visitors

Friday, July 24, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - తొమ్మిదవ భాగం

24.07.20- శుక్రవారం భాగం: 9 *
 ఎనిమిదవ భాగం ఇక్కడ


నెం.35,ఉస్మాన్ రోడ్
                  ప్రణవ స్వరాట్

'సాలూరు చిన గురువు' శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారి శిష్యుడు ఒకరు. స్వయాన ఆయన కుమారుడు మరొకాయన. ఇద్దరూ కర్ణాటక సంగీతంలో నిష్ణాతులే. ఇద్దరూ ఆ సంగీతాన్ని నమ్ముకొని జీవించాలనుకున్నవారే. కానీ విధి వారికి విభిన్న మార్గాలను సూచించింది. ఘంటసాలవారు 1944 లో దక్షిణాపథానికి పయనించి మద్రాసులో చిత్రసీమలో తన జీవనయానం మొదలుపెట్టారు. గురుపుత్రులు సంగీతరావుగారు అదే సమయంలో కొంచెం తూర్పుదిశగా పయనించి తనకిష్టమైన ప్రశాంత వాతావరణంలో కలివరం అనే గ్రామం లో ఒక సహృదయుడి అండనజేరారు. ఆయన పేరు, గతంలో చెప్పాను,  శ్రీ గంగుల అప్పల నాయుడు. మంచి సంగీత రసికుడు. వీణ వాయించేవారట. సంగీతరావుగారు ఆయన దగ్గరకు వెళ్ళకముందు ప్రముఖ వైణికుడు శ్రీ వాసా కృష్ణమూర్తిగారు , శ్రీ మండా సూర్యనారాయణ శాస్త్రిగారు (సినీ నటుడు రావు గోపాలరావు గారి మామగారు) అక్కడ ఉండేవారు. ఈయనకి సంగీతంలోనే కాక మంత్ర శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. వీరిద్దరి తరువాత, మా నాన్నగారు సంగీతరావుగారు ఆయన వద్ద చేరారు. "మీరు ఎవరికీ ఏ సంగీతము నేర్పనక్కరలేదు. మీరు నా వద్ద ఉంటే చాలు" అని చెప్పినంత సహృదయుడు గంగుల అప్పలనాయుడుగారు.  ప్రముఖ సినీమా డైరక్టర్ బి ఎ సుబ్బారావు, వారికి దగ్గర బంధువే.


(శ్రీ గంగుల అప్పలనాయుడుగారు)

ఆ అప్పలనాయుడు గారి ఒక చెల్లెలు, సత్యవతిగారి  అల్లుడే మనందరికీ బాగా తెలిసిన సినిమా ఎడిటర్ శ్రీ  కె ఎ మార్తాండ్.


(అనకాపల్లి రంగారావుగారు, నాన్నగారు, ఫిల్మ్ ఎడిటర్ కె ఏ మార్తాండ్ గారు)

మరొక చెల్లెలు, సావిత్రిగారి భర్త సాలూరులో ప్రముఖ వ్యక్తి శ్రీ జర్జాపు నీలకంఠం. ఆయన కుమారుడు శ్రీ జర్జాపు ఈశ్వరరావు. ఆయనే, ప్రస్తుతం, సాలూరులో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు స్థాపించిన ' శారదా గాన పాఠశాల' మంచిచెడ్డలు గమనిస్తున్నారు. 


(శ్రీ జరజాపు ఈశ్వరరావుగారు మా నాన్నగారితో)

ఇలా కొన్ని కుటుంబాలతో తరతరాల సత్సంబంధాలు కొనసాగుతూంటాయి.
 

(శ్రీ గంగుల అప్పలనాయుడుగారి సోదరి - లక్ష్మీనారాయణమ్మగారు, మేనకోడలు సత్యవతిగారు వారి పిలల్లతో మా అమ్మగారు, మా చెల్లెళ్ళు)

1945 లో 'స్వర్గసీమ' సినిమా వచ్చింది. ఘంటసాల అనే గాయకుడు ఈ సినిమాలో తన మొట్ట మొదటి పాటను భానుమతి వంటి ప్రముఖ గాయనితో కలసి పాడడంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అదే  1945 సంవత్సరం లో నేను పుట్టాను. అందుకు లోకం నవ్వనూలేదు, ఏడ్వనూ లేదు. ఉండవలసినంత సహజంగానే ఉంది. కాకపోతే మరో గొప్ప విశేషం జరిగింది. నేను పుట్టాక రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసింది. ఇది  నిజంగా ప్రపంచమంతటికీ శుభవార్తే. సంతోషకరమైన విషయమే. ఎందుకంటే, ఆ యుధ్ధ కాలంలో అన్నిటికీ రేషనే. ఏ వస్తువు దొరికేది కాదట. పసిపిల్లల పాల డబ్బాలకు రేషనే. అయితే, మా ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది కొంచెం కొంచెం గుర్తు.

ఇలా ఐదేళ్ళు గడిచాయి. ఈలోగా లోకమంతా ఎన్నో మార్పులు జరిగాయి. మనదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి కలిగి స్వాతంత్ర్యం లభించింది. ఆ విషయాలన్నీ తెలిసే వయసుకాదు నాది. కానీ, ఒకనాటి ఉదయం, మా యింటి పెరట్లో గులాబీ మొక్కలు, వంగ, బెండ మొక్కల మధ్య కాలక్షేపం చేస్తూండగా గాలిలో తేలుతూ ఎక్కడనుండో ఒక పాట వినిపించింది. అది మా నాన్నగారు పాడే పాటలా లేదు. ఎక్కడనుండి వస్తున్నదో తెలియదు. గాలివాటానికి ఒకసారి గట్టిగా, ఒకసారి మెల్లగా  వినిపించేది. అదెందుకో తెలియదు. ఆ పాట నాకు తరుచూ వినిపించేది. ఒకరోజు మా నాన్నగారు నన్ను నాయుడుగారింటికి తీసుకువెళ్ళారు.  నేను అంతవరకూ గాలిలో వింటున్న పాట,   ఆ యింటిలో ఒక బాకాలోనుండి వినిపించింది. 

నాకు చాలా వింతగా అనిపించింది. మనుషులెవరూ పాడడం లేదు. అయినా పాట వినిపిస్తోంది. ఇంతలో బాకాలో పాట ఆగిపోయింది. మళ్ళీ పాడితే బాగుండుననిపించింది. మా నాన్నగారు ఆ బాకా దగ్గరకు వెళ్ళి దేన్నో తిప్పారు.  విచిత్రం మళ్ళీ అదే పాట వచ్చింది. ఆ పాటలో మాటలు నాకు అర్ధం కాలేదు, 'పలుకు', చిలకా' అనే రెండు మాటలు తప్ప. ఎందుకంటే అదే ఊళ్ళో ఎవరింట్లోనో ఒక బాదం చెట్టు, చెట్టు మీద చిలకలు చూశాను. అవి బాదం కాయలు కొరికి పలుకులను క్రింద పడేసేవి. ఆ కాయల్లో పలుకులుంటాయని వినడం వలన , ' పలుకు', చిలక' మాత్రం గుర్తున్నాయి. ఆ మాటలు ఈ బాకాలో వినడం ఆనందం కలిగించింది. అప్పటికి నాకు నాలుగేళ్ళు దాటాయి. కొన్ని గుర్తున్నాయి. కొన్నిలేవు.
          (పలుకరాదటే చిలుకా  పాటను వినాలంటే రికార్డు పైన   ప్లే బటన్ నొక్కండి)
                                   
ఆ తర్వాత ఎప్పుడో కొన్నేళ్ళకు తెలిసింది, అది 'పలుకరాదటే చిలకా' అని, షావుకారు సినీమాలో ఘంటసాలవాడు పాడేడని. అదే నాకు కొంత జ్ఞానం వచ్చాక విన్న మొదటి పాట. అలాగే, 'దీపావళి, దీపావళీ మా ఇంట మాణిక్య కళికావళీ'. ఇందులో కూడా నాకు తెలిసిన దీపావళి ఉండడం వలన నాకు ఇష్టంగా  గుర్తుండిపోయాయి. ఈ పాటలను నాయుడిగారింట్లో చాలాసార్లే విన్నాను.

అక్కడే, మరో రెండు పాటలూ విన్నాను 'ఓ విభావరి,' 'ఆ తోటలో నొకటి'. ఎవరు పాడారో అప్పుడు తెలియదు . తర్వాత తెలిసింది.

(ఆ తోటలోనొకటి ఆరాధానాలయము .. పాట వినడానికి ప్లే బటన్ నొక్కండి)


ఒక నల్లటి ప్లేట్ తిరుగుతూంటే పాట వినపడడం నేను కనిపెట్టిన కొత్త వింత.


(ఓ విభావరీ......పాట వినడానికి ప్లే బటన్ నొక్కండి)
అలాగే, కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కూడా వింతగానే ఉంటాయి. మనకు తెలిసినవాళ్ళు కొన్నాళ్ళు కనిపించి, తరువాత ఎప్పుడో ఎక్కడో కలుసుకోవడమో, లేక వాళ్ళ గురించి వినడమో జరిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.

ఇంతకు ముందు చెప్పాను, కలివరం గ్రామం నాగావళి ఏటిని ఆనుకుని ఉందని. అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరుందని. అక్కడే గండ్రేడు అని మరో ఊరు. ఆ ఊళ్ళో నుండి మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకుందికి ఒకతను వచ్చేవాడు. అతను చాలా తెల్లగా ఉండేవాడు. షెరాయి, చొక్కా వేసుకునేవాడు.  ఆయన పేరు బురిడి లక్ష్మున్నాయుడు. మనిషి చాలా మంచివాడు. మా నాన్నగారి వ్యాసాల ద్వారా తెలుసుకున్నది. 


(శ్రీ బురిడి లక్ష్మున్నాయుడు)

అలాగే, మరొకతను, పేరు ఏదో దాసు. పూర్తిపేరు గుర్తులేదు. అతను నన్ను ఎత్తుకొని ఆడించేవాడు. తాటాకుతో చక్రాలు, న్యూస్ పేపర్ తో గాలిపటాలు చేసి, నాతో సమానంగా ఏటి ఇసకల మీద ఆడించేవాడు. అంతవరకే గుర్తు. ఆ ఊరిని ఆనుకొని ప్రవహించే నాగావళి ఏరును దొంగ ఏరు అనేవారు. సడన్ గా వరదనీటితో ఏరంతా నిండిపోయేది.  మర్నాటికల్లా వరదొచ్చిన ఆనవాలే ఉండేదికాదు.  ఎక్కడో కొండల్లో వర్షాలు పడితే ఈ ఏటికి వరద వచ్చేది. ఒకసారి అలాటి వరదలో ములిగిపోయాను. ఎవరో జుట్టుపట్టుకు పైకి లాగారు.  లేకపోతే, ఈ కబుర్లు నానుండి మీరు చదివేవారు కాదు. అప్పటినుండి నాకు కొంచెం వాటర్ ఫోబియా ఉంది. అందుకే నదీ స్నానాలు, సముద్ర స్నానాలకు దూరం. మద్రాసు మెరినా బీచ్ కు వెళ్ళినా  పాదం మునిగే లెవెల్ వరకే వెళ్ళడం పరిపాటి.

సరి, మళ్ళీ బురిడి లక్ష్మునాయుడి గారి విషయం చూద్దాము. ఆయన మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారి దగ్గర చాలా కాలమే సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత, మా నాన్నగారు కలివరం వదలి, విజయనగరం, మద్రాస్ వెళ్ళాక, ఆయన కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో  మా తాతగారు  - శ్రీ సీతారామశాస్త్రి గారి క్లాసులోనే చేరి డిప్లొమా చేశారు. అదే కాలేజీలో లెక్చరర్ గా కూడా పని చేశారనుకుంటాను. ఆలిండియా రేడియోలో తరుచూ ఆయన కచేరీలు వినిపించేవి. ఆయన టోపి ధరించేవారు. లక్షుంనాయుడుగారు కచేరీలలో తమ గురువులైన శ్రీ సీతారామశాస్త్రి గారి కృతులు  కూడా గానం చేసేవారు.  ఆయన కుమార్తే, బురిడి అనురాధా పరశురామ్. ప్రస్తుత విజయనగరం మ్యూజిక్ కాలేజి ప్రిన్సిపాల్. ఆవిడను 2008లో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో కలసి మాట్లాడినప్పుడు ఆ చిన్నప్పటి కలివరం రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నాను.


(శ్రీమతి అనురాధా పరశురామ్)

అదే కాలేజీలో గాత్రం లెక్చెరర్ గా పనిచేసిన శ్రీ బి ఎ నారాయణగారు శ్రీ బురిడి లక్షుంనాయుడిగారి శిష్యుడేనని విన్నగుర్తు.బి ఎ నారాయణగారు  కర్ణాటక సంగీతంలోనే కాక ఘంటసాలవారి పాటలు, పద్యాలు  పాడడంలో కూడా ఆరితేరినవాడు. మా జంటసంస్థలు ఆవిర్భావం నుండి 2008లో విజయనగరంలో జరిగిన ఆఖరి కార్యక్రమాల వరకూ క్రమం తప్పకుండా పాల్గొని ఘంటసాలవారి పాటలు, పద్యాలు పాడి ప్రేక్షకులను సమ్మోహనపర్చేవారు. కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వలన, మంచి గాత్రసంపద ఉన్నందువల్ల చాలా మంచి గాయకుడిగా పేరు సంపాదించారు.


(శ్రీ బి ఏ నారయణ, ఆయన కుమారుడు పవన్)

విజయనగరంలో మా ఉత్సవాల సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరయిన శ్రీ సంగీతరావుగారిని బి ఎ నారాయణ మ్యూజిక్ కాలేజీకి తీసుకువెళ్ళి తమ స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేసి ఆ పిల్లలచేత పాడించారు. ఆయన కుమారులు పవన్, సంతోష్ లు కూడా ఇప్పుడు మంచి గాయకులుగా స్థిరపడ్డారు.

ఎప్పుడో, ఎక్కడో 1945లలోని మూలాలు నేటి వరకు మూడు తరాలపాటు వ్యాపించడం అపూర్వంగానే తోస్తుంది నాకు. ఆ విధంగా నాకు ఘంటసాలవారి పాటతో  మొదటిసారిగా పరిచయం ఏర్పడినది, విన్నదీ  కరెంట్ వసతులు కూడా  లేని ఒక కుగ్రామంలో. ఇప్పుడా కలివరం కూడా అన్ని ఊళ్ళలాగే అభివృధ్ధి చెందిందని విన్నాను. 1951 ప్రాంతాలలో ఆ ఊరినుంచి  కుటుంబంతో సహా వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళే అవకాశమే దొరకలేదు. కానీ, మనసులో ఎక్కడో గాఢమైన కోరిక ఉంది. ఆ కలివరం వెళ్ళాలని.

వచ్చే వారం మళ్ళీ విజయనగరంలో......
ఘంటసాలవారి విశేషాలతో......
                ....సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.