visitors

Friday, September 18, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదహేడవ భాగం

18.09.20 - శుక్రవారం భాగం - 17*:
పదహారవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

చెళ్ళపిళ్ళ వరహాలమ్మ గారు మా దొడ్డమ్మగారు. మహా దొడ్డ వ్యక్తి. ఎవరైనా ఆదర్శ మహిళ పేరు చెప్పమంటే ఆవిడ పేరే చెపుతాను. ఆవిడ జీవితాన్ని చూసి నేర్చుకోవలసినవి, నేర్చుకున్నవి చాలానే ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలను ప్రస్తావిస్తాను. 

(తోటపల్లి కొండలు శాంతి ఆశ్రమంలో  దొడ్డమ్మ చెళ్ళపిళ్ళ వరహాలమ్మగారితో పెద్ద చెల్లెలు రమణమ్మ రెండో చెల్లెలు పద్మావతి) 

ఆవిడ ఒకే కూతురు మా శారదక్క. మా శారద చిన్నతనంలోనే తండ్రి పోయారు. ఆయన పేరు చెళ్ళపిళ్ళ అప్పల నరసింహంగారు. ప్రస్తుత ఒరిస్సాలోని రాయఘడాలో వుండేవారు. మా దొడ్డమ్మగారికి ఆయనకు  పదమూడేళ్ళకు తక్కువ లేకుండా వయోభేదం వుండేది. బాల్య వివాహమే. ఆయన ఆయుర్వేద డాక్టర్ కమ్ సంగీతం మాస్టర్. ఆయన గొప్ప సంగీత శాస్త్రపరిజ్ఞానం కలిగినవాడు. ఈరోజుల్లో అలాటివారు మ్యూజికాలజిస్ట్ లుగా గొప్ప గుర్తింపు పొందుతున్నారు. ఆయనదంతా మాటల సంగీతం. వారి నలుగురన్నదమ్ములకూ సంగీతమే వృత్తి. ఆయన సంగీతం మీద కాకుండా ఆయుర్వేదం మీద దృష్టిపెట్టి వుంటే బాగా రాణించివుండేవారని మా నాన్నగారి అభిప్రాయం. నేను పుట్టడానికి చాలా కాలం మునుపే ఆయన పోయుండాలి. నాకు ఊహ తెలిసినప్పటినుండి, మా దొడ్డమ్మగారు, శారద మా బొబ్బిలి తాతగారి సంరక్షణలోనే వుండేవారు.

మా దొడ్డమ్మగారు వారి రాయఘడా గురించి చెప్పిన వాటిలో ఒక విషయం మాత్రం భయంకరంగా ఒళ్ళు గగుర్పొడిచేదిగా ఉండి గుర్తుండిపోయింది. రాయఘడా ఊరు చుట్టూ కొండలు అడవులు వుండేవి. సాయంత్రమైతే నరసంచారం ఉండేదికాదు. అందరు ఇళ్ళలో తలుపులు మూసుకునే ఉండేవారట. కొంచెం రాత్రి పడగానే పక్కనున్న కొండల్లోంచి చిరుతలు, ఎలుగుబంట్లలాటివి ఊళ్ళో వీధుల్లోకి వచ్చి మూసి ఉన్నతలుపులు మీద పంజాలతో బాదుతూ నానా హంగామా చేసేవిట. ఆవిడ ఆ విషయాలు చెపుతూంటే నాకు చాలా భయంగా అనిపించేది. మరి అలాటి ఊళ్ళో వుండేకంటే వేరే మంచి ఊళ్ళో వుండవచ్చు కదా అని అమాయకంగా అడిగేవాడిని. ఉన్న ఊరు మారడం అంత సులభమా? విధి నిర్ణయప్రకారమే కదా ఏదైనా జరిగేది. ప్రయత్నం మాత్రమే మానవుడు చేయగలడు.

మా శారద ఎనిమిదో క్లాసు వరకూ బొబ్బిలి గర్ల్స్ స్కూల్ లో చదివి మానేసింది. తన పదహారవ ఏట వివాహం నిశ్చయమయింది. ఈ విషయంలో మా నాన్నగారి తోడ్పాటు, ప్రమేయం ఉన్నట్లు విన్నాను. వరుడు భళ్ళమూడి సత్యనారాయణ. వారిది కుద్దిగాం అనే కుగ్రామం. ఇది ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. 

(శారదక్క, బావగారు భళ్ళమూడి సత్యనారయణగారు)
సాధారణంగా తెలుగువారిళ్ళల్లో పెళ్ళిళ్ళు ఆడపిల్లవారింటనే జరగడం ఆనవాయితి. కానీ, మా శారద పెళ్ళి వరుని ఇంట జరిగింది. బొబ్బిల్నుంచి ఆ కుద్దిగాం ఇప్పటి రోడ్, రైలు రవాణా సౌకర్యాల దృష్ట్యా ఇప్పుడు ఓ నాలుగైదు గంటల ప్రయాణం. కానీ, మేము 1953లో ఉదయం బయల్దేరితే, అర్ధరాత్రికి ఆ ఊరు చేరుకోగలిగాము. బస్, రైలు, ఎడ్లబళ్ళంటూ అన్ని వాహనాలు ఎక్కేము. పెళ్ళి వైశాఖ మాసం(ఎండాకాలం) కావడాన పడవ ఎక్కే అవకాశం రాలేదు. అదే వర్షాకాలమైతే వరద పరిస్ధితిని బట్టి వంశధారానది ప్రతాపాన్ని చూడవలసి వచ్చేది. మా రైలు ప్రయాణంలో మధ్యాహ్న భోజనాల సమయంలో ఏదో స్టేషన్ లో రైలు వచ్చి ఆగింది. నా జ్ఞాపకం ప్రకారం అది నౌపడా స్టేషన్ కావచ్చు. అది వాటరింగ్ స్టేషన్ కూడాను. మళ్ళీ బండి బయల్దేరడానికి మరో గంటన్నా పడుతుందని ప్రయాణీకులంతా స్టేషన్ బయటకు భోజనాలకు వెడుతూంటే మా పెళ్ళి బృందంలో కొందరు భోజనాలకు బయల్దేరారు.  వారిలో నేనూ ఉన్నాను. ఆరోజుల్లో మా ఇళ్ళలోని ఆడవారు బయట భోజనాలు చేయడం అన్నది కనీవినీ ఎరుగరు. అరటిపళ్ళు, మంచినీళ్ళతోనో సరిపెట్టుకోవలసిందే. అక్కడ స్టేషన్ బయట హోటలు అని అందరూ అంటున్నది ఒక పూటకూళ్ళమ్మ సత్రంలాటిది. పూరిల్లు. అక్కడ అందరూ రెండు మూడు వరసల్లో క్రిందనే కూర్చునేవారు. విస్తరాకులలో వడ్డన.  మా ఛాన్స్ వచ్చేప్పటికి అన్నంతో పాటు ఉడికించిన పెసరపప్పు, ఏదో కూర, గోంగూర పచ్చడి వంటి పదార్ధాలుతో భోజనం వడ్డించారు. అయితే, మేము ఎవరమూ ఆ పదార్ధాల రుచిని మెచ్చుకుని తినే స్థితిలో లేము.  నాకైతే తినడం లేటయితే రైలు వెళ్ళిపోతుందనే భయం. మా రైలు మళ్ళా ప్రయాణం సాగించి మమ్మల్ని పర్లాకిమిడి స్టేషన్ లో పడేసింది. ఇప్పుడు ఆ ఊరు పేరు పర్లాఖముండీగా మారింది. అక్కడనుండి వేరే రైలు ఎక్కి హద్దుబంగీ అనే స్టేషన్ లో దిగాలి. హద్దుబంగీలో ఎడ్లబండి  ఎక్కి మరికొన్ని మైళ్ళు ప్రయాణం చెయ్యాలి. అప్పటికే చీకటి పడింది. పర్లాకిమిడి నుంచి నేరోగేజ్ రైలు. ఊటీ హిల్ ట్రైన్ లా ఆ రైళ్ళు చాలా నెమ్మదిగా నడిచేవి. ఆనాటి ట్రైన్స్ అన్నిటికీ స్టీమ్ ఇంజిన్లే. రాక్షసిబొగ్గు సహాయంతో నడిచే స్టీమ్ ఇంజిన్లు. (ఇంగ్లీషులో రైల్/రైల్స్  అంటే పట్టా/పట్టాలు. తెలుగులో రైలు/రైళ్ళు అంటే ట్రైన్. ఇంగ్లీష్ రైల్స్ మీద నడిచే బళ్ళు తెలుగు రైళ్ళు. ట్రైన్ అనగా తెలుగులో రైలు!)  

ఈ పొగబళ్ళ ప్రయాణాల తరవాత మనుషుల ఆకారాలు వికారాలయ్యేవి.  ఎంతటి వైజయంతీమాలలైనా  'నాదీ ఆడజన్మే' సావిత్రిలయిపోతారు. లక్స్ సబ్బు బిళ్ళలు అరగదీసి మొహానికి కాశ్మీర్ స్నోలు, హిమాలయా పౌడర్లు దట్టంగా పట్టించవలసిందే. 

ఈ రైలు ఇంజిన్లు ఘాట్ సెక్షన్ లలో పరిగెత్తలేవు. నెమ్మదిగా నడుస్తూ వెళ్తాయి. ఎత్తుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వేగం మరింత తగ్గిపోయి కాలినడకన వెళ్ళడమే సుఖమనుకునేలా ఉండేవి. ఆ రైలు ఇంజన్లకు' రాముడు‌, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు' అని పేర్లుండేవి. ఇవేళ్టి ఇంజన్ రాముడా, హనుమంతుడా అని అనుకునేవారు. అలాటి ఒక రైలెక్కి హద్దుబంగీ స్టేషన్ లో దిగేప్పటికి రాత్రి పది దాటిందనుకుంటాను. స్టేషనంతా చిమ్మచీకటి. స్టేషన్లో అక్కడక్కడ చిన్న చిన్న లాంతర్లు. ఆ వెలుగులో బయటకు వచ్చి మగపెళ్ళివారు పంపిన  రెండో మూడో ఎడ్లబళ్ళలో మా పెళ్ళి బృందమంతా ఎక్కి కుద్దిగాంకు ప్రయాణం కట్టాము. వేసవి కావడం వలన వంశధారలో నీళ్ళు ఎక్కువగా లేకుండా బళ్ళు ఏటిలోనుండే వెళ్ళాయి. పెళ్ళివారింటికి చేరేసరికి బాగా రాత్రయిపోయింది. నేనైతే బండిలోనే నిద్రపోయాను.

నేను మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఊరంతా పూరిళ్ళమయం. ఈ పెళ్ళివారింట్లో ఒకపక్క గొడ్ల సావిడి. మరో పక్క ఒక నల్లబల్లతో చిన్న  గది. అది ఒక ఎలిమెంటరీ స్కూలని చెప్పారు. అక్కడ కూడా ఏవో బస్తాలు, పాత సమాన్లతో నిండివుంది.

పెళ్ళికొడుకు తండ్రిగారి పేరు కూడా సత్యనారాయణగారే. ఇంట్లోని పెద్దకొడుకులకు సత్యనారాయణ పేరు పెట్టడం ఆనవాయితిట. ఆయన పేరుకు ముందు 'ఈశ్వర' అని ఉంటుంది. కొడుకు పేరు ముందు  'అప్పల' అని గుర్తు.  ఇప్పుడు ఆయన పెద్దమనవడి పేరు కూడా ఈశ్వర సత్యనారాయణే. మేమంతా ఈశ్వరుడు అంటాము. 

(ఈశ్వరుణ్ణి ఎత్తుకున్న శారదక్క)
ఆ భళ్ళమూడి సత్యనారాయణగారు కుద్దిగాంలో సింగిల్ స్కూల్ టీచర్. పేరుకే స్కూలు. పిల్లలెవరూ వుండరు అందరూ పొలంపనులకో, ఆవులను మేపుకుందుకో పోతూంటారు. జన్మానికో శివరాత్రిగా ఎవరైనా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ పొరపాటున ఆ నది దాటుకొని రాగలిగితే, విషయం ముందే తెలుసుకొని పదిమంది పిల్లలను పోగేసి  అల, వల, తల, రెండొకట్ల రెండూ, మూడు నాలుగులు పన్నెండని అరిపించి, వచ్చిన అధికారికి తగిన ఆతిధ్యమిచ్చి పంపించేస్తారు. ఈ తతంగమంతా వచ్చిన అధికారికి తెలుసు. పిల్లలు లేరంటే స్కూల్ ఎందుకని మూసేస్తారు. వచ్చే నాలుగురూకలు రాకుండా పోతాయి. అయితే వీరికి ముఖ్యమైన వృత్తి ఆయుర్వేద వైద్యం. ఇంట్లో అందరూ వైద్యులే. అలాగే తండ్రీకొడుకులు ఇద్దరూ మంచి మార్దంగికులు. చుట్టుపక్కల జరిగే హరికథా కాలక్షేపాలకు మృదంగ సహకారం అందిస్తారు. వీరికి మంత్ర శాస్త్రంలో ప్రవేశముందని చెపుతారు. ఆరోజుల్లో సుప్రసిధ్ధ మంత్రశాస్త్రవేత్తగా పేరుపొందిన మండా సూర్యనారాయణ శాస్త్రిగారి శిష్యులు. 

శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు

శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు ప్రముఖ హరికధా కళాకారిణి మండా కమలకుమారిగారి తండ్రి. 'ముత్యాలముగ్గు' రావు గోపాలరావు గారికి మామగారు.

నాకు ఊహ తెలిసాక జరిగిన, నేను వెళ్ళిన మొట్టమొదటి పెళ్ళి మా శారదదే. పెళ్ళిళ్ళు, పెళ్ళితతంగాలు ఎలా వుంటాయో మొదటిసారిగా చూసింది అక్కడే. అందుచేత ప్రతీ విషయమూ ఒక వింతే, విశేషమే.

ఉదయాన్నే పెళ్ళివారందరికీ అల్పాహార విందుగా అడ్డాకుల విస్తళ్ళలో ఉప్మాలాటి ఉప్పుపిండి, లేదా ఉప్పుపిండిలాటి ఉప్మాను తీసుకువచ్చి పెట్టారు. పక్కనే పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల్లో ఫుల్ గా కాఫీ అనే ద్రవ పదార్ధం. పేరుకు అల్పాహారం. కాని విస్తరినిండా వున్న ఆ రాశిని చూస్తే  మరో రెండురోజుల వరకూ భోజనమే అవసరం లేదనట్లు అనిపించింది. నాకు ముందునుంచీ ఉప్మా అంటే చిన్నచూపే. ఆ పెళ్ళివారింట ఉప్మాలాటి ఆ పదార్ధం తిన్న కొన్ని దశాబ్దాల వరకు ఉప్మా పేరును కూడా నా తలపులలోకి రానిచ్చేవాడిని కాదు. (అలాటిది ఇప్పుడు, కాలమహిమ, రెండ్రోజులకు ఒకసారి మా ఆవిడ పెట్టే రవ్వ ఉప్మావో, సేమ్యా ఊప్మావో, ఉప్పుడుపిండో మహదానందంగా తినేస్తా.) కానీ అవేళ అక్కడ వద్దని చెప్పడానికి నాకు తెలిసిన మావాళ్ళెవరు పక్కనలేరు. మా పెద్ద చెల్లెలు రమణమ్మ అప్పటికి  నెలల పిల్ల. అందువల్ల తనను చూసుకుంటూ మా అమ్మగారెక్కడో ఉన్నారు. ఆ పెళ్ళికొడుకు ఇంట్లో ఆడవాళ్లు ఎవరూలేరు. ముగ్గురూ మగపిల్లలే. వంటలూ, వార్పులూ, వడ్డనలకు ఊళ్ళోనే వున్న వారి బంధుజనం వచ్చి సహాయం చేసినట్లు విన్నాను. తరువాత, ఓ పదిగంటలకు స్నానాల కార్యక్రమం అని ఏటి ఒడ్డుకు పదమన్నారు. నాకు నూతి దగ్గర వేడినీళ్ళతో స్నానమే అలవాటు. ఏటి స్నానమంటే భయం. కలివరం ఏట్లో ములిగిపోయిన అనుభవం తరువాత పారే ఏరన్నా, నదన్నా భయమే. ఈలోగా, పెళ్ళికొడుకు తమ్ముళ్ళతో మాట్లాడేందుకు మరో యిద్దరు వచ్చారు. వారిని నా దగ్గరకు తీసుకువచ్చి మా 'నేస్తులు' అని వాళ్ళ పేర్లేవో చెప్పారు. ఆ ప్రాంతాలలో స్నేహితులను 'నేస్తాలు' అని అంటారని అప్పుడే విన్నాను. మా నాన్నగారు అప్పటికి రెండుసార్లు మెడ్రాస్ వెళ్ళి వచ్చారని తెలిసి అక్కడి ఎన్టీవోడు, నాగయ్య, రేలంగి నాగెస్సర్రావు,  అంజలి, శివరావు, ఘంటసాల అంటూ ఏవో సినీమా విషయాలేవో అడగబోయారు. నిజానికి నాకప్పటికి ఆ విషయాలేవీ తెలియవు. ఇంతలో మా కాబోయే అల్లుడిగారి తమ్ముడొకరు అడ్డు తగిలి 'మరీ బెంటులా మాట్లాడతావేటి ఇప్పుడూ..' అంటూ విసుకున్నాడు. ఆ 'బెంటు' అనే మాటకు  సరైన అర్ధం నాకు తెలియదు. బహుశా 'పల్లెటూరి బైతు' లాటి మాట కావచ్చును. మొత్తానికి వీళ్ళందరూ కలసి నన్ను స్నానం పేరిట వంశధారలో ముంచారు. అలవాటు లేని ఔపాసన. వాళ్ళంతా నన్ను ఒక్కసారిగా నీళ్ళలో ముంచేప్పటికి నీళ్ళన్ని తాగి,  అవి ముక్కుల్లోకి వెళ్ళి చాలా ఉక్కిరిబిక్కిరి అయింది. వాళ్ళూ కొంత భయపడ్డారు. కొంతసేపయాక సద్దుకుంది. ఆ ఏటి ఒడ్డునుండి నాలుగుపక్కలా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ అటుపక్క నివగాం, అక్కడ కొత్తూరు అంటూ చుట్టుపక్కల ఊళ్ళ గురించి చెప్పారు. 

అక్కడికి కొంత దూరంలో గుణుపూర్ అనే ఊరుంది. ఆ ఊళ్ళో మా తాతగారి దగ్గర సంగీతం నేర్చుకున్న ముద్దు పాపారావు అనే ఆయన వుండేవారు. 

(శిష్యులతో తాతగారు పట్రాయని సీతారామశాస్త్రిగారు

ఆయన ఘంటసాలగారికి విజయనగరం సంగీత కళాశాలలో సహధ్యాయి. ఇద్దరూ ప్రాణస్నేహితులు. పైనున్న తాతగారితో ఘంటసాలగారు ఇతర శిష్యులు ఉన్న ఫోటోలో తాతగారి వెనక ఉన్నవారే ముద్దు పాపారావుగారు. 

ఈ ఊళ్ళన్నీ  శ్రీకాకుళం జిల్లాలోని తెలుగు ప్రాంతాలే. కాకపోతే  అక్కడివారి మీద ఒరియా ప్రభావం కనిపిస్తుంది. నా వరకూ, మీఠాకిళ్ళీలు, కారా(జరదా)కిళ్ళీలు నమలడం ఉమ్మడంలాటి అలవాట్లు, మగాళ్ళందరి హెయిర్ స్టైల్, ఇలా కొన్ని విషయాల్లో అందరూ ఒకేలా కనిపించారు. ఇక వాళ్ళు  ఏవో కబుర్లు చెపుతూంటే, నేను వింటూ మళ్ళీ ఊళ్ళోకి వచ్చేము. 

మధ్యాహ్నం ఓ రెండు గంటల ప్రాంతంలో భోజనాలకు పిలుపులు వచ్చాయి. మేము బొబ్బిలిలో అరటి ఆకులలో భోజనం చేసేవాళ్ళం. ఇక్కడ ఈ పెళ్ళివారు పెద్ద పెద్ద తామరాకులు తీసుకువచ్చి పెట్టారు. తామరాకులలో కూడా భోజనం చేస్తారని అప్పుడే తెలిసింది. ఆ ఆకుల్లో వేడి వేడి అన్నం, పప్పు, కూరలు, పులుసులాటివి వడ్డించేసరికి ఆకు మధ్యలోని బుడిపెల్లోంచి ఆవిరి బుడగలు రావడం ఒక తమాషాగా అనిపించింది. అలాగే, నేను పుట్టిన ఎనిమిదేళ్ళలో మొదటిసారిగా ఆవపెట్టిన పనసపొట్టు కూర తినడం అక్కడే జరిగింది. నిజం చెప్పొద్దూ, ఆ పనసపొట్టు కూర మహాద్భుతం. అంత రుచికరమైన కూర అప్పటివరకూ తినలేదు. మా ప్రాంతాలలో జరిగే  పెళ్ళిళ్ళలో పనసపొట్టు కూర ఒక స్పెషల్ డిష్. ఆ కూరను వండడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పనసపొట్టు కూర తినేవాళ్ళకు అమృతతుల్యమే అనిపించినా వండడం మహా పీకులాట వ్యవహారమని తర్వాత తెలిసింది.  కూరకు పనికివచ్చే పనసకాయను ఎంచుకోవడం దానిని కొయ్యడానికి తగిన కత్తి, తరిగేప్పుడు జిగురు అంటుకోకుండా ఏదో నూనెలు పూసుకోవడం, కూరకు తగిన విధంగా పదునుగా పొట్టుగా నలగగొట్టడం, అది కూరగా వండడానికి సమపాళ్ళలో కావలసిన దినుసులు - వీటన్నిటితో రుచికరంగా చేయడమనేది సాధారణ  ఇంటి ఇల్లాళ్ళకు సాధ్యమయే పనికాదు. పాకశాస్త్రంలో ఆరితేరినవాళ్ళే ఈ competitive పనసపొట్టు కూరను వండి మెప్పించగలరు. 

ఇక పెళ్ళి అర్ధరాత్రి ముహుర్తం. అది తెలుగువారి ప్రత్యేకత. తమిళనాడు ముహుర్తాలు చాలా హాయి. తొమ్మిది నుండి పదకొండు లోపల ముహుర్తాలే ఎక్కువ. శుభ్రంగా ఉదయం పెళ్ళికి హాజరేయించుకొని , పదకొండు గంటలకు భోజనాలు కానిచ్చేసి, హాయిగా ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు. ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు లోపల అన్ని తతంగాలు ముగించేసి కళ్యాణమండపం ఖాళీ చేసేస్తారు. ఒకానొక కాలంలో పెళ్ళిళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్క ఐటమ్ చొప్పున పదహారు రోజులపాటు జరిపేవారట. ఇప్పుడు పదహారు గంటలే ఎక్కువగా భావిస్తున్నారు. ఇప్పటి పెళ్ళిళ్ళలో పెళ్ళి తంతుకన్నా బ్యూటీ పార్లర్లలో ఒంటి డెకరేషన్ కే ఎక్కువ సమయం పడుతుంది. లేకపోతే  రిసెప్షన్, పెళ్ళి వీడియోలలో మొహం అసయ్యంగా ఉంటుంది కదా. కలకాలం ఆ మొహాలు చూసుకోడం భయంకరం కదా. ఈనాడు మన భారతీయ వివాహ ప్రక్రియే పూర్తిగా మారిపోయింది.

మా శారద పెళ్ళికి ముందే సాయంత్రం మా నాన్నగారి సంగీత కచేరీ జరిగింది. పెళ్ళికొడుకే మృదంగం వాయించారు. చీకటి పడుతున్న సమయానికి ఎక్కడినుండో మూడు పెట్రోమాక్స్ లైట్లను తీసుకువచ్చారు. అలాటి లైట్లను కలివరంలో దూరం నుంచి చూశాను. కానీ అవి వెలగడానికి ఎంత శ్రమపడాలో ఇక్కడే దగ్గర నుంచి చూసాను. వాటి టాంక్ లో కిరొసిన్ పోసి పంపు కొట్టడం, గేస్ మేంటల్ మాత్రమే అంటుకునేలా వెలిగించడం, మంచి వెలుగు వచ్చేవరకూ కుస్తీలు పట్టడం చికాకు పనే. 
ఒకసారి వెలిగిస్తే కొన్ని గంటలపాటూ దేదీప్యమానంగా వెలుగుతాయి. అలాటి లైట్ల వెలుగులో మా నాన్నగారి కచేరీ, రాత్రి భోజనాలు, అర్ధరాత్రి పెళ్ళి ముహుర్తం, ఇతర తంతులన్నీ సవ్యంగా ముగిసాయని చెప్పారు. ఒక రాత్రయాక నేను పూర్తిగా నిద్రపోయాను. ఏం జరిగింది నాకు తెలియనే తెలియదు. అలాగే, కాశీయాత్ర సమయంలో పెళ్ళికూతురి తమ్ముడిగా చేయవలసిన తంతులో పాల్గొన్నానో లేదో ఆ విషయాలేవి నా జ్ఞాపకాలలో లేవు. అవన్నీ నెమరు వేసుకుందుకు ఇప్పటిలా  విడియో కేసట్లు, కలర్ ఆల్బంలు, కనీసం, బ్లాక్&వైట్ ఫోటోలు కూడాలేవు. పెళ్ళయ్యాక ఆ కుద్దిగాంలో ఎన్నాళ్ళున్నామో సరిగా గుర్తులేదు,కానీ, అక్కడ నుండి మేము విజయనగరం/బొబ్బిలి వేపు ప్రయాణం కట్టడం జరిగింది. 
             
1954 లో ఒకసారి మా నాన్నగారు కలివరం నాయుడిగారి ఆహ్వానం మీద తిరుపతి వెళ్ళారు. అక్కడికి వారికి బంధువు, ప్రముఖ చిత్ర దర్శకుడైన బి ఎ సుబ్బారావు రాగా వారందరూ స్వామి దర్శనం తరువాత మెడ్రాస్ ప్రయాణం కట్టారు. మెడ్రాస్ లో వీళ్ళంతా కలసి ఘంటసాలవారి ని చూడాలని త్యాగరాయనగర్ (టి.నగర్)లో నెం.35, ఉస్మాన్ రోడ్ కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన సమయానికి ఘంటసాలగారు ఇంట్లోలేరట. 'కన్యాశుల్కం' సినీమా పాటల రికార్డింగుకు వెళ్ళారట. మా నాన్నగారు, నాయుడుగారు కొంతసేపు అక్కడ గడిపి తిరిగి బసకు వచ్చేశారు. మర్నాడు ఉదయమో, సాయంత్రమో రైలుకు బయల్దేరే సమయానికి ఘంటసాలగారు ఆ హోటల్ కు వచ్చి, మా నాన్నగారిని వెళ్ళడానికి వీలులేదని, చేతినిండా సినీమాలపని ఉందని తనతోనో ఉండిపొమ్మని బలవంతపెట్టి నాయుడిగారిని మాత్రం తిరిగి వెళ్ళమని చెప్పి మా నాన్నగారిని తనతో కూడా కారులో తమ ఇంటికి తీసుకువచ్చేశారట. తరువాత ఒక ఏణ్ణర్ధం పాటు నేను మా నాన్నగారిని చూడలేదు. మధ్య మధ్య క్షేమ సమాచారాలతో ఉత్తరాలు వచ్చేవి. అప్పుడే, నా చదువు బొబ్బిలికి ట్రాన్సఫర్ అయింది. 1955లో బొబ్బిలి బ్రాంచ్ హైస్కూలులో సెకెండ్ ఫారమ్ లో జాయిన్ అయ్యాను. 

ఆ స్కూల్ విశేషాలు, బొబ్బిలి టూరింగ్ టాకీస్ లలో సినీమాలు ...
వచ్చేవారం....
                    ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.