visitors

Saturday, June 6, 2020

నెం. 35, ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - రెండవభాగం


నెం. 35, ఉస్మాన్ రోడ్  (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ( రెండవభాగం)

  

                                            నెం. 35, ఉస్మాన్ రోడ్ 
 
                                                                                      - స్వరాట్


ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేముందు నాకు గల అర్హతేమిటో చెపుతానన్నాను.

ఒక మనిషి తనను గురించి పరిచయం చేసుకోవాలంటే , తనకంటూ ఒక స్థాయి , వ్యక్తిత్వం వుండకతప్పదు. అవి లేనివారు తమ వంశవృక్షాలను వెదకి వాటిలోని సారస్వమైన ఫలాలను తనకు ఆపాదించుకొని పదిమందిలో నిలబడాలనుకుంటారు. దీనినే 'చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం' ;  లేదా "మా పెద్దలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి " అని చెప్పడం. ఆ పనే యిప్పుడు నేను చేయబోతున్నాను.  నా యీ మాటలు చదువుతున్నవారికి నేనేదో complexities తో బాధపడుతున్నాననే అనుమానం కలుగుతుంది. నాకలాటి ఆత్మనూన్యతా భావాలేవీ లేవు. ఉన్న వాస్తవం అది. Hypocrisy కి దూరంగా వుండాలనేది నా కోరిక.

మాది ' పట్రాయని'  వారి వంశం. ఈ వంశంలోని పూర్వీకులు ఏదో రాజుగారి కొలువులో ' పట్రాయుడు' పదవి వహించారట. అంటే కొంతమంది సైనికులకు అధిపతి వంటి పదవి. ఆ పట్రాయుడి వంశంలోని వారు పట్రాయనివారుగా మారారు.
ఆ వంశంలో పుట్టినవారు శ్రీ వెంకట నరసింహ శాస్త్రి . ఆయన సంగీతజ్ఞుడు . ఆయన జీవితం చాలావరకు ఒరిస్సాలో ని బరంపురంలో జరిగింది. కర్ణాటక సంగీతంలో కొంత కీర్తన గ్రంధాన్ని నేర్చుకునేందుకు మద్రాస్ లో కొన్నాళ్ళు వున్నారట. ఒరిస్సా లోని అనేక రాజాస్థానాలలో , జమిందారీలలో  కచేరీలు చేస్తూ పండిత సత్కారాలు , సన్మానాలు అందుకున్నారు.ఈయనకు గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రీ నరసింహశాస్త్రి గారికి వయసు మీరాక తన కుమారుడితో సాలూరు లో నివాసం ఏర్పర్చుకున్నారు. సంగీతంలో తండ్రీ కొడుకులిద్దరిదీ వేర్వేరు మార్గాలుగా తోస్తుంది. ఆయనను '  సాలూరు పెద గురువు' గారనేవారు.

ఆయన కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి. వాగ్గేయకారుడు. ఎన్నో కృతులను , చాటు పద్యాలను చందోబధ్ధంగా వ్రాశారు. వీరు  ' సాలూరు చిన గురువుగా లబ్దప్రతిష్టులు. సీతారామశాస్త్రి గారు సాలురులో సొంతంగా భూమికొని దానిలో ఒక చిన్న పర్ణశాల నిర్మించి సంగీత పాఠశాల ప్రారంభించారు. ఆంధ్రదేశమంతా  తిరిగి సంగీత కచేరీలు చేసేవారు.
సీతారామ శాస్త్రిగారికి ముగ్గురు కుమారులు. సంగీతరావు , నారాయణ మూర్తి , ప్రభాకరరావు.
ఈ ముగ్గురు కూడా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే.
ఇలా మూడు తరాల వరకు సంగీతమే వృత్తిగా , ప్రవృత్తిగా , పరమార్ధంగా గల మా పట్రాయని వారి వంశం,  మా నాల్గవ తరానికి వచ్చాక సంగీతాన్నే వృత్తిగా స్వీకరించలేకపోయింది. కారణాలనేకం. అవి అప్రస్తుతం. అయితే అందరూ సంగీతాభిలాష , ఆసక్తి , గౌరవ మర్యాదలు కలవారే. ఇద్దరు , ముగ్గురు ఆడపిల్లలు సంగీతంలో విశిష్టమైన కృషిచేసినవారే.

పెరుగుతున్న కుటుంబం , ఆర్ధిక సమస్యల దృష్ట్యా శ్రీ సీతారామశాస్త్రిగారు (మా తాతగారు) సాలూరులోని స్వంత పాఠశాల వదలి  ఆంధ్రదేశంలోనే ప్రప్రధమ సంగీత కళాశాల అయిన విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించి , తన కుటుంబాన్ని కూడా విజయనగరానికి తరలించారు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఏర్పడిన ఖాళీలో గాత్ర పండితునిగా నియామకానికి పెద్ద పోటీయే వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రముఖ వైలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడుగారు నియమించబడ్డారు. గాత్రపండితునిగా శ్రీ సీతారామశాస్త్రిగారు నియమితులయ్యారు. అయితే ,
ఈ ఆచార్య పదవి ఆయనను అంత సునాయాసంగా వరించలేదు.  విజయనగరం ఎస్టేట్ కలెక్టర్ , పండితుల సమక్షంలో జరిగిన పోటీలో నెగ్గిన తర్వాత శ్రీ సీతారామ శాస్త్రిగారికి గాత్ర పండితుడిగా ఉద్యోగం లభించింది.
అదే పదవిలో శ్రీ శాస్త్రిగారు రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. శ్రీ సీతారామ శాస్త్రి గారిది విలక్షణమైన సంగీతం. ఆయన గానం శుద్ద శాస్త్రీయమైనా  దాక్షిణాత్యపు సంగీతబాణీకి విరుధ్ధమైనది ఆయన గానం , సంగీతం. ఆయన తనకు ప్రక్క వాద్యంగా హార్మోనియం ను తానే వాయించుకుంటూ పాడేవారు. ఆ కారణంగా , ఆనాటి బాణీ విద్వాంసుల మధ్య ఒకరకంగా వెలివేయబడ్డారు.  ఆయన అన్ని రకాల బాణీలలో ఆరితేరినవారే. సంగీత కళాశాల లో విద్యార్ధులకు సంగీతం బోధించేప్పుడు అక్కడి శాస్త్ర మర్యాదలను పాటిస్తూ సిలబస్ ప్రకారమే శిక్షణ యిచ్చేవారు. కళాశాల వెలుపల , కచేరీలలో తన స్వతంత్ర ధోరణిలో గమకయుక్తమైన , భావప్రధానమైన కర్ణాటక సంగీతాన్నే  హార్మోనియం మీద వాయిస్తూ గానం చేసేవారు.  శ్రీ సీతారామ శాస్త్రిగారి  స్వీయ కృతులు రెండు ఓడియన్ రికార్డ్ లుగా వచ్చాయి.

సాలూరి చిన గురువుగారి బాణీ సాహితీ లోకంలో , వారికి ఒక విశిష్టతను , వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టాయి. కచేరీలలో ఆయన గానం చేసే స్వీయ కృతులు , చాటు పద్యాలు విజయనగరం లోని పండితులను , సాహితీవేత్తలను అమితంగా ఆకర్షించాయి. అదే ' కౌముదీ పరిషత్' అనే సాహితీ వేదిక ఆవిర్భావానికి కారణమయింది. శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారే ఆజన్మ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. స్థానిక సంస్కృత కళాశాల పండితులంతా సభ్యులు గా చేరి పదిహేను రోజులకో  నెలకో ఒకసారి సాయంత్రం పూట వెన్నెల వెలుగులో సాహిత్య , సంగీత గోష్ఠి జరిపి తమ కవితలను , కృతులను వినిపించి చర్చలు జరిపేవారు.
ఈ కౌముదీ పరిషత్ కు ' భారతీ తీర్థ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్శిటీ వారి గుర్తింపు లభించింది. ఆ భారతీ తీర్థ రీసెర్చ్ యూనివర్సిటీ వారే
శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారికి , వారి పెద్ద కుమారుడు శ్రీ సంగీతరావు గారికి ' సంగీత భూషణ ' బిరుదు ప్రదానం చేశారు.
శ్రీ పట్రాయని సంగీతరావు గారు తండ్రికి తగ్గ తనయుడు. సార్ధక నామధేయుడు. గురు ముఖఃతా ఆయన నేర్చుకున్న సంగీతం మూడు మాసాలు మాత్రమే. తండ్రిగారి సహచర్యం లో ఆయన గానం వింటూ స్వయంకృషితో సాధించినదే అధికం. హార్మోనియం మీద కర్ణాటక సంగీతాన్ని గమకయుక్తంగా , శుధ్ధ శాస్త్రీయంగా అత్యంత సమర్ధవంతంగా పలికించగల  అతి కొద్దిమంది విద్వాంసులలో ఒకరుగా శ్రీ సంగీతరావు పేరు పొందారు. తన 16 వ ఏట నుండే స్వతంత్రంగా హార్మోనియం మీద జంత్రగాత్ర కచేరీలు చేయడం ప్రారంభించారు. శ్రీ సంగీతరావు గారు ఆంధ్రదేశానికి చెందిన మరో విలక్షణ విద్వన్మణి సంగీత సుధాకర శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సీనియర్. వయసులో పది సంవత్సరాలు పెద్ద.
ఆలిండియా రేడియో ప్రక్క వాద్యంగా హార్మోనియం ను నిషేధించిన కారణంగా శ్రీ సంగీతరావు ఆలిండియా రేడియోను తనకు తానే దూరం చేసుకున్నారు.  శ్రీ సంగీతరావు గారి  గానవిద్వత్ ప్రదర్శనకు ఆకాశవాణి ఏనాడు వేదిక కాలేదు.   సంగీత ప్రసంగాలకు మాత్రం వారిని ఆహ్వానించేవారు.అది శ్రీ సంగీతరావుగారి వ్యక్తిత్వం.
తన స్వయంకృషితో నే వీణ , వైలిన్ వాద్యాల మీద పట్టు సాధించారు. వారికి తండ్రిగారి వారసత్వం వలన సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం లభించింది. ఆంధ్రదేశంలోని ప్రముఖ కవులు రచయితలతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది.
శ్రీ పట్రాయని సంగీతరావుగారికి ఆ పేరు నెలల పిల్లాడిగా వున్నప్పుడే అనుకోకుండా పెట్టబడింది. ఆ పేరు తోనే సంగీతలోక ప్రసిధ్ధులైనారు. స్కూల్ రికార్డ్స్  లో నమోదైన పేరు నరసింహమూర్తి.  అది వారి తాతగారి పేరు.

నేను శ్రీ సంగీతరావుగారి పెద్ద కుమారుడిని.  నా తర్వాత , మంచి సంగీతం పట్ల అభిరుచి, ఆసక్తి గల ఒక సోదరుడు , ముగ్గురు సోదరీమణులు వున్నారు.

దీనికి , మన పాటల దేవుడికి ఏమిటి సంబంధం , ఎందుకీ అక్కర్లేని సొద అని మీరు భావించినా భావించవచ్చు. కానీ , కారణం వుంది . ఘంటసాలగారి గురించి అర్ధం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు , కొంతమంది వ్యక్తుల గురించి కూడా అవగాహన కావాలి. అందుకే ఈ ఉపోధ్ఘాతం.

శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో గాత్ర ఉపన్యాసకుడిగా ప్రవేశించిన కొద్ది నెలలకు , వేసంగి శెలవులలో, కళాశాల మూసివేసివున్న తరుణంలో ఓ పధ్నాలుగేళ్ళ వయసున్న, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి సంగీతం నేర్చుకోవాలని , విజయనగరం చేరుకున్నాడు.

అప్పుడేం జరిగింది ?
                            .... (సశేషం - రెండవభాగం)

నెం.35, ఉస్మాన్ రోడ్ - ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక - అధ్యాయం 1 - మొదటిభాగం

మొదటి భాగం -

                        నెం. 35, ఉస్మాన్ రోడ్
                  -    స్వరాట్ 

ఆజన్మాంతం నేను సదా గుర్తుంచుకునే సంఖ్యలు చాలానే వున్నా అతి ముఖ్యమైనవి మాత్రం రెండే రెండు -
ఒకటి 35 , రెండవది 25.
35 ఉస్మాన్ రోడ్ గాన సరస్వతికి నిలయం.
25 సాంస్కృతిక నిలయం.
నేనేదో మీకు ఆసక్తి కలిగించే విషయాలు చెపుతానని అనుకోవడానికి కారణం నెం. 35 ఉస్మాన్ రోడ్.

ఇక, నాలాటి ఇంట్రావెర్ట్ ను చేరదీసినాలో కూడా  ఏదో టాలెంట్ వుందని ప్రోత్సహించి , నాచే నాలుగు మంచి పనులు చేయించిఅందరిలో నాకుకొంతలో కొంత గుర్తింపును యిచ్చినది నెం. 25. ఈనాడు, యిన్ని సమూహాలలో ఏవో నాలుగు మాటలు వ్రాయగలగడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్నిచ్చింది నెం. 25, మెలనీ రోడ్ .

ఈ రెండు నెంబర్లు గల స్థలాలలో ఏభైఏడేళ్ళ జీవితం గడిచింది. ఈ రెండు చోట్లా ఒక మంచి మనిషిగా జీవించడానికి కావలసిన అనేక మంచి పాఠాలు నేర్చుకున్నాను.

 ఎక్కడ వున్నాఎంత ఉన్నత స్థితిలో వున్నా గతం మరువద్దు. అహం వద్దు. ఆత్మవిశ్వాసం పెంచుకో. వినయంతో పాటూ వ్యక్తిత్వం కావాలి.  వివాదాలకు దూరంగా వుండు. అడుగు నేలమీదే వుండనీ . మంచి చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగు.
ఇటువంటి భావాలు నాలో పెంపొందడానికి ఎంతో దోహదం చేసిన ఆ 25 మీద నాకున్న కృతజ్ఞతకు సూచకంగా,  25 వ తేదీ నుండి మన సమూహంలో యీ కొత్త శీర్షికను  ప్రారంభిస్తున్నాను.

ఒకనాడు నెంబర్ 35 ఉస్మాన్ రోడ్, టి.నగర్, మద్రాస్-17, మెడ్రాస్ మహా నగరంలో సుప్రసిధ్ధం. గాన సరస్వతికి నిలయం. అదే, గానగంధర్వుడిగా, అమరగాయకుడిగా ప్రపంచ నలుమూలలావున్న తెలుగు వారందరి హృదయాలలో  సుస్థిరస్థానం ఏర్పర్చుకొని చిరంజీవి గా ప్రకాశిస్తున్న పాటల దేవుడు 'ఘంటసాలనివాస గృహం.

ఈ సంగీత కళాలయంలోని విశేషాలు  ఒక తెఱచిన పుస్తకం. లోకవిదితం. ఇప్పుడు
నేను కొత్తగా కనిపెట్టి, చెప్పగలిగే విశేషాలేవీ వుండవు. అనేకమంది, అనేక సందర్భాలలో, అనేక చోట్ల చెప్పినవే. అందులో కొన్ని మన సమూహంలో గతంలో చెప్పుకున్నవే.
కానీ35 నెంబర్  ప్రాంగణంలో పెరిగానన్న ఒకే కారణంతో, పెద్దలంతా మరింకే విషయాలైనా చెపుతాననే ఆసక్తితో ఈ శీర్షికను నాకు అప్పగించారు. ఆ మహా గాయకుడి సంగీతం గురించి చెప్పే సాహసం నేను చేయలేను. చేయను కూడా.

అందుకనే ఈ శీర్షికకు '' నెం. 35 ఉస్మాన్ రోడ్ '' అని  పేరు పెట్టాను. ఈ ప్రాంగణంలో సుమారు ఇరవై సంవత్సరాల పాటు , ఘంటసాలవారి కాలంలో నేను విన్న విషయాలను, పొందిన అనుభవాలను నాకు జ్ఞాపకమున్నంత వరకు , నాకున్న పరిధిలో వారం వారం నాకున్న భాషా పరిజ్ఞానంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఘంటసాలవారి ని ఒక మహా గాయకుడిగా కంటే , ఒక నిరాడంబర కుటుంబీకుడిగా చూపించే ప్రయత్నం చేస్తాను.
ఏ రకమైన అభూతకల్పనలు లేకుండా , ఏ విధమైన సంచలనాలు లేకుండా ఒక సాదా కుటుంబగాధా చిత్రంగానే , ఈ కధనం సాగుతుంది. సహృదయ సభ్యులంతా ఆమోదించి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.

ఇంతకూ , నెం. 35 ఉస్మాన్ రోడ్ లోకి నేను ప్రవేశించిన ముచ్చట్లు  చెప్పడానికి నాకు గల అర్హత ఏమిటో చెప్పుకోవాలి. అది ముందు చెప్తాను. 
(సశేషం)

Friday, April 3, 2020

సొగసు తెలుగు పాటల రేడు - భుజంగరాయడు




 రంగులరాట్నం చలనచిత్రంలోని "ఇంతేరాఈ జీవితం - తిరిగే రంగుల రాట్నము" అనే పాట చాలా మంది వినే ఉంటారు. ఎంతో తేలికైన మాటలతో జీవన సారాంశాన్ని  తాత్త్విక చింతనతో కాచివడబోసిన పాటగా ఇప్పటికీ తలచుకుంటారు. 

అయితే ఆ పాట రచించిన కవి ఎవరో చాలామందికి  తెలిసి ఉండక పోవచ్చును. ఆయనే శ్రీ రామ వెంకట భుజంగరాయ శర్మగారు.  


1925లో గుంటూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బియే ఆనర్స్ చదివి మద్రాసు (ఇప్పటి చెన్నై) లోని  పచ్చప్పాస్ కళాశాలలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసారు. తరువాత కావలిలో ఒక మిత్రుడితో కలిసి విశ్వోదయ కళాశాలను స్థాపించి అందులో  తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసారు. ఆయన  గొప్ప కవిగానే కాక నటుడిగా, చిత్రకారుడిగా మంచి వక్తగా పేరుపొందిన వ్యక్తి. శ్రీ వెంపటి చినసత్యం  స్థాపించిన కూచిపూడి నాటక అకాడెమీ వారు ప్రదర్శించిన ఎన్నో నాట్య రూాపకాలను భుజంగరాయశర్మగారు రచించారు.

 కూచిపూడి నాట్యరూపకాలకు మూలాధారమైన  త్రిమూర్తులు కావ్య రచనలు చేసిన భుజంగరాయశర్మగారు,  సంగీత రచన చేసిన పట్రాయని  సంగీతరావుగారు, వాటిని అద్భుతంగా ప్రదర్శించిన వెంపటి చిన సత్యంగారు.  వీరి ముగ్గురి కలయికతో  ఈ నాట్యరూపకాలు ఆధునిక యక్షగానాలుగా ప్రసిద్ధి పొందాయి. దేశ విదేశాలలో తెలుగు సాంస్కృతిక కీర్తి పతాకాన్ని దిగ్విజయంగా ఎగరేసాయి.

 సంగీతరావుగారు -భుజంగరాయ శర్మగారు   వీరిరువురి స్నేహం - సంగీత సాహిత్య సమ్మేళనం. పూవు తావిల అనుబంధం. శతవసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో సంగీతరావుగారిని  భుజంగరాయశర్మగారితో పరిచయం, స్నేహం  గురించి అడిగినప్పుడు వారు చెప్పిన ముచ్చటలు మరోసారి చెప్పుకుందాం. 


భుజంగరాయశర్మగారు రచించిన ఎన్నోలలిత గీతాలు కూచిపూడి యక్షగానాలలోను, ఆలిండియారేడియో ద్వారాను ప్రసిద్ధి పొందినవే.

 కానీ ఇక్కడ వివరించబోయే పాట, ఒక  ప్రత్యేకమైన పాట. ఇంత వరకు ఇది రికార్డుగా వచ్చిన దాఖలాలు లేవు.


 వెంపటి చిన సత్యంగారి కూచిపూడినాటకాలను దేశ విదేశాల్లో ప్రదర్శించారు. ఆ నృత్యబృందంతో పాటు  సంగీతరావుగారు, భుజంగరాయశర్మగారు వీరిద్దరూ  కలిసి ఎన్నో   విదేశపర్యటనలు చేసారు. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలాంటి ఒకసందర్భంలో  ఒకబస్ ప్రయాణంలో అప్పటికప్పుడు  భుజంగరాయశర్మగారు ఒక  పాటను రాసి, తనకు చూపారని అప్పటికప్పుడే

ఆ పాటను రాగమాలిక లో స్వరపరిచానని చెప్పారు సంగీతరావుగారు.

"ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాట"  అంటూ సాగే ఈ పాటలో ప్రతి పదమూ తేనెలో ముంచిన  రసగుళికే. ప్రతి పాదంలోను విరిసే భావన అచ్చతెలుగుదే. 
పాటలో  మొదట వచ్చే  పల్లవి -
  ఎన్ని సొగసులమూట
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకు   
ఈ పల్లవితోనే తెలుగు పదానికి, భావానికి పట్టం కట్టడం ప్రారంభమవుతుంది. తెలుగు అజంత భాష కావడం వలన శ్రవణసుభగంగా ఉంటుందని, తెలుగుమాట తేనెలాగా తీయగా ఉంటుందని, తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని తెలుగుభాష సొగసు గురించి విదేశీయులు కూడా పొగిడారు. అటువంటి తెలుగు మాటలతో కూడిన  తెలుగు పాట ఎన్నో సొగసుల మూటే మరి. తెలుగునుడికారం,తెలుగు సంస్కృతి సంప్రదాయాలు,  అన్నిటినీ  ప్రతిబింబించే విధంగా పాటలోని తరువాతి చరణాలు సాగుతాయి.

  గొబ్బెమ్మ సిగలోని
  గుమ్మడీ పూవులా
  గుమ్మడీ మదిలోని 
  మంచు కోరికలా

 సంక్రాంతికి కన్నెపిల్లలు చక్కని మొగుడు కావాలని, రావాలని  నోములు నోచి ముగ్గులు పెట్టి ఆ మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి  ఆటలు ఆడతారు. ఆ గొబ్బెమ్మల పైన  పసుపురంగు గుమ్మడిపూలను ఉంచుతారు.  ఈ తెలుగు పండుగను గుర్తుచేసేదే రెండో చరణం. గొబ్బెమ్మను చేసి  పైన తురిమే గుమ్మడి పూలలో కనిపించే శీతాకాలపు  తుషార బిందువును  అమ్మాయి మనసులో కాబోయే భర్తగురించి కలిగే కమ్మని ఆలోచనగా సూచిస్తూ గుమ్మడీ మదిలోని  మంచుకోరికగా వర్ణించారు. 
  తొలికారు మబ్బులో 
   పులకించు ధాత్రిలా
   ధాత్రి ఎదలో మేలుకొను
   పంటసిరిలా
తరతరాలుగా భూమి ఆకాశం తెలుగుకవులకి ప్రేయసీ ప్రియులే.  మబ్బులు కమ్మిన ఆకాశం చినికే వానచినుకులు తన ప్రేయసి భూమి పైన చిలికే పన్నీటి జల్లులే.  గ్రీష్మంలో చెమ్మను  కోల్పోయి నెర్రెలు విచ్చిన భూమిని మరల పదును చేసిన రైతులు  తొలికారు  మబ్బులు కమ్మి జలజలా వాన ఎప్పుడు కురుస్తుందా అని విత్తనాలు వేసి ఎదురుచూస్తారు. ఆ సందర్భాన్ని వర్ణించే చరణం ఇది. తొలికారు మబ్బులు కమ్మి వాన కురిస్తే నేల పులకరిస్తుంది. విత్తిన విత్తనాలన్నీ మొలకలెత్తి  పంటసిరిగా మారి రైతులకు సిరి సంపదలిస్తాయి. తెలుగు ప్రాంతాలలో వ్యవసాయం ప్రారంభమయ్యేది తొలికారు లోనే కదా.      
  తలుపుదగ్గర చెప్పు 
  తన మగనిపేరులా
 పేరులో తారాడు 
  మన్మథుని రూపులా 

తొలిసారి వరుడి చిటికెనవేలు పట్టుకొని అత్తగారింటిలో గృహ ప్రవేశం చేసే నవవధువును భర్తపేరు చెప్పమని ఆ గుమ్మంలో నిలబెట్టి అడగడం  మన తెలుగు పెళ్ళిళ్ళలో వేడుక, ఒక సంప్రదాయం. వధువు భర్త పేరు చెప్పడానికి సిగ్గు పడడానికి కారణం ఆమె మనసులో మన్మధుని రూపులా  తన భర్త రూపం  గోచరించడమే.

గోదారి ఒడిలోన 
నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ
పాల వెన్నెలలా

తెలుగుదేశంలో ప్రవహించే గొప్ప నది గోదావరి. తెలుగువారి పలుకుబడి గోదారి.తరతరాలుగా ఈ భారతదేశంలో నీరిచ్చే నదులను, పాలిచ్చే ఆవులను మనని పెంచి పోషించే తల్లితో పోల్చి గౌరవించడం  సంప్రదాయం. గోదావరి నదిలో చంద్రోదయ మైనప్పుడు ఆ సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం. మరి  గోదారి తల్లి అయితే  ఆమె కడుపున ఉదయించే  బాలచంద్రుడిని ఆమె పాపగా ఊహించినప్పుడు  ఆవెన్నెల వెలుగులు, ఆ పాపాయి పాల చెక్కిళ్ళు చిందే కాంతులే .

 భద్రాద్రి రాము 
 నెన్నుదిటి కస్తూరిలా
 కస్తూరి మనసులో
 కారుణ్య రేఖలా

భద్రాద్రిపై వెలసిన రాముడు తెలుగింటి దేవుడు. ఆ రాముడి నుదిటిపై వెలిగేది,రెండు ఊర్థ పుండ్రాల నడుమన  కస్తూరి తో తీర్చిన ఎర్రని నామము.రాముడి  నెన్నుదిటిపై (అందమైన నుదురుభాగం) తీర్చే మూడు నామాలలో  తెల్లనిరెండు నామాలు మనిషిలో పెంచుకోవలసిన సత్త్వగుణాలకు ప్రతీకలుగా,మధ్యలో  కస్తూరితో తీర్చే ఎర్రని రేఖను మనిషి లోని అనురాగాన్ని, మోహాన్నిపెంచే రజోగుణానికి ప్రతీకగా భావిస్తారు హైందవులు. రాముడి  మనసుకూడా కస్తూరిలా పరిమళభరితమయినది. నామంలోని ఎరుపు రేఖలా ప్రేమాస్పదమైనది.  చల్లనితండ్రి తెలుగింటి రాముడు. ఆ భద్రాద్రి రాముడి నుదిటిపై  కస్తూరితో తీర్చే ఎర్రని రేఖ, మనందరినీ చల్లగా కాచే కారుణ్యరేఖ. 

ఎంతో సొగసైన తెలుగు పాటల గురించి  పాట రాస్తూ, ఆ  పాటలోనే ఎంతో  సొగసైన తేనెలొలికే  తెలుగు మాటలను వాడారు భుజంగరాయ శర్మగారు. సొగసుల మూట, మంచు కోరిక, మగని పేరు, తారాడు మన్మధుని రూపు, మేలుకొను పంటసిరులు,తొలికారు మబ్బులు, నెలవంక పాప, పాల వెన్నెలలు, నెన్నుదురు  ... 

ఓహోహో !! ఎన్నిచక్కని తెలుగుపదాలు. ఎంత కమ్మని తెలుగురసాల ఊటలు. తెలుగు భాషామతల్లికి భుజంగ రాయ శర్మగారు ఇచ్చిన మంగళ హారతి కదా  ఈ పాట.


లలిత లలితమయిన అలతి అలతి పదాలతో కూర్చిన  ఈ చక్కని  పాటకి ఇంచక్కని  రాగ వరుసలు కూర్చారు - 
శ్రీ పట్రాయని  సంగీతరావుగారు. సంగీతరావుగారి  అమ్మాయి, గాయని,  శ్రీమతి కొచ్చెర్లకోట  పద్మావతి  ఈ పాటను అతి మధురంగా గానం చేసారు. ఆ పాట  లింక్ ఇక్కడ.

     
     

            
     
        
        

         

శ్రీ సంగీతరావుగారి జ్ఞాపకాలలో శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు

                                     
                                   శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు       

                                                                                                                                                                                                                  -  పట్రాయని సంగీతరావు


తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నృత్యనాటకం శ్రీనివాస కల్యాణం పేరుతో ప్రదర్శించాలని సంకల్పించింది. నృత్య నిర్వహణ వెంపటి చిన సత్యంగారికప్పగించింది. దీనికి సలహాదారు బి.ఎన్. రెడ్డిగారు, రచయిత ఎస్. వి. భుజంగరాయ శర్మగారు. సంగీత నిర్వహణ ద్వారం భావనారాయణగారు. ద్వారం భావనారాయణగారికి సహాయకుడిగా నన్నాహ్వానించేరు. ఆయన అంతకు పూర్వం శాకుంతల నృత్యనాటాకానికి సంగీత నిర్వహణ చేశారు.

శ్రీనివాస కల్యాణంలో రెండు సీన్లు పూర్తయ్యాయి. భృగుమహర్షి త్రిమూర్తుల యోగ్యతను పరీక్షించడం ప్రారంభమయింది. మహేశ్వరుణ్ణి పరీక్షించడానికి రావలసి ఉన్నది. పరమేశ్వర ప్రార్ధన శ్లోకం ప్రారంభమయింది. వాసంత ప్రసవీకృతైందవకళమ్ చూడాకలాపోన్నతమ్ – మాటలన్నీ లలితంగా, శ్రవణపేయంగా వినిపించేయి. కృతైందవకళమ్–  ఇందుశబ్దానికి తధ్ధిత రూపం ఐందవా’ ? అని అడిగాను. తధ్ధిత రూపమనే వ్యాకరణ పారిభాషిక పదంతో కూడిన ప్రశ్న నా నుంచి రావడం శర్మగారికి వింతగా వినిపించింది. ఈ సంఘటన తరవాత నన్ను సాహిత్యాభిలాషిగా గ్రహించేరు. అప్పటినుంచి ఏది రికార్డు చేయవలసి వచ్చినా, ఆ సాహిత్యాన్ని ముందుగా నాకు వినిపిస్తూ ఉండేవారు.

ఆయన చాలా సహృదయుడు. స్నేహాభిలాషి. భాషలోను, భవంలోను ఉత్తమ సంస్కారం కలిగినవాడు. క్రమంగా – భావనారాయణగారు మద్రాసులో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేకపోవడంతో – పద్మావతీ శ్రీనివాసం – నృత్యనాటాకానికి సంగీతం నేనే నిర్వహించవలసీ వచ్చింది. శర్మగారు ఏది రాసినా లలితంగా, సుకుమారంగా వినిపించేది. వెంటనే దానికి సంగీతం అమర్చడానికి ఎంతో ఉత్సాహం కలిగేది.

నాటకరంగ విభజనలో, పాత్రపోషణలో ప్రదర్శన సంబంధమైన అంశాలు అన్నిటిలోను సత్యంగారు, శర్మగారిని సంప్రదిస్తూ ఉండేవారు.

ఆ రోజుల్లో కావలి కాలేజీలో ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి గారూ పనిచేవారు. హనుమఛ్ఛాస్త్రి గారూ, పిలకా గణపతిశాస్త్రిగారూ విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్ధులుగా ఉండినప్పుడు పంతుల లక్ష్మీనారాయణ గారు శతవృధ్ధులు.

నవ్యకవిత్వం ఆవిర్భవించిన రోజులవి. నవ్యకవిత్వం పట్ల ఇంద్రగంటి వారికీ, పిలకావారికి సానుభూతి ఉండేది. ఆనాటి ముచ్చట్లు నేను కొన్ని విన్నాను. శర్మగారికా ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఆ కబుర్లు పొడిగించాలని ఉండేది శర్మ గారికి.

శ్రీ వెంపటి చిన సత్యం గారు శర్మ గారి సాహిత్యమే కాకుండా, ఆయన సాన్నిహిత్యమూ కోరుకునేవారు. ఆ కారణంచేతే అకాడెమీ నృత్యనాటకాలు ఎక్కడ జరిగినా, శర్మగారి తోడ్పాటు ఉంటూ ఉండేది.

ఆ రోజుల్లో – అవతల కెనడా నుంచి ఇవతల ఫ్లోరిడా దాకా సంచారం జరిగింది. ఈ ప్రయాణాలన్నీ గ్రేహౌండ్బస్సులోనే. శర్మగారూ మాతోటే ప్రయాణం చేసేరు. ఆయన నాకు దగ్గరగా ఉండేవారు.
ఆ బస్సులోనే –
  ‘ఎన్ని సొగసుల మూట 
  మా తెలుగు పాట
  ఎంత తేనియలొలుకు 
  మా తెలుగు పలుకూ
అనే పాట రాసి చూపించేరు నాకు శర్మగారు. నాకది వెంటనే పాడి వినిపించాలనిపించింది. రాగమాలికలో చేశానాపాట.

ఆ పాట ఇదీ –
పల్లవి – రాగం పీలు
ఎన్ని సొగసుల మూట మా తెలుగు పాటా
ఎంత తేనియలొలుకు మా తెలుగు పలుకు       llఎన్నిll


చరణం 1 – రాగం పీలు
తొలికారు మబ్బులో పులకించు ధాత్రిలా
ధాత్రియెదలో మేలుకొను పంటసిరిలా              llఎన్నిll
చరణం 2 – రాగం పీలు
గొబ్బెమ్మ సిగలోని గుమ్మడీ పూవులా
గుమ్మడీ మనసులో మంచు కోరికలా              llఎన్నిll
చరణం 3 – రాగం జంఝూటి
తలుపు దగ్గర చెప్పు తన మగని పేరులా
పేరులో తారాడూ మన్మథుని రూపులా            llఎన్నిll
చరణం 4 – రాగం మోహన
గోదారి ఒడిలోని నెలవంక పాపలా
నెలవంక చెక్కిళ్ళ పాల వెన్నెలలా                  llఎన్నిll

చరణం 5 – రాగం మధ్యమావతి
భద్రాద్రి రాము నెన్నుదుటి కస్తూరిలా
కస్తూరి మనసులో కారుణ్య రేఖలా                  llఎన్నిll

– ఇలా ఏ పాట రాసినా లలిత సుందరమైన ఆ శైలి మనసునెంతో ఆకట్టుకుంటుంది.
శర్మగారెప్పుడు ఏ పనిమీద మద్రాసు వచ్చినా ఆయనతో సత్కాలక్షేపం అవుతుందనే ఆశ నాకుండేది.
18-03-2020
ఉదయం  11 గంటలకు
నాన్నగారు చెపుతుండగా రాసిన వ్యాసం
-      కె వి రమణమ్మ 

Wednesday, March 25, 2020

సాధకుడు బోధకుడు విద్వన్మణి- నూకల చినసత్యనారాయణ


                     


సంగీతరావుగారు సమకాలీనులైన కళాకారులను పరిచయం చేస్తూ, వారి కళాప్రదర్శనలోని లోతుపాతులను వివరిస్తూ ఎన్నో ప్రామాణిక వ్యాసాలను రాసారు. 1976 సం.లో ఆంధ్ర ప్రభ దినపత్రిక లో ఈ వ్యాసపరంపర ప్రచురితమైంది. అప్పటి వ్యాసాలలో ఆయా కళాకారులగురించి సంగీతరావుగారు వివరించిన విశేషాలు తెలుసుకోగోరేవారికోసం ఇక్కడ మళ్లీ ప్రచురిస్తున్నాం. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి వంటి ఎందరో మహావిద్వాంసులను పరిచయంచేసిన ఆ వ్యాస పరంపరలో నూకల చినసత్యనారాయణగారి విద్వత్తును వివరించే వ్యాసం ఇది.

ఆంధ్రప్రభ – డిసెంబర్ 12, 1976, విజ్ఞాన వేదిక
                                  రాగపస్తారంలో స్వతంత్రుడు
         నూకల చిన సత్యనారాయణ
సంగీతం శాస్త్రంగా, వృత్తిగా పరిగ్ర్యహించి పరిపూర్ణమైన సత్ఫలితాలను సాధించిన పట్టభద్రుడు శ్రీ నూకల సత్యనారాయణ. కర్ణాటక సంగీత రసికులకు ఈనాడు శ్రీ సత్యనారాయణ సంగీతం ఎంతో కుతూహలం, ఆసక్తి ఉన్నాయి. సుశ్రావమైన ఆయన కంఠస్వరమూ, రాగతాళములలో గల స్వాతంత్ర్యమూ, సరసత, కచేరీ నిర్వహించడంలో గల అభినివేశమూ శ్రీ సత్యనారాయణ సంగీతంలోని సహజ ఆకర్షణ.

మూడు పదులు దాటిన శ్రీ సత్యనారాయణ సంగీత జీవితానుభవం గణనీయమైనది. సంప్రదాయ సంగీతం సక్రమమైన పధ్ధతిలో గురుముఖతః సాధనచేసిన శ్రీ సత్యనారాయణ సంగీతం ఆయనను ప్రభావితం చేసిన అనేక మంది విద్వాంసుల ప్రతిభతో తాదాత్మ్యం చెందడం ఆయన రసజ్ఞతను, సహృదయాన్ని వ్యక్తం చేస్తుంది. కళాపరంగా ఎక్కడ ఏ మంచి వినిపించినా దానిని గ్రహించడం వలన శ్రీ సత్యనారాయణ పాండిత్యంలో ఎంతో వైశాల్యమూ, గాంభీర్యమూ ఏర్పడ్డాయి. ఈవిధమైన పాండిత్యం ఉత్తమ గురుత్వానికి లక్షణం.

శ్రీ సత్యనారాయణ మొదట వాయులీన వాదకులైన తరవాతనే గాయకులయ్యారు. వాద్యనైపణ్యం కూడా కలిగిన గాయకుడిలో శాస్త్రియంగా సునిశితమైన అవగాహన, సుస్ఫష్టమైన గమకస్ఫూర్తి ఉంటాయి.




పరిశోధన
శ్రీ సత్యనారాయణ సంగీతశాస్త్రంలో పరిశోధనలు సలిపిన పండితులు. భారతీయ సంగీతంలోని రాగవిధానానికి సంబంధించిన దాక్షిణాత్య, ఔత్తరాహ సంగీతసంప్రదాయ రీతుల తులనాత్మక పరిశీలన వారి ప్రత్యేక కృషి.

రాగవిధానం భారతీయ సంగీతం విశిష్ఠత నిరూపస్తుంది. భారత హృదయ సంవేదన రాగవిధానంలోనే సంగీతమయంగా వ్యక్తం అవుతుంది. రాగములు దేవతామూర్తులుగా ధ్యానించబడ్డాయి. అనేక రాగములు రూపకల్పన చేయబడి చిత్రీకరించబడ్డాయి.

రాగనిర్వచనం
రాగం అంటే ఏమిటి? ఆరోహణావరోహణ క్రమంలో గల స్వర సముదాయం అని స్థూలంగా చెప్పడం కన్న, రాగం అంటే సంగ్రహరూపంగా ఉన్న ఒక స్వర రచన అని అనడం ఉచితం. అయితే, ఆ రచన గాయకుని ఊహాపోహలననుసరించి సంకోచ వ్యాకోచాలకు అవకాశం కలిగిస్తుంది. అనేక రాగాలకు రసనిర్ణయం జరిగింది. అయితే ఆ నిర్ణయం సక్రమంగా అనుసరించబడలేదు. నిజానికి వివిధ రసములకు లక్ష్యప్రాయమైన స్వరరచనలు లేవు. యక్షగానాలలోను, నాట్యరూపకములలోను ఆయా రాగాలను వివిధ రస నిష్ప్తత్తికి పోషించేవారేమో? ఆయా రసభావములను పోషించే సందర్భంలో తీవ్ర, కోమల స్వరసమ్మేళన గాయకుని సరసమైన ప్రతిభే ప్రధానంగా ఉంటుంది. రసనిష్పత్తికి రాగప్రాధాన్యాన్ని చెప్పినట్టు, తాళప్రాధాన్యాన్ని చెప్పడం కనబడదు. అనుభవంలో తాళప్రాధాన్యం ఎంతో కనిపస్తుంది. రసభావపోషణలో రాగముల పరిధి నిర్ణయించడం పరిశోధకుల సమస్య. అనేక ప్రసిధ్ధ రాగములు శతాబ్దుల తరబడి ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాలక్రమాన మేళకర్త పధ్ధతి అనుభవంలోకి రావడం, దానిని బట్టి అనాదిగా వస్తూన్న రాగాలను ఆయా మేళకర్తలకు సంబంధించి వర్గీకరించడం జరిగింది. మేళకర్త విధానం అమలులోకి వచ్చిన తరవాత ఔడవషాడవ భేదాలననుసరించి ఏర్పడ్డ రాగాలు వేలకు వేలు తయారయాయి. వీటన్నిటికీ పేర్లు పెట్టవలసి రావడం ఒక సమస్యే. కారణం – చందోబధ్ధంగా ఏర్పడ్డ ఆయా రాగాలకు అనుభవంలో లేకపోయినా, వేల సంఖ్యలో నామకరణం చేయవలసి ఉంటుంది గదా! అయితే, ఎన్ని పుస్తకాల్లో వెతికినా అన్ని వేల రాగాలు కనబడవు. మనకి కావలసిన మూర్ఛనకి సరిపడే పేరు పుస్తకాల్లో కనబడకపోతే ఏ శక్తిప్రియఅన్న పేరో పెట్టుకోవలసి ఉంటుంది. ఆరోహణావరోహణ క్రమంలో వక్రసంచారంలో ప్రతి చిన్న మార్పును వేరే రాగంగా వ్యవహరించవలసి వస్తుంది.

ఒక రాగం శ్రవణయోగ్యంగా ఉండడం, ఆ రాగంలోని స్వరసంబంధ పరస్పర సంవాది, అనువాది రూపంగా ఉండడం గ్రహించగలుగుతాం. ఈ ప్రాతిపదిక మీద రాగవిధానం పునః పరిశీలించడం అవసరమేమో? ప్రతి చిన్న సంచారాన్నీ ప్రత్యేక రాగంగా పేర్కొనడం కన్నా ఈనాడు వివిధ రాగములుగా పేర్కొనబడిన రాగాలను సమన్వయపఱచి ఒకే రాగంగా విస్తృతపరచవచ్చునేమో! శ్రీ సత్యనారాయణగారి వంటి పరిశోధకులు వివరించవలసి ఉంటుంది.

రాగమేళనం    
ఈనాడు ఉత్తరాది సంగీతంలో రెండు భాగాలుగా గానం చేయడం ఒక ప్రక్రియగా అమలులోకి వచ్చి ఉంది. రాగవిధానం వలన నిర్దిష్టమైన రాగభావములకు ప్రత్యేకత ఏర్పడడం జరిగింది. ఆ రాగ స్వరూపానికి స్కాలిత్యం ఏర్పడకుండా అచంచలమైన లక్షణం ఏర్పడింది. గ్రహస్వరం, న్యాసస్వరం, అంశస్వరములను నిర్ణయించి ఆ రాగ స్వరూపానికి మార్పులు, చేర్పులకు అవకాశంలేకుండా చేయబడింది. దీనివలన ఆయా రాగాల స్వరూపాలు నిర్దిష్టంగా ఏర్పడ్డా, ఆయా రాగములలో రచింపబడిన రచనలలో వైవిధ్యం లోపిస్తుంది. ఒకే రాగంలో ఉన్న అనేక రచనలలో ఉన్న రాగభావం ఒకటే. ఒక కీర్తన గాంధారంలో ప్రారంభం అయితే, మరొకటి షడ్జమంలో ఎత్తుగడ జరిగిందనే తృప్తి తప్పిస్తే మరేమీలేదు.

అందుచేతనే రాగభావములను ఆధారం చేసుకున్న ఆయా రచనలలో స్వరరచయిత భావనకు అవకాశంలేదు. ఇంతకు పూర్వం శతాబ్దులుగా ప్రచారంలో ఉన్న రాగభావన్ని సాహిత్యానికి అమర్చడమన్నదే ప్రధానం. ఆయా విషయాలను వివరంగా రసికులు గ్రహించడానికి శ్రీ సత్యనారాయణగారు వంటి పండితుల పరిశోధనలు ఎక్కువ ఉపకరిస్తాయి.

శ్రీ సత్యనారాయణ ప్రథమశ్రేణి గాయకులు. అనేక సంగీత కచేరీలు చేసి, రసికుల మన్ననలు పొందారు. రేడియో జాతీయ కార్యక్రమాల్లో తమ సంగీతం వినిపించారు. అనేక సంగీత రూపకములకు సంగీత సారథ్యం వహించారు. ప్రభుత్వ మర్యాదలననుసరించి అనేక సత్కారాలు పొందారు. పీఠాధిపతుల ఆశీస్సులనందుకున్నారు.

ఉత్తమ సంగీత విద్వాంసులుగా, ప్రథమశ్రేణి గాయకులుగా, వాద్య నిపుణులుగా, స్వరరచయితగా, ఆచార్యులుగా కృతార్థులయిన శ్రీ సత్యనారాయణ స్వకీయమైన ప్రతిభతో రసిక లోకానికి ఇవ్వగలిగినది ఇంకా ఎంతో ఉందనే అనిపిస్తుంది.

===+++===  ఫఫరరరరర