీతకార్యక్రమం నిర్వహించడానికి ఒక వైవిధ్యభరితమైన అంతకుముందెన్నడు జరగని రీతిలో సంగీతాభిమానులను అలరించడానికి రూపకల్పన జరిగింది.
ఘంటసాలవారు తన 25 సంవత్సరాల సినీజీవినయానంలో ఎంతోమంది సంగీత దర్శకులతో, గాయనీగాయకులతో కలసి పనిచేశారు. పరస్పర స్నేహ సౌభాతృత్వాలతో ఒక వసుధైక కుటుంబకంగా మెలిగారు. అలాటి పలువురు ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీగాయకులను కూడా తనతో పాటే సముచితంగా గౌరవించబడాలని, వారందరి సమ్మేళనంతో ఒక సంగీత విభావరి జరగాలని ఘంటసాల మాస్టారు ఆశించారు. చిత్రసీమలోని ప్రముఖ సంగీత దర్శకులను, గాయనీగాయకులను తనతో పాటు వేదికనలంకరించి తలా ఒకటి రెండు పాటలను ఆలపించవలసిందిగా కోరారు. మాస్టారు కోరడమే తడవుగా దక్షిణాది సినీమా సంగీత కుటుంబం తమ పరిపూర్ణ సహాయ సహకారాలందించడానికి ముందుకు వచ్చారు. ఆనాటి సంగీతోత్సవంలో ఒక్కొక్క సంగీత దర్శకుడు తమ సంగీత దర్శకత్వంలో తమకు నచ్చిన రెండు పాటలను, మాస్టారి సోలో ఒకటి, డ్యూయెట్ ఒకటి పాడించడానికి నిర్ణయించారు. ఘంటసాలవారు, ఇతర గాయకులు వేదికమీద పాడుతున్నప్పుడు ఆ పాటలను స్వరపర్చిన సంగీత దర్శకులే వేదికమీదకు వచ్చి ఆర్కెస్ట్రా బృందాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విధంగా చేయడంవలన అంతకుముందు తెరవెనుకే వుండి సామాన్య ప్రేక్షకులకు కనపడని తమ అభిమాన సంగీత దర్శకులను, గాయనీగాయకులను, అతిపెద్ద ఆర్కెస్ట్రా బృందాన్ని, తమ అభిమాన నటీనటులను ఒకేసారి చూసి ఆనందించే అవకాశం కలుగుతుంది. ఘంటసాల సినీ సంగీత రజతోత్సవ సంగీత విభావరిలో పాల్గొనడానికి అడిగిందే తడవుగా అంగీకరించి తమ మాస్టారిపట్లగల గౌరవాభిమానాలను చాటుకున్న ప్రముఖ సంగీత దర్శకులు/ గాయనీ గాయకులు : సర్వశ్రీ - ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఎమ్.ఎస్.విశ్వనాధన్, కె.వి.మహాదేవన్, పి.ఆదినారాయణ రావు, టి.వి.రాజు, మాస్టర్ వేణు, ఎస్.పి.కోదండపాణి, టి.చలపతిరావు, సుసర్ల దక్షిణామూర్తి, జి.అశ్వథ్థామ, విజయా కృష్ణమూర్తి, బి.శంకర్, సాలూరి హనుమంతరావు, పి.సుశీల, పి.లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, జమునారాణి, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
ఘంటసాల సినీ సంగీత రజతోత్సవ సంగీతకార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు 40 మంది సభ్యులు గల వాద్యబృందాన్ని ప్రత్యేకంగా మద్రాస్ నుండే తీసుకువెళ్ళడానికి నిశ్చయించారు.
ఘంటసాల, కె.వి.మహాదేవన్, ఎస్.రాజేశ్వరరావు, ఎమ్.ఎస్.విశ్వనాధన్, పెండ్యాల, టి.వి.రాజు, మొదలగు సంగీత దర్శకుల వద్ద పనిచేసే వాద్యకళాకారులు, ఆంగ్లో ఇండియన్ వైలినిస్ట్ లు, గిటార్, మేండలిన్, సాక్స్, ట్రంపెట్, డ్రమ్స్ ప్లేయర్స్ ఈ సంగీతోత్సవానికి అదనపు ఆకర్షణ.
ఈ సంగీతోత్సవంలో ఆనాటికి బహుళ ప్రచారంలో వున్న పాటలనే సంగీత దర్శకులు తమ పాటలుగా ఎంపికచేసి ఇచ్చారు. దాదాపు 40-50 బహుళ జనాదరణపొందిన సోలోలు, డ్యూయెట్లు లెక్కకు తేలాయి. ఆ పాటలన్నిటినీ గ్రామఫోనులో వింటూ మా నాన్నగారు శ్రీ సంగీతరావుగారు నొటేషన్స్ తయారు చేశారు. ఆ పాటలన్నిటిని అందుబాటులో వున్న గాయనీ గాయకులతో ఆర్కెస్ట్రావారితో పలుసార్లు మాస్టారింట్లోనే రిహార్సల్స్ చేసారు.
వేదికలమీద జరిగే లలిత సంగీత కచేరీలలో తరచూ రిథిమ్స్ సెక్షన్ వాళ్ళ శ్రుతులు చేసుకునేందుకు తీసుకునే సమయంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. పది పాటలు పాడవలసిన చోట ఆరేడు పాటలతోనే సరిపెట్టేస్తారు. ఇలాటి అవకతవకలు స్టేజిమీద శ్రుతులు చూసుకోవడం వంటి పరిస్థితి రాకుండా ఒకే శ్రుతిలో వుండే పాటలన్ని ఒకేసారి పాడేలా, అందుకు సిధ్ధంగా తబలాలు, డోలక్ లు ఏర్పాటుచేసుకోవలసిన ఆవశ్యకత గురించి రిహార్సల్స్ లో ఆర్కెస్ట్రాకు మాస్టార్ తగు హెచ్చరికలు చేశారు. అలాగే పాటలోని బిజిఎమ్స్ మాత్రమే వాయించేదెవరు, గాయకులతో కలసి పూర్తి పాటను ఫాలో అయే వాద్యకళాకారులు ఎవరు అనే అంశాలను ముందుగానే మాస్టారు అందరికీ తగు సూచనలు ఇచ్చారు. ఘంటసాలవారి కచేరీలలో పాల్గొనే ఆర్కెస్ట్రా అంతా పాటను పూర్తిగా ఫాలో చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో కచేరీలోని అన్ని పాటలకు హార్మోనియం (మా నాన్నగారు), వయొలిన్స్ (Y.N.శర్మగారు, అచ్యుతశాస్త్రిగారు, చిత్తూరు సుబ్రహ్మణ్యంగారు), ఫాలోయింగ్ తప్పనిసరైంది. వెస్టర్న్ స్టైల్ వైలినిస్ట్ లు, మేండలిన్, గిటార్స్, ట్రంపెట్స్, సాక్సోఫోన్, డ్రమ్స్, మొదలైనవారంతా ఒక్క బ్యాక్ గ్రౌండ్స్ మాత్రమే వాయిస్తారు. సినీమాలలోని ఆర్కెస్ట్రా ప్లేయర్స్ అంతా తమ తమ వాద్యాలలో అత్యంత నైపుణ్యం కలిగివుంటారు. వాళ్ళకుండే బిజీ షెడ్యూల్స్ లో ఎవరూ ఎక్కువగా రిహార్సల్స్ చేయడానికి, చేయించడానికి ఇష్టపడరు. ఒకసారి పాట నొటేషన్ వారి చేతికి వెళితే ఎవరి బిట్స్ వాళ్ళు మహా పెర్ఫెక్ట్ గా వాయించేస్తారు. అలాటి perfectionistలకే సినీమా రంగంలో మనుగడ. సంగీతశాస్త్రం తెలియడంతో పాటు on the spot దానిని ఖచ్చితంగా ప్రదర్శించగల వాద్యకళాకారులనే సంగీత దర్శకులు తమ రికార్డింగ్ లకు పిలుస్తారు.
అందుచేతనే హైదరాబాద్ కు తెలుగు పరిశ్రమ తరలివెళ్ళిన చాలా సంవత్సరాలవరకూ సినీమా పాటల రికార్డింగ్ లు మాత్రం మద్రాసు సినీమా స్టూడియోల లోనే జరిగేవి. ఆనాటికి హైదరాబాద్ స్టూడియోలలో రికార్డింగ్ సౌకర్యాలుకానీ, సినీమా టెక్నిక్ తెలిసిన వాద్య నిపుణులు గానీ అంత ఎక్కువ సంఖ్యలో ఉండేవారు కారు. లబ్దప్రతిష్టులైన సినీసంగీత వాద్యకళాకారులనే ఘంటసాల సినీ రజతోత్సవ సంగీత కార్యక్రమానికి ఎన్నుకున్నారు. చిత్తూర్ సుబ్రమణ్యం, వై.ఎన్.శర్మ, ప్రసాదరావు, అచ్యుతరామశాస్త్రి, ఆర్.వి.భద్రం, జోసెఫ్, కృష్ణ, డేనియల్ , టోనీ డకోస్టా (డ్రమ్స్), సుబ్బారావు (ఎలక్ట్రిక్ గిటార్), ప్రసాద్, జడ్సన్, (తబలా), సుబ్బారావు (డోలక్) వంటి ప్రముఖ వాద్యకళాకారులు పాల్గొన్నారు.
ఈ బృహత్ సంగీతోత్సవంలో గాయనీగాయకులు పాడే పాటలను నీటుగా అక్షరదోషాలు లేకుండా వ్రాసే భాధ్యతను ఘంటసాల మాస్టారు నాకు అప్పజెప్పారు. ప్రతీ గాయకుడికి, గాయనికి విడివిడిగా ఆ పాటలను గ్రామఫోనులో వింటూ శ్రధ్ధాభక్తులతో రాసి ముగించాను. ఘంటసాల మాస్టారికి ప్రత్యేకంగా ఒక నలభై పేజీల నోట్ బుక్ లో ఆయన పాడవలసిన పాటలన్నీ వ్రాసాను.
ఆ కచేరీలో పాడిన లేదా నేను వ్రాసిన పాటలన్నీ ఈనాడు గుర్తులేవు. కొన్ని మాత్రం గుర్తుండిపోయాయి. అవి - సర్వశ్రీ అశ్వథ్థామ గారి 'సుధవోల్ సుహాసిని', వేణుగారి 'ప్రియతమా రాధికా', బి.శంకర్ గారి 'మనిషైతే మనసుంటే' - అమాయకుడు విశ్వనాధన్ గారి 'జగమే మాయ', కె.వి.మహాదేవన్ గారి 'ముద్దబంతి పూవులో', మంచిమనసులు లోని 'మామ మామా', ఎస్.పి.కోదండపాణి గారి 'ఆలయాన వెలసిన', చలపతిరావుగారి 'ఎవరివో నీవెవరివో', ఘంటసాలవారి సంగీతంలో 'దినకరా శుభకరా', 'అందమె ఆనందం', మాధవపెద్దిగారి 'వివాహభోజనం' 'అందమే ఆనందం' ఆదినారాయణ రావుగారి 'హాయి హాయిగా'. ఇలాటి హాయినిగొలిపే సుశ్రావ్యమైన పాటలు ఎన్నింటినో ఎంపికచేశారు. ఈ రజతోత్సవ కచేరీ పాటల వ్రాతలు, రిహార్సల్స్
తో పొద్దే తెలిసేది కాదు. హేమాహేమీలవంటి సంగీత దర్శకుల సమక్షంలో సుప్రసిధ్ధులైన గాయనీగాయకులందరితో, తాను సినీమాలలో పాటలనే తిరిగి ఈ బహిరంగ భారీ వేదిక మీద ఆలపించడానికి ఘంటసాలవారు మరింత శ్రధ్ధాసక్తులు చూపించారు.
ఈ ఉత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ కు ఫ్లైట్స్ లో వెళ్ళేవారికి, రైల్లో వెళ్ళేవారికి ముందుగానే టిక్కెట్లు బుక్ చేయడం జరిగింది.
1970 జనవరి 31 వ తేదీన ఆర్కెస్ట్రావారందరితో కలసి మాస్టారింట్లోని నరసింగ, నేను కూడా హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరాము. రెండు సెకెండ్ క్లాస్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లలో మా ఆర్కెష్ట్రావారికి బెర్తులు కేటాయించబడ్డాయి.
ఆనాడు తమిళనాడు లో టోటల్ ప్రొహిబిషన్ వుండేది. మందు ప్రియులంతా సమయం దొరికితే పక్కనున్న పాండిచ్చేరికి (యూనియన్ టెరిటరీ. అక్కడ అంతా ఫ్రీ గా లభించేది) గాని, లేదా తమిళనాడు - ఆంధ్రా బోర్డర్ లు దాటి గూడూరు, నెల్లూరు లు గానీ పరుగులు తీసేవారు.
మన సమాజంలోని అన్ని రంగాలలో వ్యసనపరులున్నా, మందుకు, మగువకు, చీట్లాటకు బానిసలైపోయినవారు సినీమారంగంలో ఎక్కువనే చెప్పాలి. ఆ రకమైన వాళ్ళంతా ఒక చోట చేరి ఈ హైదరాబాద్ ట్రిప్ ను తమకు అనువుగా మార్చుకొని బ్రహ్మానందాన్ని అనుభవించారు.
ఫిబ్రవరి 1, 1970 ఉదయానికి అందరం హైదరాబాద్ చేరుకున్నాము. అందరికీ హోటల్స్ లో రూమ్స్ ఏర్పాటు చేశారు. మాస్టారింటి నుండి ఆయనతోపాటు సావిత్రమ్మగారు, పెద్దబాబు మాత్రం ఫ్లైట్ లో వచ్చారు.
నేనూ, నరసింగ ముందుగానే లాల్ బహదూర్ స్టేడియంకు చేరుకున్నాము. స్టేడియం అంతా ఈ భారీ రజతోత్సవ సభకు బాగా ముస్తాబయింది. వేదికనలంకరించే పెద్దలందరినీ పుష్పమాలలతో గౌరవించడానికి కావలసిన గులాబీ మాలలన్నీ ప్రత్యేకంగా మద్రాసు నుండే తెప్పించడం జరిగింది. వాటన్నిటినీ వేదిక పక్కనే అందుబాటులో వుంచే ఏర్పాట్లలో నేను, నరసింగ నిమగ్నులయ్యాము. ఆ పూల మాలలన్నీ వాడిపోకుండా మధ్యమధ్యలో నీళ్ళు జల్లుతూ చాలా జాగ్రత్త తీసుకున్నాం.
సాయంత్రం ఐదు దాటిందగ్గరనుండి ఒక్కొకరుగా స్టేడియంకు రావడం మొదలు పెట్టారు. సాయంత్రం ఆరయేసరికి లాల్ బహదూర్ స్టేడియం జనసముద్రమయింది. ముఫైవేలమంది ప్రేక్షకులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిథులతో, రాజకీయనాయకులతో, దక్షిణ భారత చలన చిత్ర ప్రముఖులతో లాల్ బహదూర్ స్టేడియం అంతా ఉత్సవ వాతావరణం నెలకొన్నది. బొంబాయి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత-దర్శకుడైన దేవానంద్, ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ప్రత్యేకంగా విశిష్ట అతిథులుగా ఈ ఉత్సవంలో పాల్గొనడంతో ప్రేక్షకుల ఆనందం రెట్టింపు అయింది.
నిర్ణీత సమయానికి ప్రార్థనా గీతంతో సభ ప్రారంభయింది.
శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంగీత మహోత్సవ సభ అధ్యక్షులు గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ. శ్రీ కాసు బ్రహ్మనందరెడ్డి తమ సతీమణి శ్రీమతి రాఘవమ్మ గారితో విచ్చేశారు.
ఈ రజతోత్సవ కమిటీ అధ్యక్షుని హోదాలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖామాత్యులు పి.తిమ్మారెడ్డిగారు ఆహుతులకు స్వాగతం పలికారు. "మన అభిమాన గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఘంటసాల వేంకటేశ్వరరావుగారిని సత్కరించదలచడం ఒక అపూర్వ సన్నివేశం. గానసరస్వతికే ఇది అమోఘమైన ఆనందోత్సవం" అంటూ తమ స్వాగతోపన్యాసాన్ని కొనసాగించారు.
ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ ఘంటసాల సినీ జీవిత రజతోత్సవాన్ని ప్రారంభిస్తూ ఘంటసాల లక్షలాది ప్రేక్షకుల హృదయాలలో తన అపూర్వగానంతో ఆనందాన్ని వెల్లివిరియజేసారని, అటువంటి సంగీత కళానిధిని సన్మానించడమంటే సినీకళాకారులందరినీ సన్మానించడమేనని కొనియాడారు. తరువాత, ప్రముఖ హిందీ నటి వహీదా రెహ్మాన్ రజతోత్సవ కమిటీ తరఫున ఒక సుందరమైన వీణను బహుకరించారు. (తర్వాతి కాలంలో ఘంటసాల మాస్టారి పిల్లలు మా నాన్నగారి దగ్గర సంగీత సాధనకు ఆ వీణ పూర్తిగా ఉపయోగపడింది).
రజతోత్సవ కమిటీ కార్యదర్శి ఆర్.వి.రమణమూర్తి ఘంటసాల వారి సన్మానపత్రం చదివి వినిపించారు. సుప్రసిధ్ధ చిత్రనిర్మాత, పంపిణీదారు అయిన శ్రీ సుందర్లాల్ నహతా 'ఘంటసాల రజతోత్సవ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఈ ప్రత్యేక సంచికలో తెలుగుసినీమా రంగానికి చెందిన గీత రచయితలు, సర్వశ్రీ శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, సి.నారాయణరెడ్డి, సముద్రాల (జూ.) కొసరాజు, కరుణశ్రీ వంటి ప్రముఖులు ఘంటసాలగాన ప్రతిభను తమ కవితలు ద్వారా కొనియాడారు. మరెందరో ప్రముఖులు వ్యాసాలు వెలువరించారు.
చలన చిత్రసీమకు చెందిన ఎన్.టి.రామారావు, ఎ.నాగేశ్వరరావు, జగ్గయ్య, కాంతారావు, గుమ్మడి, రేలంగి, సావిత్రి, అంజలీదేవి, తదితర నటీనటులు, చిత్రనిర్మాతలు, దర్శకులు, చలనచిత్ర డిస్ట్రిబ్యూటర్ లు ఘంటసాలవారిని పూలమాలలతో ముంచెత్తి తమ ప్రేమాభిమానాలను చాటారు. ఎన్.టి.రామారావు మాట్లాడుతూ ఘంటసాల చాలా కష్టపడి వృధ్ధిలోకి వచ్చారని, సర్వకాల సర్వావస్థలలోనూ బాధితుల పట్ల కరుణపూరితంగా వ్యవహరించే మాస్టారంటే తనకెంతో గౌరవమని అన్నారు. అక్కినేని తన ఉపన్యాసంలో తామిద్దరూ ఒకే చోటనుండి వచ్చి అనేక కష్టనష్టాలను తట్టుకొని నిలబడినవారమని, ఘంటసాలను సన్మానించడం అంటే సినీమా ప్రపంచం, ప్రేక్షకలోకం తమను తాము సన్మానించుకోవడమే అవుతుందని అన్నారు. దేశ విదేశాలలో కూడా ఘంటసాల పర్యటించి మన తెలుగుదనాన్ని, తెలుగు సంగీత ప్రాభవాన్ని చాటిస్తారనే దృఢ నమ్మకం తనకు వున్నదని అన్నారు.
సుప్రసిధ్ధ దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారు ఘంటసాలవారి గాన ప్రతిభ గురించి మాట్లాడుతూ గాయకుడిగా ఘంటసాలచేత విఘ్నేశ్వరపూజ చేయించిన ఘనత తనకే దక్కిందని చెప్పారు.
నటుడు జగ్గయ్య తన ఉపన్యాసంలో 'గానానికి మారుపేరు ఘంటసాల' అని ఆయన గళం ఆంధ్రదేశంలో ప్రతీ ఇంటా మార్మోగుతూనే వుంటుందని కొనియాడారు.
సభకు అధ్యక్షత వహించిన గౌరవ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారు మాట్లాడుతూ అందరికీ సంగీతం రాకపోయినా విని ఆనందించడానికి తగిన అభిరుచి, సంస్కృతి అవసరమని, వాటిని పెంపొందించడానికి ఘంటసాలే సర్వసమర్ధుడని అభిప్రాయపడ్డారు.
ముఖ్యఅతిథుల ఉపన్యాసాలనంతరం తనకు జరిగిన ఘన సన్మానోత్సవానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘంటసాల ప్రసంగించారు. ముందుగా తన సినీజీవిత రజతోత్సవ సభకు విచ్చేసి దిగ్విజయంగా జరిపించిన సర్వశ్రీ గౌరవ ముఖ్యమంత్రి, తిమ్మారెడ్డిగారు, ఎ.వాసుదేవరావు, తదితర మంత్రివర్యులు, ముఖ్య, విశిష్ట అతిథులుగా హాజరయిన దేవానంద్, వహీదా రెహ్మాన్ చలన చిత్ర ప్రముఖులు, తోటి సంగీత కళాకారులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలో తనను చిత్రసీమకు పరిచయం చేసిన శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారికి, నిర్మాత ఘంటసాల బలరామయ్యగారికి, పాటలు పాడించిన ఆకాశవాణికి, మొదటి గ్రామఫోన్ పాట పాడించిన శ్రీ పేకేటి శివరాం గారికి, ఐరవై ఐదు సంవత్సరాల పాటు తనను అభిమానించి ప్రోత్సహిస్తున్న ఆశేష ఆంధ్ర ప్రజానికానికి తాను సర్వదా ఋణపడి వున్నానని ఘంటసాల చెప్పారు. తనకు 'పద్మశ్రీ' బిరుదునిచ్చి గౌరవించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చివరగా, ఆంద్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగారు ఘంటసాల గాన ప్రతిభను కొనియాడుతూ వందన సమర్పణ చేశారు.
సభా కార్యక్రమం ముగిసిన తరువాత ఘంటసాల సంగీతోత్సవం అత్యంత జనరంజకంగా సాగింది. ఘంటసాలవారు గంటల తరబడి నిలబడి పాడిన కచేరీ ఇదొక్కటే. ఆయనెప్పుడూ తన వాద్యబృందంతో సహా కూర్చోనే కచేరీలు చేసేవారు. ఈ అద్భుత సంగీత విభావరికి ప్రముఖ సినీ గీత రచయిత డా. సి.నారాయణరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఉత్సవానికి విశిష్టత తెచ్చారు. 'నభూతో నభవిష్యతి' అనే రీతిలో జరిగిన ఘంటసాల రజతోత్సవ సంగీతోత్సవంలో పాల్గొన్న సంగీతదర్శకులకు, గాయనీ గాయకులకు ప్రముఖ నటీమణులు సావిత్రి, అంజలిదేవి మెమెంటోలను బహుకరించారు.
ఈ సభ ఆద్యంతమూ నేను వేదికపైనే వుండి చూసే అదృష్టం నాకు కలిగింది. నా జీవితంలో నేను మొదటిసారిగా పాల్గొన్న అత్యంత భారీ సాంస్కృతికోత్సవం ఘంటసాల సినీ రజతోత్సవ సభ.
ఘంటసాల సినీజీవిత రజతోత్సవం
ఆ తరువాత కాలంలో నేను మరెన్నో ప్రతిష్టాత్మక జాతీయ సంగీతోత్సవాలలో కార్యకర్తగా పాల్గొనే మహద్భాగ్యం కలిగినా ఈ మొదటి ఉత్సవ అనుభవాన్ని మాత్రం నేనెన్నటికీ మరువలేను. ఈ తరహాలో ఏ కళాకారుడికి ఇంత ఘనమైన సత్కారం ఏనాడు జరగలేదు. ఇకపై జరగదు. ఘంటసాలవారిని గాన గంధర్వులన్నా, అమరగాయకులన్నా, శతాబ్ది గాయకులన్నా అది వారికి మాత్రమే చెల్లు.
అటువంటి మహోన్నత సంగీతజ్ఞుడు, సినీ గాయకుడు, సినీ సంగీత దర్శకుడు, సమాజసేవా తత్పరుడు, దేశభక్తుడు అయిన ఘంటసాలకు మరెన్నో ఉన్నత పురస్కారాలు లభించాలి. అందుకు రానున్న ఘంటసాల శతజయంతి ఉత్సవాలు మరింత దోహదం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని నా ఆకాంక్ష.
ఘంటసాలవారి 'నెం. 35, ఉస్మాన్ రోడ్' లో మరిన్ని జ్ఞాపకాలతో... వచ్చేవారం...
. ... సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
2 comments:
💎నేటి మీ జ్ఞాపకాల మాలిక …55వ భాగం- మా కళ్ళ ముందే జరిగిన ఓ బృహత్ సాంస్కృతిక కార్యక్రమాన్ని తలపించింది! ఎన్నో సార్లు ఈ సందర్భంగా విడుదలైన వీడియో చూడ్డం జరిగినా….మీరు వేదిక మీది నుండి అత్యంత సమీపంగా వీక్షించి, నిశిత పరిశీలనతో అక్షరబద్ధం చేసి మాకందించడం ముదావహం! చాల క్రమబద్ధంగానూ వుంది మీ వివరణ! నేను పదవ తరగతి చదువుతున్న రోజులవి. కేవలం వార్తా పత్రికల్లో ఈ సంరంభం గురించి చదివి ఆనందించినట్లు గుర్తు!
💎ఆ రోజుల్లో …పేకాటరాయుళ్ళంతా ఒక చోట జేరి సరదాలు పంచుకొంటూండడం సర్వసాధారణం! పైగా ఇలాంటి ఫంక్షన్లు, అకేషన్లు వస్తే…అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మామూలే! ఈ చిన్న విషయాన్ని కూడ వదల్లేదు మీరు!😃😃
💎బిజీగా వుండే సంగీత కళాకారులు, పర్ఫెక్షనిస్టులు, సంగీత దర్శకులను వేదిక మీదనే తమ తమ పాటలను కండక్ట్ చేస్తే బాగుంటుందని మాస్టారు కోరడం, అందుకు వెంటనే వారి మీది గౌరవంతో ఒప్పేసుకోవడం, కార్యక్రమానికి ముందుకే మాస్టారి ఇంట్లోనే జరిగిన రిహార్సల్స్….ఇత్యాది వివరాలన్నీ మీ బ్లాగు పై పాఠకులకు ఆసక్తిని పెంచేవే! గత రెండు వారాలుగా మీ బ్లాగు చూళ్ళేక పోయాను. మళ్ళీ ఒకసారి వీలు చూసుకుని అవీ తిరగేయాలి! ధన్యవాదాలు స్వరాట్ గారు!🙏🙏
మీ అభినందనలకు కృతజ్ఞతలు.
Post a Comment