visitors

Saturday, February 25, 2012

ఆంధ్రమాతకు కృష్ణ శాస్త్రిగారి గీతార్చన



(చాలామంది తెలుగువారికి తెలియని ఓ చక్కని,  కొత్తపాటని ఇక్కడ పరిచయం చేయబోతున్నాను)

1897లో ఆంధ్రదేశంలో జన్మించిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మీద ఆ కాలంలోని అనేక ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో భాష, సంస్కృతి, సమాజం ఈరంగాలలో అనేక మార్పులు చోటుచేసుకున్న కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం పట్టారు. ఆనాటి సాహిత్యంలో ప్రధాన మైన ధోరణి, ఉద్యమ స్థాయినందుకున్న కవితా పద్ధతి భావకవిత్వం.  గురజాడ, రాయప్రోలు సుబ్బారావుగారు తో ప్రారంభమై భావకవిత్వం శాఖోపశాఖలుగా విస్తరించింది. కవిత్వం చెప్పడంలోనే కాక ఆ కవిత్వం చెప్పేవారి రూపురేఖావిలాసాలు కూడా  కొత్తపోకడలు సంతరించుకుని భావకవులల్లిన కవిత్వం ప్రజా బాహుళ్యంలో విశిష్టమైన స్థానం సంపాదించింది.

ఆ భావకవిత్వ యుగంలోని అచ్చమైన భావకవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవితా యుగంలోని అన్ని లక్షణాలు దేవులపల్లి కవిత్వంలో కనిపిస్తాయి. ప్రణయం, ప్రకృతి, దేశ భక్తి, ఆథ్యాత్మికత, సంఘ సంస్కరణ, మానవత్వం, కాల్పనికత, మార్మికత ఇలా భావకవులు  ఆ కాలంలోని  ఇతర భాషా సాహిత్యాల ప్రభావంతో చేసిన రచనలలోని ప్రధానమైన వస్తువులు. దేవులపల్లి కవిత్వంలో  ఈ అంశాలకు చెందిన గేయాలెన్నో కనిపిస్తాయి.

దేవులపల్లి గీతాలలో దేశ భక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం -జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. 

భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లిగారు రాసిన ఈ గేయం జాతీయపండుగల సందర్భాలలో  తెలుగు వాళ్ళ నోట పారాయణంగా మ్రోగుతుంది.

అయితే  దేశభక్తి అనే ఛాయతోనే ఆంధ్రదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ  దేవులపల్లి కష్ణశాస్త్రిగారు రచించిన మరొక గేయం చాలామంది తెలుగు వారికి తెలియదు.  ఆంధ్రదేశ వైభవాన్ని వర్ణిస్తూ సాగే గేయం జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ . 


 జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ గేయం పూర్తిగా సంస్కృత పదాలతో కూర్చిన గేయం అయితే, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ  గేయంలో ఎక్కువగా తెలుగు పదాలను కూర్చడమే కాక తెలుగు దేశంలోని ప్రకృతి వర్ణన కూడా చేసారు కృష్ణశాస్త్రిగారు.

పట్రాయని సంగీతరావుగారు మద్రాసు కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ - రూపొందించిన ఎన్నో నృత్యనాటకాలకు సంగీతం సమకూర్చారు. ఆ సమయంలో  మాష్టరు గారు వెంపటి  చినసత్యంగారి వద్ద నాట్యం నేర్చుకున్న అనేకమంది ప్రముఖ నర్తకీమణులలో సినీనటి కాంచన ఒకరు.   ఆమె తన నాట్యం లో   ప్రదర్శించడంకోసం   దక్షయజ్ఞం అనే రచన ప్రారంభించారట కృష్ణశాస్త్రిగారు. దక్షయజ్ఞం రచన కొసవరకు సాగలేదు, కానీ ఆసమయంలోనే కృష్ణశాస్త్రిగారు, " ప్రతిదినము నీ గుణకీర్తనమే పారవశ్యమున పాడెదమూ", 
" పూవులేరి తేవే చెలి"  అనే లలితగేయాలను రచించారుట.    అప్పుడు  కూచిపూడి నాటకాలకు సంగీత దర్శకుడిగా ఉన్న   పట్రాయని సంగీతరావుగారు   కృష్ణశాస్త్రిగారిని తరచు కలుసుకుంటూ ఉండేవారు. ఆ సందర్భంలోనే ఈ గేయాలను సంగీతరావుగారు  స్వరపరిచారు.  ప్రతిదినమూ నీ గుణకీర్తనమే గేయాన్ని శహనా రాగంలోను, పూ లేరి తేవే చెలి పోవలె గేయాన్ని యదుకుల కాంభోజి రాగంలోను, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ " పాటను  కల్యాణి, మధ్యమావతి రాగాలలోను కూర్చారు సంగీతరావుగారు.

ఈ క్రమంలో దేవులపల్లివారు రాసుకున్న పాట  వారి స్వహస్తాలతో ఇదిగో ఇది.


ఈ పాట సాహిత్యం ప్రారంభం  ఇలా ఉంటుంది.
జయ జయ మహాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియతమ భారతధాత్రీ  ప్రియపుత్రీ శుభ ధాత్రీ

భారతదేశాన్ని తల్లిగా భావించి జయజయప్రియభారత జనయిత్రీ అని రాసిన కృష్ణశాస్త్రిగారు, ఆ భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్ర దేశాన్ని భారతధాత్రీ ప్రియపుత్రీ  అంటూ  ఆ భారతమాత పుత్రికగా ఊహించారు ఈ పాటలో.

మొదటి చరణంలో పచ్చని పంటపొలాలతో సస్యాలతో కొత్త చిగుళ్ళు వేసి పచ్చగా ఉన్న ఆంధ్ర దేశాన్ని, అరటి, మామిడి,  కొబ్బరి మొదలైన వృక్షచ్ఛాయలతో నిండి వాటినుండి వచ్చే మృదువైన గాలులు  వింజామర వీచగా అతి సుందరంగా శోభిల్లే భూమిగా ఆంధ్రదేశాన్ని ఊహించారు.

రెండవ చరణంలో ఆంధ్రదేశానికి చెందిన ఘనమైన చరిత్రను స్మరించి, రాబోయే కాలాన్ని మరింత ఘనంగా ఊహించి ఇటు మంజీరా నది, అటు వంశధార నదులు ఆ తల్లిని ఘనంగా కీర్తిస్తూ ఉన్నాయట. కబరీ కాశ కదంబములూగ అంటే కొబ్బరిచెట్ల కొమ్మలు, రెల్లు పొదలు, కడిమిచెట్లు వంటి అంగాలతో చలిస్తూ ఉండగా  శబరీ, పెన్నా మొదలయిన నదులు సంతోషంతో నృత్యం చేస్తాయట. ఈ సంబరమంతా చూసి గోదావరి, కృష్ణా నదులు తమ ప్రవాహాలనే తలలను ఊపుతూ సంతోషాన్ని తెలియజేస్తాయని వర్ణిస్తారు కృష్ణశాస్త్రి.

మూడవ చరణం లో  ఈ ఆంధ్రదేశంలో వసించే వారి అన్ని కోరికలు తీరాలని, ఇటు తెలంగాణలోను, అటు కళింగదేశమయిన ఉత్తర ప్రాంతంలోను, రాయలసీమ లోను మొత్తం తెలుగు ప్రాంతాలన్నిటా వేల వేల గుమ్మాలలో మంగళనాదంగా ఆంధ్రగానం మోగాలని కోరుకుంటారు.

పాట ముగింపులో  కవి తన ప్రబోధాన్ని తెలియజేస్తారు. జగమంతా తన కుటుంబమే అని నమ్మే విశాలహృదయం కవిది. అందుకే విశాల మానవతా సమతా వాదమే మా మనోరథం అంటూ ఏ కులమతాలు, వైషమ్యాలు లేని సమానత్వంతో మానవత్వాన్ని సాధించి మనుషులంతా ఒకే కుటుంబంగా జీవించే ఆశయాన్ని సాధించాలంటారు. అందుకోసం నడుం కట్టాలంటారు. 

లోక కల్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛకోసం ధృఢమైన శపథం తీసుకోవాలని బోధిస్తారు. ఒక్క క్షణకాలం కూడా వృథా చేయకుండా ఈ ఆశయసాధనకోసం అంకితం అవుతామని, గమ్యంకోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరవని  సంకల్పాన్ని వెల్లడిస్తారు. ఇటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలగాలని దీవించమని కోరుతారు.

సకల మానవకల్యాణమే విశ్వకవి కోరుకునే ఆశయం.
ఆ లోకకల్యాణంకోసమే కవి పూరించే ఈ మంగళకాహళి.

పాట సాహిత్యం :

          జయ జయ మహాంధ్ర జనయిత్రీ
          జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
          జయ జయ ప్రియతమ భారతధాత్రీ 
          ప్రియపుత్రీ శుభ ధాత్రీ


1 చరణం.    శ్యామల నవ సస్యాంబరా
              కోమల సుమవల్లీ చికురా
              కదళీ రసాల లాంగలీ ఛలచ్ఛద
              మృదులానిల జామరా
              సుందరాతి సుందర వసుంధరా 
                                            "జయ జయ మహాంధ్ర"
2 చరణం.    నీ పూర్వ చరిత స్మరియించి
               నీ భావి ఘనత దర్శించి
               ఇటు మంజీర అటు వంశధార 
               ఎలుగెత్తి నిన్ను కీర్తించూ
               కబరీ కాశ కదంబములూగ 
               శబరీ పెన్నలు నర్తించు
               మరి మరి కృష్ణా గోదావరి 
               ఝరులు తలలూపి హర్షించు
                                              "జయ జయమహాంధ్ర"
 3 చరణం   ఎల్లర కోర్కులు నిండునని 
              మనమెల్లరమొక సంసారమని
              ఇటు తెలంగాణ  అటు కళింగాన
              అట నట కోస్తా రాయలసీమల
              సహస్ర సహస్ర మందిర గేహళి
              సదా మ్రోగు నీ మంగళ కాహళి  "జయ                                                                                జయమహాంధ్ర"
  ముగింపు:     శ్రీ విశాల మానవతా సమతా
                     సాధనమే మా మనోరథం
                      భావిలోక కల్యాణ సుస్థిర  
                      స్థాపనమే మా దృఢ శపథం
                      ఒక క్షణమేని వృథ పోనీము
                      ఒక అడుగేని చెదరనీయము
                      శ్రీరస్తు శుభమస్తని శాంతి రస్తని దీవించు  
                                               

    ( జయ జయ మహాంధ్ర జనయిత్రీ  వినడానికి వీడియో పైన  క్లిక్ చేయండి)

Saturday, February 11, 2012

ఇద్దరు మిత్రులు

ఇక్కడ చెప్పబోతున్న ఇద్దరు మిత్రులు, మన మధురగాయకుడు ఘంటసాల, కలైమామణి పట్రాయని  సంగీతరావూను.

పట్రాయని సీతారామశాస్త్రిగారు ఘంటసాలకి విజయనగరంలో  సంగీతవిద్య నేర్పిన గురువుగారు .గురువుగారి నుండి సంగీత విద్యను గ్రహించడమే కాకుండా ఆయన  వ్యక్తిత్వాన్ని జీవితాదర్శంగా చేసుకున్న గొప్ప శిష్యుడు ఘంటసాల. 

భాషలోని సాహిత్యభావానికి తగిన సంగీతకల్పన చేయడంలోతెలుగుపాటలో మాట తెలుగుమాటగా వినిపించాలన్న గురువుగారి ఆదర్శాన్ని ఘంటసాలగారు అక్షరాలా ఆచరించారు. గురువుగారి ప్రభావం వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్టతప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి’ – అన్నారు ఒకచోట ఘంటసాల.

సీతారామశాస్త్రిగారు సంగీతాన్ని ఒకయోగంగా సాధనచేసిన గొప్ప సాధకులు. అనేకగీతాలను రచించి స్వరపరచి గానం చేసిన వాగ్గేయకారుడు.  గురువుగారి పట్ల ఎంతో వినయంతో పాటు అత్యంత ఆత్మీయతానురాగాలను చూపేవారు ఘంటసాల. 

గురువుగారి  ప్రథమ పుత్రులు సంగీతరావుగారు. పట్రాయని వంశంలోని తాతగారి, తండ్రిగారి సంగీత సాహిత్య స్వరసంపదను వారసత్వంగా అందుకున్నారు. అతి చిన్నవయసునుండే సంగీతకచేరీలు చేస్తూ ప్రముఖుల మన్ననలు పొందారు. 

ఘంటసాల విజయనగరంలో కొంతకాలం గురువుగారి ఆశ్రయంలో ఉండవలసిన పరిస్థితిలో వయసు తేడా ఎక్కువగా లేని సంగీతరావుగారు, ఘంటసాల మధ్య మైత్రి చిగురించింది. తరువాత ఘంటసాల మద్రాసుచేరి మంచి సంగీత దర్శకుడుగా స్థిరపడ్డారు. 1954 లో అనుకోకుండా మద్రాసు కి వచ్చిన  సంగీతరావుగారు ఘంటసాలగారి ఆహ్వానం మేరకు వారి ఆర్కెష్ట్రాలో హార్మోనియం వాయిద్యకారుడుగా, ఘంటసాలగారికి స్వరసహచరుడిగా మద్రాసులో ఉండిపోయారు.


1955లో ఘంటసాల  స్వంత ఆర్కెష్ట్రాని ప్రారంభించారు. అప్పటినుండి  ఘంటసాల  సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నిటిలోనూ సంగీతరావుగారు తనవంతు సహకారం అందించారు.ఘంటసాల స్వరపరుస్తూన్నప్పుడు వాటికి  నోట్స్ రాసి ఇవ్వడం, ఆర్కెష్ట్రాకి సూచనలు ఇవ్వడం  చేసేవారు సంగీతరావుగారు. పాట స్వరపరచినప్పుడు స్వరాలు రాసి ఇవ్వడం అనేది సులభమైన పని కాదు. చాలా శ్రమతో కూడుకున్నది.
పాట కంపోజ్ చేస్తున్నప్పుడు ఘంటసాల అలా పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే కాని స్వరాలు రాసుకోవడానికి టైం ఉండేది కాదు. అప్పుడా స్వరాలను గుర్తుపెట్టుకొని హార్మోనియం మీద నోట్ చేసుకోవడం సంగీతరావుగారు చేసేవారు. అలాగే  పాటలను కర్ణాటక సంగీతపరంగా ప్రయోగాత్మకంగా కూర్చినప్పుడు  సంగీతరావుగారికి గల అపారమైన సంగీత ప్రతిభ తెలిసిన ఘంటసాల సందర్భానుసారంగా ఉపయోగించుకునేవారు.


ఘంటసాల సంగీతరావుగారిని సంగీతం బాబూ అని పిలిచేవారుట. ఒక్కోసారి మేష్టారూ అని కూడా సంబోధించేవారట. శ్రీ ఘంటసాలగారి విద్యార్ధి దశనుంచి ఆయన జీవితకాల పర్యంతం అనేక దశలలో సంగీతరావుగారు ఆయన మిత్రుడిగా, సహచరుడిగా మెలిగారు. అటువంటి తన గురుపుత్రుడుగా, ఓమంచి మిత్రుడిగా సంగీతరావుగారిని ఘంటసాలగారు తన జీవితాంతం కూడా ఎంతో ఆదరాభిమానాలు కనపరిచి గౌరవించారు. 




మొదటిసారి ఈ ఇద్దరూ కలుసుకున్న ముహూర్తబలం ఎటువంటిదోకాని ఘంటసాలగారి మరణ పర్యంతం సుమారు పాతిక సంవత్సరాలపాటు  ఇద్దరూ కలిసి ఎంతో ప్రియమిత్రులుగా చరించారు. వృత్తిలోను, ప్రవృత్తిలోను మమేకమైనారు.  ఘంటసాలగారి ఇంటి వెనుక భాగంలోనే సంగీతరావుగారి కాపురం.  రికార్డింగులకి కలిసే వెళ్ళేవారు. ఇరువురి కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉండేవి. పిల్లలంతా కలిసి పెరిగారు.  ఘంటసాల విదేశీయాత్ర చేసినా, ఎక్కడ కచేరీలు చేసినా  పక్కనే ఉండేవారు సంగీతరావుగారు. స్వర కల్పన చేసినప్పుడు స్వరాలు రాయడం,హార్మోనియంతో వా                   ద్య సహకారం చేసేవారు. 


ఈ విధంగా పాతిక సంవత్సరాలకు పైగా స్వరమైత్రితో, పవిత్రమైన  స్నేహబంధంతో  చిరమిత్రులుగా ఎంతో ఆత్మీయతానురాగాలతో ముడిపడిన                                    
బంధం  వీరిద్దరిదీ.

ఆ బంధానికి గుర్తుగా  డిసెంబరు 4, 2006 న  అప్పటి ముఖ్యమంత్రి డా.రాజశేఖరడ్డి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున  ఘంటసాల అవార్డ్              పేరుతో సంగీతరావుగారిని సత్కరించారు. 


మళ్ళీ ఈరోజు ఫిబ్రవరి 11, 2012 న ఘంటసాలగారి స్మృత్యర్థం ప్రతి           సంవత్సరం  ఇచ్చే  ఘంటసాల ప్రతిభా పురస్కారం అవార్డును  శ్రీ సంగీతరావుగారు అందుకోనున్నారు.  ఘంటసాల, సంగీతరావుగారి మధ్యగల మధురమైన స్నేహానుబంధానికి గుర్తుగా, సంగీత కళకు, నాట్యకళకు సంగీతరావుగారు అందించిన సేవలను గుర్తించి  ఈ అవార్డును 
సంగీతరావుగారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు రూపంలో ఇచ్చి సన్మానించనున్నారు.

ఘంటసాలగారు మరణించి 38 సంవత్సరాలు గడిచింది. అయినా తెలుగు హృదయాలలో చిరంజీవి ఆయన.

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు - అన్నాడు మనసుకవి ఆత్రేయ. ఘంటసాలగారు మనకి వదిలి వెళ్ళిన తీపిగురుతు అయిన  ఈ ఇద్దరు మిత్రుల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసే సందర్బం ఇది.

శ్రీ సంగీతరావుగారికి అభినందనలు.


ప్రియమిత్రులు ఘంటసాలగారి గురించి సంగీతరావుగారి మాటల్లో తెలుసుకోవాలంటే ఇక్కడ వినవచ్చు.


11 ఫిబ్రవరి, 2012నాటి సన్మాన సభ వివరాలు :