visitors

Tuesday, December 20, 2011

ప్రతిభకు పురస్కారం!!

92 సంవత్సరాల వయసులో సంగీతరావుగారిలోని కళాతపస్వికి లభించబోతున్న మరొక గౌరవం" టాగూర్ పురస్కారం."

మద్రాసులో కూచిపూడి అకాడెమీ స్థాపించి, కూచిపూడి నృత్యనాటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని, ప్రజాబాహుళ్యంలో నాట్యానికే ఒక గొప్ప ప్రచారాన్ని కలిగించిన వారు  కళా ప్రపూర్ణ డా. వెంపటి చినసత్యం. 
1973 సం. ప్రాంతాలలో ఆ సంస్థలో ప్రవేశించి దాదాపు 35 సంవత్సరాలపాటు వెంపటి చిన సత్యంగారు రూపొందించిన నృత్యనాటకాలకు విశిష్టమైన సంగీతాన్ని అందించారు పట్రాయని సంగీతరావుగారు. 
 ఫోటోలో ఉన్నవారు- ఎడమనుంచి -శ్రీమతి కనకదుర్గ(గాత్రం), శ్రీ గోవిందరాజన్(మృదంగం), శ్రీ ఎం.ఎస్.రావు(వయొలిన్), శ్రీ సంగీతరావు, శ్రీ వెంపటి చినసత్యం, శ్రీ నాగరాజన్(ఫ్లూట్)

 కూచిపూడి అకాడెమీ  రూపొందించిన పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం, రుక్మిణీ కల్యాణం, హరధనుర్భంగం (రామాయణం), శ్రీ పదపారిజాతం(అన్నమయ్య) మొదలైన దాదాపు పదిహేను నృత్యనాటకాలకు సంగీత సహకారాన్ని అందించిన పట్రాయని సంగీతరావుగారి విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర సంగీత నాటక అకాడెమీ – అకాడెమీ  టాగూర్ పురస్కార్ 2011 అనే అవార్డుతో సత్కరించనున్నట్టు ప్రకటించింది.

రవీంద్రనాథ టాగూర్ జయంతి ఉత్సవాలు (నూటయాభై సంవత్సరాలు) సందర్భంగా  ఈ అవార్డును లలితకళారంగంలో విశిష్టమైన ప్రతిభ ప్రదర్శించిన కళాకారులు వందమందికి ఈ గౌరవాన్ని ప్రకటించారు. వీరిలో 50 మంది కళాకారులను టాగూర్ రత్న అనే అవార్డుతోను( రూ. 3 లక్షలు బహుమతి) , మరొక 50 మంది కళాకారులను టాగూర్ పురస్కార్ అనే అవార్డుతోను(రూ.1 లక్ష బహుమతి) సత్కరిస్తారని అకాడెమీ తన ప్రకటనలో తెలిపింది.

ఈసందర్భంగా శ్రీ పట్రాయని సంగీతరావుగారికి కళాభివందనాలు.