visitors

Sunday, February 20, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై తొమ్మిదవ భాగం

20.02.2022 - ఆదివారం భాగం - 69*:
అధ్యాయం 2 భాగం 68 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1971 లో నేను ప్రవేశించిన కొత్త ఉద్యోగం నిరంతరమని అనిపించుకున్న ఏడాది నుండి కంపెనీవారు నాకు కూడా LTA ( Leave Travel Assistance) రూల్స్ వర్తింపజేశారు. దాని ప్రకారం నేను కూడా సంవత్సరానికి ఒకసారి 5 రోజులకు తక్కువ లేకుండా శెలవు పెట్టి LTA  advance తీసుకొని ఏదైనా ఊరు వెళ్ళి రావచ్చు. వెళ్ళివచ్చిన తర్వాత రైలు టిక్కెట్ల ప్రూఫ్ తో మిగతా ఎలవెన్స్ కంపెనీ నుండి తీసుకోవచ్చును. నేను చేరిన ఒక పదిహేనేళ్ళ వరకు  మా కంపెనీకి శని, ఆదివారాలు శెలవు దినాలుగా వుండేవి.   ఆ కంపెనీ యూరోపియన్స్ కంపెనీ కావడం వలన డిసెంబర్ 25  క్రిస్మస్ కు ఆ మర్నాడు 26 బాక్సింగ్ డే కు శెలవులుండేవి. జనవరి 1 , న్యూ ఇయర్స్ డే కు శెలవు. మా కంపెనీ/ ఫ్యాక్టరీలో తమిళం, మలయాళీ క్రిస్టియన్లు చాలామందే వుండేవారు. వాళ్ళంతా ఈ మూడు రోజులు కలసి వచ్చేలా LTA లీవులో పోతూండేవాళ్ళు. మిగిలినవాళ్ళు దీపావళి, పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా శెలవుల్లో వెళ్ళేవారు. ముందువెనకల శని, ఆదివారాలకు ఒక ఐదురోజులు శెలవు జోడిస్తే దాదాపు పదిహేను రోజులు శెలవు హాయిగా అనుభవించే అవకాశం వుండేది. నాకు వివాహమైన మొదటి రెండు  సంవత్సరాలు ఎక్కడికీ బయట వూళ్ళకు వెళ్ళే అవకాశం లభించలేదు.

1974 సంక్రాంతి సమయంలో LTA తో మాకు అత్యంత దగ్గర బంధువుల వూళ్ళకు వెళ్ళాము. సుమారు ఓ పదిహేనురోజుల ట్రిప్. మా ఆవిడతో బయట వూళ్ళకు వెళ్ళడం అదే మొదలు. అత్తవారి వూరు కూడా మద్రాసే కావడం వలన ఆ వంకన బయట ఊళ్ళకు వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. మా రెండు తరఫుల దగ్గర చుట్టాల ఇంటికి ఈ ట్రిప్ లో వెళ్ళాలని బయల్దేరాము.

మేము ఓ పదిహేను రోజుల తర్వాత మద్రాసు వచ్చేటప్పటికి నెం. 35,ఉస్మాన్ రోడ్ ఇంటి వాతావరణం ఉద్విగ్నభరితమైవుంది. (ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు నేను మద్రాసు లో లేని సమయంలో జరిగిన సంఘటనలు నా స్వానుభవం కాదు. మా ఇంట్లోవారు  మాస్టారు ఇంట్లోవారు చెప్పగా విన్నవి మాత్రమే). 

ఘంటసాల మాస్టారికి అతి చిన్నవయసులోనే  అంటే ఆయనకు తన ముఫ్ఫై రెండవ ఏటనే మధుమేహ(డయబిటిస్) వ్యాధి బయటపడిందని చెప్పుకోవడం వుంది. ఈ వ్యాధి వారింట్లో మాస్టారి తల్లిగారికి, తమ్ముడు సదాశివుడు గారికి, పెద్దకుమారుడు విజయకుమార్ కు, (చిన్నబాబు రత్నకుమార్ కు కూడా వున్నట్లే గుర్తు) తీవ్రంగానే వుండేది. వంశపారంపర్యంగా సంక్రమించిందనే చెప్పాలి. ఈ లక్షణాల వలన ఘంటసాల మాస్టారు హెచ్చు శ్రుతిలో పైస్థాయిలో ఆలపించేప్పుడు కొంత అయాసం, అలసట కలిగేవి. దాని ప్రభావం వలన అరికాళ్ళ మంటలు ఎక్కువై చాలా అవస్థ పడేవారు. గతవారం చెప్పినట్లు ఘంటసాలవారు సంగీతం విషయంలో గొప్ప నిష్ణాతులు. అనుభవజ్ఞులు. కానీ లౌకిక వ్యవహారాలలో ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో చాలా అమాయకులు. ఎవరేది చెప్పినా గాఢంగా నమ్మేసి అది పాటించేసేవారు. అలాటి సలహాలు కొన్ని పనిచేసినా మరికొన్ని తీవ్రంగా వికటించేవి.

ముఖ పరిచయం లేని ఒక పత్రికా విలేఖరి ఎవరో వచ్చి  దీర్ఘకాలిక రోగాలకు  చికిత్స చేసే గొప్ప నాటు వైద్యుడు ఎవరో చిత్తూరు లో వున్నడని అతని దగ్గరకు తీసుకు వెడతానని చెప్పాడట. ఆ వైద్యుడు చేసిన వైద్యంతో తన తల్లిదండ్రులకు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తల్లిదండ్రులకు ఉన్న జబ్బులు నయమయాయని చెప్పాడట. ఘంటసాల మాస్టారు ఆ వైద్యం తీసుకోవడానికి సిధ్ధపడ్డారట. సావిత్రమ్మగారు ఎంత చెప్పినా వినకుండా  1974 జనవరి 12 వ తేదీన విజయకుమార్ ను తోడుతీసుకొని కారులో చిత్తూరు వెళ్ళారట. ఆ నాటు వైద్యుడు ఒక హోటల్ సర్వర్ కూడా. నాలుగేసి గంటలకు ఒకసారి చొప్పున రెండు డోసుల మందు ఇచ్చాడట. ఆ రెండు డోసులు వేసుకున్న తర్వాత నయంగా అనిపించిందట. ఆ మందుతో కాళ్ళవాపులు తగ్గాయని తిరిగి మద్రాస్ వచ్చేసారట. త‌ర్వాత యథాప్రకారంగా రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు వెళ్ళడం ప్రారంభించారు. ఆ నాటు మందు వేసుకోసాగారు. ఆ మందు ప్రభావంతో కాళ్ళవాపులు కొంత తగ్గాయి కాని గొంతునొప్పి ప్రారంభమై  జనవరి 16 నాటికి అది తీవ్రమయింది. వేసుకున్న నాటుమందు వికటించింది. అలాగే 20వ తేదిన కూడా రెండు పాటలు పాడి వచ్చారట. విజయా హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ గా పనిచేసే వారి కుటుంబ వైద్యుడు డా. జయంతి రామారావుగారు వచ్చి మందులేవో ఇస్తూ వచ్చారు కానీ గుణం కనపడలేదు. మద్రాస్ లోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన ENT స్పెషలిస్ట్ డా. చిట్టూరి సత్యనారాయణగారు. మాస్టారిని ఆయన వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన అన్ని పరీక్షలు చేసి ఆ నాటు మందు వల్లే గొంతు సెప్టిక్ అయిందని, నయంకావడానికి ఇంజక్షన్లు, మందులు వ్రాసిచ్చారు. గొంతు నొప్పి వలన ఆహారం తీసుకోవడం కష్టమయింది. పూర్తిగా నీరసపడిపోయారు. లేచి నిలుచోలేని స్థితికి వచ్చేసారు. అలా ఓ పదిరోజులు గడిపారు ఇక ఇంట్లో లాభంలేదు హాస్పిటల్ లో జాయిన్ చేయడం మంచిదని డా.జయంతి గారు చెప్పడంతో  జనవరి 30న విజయా హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. ఘంటసాలకు ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే అమలు పర్చమని  విజయా హాస్పిటల్ అధినేత బి.నాగిరెడ్డి గారు తమ సిబ్బందికి ఉత్తర్వులు ఇచ్చారట.

ఘంటసాల మాస్టారు హాస్పిటల్ లో వున్నప్పుడు ఎంతో మంది నిర్మాతలు వచ్చి ధైర్యం చెప్పేవారట. మాస్టారు పాడవలసిన పాటల కాల్షీట్లు ఇవ్వమని, ముందస్తుగా ఎడ్వాన్స్ గా ఔదార్యంగా మొత్తం డబ్బు ఇవ్వబోయేవారట. కానీ మాస్టారు తాను ఆ పాటలన్నీ పాడిన తర్వాతే డబ్బు తీసుకుంటానని చెప్పారట. అదీ ఘంటసాలవారి వ్యక్తిత్వం.

బి.పి., డయబిటిస్, పైల్స్, హార్ట్ ప్రోబ్లెమ్స్ అన్నీ ఎక్కువై ఘంటసాలవారి పరిస్థితి విషమించింది. చాలా రోజులుగా ఆహారం లేకపోవడంతో విజయా హాస్పిటల్ డాక్టర్లు డ్రిప్స్ ఎక్కించడం మొదలెట్టారు.

వాహినీ స్టూడియోలోని కొన్ని రికార్డింగ్ ధియేటర్లను, షూటింగ్ ఫ్లోర్స్ స్థానే విజయాహాస్పిటల్ ను నిర్మించారు బి.నాగిరెడ్డి.  దాదాపు పాతిక సంవత్సరాల పాటు ఏ స్టూడియోలో నిర్విరామంగా పాటలు పాడారో ఏ సంస్థకోసం అజరామరమైన గీతాలను స్వరపర్చడానికి వెళ్ళేవారో అదే స్థలంలోని ఒక గదిలో ఈ రోజు ఘంటసాల మాస్టారు తీవ్ర అనారోగ్యంతో మంచానబడ్డారు.

సావిత్రమ్మగారు మాస్టారి పక్కనే రాత్రింబవళ్ళు గడపసాగారు. ఇంట్లోని పిల్లలు, పెద్దలూ  భయపడకుండా వుండడానికి మాస్టారికి నయమైపోతుందని  పదకొండవ తేదీన ఇంటికి వచ్చేస్తారని చెప్పడం నేనూ విన్నాను. దానికి తగినట్లుగానే ఆ రోజు ఉదయం ఘంటసాలగారు బాగా మాసిపోయిన గెడ్డం గీయించుకున్నారట. డాక్టర్లు కూడా ఇడ్లీ, జావ పెట్టవచ్చని చెప్పారట.

ఘంటసాలవారి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వాములు ఘంటసాలవారిని చూడడానికి విజయా హాస్పిటల్ కు వచ్చారట. వారు ధైర్యవచనాలు చెప్పి వెళ్ళిన తర్వాత ఘంటసాలవారు అకస్మాత్తుగా తన చొక్కా, బనీను విప్పేసి, మెడలోని యజ్ఞోపవీతాన్ని కూడా తీసేసి పక్కన పడేసారట.

1974 ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం పది గంటల సమయంలో మాస్టారికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. వేరే రూమ్ కు తీసుకువెళ్ళి ఆక్సిజన్ పెట్టారట.  గత కొద్ది రోజులుగా  డ్రిప్స్ మీదే కాలం వెళ్ళబుచ్చుతున్నందున వారి రెండు చేతులు బాగా కమిలిపోయి  డ్రిప్స్ పెట్టడం కష్టమైపోయి కాలికి పెట్టడం ప్రారంభించారట. డ్యూటీ డాక్టర్  తాను ఘంటసాలవారి అభిమానినని ఘంటసాలవారి కచేరీ తిరుపతిలో జరిగినప్పుడు వాళ్ళ ఊరినుంచి సైకిల్ మీద తిరుపతి వెళ్ళి ఘంటసాలవారి కచేరీ విని మురిసిపోయిన సంగతులన్ని చెపుతూ వచ్చేరట. కానీ మాస్టారిలో ఏ స్పందన కనిపించకపోయేసరికి నాడి చూస్తే అందలేదట. వెంటనే డా. జయంతి రామారావుగారు, ఇతర డాక్టర్లు పరుగెత్తుకు వచ్చి తమ ప్రయత్నాలు తామూ చేసారట. కానీ ఫలితం దక్కలేదు.

1974 ఫిబ్రవరి 11 వ తేదిన రెండు గంటల సమయంలో  ఘంటసాలవారి భౌతికకాయం నెం. 35, ఉస్మాన్ రోడ్ కు చేర్చారు.

ఘంటసాలవారి మరణవార్తతో దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.  మద్రాసు నగరంలోని సినీమా  కార్యకలాపాలు స్థంభించిపోయాయి. సంతాప సూచకంగా  రెండు రోజులపాటు అన్ని స్టూడియో లలో రికార్డింగ్ లు క్యాన్సిల్ చేసేసారు.

మామూలుగా ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళిపోయిన నాకు మా నాన్నగారు ఘంటసాలవారి మరణవార్తను ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే రెండురోజులు శెలవు పెట్టి ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేప్పటికి ఇంటి ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది.  అందరి ముఖాలలో తీవ్ర విషాదం అలముకొనివుంది. ఘంటసాల మాస్టారి భౌతికకాయాన్ని పోర్టికో వరండాలో ఉంచారు. ఆ వరండా మీది కుర్చీలోనే కూర్చొని తన కోసం వచ్చే కోరస్ సింగర్స్ తో, బయటిప్రాంతాల అభిమానులతో ఘంటసాలవారు చాలా సంతోషంగా, ఉత్సాహం తో మాట్లాడుతూ వచ్చినవారందరినీ ఆనందపర్చేవారు. అలాటి వ్యక్తి ఈనాడు అచేతనంగా వుండడం మనసుకెంతో కష్టాన్ని కలిగించింది.

ఘంటసాలవారి మరణవార్త వినగానే జాతి, కు‌ల, మత, భాషా తత్త్వాలకు అతీతంగా అసంఖ్యాకమైన జనసందోహం ఆ ప్రజాగాయకుని కడసారిగా చూచి నివాళులు అర్పించేందుకు  తరలివచ్చింది. వచ్చినవారందరిలో తీవ్రమైన దుఃఖం గూడుకట్టుకొనివుంది. ఎవరికి ఎవరు సానుభూతి చెప్పాలో తెలియక విలపించసాగారు. మాస్టారి సతీమణి సావిత్రమ్మగారు, ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడు, ఇతర కుటుంబ సభ్యులు పూర్తిగా నిశ్చేష్ఠులైపోయారు. వారికి ఏవిధంగా సానుభూతి చూపగలము.

ముందుగా ఘంటసాలవారి కి మంచిమిత్రుడు, ప్రముఖ నటుడు కాంతారావుగారు వచ్చి చొరవతీసుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కాంతారావు గారు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు అందరికీ టెలిఫోన్ లో సమాచారం అందజేశారు. నేను , నరసింగ పక్కనేవుండి టెలిఫోన్ డైరక్టరీ లోని నెంబర్లను ఒక్కొక్కటిగా అందజేస్తూంటే కాంతారావు గారు అందరికీ ఈ విషాదవార్తను ఫోన్ లో చెప్పారు. ఘంటసాలవారి మరణవార్త వినగానే ఆలిండియా రేడియో వారు విషాద సంగీతం వినిపిస్తూ మధ్య మధ్యలో ప్రముఖుల సంతాపసందేశాలను, మాస్టారి అజరామరమైన మధురగీతాలను ప్రసారం చేస్తూనే వచ్చారు. మద్రాస్ లోని తమిళ సాయంత్రపు పత్రికలన్నీ ఘంటసాలవారి మరణవార్తనే ప్రధానంగా ప్రకటించాయి. సినీ ప్రముఖులతో ఇల్లంతా నిండిపోయింది. అక్కినేని, ఎన్.టి.రామారావు తమ విషాద సంతాపాన్ని, మాస్టారితో తమకు గల అనుబంధాన్ని  తమ గద్గదకంఠాలతో ఆలిండియా రేడియోలో వివరించారు. బి.ఎన్.రెడ్డి, పి.పుల్లయ్య, సి.ఎస్.రావు వంటి ప్రముఖ దర్శక నిర్మాతలు వచ్చి మాస్టారిని చూసి కన్నీరు కార్చారు. ఘంటసాలవారంటే అమితంగా గౌరవించే సంగీతదర్శకుడు టి.చలపతిరావు కన్నీరు ఆపుకోలేక స్పృహకోల్పోయారు.  ఆయనను సముదాయించడమే కష్టమయింది. దక్షిణాది భాషలకు చెందిన సంగీతదర్శకులు, నేపథ్యగాయకులు, వాద్యకళాకారులు తమ ప్రియతమ మాస్టారిని చూసి కంటతడిపెట్టుకున్నారు. దక్షిణ భారత సినీ మ్యుజిషియన్స్ ఎసోసియేషన్ ఆఫీస్ లో  ఘంటసాలవారి చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటి అంజలి ఘటించారు. రెండురోజులపాటు పాటల రికార్డింగ్ కార్యక్రమాలను బంద్ చేసేసారు. ఇక సామాన్య ప్రజానీకానికి అంతేలేదు. 

సుప్రసిధ్ధ తమిళనటుడు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మాస్టారి పెద్దకుమారుడు విజయకుమార్ ను సముదాయింబోయి తానే గట్టిగా విలపించడం మొదలెట్టారు. అక్కడి వాతావరణం ఉద్వేగభరితమయింది. పెద్దబాబు(విజయకుమార్) అయితే తండ్రిగారి భౌతికకాయం పక్కనే తంబురా పెట్టుకు కూర్చుని విషాదరాగాలను, తండ్రిగారు పాడిన విషాదగీతాలను రాత్రంతా నిర్విరామంగా పాడుతూనే వున్నాడు. మరొకపక్క మాస్టారి దగ్గర పాటలు పాడే కోరస్ సింగర్సంతా భజనగీతాలు ఆలపిస్తూనే వచ్చారు. 

ఆ రాత్రి ఎలా తెలవారిందో ఎవరికీ తెలియదు. మర్నాటి ఉదయానికి ఘంటసాలవారి బంధువులు, సావిత్రమ్మగారి ఆత్మీయులు అందరూ రావడంతో ఇంట్లోవారి దుఃఖానికి అంతేలేదు. పురోహితులు ఘంటసాలవారి భౌతికాయానికి అంతిమ సంస్కారాలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు మొదలెట్టారు.  మద్రాసులో సినీ నటీనటులను చూడడానికి వచ్చిన తిరుపతి యాత్రా స్పెషల్ బస్సులన్నీ  నెం.35, ఉస్మాన్ రోడ్ ప్రాంగణానికి వచ్చిచేరాయి. వారంతా తమ ప్రియతమ గాయకుని అంతిమ యాత్రలో భాగమయ్యారు. ఘంటసాలగారి భౌతికకాయం, గాయకులు టి.ఎమ్.సౌందరరాజన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నటుడు కృష్ణంరాజు, మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు వంటివారు ముందుగా నడుస్తూండగా శ్మశానవాటికకు చేరుకుంది.




టి.నగర్ ఉస్మాన్ రోడ్ దక్షిణాన ఉన్న కన్నమ్మపేట శ్మశాన వాటికకి, ఎక్కడెక్కడినుండో వచ్చిన వేలాది అభిమానులు ఘంటసాల మాస్టారి భౌతికాయం మీద పూలవర్షం కురిపిస్తూ ఘంటసాల అమర్ రహే, ఘంటసాల జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగగా, సినీ ప్రముఖుల భుజాలమీదుగా ఘంటసాలవారి భౌతికకాయం తన అంతిమయాత్ర సాగించింది.  కన్నమ్మపేట శ్మశాన వాటికకు చేరేంతవరకు రోడ్ కు ఇరువైపులా ప్లాట్ ఫారమ్ ల మీద, మేడలపైనుండి తమిళ అభిమానులంతా ఘంటసాలవారి కి నివాళులు అర్పించారు. కొందరు తమిళం  వారు దేవదాసు లో మాస్టారు పాడిన 'ఉలగేమాయం వాళ్వే మాయం'  (జగమేమాయా బ్రతుకే మాయా) పాటను పాడుతూ విలపించారు. వేలాది ప్రజలు వెంటరాగా శ్మశానవాటికలో ఘంటసాలవారి భౌతికకాయానికి పెద్దకుమారుడు విజయకుమార్ అగ్నిసంస్కారం చేశాడు.  ఒక సంగీత సామ్రాట్ ఆత్మ అనంతలోకాలకు తరలిపోయింది.  




ఘంటసాలవారు అమరగాయకులుగా మన మనస్సులలో నిల్చిపోయారు. వారు భౌతికంగా మన మధ్యనుండి తొలగి 48 సంవత్సరాలు అవుతున్నావారు పాడిన వేలాది పాటలు సంగీతప్రియులకు అన్నివిధాలా ఉపశమనం కలిగిస్తూనే ఉన్నాయి.

తెలుగు భాష ఉన్నంతవరకూ ఘంటసాలవారు, వారి అమృతతుల్యమైన గానం ఈ ప్రకృతిలో లీనమయేవుంటుంది.

ఘంటసాల చరిత అజరామరం. అంతమనేదే లేదు.
                        ...సశేషం