visitors

Friday, July 31, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - (పదవ భాగం)

31.07.20 - శుక్రవారం భాగం: 10*
 తొమ్మిదవ భాగం ఇక్కడ





ముందుగా శ్రీ రావి కొండలరావుగారికి స్మృత్యంజలి

సన్మిత్రుడు శ్రీ రావి కొండలరావు గారి మరణం నాకెంతో విచారాన్ని, ఆవేదనను కలిగించింది. మా ఇద్దరికీ మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నది. సినీ కళాకారుడిగా ఆయన గురించి తెలిసినది తక్కువే. వాణీమహల్ లో ఆయన నాటకం 'పట్టాలు తప్పిన బండి' చూశాక ఆయనంటే ఒక గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. కానీ, మా మైత్రికి మూలం మద్రాస్ తెలుగు అకాడెమి. 
1980 ల నుండి ఆయన ఆ సంస్థలో గౌరవ కార్యదర్శి. నేను సహ కార్యదర్శిని.  కొండలరావు గారు శ్రీ టివికె శాస్త్రిగారికి బాల్య మిత్రుడు. "ఒరే అంటే ఒరే" అని పలకరించుకునేంత మైత్రి.  మేము ముగ్గురం మద్రాసు తెలుగు అకాడెమీ ద్వారా ఎన్నో అపురూపమైన , అపూర్వమైన సాంస్కృతికోత్సవాలు రూపొందించాము. మా ఇద్దరి మధ్యా పదమూడేళ్ళ వయసు వ్యత్యాసం ఉంది. కానీ ఆయన చాలా ప్రేమతో సోదరుడిలా చూసుకునేవారు. 
తరుచూ, శాస్త్రిగారి ఇంటిదగ్గర (అదే ఆఫీసు, అదే ఇల్లు) కలిసేవాళ్ళం.  అవసరం పడితే కొండలరావుగారి అభిరామపురం ఇంట్లో గంటల తరబడి పనిచేసేవాళ్ళం. నాకు నటన, నాటకం గురించి ఏమీ తెలియకపోయినా  మా వేదిక మీద జరిగిన ఒక స్కిట్ లో నన్నూ ఇరికించి విడియోలో కనపడేలా చేశారు. 
ఆయన హైదరాబాద్ మకాం మార్చినా, మా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వచ్చి కార్యదర్శిగా తన బాధ్యతలు నిర్వహించేవారు. 
కొండలరావు గారు, రాధాకుమారి  టి నగర్ లో ఒక చిన్న అద్దె ఇంటిలో ఉన్నప్పటినుండి ఎరికే. వారి అన్నగారు రావి చలంగారు, తమ్ముడు ధర్మారావుగారు. అందరూ ఉన్నతశ్రేణి నటులే. వారి కుటుంబ సభ్యులందరూ కలసి శ్రీ రావి చలంగారి నిర్వహణలో  నటించిన "చుట్టం కొంప ముంచాడు"  మా వేదిక మీద ప్రదర్శించడం మరువలేని విషయం. చాలా గొప్ప సందేశమున్న నాటకం. 
శ్రీ రావికొండలరావుగారిని విజయనగరంలో  2008 ఉత్సవాల తర్వాత, ఒకటి రెండుసార్లు మద్రాస్ లో శాస్త్రిగారింట్లో చూశాను. స్వయంగా కలుసుకోకపోయినా ఫోన్ల ద్వారా ముచ్చటించుకోవడం ఉండేది. గత కొన్నేళ్ళుగా శారీరక అస్వస్తతతో ఉంటున్నా హైదరాబాద్ లో ఒంటరిగానే ఉంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది  ఆయన జన్మదినోత్సవం అయాక ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం కోలుకుంటున్నదనే చెప్పారు.
ఇంతలోనే ఈ విషాదవార్త వినరావడం చాలా విచారకరం. 
వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.

---

భాగం: 10

ఉన్న తావున ప్రశాంతంగా నిలువనీయక చదరంగంలో పావులను కదిపినట్లు, కదిపి, ఒక్కోసారి కుదిపి మనిషి జీవితంతో ఆడుకోవడం దేవుడనేవాడికి ఒక సరదా. 

ఏదో కలివరంలో జీవితం ప్రశాంతంగా జరిగిపోతోందనుకునే సమయంలో మళ్ళీ మా నాన్నగారికి స్థాన చలనం తప్పలేదు. గురువుగారిని దర్శించుకునేందుకు ఘంటసాలవారు విజయనగరం వెళ్ళిన సమయానికి  వారక్కడ లేరు. కలివరంలో ఉన్నరని తెలిసి చూడడానికి అక్కడికే వెళ్ళారు. కూడా ఆయనతో  అప్పట్లో సహాయకుడిగా ఉన్న వీణ రంగారావు (మారెళ్ళ), కూడా ఉన్నారు. ఆ సందర్భంలో గురువుగారితో మట్లాడుతూ తన సినీమా వృత్తి గురించి, మద్రాస్ లో సంగీతజ్ఞులకు ఉండే అవకాశాలను గురించి చెపుతూ సంగీతరావు గారిని మద్రాస్ పంపితే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ తండ్రీ కొడుకులు ఈ విషయంలో వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. కారణం, సినీమాల పట్ల అయిష్టత ఒక కారణమైతే, తన వ్యక్తిత్వానికి తగిన రంగం కాదనే భావన కూడా కావచ్చు. మరి కొన్నేళ్ళు అక్కడే గడిపారు.  (ఈ విషయాలు గతంలో ముచ్చటించడం జరిగింది).

మా నాన్నగారు కలివరం వదలిపెట్టడానికి కారణం ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు పుట్టిన ముగ్గురు పిల్లలు,  రెండు మూడేళ్ళ వయసులో పోవడం ఒక కారణమేమోనని నా భావన. నాకంటే పైన ఒక పిల్లవాడు. మా తాతగారి పేరు కలిసొచ్చేలా 'సీతారామ్' అని పెట్టారట. ఎన్నేళ్ళున్నాడో నాకు తెలియదు. తరువాత  రెండవ వాడిగా నేను పుట్టాను.  మా నాన్నగారికి సంగీతంతో పాటు సాహిత్యం, వేదాంత గ్రంధాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి విషయాల మీద మంచి ఆసక్తి, పట్టు ఉండేవి. వెతికి వెతికి నాకు ఉపనిషత్తులు లోనుండి  'ప్రణవస్వరాట్' అనే పేరు పెట్టారు. 'ప్రణవం' అంటే ఓంకారం, నాదమనే అర్ధం వుంది. 'స్వరాట్' అంటే ఇంద్రుడు, అధిపతి అనే అర్ధాలున్నాయట. ఆయన ఉద్దేశంలో సంగీత విద్యలో ఇంద్రుడంతటి వాడిని కావాలనేమో! కుటుంబ వారసత్వపు వాసనల వలన  నేను మంచి సంగీతాన్ని, ఎవరు పాడినా విని ఆనందించగల స్థితిలో ఉన్నాను.

నా తర్వాత, మరొక బాబు.  భగవద్గీత మీద వుండే భక్తితో అతనికి 'గీతాకృష్ణ' అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు నాకు జ్ఞానం రాకుండానే పోయాడు. తర్వాత, మరో ఆడపిల్ల 'సుమన' అని పేరు. ఆ పాప విషయంలో ఉండీ లేనట్లుగా  ఏవో కొన్ని జ్ఞాపకాలు.  ఒకసారి ప్రమాదవశాత్తు మండుతున్న కుంపట్లో వ్రేళ్ళు పెట్టి ఏడవడం బాగా గుర్తుండిపోయింది. సైబాల్ పూయడం గుర్తుంది. ఎఱ్ఱ రంగు సైబాల్ డబ్బా,  అదే రంగులో, అదే సైజులో ఇప్పటికీ చూస్తున్నాను. ఏం అనారోగ్యమో తెలియదు మూడేళ్ళలోపే పోయిందనుకుంటాను. 

కలివరంలో జరిగిన ఈ సంఘటనలు మా నాన్నగారి మీద, అమ్మగారి మీదా ప్రభావం చూపాయేమో! తెలియదు. మొత్తానికి 1951 లో మా నాన్నగారు కలివరం వదలిపెట్టి విజయనగరంలో  మా తాతగారింటికి నివాసం మార్చేశారు. కలివరం వదలి వెళ్ళిపోయినా శ్రీ గంగుల అప్పలనాయుడు గారి కుటుంబంతో మైత్రి కొనసాగుతూనే ఉంది. ఈ ముగ్గురు పిల్లల తరువాత మరెవరికీ ఆసక్తితో పేర్లు ఎంచి పెట్టడం జరగలేదు. అందరూ ఉండి ఉంటే సంగీతరావు గారికి నవరత్నాల్లాటి పిల్లలు (నలుగురు మగ + ఐదుగురు ఆడపిల్లలు) అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఐదుగురున్నాము పిల్లా పాపలతో. 

నాకు అక్షరాభ్యాసంలాటిది కలివరంలోనే జరిగిన గుర్తు. మానాన్నగారు ఒకసారి విజయనగరం నుంచే అనుకుంటాను తెలుగు వాచకం బొమ్మల పుస్తకం తెచ్చారు. అందులో అక్షరాలతో పాటు అల, వల, తల, వంటి మాటలు బొమ్మలుండేవి. మా నాన్నగారికి ఒక కాలంలో కారాకిళ్ళీలు(బాబా జరదా), సిగరెట్లు అలవాటు బాగా ఉండేది. బెర్కిలీ సిగరెట్లు ఆయన మొదటి బ్రాండ్. తరువాత, సిజర్స్ . ఈ సిగరెట్లు రంగు రంగు పెట్టెల్లో వచ్చేవి. వాచీమార్క్, పాసింగ్ షో, ఛార్మీనారు, బెర్కిలీ, సిజర్స్, మొదలైనవి. ఈ ఖాళీ సిగరెట్ పెట్టెలు పిల్లలకు ఎంత అవసరమో నాకు బొబ్బిలి లో తెలిసింది. ఆ విషయాలు తరువాత. ఇవికాక,కరీం బీడీ, గుఱ్ఱం మార్క్ బీడీలు కట్టలు కట్టలుగా  అమ్మేవారు. ఇక, 555 సిగరెట్లు, స్పెన్సర్ చుట్టలు ధనవంతుల బ్రాండ్లు. అట్టపెట్టెల్లో కాకుండా టిన్ డబ్బాల్లో వచ్చేవి. ఆ ఖాళీ డబ్బాలను మొన్నమొన్నటి వరకు ఇళ్ళలో బియ్యం, పప్పులు  కొలుచుకునేందుకు ఉపయోగించేవారు. వాటిని చూడడం మెడ్రాస్ వచ్చేకే. మద్రాస్ ను మెడ్రాస్ అనడం ఒక డాబుగావుండేది.  

కలివరంలో ఈ కారాకిళ్ళీలకు సంబంధించిన  ఒక సంఘటన. మా నాన్నగారు కారాకిళ్లిలతో పాటూ మీఠా కిళ్ళీలు ఇంటికి తెచ్చేవారు. అవి నేనూ నమిలేవాడిని. ఒకసారి తెలియక మీఠాకిళ్ళీకి బదులు ఆ కారాకిళ్ళి నోట్లో పెట్టుకొని నమిలేశాను. ఇంక అంతే సంగతులు. కిళ్ళీలోని కారా మసాలల ఘాటు నశాళానికెక్కింది. తలతిరుగుడు, ఎక్కిళ్ళు ప్రారంభమయాయి. తరువాత నీళ్ళు త్రాగించి, పుక్కిలించి ఉమ్మేయడం వంటివేవో చేయించారు.  తరువాత, ఆయన హార్మోనియం వాయించుకుంటూ పాడుతూంటే  అది వింటూ ఆయన పక్కనే  చాలాసేపు పడుక్కుండిపోయాను.

            
(చింతానాస్తికిలా - శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర రచన -సంగీతరావుగారి గాత్రంలో)
(మనవరాలు గాయత్రి లలితస్మిత గీసిన హార్మోనియం మీద తాతగారి వేళ్ళు) 

సంగీతంలో మాధుర్యంతో పాటు మంత్రశక్తీ వుంది. మానసిక ప్రశాంతికి శ్రావ్యమైన సంగీతానికి మించిన సాధనంగానీ, ఔషధం కానీ లేవు. ఆ ప్రశాంతత ఏ ఒక్క గాయకుడివల్లే కలుగుతుందని లేదు. మంచి సంగీతానికి స్పందించగల హృదయముంటే చాలు. ఆ పాట మహత్తుతో  నెమ్మదిగా నా తల తిరుగుడు తగ్గింది.


నాకు ఆరేళ్ళ వయసులో మానాన్నగారు విజయనగరం వచ్చేశారు. వృత్తిరీత్యా మా నాన్నగారు కచేరీలకు బయట ఊళ్ళకు వెళుతూండేవారు. అలాటి సమయంలోనే, ఆయన మిత్రుడు, శ్రేయోభిలాషి శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు మా నాన్నగారికి రైలు టిక్కెట్టు కొనిచ్చి బలవంతంగా మెడ్రాస్ పంపించారు. అప్పుడు ఘంటసాలవారు పరోపకారం తీస్తున్న రోజులు. మా నాన్నగారు మెడ్రాస్ వెళ్ళి ఘంటసాలగారింట్లో ఉంటూ పరోపకారం, పల్లెటూరు  సినీమాలలో బృందగానాల్లో పాల్గొని,ఆ వాతావరణం నచ్చక వెంటనే వెనక్కితిరిగి వచ్చేయడం వంటి విషయాలు గతవారం చెప్పినదే. 

చిన్నతనంలో  నాకు తరుచూ మలేరియా ఫీవర్ వస్తూండేది. దానివలన నా ప్రాధమిక విద్య సక్రమంగా జరగలేదు. 1952-లో అయ్యకోనేరు గట్టుమీద ఉండే అరటిచెట్ల బడిలో మూడవ తరగతిలో చేర్చారు.  మా తాతగారి అద్దె ఇల్లు సుబ్రమణ్యం పేట, గెడ్డవీధిలో మొదటి ఇల్లు. స్కూలుకు వెళ్ళిరావడం, స్కూల్ లో ఇతర పిల్లలతో తిరగడంతో కొంత జ్ఞానం పెరిగింది. అప్పట్లో వచ్చే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కినీమా వంటి పత్రికలలోని సినీమా బొమ్మలు చూడడం వాళ్ళను గుర్తుపట్టడం తెలిసాయి.

అప్పుడప్పుడు మాతాతగారు తనతో కూడా మ్యూజిక్ కాలేజీకి తీసుకువెళ్ళేవారు. అక్కడ  ఆయన పిల్లలకు చెప్పే సంగీతపాఠాలు వింటూ ఆ హాలులో గోడలమీద వుండే ప్రముఖుల ఫోటోలు చూస్తూ,  ఆ వరండాలమీద తిరిగేవాడిని. అక్కడ మా తాతగారి తో పాటు గాత్ర ఆచార్యుడిగా శ్రీ డొక్కా శ్రీరామమూర్తి గారని ఒకాయన. ఆయన మాత్రమే అక్కడివారిలో నాకు పరిచయం ఉన్నవారు. అలాగే శ్రీ ద్వారం బాబూరావు ( భావనారాయణరావు) గారు.  ఆయన మా రెండో చిన్నాన్నగారికి సహాధ్యాయి. ఆ బాబూరావు గారే మనందరికి చిరపరిచితురాలైన సుప్రసిధ్ధ బహు భాషాగాయని శ్రీమతి సుశీలగారి సంగీతం గురువుగారు.

1950 లో భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం లభించి గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. 1952 లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు, స్వతంత్ర, ఇండిపెండెంట్ అభ్యర్ధులంటూ రోడ్లమీది గోడలన్నీ రకరకాల పేర్లతో రంగు రంగుల బొమ్మలతో నిండిపోయి వుండేవి. వివిధ రకాల జెండాలు ఊరంతా రెపరెపలాడేవి. నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, రాజాజీ వంటి ప్రముఖ జాతీయనాయకుల పేర్లతో పాటూ తెన్నేటి విశ్వనాధం, ఎన్ జి రంగా వంటి పేర్లు కనపడేవి. ఆ ఎన్నికల్లో విజయనగరం రాజావారు శ్రీ పివిజి రాజు కూడా సోషలిస్టు పార్టీ తరఫున పోటీచేసిన గుర్తు. అలాగే సాంబశివరావు అనే ఆయన పోటీ చేశారు.  మా తాతగారు రాజావారి సంగీతకళాశాల ఉద్యోగి కావడం వలన స్వామిభక్తితో పివిజి కే ఓట్ వేసినట్లు చెప్పుకునేవారు. మా ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ములు తలో పార్టీకి వత్తాసు పలుకుతూ భోజనాల దగ్గర వివాదాలు మొదలెట్టేవారు. మా ఇంటికి సమీపంలోనే ఒక మునసబ్ కోర్ట్ ఉండేది. అందులో పోలింగ్ బూత్. ఇంట్లోవారంతా వెళ్ళి ఓటేసివచ్చారు. ఆ ఎలక్షన్ హీటంతా మా ఇంట్లోనూ ఉండేది. 


(21/01/1952 - విజయనగరంలో సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధుల విజయం)

ఈలోగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఒకటి. ఊరంతా సభలు, సమావేశాలు, ఊరేగింపులతో దద్దరిల్లింది. గోడలనిండా "ఆంధ్రరాష్టం రావాలంటే రాజాజీ నశించాలి" అని స్లోగన్స్ . దాని పక్కనే  "ఆంధ్ర రాష్ట్రం కావాలంటే దుంపరాష్ట్రం తెంచాలి" అని ఆకతాయిల సొంత పైత్యాలతో నిండి వుండేవి. వాటి ప్రభావం మా ఇంటి పెరటిగోడల మీద పడింది. అప్పట్లో ఇంట్లో అల్లరి చేయడానికి  నాతో పాటు మా రెండవ చిన్నాన్నగారి అబ్బాయి ఉండేవాడు నాకంటే రెండేళ్ళు చిన్న. పేరు పట్రాయని వెంకట నరసింహ సన్యాసి వర ప్రసాద్. (PVNSV ప్రసాద్. Ex. Telco employee, ప్రస్తుతం బెంగుళూరు నివాసి). మేమిద్దరం మాకు వచ్చిన తెలుగులో బొగ్గుతోనూ, జామాకు, రాచఉసిరి ఆకుల పసరుతో గోడలన్ని ఖరాబు చేస్తూండేవాళ్ళం. మా అమ్మగారో, పిన్నిగార్లో ఎవరో చూసి కేకలేసినా ఆ క్షణం వరకే. తరువాత మామూలే. మా తాతగారికి భయం. మమ్మల్ని గట్టిగా అదలిస్తే ఆ భయంతో ఏ ఊష్ణం వచ్చేస్తుందోనని. మమ్మల్ని ఇల్లు కదలి బయటికి పంపేవారు కాదు. ఆరోజుల్లో విజయనగరం సాంస్కృతిక పరంగా ఎంత ప్రసిధ్ధో, అలాగే గాడిదలకి,మలేరియా దోమలకి, తద్వారా ఫైలేరియాకు కూడా ప్రసిధ్ధే. మా తాతగారు చాలా సౌమ్యులు. అతి భయస్తులు. ఆ లక్షణాలన్నీ మా ఒంటబట్టాయి.

1952 డిసెంబర్ లో ఒక చెల్లెలు పుట్టింది. పేరు వెంకట రమణమ్మ. ఏడుకొండలవాడి పేరు. 1953 జనవరిలో మా నారాయణ మూర్తి చిన్నాన్నగారికి ఒక ఆడపిల్ల. రాజరాజేశ్వరీ ప్రసన్న జ్యోతిర్మయి. సింపుల్ గా జ్యోతి అయింది. వీళ్ళిద్దరికీ మీద మరో ఆడపిల్ల కూడా ఉంది. మా ప్రభూ చిన్నాన్నగారి అమ్మాయి మంగమాంబ. మంగమ్మగారు మా నాయనమ్మగారు. మూడో కొడుకు పుట్టిన మూడేళ్ళకే కాలం చేశారు. మాకెవరికీ తెలియదు. ఈ ఇంట్లోవాళ్ళందరికీ కేర్ టేకర్ మా పెద్ద అమ్మమ్మగారే. ఓలేటి వెంకట నరసమ్మ, మా అమ్మగారి దొడ్డమ్మ, మా తాతగారి పెత్తల్లి కూతురు. ఆవిడ చెల్లెలు, మా అమ్మమ్మగారు, అప్పల నరసమ్మ. మా పెద్దమ్మమ్మగారు వితంతువు. పిల్లలు లేరు.  మంచి జ్ఞాని. ఆవిడ భర్త, మా పెద్దతాతగారి పేరు కూడా నరసన్న. ఆయన ఉండే రోజుల్లో వారిద్దరూ కలిసి వెంకటనరసకవులుగా సాహిత్య సేవ కూడా చేసేరు. తమ్ముడి సంసారమంతటి మీదా ఆవిడదే పర్యవేక్షణ. మా తాతగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు, నిమిత్తమాత్రులు.

క్రమక్రమంగా ఒంటరిగా బయటకు వెళ్ళడం, అయ్యకోనేరు గట్టుకు ఒక ప్రక్కనుండే, అలవాటైన శెట్టికొట్లో పెప్పర్మెంట్లు, ప్యారీ చాక్లెట్లు, జెబి మంఘారాం బిస్కెట్లు వంటివి తెచ్చుకోవడం అలవాటయింది. అప్పట్లో దసరా ఉత్సవాలు బాగా జరిపేవారు. స్కూల్ టీచర్లందరూ పిల్లల్ని వెంటేసుకొని వీధివీధినా ప్రతి యింటిముందూ ఆపి దసరాపాటలు పాడి, అయ్యవార్లకు ఐదు వరహాలు, పిల్లకాయలకు పప్పుబెల్లాలు చాలంటూ డిమాండ్ చేసి, బాణాలతో ఆ ఇళ్ళవారిమీద పువ్వులు జల్లిపించి వారిచ్చే  అర్ధో, రూపాయో, సంభావన పుచ్చుకొని మరో ఇంటికెళ్ళేవారు. అలాగే స్కూల్ లో కూడా దసరా పూజలు చేసి స్వీట్లు పంచిపెట్టేవారు.

విజయనగరంలో దీపావళి కూడా వీరోత్సాహంతో జరిగేది. దీపావళి వస్తే ఏ వీధి తగలెడుతుందోనని భయపడేవారు. ఊళ్ళో పాత కక్షలేవైనా ఉంటే ఆ రోజు రాత్రి మరింత పెట్రేగేవి. ఆ ఊళ్ళో లంక వీధని ఒకటి ఉండేది. అక్కడ ఇలాటి అల్లర్లు ఎక్కువని చెప్పుకునేవారు. వాళ్ళంతా రెండు పార్టీలు గా చీలిపోయి తారాజువ్వలు, వెలక్కాయలు, కొబ్బరికాయలలో మందుగుండు కూరి వాటిని నేలమీద ఎదురెదురుగా విసురుకొంటూ ఉండేవారు. ఇవన్నీ ప్రమాదకరంగా మారి ఇళ్ళుకాలిపోయి, ఒళ్ళుకాలిపోయిన సంఘటనలతో మర్నాడు ఊరంతా గుప్పుమనేది. అప్పటికీ పోలిసులు అలాటి రౌడీ ముఠాలను అరెస్టు చేసి ఒక లారీలో ఎక్కించి అర్ధరాత్రి సమయాలలో చీకట్లో ఊరవతలెక్కడో జనసంచారం లేనిచోట వదిలేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు అక్కడనుండి నడుచుకుంటూ ఊరు చేరేసరికి తెల్లారిపోయేది. దీపావళి అయిపోయేది. మా తాతగారి శిష్యులు, మిత్రుల (పరిమి వారు) పిల్లలు మాకు దీపావళికి ఇంట్లో తయారు చేసిన మతాబాలు, చిచ్చుబుడ్లు, చిచింద్రీలు తెచ్చి ఇచ్చేవారు. వాటిని కాలిస్తే ఒళ్ళెక్కడ కాలుతుందోనని మాతాతగారి భయం.

అలాగే, విజయనగరం కొళాయి నీళ్ళ దెబ్బలాటలకూ ప్రసిద్దే. ఆడవాళ్ళ గొడవలతో ప్రారంభమై మగాళ్ళు తలలు బద్దలు కొట్టుకునేవరకు వచ్చేది. అలాటివారికి అవగాహన కల్పించేందుకు 'కొళాయి బుర్ర' వంటి బుర్రకధలను అభ్యుదయవాదులు వినిపించేవారు. 
మా చిన్నాన్నగారు శ్రీ పట్రాయని నారాయణ మూర్తిగారు వైణికుడు. శ్రీ వాసా వెంకటరావుగారి శిష్యుడు. శ్రీ వాసా కృష్ణమూర్తిగారికి, శ్రీ పంతుల భువనేశ్వరరావుగారికి సహాధ్యాయి. ఈయన అదే సంవత్సరంలో విశాఖపట్నం మకాము మార్చి అక్కడ సంగీత పాఠాలు, ఒక చిన్న స్కూలు ఏర్పాటు చేసుకున్నారు. మా రెండో చిన్నాన్నగారు శ్రీ పట్రాయని ప్రభాకరరావు గారు గాత్రజ్ఞుడు. విజయనగరం మహారాజ సంగీత కళాశాల విద్యార్ధిగా డిప్లొమా హోల్డర్. అందరూ మంచి విద్వత్ కలవారే. ఆయనే మా తాతగారికి తోడుగా ఇంటిపనులన్ని చూసేవారు. మా ఇద్దరిని కూర్చోపెట్టి  అప్పుడప్పుడు చదివించేవారు. ఇంట్లో ఎవరికి అనారోగ్యం చేసినా ఆ ప్రభాకరరావుగారే వెంటనే సుసర్ల వెంకట్రావుగారనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళేవారు. ఆయన హస్తవాసి గొప్పదని చెప్పుకునేవారు. ఆయన మూడు నాలుగు రంగుల్లో అరకు మందులు బాటిల్స్ లో పోసి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు వాడమని ఇచ్చేవారు. ఇంట్లో రకరకాల రంగు రంగుల అరకు మందు సీసాలుండేవి.  మా నారాయణమూర్తి చిన్నాన్నగారి డాక్టర్ వేరే. ఆయన పేరు యాజులుగారు. స్థానికంగా ఉండే ఘోషాస్పత్రికి రిక్షాలో వెళుతూంటే నేనూ కూడా వెళ్ళేవాడిని.

అప్పటికి ఊళ్ళో నాలుగు వీధులు పరిచయమై ఒంటరిగా వెళ్ళడం అలవాటయింది. ఈలోగా సినీమా పరిజ్ఞానమూ పెరిగింది. ఆ రోజుల్లోనే పాతాళభైరవి, మల్లీశ్వరి, ప్రియురాలు, పెళ్ళిచేసి చూడు, ప్రేమ, పిచ్చిపుల్లయ్య, చండీరాణి వంటి సినీమాలు రావడం వాటికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు చదవడం వచ్చాయి. అప్పట్లోనే 'తండ్రి' అని ఒక సినీమా మలయాళం డబ్బింగ్ కావచ్చు. తిక్కురుసి అనే నటుడు నటించినది. ఆ తిక్కురిసి పేరు వింతగా అనిపించి ఆ సినీమా పేరు గుర్తుండి పోయింది. అలాగే, 'ముగ్గురు కొడుకులు' అని ఒక సినీమా. ఈ రెండు సినీమాలు చూడలేదు, కానీ, 'తండ్రి - 'మా తాతగారుగా',  'ముగ్గురు కొడుకులు' మా నాన్నగారు, చిన్నాన్నగార్లుగా ఊహల్లో ఉండేవి. ఈ సినీమాలలోని పాటలన్నీ లౌడ్ స్పీకర్లలో, పబ్లిక్ పార్క్ లలో వినిపించేవి. కొన్నిటిని ఘంటసాలవాడు పాడాడని అనుకునేవారు. అదెవరో మాకు తెలిసేది కాదు. 

విజయనగరం కృష్ణాహాల్ సమీపంలో ఒక పెద్ద పార్క్ ఒక పక్క మరో సినీమా హాలు ఉండేవి. ఆ పార్క్ లోనే నేను మొదటిసారిగా 'ఓ తారకా ఓ జాబిలీ' పాటను లౌడ్ స్పీకర్లో విన్నాను. పాట వింటున్నంతసేపు ఆనందంగా అనిపించింది. అదేం సినీమా, పాడిందెవరనే ధ్యాస అప్పుడు లేదు. ఎప్పుడో తరువాత తెలుసుకున్నాను చండీరాణి సినీమాలో ఎన్ టి రామారావు, భానుమతి పాడారని. మరి, ఘంటసాల పాడడమేమిటనే సందేహమూ కలిగింది. అలాటి సందేహాలన్నింటినీ తరవాతి కాలంలో కాలమే తీర్చింది.

(చండీరాణి సినిమాలోని ఓ తారకా పాట వినడంకోసం ప్లే బటన్ నొక్కండి)

మా ఇంటికి దగ్గరలో 'ప్రభాత్' టాకీస్ అని ఓ సినీమా హాలుండేది. అందులో 'కృష్ణలీలలు' సినీమా వచ్చింది. ఎస్ వి రంగారావుది కాదు. వేమూరి గగ్గయ్యది. ఆయన కంసుడు అందులో. ఎస్ రాజేశ్వరరావు కృష్ణుడు. ఆ సినీమాను ఒంటరిగా చూడ్డానికి ఇంట్లోవారు పర్మిషన్ ఇచ్చి డబ్బులిచ్చి పంపారు. నేను హాలు దగ్గరకు వెళ్ళేసరికి  యింకా మ్యాట్నీ షో వదలలేదు. సినీమా హాలులోపల నుండి గాట్టిగా అరుపులు , భయంకరమైన నవ్వులు, పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. అంతే! భయంతో ఠారెత్తి ఇంటికి ఒకటే పరుగు. సినీమాలేదు, గినీమా లేదు. ఆ తరువాత ఎప్పుడో టివీలో దూరదర్శన్ ప్రసారం చేసినప్పుడు చూసాను. కొన్నాళ్ళపాటు గగ్గయ్య, జగ్గయ్య ఒకరేననే భ్రమ ఉండేది. 

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు ఒకసారి నన్నేదో ఇంగ్లీషు సినీమాకు తీసుకెళ్ళారు.' కొవ్వాడీస్' అని గుర్తు. నేను చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా అది. అది చూసి వచ్చి ఇంట్లో నడుముమీద రెండు చేతులు పెట్టుకొని చెప్పులతో కాళ్ళు ముందుకు వెనక్కి ఊపుతూ డాన్స్ చేస్తూంటే నాకు నవ్వు వచ్చేది. అంత పెద్దవాడు అలా గెంతుతూంటే. కుటుంబంలో ఆడవాళ్ళు సినీమాలకు వెళ్ళాలంటే జట్కా బళ్ళలోనే. విజయనగరంలో సైకిల్ రిక్షాలు వచ్చిన కొత్తరోజులు. స్టేషన్ కు వెళ్ళాలన్నా, మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాలన్నా, సుసర్ల వెంకట్రావుగారి హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా సైకిల్ రిక్షాయే. ఎక్కడికైనా బేడ (రెండు అణాలు) డబ్బులే ఇచ్చేవారు. అప్పట్లో అక్కడి గౌరీశంకర్ విలాస్ హోటల్లో ఒక అణాకు రెండు ఇడ్లీలు. మీకు రూపాయి మానం గుర్తుందా. 
ఒక రూపాయికి - అర్ధలు 2
పావలాలు - 4
బేడలు - 8
అణాలు - 16
అర్ధణాలు - 32
కాణీలు - 64
దమ్మిడీలు - 128
వీటికి క్రింద ఏగాణీలు, ఠోలీలు అనే నాణేలు కూడా ఉండేవి.
'దమ్మిడీ ముండకు ఏగాణీ క్షవరం' అనే సామెతలు ప్రచారంలో ఉండేవి.  రాగితో చేసిన ఆ కాణీలు, దమ్మిడీలకు కూడా ఏవో కొనుకున్న గుర్తుంది. ఈ కాణీలు రెండు రకాలు. ఒకదానికి చిల్లుండేది. అలాటి చిల్లు కాణీలను పిల్లల మొలత్రాడులో వేసి నడుముకు కట్టేవారు. దృష్టిపరిహారామో లేక రాగి ఒంటికి మంచిదనే కారణమేనా కావచ్చు. ఈ కాపర్ల (రాగి నాణేలు) మీద వాటితో కొనుక్కోగల చుట్టలమీద కన్యాశుల్కం లో ఒక పెద్ద లెక్చరే ఉంది గిరీశానిది.

ఇలా జరుగుతూండగా ఒకరోజు మా ఇంట్లో ఘంటసాల పేరు మరొకసారి వినిపించింది. ఒకే మనిషిని కొందరు 'డు' అని మరికొందరు 'రు' అని ఎందుకు పిలుస్తారో నాకు అర్ధమయేది కాదు. గంటసాలవాడు రేపు మనింటికి వస్తున్నాడని. గంటసాలవాడు ఎవరు? ఎక్కడనుండి వస్తున్నాడు? ఎందుకు రావడం? అనే వాటిమీద అనేక సందేహాలు. ఎవరిని అడగాలి. అడిగితే ఏమంటారో? నాకు గంటశాల అంటే దేవుడి గుళ్ళోని గంట, శాల అంటే తాటాకుల శాలగా అర్ధం చెప్పుకొని గంట ఉన్న శాలే గంటశాల అని నిర్ణయానికొచ్చాను. కానీ గంటసాల మనిషంటున్నారే. 

ఈ లోపల ఇంట్లో వారంతా ఆ వచ్చేవారికోసం ఏర్పాట్లు జరుపుతూ, పెరటి గోడలమీద మా వ్రాతలను తుడిపి శుభ్రం చేసే పనిని నాకు, ప్రసాద్ కు  పెట్టారు.

తరువాత...... వచ్చేవారం....
                        సశేషం.

Friday, July 24, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - తొమ్మిదవ భాగం

24.07.20- శుక్రవారం భాగం: 9 *
 ఎనిమిదవ భాగం ఇక్కడ


నెం.35,ఉస్మాన్ రోడ్
                  ప్రణవ స్వరాట్

'సాలూరు చిన గురువు' శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి శిష్యుడు ఒకరు. స్వయాన ఆయన కుమారుడు మరొకాయన. ఇద్దరూ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులే. ఇద్దరూ ఆ సంగీతాన్ని నమ్ముకొని జీవించాలనుకున్నవారే. కానీ విధి వారికి విభిన్న మార్గాలను సూచించింది. ఘంటసాలవారు 1944 లో దక్షిణాపథానికి పయనించి మద్రాసులో చిత్రసీమలో తన జీవనయానం మొదలుపెట్టారు. గురుపుత్రులు సంగీతరావుగారు అదే సమయంలో కొంచెం తూర్పుదిశగా పయనించి తనకిష్టమైన ప్రశాంత వాతావరణంలో కలివరం అనే గ్రామం లో ఒక సహృదయుడి అండనజేరారు. ఆయన పేరు, గతంలో చెప్పాను,  శ్రీ గంగుల అప్పల నాయుడు. మంచి సంగీత రసికుడు. వీణ వాయించేవారట. సంగీతరావుగారు ఆయన దగ్గరకు వెళ్ళకముందు ప్రముఖ వైణికుడు శ్రీ వాసా కృష్ణమూర్తిగారు , శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు (సినీ నటుడు రావు గోపాలరావు గారి మామగారు) అక్కడ ఉండేవారు. ఈయనకి సంగీతంలోనే కాక మంత్ర శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. వీరిద్దరి తరువాత, మా నాన్నగారు సంగీతరావుగారు ఆయన వద్ద చేరారు. "మీరు ఎవరికీ ఏ సంగీతము నేర్పనక్కరలేదు. మీరు నా వద్ద ఉంటే చాలు" అని చెప్పినంత సహృదయుడు గంగుల అప్పలనాయుడుగారు.  ప్రముఖ సినీమా డైరక్టర్ బి ఎ సుబ్బారావు, వారికి దగ్గర బంధువే.


(శ్రీ గంగుల అప్పలనాయుడుగారు)

ఆ అప్పలనాయుడు గారి ఒక చెల్లెలు, సత్యవతిగారి  అల్లుడే మనందరికీ బాగా తెలిసిన సినిమా ఎడిటర్ శ్రీ  కె ఎ మార్తాండ్.


(అనకాపల్లి రంగారావుగారు, నాన్నగారు, ఫిల్మ్ ఎడిటర్ కె ఏ మార్తాండ్ గారు)

మరొక చెల్లెలు, సావిత్రిగారి భర్త సాలూరులో ప్రముఖ వ్యక్తి శ్రీ జర్జాపు నీలకంఠం. ఆయన కుమారుడు శ్రీ జర్జాపు ఈశ్వరరావు. ఆయనే, ప్రస్తుతం, సాలూరులో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు స్థాపించిన ' శారదా గాన పాఠశాల' మంచిచెడ్డలు గమనిస్తున్నారు. 


(శ్రీ జరజాపు ఈశ్వరరావుగారు మా నాన్నగారితో)

ఇలా కొన్ని కుటుంబాలతో తరతరాల సత్సంబంధాలు కొనసాగుతూంటాయి.
 

(శ్రీ గంగుల అప్పలనాయుడుగారి సోదరి - లక్ష్మీనారాయణమ్మగారు, మేనకోడలు సత్యవతిగారు వారి పిలల్లతో మా అమ్మగారు, మా చెల్లెళ్ళు)

1945 లో 'స్వర్గసీమ' సినిమా వచ్చింది. ఘంటసాల అనే గాయకుడు ఈ సినిమాలో తన మొట్ట మొదటి పాటను భానుమతి వంటి ప్రముఖ గాయనితో కలసి పాడడంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అదే  1945 సంవత్సరం లో నేను పుట్టాను. అందుకు లోకం నవ్వనూలేదు, ఏడ్వనూ లేదు. ఉండవలసినంత సహజంగానే ఉంది. కాకపోతే మరో గొప్ప విశేషం జరిగింది. నేను పుట్టాక రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసింది. ఇది  నిజంగా ప్రపంచమంతటికీ శుభవార్తే. సంతోషకరమైన విషయమే. ఎందుకంటే, ఆ యుధ్ధ కాలంలో అన్నిటికీ రేషనే. ఏ వస్తువు దొరికేది కాదట. పసిపిల్లల పాల డబ్బాలకు రేషనే. అయితే, మా ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది కొంచెం కొంచెం గుర్తు.

ఇలా ఐదేళ్ళు గడిచాయి. ఈలోగా లోకమంతా ఎన్నో మార్పులు జరిగాయి. మనదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి కలిగి స్వాతంత్ర్యం లభించింది. ఆ విషయాలన్నీ తెలిసే వయసుకాదు నాది. కానీ, ఒకనాటి ఉదయం, మా యింటి పెరట్లో గులాబీ మొక్కలు, వంగ, బెండ మొక్కల మధ్య కాలక్షేపం చేస్తూండగా గాలిలో తేలుతూ ఎక్కడనుండో ఒక పాట వినిపించింది. అది మా నాన్నగారు పాడే పాటలా లేదు. ఎక్కడనుండి వస్తున్నదో తెలియదు. గాలివాటానికి ఒకసారి గట్టిగా, ఒకసారి మెల్లగా  వినిపించేది. అదెందుకో తెలియదు. ఆ పాట నాకు తరుచూ వినిపించేది. ఒకరోజు మా నాన్నగారు నన్ను నాయుడుగారింటికి తీసుకువెళ్ళారు.  నేను అంతవరకూ గాలిలో వింటున్న పాట,   ఆ యింటిలో ఒక బాకాలోనుండి వినిపించింది. 

నాకు చాలా వింతగా అనిపించింది. మనుషులెవరూ పాడడం లేదు. అయినా పాట వినిపిస్తోంది. ఇంతలో బాకాలో పాట ఆగిపోయింది. మళ్ళీ పాడితే బాగుండుననిపించింది. మా నాన్నగారు ఆ బాకా దగ్గరకు వెళ్ళి దేన్నో తిప్పారు.  విచిత్రం మళ్ళీ అదే పాట వచ్చింది. ఆ పాటలో మాటలు నాకు అర్ధం కాలేదు, 'పలుకు', చిలకా' అనే రెండు మాటలు తప్ప. ఎందుకంటే అదే ఊళ్ళో ఎవరింట్లోనో ఒక బాదం చెట్టు, చెట్టు మీద చిలకలు చూశాను. అవి బాదం కాయలు కొరికి పలుకులను క్రింద పడేసేవి. ఆ కాయల్లో పలుకులుంటాయని వినడం వలన , ' పలుకు', చిలక' మాత్రం గుర్తున్నాయి. ఆ మాటలు ఈ బాకాలో వినడం ఆనందం కలిగించింది. అప్పటికి నాకు నాలుగేళ్ళు దాటాయి. కొన్ని గుర్తున్నాయి. కొన్నిలేవు.




          (పలుకరాదటే చిలుకా  పాటను వినాలంటే రికార్డు పైన   ప్లే బటన్ నొక్కండి)
                                   
ఆ తర్వాత ఎప్పుడో కొన్నేళ్ళకు తెలిసింది, అది 'పలుకరాదటే చిలకా' అని, షావుకారు సినీమాలో ఘంటసాలవాడు పాడేడని. అదే నాకు కొంత జ్ఞానం వచ్చాక విన్న మొదటి పాట. అలాగే, 'దీపావళి, దీపావళీ మా ఇంట మాణిక్య కళికావళీ'. ఇందులో కూడా నాకు తెలిసిన దీపావళి ఉండడం వలన నాకు ఇష్టంగా  గుర్తుండిపోయాయి. ఈ పాటలను నాయుడిగారింట్లో చాలాసార్లే విన్నాను.

అక్కడే, మరో రెండు పాటలూ విన్నాను 'ఓ విభావరి,' 'ఆ తోటలో నొకటి'. ఎవరు పాడారో అప్పుడు తెలియదు . తర్వాత తెలిసింది.

(ఆ తోటలోనొకటి ఆరాధానాలయము .. పాట వినడానికి ప్లే బటన్ నొక్కండి)


ఒక నల్లటి ప్లేట్ తిరుగుతూంటే పాట వినపడడం నేను కనిపెట్టిన కొత్త వింత.


(ఓ విభావరీ......పాట వినడానికి ప్లే బటన్ నొక్కండి)
అలాగే, కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కూడా వింతగానే ఉంటాయి. మనకు తెలిసినవాళ్ళు కొన్నాళ్ళు కనిపించి, తరువాత ఎప్పుడో ఎక్కడో కలుసుకోవడమో, లేక వాళ్ళ గురించి వినడమో జరిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.

ఇంతకు ముందు చెప్పాను, కలివరం గ్రామం నాగావళి ఏటిని ఆనుకుని ఉందని. అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరుందని. అక్కడే గండ్రేడు అని మరో ఊరు. ఆ ఊళ్ళో నుండి మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకుందికి ఒకతను వచ్చేవాడు. అతను చాలా తెల్లగా ఉండేవాడు. షెరాయి, చొక్కా వేసుకునేవాడు.  ఆయన పేరు బురిడి లక్ష్మున్నాయుడు. మనిషి చాలా మంచివాడు. మా నాన్నగారి వ్యాసాల ద్వారా తెలుసుకున్నది. 


(శ్రీ బురిడి లక్ష్మున్నాయుడు)

అలాగే, మరొకతను, పేరు ఏదో దాసు. పూర్తిపేరు గుర్తులేదు. అతను నన్ను ఎత్తుకొని ఆడించేవాడు. తాటాకుతో చక్రాలు, న్యూస్ పేపర్ తో గాలిపటాలు చేసి, నాతో సమానంగా ఏటి ఇసకల మీద ఆడించేవాడు. అంతవరకే గుర్తు. ఆ ఊరిని ఆనుకొని ప్రవహించే నాగావళి ఏరును దొంగ ఏరు అనేవారు. సడన్ గా వరదనీటితో ఏరంతా నిండిపోయేది.  మర్నాటికల్లా వరదొచ్చిన ఆనవాలే ఉండేదికాదు.  ఎక్కడో కొండల్లో వర్షాలు పడితే ఈ ఏటికి వరద వచ్చేది. ఒకసారి అలాటి వరదలో ములిగిపోయాను. ఎవరో జుట్టుపట్టుకు పైకి లాగారు.  లేకపోతే, ఈ కబుర్లు నానుండి మీరు చదివేవారు కాదు. అప్పటినుండి నాకు కొంచెం వాటర్ ఫోబియా ఉంది. అందుకే నదీ స్నానాలు, సముద్ర స్నానాలకు దూరం. మద్రాసు మెరినా బీచ్ కు వెళ్ళినా  పాదం మునిగే లెవెల్ వరకే వెళ్ళడం పరిపాటి.

సరి, మళ్ళీ బురిడి లక్ష్మునాయుడి గారి విషయం చూద్దాము. ఆయన మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారి దగ్గర చాలా కాలమే సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత, మా నాన్నగారు కలివరం వదలి, విజయనగరం, మద్రాస్ వెళ్ళాక, ఆయన కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో  మా తాతగారు  - శ్రీ సీతారామశాస్త్రి గారి క్లాసులోనే చేరి డిప్లొమా చేశారు. అదే కాలేజీలో లెక్చరర్ గా కూడా పని చేశారనుకుంటాను. ఆలిండియా రేడియోలో తరుచూ ఆయన కచేరీలు వినిపించేవి. ఆయన టోపి ధరించేవారు. లక్షుంనాయుడుగారు కచేరీలలో తమ గురువులైన శ్రీ సీతారామశాస్త్రి గారి కృతులు  కూడా గానం చేసేవారు.  ఆయన కుమార్తే, బురిడి అనురాధా పరశురామ్. ప్రస్తుత విజయనగరం మ్యూజిక్ కాలేజి ప్రిన్సిపాల్. ఆవిడను 2008లో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో కలసి మాట్లాడినప్పుడు ఆ చిన్నప్పటి కలివరం రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నాను.


(శ్రీమతి అనురాధా పరశురామ్)

అదే కాలేజీలో గాత్రం లెక్చెరర్ గా పనిచేసిన శ్రీ బి ఎ నారాయణగారు శ్రీ బురిడి లక్షుంనాయుడిగారి శిష్యుడేనని విన్నగుర్తు.



బి ఎ నారాయణగారు  కర్ణాటక సంగీతంలోనే కాక ఘంటసాలవారి పాటలు, పద్యాలు  పాడడంలో కూడా ఆరితేరినవాడు. మా జంటసంస్థలు ఆవిర్భావం నుండి 2008లో విజయనగరంలో జరిగిన ఆఖరి కార్యక్రమాల వరకూ క్రమం తప్పకుండా పాల్గొని ఘంటసాలవారి పాటలు, పద్యాలు పాడి ప్రేక్షకులను సమ్మోహనపర్చేవారు. కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వలన, మంచి గాత్రసంపద ఉన్నందువల్ల చాలా మంచి గాయకుడిగా పేరు సంపాదించారు.


(శ్రీ బి ఏ నారయణ, ఆయన కుమారుడు పవన్)

విజయనగరంలో మా ఉత్సవాల సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరయిన శ్రీ సంగీతరావుగారిని బి ఎ నారాయణ మ్యూజిక్ కాలేజీకి తీసుకువెళ్ళి తమ స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేసి ఆ పిల్లలచేత పాడించారు. ఆయన కుమారులు పవన్, సంతోష్ లు కూడా ఇప్పుడు మంచి గాయకులుగా స్థిరపడ్డారు.

ఎప్పుడో, ఎక్కడో 1945లలోని మూలాలు నేటి వరకు మూడు తరాలపాటు వ్యాపించడం అపూర్వంగానే తోస్తుంది నాకు. ఆ విధంగా నాకు ఘంటసాలవారి పాటతో  మొదటిసారిగా పరిచయం ఏర్పడినది, విన్నదీ  కరెంట్ వసతులు కూడా  లేని ఒక కుగ్రామంలో. ఇప్పుడా కలివరం కూడా అన్ని ఊళ్ళలాగే అభివృధ్ధి చెందిందని విన్నాను. 1951 ప్రాంతాలలో ఆ ఊరినుంచి  కుటుంబంతో సహా వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళే అవకాశమే దొరకలేదు. కానీ, మనసులో ఎక్కడో గాఢమైన కోరిక ఉంది. ఆ కలివరం వెళ్ళాలని.

వచ్చే వారం మళ్ళీ విజయనగరంలో......
ఘంటసాలవారి విశేషాలతో......
                ....సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified. 


Friday, July 17, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఎనిమిదవ భాగం

ఏడవ భాగం     ఇక్కడ.

17.7.2020 - శుక్రవారం: భాగం : 8.

నెం.35,ఉస్మాన్ రోడ్.  


ఘంటసాలగారి సంస్కారం

                                            
మద్రాస్ లో చిత్రసీమలో కొంత నిలదొక్కుకున్న తర్వాత , విజయనగరం వదలి వెళ్ళిన మరికొన్నేళ్ళకు ఘంటసాల మరల విజయనగరం వెళ్ళి తమ గురువులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కలిసారు. సినీమాలలో తన పురోభివృద్ధి ని గురించి గురువుగారికి చెప్పి వారి ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంలో , మద్రాస్ లో మంచి గాయకులకు తగిన అవకాశాలున్నాయని , అందువల్ల , వారి పెద్దబ్బాయి సంగీతరావు ను తన దగ్గరకు పంపమని కోరారు. కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.

1942 లో తొలిసారిగా మా నాన్నగారు - శ్రీ సంగీతరావు గారు ఒక స్నేహితుడి ఆహ్వానం మీద మద్రాస్ వెళ్ళారు. అప్పటికింకా ఘంటసాల మద్రాసు వెళ్ళలేదు. మద్రాసులో ఆలిండియా రేడియో , జెమినీ స్టూడియో   
ప్రారంభమైన తొలిరోజులు.

      
                                                                      
ఆ జెమినీ స్టూడియో లో సాలూరుకు చెందిన మా తాతగారి మిత్రుడు శ్రీ ఉరిమి జగన్నాధం ( ప్రముఖ తబలిస్ట్ వి. లలిత్ ప్రసాద్ తండ్రి) అనే ఆయన జెమినీ స్టూడియోలో తబలిస్ట్ గా పనిచేశేవారు. ఆయన సాలూరులో రాజావారి నాటక సంస్థలో తబలిస్ట్ గా , స్క్రీన్స్ పెయింటర్ గా ఉండేవారు. ఆ జగన్నాధంగారు మా నాన్నగారిని కలుసుకొని తనతో కూడా మద్రాసులో అనేక సినీమా కంపెనీలకు , నాటక సంస్థలకు తీసుకువెళ్ళి మా నాన్నగారి పాటను అందరికీ వినిపించేవారు. 

ఆ క్రమంలో మా నాన్నగారు శ్రీచిత్తూరు వి. నాగయ్యగారిని కూడా కలసి తన పాట వినిపించారు. ఆ సమయంలో నాగయ్యగారు భక్త పోతన సినీమాకు పని చేస్తున్నారు. అక్కడ , " మాతా పితా గురుదేవా " అనే పాట రిహార్సల్స్ జరుగుతున్నాయి. సినీమాలో పోతనగారి కూతురు పాడే పాట. ఆ పాట విని అదే పాటను సంగీతరావు గారు నాగయ్యగారికి వినిపించారు. ఆయన అది విని చాలా సంతోషించారు. సుసర్ల దక్షిణామూర్తి వంటివారు కుర్రవాళ్ళుగా తిరుగాడుతూ కనిపించేవారు. 

ఈ విధంగా మద్రాస్ లో కొన్నాళ్ళు గడిపాక సంగీతరావు గారికి బాగా అనారోగ్యం చేసింది. అదే సమయంలో రెండవ ప్రపంచయుధ్ధం యొక్క ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందనే భయంతో సీతారామశాస్త్రి గారు తమ కుమారుడిని మద్రాసు వదలి రమ్మని కబురు పంపించడంతో , సంగీతరావు గారు మద్రాసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రీకాకుళానికి సమీపంలో దూసి స్టేషన్ . ఆ స్టేషన్ కు ఓ నాలుగు మైళ్ళ దూరంలో కలివరం అనే ఒక చిన్నగ్రామం.ఊరిని ఆనుకొని నాగావళి ఏరు. ఏటికి అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరు ఉండేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి తండ్రిగారిది ఆ వూరే.

 ఈ కలివరంలో శ్రీగంగుల అప్పలనాయుడు గారని పెద్ద భూస్వామి. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన మా నాన్నగారిని తన ఆస్థానగాయకుడిగా పెట్టుకున్నారు. శ్రీ సంగీతరావు 1944 నుండి ఆరేళ్ళపాటు ఆయన ఆదరణలో ఉన్నారు. అప్పలనాయుడు గారికి ముగ్గురో , నలుగురో చెల్లెళ్ళు. వారందరికీ మా నాన్నగారు -సంగీతరావు గారు సంగీతం నేర్పేవారు.

 1952 లో మరల శ్రీ ఘంటసాలవారి ఆహ్వానం మేరకు మా నాన్నగారు మద్రాసు బయల్దేరి వెళ్ళారు. వెళ్ళే సమయంలో భయంకరమైన గాలివాన వచ్చి రైల్వే ట్రాక్ లు దెబ్బ తినడంతో రైలును గూడూరు నుండి రేణిగుంట మార్గంగా నడిపి మద్రాస్ చేర్చారు. అక్కడ సెంట్రల్ స్టేషన్ పక్కన ఒక హోటల్ లో దిగి ,తన పెట్టె అక్కడుంచి ఘంటసాలవారి ని చూడ్డానికి మాంబళం ( అదే త్యాగరాయనగర్ లేదా టి.నగర్) లోని నెం.35 , ఉస్మాన్ రోడ్ కు వెళ్ళారు. ఆ రోజు ఘంటసాలగారి తండ్రి తిధి. ఆయన ఆ కార్యక్రమంలో మునిగిఉన్నారు. మ నాన్నగారు వచ్చిన సంగతి మోపర్రు దాసుగారి ద్వారా విని , ఘంటసాలగారు లోపలనుండి బయటకు వచ్చి మా నాన్నగారిని ఆప్యాయంగా పలకరించి ఇంటిలోపలికి తీసుకువెళ్ళారు. ఆ సంస్కారం , గౌరవం మరెవరికీ రావని మా నాన్నగారు ఎప్పుడూ తల్చుకుంటూంటారు. 

అప్పట్లో ఘంటసాలగారు కొత్తగా ' వాక్సాల్' (vauxhall) అనే కారు కొన్నారు. ఆ రోజు సాయంత్రం , ఆ కారులో ఘంటసాలగారు తనను హొటల్ కు తీసుకువెళ్ళి అక్కడున్న పెట్టితో సహా ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఘంటసాల గారు పరోపకారం సినీమా తీస్తున్నారు.

(ఆడియో వినడం కోసం పరోపకారం పోస్టర్ మీద క్లిక్ చేయండి)

 అందులో ఆరుద్ర వ్రాసిన 'పదండి ముందుకు-పదండి తోసుకు ' అనే గీతాన్ని సంగీతరావు గారిచేత పాడించారు. అది శ్రీ శ్రీ రాసిన " పదండి ముందుకు " పాటకు పేరడీ లాటిది. అలాగే , ' పల్లెటూరు ' చిత్రంలో అనేక బృందగానాలుండేవి. మాధవపెద్ది , పిఠాపురం , గోపాలం వీరందరితో కలసి మా నాన్నగారు కూడా ఆ పాటలను పాడారు. అయితే తను నేర్చుకున్న సంగీతం వేరు , సినీమాల్లోని సంగీతం వేరని , ఆ వ్యవహారం మనసుకు నచ్చక మా నాన్నగారు సంగీతరావు గారు మరొకసారి మద్రాసు వదలి వెళ్ళిపోయారు. యధాప్రకారంగా తను , తన కచేరీలంటూ కాలం గడపసాగారు. 

కానీ , విజయనగరంలో, పెరుగుతున్న కుటుంబభారం , ద్వివేదుల నరసింగరావు ( డా.డి.ఎన్ రావు , ద్వివేదుల విశాలాక్షి) వంటి మిత్రులు ఇక్కడే ( విజయనగరం) లోనే వుంటూ తనలో వుండే సంగీత ప్రతిభను వృధా చేసుకోవద్దనే స్నేహపూర్వకమైన ఒత్తిడులు ఎక్కువై వృత్తిరీత్యా విజయనగరం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


 1954 లో కలివరం గంగుల అప్పలనాయుడు గారి కోరిక మేరకు వారితో కలసి తిరుపతియాత్ర వెళ్ళారు. అక్కడికి ఆ నాయుడి గారి బంధువు ప్రముఖ డైరెక్టర్ బి.ఎ. సుబ్బారావు , వారి సోదరుడు బి.ఎ. రామారావు వచ్చారు. వారంతా కలసి మద్రాసు వచ్చి ఘంటసాలవారి ని చూచేందుకు వెళ్ళారు. అప్పుడు ఘంటసాలగారు కన్యాశుల్కం రికార్డింగ్ కు వెళ్ళారు. సంగీతరావు గారు తెల్లారి తిరిగి వెళ్ళిపోతారనే సమయానికి ఘంటసాలవారు వచ్చి " ఇప్పుడు మన చేతిలో చాలా సినీమాలున్నాయి. మీరు వెళ్ళడానికి వీలులేదని" బలవంతపెట్టి ఉంచేశారు. నాయుడు గారి కుటుంబం మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు.


 అలా 1954 నుండి 1974 వరకు రెండు దశాబ్దాల వరకు ఘంటసాలగారి దగ్గరే సంగీతరావు గారు పనిచేశారు. ఘంటసాల వారి సంగీత సహాయకుడిగా ఘంటసాలగారు స్వరపర్చిన పాటలకు స్వరాలు వ్రాస్తూ వాటిని ఆర్కెష్ట్రా కు , గాయకులకు నేర్పడం , ఆర్కెష్ట్రా లో హార్మోనియం , వీణ వంటివి వాయించడం చేశేవారు. సినీమా లలో పాడడం విషయంలో ఏమాత్రం ఆసక్తి  కనపర్చలేదు. ఘంటసాల గారితో కలసి అనేక కచేరీలలో పాల్గొని హార్మోనియం వాయించారు. అవసరమనుకున్నప్పుడు ఘంటసాలవారి తో కలసి కచేరీలలో పాడేవారు.

 1971 లో ఘంటసాలవారి తో కలసి విదేశాలు పర్యటించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఘంటసాలవారి కి అనారోగ్యం కారణంగా సంగీత దర్శకత్వం వహించే సినీమా ల సంఖ్య తగ్గిపోయింది. కానీ , ఘంటసాలవారి ని వదలిపెట్టి వేరే సంగీతదర్శకులను ఆశ్రయించడానికి మనస్కరించలేదు. ఘంటసాలవారి కోరిక మీద వచ్చిన తను చివరవరకూ ఆయనతోనే ఉండాలనే ఒకరకమైన కృతజ్ఞతాభావం , ఒకరిపట్ల ఒకరికి గల సోదరభావం , పరస్పర మైత్రీ భావంతో , ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారికి మాత్రమే సహాయకుడిగా ఉండిపోయారు.

 1972 నుండి ఘంటసాలవారి అనుమతితో శ్రీ వెంపటి చిన సత్యంగారి కోరిక మీద వారి కూచిపూడి స్కూల్ లో పిల్లలకు సంగీతం చెప్పడానికి ప్రవేశించారు. అలాగే , సినీ నటి కాంచనకు గాత్రం , వీణ నేర్పించారు . అలాగే ఆత్రేయ గారి అమ్మాయికి నాలుగేళ్ళు సంగీతం నేర్పారు. 1974 తర్వాత , డా. వెంపటి చినసత్యంగారితో ఏర్పడిన మైత్రి కారణంగా మరో పాతిక సంవత్సరాలు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ కి మా నాన్నగారు తన సేవలందించారు. 1983 వరకు అదే నెం.35 ఉస్మాన్ రోడ్ ఘంటసాలగారింటి చిన్న ఔట్ హౌస్ లో నే తన ఐదుగురు పిల్లలతో కాలం గడిపారు. తన భవిష్యత్ పట్ల ఆదినుండి ఎంతో అక్కర చూపిన ఘంటసాలగారంటే మానాన్నగారికి ఎంతో గౌరవం. కుచేలుడు , కృష్ణుడు వంటి భావం ఉండేదేమో తెలియదు. ఘంటసాలవారి తో కలసి పనిచేస్తున్నా తన పరిధులు దాటి తనెలాటి అతి చొరవ తీసుకోలేదు. తన పిల్లలూ అలాగే ఉండాలని కోరుకున్నారు.
ఆ విషయాలన్నీ .... వచ్చే వారమే... 

(సశేషం)

Friday, July 10, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఏడవ భాగం

భాగం - 7*
ఆరవభాగం ఇక్కడ

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్




నాటకాలు వేసుకుంటూ తిరగడం, ఏవో సంగీతకచేరీలు చేసుకోవడంలో కాలం గడుస్తోందే తప్ప చెప్పుకోతగ్గ  ఆదాయం, అభివృధ్ధి కనపడలేదు. ఇది ఘంటసాల తల్లిగారికి ఒక వేదనగా తయారయింది. ఎప్పుడు ఇంటిపట్టున ఉండక, ఇల్లు పట్టని కొడుకుకు ఒక కాలికట్టు (పెళ్ళి)  వేస్తే బాధ్యత తెలిసి, కుదురుగా ఉంటాడనే తల్లి ప్రేమతో అతనికి పెళ్ళిచేయాలని సంకల్పించారు. 


ఈ విషయంగా తన వరస సోదరుడైన కొడమంచిలి వెంకటరత్నశాస్త్రిగారిని సంప్రదించారు. ఆయన పెదపులివర్రు వాస్తవ్యులు. స్థానిక బాలాత్రిపురసుందరి ఆలయంలో అర్చకులు. ఊళ్ళో మంచి పేరున్న పెద్దమనిషి. ఆయనకు ఆడా, మగా పదిమంది సంతానం. ఆయన రెండవ కుమార్తె సావిత్రిని తన కొడుకుకి యిచ్చి పెళ్ళి జరిపించమని కోరడం , ఆయన సమ్మతించడం జరిగింది.  దైవసంకల్పం కూడా తోడవడంతో సావిత్రి, ఘంటసాల ల వివాహం 1944 లోమార్చ్ మూడవ తేదీన జరిగింది.



ఘంటసాల  బాల్యావస్థ, యువ దశదాటి ఒక గృహస్తుడయ్యాడు. ఇక, ఘంటసాలను బహువచనంతో సంబోధించడం సముచితం.

సావిత్రిగారితో వివాహం ఘంటసాల వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు నాంది పలికింది.
                 

తెలుగు సినీమా ప్రపంచంలో లబ్దప్రతిష్టులైన  కవి శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులు, సినీ డైరక్టర్ కాశీనాధుని విశ్వనాథ్, స్వస్థలం పెదపులివర్రు. ఘంటసాలవారి అత్తవారి ఊరు కూడా అదే పెదపులివర్రు. వారంతా ఒకరికొకరు బాగా పరిచయస్తులు.

ఘంటసాలవారి పెళ్ళైన కొద్ది రోజులకు సముద్రాల రాఘవాచార్యులవారు పెదపులివర్రు వెళ్ళడం జరిగింది. అప్పుడు, ఘంటసాలగారు ఆచార్యులవారిని కలసి తన మంచిచెడ్డలు చెప్పుకున్నారు. తాను నేర్చుకున్న సంగీతాన్ని సముద్రాలవారికి వినిపించారు. ఆయన విని చాలా సంతోషించారు. ఇలాటి పల్లెటూళ్ళలో కన్నా మద్రాస్ వంటి నగరాలలో వృధ్ధిచెందే అవకాశాలు ఎక్కువని, అందుచేత మద్రాస్ లో తనను కలిస్తే తగు ప్రయత్నాలు చేయవచ్చని ఘంటసాలగారిలో ఆత్మస్థైర్యం కలిగించారు. ఆచార్యులవారి మాటలు ఘంటసాల తన ఆశల, ఆదర్శాల సాఫల్యానికి తొలిమెట్టుగా భావించారు. 


వివాహం జరిగిన రెండు మాసాలకు ఘంటసాలగారు ఒంటరిగా తన మకామును మద్రాసుకు మార్చారు. 

సముద్రాల రాఘవాచార్యులవారు ఘంటసాలగారికి తన ఇంటనే ఆశ్రయమిచ్చి, తను పని చేస్తున్న, తెలిసిన సినీమా కంపెనీలన్నింటికీ తిప్పుతూ ప్రతీ చోటా ఘంటసాల పాటను అందరికీ వినిపింపజేసేవారు. ఈ విధంగా ఘంటసాల సముద్రాలవారింట కొన్నిమాసాలు గడిపారు. ఆ క్రమంలో నాగయ్యగారి దగ్గర, బి.ఎన్. రెడ్డిగారి వద్దా తన పాట వినిపించి వారిని మెప్పించారు. కానీ వెనువెంటనే ఏ అవకాశాలు దొరకలేదు.
ఈ అవకాశాల వేటలో తిరుగాడుతూ  టి.నగర్ లోని పానగల్ పార్క్ లోనే  కొన్ని రోజులపాటు అక్కడివారి దయాధర్మంతో రాత్రింబవళ్ళు గడిపారట.

కొన్నాళ్ళకు, ముందుగా ఘంటసాల బలరామయ్యగారి ఆఫీసులో ఉంటూ వారు తీసిన 'సీతారామ జననం' లో కోరస్ లు పాడి, ఎక్స్ట్రా వేషాలు వేసినందుకు నెలకు 75 రూపాయలందుకున్నారు.
(ఘంటసాలగారి సినిమారంగ ప్రవేశం తొలిరోజులగురించి  శ్రీ పేకేటి శివరాంగారు -)


అక్కినేని నాగేశ్వరరావు అదే సీతారామజననంలో రాముడిగా తొలిసారి హీరోగా నటించారు. అక్కినేని, ఘంటసాలల మధ్య మైత్రి బలపడింది అప్పుడే.


నాగయ్యగారి రేణుకా ఆఫీస్ లో ఉండేందుకు అవకాశం దొరికింది. నాగయ్యగారు తీస్తున్న త్యాగయ్య సినీమాలో కోరస్ పాడడం, నాగయ్యగారి శిష్యుడిగా వేషం కట్టడం వంటివి జరిగాయి. 

  ( ఈ వీడియోలో నాగయ్యగారికి ఎడమవైపు ఉన్న శిష్యుడు ఘంటసాల)

వాహినీ వారి 'స్వర్గసీమ' లో తొలిసారిగా భానుమతి గారితో కలసి  ఒక డ్యూయెట్ ను సి.హెచ్. నారాయణరావుకు పాడించారు బి.ఎన్. రెడ్డి. 


అక్కడ    బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఘంటసాలను చూసి ఆలిండియా రేడియోకు సిఫార్సు చేసి ఘంటసాల గొంతును తెలుగు శ్రోతలకు వినిపించేలా  చేశారు . నెలకు ఆరేడు ప్రోగ్రాములు ఇప్పించి భుక్తికి లోటులేకుండా ఆదుకున్నారు.  

ఇదే క్రమంలో, HMV గ్రామఫోన్ కంపెనీకి వెళితే వారు ఘంటసాల కంఠం మైకుకు పనికిరాదని తిరస్కరించారు. (అలా తిరస్కరించిన అక్కడి ఆఫీసరే మరో 18 ఏళ్ళ తర్వాత  తాను నిర్మించిన చిత్రానికి ఘంటసాలను సంగీతదర్శకుడిగా, చిత్రంలో పాటల గాయకుడిగా నియమించుకున్నారు.
ఆయనెవరనేది తరువాయి భాగాలలో చూద్దాము) .

ఆ తరువాత, ఘంటసాల పాటను విన్న పేకేటి శివరాం  HMVలో ప్రవేశించిన వెనువెంటనే ఘంటసాలగారిచేత 'నగుమోమునకు' అనే చాటు పద్యం, 'గాలిలో నా బ్రతుకు' పాటను తొలిసారిగా పాడించారు.


 అయితే అవి కలకత్తా వెళ్ళి అక్కడ రికార్డులుగా మారి ప్రజలలోకి వెళ్ళేలోగా 'స్వర్గసీమ' సినీమా ముందు విడుదలై ఒక కొత్త గాయకుడి గురించి అందరికి తెలిసింది. తరువాత, 
క్రమక్రమంగా, గృహప్రవేశం, త్యాగయ్య, యోగి వేమన (ఇందులో ఒక నాట్య సన్నివేశంలో నట్టువాంగం చేసే కళాకారుడిగా కూడా కనిపిస్తారు).



           (ఈ వీడియోలో నర్తకి పక్కన నట్టువాంగం చేస్తున్న ఘంటసాల)
పల్నాటియుధ్ధంలో నాలుగు పాటలు పాడారు. రెండు అక్కినేనితో, ఒకటి కన్నాంబతో, ఒకటి సోలోగా పాడారు.
భరణీ వారు తీసిన 'రత్నమాల' సినీమాలో భానుమతి తో రెండు డ్యూయెట్లు, ఒక సోలో పాడడమే కాక, భానుమతి, రామకృష్ణగార్ల ప్రోత్సాహంతో సి ఆర్ సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేయడంతోపాటు స్వతంత్రంగా కొన్ని పాటలను స్వరపర్చడం జరిగింది. 
ఇక, ఘంటసాల పేరు సినిమా రంగంలోనూ, ప్రేక్షకులలోనూ బాగా వినిపించడం ప్రారంభమయింది.

బాలరాజు ' చెలియా కనరావా' పాటతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మార్మోగింది.



బాలరాజు సినీమాయే సంగీత దర్శకుడిగా తన తొలి సినీమాగా ఘంటసాల చెపుతారు.
ఘంటసాల బలరామయ్యగారి బలవంతంమీద, సంగీతదర్శకుడు గాలి పెంచల నరసింహారావుగారి ప్రోద్బలంతో, సహ సంగీతదర్శకుడి హోదాలో 11 పాటలను స్వరపర్చారు.
ఇందులో అక్కినేని పాడిన 'చెలియా కనరావా' పాట గ్రామఫోన్ రికార్డ్ లో ఉంటే, ఘంటసాలగారు పాడిన అదే పాట సినీమాలో ఉంటుంది. 
అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాట సినిమాలో లేదు కనుక   ఆ అరుదైన పాట రికార్డు ఇక్కడ వినండి :
ఈ చిత్రంలో వక్కలంక సరళతో పాడిన 'నవోదయం శుభోదయం' పాటే తన తొలి సినీమా పాట స్వరరచనగా ఘంటసాల పేర్కొంటారు.


 ఘంటసాలగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు ఇద్దరూ సినీరంగప్రవేశం ఒకేసారి చేసారు.ఘంటసాలగారితో తన తొలినాళ్ళ స్నేహం గురించి ఏఎన్నార్ ఏమన్నారో ఈ ఆడియో ఫైల్ లో వినవచ్చు.
ఘంటసాలగారి సినీజీవితానికి ఒక గొప్ప మలుపు 'కీలుగుఱ్ఱం' సినిమా. ఇందులోని 'కాదుసుమా కలకాదు సుమా' పాటతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ఈ సినీమా తమిళంలో కూడా అత్యంత  విజయవంతమై తమిళనాట కూడా ఘంటసాల పేరు అందరికీ తెలియడం ప్రారంభించింది.
ఈ సినీమా గురించి మరింత చెప్పవలసి ఉంది.
కీలుగుఱ్ఱం చిత్ర నిర్మాత దర్శకుడు మీర్జాపురం రాజావారు. ఆయన సతీమణి సి. కృష్ణవేణి ప్రముఖ నటి, గాయని. వీరు స్థాపించిన శోభానాచల, ఎమ్.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ ద్వారా తమ సొంత స్టూడియో లో ఒకేసారి మూడు సినీమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మూడింటికి సంగీతం సమకూర్చే బాధ్యతను యువ సంగీత దర్శకుడైన ఘంటసాలకు అప్పగించారు. ఘంటసాలగారు మొట్టమొదట స్వతంత్రంగా సంగీతం చేయడానికి ఒప్పందం చేసుకున్న చిత్రం 'లక్ష్మమ్మ', తరువాత, 'మనదేశం', తరువాత 'కీలుగుఱ్ఱం'. అయితే, ఈ మూడింటిలో  1949 లో ముందుగా 'కీలుగుఱ్ఱం', అదే సంవత్సరం ఆఖరులో 'మనదేశం' చిత్రాలు విడుదలై కొత్త సంగీతదర్శకుడిగా, గాయకుడిగా ఘంటసాల పేరు తెలుగు వారందరికీ చిరపరిచితమయింది. తాను ముందుగా ఒప్పుకున్న మొదటి చిత్రం 'లక్ష్మమ్మ' 1950 లో రిలీజయింది. ఈ లక్ష్మమ్మ కు పోటీగా ఘంటసాల బలరామయ్యగారు, అంజలీదేవి, అక్కినేని లతో 'లక్ష్మమ్మ కథ' సినీమా తీశారు, కానీ, విజయవంతం కాలేదు.
కృష్ణవేణి, సి.హెచ్. నారాయణ రావు నటించి త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మమ్మ' గొప్ప హిట్ అయింది. రెండింటి కథా ఒకటే.
ఇక, అక్కడ నుండి ఘంటసాల రక్షరేఖ, లైలామజ్ను, ధర్మాంగద, మనదేశం వంటి చిత్రాలలో తన పాటలతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు.

భానుమతిగారి సూపర్ హిట్ విషాద ప్రేమగాథ 'లైలామజ్ను'. ఇందులో  ఘంటసాలగారు పాడిన తొమ్మిది పాటలు చిత్రానికి జీవం పోసాయి. తమిళంలో కూడా లైలామజ్ను,  పాటలవల్లే సూపర్ హిట్ అయింది. 
1949 లో 'మనదేశం'
1950 లో 'షావుకారు' చిత్రాల సంగీతదర్శకుడిగా ఘంటసాల అగ్రశ్రేణి సంగీతదర్శకుల జాబితాలోకి ఎక్కారు. 
ఇక అక్కడ నుండి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాల సినీ ప్రస్థానం రెండున్నర దశాబ్దాల పాటు నిరాటంకంగా  కొనసాగింది. 
ఒక ప్రక్క సినీమాలలో పాడుతూనే, ఓ మూడేళ్ళపాటు  మరో ప్రక్క ఆలిండియా రేడియోలో  శాస్తీయ, లలిత  సంగీతం, నాటకాలు, రూపకాలు అంటూ అన్ని రకాల కార్యక్రమాలలో  పాల్గొనేవారు.

ఘంటసాలగారిని ఆదిలో తిరస్కరించిన హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) వారు, తమ నిరంతర గాయకుడిగా నియమించుకున్నారు .

తెలుగువారి సొత్తుగా చెప్పుకునే పద్యపఠన ప్రక్రియను, నూతన శైలిలో తెలుగువారికి అందించిన ఘనత ఘంటసాలకే దక్కుతుంది. తెలుగులో సుప్రసిధ్ధ కవులందరి పద్యాలను గ్రామఫోన్ రికార్డ్ లు గా విడుదల చేసి దేశమంతా సంచలనం సృష్టించారు.  అలాగే, తిరుపతి వేంకటేశ్వరుని మీద లెఖ్ఖకు మించి భక్తిగీతాలను, ప్రబోధగీతాలను, దేశభక్తి గీతాలను ఆలపించి  తెలుగునాట ఒక ప్రభంజనంలా సంచలనం సృష్టించారు.

పద్య పఠనం విషయంలో ఘంటసాలవారు తమ గురుదేవులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారినే స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకున్నారు.  గురువుగారి ప్రభావం ఘంటసాలగారి మీద చాలానే ఉంది.
కేవలం ఘంటసాల పాటలతోనే హెచ్.ఎమ్.వి. వారు ఆంధ్రదేశంలో నిలదొక్కుకున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కానేరదు.

చలన చిత్రసీమలో ఘంటసాలగారు సాధించిన విజయాలు అనన్యసామాన్యం, అనితరసాధ్యం. 

1950 ల తర్వాత, ఘంటసాల సినీ సంగీత చరిత్ర ఒక తెఱచిన పుస్తకం. ఆ విషయాలు నేను చెపితేనే మీరు తెలుసుకోవాలని లేదు.
ఇంటింటా ఒక ఘంటసాల వెలయడానికి కారణభూతులైన తెలుగు ప్రజలందరికీ ఘంటసాల తమ మనిషే. ఈనాటికీ చాలా తెలుగు లోగిళ్ళలో ఘంటసాల పాటతోనే సూర్యోదయమై, ఆయన జోలపాటతోనే నిద్రపోతారు.

ఈవిధంగా విజయపథంలో పయనిస్తున్న ఘంటసాలగారు విజయనగరం వదలి వెళ్ళిన మరో ఐదారేళ్ళకు మరల తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని విజయనగరంలో దర్శించారు.
ఆ విశేషాలన్నీ.....
వచ్చేవారం....   (సశేషం)
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified. 


Friday, July 3, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఆరవ భాగం


 
35, ఉస్మాన్ రోడ్.-  ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) -  ఆరవ భాగం
మొదటిభాగం  ఇక్కడ
రెండవ భాగం   ఇక్కడ
మూడవభాగం  ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ
ఐదవభాగం      ఇక్కడ
భాగం - 6. 

*నెం.35 ఉస్మాన్ రోడ్*

                🌳
                    ...స్వరాట్

విజయనగరంలో సంగీతశిక్షణ పూర్తి చేసుకొని స్వగ్రామమైన చౌటపల్లి చేరుకున్న ఘంటసాల జీవితంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు , విశేషాలు అన్నీ , అనేక పత్రికలలో , పుస్తకాల రూపంలో వెలువడ్డాయి . ఆ విషయాలన్నీ  ఆ తరం తెలుగువారందరికీ అవగతమే. అయినా ఈ తరంవారు  ఘంటసాల గురించి మరింత తెలుసుకునేందుకు , ఘంటసాల తన జీవితచరిత్రలో చెప్పుకున్న విశేషాలను సంక్షిప్తంగా , ఈ 6వ భాగంలో మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

కర్ణాటక సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామమైన చౌటపల్లి చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆంధ్రదేశంలో అనేక చోట్ల శ్రీరామనవమి , గణపతి నవరాత్రులు , శారదా నవరాత్రులు , మొ.ఉత్సవ కార్యక్రమాలలో , పెళ్ళిళ్ళలో అనేక సంగీత కచేరీలు చేశాడు. అటువంటి సమయంలోనే ఆంధ్రదేశంలో సుప్రసిధ్ధ సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులైన సర్వశ్రీ హరినాగభూషణంగారు , పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు , వారణాసి బ్రహ్మయ్య శాస్త్రిగారు , క్రోవి సత్యనారాయణ గారు
మొదలైనవారి ఆశిస్సులు లభించాయి. 

అయితే  ఘంటసాలకు కేవలం సంగీత కచేరీలపైన వచ్చే ఆదాయంతోనే జీవించడం సాధ్యం కాదనిపించింది. 
ఆంధ్రదేశంలో సంగీత కచేరీలకన్నా నాటక ప్రదర్శనలు , హరికధా కాలక్షేపాలే ఆర్ధికంగా లాభదాయమనిపించింది. నాటక కళ మీద మొదటినుంచి అభిరుచి ఉండడంవలన తానే స్వయంగా ఒక నాటక సంస్థను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. 
అలాటప్పుడే ప్రముఖ రంగస్థల నటులైన అద్దంకి ,పారుపల్లి , సూరిబాబు , రఘురామయ్య, పులిపాటి , పీసపాటి 
మొ.వారి పరిచయాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలో వీరిలో కొందరితో కలసి స్టేజ్ మీద నటించే అవకాశమూ లభించింది. ఆ తరుణంలోనే ఒకసారి ఆంధ్రనాటక కళాపరిషత్ లో కూడా పాల్గొన్నా ఏవిధమైన గుర్తింపు లభించలేదు. 
(అయితే మరో పుష్కరం తరువాత అదే ఆంధ్రనాటక కళా పరిషత్ వారు ఘంటసాలను ఘనంగా సన్మానించడం జరిగింది. )

ఈ విధంగా ఉదరపోషణకోసం సంగీత కచేరీలతో , నాటకాలతో దుర్భరంగా బండిలాగిస్తున్న సమయంలో పులిమీద పుట్రలా మరో విపరీతం వచ్చిపడింది.

 రెండవ ప్రపంచ యుధ్ధ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. బ్రిటిష్ వారి బానిసగా మన దేశం దాస్యం చేస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నాయకులందరిని జైళ్ళలో పెట్టారు. 1942 ఆగస్ట్ లో  జాతీయ కాంగ్రెస్ 'క్విట్ ఇండియా' తీర్మానం చేసింది. రాజకీయంగా దేశమంతటా ఉద్రేక పరిస్థితి నెలకొన్నది. విప్లవోద్యమం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా చెలరేగింది.

రాజకీయాలగురించి గానీ , దేశ పరిస్థితి గురించి గానీ , ఉద్యమాల గురించి గానీ ఏమీ తెలియని ఘంటసాలలో ఒక అమాయక ఆవేశం ఉవ్వెత్తున తలయెత్తింది. స్కూల్ చదువు కూడా అంతంతమాత్రమే.
అతను తన పదవ ఏట , హరిజనోధ్ధరణ ప్రచారం కోసం జాతిపితగా పేరొందిన మహాత్మాగాంధీ తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది. భారతదేశ  స్వాతంత్రోద్యమ సూత్రధారి కూడా అదే గాంధీయని తెలిసింది. దేశంకోసం , భారత పౌరుడిగా  తాను కూడా త్యాగం చేయవలసిన సమయం ఆసన్నమైయిందని సహ మిత్రులతో కలసి స్థానికంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని వీధులలో దేశభక్తి గీతాలు ఆలపించడం మొదలెట్టాడు. ఇది చూసిన తెల్ల దొరల ప్రభుత్వం అందరితోపాటు ఘంటసాలకు కారాగార శిక్ష విధించింది.


ఘంటసాలకు జైలు జీవితం ఎంతగానో సహకరించింది. 
నియమబధ్ధమైన జీవితం , కర్తవ్యం , స్థిర సంకల్పం మొదలైన విషయాల లో మంచి అవగాహన ఏర్పడింది. 
అందరితో కలివిడిగా మెలిగే నైజం ఉండడం వలన జైలులో వీరూ వారు అనక అందరికీ స్నేహపాత్రుడయ్యాడు. 
ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులైన సర్వశ్రీ - బెజవాడ గోపాలరెడ్డి , పొట్టి శ్రీరాములు , బి ఎస్ మూర్తి , ఎర్నేని సుబ్రహ్మణ్యం వంటి వారి సహచర్యం ఘంటసాలకు లభించింది. ఘంటసాల తన పాటలు , పద్యాలతో జైల్లోని అన్ని వర్గాలవారిని ఉత్సాహపరచి , ఉత్తేజితులను చేశాడు. 
అయితే , జైలునుండి విడుదల పొందిన తరువాత ఘంటసాలలో ఆ రాజకీయ ప్రభావం ఏదీ మిగలలేదు. మళ్ళా యధాప్రకారంగా నాటకాలతో , సంగీత కచేరీలతో రోజులు గడపసాగాడు.

అటువంటి సందర్భంలో ఘంటసాలకు పెదపులివర్రుకు చెందిన కొడమంచిలి వెంకట రత్న శాస్త్రి గారి రెండవకుమార్తె సావిత్రి తో వివాహం నిశ్చయమయింది.

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చేవారం....
                        సశేషం.

Friday, June 26, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఐదవ భాగం


నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) -  ఐదవ భాగం
 
మొదటిభాగం  ఇక్కడ
రెండవ భాగం   ఇక్కడ
మూడవభాగం  ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ

                              

                             నెం. 35 ఉస్మాన్ రోడ్

               
                                                                                                 - స్వరాట్

విజయనగరం లో ఘంటసాల సంగీతాభ్యాసం అటు సంగీత కళాశాల లోనూ ఇటు గురువుగారు పట్రాయని సీతారామశాస్త్రి గారింటి వద్ద కూడా సాగేది. సంగీతం పట్ల ఒక లక్ష్యం , ఉత్సాహం , శ్రధ్ధ గల విద్యార్ధులకు ఏ సమయంలోనైనా సీతారామశాస్త్రి గారు సంగీత శిక్షణలు యిచ్చేవారు. ఈ విషయాన్ని ఘంటసాలవారు తమ  జీవిత చరిత్రలో , ఇంటర్వ్యూ ల లో తెలియజేశారు.

" సంగీత విద్య యెడల నాకు గల తీవ్రమైన ఆకాంక్షను అర్ధం చేసుకున్నారు. నన్ను సర్వ విధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగించారు. శ్రీ శాస్త్రిగారి గానం , వారి మూర్తిమంతం,   సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించాయి. 'గురువు' అన్న మాట శ్రీ శాస్త్రిగారియెడలనే సార్ధకమయిందనిపించింది. వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించాను.
ఈ సమయం , ఆ సమయం అని లేకుండా అన్ని వేళల్లో నన్ను కూర్చోబెట్టి సాధన చేయించేవారు. ఆయన ఎప్పుడూ " సాంబ సదాశివ" నామాన్ని స్మరిస్తూ ,అదే నాదంగా నాభిస్థానం నుండి ఎలా పలకాలో చెపుతూ నాతో కూడా పాడించేవారు.

ఘంటసాలగారు AIR కార్యక్రమంలో తనపైన ప్రభావం చూపిన గురువుగారి గురించి  ఇలా అన్నారు - 

ఆడియో లింక్ ఇక్కడ వినవచ్చు. 



ఆ విధంగా ఘంటసాల సంగీతాభ్యాసం కొనసాగింది.

సంగీతాభ్యాసానికి విజయనగరం వచ్చినప్పుడు కొంతకాలం తన ఆకలిబాధను తీర్చుకోవడానికి మధూకరం ఎత్తినా,  సంగీతకళాశాలలో చేరిన కొన్నాళ్ళకు  మహారాజావారి  సింహాచలం సత్రవులో పద్దు కుదిరింది. ఆకలి సమస్య తీరింది. సత్రవు భోజనం, మఠం నిద్ర (గురువుగారింట).  కళాశాల విద్య ముగిసే రోజులలో తన రాత్రి బసను "మూడు కోవెళ్ళ" కు మార్చాడు.

ఆ రోజుల్లో పేద విద్యార్ధులు వారాలు , మధూకరం చేసుకుంటూ విద్యభ్యాసం చెయ్యడాన్ని అందరూ సహజంగానే భావించేవారు.
గృహస్థులు కూడా ఆలాటి విద్యార్ధుల ఎడల ప్రేమను కనపర్చేవారు. సంప్రదాయజ్ఞులు కూడా విద్యార్ధులు మధూకర వృత్తిని అవలంబించడం మహోత్కృష్టకార్యంగా భావించేవారు.

అయితే ఇందుకు మినహాయింపులు కూడా ఉంటాయి. గురువులు శిష్యుడి శ్రధ్ధను , మనోప్రవృత్తిని గమనించి అందుకు తగినట్లుగానే విద్యాబోధన చేసేవారు. అందుకు ఉదాహరణ గా యీ చిన్న కథ చూద్దాము.

ఒక కుర్రవాడు గురుకులంలో చేరి , గురు శుశ్రూష చేస్తూ శ్రధ్ధగా విద్యాభ్యాసం చేసేవాడు. అతని భోజన వసతులన్నీ గురువుగారింటనే సాగేవి. ఆ గురు దంపతులు ఆ బాలుడిని తమ కన్నకొడుకులతో సమానంగా ప్రేమగా  చూసుకునేవారు.

ఇలా కొన్నేళ్ళు గడిచాయి.

ఒకరోజు గురుపత్ని ఆ విద్యార్ధికి భోజనం వడ్డించి అన్నంపై నెయ్యి వడ్డించింది. వెంటనే , ఆ శిష్యుడు ఆమెను వారిస్తూ , " అమ్మగారు , మీరు పొరపాటున  నాకు నెయ్యికి బదులు ఆముదం వడ్డిస్తున్నారు. గమనించండి ," అని అన్నాడు. " అయ్యో ! అలాగా నాయనా ! చూసుకోలేదు " అంటూ ఆవిడ మరల నేయి తీసుకువచ్చి వడ్డించింది. ఇదంతా  గురువుగారు చూస్తూనే ఉన్నారు. మర్నాటి ఉదయం శిష్యుడు అధ్యయనం కోసం గురువుగారి సమక్షానికి వచ్చాడు. గురువుగారు అతనిని చూసి " నాయనా ! నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇక నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళవచ్చును " అని చెప్పారు. అది విని శిష్యుడు నిర్ఘాంతపోయాడు. తనవల్ల ఏం తప్పు జరిగిందో తెలియక ,  గురువుగారి మాటలు అర్ధంకాక శిష్యుడు గురువుగారి కాళ్ళమీద పడ్డాడు. 

ఆయన అతనిని  లేవదీసి బుజ్జగింపుగా " నాయనా ! నీకు ఎప్పుడైతే విద్య పట్ల లక్ష్యం మారి ఇతర విషయాలపై బుధ్ధి లగ్నం చేశావో , అప్పుడే నీ విద్య ముగిసింది. ఇన్నాళ్ళూ నీవు గురువమ్మగారి చేతి భోజనమే చేస్తున్నావు. ఇన్నాళ్ళూ , ఆవిడ నీ భోజనంలో ఆముదమే వడ్డించేది , నెయ్యి కాదు. నీవు మారుమాటాడకుండా అదే భుజించేవాడివి. అప్పుడు నీ లక్ష్యం , ఏకాగ్రత అంతా నీ విద్య మీదనే ఉండేది. నిన్న నీకు భోజనంలో నెయ్యికి బదులు ఆముదం వడ్డించారానే విషయం తట్టింది. అంటే నీ దృష్టి మరలింది. ఏకాగ్రత తగ్గింది. ఇంక నీకు విద్య బుధ్ధికెక్కదు. నీ విద్యాభ్యాసం ముగిసినట్లే. ఇక నీవు ఇంటికి వెళ్ళి వేరే ఏదైనా వృత్తి చేసుకొని నీ తల్లిదండ్రులను సుఖపెట్టు " అని మంచి సలహాలతో అతనిని గురుకులం నుండి పంపివేశాడు.

ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసింది, ఏ విద్యయైనా నేర్చుకోవాలంటే చిత్తశుధ్ధి , లక్ష్యం , ఏకాగ్రత , వినయ విధేయతలు కావాలి.
ఈ లక్షణాలు ఉన్న విద్యార్ధులు  మాత్రమే తమ కృషితో ఉన్నతిని సాధిస్తారు.

ఈ లక్షణాలన్నింటితో ఘంటసాల వెంకటేశ్వర్లు పట్రాయని సీతారామశాస్త్రి గారి సన్నిధిలో సశాస్త్రీయమైన సంగీత విద్యను క్షుణంగా అభ్యసించాడు.

గురువుగారింట శిక్షణ అయాక నల్ల చెరువు మెట్టల సమీపంలో  ఉన్న ఒక బావి దగ్గర స్నానాదికాలు ముగించి , దగ్గరలో ఉన్న వ్యాసనారాయణ స్వామి గుడి ఆవరణలో మరల సంగీత సాధన చేసేవాడు. ఆ వ్యాసనారాయణ మెట్టనే నల్లచెరువు మెట్టలు , బాబా మెట్టలు అని కూడా అనేవారు. అక్కడ ఖాదర్ అవులియా బాబా ఆశ్రమం ఉండేది. ప్రతీ రోజూ సాయంత్రం ఆ బాబాగారి సమక్షంలో సంగీత , నృత్య కార్యక్రమాలు జరిగేవి.

విజయనగరంలో సంగీత విద్యార్ధులు తమ విద్యాసాధనని పరీక్షించుకోవడానికి , సార్ధకపర్చుకోవడానికి అనేక భజన గోష్ఠులు అవకాశం కల్పించేవి. వ్యాసుల రాజారావు గారి మేడలోనూ , వంకాయలవారింటిలోనూ , శంభరదాసుగారి కుటీరంలోనూ   ప్రతీవారం ఏదో రోజున భజన కాలక్షేపం ఉండేది. ఏకాహాలు , సప్తాహాలు అంటూ ఏడాది పొడుగునా సత్కాలక్షేపాలు జరిగేవి. వీటిలో , విద్వాంసులు , విద్యార్థులు అనే తేడాలేకుండా అందరూ పాల్గొనేవారు. ఈ భజన గోష్ఠులలో సాధకులకి మంచి ప్రోత్సాహం , పాడడానికి చొరవ ఏర్పడేవి . ఏదో ఒక కీర్తన తీసుకొని బృందగానం చేసేవారు. స్వరకల్పనలలో అందరూ పోటీపడి పాల్గొనేవారు.

ఇలాటివాటిని వెంకటేశ్వర్లు బాగానే సద్వినియోగం చేసుకున్నాడు.
అంతేకాదు , గురువుగారి " కౌముదీ పరిషత్ " సాహీతీ , సంగీత గోష్ఠులను ఆసక్తితో , శ్రధ్ధగా పరిశీలిస్తూ తన సంగీతవిద్యను పెంపొందించుకున్నాడు.

ఇటువంటి సుహృధ్భావ వాతావరణం లో ఘంటసాల సంగీత విద్య ముగిసింది.
ఇక ఆ ఊరినుండి వెళ్ళిపోయే సమయంలో , విజయనగరం లో శ్రీ మారుతీ భక్త మండలి , సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఘంటసాలచేత ఒక సంగీత కచేరీ చేయించారు. ఆ సందర్భంగా ఘంటసాలకు , హరికధా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి చేతుల మీదుగా ఒక తంబురాను బహుకరించారు. ఆ తంబురా తన జీవితంలో అత్యంత విలువైనదిగా ఘంటసాలవారూ తరచూ అందరికీ చెప్పేవారు.

ఘంటసాల వెంకటేశ్వర్లు సంగీత కళాశాల విడిచిపెట్టిన నాటికి ప్రముఖ కర్ణాటక సంగీత గాత్రజ్ఞులు సర్వశ్రీ నేదునూరి కృష్ణమూర్తి , నూకల చిన సత్యనారాయణ , జనగాం ఆంజనేయులు , వైణిక విద్వాంసులు అయ్యగారి సోమేశ్వరరావు , మొ.వారు అప్పటికింకా విద్యార్ధి దశలోనే ఉండేవారు.

ఇక్కడ , శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఆసక్తికరమైన విషయం.
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు , శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు , విజయనగరం సంగీత కళాశాలలో వైలిన్ విద్యార్ధులుగా చేరి సంగీతం నేర్చుకున్నారు. వైలిన్ లో శిక్షణ ముగిసిన కొన్నేళ్ళకు గాత్రంలో సాధన చేసి గాత్ర విద్వాంసులుగా స్థిరపడ్డారు. ఈ యిద్దరూ కూడా కొన్ని సంగీత కచేరీలలో శ్రీ సంగీతరావు గారికి వైలిన్ వాద్య సహకారం అందించారట.

(అలాగే , మద్రాస్ లో జరిగిన ఒక కచేరీలో సంగీతరావు గారికి శ్రీ హరి అచ్యుత రామశాస్త్రి గారు (ప్రముఖ సంగీత విద్వాంసులు కీ.శే. శ్రీ హరి నాగభూషణం గారి కుమారులు శ్రీ హరి అచ్యుతరామ శాస్త్రి. చాలా ప్రముఖ సంగీత దర్శకుల వాద్యబృందాలలో పేరుపొందిన వైలినిస్ట్.) వైలిన్ సహకారం అందించడం నాకు బాగా గుర్తుంది.)

సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామం చేరుకున్నారు.

తరువాత , ఏం జరిగిందో , మనం కూడా విజయనగరం నుండి బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడేనా...
కాదు , వచ్చే వారం.

                     .... సశేషం

Friday, June 19, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - నాలుగవ భాగం


మొదటి సంచిక ఇక్కడ
రెండవ సంచిక ఇక్కడ
మూడవ సంచిక ఇక్కడ

భాగం - 4.
                              
                                         నెం.35 ఉస్మాన్ రోడ్                                                                                                                       -                                      స్వరాట్


ఘంటసాల వెంకటేశ్వర్లు విజయనగరం లోని విజయరామ సంగీత కళాశాలలో ప్రవేశించేనాటికి విజయనగరం నేపథ్యం, సంగీత కళాశాల నేపథ్యం  గురించి మనం కొంత అవగాహన ఏర్పర్చుకోవాలి. అప్పుడే , ఘంటసాల విద్యాభ్యాసం ఎలా జరిగిందనే విషయం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
 దాదాపు వంద సంవత్సరాల క్రిందటి విజయనగరం యొక్క గత వైభవం గురించి సమర్ధవంతంగా  ఈనాడు మనకు చెప్పగల ఏకైక వ్యక్తి శ్రీ పట్రాయని సంగీతరావు గారు మాత్రమే. అందుకే , వివిధ సందర్భాలలో శ్రీ సంగీతరావు గారు వెలిబుచ్చిన విషయాలనే ఈ నాలుగవ భాగంలో ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వారి మాటలలోని సారాంశాన్ని నాకు తెలిసిన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను.

" సంగీతం నేర్చుకోవడానికి దూరప్రాంతాలనుంచి విజయనగరం వచ్చేవారు. అలా వచ్చినవారిలో నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రులలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు.
సాధ్యమైనంత వరకు విద్యార్ధిలో ఉండే సహజసిధ్ధమైన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి దోహదం చేసేదే నిజమైన విద్య. అది మా తాతగారి విద్యా విధానం . ఆ పధ్ధతినే మా నాన్న అనుసరించారు."

1936 డిసెంబర్ లో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించారు. ఆనాటి విజయనగరం మహారాజు - శ్రీమద్ అలక్ నారాయణ గజపతి మహారాజుగారు (మనకు తెలిసిన అశోక్ గజపతిరాజు , ఆనంద గజపతిరాజు గార్ల తాతగారు).
ఆనాడు విజయనగరం సాంస్కృతికంగా ఆంధ్రదేశంలో ప్రముఖంగా ఉండేది. విజయనగరం కాలేజీ దేశంలో పురాతనమైనది.సంస్కృత కళాశాల , సంగీత కళాశాలలు విజయనగరంలో మాత్రమే ఉండేవి.
నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తెరమరుగై అప్పటికి చాలాకాలం అయింది. ఆటపాటలమేటి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు , మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు , ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వీణా వెంకటరమణయ్య దాసుగారు , మల్లాది విశ్వనాథ కవిరాజు , కవిశేఖర భోగరాజు నారాయణ మూర్తి , మొదలయిన మహనీయులు ఆనాటికి ఉండనే ఉన్నారు. పేరి లక్ష్మీనారాయణ శాస్త్రిగారు , వఝ్ఝల చినసీతారామశాస్త్రిగారు సంస్కృత కళాశాల అధ్యాపకులు గా ఉండేవారు.
సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారి హయాంలో హరికథా కాలక్షేపం విద్యార్ధులే ఎక్కువగా ఉండేవారు. దాసుగారు రిటైరయ్యాక ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయన వచ్చిన తరువాత సంగీత కళాశాలలో సంప్రదాయ సంగీతాధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. వాసా వెంకటరావుగారు వీణ అధ్యాపకులుగా , పట్రాయని సీతారామశాస్త్రి గారు , పేరిబాబుగారు , నేమాని వరహాలు దాసుగారు గాత్ర పండితులుగాను , మునిస్వామి గారు నాదస్వర పండితులు గా , శ్రీపాద సన్యాసిరావుగారు మృదంగ పండితులుగానూ ఉండేవారు.

సరిదె లక్ష్మీ నరసమ్మగారు , ఆ రోజుల్లో , సుప్రసిధ్ధ నర్తకి. ఆవిడనే కళావర్ రింగ్ అనేవారు.
1940 ప్రాంతాల్లో శ్రీ శ్రీ తరుచూ విజయనగరం లో కనిపించేవారు. శ్రీ ఆరుద్ర విజయనగరం కాలేజీ లోనే చదువుకున్నారు. ప్రముఖ కవి శ్రీరంగం నారాయణ బాబు అక్కడివారే. గొప్ప సంగీతాభిమాని . ద్వారం వారి సంగీత కచేరీ అయిన తరువాత తరుచూ నారాయణ బాబుగారి ప్రసంగం కూడా ఉండేది. ప్రముఖ సాహితీవేత్త రోణంకి అప్పలస్వామిగారు , సుప్రసిధ్ధ కథకుడు చాగంటి సోమయాజులు గారూ విజయనగరంలోనే వుండేవారు. విశ్వవిఖ్యాత పహిల్వాన్, కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారు కూడా విజయనగరం లోనే ఉండేవారు. అప్పటికే అనారోగ్యంపాలయ్యారు.
అప్పట్లో , చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఆంధ్రదేశం అంతటా సుప్రసిధ్ధులుగా ఉండేవారు.నటుడిగా , హరికథకుడిగా , నాటి యువతరానికి మార్గదర్శి ఆయన.మారుతీ భక్త మండలి అనే కళా సంస్థ నిర్వహించేవారు.
సాలూరు చిన గురువుగా ప్రసిధ్ధులైన పట్రాయని సీతారామశాస్త్రి గారింట్లో నిత్యమూ సంగీత , సాహిత్య సమ్మెళనం జరుగుతూండేది. గురువుగారి మిత్రులు , సాహిత్యవేత్తలు , పండితులు , కవులు , కధకులు , నవలా రచయిత లు అందరూ అనేక విధాలైన చర్చలు చేస్తూండేవారు. సంగీత , సాహిత్యాల పరస్పర సంబంధ విషయమై ఆ రోజుల్లో సీతారామశాస్త్రి గారి సంగీత శిష్యుడు పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారి ' లక్ష్య , లక్షణ సమన్వయం ' అనే వ్యాసం ' వేదిక్ రీసెర్చ్' అనే పత్రికలో ప్రచురించారు. అది గురువుగారి ఆదర్శాలను ప్రతిబింబించేదిగా భావించబడింది. గురువుగారింట్లో సమావేశమైన మిత్రబృందమే తరువాత 'కౌముదీ పరిషత్తు' గా పరిణమించింది. ఈ పరిషత్తు సభ్యులు చాలామంది సుప్రసిధ్ధ రచయితలుగా , సంగీతజ్ఞులుగా లోకానికి పరిచయమయ్యేరు.

శ్రీ బుర్రా శేషగిరిరావు పంతులుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన అతి పెద్ద సంస్ధ ' ఆంధ్ర భారతీ తీర్థ'. అదే ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ'. యువరచయితలు , కవులు , కధకులు , తమ రచనలను ఈ సంస్థ సభలలో వినిపించేవారు. యువగాయకులు , వాద్యకులు తమ గానాన్ని ప్రదర్శించేవారు. అర్హులకి బిరుదు ప్రదానాలని కూడా ఈ సంస్థ నిర్వహించేది.
మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గురువుగారు , సుప్రసిధ్ధ సంగీతజ్ఞులు కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్యగారికి ' గాయక సార్వభౌమ' బిరుదు , విద్యావేత్త గిడుగు సితాపతిగారికి గౌరవ డాక్టరేట్ , స్థానం నరసింహారావుగారికి ' నటశేఖర' ఈ సంస్థే ప్రదానం చేసింది.
( పట్రాయని సీతారామశాస్త్రి గారికి , పట్రాయని సంగీతరావుగారికి కూడా ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ వారు 'సంగీతభూషణ' బిరుదులను ఇచ్చింది.)

ఇటువంటి సాంస్కృతిక వాతావరణం తో నిండిన విజయనగరంలో సంగీతం అభ్యసించడానికి గంపెడాశతో వచ్చాడు ఘంటసాల వెంకటేశ్వర్లు. వచ్చీ రాగానే కలిగిన చేదు అనుభావాలను దిగమ్రింగుకొని పట్రాయని సీతారామశాస్త్రి గారి పంచనజేరాడు.
అప్పుడు అతను ఎలా ఉండేవాడు ?
" ఘంటసాలతో నా మొదటి పరిచయం 1938 లో అని జ్ఞాపకం.తేదీలవారీగా చెప్పుకోవాలంటే ఆ జ్ఞాపకాలు యదార్ధానికి కొంచెం  ఇటూ అటు గా ఉండే అవకాశం ఉంది.
చామనచాయగా , బొద్దుగా , కొంచెం పళ్ళు ఎత్తుగా , కాంతివంతమైన కళ్ళతో , స్నేహశీలమైన హావభావాలతో అతను అందరికీ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక నిక్కరు , గళ్ళషర్టూ ఇది వేషం. కొంచెం ఈడుకి మించి కనిపించేవాడు."
గురువు గారు పట్రాయని సీతారామశాస్త్రిగారి విలక్షణత గురించి గతంలో కొంత చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొంత చూద్దాము.
" శాస్త్రిగారు ఒకవిధంగా వివాదాస్పదమైన పండితులుగా భావింపబడేవారు. వారికి సంగీతం లోనే కాక సాహిత్యం లో కూడా మంచి అభినివేశం ఉండేది. కచేరీలలో ఆయన సొంత రచనలే గానం చేసేవారు. హర్మోనియం ప్రక్క వాద్యంగా తానే వాయించుకొని పాడేవారు. ఇది సంప్రదాయజ్ఞులకి నచ్చేదికాదు. శాస్త్రిగారికి త్యాగరాజస్వామి కీర్తనల విషయంలో త్యాగరాజు సంగీతం పట్లే కాకుండా సాహిత్యం విషయంలో కూడా ఎంతో మమకారం ఉండేది. త్యాగరాజ కీర్తనలలోని సాహిత్యం పోషించడానికి ఆయన ఒక విశిష్టమైన పధ్ధతిలో గానం చేసేవారు. నిజానికి శాస్త్రానికి విరుధ్ధంగా ఆయన ఏమీ చేయలేదు. సలక్షణమైన రాగతాళాలను అతిక్రమించి ఆయన ఎన్నడూ పాడేవారు కాదు. కానీ సంప్రదాయజ్ఞులకు ఆయన బాణీ ఏదో విప్లవ ధోరణిలో కనపడేది. ఆయన కాలేజీలో విద్యార్ధులకు సంప్రదాయ పధ్ధతులలోనే పాఠం చెప్పేవారు. బయట గానం చేసేప్పుడు ఆయన పధ్ధతి ఆయనదే.
పట్రాయని సీతారామశాస్త్రి గారు గానం చేసే విధానం అపూర్వమైనది. ఆయన కచేరీలో సరస్వతీ ప్రార్ధన . ఆయన స్వకీయమైన ఒక పద్యంతో ప్రారంభించేవారు . ఆ పద్యం ఆధారంగానే రాగాలాపన , స్వరకల్పన , సంకీర్తన మొదలైన చాలా కచేరీ అంశాలు నడిపించేవారు.
ఆయన తన కచేరీలలో అలవాటు గా పాడిన పద్యం :

సీసపద్యం : 
రాగమందనురాగ రసములొల్కించుటే
అమ్మరో నీ మందహాసమమ్మ

గడియారమునకె సద్గతిని జూపు లయ తాళ
గతులెన్న నీ మందగమనమమ్మ

పూలమాలికల కూర్పును బోలు స్వరకల్పనలు నీదు
మృదుల భాషలు గదమ్మ

శృతియందు లీనమౌ గతి
మది నిల్పుటే
భారతీ నీ శాంతభావమమ్మ

నవరసంబుల సముద్భవమంద జేయుటే
శారదా నీ కటాక్షము గదమ్మ 🌷

తేటగీతి :

భావ రాగంబులును, తాళ ఫణితి , శృతియు
గలియ గానంబు జేసెడి
గాయకునకు
శృతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జననీ .
https://youtu.be/rxTrppbqk-Y

సామాన్య శ్రోతలనుంచి , సంగీత సాహిత్యాల సమన్వయం కోరే రసజ్ఞులందరికీ సీతారామశాస్త్రి గారి గానం రస ప్రవాహంలో ముంచెత్తేది.

గురువుగారి విశిష్టమైన గానం ఘంటసాలను ఎంతో ఆకర్షించింది. సంగీతం విషయంలో పట్రాయని సీతారామశాస్త్రి గారి మార్గమే ఘంటసాలకి కూడా ఆదర్శమయింది.

తరువాతి కాలంలో ,పట్రాయని సీతారామశాస్త్రి గారి స్మారక సంచికలో గురువుగారి సంగీత శిక్షణలో తాను గ్రహించిన విషయం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మాటలలో ఈ విధంగా ఉంది.



'సంగీత శాస్త్రము , లక్ష్య గ్రంధము నేను ఇతర పండితుల నుండి సంగ్రహించగలిగే వాడినేమో, గాని గురువుగారు నాకు ప్రసాదించినది అనితర లభ్యమైనదని నా విశ్వాసం.
ముఖ్యంగా గాత్ర సాధన చేయడంలో అలవర్చుకోవలసిన శృతిశుధ్ధి , నాదశుధ్ధి , గమకశుధ్ధి , తాళగత , స్వరగత , లయశుధ్ధి శిష్యులకు కలగజేయడంలో ఆ మహానుభావుడు సిధ్ధుడు.
వారు నాదానుభవాన్ని ' సాంబసదాశివ ' అనే నామ సంకీర్తనతో మంత్రవతుగా నాలో ప్రసరింపజేశారు. కీర్తనలలోని రసభావాలకి అనుగుణ్యంగా పట్టువిడుపులతో గమకాలు అంత సార్ధకంగా ప్రయోగించడం గురువుగారి వంటి నాదసిధ్ధులకు మాత్రమే సాధ్యమని నా నమ్మకం."

ఒకవిధంగా పట్రాయని సీతారామశాస్త్రి గారు కాలానికి సరిపడని విద్వాంసులనిపిస్తుంది.

అటువంటి నాదయోగి సన్నిధిలో  వెంకటేశ్వర్లు సంగీతశిక్షణ నిరాటంకంగా కొనసాగింది. తరువాత ,....
వచ్చేవారమే.....         (సశేషం)


                       

Friday, June 12, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - మూడవభాగం

                                           🌳 నెం. 35 , ఉస్మాన్ రోడ్ 🌳

                                                                                         -  స్వరాట్

                                              


తండ్రి గారు తన ఆఖరి క్షణాలలో యిచ్చిన సలహా ప్రకారం ఎలాగైనా సరే సంగీతం నేర్చుకోవాలనే పట్టుదలతో , యింట్లో ఎవరికీ చెప్పకుండా  చేతినున్న ఉంగరాన్ని అమ్మి ఆ డబ్బుతో విజయనగరం చేరుకున్నాడు వెంకటేశ్వర్లు. అక్కడున్న సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించాలని అతని కోరిక. 

కానీ , దురదృష్టం అతడిని వెంటాడుతూనే వుంది. అతను విజయనగరం వెళ్ళిన సమయానికి సంగీత కళాశాల వేసవి శెలవుల కారణంగా మూసివేశారు. ఏం చేయాలో తోచక ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడిగారిని ఆ కుర్రవాడు కలిసి తన గురించి చెప్పుకోగా , కళాశాల తెరిచేంతవరకు సంగీత కళాశాలలోనే తలదాచుకుందుకు అనుమతించారు నాయుడుగారు. అతనిలాటి వారే కొందరు సంగీత విద్యార్థులు శెలవులకు యిళ్ళకు వెళ్ళలేనివారు అక్కడే బసచేసేవారు. తమ మధ్యకు మరో కొత్తవాడు రావడం వాళ్ళకు గిట్టలేదు. ఇతనిని అక్కడలేకుండా చేయడానికి ఏవో సమస్యలు , యిబ్బందులు సృష్టించారు. అందులో భాగంగా , తమకు సంబంధించినదేదో దొంగలించబడిందని అది యీ కొత్త కుర్రాడే చేశాడని నిందమోపి వెంకటేశ్వర్లుకు నిలవనీడ లేకుండా తరిమికొట్టారు. ఆ విద్యార్ధులకు భయపడి కళాశాల కు సమీపంలో వున్న ఎల్లమ్మ గుడిలో కొన్నిరోజులు తలదాచుకున్నాడు. తినడానికి తిండి , నిలువ నీడ లేని అతనికి ఎవరో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి గురించి చెప్పి , ఆయనను కలిస్తే తగు సహాయం చేస్తారని సలహా యిచ్చారట. ఆ ప్రకారం , శ్రీ సీతారామశాస్త్రి గారిని కలసి తన కష్టాలు చెప్పుకున్నాడు.

తర్వాత కాలంలో ఎప్పుడో బయటపడిన విషయం ఏమంటే  ఆ దొంగతనం అభియోగం కేవలం అసూయతో చేశారట. దొంగలించబడిన వస్తువులేం విలువైనవి కావు. అక్కడ బస చేస్తున్న  ఒక విద్యార్ధి ఎక్కడినుండో తలంటుపోసుకోవడానికి కుంకుడుకాయలు తెచ్చి ఎండబెట్టుకున్నాడట. సాయంత్రం వచ్చి చూస్తే అవి కనిపించలేదట. ఆ కుంకుడుకాయలు దొంగిలించింది ఈ కొత్త కుర్రాడే అని అతడిని హింసించి వెళ్ళగొట్టారట. వాళ్ళలో వాడే మరొకడు ఆ కాయలను తీసి కనపడకుండా దాచేసాడట.
ఇంతే జరిగిన విషయం .అసలు విషయం ఏమంటే  మరో కొత్తవాడు వస్తే తమ స్థాన బలిమి ఎక్కడ పోతుందో అనే భయం, అసూయ. బాల్య చాపల్యం.
 ఈ విషయాలు ఏవీ  ఘంటసాలవారి జీవిత చరిత్రలలోఎక్కడా వ్రాయబడలేదు. 

ఘంటసాలవారు తన కధలో " నేను విజయనగరంలో నిలదొక్కుకొని కాలేజీలో సక్రమంగా ప్రవేశించడానికి కూడా ఎంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇటువంటి నిరుత్సాహ పరిస్థితులలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి దర్శనం చేశాను. " అని మాత్రమే వ్రాసుకున్నారు.

తర్వాత కాలంలో నాకు జ్ఞానం వచ్చాక ఘంటసాలవారి ప్రస్తావన వచ్చినప్పుడు  మా యింట్లో మా పెద్దలు అనుకున్న మాటలు యివి.)

 ఆ కుర్రవాడి పరిస్థితి కి జాలిపడి శాస్త్రిగారు తన యింటనే ఆశ్రయమిచ్చారు. వెంకటేశ్వర్లు పాటవిని సంగీతం నేర్పడానికి సమ్మతించారు.

శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వారితో పాటు వారి అక్కగారు, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు వుండేవారు. వారుకాక సంగీతం నేర్చుకునే విద్యార్థులు కూడా ఓ ఐదుగురు అదే యింట్లో ఒక గదిలో నివసించేవారు. వారితోపాటు వెంకటేశ్వర్లుకు కూడా శాస్త్రిగారింట్లో నిలవ నీడ దొరికింది. మరి భోజనం సంగతేమిటి ? ఆనాడు యిప్పటిలా హోటల్స్ వుండేవికావు.  వున్నా అలాటి చోట్ల భుజించడానికి కావలసిన డబ్బులు విద్యార్ధుల దగ్గర వుండేవికాదు. అలాటి పేద విద్యార్ధులకోసం , ముఖ్యంగా సంస్కృత కళాశాల విద్యార్ధులకోసం విజయనగరం రాజావారు సింహాచలం భోజన సత్రం ఏర్పాటు చేశారు.అందులో  వందలాది సంస్కృత కళాశాల విద్యార్ధులున్నా , సంగీత కళాశాల విద్యార్ధులు ఓ ఇరవైమందికి మాత్రమే భోజన వసతి  ఉండేది. ఆ సత్రవులో భోజన వసతి  దొరకడానికి  కొంత సమయం పడుతుంది.  అడిగిన వెంటనే దొరకదు.అంతవరకూ ఏం చేయాలి. తాత్కాలికంగా శ్రీ సీతారామ శాస్త్రిగారి దయార్ద్ర హృదయం వలన ఆకలి సమస్య తీరినా , వారి ఆర్ధికస్థితి దృష్ట్యా వారిని యిబ్బంది పెట్టకూడదని , చాలామంది పేద విద్యార్ధులలాగనే వెంకటేశ్వర్లు కూడా మధూకరం ఎత్తడానికి నిర్ణయించాడు.

 ఆరోజుల్లో విద్యార్ధులు మధూకరం చేయడం , సంపన్న గృహస్తుల యిళ్ళలో వారాలు చేసుకొని విద్య సాగించడమనేది సహజంగానే జరిగేది. గృహస్తులు తమ పరిధులలో బీద విద్యార్ధులకు చేయూతనిచ్చేవారు. వెంకటేశ్వర్లు కూడా అదే బాట పట్టాడు. శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వుండే నేలనూతుల నాగభూషణం అనే  ఒక విద్యార్ధితో కలసి ఊళ్ళో మధూకరం చేసి పొట్టనింపుకునేవాడు. నాగభూషణం శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారి దగ్గర హరికధ , శ్రీ సీతారామశాస్త్రి గారింట్లో వుంటూ సంగీతం నేర్చుకునేవాడు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నాగభూషణాన్ని ఘంటసాల అన్నా అని సంబోధించేవాడు. ఘంటసాలకు జోలె పట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా , యిద్దరికి కావలసిన అన్నాన్ని నాగభూషణమే తీసుకువచ్చేవాడు.

సంగీత కళాశాల తెరిచే వరకు ఆగకుండా శ్రీ సీతారామశాస్త్రి గారు వెంటనే తన యింటనే సంగీత శిక్షణ యివ్వడం ప్రారంభించారు.
విజయనగరం నుండి తిరిగి వెళ్ళేవరకూ గురువుగారింటనే వెంకటేశ్వర్లు గడపడం జరిగింది. బయట ఆహారం దొరకని పరిస్థితులలో భోజనం కూడా గురువుగారింట్లోనే జరిగేది.

ఈలోగా , వేసవి శెలవులు ముగిసి సంగీత కళాశాల తెరవడం జరిగింది. ప్రిన్సిపాల్ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు , చౌటపల్లి నుంచి వచ్చిన యీ ఘంటసాల వెంకటేశ్వర్లు పాటవిని గాత్ర సంగీతానికి యీ కుర్రవాడి కంఠం బాగుంటుందని గాత్రం క్లాసులోనే ప్రవేశించమని సలహా యిచ్చారు. ఆవిధంగా , ఘంటసాలకు సంగీత కళాశాలలో కూడా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి పర్యవేక్షణలోనే సంగీత శిక్షణ మొదలయింది.

రోజూ కళాశాలలో, తర్వాత యింటి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు.

శ్రీ సీతారామశాస్త్రి గారు ఘంటసాలకు నేర్పిన సంగీత
లక్ష్య , లక్షణాల గురించి  తెలుసుకోవాలంటే
ముందుగా , ఘంటసాలవారి గురువుగారు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి , వారి సంగీత బోధన పధ్ధతుల గురించి , వారి కచేరీలు చేసే విధానం గురించి , వారి కుమారులు శ్రీ పట్రాయని సంగీతరావు గారి మాటల్లో.....