visitors

Saturday, January 9, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పధ్నాలుగవ భాగం

09.01.2021 - శనివారం భాగం - 14*:
అధ్యాయం 2  భాగం 13 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1959 - 1963 ల మధ్య నెం.35, ఉస్మాన్ రోడ్, 36, ఉస్మాన్ రోడ్ లలో బాలకాండ సాగింది.  పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యంగా ఇల్లంతా కళకళలాడింది. 


35, 36 ఉస్మాన్ రోడ్ పిల్లలు

నెం.35, ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాలవారి పిల్లలు, ఔట్ హౌస్ లోని సంగీతరావుగారి పిల్లలు, నెం.36, ఉస్మాన్ రోడ్ లోని రాజగోపాలన్ గారి పిల్లలు ఏ అరమరికా లేకుండా, ఏ భేషజాలు లేకుండా చివరివరకూ స్నేహసుహృద్భావాలతో, ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానాలు కనపరుస్తూ మెలిగారు. ఇప్పటికీ ఈ మూడిళ్ళలో పుట్టి పెరిగిన సంతానం అలాగే వున్నారు. అక్కా తమ్ముడూ, అన్నా చెల్లి అంటూ ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోకపోయినా అందరూ సోదరభావంతోనే మెసలుతూ వచ్చారు. ఇంట్లో పెద్దల భావాలు, నడవడిక, పెంపకం ఎలావుంటే ఆ ఇంటి పిల్లలు కూడా అదే రీతిలో పెరుగుతారు, అని జనరలైజ్ చేసి చెప్పలేము, కానీ, ఆయా కుటుంబాలలోని సంస్కారం అందుకు తప్పక దోహదం చేస్తుంది. 

1959 జనవరిలో మా యింట మా రెండో చెల్లెలు పద్మ, 1959 మే నెలలో మాస్టారి పెద్దమ్మాయి శ్యామల, 1960 జూలైలో మాస్టారి రెండో అమ్మాయి సుగుణ, 1961 మే లో మా మూడో చెల్లెలు లలిత, 1963 జనవరిలో ఘంటసాలవారి ఆఖరి అమ్మాయి రాధ (శాంతి), 1963 అక్టోబర్ లో మా ఆఖరి చెల్లెలు సుమబాల పుట్టడం జరిగింది. మా పక్కిల్లు నెం.36, ఉస్మాన్ రోడ్, మామా ఇంట్లో కూడా దాదాపు ఈ కాలంలోనే వారి ఆఖరి ఇద్దరి ముగ్గురు పిల్లలు పుట్టిన గుర్తు. మా పక్కింటి మామా (శ్రీAKరాజగోపాలన్), మామీల (శ్రీమతి పర్వతవర్థని) పెద్దబ్బాయి రఘు, సీత, తార, లల్లి(లలిత), శేఖర్ (AKస్వామినాథన్), కణ్ణా(బాలకృష్ణన్), శీను(శ్రీనివాసన్), వీళ్ళందరికీ నడకా, మాటా వచ్చేసరికి అందరి గమ్యం 35 ఉస్మాన్ రోడ్డే.



మా అమ్మగారికి పిల్లలంటే మహా ప్రాణం. ఆవిడ ఏనాడు పిల్లలను తిట్టడంగానీ, వాళ్ళను కఠినంగా శిక్షించడంవంటివి గానీ  చేయలేదు. విజయనగరంలో ఒకేఒకసారి మాత్రం  ఆవిడ కోపాన్ని నా మీద ప్రయోగించింది. కారణం గుర్తులేదుఅందువలన ఈ రెండిళ్ళలోని పిల్లలు మా అమ్మగారంటే చాలా ఇష్టపడేవారు. ఆవిడ దాదాపు ఐదు దశాబ్దాలు మద్రాసులోనే గడిపినా ఆవిడకు తమిళం ఒక్క ముక్క ఒంటబట్టలేదు. ఆవిడ ఆ ప్రయత్నమూ చెయలేదు. (మా నాన్నగారికీ తమిళం రాలేదు. భాష అర్ధమవుతుంది కానీ, మాట్లాడలేరు.)

అందువలన మా పక్కింటి పిల్లలు మా అమ్మగారితో మెసలుతూ అవసరంమేరకు తెలుగులో మాట్లాడడం నేర్చేసుకున్నారు. అలాగే  మాస్టారింట్లో పనిచేసే తాయి, ఆవిడ కొడుకు మా తెలుగులోనే మాట్లాడుతూ మా అమ్మగారికి అభిమానపాత్రులయ్యారు. మాస్టారింట్లో సావిత్రమ్మగారు, పాపగారు, అందరూ  తమిళం బాగా మాట్లాడతారు. నాకు మొదట్లో తమిళ భాష రానందువల్ల పక్కింటి మామా కుటుంబంతో, వారి పిల్లలతో పెద్దగా స్నేహం పెరగలేదు. అందుకు మరో కారణం నా వయసు. పక్కింటి రఘు తప్ప మిగిలిన రెండిళ్ళ పిల్లలు వయసులో చాలా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళతో కలసి అల్లరిచేస్తూ, ఆటలాడే వయసు నాది కాదు. 

'బాలానాం రోదనం బలం' అంటారు. ఇంట్లో ఏదో మూల ఒకరు ఏడుపు మొదలెడితే వెంటనే రెసిప్రోకల్ గా మరో పక్కనుండి మరో శృతిలో మరొకరు గొంతు కలిపేవారు. ఇలా ఒక ఐదేళ్ళు అందరి ఆరున్నరశృతి  సప్తస్వరాలలాగా  వినిపించేవి. ఈ పిల్లల అల్లరితో ముద్దు మురిపాలతో నెం.35, ఉస్మాన్ రోడ్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. 1965 నాటికి  ఒక చిన్న సైజ్ కిండర్గార్డెన్ స్కూలుకు కావలసినంతమంది పిల్లలు ఈ రెండు లోగిళ్ళలో తయారయ్యారు.


మెరీనా బీచ్ లో ఉస్మాన్ రోడ్ పిల్లలతో నరసింగ

ఘంటసాల మాస్టారికి పిల్లలంటే ముద్దే. స్వపర భేదం లేదు. అందరినీ చేరదీసేవారు. ఆయన తీరికగా ఇంట్లో వుంటే ఈ చంటి పిల్లలంతా ఆయన గుండెలమీదే స్వారీ చేసేవారు. ఆయన కూడా ఏదో తమాషాలు చేసి ఆ పిల్లలను నవ్వించేవారు. పిల్లలమీద విసుక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి మాస్టారికి ఇష్టముండేది కాదు. ఆ సెషన్ అంతా అమ్మగారిది. అయ్యగారు ఇంట్లోలేనప్పుడు క్లాస్ తీసేవారు. అమ్మగారికి కోపం ఎక్కువే. అల్లరిపెట్టేవాళ్ళకి అమ్మగారి శిక్షలు తప్పేవికావు. తన ప్రేమపాశాన్ని తొడపాశాల ద్వారా  చూపెట్టేవారు. నొప్పితో కుయ్యో, మొర్రోమని నోరెత్తితే "ఛంపుతా" అని కళ్ళెర్ర జేసి అమ్మగారు చెయ్యెత్తితే చాలు అల్లరి చేసే పిల్లల నోళ్ళు మూతపడేవి. వాళ్ళు మెల్లగా అక్కడనుండి జారుకొని పాప పిన్నిగారి దగ్గరకో, మా అమ్మగారి దగ్గరకో చేరి కావలసిన సానుభూతిని, బిస్కట్ల లంచాన్ని పొందేవారు. మాస్టారింటి తీన్ దేవియాల అల్లరి చేష్టల వల్ల  ఆ ఇంట్లోని ఒక మంచి క్యారమ్ బోర్డ్ ఎందుకూ పనికి రాకుండాపోయింది. మరి అది ఎలాటి అల్లరో  మీరే ఊహించుకోండి.

1959 అంతా నెం.35, ఉస్మాన్ రోడ్ లో నిర్విరామ కార్యక్రమాలతో చాలా ఉత్సాహంగా సాగింది. 

ఆ సంవత్సరం ఘంటసాల మాస్టారింటికి సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ గారు ఏడెనిమిది మంది పరివారంతో మద్రాస్ వచ్చారు.  

బడే గులాం ఆలీఖాన్ గారిది పాటియాలా ఘరానా సంగీత శైలి. తుమ్రీ, ఖయాల్ గానంలో అత్యంత నిష్ణాతులు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయకుడు. అటువంటి గాయకుడిని కళ్ళారా చూడడమే గొప్ప అదృష్టమైతే, ఆయన కచేరీ వినే మహాధ్భాగ్యం నాకు నా చిన్నతనంలోనే కలిగింది. ఘంటసాల మాస్టారు 'ఖాన్ సాబ్' అని పిలిచేవారు. మాస్టారికి ఖాన్ సాబ్ గాత్రమన్నా, ఆయన సంగీతమన్నా చాలా ఇష్టం. చంద్రహారం లోని "ఇది నా చెలీ, ఇది నా సఖీ" పాటకు ఘంటసాల మాస్టారు ఉపయోగించిన రాగేశ్వరి రాగం మీద ఖాన్ సాబ్ సంగీత శైలి ప్రభావం వుందని అంటారు. 



ఖాన్ సాబ్ తన కచేరీలలో విధిగా "క్యా కర్ సజనీ ఆయెన బాలం" అనే గీతాన్ని ఆలపించేవారు. ఘంటసాలవారికి ఈ గీతమంటే అమితమైన ఇష్టం. తరచూ హమ్ చేసేవారు. మా నాన్నగారు పాడగా కూడా విన్నాను. మాస్టారు వారిని, వారి వాద్యబృందాన్ని, పరివారాన్ని చాలా సాదరంగా, గౌరవంగా తమ ఇంటికి ఆహ్వానించి తీసుకువచ్చారు.

అప్పట్లో ఒక బ్రాహ్మడు ఒక ఇస్లామ్ మతస్థుడిని తీసుకువచ్చి తన ఇంట్లో పెట్టుకోవడం కొందరు ఛాందసవాదుల కన్నెర్రకు కారణమయింది, అని చెప్పుకోగా విన్నాను. అయినా ఘంటసాల మాస్టారు చాలా విశాల దృక్పథం కలవారు. ఎవరి విమర్శలను లెఖ్ఖ చేయలేదు. అందుకే ఖాన్ సాహేబ్ కు ఘంటసాలగారంటే అంత వాత్సల్యం, అభిమానం. వచ్చినవారందరికీ మాస్టారి ఇంటి మేడ భాగాన్ని పూర్తిగా కేటాయించి, ఇంట్లో వారెవరూ వారికి ఏ రకమైన అంతరాయం కలిగించరాదని హెచ్చరించారు. భోజన వసతులన్నీ మాస్టారింటినుండే వెళ్ళేవి. మేడమీదకు వెళ్ళడానికి ప్రత్యేకమైన త్రోవ వుండడం వలన ఎవరికీ ఏవిధమైన ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లన్నీ చేశారు. అంతకుముందు, వారు ఒకసారి మద్రాస్ వచ్చారట, కానీ, అప్పటికి మేము మద్రాస్ వెళ్ళలేదు. ఈసారి కొన్ని వరస కచేరీలు చేయడానికి మద్రాస్ వచ్చారు. అందులో ఒక రోజు కచేరీకీ మాస్టారింట్లో అందరితోపాటూ నేనూ వెళ్ళాను. ఆ రోజున కూడా ఆ "క్యా కర్ సజనీ ఆయెన బాలమ్"  గీతాన్ని ఎంతో మనోజ్ఞంగా గానం చేశారు. నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు. కానీ ఆయన పాట వింటూంటే చాలా ఆశ్చర్యంగా, ఎంతో హాయిగా, ఆనందంగా అనిపించింది.



ఖాన్ సాబ్ ను చూడకముందు ఆయన గురించి మా నాన్నగారిని అడగేను. 1960ల నాటికి మా ఇంట్లో అందరికంటే మా నాన్నగారు, ఆయన స్నేహితుడు శ్రీ పంతుల శ్రీరామశాస్త్రి గారు వలంగా ఉండేవారు. (మా ప్రాంతాల్లో లావుగా వుండడాన్ని 'వలంగా' వున్నాడని అంటారు.) మా నాన్నగారి కంటే ఘంటసాల మాస్టారు లావు. మాస్టారికి రెండింతలు బడే గులాం ఆలీఖాన్ గారు వుంటారని మా నాన్నగారు చెపితే 'అమ్మ బాబోయ్' అనిపించింది. నిజమే, ఖాన్ గారిది చాలా భారీకాయమే. పెద్ద పెద్ద బుర్ర మీసాలు, తలమీద నల్లటి టోపీ, పఠాన్లు లాగా వస్త్రధారణ. కారులోకి ఎక్కేప్పుడు, దిగేప్పుడు చాలా శ్రమపడవలసి వచ్చేది. చిన్న పీటలాటిది ఎప్పుడూ అందుబాటులో ఉండేది. ఖాన్ సాబ్ కు కానీ, ఆయన పరివారానికి కాని పెద్ద సమస్య భాష. వారందరికీ ఉర్దూ తప్ప మన తెలుగు , తమిళ భాషలు ఒక్క ముక్క అర్ధం కావు.  ఉర్దు, తెలుగు తెలిసిన ఎవరో మధ్యవర్తి ద్వారా కాలక్షేపం జరిగేది. ఘంటసాల మాస్టారిది, ఖాన్ సాబ్ ను చూసేందుకు వచ్చేవారందరిదీ ఒకటే భాష. సంగీతం.  అన్ని వర్గాలవారిని సమన్వయపర్చి వారధిగా నిలిచేది విశ్వవ్యాప్తమైన సంగీతమే. అక్కడ మరే యితర మాటలకు తావులేదు. అంతా సామవేద గానమే. అదే మన భారతీయ సంస్కృతి. ఖాన్ సాబ్ పాటను వినడానికి మద్రాస్ లోని ప్రముఖ సంగీత విద్వాంసులంతా మాస్టారింటికి ఎడతెరిపిలేకుండా వచ్చేవారు.  కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన విద్వాంసులందరు ఖాన్ సాబ్ ను చూసి ఆయనతో ముచ్చటించాలని వచ్చేవారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డికె పట్టమ్మాళ్, ఎమ్మెల్ వసంతకుమారి, శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, వంటి విద్వాంసులను అప్పుడే చూసే అవకాశం లభించింది. ఇక సినీమా గాయకులు, అన్ని భాషలవారూ చూడడానికి వచ్చేవారు. 

ఖాన్ సాబ్ పాడుతున్నప్పుడు అంతరాయం కలగకూడదని, మెల్లగా చప్పుడు చేయకుండా మేడ మెట్లమీదే కూర్చొని శ్రధ్ధగా ఆయన పాటను ఆలకించేవాడినని ప్రముఖ కవి ఆరుద్ర తన వ్యాసం ఒకదానిలో వ్రాశారు. అర్ధరాత్రి దాటేవరకూ ఎవరో ఒకరు రావడం ఆయన పాడేది వినడం పరిపాటిగా వుండేది. ఖాన్ సాబ్ నిద్రపోతున్న సమయంలో కూడా స్వరమండల్ ఆయన గుండెలమీదే వుండేది. ఏమాత్రం మెలకువ వచ్చినా స్వరమండల్ తంత్రులన్నీ మధురమైన స్వరాలని వినిపించేవి.

ఖాన్ సాబ్ వంటి సరస్వతీ పుత్రులవల్ల, ఆయనను సందర్శించడానికి వచ్చే ఇతర గాయక స్రష్టల వలన "నెం.35, ఉస్మాన్ రోడ్" ఎంతో పావనమయింది. అందుకే, నా దృష్టిలో "నెం.35, ఉస్మాన్ రోడ్" ఒక సాధారణ గృహం కాదు. ఒక పవిత్ర సరస్వతీ నిలయం.  సంగీతాలయం. అటువంటి సాంస్కృతిక వాతావరణంలో పెరిగి పెద్దైన అదృష్టం నాకు లభించింది. పాట రాకపోయినా ఫర్వాలేదు, మంచి సంగీతం విని ఆనందించే హృదయముంటే చాలని భావిస్తాను.

వచ్చిన సంగీతాభిమానులంతా వెళ్ళిపోయిన తరువాత వారి రాత్రి భోజన కార్యక్రమం జరిగేది. ఖాన్ సాబ్ బృందమంతా చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ చుట్టూరా కూర్చొనేవారు. వారిమధ్యలో పెద్ద పెద్ద చపాతీ దొంతరలు, పక్కనే కొన్ని కూరల వంటకాలు ఉండేవి. ఇన్ని చపాతీలు  ఎవరైనా తినగలరా అని నాకు అనిపించేది. కానీ ఒక చిన్న ముక్క కూడా మిగిలేది కాదు. అన్నం విలువ తెలిసినవారే ఏ ఒక్క పదార్ధమూ పారేయకుండా భక్తి శ్రధ్ధలతో తింటారని మా పెద్దలు చెప్పేవారు.

ఖాన్ సాబ్ బృందంవారు భోజనాల సమయంలో ఒకరు వడ్డించడం, మరొకరు తినడం అనే ప్రసక్తేలేదు. ఎవరికి కావలసినది వారే వడ్డించుకు తినేవారు. భోజన సమయంలో కూడా గడచిన సంగీత కార్యక్రమం గురించి, లేదా, జరగబోయే కచేరీ గురించి చర్చించుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించేవారు. వారి భోజన కార్యక్రమం నాకు చాలా వింతగా అనిపించేది. వయసు, అనుభవం లేకపోతే ఏది చూసినా వింతే. ఇవన్నీ నాకు గుర్తుండిపోవడానికి కారణం ఆ చిన్న వయసు మనస్తత్త్వమేనేమో!

బడే గులాం ఆలీఖాన్ గారు ఏనాడు సినీమాలలో పాడలేదు. పాడాలనీ అనుకోలేదేమో! అటువంటి వ్యక్తిని బలవంతపెట్టి "మొఘల్ ఈ అజాం" చిత్రంలో తాన్సేన్ పాత్రకు పాడించారు. సినీమాలలో  ఒక సంగీత దర్శకుడి అదుపాజ్ఞలు పాటిస్తూ పాడడం ఇష్టంలేని ఖాన్ సాబ్ ఒక అనూహ్యమైన చాలా పెద్ద పారితోషికం డిమాండ్ చేసారట. అంత పెద్ద మొత్తం ఆ రోజుల్లో ఏ సినీమా గాయకుని ఇచ్చే స్తోమత ఏ నిర్మాతకు వుండేది కాదు. కానీ నిర్మాత పట్టుదలతో ఆయన కోరిన పారితోషికం ఇచ్చి పాడించారట. సంగీత దర్శకుడు నౌషాద్ అలి. సాధారణ గాయకులకు నేర్పినట్లు ఖాన్ సాబ్ కు పాట నేర్పడం సాధ్యమయేపనికాదు. అందువలన రాగం పేరు మాత్రం చెప్పి సాహిత్యం చేతికి ఇచ్చి  ఆయన ఇష్టానికే వదిలేసారట. పాడడమంటూ మొదలుపెడితే అది అనంతంగా సాగిపోవలసిందే. కట్ చెప్పి ఆపే ధైర్యం నౌషాద్ చేయలేకపోయారట. పాట అంతా రికార్డ్ చేసి తరువాత ఎడిటింగ్ సమయంలో తమకు కావలసినంత మేరకు సినీమాలో ఉపయోగించుకున్నారని మొఘలే ఈ అజాం సినీమా సంగీత విశేషాల గురించి వచ్చిన ఒక వ్యాసంలో చదివాను. ఇందులోని నిజానిజాలు నాకైతే తెలియవు.

బడే గులాం ఆలీఖాన్ గారు తమ బృందంతో తిరిగి బొంబాయి వెళ్ళేముందు అందరూ  వాకిట్లో కారు పోర్టికోలోకి వచ్చారు. ట్రైన్ లోనే వెళ్ళిన గుర్తు. మేడ మీద నుండి వారి సామానంతా కార్లలోకి ఎక్కిస్తున్న సమయంలో ఖాన్ సాబ్ పోర్టికోలోని సిమెంట్ అరుగుమీద కూర్చొని (ముక్కాలి పీట సాయంతో), వెళ్ళేముందు మాస్టారిని, మా నాన్నగారిని, అక్కడ ఉన్నవారందరినీ పలకరిస్తూ వచ్చారు. మా నాన్నగారి పక్కనే నిల్చొనివున్న నన్ను చూసి "ఈ కుర్రవాడి చెవులు పెద్దవిగా ఉన్నాయి. చాలా అదృష్టవంతుడు అవుతాడు" అని నా తల నిమిరారు. ఆ సమయంలో అందరి దృష్టి నా మీదే పడడంతో నాకు చాలా సిగ్గనిపించింది. అష్టవంకరలు పోయాను. 

అదృష్టం అనేక రకాలు.  ధనార్జనే ఒక్కటే అదృష్టంగా భావించనక్కరలేదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడినే. అంతటి మహాగాయకుని మాటలు నాకు ఆశీస్సులు గా భావిస్తాను. మనిషికి తప్పనిసరిగా ఏదో ఒక ambition ఉండాలి,  జీవితంలో ఏదైనా ఘనమైన సాధన చేయాలి అని మా నాన్నగారు తరుచు అనేవారు. డబ్బు సంపాదన ఒక్కటే సాధన కాదని ఆయన దృఢాభిప్రాయంగా నాకు తోస్తుంది. 

1958-59 ప్రాంతాలలోనే 'నమో వెంకటేశా', 'ఏడు కొండలసామీ' వంటి పాటలు గ్రామఫోన్ రికార్డింగ్ జరిగిన జ్ఞాపకం. ఆ పాటల కంపోజింగ్ మేడమీద ముందు రూమ్ లో జరిగేది. ఆ సమయంలోనే ఆ పాటల రచయిత శ్రీ రావులపర్తి భద్రిరాజుగారిని చూసాను. ఆ పాటల కంపోజింగ్ సమయంలోనే 'ఖోల్' అనే వాద్యాన్ని మొదటిసారిగా చూసాను. 

 


చూడడానికి మృదంగంలా కనిపించినా ఆకారంలో, ధ్వనిలో చాలా తేడావుంది. అలాగే ఆ పాటలలో క్లేవైలిన్ (యూనివాక్స్) కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ రెండు పాటలు ఎంత హిట్టయినాయో అందరికీ తెలుసు. సినీమా పాటలకంటే ఎక్కువ ప్రజాదరణ పొంది ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. 'ఏడు కొండలసామి' పాట గ్రామఫోన్ రికార్డ్ గా రావడానికి ముందు, కొంచెం తేడాగా ఘంటసాలగారు పాడినది ఆలిండియా రేడియోలో ప్రసారం చేసారు. 

మాస్టారి ఇంటి మేడమీది ముందు రూమ్ లో తెలుపు నలుపుల ఫోటో ఒకటి గోడకు వేలాడుతుండేది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తి చేతిలో ఒక కాఫీ కప్ కూడా కనిపిస్తుంది. మాస్టారికి ఏ విధమైన సంబంధమో తెలియదు. తరువాత ఎవరో చెప్పారు ఆయన ఒక  పెద్ద గాయకుడని, హిందీ సినీమాలలో పాడతారని. మనిషి చాలా హాండ్సమ్ గా కనిపిస్తారు. నాకెందుకో అతనే  ముఖేష్ అని అనిపించేది. ఆ పేరే నా మనసులో  చాలాకాలం లాక్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత, కొంత సినిమా పరిజ్ఞానం పెరిగాక అప్పుడు తెలిసింది ఆ ఫోటోలో వున్న హిందీ గాయకుడి పేరు తలత్ మహమ్మద్ అని. తలత్ మహమ్మద్ గళంలోని ఒక రకమైన వణుకు ఆయన ప్రత్యేకత. అది ఆయనకే చెల్లు.

1959లో ఘంటసాలవారి పుష్పకవిమానం (నెం.35, ఉస్మాన్ రోడ్)లోకి మరొక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. అతని పేరు ముద్దు నరసింగరావు. 

చివర సర్కిల్ ఉన్నది నరసింగరావు

ఘంటసాల మాస్టారి స్నేహితుడు ముద్దు పాపారావుగారి కుమారుడు. పాపారావుగారు, మాస్టారు విజయనగరం సంగీత కళాశాలలో సహాధ్యాయులు. ఆప్తమిత్రులు. 


తాతగారి వెనుకే సర్కిల్ లో ఉన్నది ముద్దు పాపరావుగారు
ఎడమవేపు కూర్చుని సర్కిల్ ఉన్నది ఆయన అన్నగారి అబ్బాయి (నరసింగరావుకి కజిన్)

ఘంటసాలవారి స్నేహసౌశీల్యాలు చాలా గొప్పవి. పాపారావుగారు గుణుపూర్ లో ఉండేవారు. ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో వుండి కనుమూశారు. భార్యా పిల్లలకు జీవనాధారం కరువయింది. స్నేహితుడి కుమారుడైన నరసింగరావును తన దగ్గరకు రప్పించి తమ ఇంటి పిల్లవాడిలా ఆదరించారు. అతని చెల్లెళ్ళకు తనే దగ్గరుండి వివాహం జరిపించి ఆ కుటుంబానికి దారి చూపారు. నరసింగరావుకు పెద్ద ఉద్యోగం  ఏర్పాటు చేయడానికి కావలసిన విద్యార్హతలు లేక తమ ప్రొడక్షన్ ఆఫీసు పనులే చేయించేవారు. నరసింగరావు నాకంటే ఏడేళ్ళు పెద్ద. ఘంటసాలవారింటి పిల్లవాడిలాగే అందరూ చూసుకున్నారు. గత రెండేళ్ళ క్రితం వరకు ఘంటసాలవారి మూడో అల్లుడు, (శాంతి భర్త కొండూరు సురేంద్ర కుమార్) స్వగృహంలోనే సావిత్రమ్మగారికి సొంత కొడుకులా సేవచేస్తూ చేదోడువాదోడుగా వుండేవాడు. అతనికి కుటుంబ పరిస్థితులవల్ల పెద్దగా చదువు సంధ్యలు, వివాహం అమరలేదు. అమ్మగారు ఏవూరు వెళ్ళినా తోడుగావెళ్ళేవాడు. (రెండేళ్ళ క్రితం, సరిగ్గా 24 జనవరి 2019న) ఎనభై ఏళ్ళ వయసులో అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి నిద్రలో సునాయాస మరణం పొందాడు. మాస్టారి కుటుంబమే అంత్యక్రియలు జరిపించారు. ఎవరు ఏపాటి మేలు చేసినా మరువక పోవడమనేది ఘంటసాలవారి సౌహార్ద్రత, వాత్సల్యం. 

వేసవి శెలవులు వచ్చాయంటే 35, ఉస్మాన్ రోడ్ బంధు మిత్రులతో నిండిపోతుంది. మా ఇంటికి వచ్చే అతిధులు కూడా రాత్రిపూట నిద్ర మాస్టారింటి మేడమీదనే. 1959 వేసవుల్లోనే అని గుర్తు, మా నాన్నగారి పినతల్లి కొడుకు గుమ్మా మార్కెండేయ శర్మ. 


గుమ్మా మార్కండేయ శర్మ

మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళున్నారు. ఆయన BA, B.Ed., మాస్టరుగారు. మెడ్రాసంతా చూపించడానికి అతనికి నేనే ఎస్కార్ట్ ను. ఇద్దరమూ కలసి బస్ లో చాల చోట్లకే తిరిగాము.

ఆ సమయంలోనే HMVలో మాస్టారివి రెండు పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అవి రావులపర్తి భద్రిరాజుగారు వ్రాసిన "పాడనా ప్రభూ పాడనా", మరొకటి "జీవితమంతా కలయేనా" ఈ పాటల రికార్డింగ్ కు నేనూ, శర్మబాబు కూడా ఘంటసాల మాస్టారితో వెళ్ళాము. ఆ రికార్డింగ్ సమయంలో తీసిన ఫోటో కూడా ఉండేది. అందులో శర్మ కూడా కనిపిస్తారు. ఈ HMV రికార్డింగ్ స్టూడియో మౌంట్ రోడ్ లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు ఎదురుగా వుండేది. కొత్తగా ఎవరు ఏ సినీమా తీయదల్చిన తమ సినీమాపేరును ఈ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకెవరైనా అదే పేరుతో సినిమా తీస్తే చెల్లుబాటు కాకుండా చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు ఆ ఫిలిం ఛాంబర్ కు ముందు వేపు మౌంట్ రోడ్ లో వుమ్మిడియార్స్ వారి పెద్ద నగల దుకాణం వెలసింది.

HMVకి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ లో 'కోల్ ఇండియా' ఆఫీసు, మరొక పక్క సఫైర్, బ్లూ డైమండ్, ఎమరాల్డ్ థియేటర్స్ కాంప్లెక్స్ ఉండేది. 

ఆ బ్లూ డైమండ్ థియేటర్ ఇండియాలోనే మొట్టమొదటి కంటిన్యువస్ సినీమా థియేటర్. ఉదయం 9 గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు ఒకే సినిమా నాన్ స్టాప్ గా  వేసేవారు. ఒకే టిక్కెట్టు మీద రోజంతా ఆ థియేటర్లో కాలక్షేపం చేయవచ్చు. ఎక్కువగా ఇంగ్లీషు సినీమాలే వేసేవారు. పనీపాటాలేని వారంతా హాయిగా ఇక్కడ కాలక్షేపం చేసేవారు. ఈ సినీమా కాంప్లెక్స్ కు అధిపతులు వీకంసీస్ డైమండ్ జ్యూవెలర్స్ వారిది. ఆ స్థలంమీద రాజకీయ నాయకుల శీత కన్నుపడింది. ఆ కాంప్లెక్సంతా నేలమట్టమై,నిరుపయోగంగా, వివాదాస్పద స్థలమైపోయింది.

ఘంటసాల మాస్టారికి తీరిక చిక్కినప్పుడు భార్యా పిల్లలను ఇంట్లోనివారిని తీసుకొని బీచ్ కు వెళ్ళడం ఆయనకు సరదా. రాత్రి భోజనాలు అయ్యాక ఏ తొమ్మిదింటికో బయల్దేరేవారు. ఒక కారు చాలకపోతే రెండో కారును కూడా తీసేవారు. తమ్ముడు కృష్ణ మాస్టారికోసం ఒక చాప, దిండు కూడా తీసుకువచ్చేవారు. మాస్టారు బయట ఊళ్ళ కచేరీలకు వెళ్ళినప్పుడు ఈ తమ్ముడు కృష్ణే ఎస్కార్ట్. ఇతని గురించి మరోసారి చూద్దాము. ఆ రోజు బీచ్ కు మా నాన్నగారు, నేనూ, శర్మబాబు కూడా వెళ్ళాము (మా నాన్నగారికి అంత ఆమోదయోగ్యం కాకపోయినా. తనవల్ల, తనవారి వల్ల ఘంటసాలవారికి, వారి కుటుంబానికి ఏ అసౌకర్యం కలగకూడదనేది మా నాన్నగారి ధ్యేయం. ఆ విషయం నేనూ ఒక తండ్రినయ్యాకగానీ అర్ధంకాలేదు).

మాస్టారు ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా ఇలియట్స్ రోడ్ చివరన ఉన్న గాంధీ స్టాచ్యూ బీచ్ కే తీసుకువెళ్ళేవారు. దానికి ఎదురుగా IG of Police (now DGP) ఆఫీస్, పక్కనే ఆలిండియా రేడియోస్టేషన్ ఉన్నాయి. కొత్త లైట్ హౌస్  కూడా ఇప్పుడు ఆలిండియా రేడియో కు ఎదురుగా ఉంది.  బిసెంట్ నగర్ లో కూడా ఒక ఇలియట్స్ బీచ్ వుంది. పాతరోజుల్లో, అమెరికన్ కాన్స్లులేట్ ఉన్న స్థలం నుండి మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీ వరకు ఉన్న రోడ్ ను కెథెడ్రల్ రోడ్ అని, (ఈ రోడ్ మీదే మద్రాసులోని మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ చోళా షెరాటన్ వెలసింది) దాని తర్వాత వచ్చే రోడ్ ను ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ అని పిలిచేవారు. ప్రసిధ్ధి పొందిన కళ్యాణీ హాస్పిటల్ కూడా ఈ రోడ్ మీదే  ఉంది. ఆ రోడ్ చివరన గాంధీ బీచ్. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధకృష్ణన్ గారి "గిరిజ" భవనం ఉన్నదీ ఈ రోడ్డే.  ఆ భవనంలో డా.రాధాకృష్ణన్ గారి సమక్షంలో మాస్టారు చేసిన ఒక కచేరీకి నేనూ వెళ్ళాను. ఆయన పేరు మీదుగానే ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ ను డా.రాధాకృష్ణన్ సాలై( వీధి)గా మార్చడం జరిగింది.

మేము బీచ్ కు వెళ్ళే సమయానికి జనసమర్దం వుండేదికాదు ప్రశాంతమైన  చల్లనిగాలితో, వెన్నెల రాత్రిలో బీచ్ లో గడపడం ఎంత హాయిగా, ఆనందంగా ఉండేదో. బీచ్ ఇసకలో ఒక చోట కృష్ణ తెచ్చిన చాప దిండు వేసుకొని మాస్టారు పడుక్కునేవారు. పక్కనే అమ్మగారు, మా నాన్నగారు కూర్చొని మాట్లాడుకునేవారు, కృష్ణ మాస్టారి కాళ్ళు పడుతూండేవారు. పిల్లలందరం వాళ్ళతో సంబంధం లేకుండా పిన్నిగారితో కలసి చాలా దూరం వరకు నడచి వెళ్ళి అక్కడ ఆటలాడే వాళ్ళం. మేము వెళ్ళేముందే మాస్టారు చెప్పేవారు ఒక గంట వరకు రావద్దని. మా నాన్నగారిని కూడా  బీచ్ కు తీసుకు వచ్చారంటే ఏవో పాటల కంపోజింగ్ కు, సంగీతానికి సంబంధించిన చర్చలు జరపడానికే. నా చిన్నతనంలో చాలాసార్లే  మాస్టారి కుటుంబంతో వెన్నెలలో బీచ్ కు వచ్చి ఆనందంగా గడపడం జరిగింది. తిరిగి ఏ పదకొండు గంటల తర్వాత ఇంటికి బయల్దేరేవాళ్ళం.

ఇప్పుడు రోజులు మారిపోయాయి. అదుపుమీరి పెరిగిపోతున్నజనసముద్రం, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యంతో బీచ్ లో మునుపచి ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. ఇంటి దగ్గరున్నా, బీచ్ కు వెళ్ళినా ఒక్కటే అనిపిస్తోంది. ఇప్పటిలా ఆ రోజుల్లో బీచ్ లో సేఫ్టీ, సెక్యూరిటీ ప్రోబ్లమ్ అంటూ ఏ ఆంక్షలు వుండేవి కావు. ఇప్పుడు ఇంట్లోని ఆడవాళ్లతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో బీచ్ కు వెళితే భద్రతే లేదు. అటు ఎన్టీ సోషల్ ఎలిమెంట్స్, ఇటు వారిని కంట్రోల్ చేసే నెపంతో పోలీసుల అథారిటీ. వీటన్నిటితో "బీచ్ పక్కకెళ్ళద్దురా డింగరీ" అని పాడుకోవలనిపిస్తుంది.

1959 లో ఘంటసాల మాస్టారు మరొకసారి సినీమా నిర్మాణానికి పూనుకున్నారు.

 మళ్ళీనా...???

ఆ సినీమా సమాచారం వచ్చేవారం ..... 
                 ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


6 comments:

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

ఈ వారం 35 ఉస్మాన్ రోడ్డు విశేషాలు కొత్త కొత్త పుంతలు తొక్కాయి. పిల్లలు ఉన్న ఇల్లు కన్నా స్వర్గం ఏది అన్నట్లుగా దాదాపుగా ఎనిమిది నుంచి పది మంది పిల్లలు కలకలలాడుతూ ఉస్మాన్ రోడ్డు 35 36 ఇళ్లల్లో తిరుగుతూ ఉండటం వారి విశేషాలు మీరు ప్రత్యేక శ్రద్ధతో వ్రాయడం చాలా హృద్యంగా ఉంది. పిల్లల పట్ల ఘంటసాలగారి అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు చాలా బాగా ఉటంకించారు. బడేగులాం అలీఖాన్ గారి తో, వారి పరిచయం తో, వారికి కచేరీల తో ఇంకా ఎన్నో విశేషాలతో ఈనాటి భాగం చాలా బాగా గడిచింది. మీకు ఎన్నో కృతజ్ఞతలతో మరియు అభినందనలతో!!

P P Swarat said...

నమస్కారం. ధన్యవాదాలు.

Pulijalasanthisree said...

చాలా బాగుంది మీ అనుభవాల మాలిక..ఏకబిగిన చదివించింది... అదృష్ట వంతులు మీరు స్వచ్ఛమైన.. అందమైన..బాల్యాన్ని..మరచిపోలేని అనుభూతులను ప్రోదిచేసుకున్నారు... శ్రీ ఖాన్ గారి పాట వింటుంటే గంధర్వగానమే.. వారి ప్రభావం మాష్టారి మీద చాలావుందని అర్ధమైంది..ఆ రాగప్రస్తారం.. గమకాలు మాష్టారుకూడా అనుసరించారు..ఈ చదివేభాగ్యం వినేభాగ్యం మాకు కూడా అందించినందుకు సర్వదా కృతజ్ఞతలు మీకు

P P Swarat said...

అభినందనలకు అభివాదాలు.

హృషీకేష్ said...

అద్భుతంగా ఉన్నాయి సరస్వతీ నిలయం సంగీత భరిత విశేషాలు. మీ అనుభవాలు, పరిచయాలు మాతో పంచుతున్నందుకు ధన్యవాదాలు. మాకెంతో అనుభూతిని కలుగ చేస్తున్నారు. అభివాదం!!🙏🙏

P P Swarat said...

ధన్యవాదాలు.