visitors

Friday, July 31, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - (పదవ భాగం)

31.07.20 - శుక్రవారం భాగం: 10*
 తొమ్మిదవ భాగం ఇక్కడ

ముందుగా శ్రీ రావి కొండలరావుగారికి స్మృత్యంజలి

సన్మిత్రుడు శ్రీ రావి కొండలరావు గారి మరణం నాకెంతో విచారాన్ని, ఆవేదనను కలిగించింది. మా ఇద్దరికీ మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నది. సినీ కళాకారుడిగా ఆయన గురించి తెలిసినది తక్కువే. వాణీమహల్ లో ఆయన నాటకం 'పట్టాలు తప్పిన బండి' చూశాక ఆయనంటే ఒక గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. కానీ, మా మైత్రికి మూలం మద్రాస్ తెలుగు అకాడెమి. 
1980 ల నుండి ఆయన ఆ సంస్థలో గౌరవ కార్యదర్శి. నేను సహ కార్యదర్శిని.  కొండలరావు గారు శ్రీ టివికె శాస్త్రిగారికి బాల్య మిత్రుడు. "ఒరే అంటే ఒరే" అని పలకరించుకునేంత మైత్రి.  మేము ముగ్గురం మద్రాసు తెలుగు అకాడెమీ ద్వారా ఎన్నో అపురూపమైన , అపూర్వమైన సాంస్కృతికోత్సవాలు రూపొందించాము. మా ఇద్దరి మధ్యా పదమూడేళ్ళ వయసు వ్యత్యాసం ఉంది. కానీ ఆయన చాలా ప్రేమతో సోదరుడిలా చూసుకునేవారు. 
తరుచూ, శాస్త్రిగారి ఇంటిదగ్గర (అదే ఆఫీసు, అదే ఇల్లు) కలిసేవాళ్ళం.  అవసరం పడితే కొండలరావుగారి అభిరామపురం ఇంట్లో గంటల తరబడి పనిచేసేవాళ్ళం. నాకు నటన, నాటకం గురించి ఏమీ తెలియకపోయినా  మా వేదిక మీద జరిగిన ఒక స్కిట్ లో నన్నూ ఇరికించి విడియోలో కనపడేలా చేశారు. 
ఆయన హైదరాబాద్ మకాం మార్చినా, మా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వచ్చి కార్యదర్శిగా తన బాధ్యతలు నిర్వహించేవారు. 
కొండలరావు గారు, రాధాకుమారి  టి నగర్ లో ఒక చిన్న అద్దె ఇంటిలో ఉన్నప్పటినుండి ఎరికే. వారి అన్నగారు రావి చలంగారు, తమ్ముడు ధర్మారావుగారు. అందరూ ఉన్నతశ్రేణి నటులే. వారి కుటుంబ సభ్యులందరూ కలసి శ్రీ రావి చలంగారి నిర్వహణలో  నటించిన "చుట్టం కొంప ముంచాడు"  మా వేదిక మీద ప్రదర్శించడం మరువలేని విషయం. చాలా గొప్ప సందేశమున్న నాటకం. 
శ్రీ రావికొండలరావుగారిని విజయనగరంలో  2008 ఉత్సవాల తర్వాత, ఒకటి రెండుసార్లు మద్రాస్ లో శాస్త్రిగారింట్లో చూశాను. స్వయంగా కలుసుకోకపోయినా ఫోన్ల ద్వారా ముచ్చటించుకోవడం ఉండేది. గత కొన్నేళ్ళుగా శారీరక అస్వస్తతతో ఉంటున్నా హైదరాబాద్ లో ఒంటరిగానే ఉంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది  ఆయన జన్మదినోత్సవం అయాక ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం కోలుకుంటున్నదనే చెప్పారు.
ఇంతలోనే ఈ విషాదవార్త వినరావడం చాలా విచారకరం. 
వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.

---

భాగం: 10

ఉన్న తావున ప్రశాంతంగా నిలువనీయక చదరంగంలో పావులను కదిపినట్లు, కదిపి, ఒక్కోసారి కుదిపి మనిషి జీవితంతో ఆడుకోవడం దేవుడనేవాడికి ఒక సరదా. 

ఏదో కలివరంలో జీవితం ప్రశాంతంగా జరిగిపోతోందనుకునే సమయంలో మళ్ళీ మా నాన్నగారికి స్థాన చలనం తప్పలేదు. గురువుగారిని దర్శించుకునేందుకు ఘంటసాలవారు విజయనగరం వెళ్ళిన సమయానికి  వారక్కడ లేరు. కలివరంలో ఉన్నరని తెలిసి చూడడానికి అక్కడికే వెళ్ళారు. కూడా ఆయనతో  అప్పట్లో సహాయకుడిగా ఉన్న వీణ రంగారావు (మారెళ్ళ), కూడా ఉన్నారు. ఆ సందర్భంలో గురువుగారితో మట్లాడుతూ తన సినీమా వృత్తి గురించి, మద్రాస్ లో సంగీతజ్ఞులకు ఉండే అవకాశాలను గురించి చెపుతూ సంగీతరావు గారిని మద్రాస్ పంపితే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ తండ్రీ కొడుకులు ఈ విషయంలో వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. కారణం, సినీమాల పట్ల అయిష్టత ఒక కారణమైతే, తన వ్యక్తిత్వానికి తగిన రంగం కాదనే భావన కూడా కావచ్చు. మరి కొన్నేళ్ళు అక్కడే గడిపారు.  (ఈ విషయాలు గతంలో ముచ్చటించడం జరిగింది).

మా నాన్నగారు కలివరం వదలిపెట్టడానికి కారణం ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు పుట్టిన ముగ్గురు పిల్లలు,  రెండు మూడేళ్ళ వయసులో పోవడం ఒక కారణమేమోనని నా భావన. నాకంటే పైన ఒక పిల్లవాడు. మా తాతగారి పేరు కలిసొచ్చేలా 'సీతారామ్' అని పెట్టారట. ఎన్నేళ్ళున్నాడో నాకు తెలియదు. తరువాత  రెండవ వాడిగా నేను పుట్టాను.  మా నాన్నగారికి సంగీతంతో పాటు సాహిత్యం, వేదాంత గ్రంధాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి విషయాల మీద మంచి ఆసక్తి, పట్టు ఉండేవి. వెతికి వెతికి నాకు ఉపనిషత్తులు లోనుండి  'ప్రణవస్వరాట్' అనే పేరు పెట్టారు. 'ప్రణవం' అంటే ఓంకారం, నాదమనే అర్ధం వుంది. 'స్వరాట్' అంటే ఇంద్రుడు, అధిపతి అనే అర్ధాలున్నాయట. ఆయన ఉద్దేశంలో సంగీత విద్యలో ఇంద్రుడంతటి వాడిని కావాలనేమో! కుటుంబ వారసత్వపు వాసనల వలన  నేను మంచి సంగీతాన్ని, ఎవరు పాడినా విని ఆనందించగల స్థితిలో ఉన్నాను.

నా తర్వాత, మరొక బాబు.  భగవద్గీత మీద వుండే భక్తితో అతనికి 'గీతాకృష్ణ' అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు నాకు జ్ఞానం రాకుండానే పోయాడు. తర్వాత, మరో ఆడపిల్ల 'సుమన' అని పేరు. ఆ పాప విషయంలో ఉండీ లేనట్లుగా  ఏవో కొన్ని జ్ఞాపకాలు.  ఒకసారి ప్రమాదవశాత్తు మండుతున్న కుంపట్లో వ్రేళ్ళు పెట్టి ఏడవడం బాగా గుర్తుండిపోయింది. సైబాల్ పూయడం గుర్తుంది. ఎఱ్ఱ రంగు సైబాల్ డబ్బా,  అదే రంగులో, అదే సైజులో ఇప్పటికీ చూస్తున్నాను. ఏం అనారోగ్యమో తెలియదు మూడేళ్ళలోపే పోయిందనుకుంటాను. 

కలివరంలో జరిగిన ఈ సంఘటనలు మా నాన్నగారి మీద, అమ్మగారి మీదా ప్రభావం చూపాయేమో! తెలియదు. మొత్తానికి 1951 లో మా నాన్నగారు కలివరం వదలిపెట్టి విజయనగరంలో  మా తాతగారింటికి నివాసం మార్చేశారు. కలివరం వదలి వెళ్ళిపోయినా శ్రీ గంగుల అప్పలనాయుడు గారి కుటుంబంతో మైత్రి కొనసాగుతూనే ఉంది. ఈ ముగ్గురు పిల్లల తరువాత మరెవరికీ ఆసక్తితో పేర్లు ఎంచి పెట్టడం జరగలేదు. అందరూ ఉండి ఉంటే సంగీతరావు గారికి నవరత్నాల్లాటి పిల్లలు (నలుగురు మగ + ఐదుగురు ఆడపిల్లలు) అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఐదుగురున్నాము పిల్లా పాపలతో. 

నాకు అక్షరాభ్యాసంలాటిది కలివరంలోనే జరిగిన గుర్తు. మానాన్నగారు ఒకసారి విజయనగరం నుంచే అనుకుంటాను తెలుగు వాచకం బొమ్మల పుస్తకం తెచ్చారు. అందులో అక్షరాలతో పాటు అల, వల, తల, వంటి మాటలు బొమ్మలుండేవి. మా నాన్నగారికి ఒక కాలంలో కారాకిళ్ళీలు(బాబా జరదా), సిగరెట్లు అలవాటు బాగా ఉండేది. బెర్కిలీ సిగరెట్లు ఆయన మొదటి బ్రాండ్. తరువాత, సిజర్స్ . ఈ సిగరెట్లు రంగు రంగు పెట్టెల్లో వచ్చేవి. వాచీమార్క్, పాసింగ్ షో, ఛార్మీనారు, బెర్కిలీ, సిజర్స్, మొదలైనవి. ఈ ఖాళీ సిగరెట్ పెట్టెలు పిల్లలకు ఎంత అవసరమో నాకు బొబ్బిలి లో తెలిసింది. ఆ విషయాలు తరువాత. ఇవికాక,కరీం బీడీ, గుఱ్ఱం మార్క్ బీడీలు కట్టలు కట్టలుగా  అమ్మేవారు. ఇక, 555 సిగరెట్లు, స్పెన్సర్ చుట్టలు ధనవంతుల బ్రాండ్లు. అట్టపెట్టెల్లో కాకుండా టిన్ డబ్బాల్లో వచ్చేవి. ఆ ఖాళీ డబ్బాలను మొన్నమొన్నటి వరకు ఇళ్ళలో బియ్యం, పప్పులు  కొలుచుకునేందుకు ఉపయోగించేవారు. వాటిని చూడడం మెడ్రాస్ వచ్చేకే. మద్రాస్ ను మెడ్రాస్ అనడం ఒక డాబుగావుండేది.  

కలివరంలో ఈ కారాకిళ్ళీలకు సంబంధించిన  ఒక సంఘటన. మా నాన్నగారు కారాకిళ్లిలతో పాటూ మీఠా కిళ్ళీలు ఇంటికి తెచ్చేవారు. అవి నేనూ నమిలేవాడిని. ఒకసారి తెలియక మీఠాకిళ్ళీకి బదులు ఆ కారాకిళ్ళి నోట్లో పెట్టుకొని నమిలేశాను. ఇంక అంతే సంగతులు. కిళ్ళీలోని కారా మసాలల ఘాటు నశాళానికెక్కింది. తలతిరుగుడు, ఎక్కిళ్ళు ప్రారంభమయాయి. తరువాత నీళ్ళు త్రాగించి, పుక్కిలించి ఉమ్మేయడం వంటివేవో చేయించారు.  తరువాత, ఆయన హార్మోనియం వాయించుకుంటూ పాడుతూంటే  అది వింటూ ఆయన పక్కనే  చాలాసేపు పడుక్కుండిపోయాను.

            
(చింతానాస్తికిలా - శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర రచన -సంగీతరావుగారి గాత్రంలో)
(మనవరాలు గాయత్రి లలితస్మిత గీసిన హార్మోనియం మీద తాతగారి వేళ్ళు) 

సంగీతంలో మాధుర్యంతో పాటు మంత్రశక్తీ వుంది. మానసిక ప్రశాంతికి శ్రావ్యమైన సంగీతానికి మించిన సాధనంగానీ, ఔషధం కానీ లేవు. ఆ ప్రశాంతత ఏ ఒక్క గాయకుడివల్లే కలుగుతుందని లేదు. మంచి సంగీతానికి స్పందించగల హృదయముంటే చాలు. ఆ పాట మహత్తుతో  నెమ్మదిగా నా తల తిరుగుడు తగ్గింది.


నాకు ఆరేళ్ళ వయసులో మానాన్నగారు విజయనగరం వచ్చేశారు. వృత్తిరీత్యా మా నాన్నగారు కచేరీలకు బయట ఊళ్ళకు వెళుతూండేవారు. అలాటి సమయంలోనే, ఆయన మిత్రుడు, శ్రేయోభిలాషి శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు మా నాన్నగారికి రైలు టిక్కెట్టు కొనిచ్చి బలవంతంగా మెడ్రాస్ పంపించారు. అప్పుడు ఘంటసాలవారు పరోపకారం తీస్తున్న రోజులు. మా నాన్నగారు మెడ్రాస్ వెళ్ళి ఘంటసాలగారింట్లో ఉంటూ పరోపకారం, పల్లెటూరు  సినీమాలలో బృందగానాల్లో పాల్గొని,ఆ వాతావరణం నచ్చక వెంటనే వెనక్కితిరిగి వచ్చేయడం వంటి విషయాలు గతవారం చెప్పినదే. 

చిన్నతనంలో  నాకు తరుచూ మలేరియా ఫీవర్ వస్తూండేది. దానివలన నా ప్రాధమిక విద్య సక్రమంగా జరగలేదు. 1952-లో అయ్యకోనేరు గట్టుమీద ఉండే అరటిచెట్ల బడిలో మూడవ తరగతిలో చేర్చారు.  మా తాతగారి అద్దె ఇల్లు సుబ్రమణ్యం పేట, గెడ్డవీధిలో మొదటి ఇల్లు. స్కూలుకు వెళ్ళిరావడం, స్కూల్ లో ఇతర పిల్లలతో తిరగడంతో కొంత జ్ఞానం పెరిగింది. అప్పట్లో వచ్చే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కినీమా వంటి పత్రికలలోని సినీమా బొమ్మలు చూడడం వాళ్ళను గుర్తుపట్టడం తెలిసాయి.

అప్పుడప్పుడు మాతాతగారు తనతో కూడా మ్యూజిక్ కాలేజీకి తీసుకువెళ్ళేవారు. అక్కడ  ఆయన పిల్లలకు చెప్పే సంగీతపాఠాలు వింటూ ఆ హాలులో గోడలమీద వుండే ప్రముఖుల ఫోటోలు చూస్తూ,  ఆ వరండాలమీద తిరిగేవాడిని. అక్కడ మా తాతగారి తో పాటు గాత్ర ఆచార్యుడిగా శ్రీ డొక్కా శ్రీరామమూర్తి గారని ఒకాయన. ఆయన మాత్రమే అక్కడివారిలో నాకు పరిచయం ఉన్నవారు. అలాగే శ్రీ ద్వారం బాబూరావు ( భావనారాయణరావు) గారు.  ఆయన మా రెండో చిన్నాన్నగారికి సహాధ్యాయి. ఆ బాబూరావు గారే మనందరికి చిరపరిచితురాలైన సుప్రసిధ్ధ బహు భాషాగాయని శ్రీమతి సుశీలగారి సంగీతం గురువుగారు.

1950 లో భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం లభించి గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. 1952 లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు, స్వతంత్ర, ఇండిపెండెంట్ అభ్యర్ధులంటూ రోడ్లమీది గోడలన్నీ రకరకాల పేర్లతో రంగు రంగుల బొమ్మలతో నిండిపోయి వుండేవి. వివిధ రకాల జెండాలు ఊరంతా రెపరెపలాడేవి. నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, రాజాజీ వంటి ప్రముఖ జాతీయనాయకుల పేర్లతో పాటూ తెన్నేటి విశ్వనాధం, ఎన్ జి రంగా వంటి పేర్లు కనపడేవి. ఆ ఎన్నికల్లో విజయనగరం రాజావారు శ్రీ పివిజి రాజు కూడా సోషలిస్టు పార్టీ తరఫున పోటీచేసిన గుర్తు. అలాగే సాంబశివరావు అనే ఆయన పోటీ చేశారు.  మా తాతగారు రాజావారి సంగీతకళాశాల ఉద్యోగి కావడం వలన స్వామిభక్తితో పివిజి కే ఓట్ వేసినట్లు చెప్పుకునేవారు. మా ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ములు తలో పార్టీకి వత్తాసు పలుకుతూ భోజనాల దగ్గర వివాదాలు మొదలెట్టేవారు. మా ఇంటికి సమీపంలోనే ఒక మునసబ్ కోర్ట్ ఉండేది. అందులో పోలింగ్ బూత్. ఇంట్లోవారంతా వెళ్ళి ఓటేసివచ్చారు. ఆ ఎలక్షన్ హీటంతా మా ఇంట్లోనూ ఉండేది. 


(21/01/1952 - విజయనగరంలో సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధుల విజయం)

ఈలోగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఒకటి. ఊరంతా సభలు, సమావేశాలు, ఊరేగింపులతో దద్దరిల్లింది. గోడలనిండా "ఆంధ్రరాష్టం రావాలంటే రాజాజీ నశించాలి" అని స్లోగన్స్ . దాని పక్కనే  "ఆంధ్ర రాష్ట్రం కావాలంటే దుంపరాష్ట్రం తెంచాలి" అని ఆకతాయిల సొంత పైత్యాలతో నిండి వుండేవి. వాటి ప్రభావం మా ఇంటి పెరటిగోడల మీద పడింది. అప్పట్లో ఇంట్లో అల్లరి చేయడానికి  నాతో పాటు మా రెండవ చిన్నాన్నగారి అబ్బాయి ఉండేవాడు నాకంటే రెండేళ్ళు చిన్న. పేరు పట్రాయని వెంకట నరసింహ సన్యాసి వర ప్రసాద్. (PVNSV ప్రసాద్. Ex. Telco employee, ప్రస్తుతం బెంగుళూరు నివాసి). మేమిద్దరం మాకు వచ్చిన తెలుగులో బొగ్గుతోనూ, జామాకు, రాచఉసిరి ఆకుల పసరుతో గోడలన్ని ఖరాబు చేస్తూండేవాళ్ళం. మా అమ్మగారో, పిన్నిగార్లో ఎవరో చూసి కేకలేసినా ఆ క్షణం వరకే. తరువాత మామూలే. మా తాతగారికి భయం. మమ్మల్ని గట్టిగా అదలిస్తే ఆ భయంతో ఏ ఊష్ణం వచ్చేస్తుందోనని. మమ్మల్ని ఇల్లు కదలి బయటికి పంపేవారు కాదు. ఆరోజుల్లో విజయనగరం సాంస్కృతిక పరంగా ఎంత ప్రసిధ్ధో, అలాగే గాడిదలకి,మలేరియా దోమలకి, తద్వారా ఫైలేరియాకు కూడా ప్రసిధ్ధే. మా తాతగారు చాలా సౌమ్యులు. అతి భయస్తులు. ఆ లక్షణాలన్నీ మా ఒంటబట్టాయి.

1952 డిసెంబర్ లో ఒక చెల్లెలు పుట్టింది. పేరు వెంకట రమణమ్మ. ఏడుకొండలవాడి పేరు. 1953 జనవరిలో మా నారాయణ మూర్తి చిన్నాన్నగారికి ఒక ఆడపిల్ల. రాజరాజేశ్వరీ ప్రసన్న జ్యోతిర్మయి. సింపుల్ గా జ్యోతి అయింది. వీళ్ళిద్దరికీ మీద మరో ఆడపిల్ల కూడా ఉంది. మా ప్రభూ చిన్నాన్నగారి అమ్మాయి మంగమాంబ. మంగమ్మగారు మా నాయనమ్మగారు. మూడో కొడుకు పుట్టిన మూడేళ్ళకే కాలం చేశారు. మాకెవరికీ తెలియదు. ఈ ఇంట్లోవాళ్ళందరికీ కేర్ టేకర్ మా పెద్ద అమ్మమ్మగారే. ఓలేటి వెంకట నరసమ్మ, మా అమ్మగారి దొడ్డమ్మ, మా తాతగారి పెత్తల్లి కూతురు. ఆవిడ చెల్లెలు, మా అమ్మమ్మగారు, అప్పల నరసమ్మ. మా పెద్దమ్మమ్మగారు వితంతువు. పిల్లలు లేరు.  మంచి జ్ఞాని. ఆవిడ భర్త, మా పెద్దతాతగారి పేరు కూడా నరసన్న. ఆయన ఉండే రోజుల్లో వారిద్దరూ కలిసి వెంకటనరసకవులుగా సాహిత్య సేవ కూడా చేసేరు. తమ్ముడి సంసారమంతటి మీదా ఆవిడదే పర్యవేక్షణ. మా తాతగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు, నిమిత్తమాత్రులు.

క్రమక్రమంగా ఒంటరిగా బయటకు వెళ్ళడం, అయ్యకోనేరు గట్టుకు ఒక ప్రక్కనుండే, అలవాటైన శెట్టికొట్లో పెప్పర్మెంట్లు, ప్యారీ చాక్లెట్లు, జెబి మంఘారాం బిస్కెట్లు వంటివి తెచ్చుకోవడం అలవాటయింది. అప్పట్లో దసరా ఉత్సవాలు బాగా జరిపేవారు. స్కూల్ టీచర్లందరూ పిల్లల్ని వెంటేసుకొని వీధివీధినా ప్రతి యింటిముందూ ఆపి దసరాపాటలు పాడి, అయ్యవార్లకు ఐదు వరహాలు, పిల్లకాయలకు పప్పుబెల్లాలు చాలంటూ డిమాండ్ చేసి, బాణాలతో ఆ ఇళ్ళవారిమీద పువ్వులు జల్లిపించి వారిచ్చే  అర్ధో, రూపాయో, సంభావన పుచ్చుకొని మరో ఇంటికెళ్ళేవారు. అలాగే స్కూల్ లో కూడా దసరా పూజలు చేసి స్వీట్లు పంచిపెట్టేవారు.

విజయనగరంలో దీపావళి కూడా వీరోత్సాహంతో జరిగేది. దీపావళి వస్తే ఏ వీధి తగలెడుతుందోనని భయపడేవారు. ఊళ్ళో పాత కక్షలేవైనా ఉంటే ఆ రోజు రాత్రి మరింత పెట్రేగేవి. ఆ ఊళ్ళో లంక వీధని ఒకటి ఉండేది. అక్కడ ఇలాటి అల్లర్లు ఎక్కువని చెప్పుకునేవారు. వాళ్ళంతా రెండు పార్టీలు గా చీలిపోయి తారాజువ్వలు, వెలక్కాయలు, కొబ్బరికాయలలో మందుగుండు కూరి వాటిని నేలమీద ఎదురెదురుగా విసురుకొంటూ ఉండేవారు. ఇవన్నీ ప్రమాదకరంగా మారి ఇళ్ళుకాలిపోయి, ఒళ్ళుకాలిపోయిన సంఘటనలతో మర్నాడు ఊరంతా గుప్పుమనేది. అప్పటికీ పోలిసులు అలాటి రౌడీ ముఠాలను అరెస్టు చేసి ఒక లారీలో ఎక్కించి అర్ధరాత్రి సమయాలలో చీకట్లో ఊరవతలెక్కడో జనసంచారం లేనిచోట వదిలేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు అక్కడనుండి నడుచుకుంటూ ఊరు చేరేసరికి తెల్లారిపోయేది. దీపావళి అయిపోయేది. మా తాతగారి శిష్యులు, మిత్రుల (పరిమి వారు) పిల్లలు మాకు దీపావళికి ఇంట్లో తయారు చేసిన మతాబాలు, చిచ్చుబుడ్లు, చిచింద్రీలు తెచ్చి ఇచ్చేవారు. వాటిని కాలిస్తే ఒళ్ళెక్కడ కాలుతుందోనని మాతాతగారి భయం.

అలాగే, విజయనగరం కొళాయి నీళ్ళ దెబ్బలాటలకూ ప్రసిద్దే. ఆడవాళ్ళ గొడవలతో ప్రారంభమై మగాళ్ళు తలలు బద్దలు కొట్టుకునేవరకు వచ్చేది. అలాటివారికి అవగాహన కల్పించేందుకు 'కొళాయి బుర్ర' వంటి బుర్రకధలను అభ్యుదయవాదులు వినిపించేవారు. 
మా చిన్నాన్నగారు శ్రీ పట్రాయని నారాయణ మూర్తిగారు వైణికుడు. శ్రీ వాసా వెంకటరావుగారి శిష్యుడు. శ్రీ వాసా కృష్ణమూర్తిగారికి, శ్రీ పంతుల భువనేశ్వరరావుగారికి సహాధ్యాయి. ఈయన అదే సంవత్సరంలో విశాఖపట్నం మకాము మార్చి అక్కడ సంగీత పాఠాలు, ఒక చిన్న స్కూలు ఏర్పాటు చేసుకున్నారు. మా రెండో చిన్నాన్నగారు శ్రీ పట్రాయని ప్రభాకరరావు గారు గాత్రజ్ఞుడు. విజయనగరం మహారాజ సంగీత కళాశాల విద్యార్ధిగా డిప్లొమా హోల్డర్. అందరూ మంచి విద్వత్ కలవారే. ఆయనే మా తాతగారికి తోడుగా ఇంటిపనులన్ని చూసేవారు. మా ఇద్దరిని కూర్చోపెట్టి  అప్పుడప్పుడు చదివించేవారు. ఇంట్లో ఎవరికి అనారోగ్యం చేసినా ఆ ప్రభాకరరావుగారే వెంటనే సుసర్ల వెంకట్రావుగారనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళేవారు. ఆయన హస్తవాసి గొప్పదని చెప్పుకునేవారు. ఆయన మూడు నాలుగు రంగుల్లో అరకు మందులు బాటిల్స్ లో పోసి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు వాడమని ఇచ్చేవారు. ఇంట్లో రకరకాల రంగు రంగుల అరకు మందు సీసాలుండేవి.  మా నారాయణమూర్తి చిన్నాన్నగారి డాక్టర్ వేరే. ఆయన పేరు యాజులుగారు. స్థానికంగా ఉండే ఘోషాస్పత్రికి రిక్షాలో వెళుతూంటే నేనూ కూడా వెళ్ళేవాడిని.

అప్పటికి ఊళ్ళో నాలుగు వీధులు పరిచయమై ఒంటరిగా వెళ్ళడం అలవాటయింది. ఈలోగా సినీమా పరిజ్ఞానమూ పెరిగింది. ఆ రోజుల్లోనే పాతాళభైరవి, మల్లీశ్వరి, ప్రియురాలు, పెళ్ళిచేసి చూడు, ప్రేమ, పిచ్చిపుల్లయ్య, చండీరాణి వంటి సినీమాలు రావడం వాటికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు చదవడం వచ్చాయి. అప్పట్లోనే 'తండ్రి' అని ఒక సినీమా మలయాళం డబ్బింగ్ కావచ్చు. తిక్కురుసి అనే నటుడు నటించినది. ఆ తిక్కురిసి పేరు వింతగా అనిపించి ఆ సినీమా పేరు గుర్తుండి పోయింది. అలాగే, 'ముగ్గురు కొడుకులు' అని ఒక సినీమా. ఈ రెండు సినీమాలు చూడలేదు, కానీ, 'తండ్రి - 'మా తాతగారుగా',  'ముగ్గురు కొడుకులు' మా నాన్నగారు, చిన్నాన్నగార్లుగా ఊహల్లో ఉండేవి. ఈ సినీమాలలోని పాటలన్నీ లౌడ్ స్పీకర్లలో, పబ్లిక్ పార్క్ లలో వినిపించేవి. కొన్నిటిని ఘంటసాలవాడు పాడాడని అనుకునేవారు. అదెవరో మాకు తెలిసేది కాదు. 

విజయనగరం కృష్ణాహాల్ సమీపంలో ఒక పెద్ద పార్క్ ఒక పక్క మరో సినీమా హాలు ఉండేవి. ఆ పార్క్ లోనే నేను మొదటిసారిగా 'ఓ తారకా ఓ జాబిలీ' పాటను లౌడ్ స్పీకర్లో విన్నాను. పాట వింటున్నంతసేపు ఆనందంగా అనిపించింది. అదేం సినీమా, పాడిందెవరనే ధ్యాస అప్పుడు లేదు. ఎప్పుడో తరువాత తెలుసుకున్నాను చండీరాణి సినీమాలో ఎన్ టి రామారావు, భానుమతి పాడారని. మరి, ఘంటసాల పాడడమేమిటనే సందేహమూ కలిగింది. అలాటి సందేహాలన్నింటినీ తరవాతి కాలంలో కాలమే తీర్చింది.

(చండీరాణి సినిమాలోని ఓ తారకా పాట వినడంకోసం ప్లే బటన్ నొక్కండి)

మా ఇంటికి దగ్గరలో 'ప్రభాత్' టాకీస్ అని ఓ సినీమా హాలుండేది. అందులో 'కృష్ణలీలలు' సినీమా వచ్చింది. ఎస్ వి రంగారావుది కాదు. వేమూరి గగ్గయ్యది. ఆయన కంసుడు అందులో. ఎస్ రాజేశ్వరరావు కృష్ణుడు. ఆ సినీమాను ఒంటరిగా చూడ్డానికి ఇంట్లోవారు పర్మిషన్ ఇచ్చి డబ్బులిచ్చి పంపారు. నేను హాలు దగ్గరకు వెళ్ళేసరికి  యింకా మ్యాట్నీ షో వదలలేదు. సినీమా హాలులోపల నుండి గాట్టిగా అరుపులు , భయంకరమైన నవ్వులు, పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. అంతే! భయంతో ఠారెత్తి ఇంటికి ఒకటే పరుగు. సినీమాలేదు, గినీమా లేదు. ఆ తరువాత ఎప్పుడో టివీలో దూరదర్శన్ ప్రసారం చేసినప్పుడు చూసాను. కొన్నాళ్ళపాటు గగ్గయ్య, జగ్గయ్య ఒకరేననే భ్రమ ఉండేది. 

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు ఒకసారి నన్నేదో ఇంగ్లీషు సినీమాకు తీసుకెళ్ళారు.' కొవ్వాడీస్' అని గుర్తు. నేను చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా అది. అది చూసి వచ్చి ఇంట్లో నడుముమీద రెండు చేతులు పెట్టుకొని చెప్పులతో కాళ్ళు ముందుకు వెనక్కి ఊపుతూ డాన్స్ చేస్తూంటే నాకు నవ్వు వచ్చేది. అంత పెద్దవాడు అలా గెంతుతూంటే. కుటుంబంలో ఆడవాళ్ళు సినీమాలకు వెళ్ళాలంటే జట్కా బళ్ళలోనే. విజయనగరంలో సైకిల్ రిక్షాలు వచ్చిన కొత్తరోజులు. స్టేషన్ కు వెళ్ళాలన్నా, మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాలన్నా, సుసర్ల వెంకట్రావుగారి హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా సైకిల్ రిక్షాయే. ఎక్కడికైనా బేడ (రెండు అణాలు) డబ్బులే ఇచ్చేవారు. అప్పట్లో అక్కడి గౌరీశంకర్ విలాస్ హోటల్లో ఒక అణాకు రెండు ఇడ్లీలు. మీకు రూపాయి మానం గుర్తుందా. 
ఒక రూపాయికి - అర్ధలు 2
పావలాలు - 4
బేడలు - 8
అణాలు - 16
అర్ధణాలు - 32
కాణీలు - 64
దమ్మిడీలు - 128
వీటికి క్రింద ఏగాణీలు, ఠోలీలు అనే నాణేలు కూడా ఉండేవి.
'దమ్మిడీ ముండకు ఏగాణీ క్షవరం' అనే సామెతలు ప్రచారంలో ఉండేవి.  రాగితో చేసిన ఆ కాణీలు, దమ్మిడీలకు కూడా ఏవో కొనుకున్న గుర్తుంది. ఈ కాణీలు రెండు రకాలు. ఒకదానికి చిల్లుండేది. అలాటి చిల్లు కాణీలను పిల్లల మొలత్రాడులో వేసి నడుముకు కట్టేవారు. దృష్టిపరిహారామో లేక రాగి ఒంటికి మంచిదనే కారణమేనా కావచ్చు. ఈ కాపర్ల (రాగి నాణేలు) మీద వాటితో కొనుక్కోగల చుట్టలమీద కన్యాశుల్కం లో ఒక పెద్ద లెక్చరే ఉంది గిరీశానిది.

ఇలా జరుగుతూండగా ఒకరోజు మా ఇంట్లో ఘంటసాల పేరు మరొకసారి వినిపించింది. ఒకే మనిషిని కొందరు 'డు' అని మరికొందరు 'రు' అని ఎందుకు పిలుస్తారో నాకు అర్ధమయేది కాదు. గంటసాలవాడు రేపు మనింటికి వస్తున్నాడని. గంటసాలవాడు ఎవరు? ఎక్కడనుండి వస్తున్నాడు? ఎందుకు రావడం? అనే వాటిమీద అనేక సందేహాలు. ఎవరిని అడగాలి. అడిగితే ఏమంటారో? నాకు గంటశాల అంటే దేవుడి గుళ్ళోని గంట, శాల అంటే తాటాకుల శాలగా అర్ధం చెప్పుకొని గంట ఉన్న శాలే గంటశాల అని నిర్ణయానికొచ్చాను. కానీ గంటసాల మనిషంటున్నారే. 

ఈ లోపల ఇంట్లో వారంతా ఆ వచ్చేవారికోసం ఏర్పాట్లు జరుపుతూ, పెరటి గోడలమీద మా వ్రాతలను తుడిపి శుభ్రం చేసే పనిని నాకు, ప్రసాద్ కు  పెట్టారు.

తరువాత...... వచ్చేవారం....
                        సశేషం.

2 comments:

Patrayani Prasad said...

చాలా బాగా వివరిస్తూ వివరాలన్నింటినీ పూస గ్రుచ్చినట్లు వరుసగా, సరళంగా ,ప్రత్యక్ష ప్రసారం లా , వినిపిస్తూ , కనిపిస్తున్నట్లు ఉంది . నాకు కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను . తెలిసినవిషయాలను ఒకసారి చిన్నతనం లోకి వెళ్లి , జ్ఞాపకం చేసుకున్నాను . ముఖ్యముగా, నీ శ్రీకృష్ణలీల సినిమా విషయం ఎందువల్లో నాకు జ్ఞాపకం లేదు చదివి చాలా నవ్వుకున్నాను.చాలాసంతోషం. ధన్యవాదాలు 🙏🙏-అన్నయ్యకు , పట్రాయని ప్రసాద్ , బెంగుళూరు , 02- ఆగష్టు -2020 .

P P Swarat said...

ఈ ధారావాహిక లోని జ్ఞాపకాలు మీ అందరికి నచ్చుతున్నందుకు సంతోషంగా వుంది. ధన్యవాదాలు.