visitors

Friday, October 30, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నాలుగవ భాగం

30.10.2020 - శుక్రవారం భాగం - 4*:
అధ్యాయం 2  భాగం 3 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

రంగయ్యర్ స్ట్రీట్ లో వున్నప్పుడే, మా నాన్నగారు ఒకసారి నన్ను మాత్రం ఘంటసాలవారింటికి వెళ్ళి ఆయనకు పళ్ళు, పువ్వులు ఇచ్చిరమ్మని పురమాయించారు. ఎందుకో తెలియదు. కానీ, యిప్పుడనిపిస్తోంది, ఆరోజు ఘంటసాలవారి పుట్టినరోజు డిసెంబర్ 4 అయ్యుండచ్చు. అంతేకాకుండా, నేను స్వతంత్రంగా బయటకు వెళ్ళి పనులు చేసుకురావడం అలవాటు చేసుకోవాలనే ఉద్దేశమైనా కావచ్చు. ఆరోజు ఉదయాన్నే వెళ్ళి ఘంటసాలవారికి పళ్ళు‌, పువ్వులు ఇవ్వడానికి బయల్దేరాను. శుభ్రమైన తాజా పళ్ళు, పువ్వులు రంగనాధన్ స్ట్రీట్ పక్కనున్న 'శివ-విష్ణు' కోవెల దగ్గర పెట్టుకొని అమ్ముతూంటారని అక్కడికి వెళ్ళి కొనమని సూచనలిచ్చారు. ఆ శివ-విష్ణు ఆలయం టి.నగర్ బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుంది. మా ఇంటి సందు చివర ఉత్తర దక్షిణాలకి మెయిన్ రోడ్డు - ఉస్మాన్ రోడ్ దగ్గర ఎడమవేపు వెళితే నెం.35, ఉస్మాన్ రోడ్ ఘంటసాలవారి స్వగృహం. కుడి వేపుకు వెళితే టి.నగర్ బస్ స్టాండ్. ఆ కోవెలను వెతుక్కుంటూ వెళ్ళాను మంచి అరటి పళ్ళు కోసం. సమయం ఉదయం 7-8 గంటల లోపు. ఆ రోజుల్లో, ఉస్మాన్ రోడ్ కు రెండువైపులా దట్టమైన చెట్లు వాటి మధ్యనుండి సన్నగా ప్రసరించే సూర్యకిరణాలతో, సుమారు ఐదు మైళ్ళ దూరాన ఉన్న సముద్రం మీద నుండి వీచే చల్లని గాలులతో, కొంచెం దూరాన కనిపించే శివ-విష్ణు ఆలయంనుండి వినవచ్చే ఘంటానాదంతో, సమీపానవుండే దుకాణాల దగ్గర అమ్మకానికి పెట్టిన పువ్వులు, అగరొత్తుల సుగంధ పరిమళాలతో ఆ ఉదయపు వాతావరణం ఇప్పటికీ నా కళ్ళముందు మెదులుతూనే వుంటుంది. 

రంగనాధన్ స్ట్రీట్ ముందునే వున్న 'నాధన్స్ కేఫ్', దానికి ఎదురు ప్లాట్ ఫారమ్ మీద వున్న 'శ్రీ దేవీ హోటల్' ల నుండి వచ్చే ఫిల్టర్ కాఫీ పరిమళాలు కాఫీ ప్రియులను ఉత్తేజపర్చి రారమ్మని ఆహ్వానిస్తూంటాయి, ఆ హోటల్స్ లోని రేడియోలలో వచ్చే భక్తిగీతాల నడుమ. అసలు, తెల్లవారుజామున రైల్లో మెడ్రాస్ పరిసరాలు తండియార్పేట, కొరుక్కుపేట స్టేషన్ల కు వచ్చేసరికి ముందుగా స్వాగతం పలికేది అప్పటికే తెరవబడిన సమీపంలోని హోటల్స్ నుండి వీచే శ్రేష్టమైన ఫిల్టర్ కాఫీ పరిమళమే. ఆనాటికి ఇంకా మద్రాసు నగరానికి వచ్చేవారికి స్వాగతం పలికే కూవమ్, అడయార్ నదులు వాటికి అనుసంధానంగా సెంట్రల్ స్టేషన్ ఆనుకుని ప్రవహించే బకింగ్ హాం కాలువలు దుర్గంధభూయిష్టం కాలేదు కనుక. ఆనాటికి బకింగ్ హాం కాలువలో ప్రవాహం ఉండేది. విజయవాడ దాకా పడవలలో కట్టెలు, ఉప్పు ఇతర వస్తువుల జలరవాణా ఉండేది. అర్బనైజేషన్ ఫలితంగా చెఱువులు, నదీతీరాలని మింగేసి వర్షాకాలంలో మానవ ఆవాసాలను చెఱువులు, కాలువలు, నదులుగా మార్చేసే భూబకాసురులను తయారుచేసిన రాజకీయం మొదలవలేదప్పటికింకా. 

మొత్తానికి ఫిల్టర్ కాఫీతోనే మెడ్రాస్ కు తెల్లవారుతుంది (నిజానికి నాకు టీ, కాఫీల వ్యసనం లేదు. పాలంటే అసలే పడదు). 

మెడ్రాస్ లో లోకల్ ట్రైన్స్ ఇటు బీచ్ నుండి, అటు తాంబరం నుండీ ఉదయం నాలుగు గంటలకే బయల్దేరుతాయి. షిఫ్ట్ లు ఎక్కే, దిగే ఫ్యాక్టరీల కార్మీకులు, ఉద్యోగులు, హోల్ సేల్ కొత్వాల్ బజార్లో కూరలు, ఫ్లవర్ బజార్లో పువ్వులు అమ్మకానికి కొనుక్కునే చిల్లర వ్యాపారస్తులతో అంత ఉదయాన్నేకూడా లోకల్ ట్రైన్స్ నిండుగానే వుండేవి.  తెల్లారేలోపే ప్రతీ ఇంటి ముంగిటా చక్కటి ముగ్గులు పెట్టే అరవ మామిలు దర్శనమిచ్చేవారు. దుకాణాలన్ని ఏడింటికే తెరిచేసేవారు. వీరందరికీ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించేది పరిమళభరిత ఫిల్టర్ కాఫీయే. భేష్ భేష్.

సంస్కృతీ సంప్రదాయాలకు, కళలకు, సంగీత సాహిత్య గోష్టులకు నిలయం మద్రాసు మహానగరం అని ఇక్కడి తెలుగువారు కూడా గర్వంగా చెప్పుకుంటారు. పేదవారు, మధ్య తరగతి వారు, లక్షాధికార్లు, కోటీశ్వరులు,  యిలా అన్ని తరగతులవారు బ్రతకడానికి తగిన  ఆశ్రయమిచ్చే మహానగరం మెడ్రాసే అని అనేవారు. మెడ్రాస్ జీవితానికి అలవాటు పడినవారు చచ్చినా ఈ వూరు వదిలిపెట్టరని ప్రముఖ రచయిత్రి 'ప్రమదావనం' మాలతీ చందూరు గారు అనడం నేను స్వయంగా విన్నాను. ఆ విధంగానే చందూరు దంపతులు చివరి వరకూ మద్రాస్ మహానగరంతోనే మమేకమై ఉండిపోయేరు. ఆనాటి స్థితిగతులు అన్నీ ఈనాడు కానరాకున్నా, కొన్ని మంచి పాత వాసనలు 'చెన్నై మానగరా'న్ని ఇంకా అంటిపెట్టుకుని వున్నాయి. 

'శివ-విష్ణు' ఆలయం దాకా వెళ్ళనక్కరలేకుండానే మధ్యలోనే రామనాధన్ స్ట్రీట్ సమీపంలో ఒక తోపుడుబండి మీద శ్రేష్టమైన అరటిపళ్ళ పెడలు పెట్టి కనిపించాయి. నాకు తాజాగా అనిపించిన పళ్ళను కొని చేతిలోని డబ్బులను వాడిముందు చాచాను. ఎంత ఏమిటి అని బేరాలాడడానికి భాష తెలియదు. ఆ బండివాడే తనకు రావలసిన డబ్బులు నా చేతిలోంచి తీసుకున్నాడు. ముప్పావలా. 

నేను కొన్నఖరీదైన అరటిపళ్ళను అరవంలో 'మలవాళపళం' అంటారు. ఆ అరవ బండివాడు అలాగే అరుస్తున్నాడు. కాని అసలైన ఆ అరవ పదాన్ని పలికే పద్ధతి తర్వాత తెలిసింది. అరవ భాష ప్రత్యేకత ఆ '''' కార శబ్దంలో ఉంది. అది వినడానికి అలవాటుపడి కొంత సాధన చేస్తేకాని పట్టుబడదు. నిజానికి అరవలలో కూడా ఆ శబ్దం పలుకు పట్టుబడని వారున్నారు. తెలుగులో కూడా ఈ శబ్దానికి ఒక సంకేతాక్షరం - బండి ఱ రూపంలో ఉండేదని కాలక్రమంలో దాని అవసరం పోయి కనుమఱుగై పోయిందంటారు. ప్రస్తుతం మన టీవీ వ్యాఖ్యాతల ధర్మవాఁ అని కాలక్రమంలో ణ, ళలకి  కూడా అదే గతి పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంగ్లీషు F కి సమానంగా తెలుగులో అక్షరం లేదు ఆ శబ్దంతో మనకి పదాలూ లేవు. అంచేత Fruit అన్న పదంలో మనం Fకి సమానంగా ఫ వాడతాం, ఫ్రూట్ అని రాస్తాం అవసరమైనప్పుడు. కానీ అదే అలవాటుగా మార్చుకుని ఫ అన్న అక్షరం వచ్చే తెలుగు పదాలని ఇంగ్లీష్ F శబ్దానికి సమనంగా పలుకుతూ ఫలం లాంటి పదాలను Faలం, ప్రతిఫలానికి ప్రతిFaలం అనే వారూ తయారయేరు.  మరలాంటప్పుడు తెలుగు కీ బోర్డ్ లో  ழ  అనే అక్షరాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని అంతలా  నిరసించడం ఎందుకో అర్థం కాదు. అది ఏ విధంగా తెలుగు భాషకి వినాశనకారో భాషావేత్తలకే  తెలియాలి. 

తమిழ், అన్బగన్, కనిమొழி   లాంటి పదాలలోని శబ్దం ళ కాదు అది మరొకలా పలకాలన్నది, కార అక్షరం గాని, దానికి సమానంగా గతంలో తెలుగులోనే ఉండిన అక్షరాన్నిగాని, కీ బోర్డ్ లో అందుబాటులో పెడితే  జిజ్ఞాసువులైన ఇతర భాషలవారు తెలుసుకోడానికి వీలుగా ఉండేది. కానీ మన భాషావేత్తలు అలా ఆ ழ అక్షరం కీ బోర్డ్ లోకి చేర్చినంత మాత్రానే తెలుగు లెస్స కాదు లెస్ అయిపోతుందని ఎందుకనుకున్నారో మరి. 

సరే, ఇంతకీ నేను కొన్నది  'మలైవాళపళం' కాదు మలైవామ్. చాలా రుచికరం. మిగతా అరటిపళ్ళ కన్నా ఆరోగ్యకరమట, ముఖ్యంగా, డైబిటిస్ పేషంట్లకి. ఆ పళ్ళతొక్కలు కూడా తినాలని కొందరు సలహా ఇచ్చారు!

సరే, ఆ పళ్ళను ఒక చేతి సంచిలో పెట్టుకొని నార్త్ ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాలవారింటికి వెళ్ళడానికి వెనుదిరిగాను. అసలు, నాన్నగారేమంటారోనని ఘంటసాలవారింటికి వెళ్ళడానికి సిద్ధపడ్డానుకాని, అక్కడ ఎవరుంటారో ఏం అడుగుతారో నేనేం చెప్పాలోనని ఒకటే భయం, గుండె దడ. నాకెందుకీ బెడద పెట్టారో అని దిగులు. సుమారు పది నిముషాల నడక తర్వాత ఆ ఇంటి ముందున్నాను. ఇంటిముందు ఒక పిట్టగోడకు ఎడమ‌, కుడివేపుల నలుపలకలుగా రెండు  స్తంభాలు. వాటి మధ్య ఇనపగేటు. దానికి ఎడమవేపు తెల్లటి మార్బుల్ రాతిమీద 'ఘంటసాల' అని తెలుగు, ఇంగ్లీష్ లలో నల్లటి అక్షరాలు. కుడివేపు గుండ్రటి నల్లటి  పెయింట్ మధ్య '35'. అదే తూర్పుముఖంగా చాలా గంభీరంగా, పాత తరహా రాజభవనంలా ఎత్తుగా ఉన్న 'నెం.35, ఉస్మాన్ రోడ్'.

మొట్టమొదటిసారి ఒంటరిగా ఎవరి తోడు లేకుండా  కాళ్ళు వణుకుతుండగా భయం భయంగా లోపలికి అడుగుపెట్టాను. నిజానికి ఆ భయానికి అర్ధంలేదు. అయినా ఎందుకంటే ఏం చెప్పలేను. ఆ ఇంటి బాల్కనీ గోడమీద నడుం మీద చేతులు పెట్టుకుని ఎడమవేపుకి తల పైకెత్తి నిలుచుని ఉన్న స్త్రీ మూర్తి విగ్రహంతో ఆ ఇల్లు చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నేను 1955లో మొదటిసారి చూసినప్పుట్నుంచి మరో పది పదిహేనేళ్ళు ఆ ఇంటి స్వరూపం మారలేదు.

1955 లో మొదటిసారి నేను చూసిన ఘంటసాలగారిల్లు

మేడ మీది ఆరుబయలు ప్రదేశాన్ని బాల్కనీ అంటారని అప్పుడే తెలుసుకున్నాను. గేటు దాటి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద నల్లటి కారు కనిపించింది. అలాటి నల్లటి కారు బొబ్బిలిలో రాణీగారు వెళుతూండగా చూశాను. అది ఎప్పుడు చూసినా తళతళ మెరుస్తూ కొత్తదిగా వుండేది. ఈ కారు పాతదిగా మరో రకంగా ఉంది. ఆ కారు పక్కన ఒక సన్నపాటి సిమెంట్ అరుగు. దాని వెనక సిమెంట్ నేలతో కొంత ఖాళీ స్థలం. అక్కడే కారు నిలుపుతారట. అలాటి స్థలాన్ని పోర్టికో అని తెలుసుకున్నాను. పొడుగుపాటి మూడు మెట్లు ఎక్కాక, ముదురాకుపచ్చ మీద తెలుపు నలుపు రంగుల చుక్కలున్న మొజైక్ ఫ్లోరింగ్ తో అడుగు, అడుగున్నర ఎత్తులో వరండా. అలాటి ఆకర్షణీయమైన ఫ్లోరింగ్  తరువాత మరెక్కడా నేను చూడలేదు. (నేను సొంతిల్లు కడితే అలాటిదే అలాటి ముదురాకుపచ్చ, తెలుపు, నలుపు కలసిన ఆ ఫ్లోరింగ్ నే వేయించాలని కలలు కన్నాను. ఇల్లైతే కట్టగలిగాను కానీ, అలాటి ఫ్లోరింగ్ కు నోచుకోలేదు.) ఎడమచేతివేపు ఒక కిటికి అక్కడ ఒక నలుగురు మనుషులు కూర్చునేలా పెద్ద కర్రబల్ల. ఎదురువేపు కిటికీ ముందు రెండు కుర్చీలు. పోర్టికోలో నిల్చొని తీసివున్న వీధి తలుపు ద్వారా లోపలికి చూస్తున్నాను ఎవరైనా కనిపిస్తారేమోనని. మనిషి అలికిడేలేదు. పోర్టికోకు రెండువేపులా సందులున్నాయి ఇంటి వెనకవేపుకు వెళ్ళడానికి. మెయిన్ డోర్ తెరిచే ఉంది. ఎక్కడా ఎవరూ కనబడలేదు. ఎటునుండి లోపలకు వెళ్ళాలో, ఎలా పిలవాలో తెలియక నిలబడి చూస్తూన్నాను. కొంతసేపటికి, వెనక పెరటివేపు ఒకావిడ కనిపించారు. నన్ను లోపలికి రమ్మని సంజ్ఞ చేశారు. అంతా గాభరా, కంగారుగా అనిపించింది. అక్కడెవరిని చూశాను, ఎంతమందిని చూశానో తెలియదు. మా నాన్నగారు ఈ పళ్ళు ఇవ్వమని చెప్పారని చెప్పి సంచీలోని పళ్ళు అక్కడ పెట్టేసి, వెనక్కి తిరిగి చూడకుండా బయటకి పరుగులంకించుకున్నాను. అప్పుడు అక్కడెవారున్నరో, ఏం అడిగారో నేనేం చెప్పానో నాకు తెలియదు. ఘంటసాలగారూ అక్కడే ఉన్నారో ఏమో, చూశానో లేదో కూడా తెలియదు. పెద్ద భారం దింపినంత హాయిగా అనిపించింది. రోడ్ మీదకు వచ్చేసాక. మరోసారి 'ఘంటసాల' పేరున్నమార్బల్ పలకని, '35' నెంబర్ ను చూశాను. అదీ నా మొదటి నెం.35, ఉస్మాన్ రోడ్', ఘంటసాలవారింటి అనుభవం.

ఈసారి ఇంటికి వెళ్ళేప్పుడు దక్షిణం వేపునున్న  ఉస్మాన్ రోడ్ కు  రెండు పక్కలా ఉన్న వీధుల పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాను. అప్పట్లో ప్రతీ వీధి ముందు, చివర ఒక ఆరడగుల సిమెంట్ స్తంభం మీద సిమెంట్ పలక, దానిమీద సిమెంట్ తోనే వీధి పేర్లు ఇంగ్లీష్ లో వుండేవి. మొదట్లో వాటిని చదవడానికి కష్టంగానే వుండేది. ఘంటసాలగారింటికి ఎదురుగా 'వ్యాసారావు స్ట్రీట్' (ఆ వీధికి చాలా ప్రాశస్త్యం వుంది. ఆ విషయాలు తరవాత మరోసారి), ఆ వీధి తరవాత దక్షిణం వేపు, అంటే, పనగల్ పార్క్ మా ఇంటికెళ్ళే వేపు వరసగా 'మురుగేశ మొదలియార్ రోడ్', 'కోట్స్ రోడ్', 'నాదముని స్ట్రీట్', 'గోవిందన్ స్ట్రీట్, 'ప్రకాశం రోడ్' ఆ తరవాత పనగల్ పార్క్ ఉన్నాయి. గోవిందన్ స్ట్రీట్ ప్రకాశం రోడ్ మధ్య బర్మాషెల్ పెట్రోల్ బంక్. ఇక, ఘంటసాలగారింటి వరసలో దక్షిణాన మొదట నాదన్ స్ట్రీట్ ఎదురుగా 'వాసన్ స్ట్రీట్', గోవిందన్ స్ట్రీట్ ఎదురుగా 'గ్రిఫిత్ రోడ్', RKM శారదా విద్యాలయ గర్ల్స్ హైస్కూల్,  స్కూల్ కు ఎదురుగా విశాలమైన పచ్చటి చెట్లతో పానగల్ పార్క్. అది ఒక ఐదురోడ్ల జంక్షన్. పనగల్ పార్క్ కి పశ్చిమాన ఉస్మాన్ రోడ్, ఉత్తరాన 'ప్రకాశం రోడ్', దక్షిణాన 'నాగేశ్వరరావు పంతులు రోడ్'. పార్క్ కి ఎదురుగా తూర్పున RKM Main Boys' హై స్కూల్. హై స్కూలు కి ఆగ్నేయంగా  'వెంకట నారాయణ రోడ్'. స్కూలునానుకుని పానగల్ పార్క్  ఎదురుగా తూర్పున పాండీబజార్ (సర్ త్యాగరాయ రోడ్). దానికి ఈశాన్యంగా 'జి.ఎన్ చెట్టి రోడ్' (అంటే గోపతి నారాయణస్వామి చెట్టి రోడ్). ఈ మూడు రోడ్లు ఓ రెండు మూడు మైళ్ళు దూరాన వుండే మౌంట్ రోడ్(ఈనాడు 'అన్నాసాలై') తో కలుస్తాయి. అలాగే పార్క్ కు దక్షిణాన వున్న ఉస్మాన్ రోడ్ కూడా సైదాపేట్ దగ్గరి మౌంట్ రోడ్ లో కలుస్తుంది. పార్క్ దగ్గర ఉస్మాన్ రోడ్ లోనుండి దక్షిణం వేపు వెడుతూంటే 'దొరైసామి రోడ్'. అది దాటాక సలామ్ స్టోర్స్ , రామన్స్ కాఫీ పౌడర్ షాప్. అక్కడే పారీస్ వేపు, ట్రిప్లికేన్ కు వెళ్ళే బస్ స్టాప్.  మంగేష్ స్ట్రీట్', దానికెదురుగా 'పింజాల సుబ్రహ్మణ్యం స్ట్రీట్'. ఇక్కడే రాఘవన్ 'నెయ్యి కడై' బస్ స్టాప్. పారీస్ నుండి వచ్చే బస్సుల స్టాపింగ్. 'రంగయ్యర్ స్ట్రీట్', ఎదురుగా 'రామస్వామి స్ట్రీట్',  'రామనాధన్ స్ట్రీట్', ఎదురుగా మోతీలాల్ స్ట్రీట్', 'రంగనాధన్ స్ట్రీట్', అది దాటాక టి.నగర్ బస్ స్టాండ్ .అక్కడ ఎదురుగా బర్కిట్ రోడ్. టి.నగర్ బస్ స్టాండ్ నుండే పారీస్ కార్నర్ కు వెళ్ళే 9,10,11, బస్సులు ఐస్ హౌస్ వేపు వెళ్ళే 12 నెంబర్, ట్రిప్లికేన్ వెళ్ళే 13 నెంబర్ బస్ లు బయల్దేరుతాయి.

ఇలా,  దక్షిణ ఉస్మాన్ రోడ్ లోని ఎదురుబొదురు వీధులన్నీ చూసుకుంటూ నడవడంలో మేముండే రంగయ్యర్ స్ట్రీట్ ను దాటి ముందుకు వెళ్ళిపోయిన సంగతి టి.నగర్ బస్ స్టాండ్ ప్రాంతాలకు వెళ్ళాకగానీ తెలియలేదు. మళ్ళా వెనక్కి తిరిగి ఒక్కో వీధి పేరు చూసుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ ను పట్టుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాను.

ఆనాటికి త్యాగరాయనగర్ (టి.నగర్) లో పెద్ద పెద్ద భవంతులతో పాటు పక్కవీధులలో మధ్యతరగతి ఇళ్ళూ ఉండేవి. వీధులన్నీ వరసగా క్రమపద్ధతిలో వుంటూ విశాలమైన ప్రాంగణాలతో అంత జన సమ్మర్దం లేకుండా ప్రశాంతంగా వుండేది. పానగల్ పార్క్ దక్షిణాన ఎన్ని వీధులుండేవో అలాగే ఘంటసాలగారింటి ఉత్తరం వేపూ ఉండేవి. అది విజయా వాహినీ స్టూడియోలకి వెళ్ళే దారి, కోడంబాకం రైల్వే గేటు దాటి వెళ్ళాలి. ఉత్తర దిక్కుకి మాత్రం నేను వెళ్ళలేదు. 

నార్త్ ఉస్మాన్ రోడ్ పూర్తిగా నివాస గృహాలు. దక్షిణాన మార్కెట్లు. ఏ విధమైన షాపింగ్ చేయాలన్నా పానగల్ పార్క్ దాటి రంగనాధన్ స్ట్రీట్ కు వెళ్ళాలి. ఆ వీధి చివరనే మాంబళం రైల్వే స్టేషన్. స్టేషన్ కు అవతల వేపు పాత మాంబళం. మేముండేది కొత్త మాంబళం లేదా త్యాగరాయనగర్ . ఒకసారి ఈ టి.నగర్ ఎంత పెద్దది అని అడిగితే  మా నాన్నగారు "మన విజయనగరం కంటే పెద్దదే" అన్నారు. ఇలాటి టి.నగర్ లు ఎన్నో కలిసిన నగరం మెడ్రాస్ అని, అదొక మహానగరమని చెప్పారు.

ఎవరైనా అరవం మాట్లాడుతుంటే అది అరవభాష అని తెలుసుకునే స్థితికి ఎదిగాను. కానీ వారి మాటలైతే అర్ధమయేవికాదు. తెలుగువారి సంఖ్య వల్ల, వారి ప్రభావం వల్ల చాలామంది మద్రాసులోని చాలామంది అరవవాళ్ళకు తెలుగు అంతో ఇంతో తెలిసి ఉండేది. జట్కావాళ్ళు రిక్షావాళ్ళు తెలుగు మాట్లాడకపోయినా బాగానే అర్ధం అయేది. అందువల్లే ఆంధ్రనుంచి వ్యాపారం, కోర్టు పనులమీద వచ్చిన తెలుగువారికి వారి దైనందిన కార్యక్రమాలకి భాష వలన పెద్దగా ఆటంకం ఉండేది కాదు.  

మెడ్రాస్ లో ప్రతీ వందమందిలో ఏభైమంది తమిళులైతే, ముఫ్ఫైమంది తెలుగువారు. మిగతా ఇరవై ఇతర భాషలవారు. అయితే మెడ్రాస్ లో తరతరలుగా స్థిరపడి ఉన్న తెలుగువారి తెలుగు మాట అర్ధమవడం కష్టమయేది. అది ప్రశస్తమైన అరవ తెలుగు. 

ఘంటసాలగారు మన తెలుగువారికి మాత్రమే కాదు తమిళులకు కూడా అభిమానపాత్రులే. అప్పటికే విడుదలైన లైలామజ్ను, పాతాళభైరవి, దేవదాసు తమిళ సినీమాల పాటల ద్వారా 'కండసాల' (ఘంటసాల) తమిళ శ్రోతల మనసులలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.నేను ఘంటసాలవారింటికి వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకు, వారింట్లో చూసినావిడ  ఎవరినో తోడు తీసుకొని మా ఇంటికి వచ్చారు. వీధిలో అల్లంత దూరాన్నే వారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారికి చెప్పాను. వాళ్ళున్నంతసేపు నేను ఇంటిలో అడుగుపెట్టలేదు, ఆడవాళ్ళంటే వుండే మొహమాటంవల్ల.  మా కాంపౌండ్ లోని చెట్టుక్రింద చప్టామీదే కాలక్షేపం చేశాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకెళ్ళాను. ఆవిడ ఘంటసాలవారి తమ్ముడు భార్యట. ఆవిడను చూస్తే మా శారదక్క (దొడ్డమ్మగారి అమ్మాయి) గుర్తుకు వచ్చింది. నిజానికి ఇద్దరి మధ్యా ఏ పోలికలు లేవు. అయినా నాకలా అనిపించింది. బహుశా, సమాన వయస్కులు కావడం వల్లనేమో. 

మా నాన్నగారు నన్ను మళ్ళీ స్కూల్ లో చేర్పించి చదివించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.1956 జూన్ వరకు స్కూలులో చేరే అవకాశంలేదు. ఈలోగా అందుకు కావలసిన శిక్షణ ఇవ్వడానికి నన్ను తన స్నేహితుడైన ఆంధ్రాబ్యాంక్ విశ్వనాధం గారికి అప్పజెప్పారు. విశ్వనాధం గారు తెలుగువారే. పాండీబజార్ బ్రాంచ్ ఆంధ్రా బ్యాంక్ లో పనిచేసేవారు. అక్కడే మా నాన్నగారికి ఆయనతో పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి. చాలా మంచి మనిషి. కానీ, బ్రహ్మాండమైన చెముడు. పనివేళల్లో హియరింగ్ మెషిన్ వాడేవారు. ఆయన దగ్గర నన్ను చదువుకు పెట్టారు. రాత్రిపూట వారింటికి వెళ్ళి, ఆయన చెప్పింది నేర్చుకుని, రాత్రి అక్కడే పడుక్కొని, మళ్ళీ ఉదయాన్నే ఇంటికి చేరుకోవడం. ఇలా ఎన్నాళ్ళు జరిగిందో గుర్తులేదు, కానీ, మధ్యలో ఒక రోజు విపరీతమైన వర్షం కురిసి విశ్వనాధంగారింటికి వెళ్ళడం చాలా కష్టమయింది. విశ్వనాధంగారు టి.నగర్ బస్ స్టాండ్ ఎదురుగా వున్న బర్కిట్ రోడ్ లో చివరగా ఒక పెద్ద బంగళా వెనక ఉండే ఔట్ హౌస్ లో కాపురం. భార్య, ఒక చిన్న పాప. మరీ పెద్ద ఇల్లేమీ కాదు కానీ చాలా నీట్ గా వుండేది.  వర్షం పడిందంటే మెడ్రాస్ రోడ్ల పరిస్థితి అప్పుడు, ఇప్పుడూ కూడా పెద్ద తేడా ఉన్నట్టనిపించదు. దశాబ్దాలెన్ని గడిచినా ఈ విషయంలో ఏం మార్పులేదు. టి.నగర్ బస్ స్టాండ్ నుండి హిందీ ప్రచారసభ వీధి చివరి వరకు మహాసాగరం. నడుం లోతు నీళ్ళలో అలాగే విశ్వనాధంగారింటికి చేరుకున్నాను. గురువుగారు, గురువమ్మగారు నన్ను చూసి జాలిపడ్డారు. ఈ విధమైన రాత్రిపూట చదువు విశ్వనాధం గారింట్లో ఎన్నాళ్ళు సాగిందో గుర్తులేదు. ఆయన చెప్పిన చదువు నాకెంతవరకు ఉపయోగించిందో తెలియదు. నాకు క్లాసు పుస్తకాలు చదువుతున్నంతసేపూ అంతా అర్ధమైనట్లే వుండేది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానాలు బాగానే చెప్పేవాడిని. కానీ , కర్ణుడి శాపాల్లాగా పరీక్షలలో మాత్రం నా తెలివితేటలు ఎందుకూ ఉపయోగపడేవి కాదు. ఏ ప్రశ్నకు ఏది సమాధానమో, అది ఎంతవరకు రాయాలో తెలిసేది కాదు. అనవసరంగా  పేజీలకు పేజీలు కాగితాలు ఖరాబు చేయడం సమాధానం కాదనే జ్ఞానోదయం చాలా లేటుగా కలిగింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఎక్కడవేసిన గొంగడి (గొంగళి పురుగే గుర్తుకు వస్తుంది) అక్కడే.

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటిలో ఉన్నది నాలుగైదు మాసాలు మాత్రమేనని గుర్తు. ఒక శుభ ముహుర్తాన మా నివాసం నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ కు మారింది. 

ఆ విశేషాలు వచ్చేవారం .....
...సశేషం*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.