visitors

Friday, June 19, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - నాలుగవ భాగం


మొదటి సంచిక ఇక్కడ
రెండవ సంచిక ఇక్కడ
మూడవ సంచిక ఇక్కడ

భాగం - 4.
                              
                                         నెం.35 ఉస్మాన్ రోడ్                                                                                                                       -                                      స్వరాట్


ఘంటసాల వెంకటేశ్వర్లు విజయనగరం లోని విజయరామ సంగీత కళాశాలలో ప్రవేశించేనాటికి విజయనగరం నేపథ్యం, సంగీత కళాశాల నేపథ్యం  గురించి మనం కొంత అవగాహన ఏర్పర్చుకోవాలి. అప్పుడే , ఘంటసాల విద్యాభ్యాసం ఎలా జరిగిందనే విషయం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
 దాదాపు వంద సంవత్సరాల క్రిందటి విజయనగరం యొక్క గత వైభవం గురించి సమర్ధవంతంగా  ఈనాడు మనకు చెప్పగల ఏకైక వ్యక్తి శ్రీ పట్రాయని సంగీతరావు గారు మాత్రమే. అందుకే , వివిధ సందర్భాలలో శ్రీ సంగీతరావు గారు వెలిబుచ్చిన విషయాలనే ఈ నాలుగవ భాగంలో ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వారి మాటలలోని సారాంశాన్ని నాకు తెలిసిన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను.

" సంగీతం నేర్చుకోవడానికి దూరప్రాంతాలనుంచి విజయనగరం వచ్చేవారు. అలా వచ్చినవారిలో నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రులలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు.
సాధ్యమైనంత వరకు విద్యార్ధిలో ఉండే సహజసిధ్ధమైన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి దోహదం చేసేదే నిజమైన విద్య. అది మా తాతగారి విద్యా విధానం . ఆ పధ్ధతినే మా నాన్న అనుసరించారు."

1936 డిసెంబర్ లో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ప్రవేశించారు. ఆనాటి విజయనగరం మహారాజు - శ్రీమద్ అలక్ నారాయణ గజపతి మహారాజుగారు (మనకు తెలిసిన అశోక్ గజపతిరాజు , ఆనంద గజపతిరాజు గార్ల తాతగారు).
ఆనాడు విజయనగరం సాంస్కృతికంగా ఆంధ్రదేశంలో ప్రముఖంగా ఉండేది. విజయనగరం కాలేజీ దేశంలో పురాతనమైనది.సంస్కృత కళాశాల , సంగీత కళాశాలలు విజయనగరంలో మాత్రమే ఉండేవి.
నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తెరమరుగై అప్పటికి చాలాకాలం అయింది. ఆటపాటలమేటి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు , మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు , ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వీణా వెంకటరమణయ్య దాసుగారు , మల్లాది విశ్వనాథ కవిరాజు , కవిశేఖర భోగరాజు నారాయణ మూర్తి , మొదలయిన మహనీయులు ఆనాటికి ఉండనే ఉన్నారు. పేరి లక్ష్మీనారాయణ శాస్త్రిగారు , వఝ్ఝల చినసీతారామశాస్త్రిగారు సంస్కృత కళాశాల అధ్యాపకులు గా ఉండేవారు.
సంగీత కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారి హయాంలో హరికథా కాలక్షేపం విద్యార్ధులే ఎక్కువగా ఉండేవారు. దాసుగారు రిటైరయ్యాక ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయన వచ్చిన తరువాత సంగీత కళాశాలలో సంప్రదాయ సంగీతాధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. వాసా వెంకటరావుగారు వీణ అధ్యాపకులుగా , పట్రాయని సీతారామశాస్త్రి గారు , పేరిబాబుగారు , నేమాని వరహాలు దాసుగారు గాత్ర పండితులుగాను , మునిస్వామి గారు నాదస్వర పండితులు గా , శ్రీపాద సన్యాసిరావుగారు మృదంగ పండితులుగానూ ఉండేవారు.

సరిదె లక్ష్మీ నరసమ్మగారు , ఆ రోజుల్లో , సుప్రసిధ్ధ నర్తకి. ఆవిడనే కళావర్ రింగ్ అనేవారు.
1940 ప్రాంతాల్లో శ్రీ శ్రీ తరుచూ విజయనగరం లో కనిపించేవారు. శ్రీ ఆరుద్ర విజయనగరం కాలేజీ లోనే చదువుకున్నారు. ప్రముఖ కవి శ్రీరంగం నారాయణ బాబు అక్కడివారే. గొప్ప సంగీతాభిమాని . ద్వారం వారి సంగీత కచేరీ అయిన తరువాత తరుచూ నారాయణ బాబుగారి ప్రసంగం కూడా ఉండేది. ప్రముఖ సాహితీవేత్త రోణంకి అప్పలస్వామిగారు , సుప్రసిధ్ధ కథకుడు చాగంటి సోమయాజులు గారూ విజయనగరంలోనే వుండేవారు. విశ్వవిఖ్యాత పహిల్వాన్, కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారు కూడా విజయనగరం లోనే ఉండేవారు. అప్పటికే అనారోగ్యంపాలయ్యారు.
అప్పట్లో , చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ ఆంధ్రదేశం అంతటా సుప్రసిధ్ధులుగా ఉండేవారు.నటుడిగా , హరికథకుడిగా , నాటి యువతరానికి మార్గదర్శి ఆయన.మారుతీ భక్త మండలి అనే కళా సంస్థ నిర్వహించేవారు.
సాలూరు చిన గురువుగా ప్రసిధ్ధులైన పట్రాయని సీతారామశాస్త్రి గారింట్లో నిత్యమూ సంగీత , సాహిత్య సమ్మెళనం జరుగుతూండేది. గురువుగారి మిత్రులు , సాహిత్యవేత్తలు , పండితులు , కవులు , కధకులు , నవలా రచయిత లు అందరూ అనేక విధాలైన చర్చలు చేస్తూండేవారు. సంగీత , సాహిత్యాల పరస్పర సంబంధ విషయమై ఆ రోజుల్లో సీతారామశాస్త్రి గారి సంగీత శిష్యుడు పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారి ' లక్ష్య , లక్షణ సమన్వయం ' అనే వ్యాసం ' వేదిక్ రీసెర్చ్' అనే పత్రికలో ప్రచురించారు. అది గురువుగారి ఆదర్శాలను ప్రతిబింబించేదిగా భావించబడింది. గురువుగారింట్లో సమావేశమైన మిత్రబృందమే తరువాత 'కౌముదీ పరిషత్తు' గా పరిణమించింది. ఈ పరిషత్తు సభ్యులు చాలామంది సుప్రసిధ్ధ రచయితలుగా , సంగీతజ్ఞులుగా లోకానికి పరిచయమయ్యేరు.

శ్రీ బుర్రా శేషగిరిరావు పంతులుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన అతి పెద్ద సంస్ధ ' ఆంధ్ర భారతీ తీర్థ'. అదే ' ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ'. యువరచయితలు , కవులు , కధకులు , తమ రచనలను ఈ సంస్థ సభలలో వినిపించేవారు. యువగాయకులు , వాద్యకులు తమ గానాన్ని ప్రదర్శించేవారు. అర్హులకి బిరుదు ప్రదానాలని కూడా ఈ సంస్థ నిర్వహించేది.
మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గురువుగారు , సుప్రసిధ్ధ సంగీతజ్ఞులు కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్యగారికి ' గాయక సార్వభౌమ' బిరుదు , విద్యావేత్త గిడుగు సితాపతిగారికి గౌరవ డాక్టరేట్ , స్థానం నరసింహారావుగారికి ' నటశేఖర' ఈ సంస్థే ప్రదానం చేసింది.
( పట్రాయని సీతారామశాస్త్రి గారికి , పట్రాయని సంగీతరావుగారికి కూడా ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ వారు 'సంగీతభూషణ' బిరుదులను ఇచ్చింది.)

ఇటువంటి సాంస్కృతిక వాతావరణం తో నిండిన విజయనగరంలో సంగీతం అభ్యసించడానికి గంపెడాశతో వచ్చాడు ఘంటసాల వెంకటేశ్వర్లు. వచ్చీ రాగానే కలిగిన చేదు అనుభావాలను దిగమ్రింగుకొని పట్రాయని సీతారామశాస్త్రి గారి పంచనజేరాడు.
అప్పుడు అతను ఎలా ఉండేవాడు ?
" ఘంటసాలతో నా మొదటి పరిచయం 1938 లో అని జ్ఞాపకం.తేదీలవారీగా చెప్పుకోవాలంటే ఆ జ్ఞాపకాలు యదార్ధానికి కొంచెం  ఇటూ అటు గా ఉండే అవకాశం ఉంది.
చామనచాయగా , బొద్దుగా , కొంచెం పళ్ళు ఎత్తుగా , కాంతివంతమైన కళ్ళతో , స్నేహశీలమైన హావభావాలతో అతను అందరికీ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక నిక్కరు , గళ్ళషర్టూ ఇది వేషం. కొంచెం ఈడుకి మించి కనిపించేవాడు."
గురువు గారు పట్రాయని సీతారామశాస్త్రిగారి విలక్షణత గురించి గతంలో కొంత చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొంత చూద్దాము.
" శాస్త్రిగారు ఒకవిధంగా వివాదాస్పదమైన పండితులుగా భావింపబడేవారు. వారికి సంగీతం లోనే కాక సాహిత్యం లో కూడా మంచి అభినివేశం ఉండేది. కచేరీలలో ఆయన సొంత రచనలే గానం చేసేవారు. హర్మోనియం ప్రక్క వాద్యంగా తానే వాయించుకొని పాడేవారు. ఇది సంప్రదాయజ్ఞులకి నచ్చేదికాదు. శాస్త్రిగారికి త్యాగరాజస్వామి కీర్తనల విషయంలో త్యాగరాజు సంగీతం పట్లే కాకుండా సాహిత్యం విషయంలో కూడా ఎంతో మమకారం ఉండేది. త్యాగరాజ కీర్తనలలోని సాహిత్యం పోషించడానికి ఆయన ఒక విశిష్టమైన పధ్ధతిలో గానం చేసేవారు. నిజానికి శాస్త్రానికి విరుధ్ధంగా ఆయన ఏమీ చేయలేదు. సలక్షణమైన రాగతాళాలను అతిక్రమించి ఆయన ఎన్నడూ పాడేవారు కాదు. కానీ సంప్రదాయజ్ఞులకు ఆయన బాణీ ఏదో విప్లవ ధోరణిలో కనపడేది. ఆయన కాలేజీలో విద్యార్ధులకు సంప్రదాయ పధ్ధతులలోనే పాఠం చెప్పేవారు. బయట గానం చేసేప్పుడు ఆయన పధ్ధతి ఆయనదే.
పట్రాయని సీతారామశాస్త్రి గారు గానం చేసే విధానం అపూర్వమైనది. ఆయన కచేరీలో సరస్వతీ ప్రార్ధన . ఆయన స్వకీయమైన ఒక పద్యంతో ప్రారంభించేవారు . ఆ పద్యం ఆధారంగానే రాగాలాపన , స్వరకల్పన , సంకీర్తన మొదలైన చాలా కచేరీ అంశాలు నడిపించేవారు.
ఆయన తన కచేరీలలో అలవాటు గా పాడిన పద్యం :

సీసపద్యం : 
రాగమందనురాగ రసములొల్కించుటే
అమ్మరో నీ మందహాసమమ్మ

గడియారమునకె సద్గతిని జూపు లయ తాళ
గతులెన్న నీ మందగమనమమ్మ

పూలమాలికల కూర్పును బోలు స్వరకల్పనలు నీదు
మృదుల భాషలు గదమ్మ

శృతియందు లీనమౌ గతి
మది నిల్పుటే
భారతీ నీ శాంతభావమమ్మ

నవరసంబుల సముద్భవమంద జేయుటే
శారదా నీ కటాక్షము గదమ్మ 🌷

తేటగీతి :

భావ రాగంబులును, తాళ ఫణితి , శృతియు
గలియ గానంబు జేసెడి
గాయకునకు
శృతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జననీ .
https://youtu.be/rxTrppbqk-Y

సామాన్య శ్రోతలనుంచి , సంగీత సాహిత్యాల సమన్వయం కోరే రసజ్ఞులందరికీ సీతారామశాస్త్రి గారి గానం రస ప్రవాహంలో ముంచెత్తేది.

గురువుగారి విశిష్టమైన గానం ఘంటసాలను ఎంతో ఆకర్షించింది. సంగీతం విషయంలో పట్రాయని సీతారామశాస్త్రి గారి మార్గమే ఘంటసాలకి కూడా ఆదర్శమయింది.

తరువాతి కాలంలో ,పట్రాయని సీతారామశాస్త్రి గారి స్మారక సంచికలో గురువుగారి సంగీత శిక్షణలో తాను గ్రహించిన విషయం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మాటలలో ఈ విధంగా ఉంది.'సంగీత శాస్త్రము , లక్ష్య గ్రంధము నేను ఇతర పండితుల నుండి సంగ్రహించగలిగే వాడినేమో, గాని గురువుగారు నాకు ప్రసాదించినది అనితర లభ్యమైనదని నా విశ్వాసం.
ముఖ్యంగా గాత్ర సాధన చేయడంలో అలవర్చుకోవలసిన శృతిశుధ్ధి , నాదశుధ్ధి , గమకశుధ్ధి , తాళగత , స్వరగత , లయశుధ్ధి శిష్యులకు కలగజేయడంలో ఆ మహానుభావుడు సిధ్ధుడు.
వారు నాదానుభవాన్ని ' సాంబసదాశివ ' అనే నామ సంకీర్తనతో మంత్రవతుగా నాలో ప్రసరింపజేశారు. కీర్తనలలోని రసభావాలకి అనుగుణ్యంగా పట్టువిడుపులతో గమకాలు అంత సార్ధకంగా ప్రయోగించడం గురువుగారి వంటి నాదసిధ్ధులకు మాత్రమే సాధ్యమని నా నమ్మకం."

ఒకవిధంగా పట్రాయని సీతారామశాస్త్రి గారు కాలానికి సరిపడని విద్వాంసులనిపిస్తుంది.

అటువంటి నాదయోగి సన్నిధిలో  వెంకటేశ్వర్లు సంగీతశిక్షణ నిరాటంకంగా కొనసాగింది. తరువాత ,....
వచ్చేవారమే.....         (సశేషం)